మార్పు 28

“ఈయేడు అరవైలు నిండుతాయి,” అన్నారు ప్రభాసరావు పంచాంగం చూస్తూ.

“పెద్దత్తయ్య వస్తానంటోంది కదా అమెరికా చూడ్డానికి. మనవాళ్ళందర్నీ పిలిచి పండుగ చేస్తే బాగుంటుంది,” అన్నాడు విషి.

“అవును, తెలుగువాళ్ళకి షష్టిపూర్తితో జీవితకాలం ఒక ఆవర్తి పూర్తయి రెండో ఆవర్తి మొదలెట్టడమన్నమాట.”

“అదేమిటి? అరవై ఏళ్ళకే జీవితం అయిపోతుందా?”

“అలా కాదు. మనకి కాలమానాలున్నాయి కదా. అరవై సంవత్సరాలకి అరవై పేర్లు. అవి ఒక వరస అయిపోయి రెండోవరస మొదలవుతుందని,” అన్నారాయన.

తల్లి శివాని, “అది కాదు. ఉగ్రరథుడు అన్న రాక్షసుడు అరవై నిండినవాళ్ళకి అనేక రుగ్మతలు కలిగించి తద్వారా ప్రాణహాని చేస్తాడనీ, ఆయన్ని పూజలతో శాంతింపజేస్తే క్షేమం, ఆయుర్వృద్ధి అని చేస్తారు ఈ షష్టిపూర్తి,” అంది.

“ఇప్పుడే అన్నయ్యని పిలిచి మాటాడతాను,” అంటూ హుషారుగా ఫోనందుకున్నాడు విషి.

“ఏంటీ, ఎప్పుడూ,” అన్నాడు రాజర్ అట్నుంచి. అతను లీసాని పెళ్ళి చేసుకున్నతరవాత రాజేశ్వరరావు అన్నపేరుని రాజర్ చేసేడు.

విషి హుషారుగా షష్టిపూర్తి అంటే వివరించి, పైనెలలో జరిపితే బాగుంటుందని చెప్పేడు.

లీసానడిగి చెప్తానని చెప్పేడు రాజర్. మర్నాడు, “లీసాతో మాటాడేను. తనకి కూడా వీలేనంది. ఇద్దరం వస్తాం. గోపీకి మిడిల్ స్కూలు కదా, అడిగి చూస్తాం వాడు చదవ్వలసిన పాఠాలు ఇంటిదగ్గర చెయ్యనిస్తారేమో. లేకపోతే వాడికి మరేదో వసతి చూడాలి. వాడి క్లాసులో టాం అని ఉన్నాడు. వాళ్ళింట్లో ఓ పూట ఉంచుకుంటారేమోలే,” అన్నాు గబగబా. అతను ఏ విషయాన్నయినా అనేక కోణాల్లోంచి ఒకేసారి చూడగల ధీనిధి. తను పెద్దవాడు కనక తానే పూనుకుని చక్కగా చదువుకున్న పురోహితుడిని వాకబు చేసి కనుక్కుని, ఆ పురోహితుడు చేయించగల హోమాలూ, పూజలూ, వాటికి తాము సమకూర్చవలసిన సంభారాలూ అన్నీ కనుక్కుని చెప్తానని విషి చెప్పేడు. అది విషికీ, ప్రభాస్రావుగారికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా ప్రభాస్రావుగారు మనదేశం, తన చిన్నప్పటి సంప్రదాయాలూ మరొకమారు మననం చేసుకుని ఉప్పొంగిపోయేరు. పెద్దకొడుకు ఎదిగి చేతికొచ్చేడు అనుకునేది ఇలాటి సమయాల్లోనే కదా.

మొత్తంమీద ప్రభాస్రావుగారి షష్టిపూర్తి మహోత్సవానికి భారీఎత్తున సన్నాహాలు మొదలయేయి. అర్జంటుగా  ఆయనా, శివానీ కలిసి ఇండియా వెళ్ళి రావడానికి టికెట్లు సిద్ధం చేసేసుకున్నారు, శాంతిపూజకి కావలసిన సామగ్రి కొనుక్కురావడానికీ, అక్కడ అయినవాళ్ళకీ ఈ వేడుకసమాచారం అందజేయడానికి కూడా. ప్రభాస్రావుగారిఅక్కయ్య రామలక్ష్మి ఎలాగా అమెరికా రావాలనుకుంటోంది కనక అదే సమయానికి ఆవిడ వచ్చేఏర్పాట్లు కూడా చేస్తాం అన్నారు పనిలో పనిగా.

ప్రభాస్రావు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సాయంత్రమే తనకి ముఖ్యులయినవారందర్నీ ఆదరా బాదరా ఫోనులో పిలిచేసి ఇది వాగ్రూపంలో ఆహ్వానమనీ, ఇండియాలో ముద్రింపించి తీసుకొచ్చేక కాయితం ఆహ్వానాలు పోస్టులో పంపుతాననీ చెప్పి ఈలోపున ఆరోజు మరే వ్యాపకమూ పెట్టుకోరాదని నొక్కి చెప్పేడు.

000

విషి ఈమధ్య పెద్దక్కయ్యఅవసరాలకి ఆదుకోడం మొదలు పెట్టేక, తరుచు అరవిందకి కనిపిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఆ సాక్షాత్కారాలకి అలవాటు పడుతోంది. ఇద్దరూ అప్పుడప్పుడు కాఫీలకీ, సినిమాలకీ కలుస్తున్నారు. వాటిని డేట్ అని మాత్రం అనడం లేదు. తండ్రి షష్టిపూర్తి మహోత్సవం నెపంతో అరవింద తమఇంటికి రావడానికీ, తనకి మరింత చేరువ కావడానికీ అవకాశం ఉంది. అది అతనికి మరింత హుషారునిచ్చింది.

అరవిందని శుక్రవారం పిలిచి శనివారం ఏ సినిమాకో కాఫీకో రా, నీకో మాట చెప్పాలి అని చెప్పి, ఎంతో “సస్పెన్సు“ సమకూర్చి, సంగతి చెప్పడానికి ఆయత్తమవుతున్నాడు. అలా అయితే మన సంస్కృతి సంప్రదాయాలగురించి తనకి గల విజ్ఞానం కూడా ప్రదర్శించవచ్చు అని అతని ఆలోచన.

శుక్రవారం అరవిందని పిలిచేడు.

అరవింద ఫోను తీసుకుని, చెంపకానించి, “మీ నాన్నగారి షష్టిపూర్తిట కదా?” అంది.

విషి ఉసూరుమని నిట్టూర్చి, ఫోనులోకి చూస్తూ, “నీకెలా తెలిసింది?” అనడిగేడు నీరసగాత్రాన్ని సంబాళించుకుంటూ.

“మీ నాన్నగారే చెప్పేరు.”

విషి విచారాన్ని కప్పి పుచ్చుకుని, “ఓ, అలాగా. ఆయన ఇంకా చెప్పలేదేమో, నేనయినా చెప్పకపోతే బాగుండదు కదా అని పిలిచేను. మరి నీకు ఆరోజు వీలేనా?”

“రెణ్ణెల్ల తరవాతిమాట కదా. ఇప్పటికి నాకు మరే కార్యక్రమాలూ లేవులే.”

అరవిందకి కాస్త అయోమయంగా ఉంది. విషి ఎందుకు హుషారుగా లేడో మాత్రం అర్థం కాలేదు.

“సరే. ఉంటాను. చదువుకోవాల్సింది చాలా ఉంది.”

“రేపు సినిమాకి వెళ్దాం రాకూడదూ?”

“ఊఁ…మ్… చాలా ఉంది చదువుకోడానికి.”

“… పోనీ, కాఫీకి రా. కొంచెంసేపు…”

అరవింద కాస్సేపు ఆలోచించి సరేనంది. పాపం, పెద్దక్కయ్యకి అంత చేస్తున్నాడు. ఏదో మనసు బాగులేనట్టుంది, పోనీ, కొంచెంసేపు … అంతలో ఏం ములిగిపోతుంది అనుకుంటోంది ఆ అమ్మాయి.

000

విషిమొహంలో కళ లేదు. కళలేని ఆమొహం చూస్తూ కూర్చుంది అరవింద.

ఎంతసేపిలా?

విసుగేస్తోంది తనకి.

విచారం ముంచుకొస్తోంది అతనకి.

ఆఖరికి అడిగింది, “ఏమయింది?”

“ప్చ్. ఏమిటో … నాకేం సరదాగా లేదు. నేననుకున్నది ఎప్పుడూ జరగదు,” చిన్నపిల్లాడిలా మూతి ముడుచుకుని.

“ఎందుకలా అనుకుంటావు?”

“ఎందుకంటే ఏం చెప్పను? చిన్నదీ పెద్దదీ ఏసంగతి కానీ … ఇప్పుడు చూడు, నేను చెప్దాం అనుకున్నాను మానాన్నగారి షష్టిపూర్తి సంగతి.”

“పోనిద్దూ. ఎవరు చెప్తేనేమిటి?”

“అవున్లే, అది నిజమే. తన స్నేహితులుకి తను చెప్పుకోవచ్చు. నీసంగతి నాకొదిలేయొచ్చు కదా? నువ్వు నాస్నేహితురాలివా? ఆయనస్నేహితురాలివా?”

“హో.హో… ఆగాగు. సరే. ఆయింది తప్పే అనుకుందాం. మనంవే చెయ్యగలంవిప్పుడు? మనవాళ్ళ సాంప్రదాయాలు అలాటివి. ప్రతీదీ పెద్దలే చెయ్యాలి. కాకపోతే, పెద్దలు వాళ్ళకి తోచింది చేసేస్తారు. అంతే కానీ ఎదటివారి ఆలోచనలు, ముఖ్యంగా పిల్లల ఆలోచనలేమిటి అన్నది వాళ్ళకి తోచదు. ఏం చేస్తాం?”

“అదే నేనంటున్నది. ఈదేశంలో ఇంతకాలం ఉన్నారు కదా ఆ మాత్రం తెలీదేమిటి? మళ్ళీ ఆయనే ఒక్కోప్పుడు నీయిష్టం, నీయిష్టంవొచ్చినట్టు చేసుకో. ఈదేశంలో నీయీడు పిల్లలు వాళ్ళనిర్ణయాలు వాళ్లే చేసుకుంటారు. నీకు ఆమాత్రం తెలీదా అంటూ స్థానికమర్యాదలు తీసుకొస్తారు రంగంమీదకి.”

అరవిందకి ఏం చెప్పాలో తోచలేదు. మాపెద్దక్కయ్యనడిగి చెప్తా దీనికి సమాధానం,” అంది సహం హాస్యంగానూ, సహం నిజంగా కుతూహలంతోనూ.

“అడుగు. ఇంకా ఆవిణ్ణే మానాన్నాగారిని కూడా అడగమని చెప్పు. ఆయన ఉద్దేశం ఏమిటో నిర్దుష్టంగా తెలిస్తే నేను కూడా బతికిపోతాను. ఎప్పుడేం చెయ్యాలో తెలుస్తుంది. ఇంతకీ రేపు వస్తావా, స్టార్ బక్స్‌లో కలుద్దాం.”

“అలాగేలే, వచ్చేముందు పిలుస్తా,”నంటూ అరవింద ఫోను ముడిచేసింది.

000

“మీకు ఇష్టమని బొప్పాయిపండు కనిపిస్తే తెచ్చేనండీ,” అంటూ విషి ప్రవేశించేడు.

“ఎందుకు బాబూ, నీకు శ్రమ. నీచదువూ, నీ వ్యాపకాలూ నీకుంటాయి కదా,” అంది పెద్దక్కయ్య, పండు అందుకుంటూ.

అరవింద పెద్దక్కయ్య పక్కన కూర్చుని భగవద్గీత చదువుతోంది. విషిని చూసి చిన్నగా నవ్వింది.

“ఫరవాలేదండీ. ఆరోగ్యం కూడాట బొప్పాయిపండు. మీతో మాటాడ్డం నాకు సరదాగా ఉంటుంది. మిగతావారితో పోలిస్తే చాలా వేరుగా ఉంటారు, కాస్త మార్పుగా ఉంటుందని వచ్చేను. మావాళ్ళతో నాకు తల తిరిగిపోతోంది,” అన్నాడు విషి.

లీల రాత్రికి కూర తరుగుతోంది కొంటరుదగ్గర నిలబడి. అతనివేపు చూసి తల ఊపింది, కనీ కనిపించనంత చిన్నగా.

“ఎలా జరుగుతున్నాయి షష్టిపూర్తి సన్నాహాలు?” అనడిగింది అరవింద.

“అదే అంటున్నా,” అన్నాడు విషి. పెద్దక్కయ్యవేపు తిరిగి, “అది కాదండీ. నేనూ, అన్నయ్యా చేస్తున్నాం కదా. అసలిక్కడ సర్ప్రైజు పార్టీలు చేస్తారు కదా. అదెలాగా లేదు. మాకు వదిలేయవచ్చు కదా. మేమిద్దరం, నేనూ మా అన్నయ్యా ఇది కేవలం కుటుంబానికి పరిమితం చేద్దాం, బాగా దగ్గరవాళ్ళని ఓ పది కుటుంబాలు పిలుద్దాం అనుకున్నాం. పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తే, ఆత్మీయతలకి తావుండదని. మానాన్నగారేమో వీళ్ళని పిలవకపోతే బాగుండదు, వాళ్ళని పిలవకపోతే ఎలా, వీళ్ళేం అనుకుంటారు, వాళ్ళకి కోపం వస్తుందంటూ వందకి పెంచేరు ఆహూతులసంఖ్యని. దాంతో, ఇంట్లో పెట్టడానికి వీలవదని హోటలు చూస్తున్నాం. మేం ఒక హోటలు మాటాడేం ఒకరోజు. మర్నాడు ఆయన మాకు చెప్పనైనా లేదు. ఆ హోటలువాళ్ళకి ఆగది అక్కర్లేదని చెప్పి, మరో పెద్ద హోటలులో ఏర్పాటు చేసేరు. అలా ప్రతీదానికీ ఆయన అలా అడ్డొస్తుంటే, మేం ఎలా చేస్తాం చెప్పండి,” విషి కోపం పట్టలేక, ఊపిరి తీసుకోడానికి ఆగిపోయేడు.

పెద్దక్కయ్య చిన్నగా నవ్వి, “ఆయన వెనకటితరం, మా తరంవాళ్ళు, ఆలోచించేధోరణి వేరు మీతరంవాళ్ళ ఆలోచనాధోరణి వేరు. నీలాగే ఆయనక్కూడా ఆరోజు ఘనంగా జరగాలని ఉంది, అంతే,” అంది.

“నిజమేనండీ, కానీ ఏదో సమయంలో మాఆలోచనలు కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. నిన్న కంప్యూటరుమీద నాలుగు గంటలసేపు కూర్చుని శుభలేఖ తయారు చేసేను. ఆయనఅభిప్రాయం అడిగితే, ప్చ్ అని చప్పరించేసి, ఇండియాలో మంచి ఆర్టిస్టులున్నారు, వాళ్ళచేత తయారు చేయిస్తానన్నారు.”

“పోనీలే. అది ఆయనషష్టిపూర్తి కదా.”

“అందుకే ఆయనసలహా అడిగేను. ఇలా కాదు, అలా అంటూ ఏవో సలహాలిస్తే నాకూ సంతోషంగా ఉంటుంది కదా.”

పెద్దక్కయ్య పెదవి విరిచి, తల పంకించి మౌనంగా కూచుంది కొంచెంసేపు. ఆవిడ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తూ కూచున్నారు విషీ, అరవిందా. వంటింట్లోంచి లీల కూడా ఓ చెవి ఇటు పారేసి కూర తరుక్కుంటోంది.

నాలుగు నిముషాలయింతరవాత పెద్దక్కయ్య నెమ్మదిగా మొదలెట్టింది, “మీతరంవాళ్ళకి ప్రతీదీ మాటల్లో స్పష్టం చేసేయాలి. అలా ఎవరైనా చెప్పేస్తే మీకేదో అంతా తెలిసిపోయినట్టు తృప్తి పడిపోతారు. అంతే కానీ మానవప్రవృత్తి చాలా విచిత్రమైనదీ, సంక్లిష్టమయినదీ అని తోచదు. విషీ, నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను కానీ నాకు తెలిసింది, లేదా నేను నాజీవితంలో చూసింది చెప్తాను. అది నీకు వర్తిస్తుందో లేదో నాకు తెలీదు. కనీసం ఆ క్రమంలో నువ్వు కూడా ఆలోచించుకోడానికి పనికి రావొచ్చు.

చెప్పేను కదా మానవస్వభావం అర్థం చేసుకోడం కష్టం. ఎంచేతంటే అంత సంక్లిష్టమయినది కనక. నిజానికి ఏ ఒక్కరి స్వభావం కానీ మారడం చాలా కష్టం. మారినా అంతరాంతరాల, అట్టడుగు పొరల్లో వెనకటి స్వభావం నీడలా వెన్నాడుతూనే ఉంటుంది. నువ్వే ఆలోచించు. ఆదిమానవులజాతి ఏర్పడిన దగ్గర్నుంచీ, సామూహికంగానూ, వైయక్తికంగానూ, బతుకు సుఖతరం చేసుకోడంకోసం కొన్ని నియమాలు ఏర్పరుచుకున్నారు. అవి ఎలా ఎవరు చేసేరో ఏవో పుస్తకాల్లో కొందరైనా మహా పండితులు రాసే ఉంటారు. అవన్నీ నాకు తెలీదు. సదా పుస్తకాలు చప్పరించి ఉమ్మేసే మీకే తెలియాలి. నేను చెప్తున్నది కేవలం నేను చూసిన లోకం ప్రాతిపదికగానే.

వేదాలూ, పురాణాలూ, ధర్మశాస్త్రాలూ వచ్చేవేళకి, ఈ నియమాలకి కొంత స్పష్టత ఏర్పడింది. వాటిల్లో ముఖ్యమైనది జ్ఞానానికి పెద్ద పీట వేయడం. జ్ఞానం అంటే కొందరు మేధావులు తమ అనుభవాలని, భావాలనీ కూడగట్టి, ప్రోది చేసి, ఒక సిద్ధాంతం తయారు చేయడమే కదా. వాటిని మిగతావారికి పంచిపెట్టేరు. అంటే వారికి తెలిసింది తెలియనివారికి చెప్పేరు. ఆ జ్ఞానాన్ని ప్రజలు శ్రద్ధగా విన్నారు. భక్తిభావం పెంచుకున్నారు ఆ జ్ఞానులయందు. ఇక్కడ తమాషా ఏమిటంటే అలా జ్ఞానాన్ని ప్రసాదించేవారియందు అందిపుచ్చుకునేవారు భక్తిభావం కలిగి ఉండాలని చెప్పింది కూడా ఆ జ్ఞానులే. ఆ సూత్రం అంగీకరించడం జరిగింది ఏకారణంగా కానీ.  అది కాలక్రమంలో వయసులో పెద్దలందరికీ వర్తించింది. అంటే వయసు ఎక్కువుంటే అనుభవాలు ఎక్కువుంటాయి. ఎక్కువ అనుభవాలు అంటే ఎక్కువ జ్ఞానం. ఇలా ఒకదానికొకటి ముడి పెట్టి పెద్దలంటే పిన్నలకి భక్తీ, గౌరవం ఉండాలన్న ప్రతిపాదన ఏర్పడింది. మన పురాణాలనిండా ఈ భావం అనేకరూపాల్లో కనిపిస్తుంది. అలాగే అందుకు ప్రతిగా పిన్నలయందు పెద్దలకి ఆదరాభిమానాలు ఉండాలన్నారు. ఇలా ఒకరకం సమతూకం సాధించడానికి ప్రయత్నం జరిగింది.

ఇప్పటికీ మీరు ఎవరోఒకరు అనడం వినే ఉంటారు మాతాత చండశాసనుడనీ, మాఅమ్మమ్మ గట్టిగా ఉరిమి చూస్తే మేం గడగడలాడేవాళ్ళం అనీ మనపెద్దవాళ్ళు చెప్పడం. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ ఆచారం – పెద్దలు తమ అనుభవాలు ఆధారంగా పిల్లల్ని సన్మార్గంలో పెట్టడానికి పూనుకోడం – కొన్ని వేలయేళ్ళగా వస్తున్న ఆచారం. అది మారుతోంది కానీ చాలా చాలా నిదానంగా. మీ ముత్తాతలకున్న ధాష్టీకం మీ తాతకి ఉండకపోవచ్చు. మా నాన్నగారిలో అందులో ఆవగింజంతైనా ఉండకపోతుందా?” అని పెద్దక్కయ్య ఆగింది ఊపిరి తీసుకోడానికో, పిల్లలిద్దరూ ఆలోచించుకోడానికో.

విషి గట్టిగా ఊపిరి పీల్చి వదిలేడు, “ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి తీసుకొచ్చేరండీ? మొత్తం మానవాళి మనస్తత్వం అంతా మూణ్ణిముషాల్లో తేల్చేసేరు. మానాన్న నామాట గౌరవించడేం అని అడిగినందుకు?”

అరవింద, లీల నవ్వేరు.

పెద్దక్కయ్య కూడా నవ్వింది, “నీ సమస్య చాలా పెద్ద సమస్య అన్నట్టు నేను మాటాడకపోతే నువ్వే మళ్ళీ మీరు నన్ను సీరియస్గా తీసుకోడంలేదు అంటావు.”

“అంటే నాసమస్య సీరియస్ కాదంటారా?”

“అది కాదు నేనంటున్నది. నీధోరణిని మీనాన్నగారు అర్థం చేసుకోడం లేదు అనుకోడం కన్నా నువ్వు మీనాన్నగారిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం తేలిక అంటున్నాను. సూక్ష్మంగా చెప్పాలంటే అనుభవం జ్ఞానానికి ప్రాతిపదిక, ముఖ్యంగా లోకజ్ఞానం. లోకజ్ఞానం వయసుతో వస్తుంది కనక పెద్దవాళ్ళు చిన్నవాళ్లకి ఏం తెలీదనే అనుకుంటారు, అది పూర్తిగా నిజం కాకపోయినా. ఎందుకంటే మీకు, అంటే చిన్నవాళ్ళకి కొత్తగా వస్తున్న ఆలోచనలతాలూకు జ్ఞానం ఎక్కువ కనక. మరి అది పెద్దవాళ్ళకి అంత తొందరగా తలకెక్కదు. ఏతా వాతా చెప్పేదేమిటంటే, మీరే, పిల్లలే కాస్త ఓపిక పట్టి పెద్దలమాట పాటించాలి. కనీసం పాటించినట్టు నటించాలి.”

విషి అరవిందవేపు చూసేడు, “నీకేమైనా అర్థమయిందా ఈ సిద్ధాంతం?”

“నేను వినే ‘అవస్థ’లో ఉన్నాను కనక నాకు అర్థమయినట్టే ఉంది.”

“సమస్య నీది కాదు కనక.”

“పోనీ, అలాగే అనుకో. ఆఖరికి కనిపిస్తున్నదేమిటంటే మీనాన్నగారిని మార్చడం నీతరం కాదు, అంచేత ఆయనమాట ప్రకారమే కానిచ్చేయి, కనీసం ఈ షష్టిపూర్తి మహోత్సవం.”

విషి నిట్టూర్చి, “సరేలెండి. ఏంచేస్తాం. ఇంక నేను కలగజేసుకోను,” అంటూ లేచేడు.

అరవింద కూడా బయల్దేరింది అతనితో.

వాళ్ళిద్దరూ వెళ్ళేక, లీల, “అయితే మనుషులు మారరంటారా?” అనడిగింది.

“మారతారు. మారడం కూడా మానవనైజమే కదా. మారడం మారతారు, నత్తనడకలో నూరోవంతు వేగంతో. మనఁవేమో మనోవేగంతోనూ, ఉన్నదానికంటే పదిరెట్లు ఎక్కువ స్థాయిలోనూ జరగాలని ఆశ పడతాం. అది కూడా జరగొచ్చు ఏ నూటికో కోటికో ఒకరివిషయంలో. నిత్యజీవితంలో అలాటి మార్పులు అంత తేలిగ్గా, ఘనంగా కనిపించవు అనే అనుకుంటాను నేనయితే.”

(ఫిబ్రవరి 16, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s