మా నిడదవోలు వంశంలో కథకులు – 2

మా చిన్నన్నయ్య సీతారామారావు రాసిన కథ, అక్కరకు రాని చుట్టాలు.

ముందు టపాలో మానాన్నగారితరంలో మా బుచ్చినాన్న కథా రచయిత అని చెప్పేను కదా. నా తరంలో మా చిన్నన్నయ్య కథనంప్రకారం) మాపెద్దన్నయ్య ఒక కథ రాసేడు. కథ పేరు “విశాఖపట్నం వెధవలసంఘం”. అది 1946లో ఆంధ్రపత్రికలో ప్రచురించారుట. మా చిన్నన్నయ్య సీతారామారావు రెండు కథలు రాసేడు. మొదటికథ పేరు జ్ఞాపకం లేదు కానీ 1946-47 ప్రాంతాల్లో చిత్రగుప్తలో ప్రచురింపబడింది.  ఈ రెండో కథ “అక్కరకు రాని చుట్టాలు” తెలుగు స్వతంత్రలో ప్రచురింపబడింది. తేదీ టేర్ షీట్‌మీద కలంతో 9-11-51 అని రాసి ఉంది.

ఈకథకి running title లాగ తెలుగు స్వతంత్రలో “జీవనమాధుర్యం” అని కుడివేపు మొదటివరసలో ఉంది. మరి ఆనాడు అలా (ఉపశీర్షికలు అనొచ్చేమో) ఇచ్చేవారేమో నాకు తెలీదు. నా రచనలకి గల్పిక, స్కెచ్ లాటి పేర్లు ఇవ్వడం చూసేను కానీ ఈ “జీవనమాధుర్యం” ఏమిటో నాకు తెలీడం లేదు.

—————————————-

జీవనమాధుర్యం

అక్కరకు రాని చుట్టాలు

                                       నిడదవోలు సీతారామారావు

 

చుట్టాలు సమయానికి ఎందుకు అక్కరకు రారో సత్యానికి అర్థం కాలేదు. కావడం లేదు. నిజానికి, చేతనయిన సాయం చేస్తే, వాళ్ల సొమ్మేం తరిగిపోతుందా? కొంప కూలిపోతుందా? పుట్టి మునిగిపోతుందా? అదే అతనికి తెలియడంలేదు.

కృష్ణకి మొన్ననింతే కదూ జరిగింది? అవసరంకొద్దీ ఓ పది రూపాయలు ఇమ్మని వెళితే, ఆఖరికి పెత్తండ్రే లేదు పొమ్మన్నాడు! ఆయనదగ్గరప్పుడు డబ్బు లేదట. కృష్ణమూర్తి తీర్చలేనివాడే అనుకోండి. అయితే ఏం, పైవాడా? ఆమాత్రం తినరానివాడా? ఆలోచిస్తే కృష్ణ అడిగింది అతని సిగరెట్టు ఖర్చుపాటి కాదు! అంతెందుకూ, తనకి మాత్రం? “ఈ ఒక్కరోజూకీ నీ వాచీ యియ్యి బాబూ! ఎంతైనా పుణ్యముంటుంది. ఈవాళ మీటింగులో అధ్యక్షత వహించాలి కదా, ఆమాత్రం లేకపోతే ఎలా సీనూ? దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి, ఆ ఉపన్యాసాలయినా యిచ్చి సాయం చెయ్యొద్దంటావా మరి?” అని తనెన్నివిధాల బతిమాలలేదు? వాచీ వెంటనే యిప్పిస్తానని ఎన్నిసార్లు చెప్పలేదు? అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. “మజ్జిగ నీళ్ళుంటే ఇలా కొంచెం పొయ్యండి పిన్నిగారూ! మా పెరుగుమనిషేమో ఎగనామం పెట్టిందివాళ. పోనీ ఈ ఒక్కరోజూ ఎలాగో సరిపెట్టుకుందామనుకుంటూంటే, పెద్దల్లుడుగారొచ్చేరు,” అని తనభార్య పుల్లమ్మత్తయ్యఇంటికి తీరా వెళ్ళి అడిగితే, ఏమంది? “అయ్యో రామా! ఆ మాయదారి పాపిష్టి పిల్లి ఏదీ ఉండనిస్తేనా? మీ ఇంటికే వద్దామనుకుంటుంటే నువ్వే వచ్చేవూ? మరీ బాగుంది,” అని బోసిపళ్ళు యికిలించేసింది. ఎవరేనా అడిగేసరికల్లా ఆ మాయదారి పాపిష్టి పిల్లులు వస్తాయి కాబోలు. ముందరిరోజు తనయింట్లో కాఫీ తాగిన పుల్లమ్మత్తయ్యేనా ఆవిడ? ఆ కాఫీ దండుగేనన్నమాట!

