మార్పు 33

షష్టిపూర్తి అయిపోయేక, ఆ రోజూ, మర్నాడూ ఒక్కొక్కరే తాము ఇరుక్కున్న సందర్భాలూ, సన్నివేశాలు బేరీజు వేసుకోడం మొదలెట్టేరు.

“బాగా చేసేరండీ షష్టిపూర్తి. ఇంత నిష్ఠగా ఆచరించడం ఎక్కడా చూడం ఈరోజుల్లో,” అంది ఒకావిడ.

రామలక్ష్మి ప్చ్ అని పెదవి విరిచేసి, “ఎలాగైనా మనయిళ్ళలో జరిపించేతీరే వేరులెండి. మొత్తం తతంగం పూర్తయేవేళకి వచ్చినవాళ్ళంత ఎంతగా డీలా పడిపోతారో తెలుసా! మగాళ్ళంతా ముక్కులదాగా మెక్కి, ఆపసోపాలు పడుతూ తలోచోటా నడుం వాలుస్తారు. ఆడవాళ్ళు చెమట్లు కారుతూ, మొహాన కుంకమ చెదిరిపోయి, చీరెలు నలిగిపోయి, పువ్వులు వాడిపోయి … అదో సొగసనుకో. వీళ్ళూ చేసేరులే హోమం, నవగ్రహపూజ, వివాహవిధి, సత్యనారాయణపూజ, దానాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ ఆ కేకులూ, డాన్సులూ ఏమిటి పానకంలో పుడకలా,” అంది కళ్ళూ, చేతులూ తిప్పుకుంటూ.

‌శివాని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది, “ఇప్పుడు మనదేశంలే లేం కదండీ. అంతా అచ్చంగా మక్కికీ మక్కీ అక్కడ జరిగినట్టే జరగాలంటే ఎలా? కాశిలో గంగాస్నానాలూ, కాళహస్తిలో శివపూజలూ … ఎక్కడికక్కడే. ఈగడ్డమీద ఉన్నపుడు, ఇక్కడిసంప్రదాయాలకి అలవాటు పడినవారిని పిలిచినప్పుడు వారిని కూడా సంతోషపెట్టాలి కదా.”

“అయితే మాత్రం మన మర్యాదలు మనం పాటించఖ్ఖర్లేదూ. అసలు వాడలా ఆ అమ్మాయితో డాన్సేమిటి, ఏమైనా మర్యాదగా ఉందా? నువ్వూ, విషీ అలా చూస్తూ ఊరుకోడమేమిటి?” అంది రామలక్ష్మి రెచ్చిపోతూ.

శివానికి చిరాకేసింది కానీ మాటకి మాట తెగులు అనుకుని అక్కడ్నించి లేచిపోయింది.

విషి ఓపిగ్గా అత్తకి ