మార్పు 32

షష్టిపూర్తికి రెండువారాలుందనగా రాజర్ వచ్చేడు ఓ శనివారం. అనుకున్న శుభవేళకి ఎవరు వస్తున్నారు, ఎవరికి ఎక్కడ వాసం ఏర్పాటు చేయాలిలాటివి లెక్కలు చూసుకుని మిగతా కొసరు ఏర్పాట్లు మొదలు పెట్టేరు. షికాగోనుండి పరమేశ్వరశాస్త్రిగారిని పిలిపిస్తున్నారు. విషి స్నేహితుడొకతను షికాగో వెళ్ళి శాస్త్రిగారిని తీసుకువస్తానని మాటిచ్చేడు. దంపతులు తెల్లవారుఝామునే లేచి, స్నానాదికాలు ముగించుకుని, నూతనవస్త్రాలు ధరించి ఆరుగంటలకల్లా పీటలమీద కూర్చోవాలని ప్లాను. విషి మిత్రుడొకడుముందురోజు సాయంత్రం వెళ్ళి  శాస్త్రిగారిని కారులో తీసుకొచ్చేస్తానని హామీ ఇచ్చేడు. శాస్త్రిగారు మొదట ఎందుకండీ ముందురోజే అన్నారు కానీ అందరివీలూ చాలూ చూసుకోవాలి కనక సరేనన్నారు.

000

రామలక్ష్మి, కవిగారూ ఇండియానించి వచ్చేరు. వారిద్దరినీ తమఇంట్లోనే పెట్టుకున్నారు ప్రభాస్రావు దంపతులు. ఇంగ్లండునించీ, ఆస్ట్రేలియానించీ వచ్చిన స్నేహితులు బంధువులఇళ్ళలో దిగేరు. కెనడాలో ఉన్న స్నేహితులు ముందురోజు రాత్రి బయల్దేరి తెల్లారేసరికి గుమ్మంలో దిగేరు.

సంరంభం యథావిధిగా సన్నాయిమేళాలమధ్య ప్రారంభమయింది. విఘ్నేశ్వరపూజ, శాంతిహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలూ, , నవగ్రహపూజ, సత్యనారాయణపూజ సర్వం శాస్త్రోక్తంగా జరిపించేరు శాస్త్రిగారు. వధూవరులు శాస్త్రిగారికి పాదాభివందనం చేసి, దక్షిణతాంబూలతో పట్టు వస్త్రాలు, గోదానం చేసేరు. ఆ తరవాత మరొక ఆరుగురికి కూడా అలాగే వస్త్రాలూ, గోముద్రలు పంచిపెట్టేరు ప్రభాస్రావు దంపతులు.

పసుపు విఘ్నేశ్వరుడిని చేసి తమలపాకులో పెట్టి పూజ చేస్తుంటే, “అదేమిటి?” అనడిగేడు మనవడు బాబీ.

రామలక్ష్మి, అది విఘ్నేశ్వరుడని చెప్పి, తాము చెయ్యబోయే శుభకార్యం అవిఘ్నంగా సాగాలని పూజ చేస్తున్నారని చెప్పింది.

ఆ పసుపు ముద్ద ఎలిఫెంట్ గాడ్ లా లేడన్నాడు బాబీ.

“ఎలిఫెంట్ గాడ్, మంకీ గాడ్ కాదు. కనీసం ఈ రెండు మాటలయినా మనమాటలు నేర్చుకో. విఘ్నేశ్వరుడు అనలేకపోతే గణపతి అను,” అంది రామలక్ష్మి.

“ఇక్కడ వీళ్ళంతేనండీ. మాట ఏదయినా కనీసం ఆ ఆలోచన ఉంది కదా అని మనం సంతోషించాలి,” అంది పక్కనున్న మరొకావిడ.

ఆ తరవాత కూడా ప్రతీదీ అదేమిటి, ఇదేమిటి, ఇప్పుడేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటూ బాబీ అడుగుతూనే ఉన్నాడు. రామలక్ష్మి ఓపినంతమేరకి జవాబులు చెప్పింది. అబ్బాయి పక్కనే కూర్చున్న లీసాకి కూడా అవే సందేహాలయితే ఉన్నాయి కానీ అడగలేదు. బాబీ ప్రాక్సీతో ఎంత తెలిస్తే అంతే అనుకుని ఊరుకుంది. ఇంటికెళ్ళేక ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తాయి కదా అనుకుంటోందావిడ. లీసా, రాజర్ పెళ్ళి కూడా తెలుగుసాంప్రదాయంలోనే జరిగింది. కానీ ఆసమయంలో  ఆ సంరంభంలో ఆవిడకి ఇదేమిటీ, అదేమిటీ అని అడిగే అవకాశం లేకపోయింది. ఏదో నాటకం వేస్తున్నట్టు కుర్చీలో కూర్చుని పురోహితుడు ఏం చెయ్యమంటే అది చేసి, అయినతరవాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందే కానీ వివరణలు అడగలేదు.

మొత్తం కార్యక్రమం అయేసరికి పన్నెండయింది.

ఆహూతులందరూ చిన్న చిన్న ద్వీపాలలా గుంపులు గుంపులుగా ఈ గదిలోనూ, ఆగదిలోనూ, ముందు వరండాలోనూ, వెనక అరుగుమీదా, చెట్లకిందా, తలోచోటా చేరి కబుర్లలో పడ్డారు. లీల మంచినీళ్ళకోసం వంటింట్లోకి వెళ్ళింది. ఎడంవేపు డైనింగుబల్లదగ్గర నలుగురు ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

“ఆ పొందూరు జరీ చీరె కట్టుకున్నమ్మాయేనా?”

“ఆ, ఆవిడే. అమ్మాయేమిటిలే కానీ నలభైలు దాటేయి.”

“మరి సుందరాన్ని వదిలేసినట్టేనా?”

“అనే అనుకుంటున్నా. ఏదీ … రెణ్ణెల్లవుతోంది ఆ పెద్దక్కయ్యింట్లోనే తిష్ఠవేసి. మరి మాటలేమైనా ఉన్నాయో లేదో తెలీదు.”

“సుందరం చెప్పేట్ట తాను వస్తున్నాడు కనక ఆవిడ రాకుండా ఉంటే బాగుంటుందనీ.”

“అవునా? ఎందుకూ?”

“మరే, కొవ్వు కాకపోతే.”

“అది కాదు. ఆయనగారు ఈవిడగారిని పలకరించకపోతే ఎవరేం తప్పు పడతారో, మరి మాటాడొచ్చో, మాటాడకూడదో … అనుకుంటూ సతమతమయిపోయేట్ట ఆ అబ్బాయి.”

“అవును మరి, పాపం. అతన్నే కదా అంటారు దేశం కాని దేశంలో ఆడపిల్లనొక్కర్తినీ అలా వీధిలోకి తోలేస్తే ఆ అమ్మాయిగతేం కాను.”

“హ, మీరు మరీను. దేశం కాని దేశం అయితే మాత్రం ఊరు గొడ్డు పోయిందేమిటి. ఇక్కడ మేం అందరం లేమూ?”

“ఏంటి, మీయింట్లో పెట్టుకున్నారా ఆవిణ్ణి?”

“అవసరమయితే పెట్టుకునేవాళ్లమే. మనలో మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు. ఆ పెద్దక్కయ్యగారు లేరూ, వాళ్ళింట్లో ఉంది.”

“అక్కడా ఇక్కడా ఎందుకు, ఇండియా వెళ్ళిపోవచ్చు కదా.”

“అక్కడ మాత్రం ఎవరున్నారు? అమ్మా బాబూ ఉన్నంతవరకే పుట్టిల్లు.”

“ఆ మేనమామ లేడూ. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ఒకపంచన పడుండొచ్చు నిశ్చింతగా.”

“హా హా”, “హు హూఁ.”

“ష్ ..” … కళ్ళతో సౌంజ్ఞలు …

లీల నిరామయంగా మంచినీళ్ళగ్లాసు తీసుకుని, ఓ గుక్కెడు తాగి, గ్లాసు తొలిచి సింకులో పెట్టేసి హాల్లోకి వచ్చింది.

“నాకు చెయ్యి నొప్పెడుతోంది. విషిని పిలు. ఇంటిదగ్గర దిగబెట్టేస్తాడేమో,” అంది పెద్దక్కయ్య పాలిపోయిన లీలమొహం తప్పించి ఎటో చూస్తూ.

లీల నెమ్మదిగా మాట సాగదీస్తూ, “మనం ఇప్పుడు వెళ్తాం అంటే బాగుండదేమో,” అంది.

“ఫరవాలేదులే. నేను చెప్తాను, విషిని పిలు. శివానిగారితో కూడా చెప్పు.”

శివాని వచ్చి, “అదేమిటండీ, వెళ్ళిపోతాం అంటున్నారుట. ఉండండి. భోజనం చేసి పోదురుగానీ,” అంది.

“చెయ్యి పీకేస్తోందండీ, కూర్చోడం కష్టంగా ఉంది. ఇంటికెళ్ళి, పడుకుంటాను. భోజనానికేంలెండి. అసలు పండుగ శుభం చూసేం కదా.”

“అయ్యో. మందులేం పని చేయడం లేదా? ఐబుప్రొఫిన్ ఇవ్వమంటారా?”

“లేదులెండి. మరోసారి వస్తాం. తీరిగ్గా కూర్చుని మాటాడుకుందాం.”

విషి, ఆవెనకే అరవిందా కూడా వచ్చేరు.

ప్రబాస్రావు వచ్చేడు, “ఏమిటండీ, భోంచెయ్యకుండా వెళ్లిపోతారా? అసలు వివాహవేళ భోజనానికి ప్రత్యేకత ఉంది,” అంటూ.

“ఏమిటండీ ఆ ప్రత్యేకతా?” అంది అరవింద చిన్నగా నవ్వి.

అరవింద తనని అడిగినందుకు ప్రభాస్రావు పొంగిపోయేడు. “నీకు తెలీదు కానీ మనసంస్కృతిలో సంస్కృతిలో భోజనం అంటేనే ఒక ప్రత్యేకత. పెళ్ళిళ్ళలో ఆహూతులు వధూవరులు చేసే ప్రమాణాలకి సాక్షులు. వాళ్ళు భోజనంతో సంతృప్తి పడడం ఒక ఎత్తయితే, అలా అన్నం తిన్నందున మనవిషయంలో అబద్ధమాడరాదన్నది మరొక నియమం. ఆ భోజనపదార్ధాల్లో ఉన్న ఉప్పుకున్న బలం అన్నమాట అది. నాఉప్పు తిని … అన్న సామెత విన్లేదూ, అలాటిదే ఇదీను.”

“లేదులెండి. మేం మీ ఉప్పు తినకపోయినా అబద్దాలు చెప్పం. పైగా ఇంతకుముందు తిన్నాం కదా,” అంది పెద్దక్కయ్య.

“అదేం వీల్లేదండీ. మీరు భోంచేసి వెళ్లాలి.”

“మేం ఆ కార్డుముక్కల్లో భోజనానికి ఉంటాం అని రాయలేదండి.”

“ఫరవాలేదులెండి. ఐదారుగురు వస్తాం అన్నవాళ్ళు రాలేదు. మీరు ఉండి తీరాల్సిందే. మీకు అలసటగా ఉంటే, కాస్సేపు పైకి వెళ్ళి గదిలో పడుకోండి,” అనేసి, గుమ్మంవేపు నడుస్తూ, “కంచానికి మూడువందలు. రానివాళ్ళు రాలేం అని చెప్పొచ్చు కదా,” అన్నాడు ప్రభాస్రావు స్వరం బాగా తగ్గించి, తనలో తను మాటాడుకుంటున్నాట్టు.

000

అతిథులందరూ తమకి కేటాయించిన బల్లలు చూసుకుని సర్దుకు కూర్చున్నారు. ఇద్దరూ పెద్దవాళ్ళు, మాటాడుకుంటారని పెద్దక్కయ్యనీ,

భోజనాలవేళ దంపతులని చాలాకాలంగా ఎరిగి ఉన్నవారు కథలు చెప్పేరు. ప్రభాస్రావు హాస్యచతురత, మంచితనం, గడుసుదనం, మేధాసంపత్తి యధాశక్తి వివరించేరు. ఒక తరం ముందుగానే ప్రేమపెళ్ళి చేసుకున్న ఆదర్శపురుషుడు.

కేక్ కట్ చేసింతరవాత, సంగీతం పెట్టేరు. వయసులో ఉన్న అబ్బాయిలూ, అమ్మాయిలూ, లీసా, రాజర్, ఉత్సవం చూడ్డానికొచ్చిన ఇతర అమెరికన్ మిత్రులు భుజాలమీదా, నడుములమీదా చేతులేసుకు, సుతారంగా వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా అడుగులేస్తూ ఆనందిస్తున్నారు.

“కమాన్, తాతా, నువ్వు బామ్మా డాన్సు, డాన్సు,” అంటూ ఆయన చెయ్యి పుచ్చుకు లాగేడు బాబీ.

మిగతా వారు కూడా యస్యస్ అంటూ చప్పట్లు కొట్టడం మొదలెట్టేరు. ప్రభాస్రావు నవ్వుతూ భార్య చెయ్యి పుచ్చుకు రా అంటూ లాగేడు. ఆవిడ సిగ్గు పడుతూ, చిన్న నవ్వుముఖంతో ఆయనవెనక నాలుగడుగులు వేసి, చాల్లెండి అంటూ పక్కకి తప్పుకుంది.

ప్రభాస్రావు పక్కకి తిరిగి, అరవిందతో డాన్సు చేస్తున్న విషిభజం తట్టి, “may I!” అన్నాడు.

విషి తప్పుకున్నాడు మర్యాదననుసరించి.

అరవింద ఆయనతో నాలుగడుగులేసి పక్కకి తప్పుకుంది మంచినీళ్ళు కావాలంటూ.

ఇదంతా చూస్తున్న రామలక్ష్మి, ”వీడికి ఏళ్ళొచ్చినా పోకిరీవేషాలు పోలేదు,” అంది.

”అదేమిటండీ అలా అంటారు?”

“చిన్నప్పట్నుంచీ ఆకతాయితనం. హైస్కూల్లో ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు – వాళ్ళ వెనక చేరి జడలు పట్టుకు లాగడం, రోడ్డుమీద వాళ్ళవెంట పడి నడుస్తూ వెకిలిమాటలాడుతూ గోల చేయడం. ఒకసారి ఒకమ్మాయి అన్నయ్య – మంచి వస్తాదులా ఉంటాడు కండలు తరిగి – మనవాడ్ని పట్టుకు తన్నడానికి సిద్ధమయేడు. ఆ తరవాత వీడు కొంచెం తగ్గేడు కానీ మళ్ళీ కాలేజీలో ఇదుగో ఈ అమ్మాయి వెనక పడ్డం మొదలెట్టేడు.

ఈ అమ్మాయి ప్రిన్సిపాలుకి రిపోర్టు ఇచ్చింది కూడా ఒకసారి. అయినా వీడేమో వెంటబడడం మాన్లేదు. ఆఖరికి ఓరోజు ఆవిడతండ్రి వీడిని కలిసి, చెప్పేరు, ‘చూడు బాబూ, మేం పరువుగా బతుకుతున్నాం. నీకు ఇష్టమయితే పెళ్ళి చేసుకో. నాకు చేతనయినంతలో కట్నకానుకలిచ్చి పెళ్ళి చేస్తాను. లేదంటావూ, దాని మానానికి దాన్ని ఒదిలెయ్. అంతేగానీ ఇలా రోడ్డుమీద గొడవ పెట్టడం మానకపోతే మక్కలిరిగ్గొడతాను’ అని మర్యాదగానే చీవాట్లు పెట్టేరు. దాంతో మాతమ్ముడు, ‘నేను మీఅమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీఅమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది. మీరు మానాన్నగారితో మాటాడండి. మేం పెళ్ళి చేసుకుంటాం’ అన్నాడు. ఆ తరవాత వారూ వీరూ మాటాడుకుని, యథావిధి పెళ్ళి చూపులు ఏర్పాటు చేసి, సుముహూర్తం పెట్టించేరు. ఆవిధంగా వారిపెళ్ళి అయింది. మాది ప్రేమపెళ్లి అంటూ వాడు గొప్పలు పోతే,  అమ్మా, నాన్నగారూ వాళ్ళకుటుంబం పరువుప్రతిష్ఠలు చూసి, మేం పెళ్ళి చేసేం అంటూ చెప్పుకుంటారు బంధువులతో.”

శివానికి ఆడబడుచు చెప్తున్న కథ వింటుంటే ఆరోజులు మనసులో మెదిలేయి. పెదవులమీద చిన్న నవ్వు మెరిసింది. అయితే రామలక్ష్మి వ్యాఖ్యానం నిజానికి ఆనాటిసంగతి కాదని ఇప్పుడు ఎదురుగా అరవిందతో ఆయన నాట్యం చెయ్యడంగురించి అని ఆవిడకి అర్థం కాకపోలేదు. అవిడ ఆవిషయాన్ని పట్టించుకోదలుచుకోలేదు. అంతే.

000

వచ్చినవాళ్ళందరూ ఒకొకరే బయల్దేరేరు వెళ్తాం అంటూ. ఆడవాళ్ళకి శివాని స్నేహితురాలు వరాలుగారూ, మగవాళ్ళకి రాజర్ చిన్న చిన్న సంచులు అందించి వీడ్కోలు చెప్పేరు.

లీలకీ, పెద్దక్కయ్యకీ, శివాని వెనకగదిలోకి పిలిచి పళ్లెంలో చీరె, పసుపూ, కుంకుమా, పువ్వులూ తాంబూలంలో పెట్టి ఇచ్చింది. అరవిందకి సల్వార్ కమీజు, పళ్ళూ, పువ్వులూ సంచీలో పెట్టి అందించింది. అవి అందుకుని, థాంక్స్ అంది.

తరవాత, పెద్దక్కయ్యతో, “రండి, మీఇద్దర్నీ మీయింటిదగ్గర దింపి నాగదికి వెళ్ళిపోతాను,” అంది. ముగ్గురూ మరోసారి శివానికి అభినందనలు తెలిపి, గుమ్మం దాటబోతుంటే ప్రభాస్రావు వచ్చి, లీలకి ఓ చిన్న పెట్టె ఇచ్చేడు, ఆ సల్వార్ కమీజుతో ముత్యాలదండ బాగుంటుందంటూ. ఆయనవెనక విషి నిల్చుని ఉన్నాడు. ఇది విషిదగ్గర్నుంచా, వాళ్లనాన్నదగ్గర్నుంచా అన్న సందేహం వచ్చింది లీలకి. ఓ క్షణం తటాపటాయించి, అంతమందిమధ్య రచ్చ చెయ్యడం ఎందుకు, తరవాత కనుక్కోవచ్చు అనుకుంటూ తీసుకుని బయల్దేరింది.

(మార్చి 15, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మార్పు 32”

  1. నందన నామ సంవత్సరంలో పుట్టిన నాకు
    షష్టి పూర్తి విశేషాలు వింతగా వినోదంగా ఉన్నాయి.
    అసలు కథకు పిట్ట కథ లా బాగా వ్రాసారు.
    మోహన్

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s