అయితే మాత్రం? కొంతమంది తనకి సాయం చేసినవాళ్ళూ ఉన్నారు. అందునించి ఒక నిశ్చయానికి రాలేకపోయేడు సత్యం.

తను మాత్రం, మరొకళ్ళకి చుట్టం కాదా? బంధువు కాడా? అవును నిజమే! అయితేనేం? తను అలాంటివాడు కాడు. తక్కినవాళ్ళలాగ తన గొప్పతనాలన్నీ తను చెప్పుకోడు కాని ఎంతమందికి సాయం చెయ్యలేదు తను? లెఖ్ఖే లేదు.

ఆవేళ గబగబా దైన్యంగా సీను వచ్చేడు. వచ్చీ రావడంతోనే, “ఈవేళ జీతం కట్టకపోతే ఫైన్ వేస్తారు మావయ్యా! దగ్గిరేమో చూడబోతే దమ్మిడీ లేదు. నాన్నగారంటారా? ఎందుకో ఇంకా పంపలేదు మరి!” అని అడిగేడు. వెంటనే సందేహించకుండా డబ్బిచ్చేడు. అంతేనా? “ఎందుకు పంపలేదో కనుక్కుంటానుండ”ని ఆవేళే భాస్కరానికి వెంటనే డబ్బు పంపించమని ఉత్తరం రాసేడు.

“పెళ్ళివారొస్తున్నారవతల. కాలక్షేపానికి ఉంటుంది, నీ గ్రామఫోనియ్యి సత్యం,” అని కృష్ణ అడిగితే కాదనలేదు. ఎదురు కూడా చెప్పకుండా యిచ్చేడు. కాఫీ పౌడరే కానియ్యండి, పంచదారే కానియ్యండి, పుల్లమ్మత్తయ్య కెన్నిమాట్లు సరఫరా చెయ్యలేదు, ఇలాగెన్నిసార్లు ఎంతమందికని సాయం చెయ్యలేదు? ఇందులో అతిశయోక్తేం లేదు. అంతా అక్షరాలా నిజం. శుద్ధఖద్దరులోనే అబద్ధమాడడం! మూడు రంగుల జెండానీడని మెలుగుతూనే అసత్యం పలకడం! గాంధీటోపీ కిందనున్న బుర్రలోనే అలాంటి ఆలోచనలు!

గ్రామబంధు మొదలయిన బిరుదుల చేపట్టిన తను చుట్టాలకు కానివాడవడం అర్థం పర్థం లేని విషయం. తనేం సహాయం చెయ్యలేదని, లోభి అని, బ్లాక్ మార్కెటు మొదలయిన వాట్లలో పేరు పొందిన గురవయ్యకు కుడిభుజంగా ఉన్నాడని, ఇంకా యేవో అంటారే కానీ వాళ్ళకేం తెలుసు తనవిషయం? తనది నిరాడంబర జీవితం కాని పిసినిగొట్టుదేం కాదు. గురవయ్యమాటంటే? అందులో తప్పేముంది? మంచి నమ్మకస్తుడే. అయినా తనకెందుకా సంగతులన్నీ ప్రస్తుతం?

ఏదెలా ఉన్నా భాస్కర్రావు మాత్రం తక్కినవాళ్ళలాంటి వాడు కాడు. మంచి స్థితిలో ఉన్నాడు. మొదటితరగతిలో పాసయితే, మేనల్లుడిని తనకింద ఆఫీసర్ని చేస్తానని మొదటినుంచీ చెప్తూనే ఉన్నాడు. తన కొడుకేమో మొదటి తరగతేఁవిటి, యూనివర్సిటీ ఫస్టుగా పాసయితే! అయితేనేం? అక్టోబర్లో కానీ ఆ పని ఖాళీ అవదట. మరలాంటప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ కూచోడమెందుకని ఊళ్ళోనే తనతోపాటు లెక్చరర్‌గా చేస్తున్నాడు.

వెదుకబోయిన కాలికి తగిలినట్టు, జోళ్లు తొడిగిన సత్యానికి వారంరోజులనించీ ఊళ్ళోనే ఉంటూన్న భాస్కరం ద్వారందగ్గరే ఎదురయ్యేడు. ఏరోజు కారోజు భాస్కర్రావే వస్తాడులే అని సత్యం ఇన్నాళ్లూ కదలలేదు. తీరా తెగతెంపులు చేసేసరికి అతనే ఎదురయేడు. భాస్కరం కూడా ఆఫీసు పనులవల్ల ఈ వారంరోజులు రాలేకపోయేడు.

“అయితే అబ్బాయిని ఈపనికి ఎప్పుడు రిజైన్ ఇమ్మంటావు తమ్ముడూ? అందుకనే బయల్దేరేరాయన మరీను,” అని సత్యంభార్య అడిగింది. వెంటనే భాస్కరం అందుకొన్నాడు, “సరిసరి! ఇది మరీ బాగుంది. మీక్కావలసింది అబ్బాయిఉద్యోగమే కానీ నేను కాదన్నమాట ఇంతకీను. ఇంక వెళ్ళొస్తా మరి. ఇరవైకల్లా రిలీజయేట్టు చూడమనండి మరి,” అంటూనే భాస్కరం కుర్చీలోంచి లేచేడు. “భలేవాడివే,” అంటూ మళ్ళీ కూచోబెట్టి అంతా కలిసి కొంచెంసేపు నవ్వుకున్నారు.

హఠాత్తుగా సత్యానికేదో జ్ఞాపకం వచ్చింది. “అదేమిటి భాస్కర్! మీసీనలా చేసేడు. మొన్న జబ్బు పడ్డాడే అనుకో. సెప్టెంబర్లో కూడా తగలేసేడేమిటి మరి? ఒకటా, రెండా, అయిదు మార్కులు తక్కువొచ్చేయి,” అన్నాడు సత్యం. భాస్కర్ తల వూపి, “అవేళ జ్వరం వచ్చిందిట. అసలే బావుళ్ళేదట ఆవేళ. ఇంకా ఇలాగే ఏవేవో చెప్పుకొచ్చేడన్నీను. ఏం చేస్తాం. అందుకే అది కనుక్కుందామనే వచ్చేను,” అని టూకీగా అసలు విషయం బైట పెట్టేడు. “అరె, ఇంతకీ మాకోసం కానే కాదన్నమాట,” అని వెంటనే సత్యం తిప్పికొట్టాడు. విరగబడి నవ్వుకున్నారు కొంతసేపు అంతాను.

పక్కింటివాళ్ళ రేడియో బండగొంతుకతో ఏదో తెగ వాగేస్తున్నది. అంతా ప్రేమజగత్తును గురించిలాగుంది. “ప్రేమజగత్తులో ప్రేమకి అర్థం డబ్బు డబ్బు డబ్బు. ధనహీనుడికి ప్రేమికులుందురు. అంటే మరోలా చెప్పాలంటే చుట్టాలుందురు.” ఇలాగే ఉంది ఉపన్యాసమంతాను. భాస్కరంవేపు చూసి మందహాసం చేసేడు సత్యం.

రేడియోగొంతు వినగానే చిట్టి ఎప్పటిలాగే వెంటనే రేడియో కొనమని మారాం చేయడం మొదలు పెట్టింది. నిలుచున్నపాటున కొనిమ్మని రాగం తీసింది. నయాన్ని భయాన్ని చెప్పి చూశారు, కానీ రాగం స్థాయి తగ్గలేదు.

“అబ్బబ్బ. ఏం పిల్లలోనబ్బా! కొంటానుండవే అంటే ఏమిటా గోల?” అని కోపంతో అరిచేడు తండ్రి. కూతురు మాత్రం తన “ఫ్రీ“ పాటను ఆపలేదు.

“ఎందుకు బావా, చిట్టిననవసరంగా అలాగంటావ్? ఆమాత్రం చేతగాకపోతే సరి. ఇలా రా చిట్టీ. మనం బజారుకు పోయి తెచ్చుకుందాం. ఊఁ పద,” అని చిట్టిని చేరదీసి, బుజ్జగిస్తూ బజారుకి తీసుకుని వెళ్ళేడు. సత్యం పెదవి కదపలేదు.

గంటలో నాలుగు వందలు ఖరీదు చేసే రేడియో ఇంట్లో ఉంది. సత్యం మొదట కొంచెం విసుక్కున్నాడు. తరవాత అయిదు వందలయినా లేందీ రేడియో ఏఁవిటన్నాడు. ఆ రేడియో ఖరీదిచ్చేస్తానన్నాడు కానీ భాస్కరం పుచ్చుకోలేదు. కొంతసేపు పాట విన్నతరవాత, భాస్కరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకొడుకు విషయం మర్చిపోవద్దన్నాడు. ఆవిషయంలో బెంగ వద్దని, తప్పకుండా “ఆ నాలుగు” మార్కులు వేస్తానని సత్యం వాగ్దానం చేసేడు.

ఘటనాచక్రం గిరగిరా తిరిగింది. రానే వచ్చింది ఇరవయ్యో తారీకు.

కొడుకు ఉద్యోగం ఆర్డరు కోసం ఏరోజు కారోజు సత్యం ఎదురు తెన్నులు చూస్తున్నాడు. పోస్టుమాన్ ఉత్తరం అందివ్వగానే ఉప్పొంగిపోయాడు. విప్పినతరవాత ఆశ్చర్యపోయేడు. చదివితరవాత నిలువునా నీరై పోయేడు. పై ఆఫీసర్ అల్లుడికి ఆ ఉద్యోగం ఇచ్చేరుట. మొదటినుంచీ మూడవతరగతి వాడైనా ఒక డిగ్రీ ఎక్కువ ఉందిట! అందునుంచి ఇవ్వక తప్పలేదట. కొన్నాళ్ళు మిలిటరీలో కూడా పని చేసి వచ్చేడట. శాయశక్తులా ప్రయత్నించేనని, అంతా బూడిదలో పోసిన పన్నీరయిందని భాస్కరం వాపోయేడు. తన చేతుల్లోంచి దాటింది కనకనే అలా అయిందని, క్షమించమని రాసేడు. సీనుకి ఆ నాలుగుమార్కులు వేసినందుకు కృతజ్ఞత తెలిపేడు.

వీధిలోంచి వస్తున్న సత్యం కొడుకు తండ్రికి పేపరందిస్తూ, విచారంతో అన్నాడు, “పాపం, సీను పరీక్ష పోయిందండీ,” అని. తండ్రిచేతిలో ఉత్తరం చూసి తన ఉద్యోగవిషయమేనన్న ఉద్దేశ్యంతో, సంతోషంతో చెప్పేడు తననీవేళ రిలీజు చేసినట్టు.

అప్రయత్నంగా సత్యం నోరువెమ్మట “అక్కరకు రాని చుట్టాల”న్న మాటలు వినపడ్డాయి. పళ్ళు పటపటలాడేయి.

“ధనమూలమిదమ్ జగత్” అంటున్న రేడియో నోటిని ముయ్యడానికి ఆతృతగా వెళ్ళేడు సత్యం.

చుట్టాలు సమయానికి ఎందుకు అక్కరకు రారో సత్యానికి అర్థం కాలేదు, కావడం లేదు. చేతనయిన సాయం చేస్తే, వాళ్ళ సొమ్మేం తరిగిపోతుందా? కొంప కూలిపోతుందా? పుట్టి మునిగిపోతుందా? అదే అతనికి తెలియడం లేదు.

000

 

 

(తెలుగు స్వతంత్రలో ప్రచురితం.)

 

 

(ఫిబ్రవరి 21, 2012.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మా నిడదవోలు వంశంలో కథకులు – 2”

  1. లక్ష్మీరాఘవ, అవునండీ, పైపై మెరుగుల్లోనే కానీ మౌలికంగా మనలో ఏమార్పూ రాలేదు, పాశ్చాత్యనాగరికతకి అలవాటు పడి మనవాళ్ళని హేళన చేసేవారితో సహా.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.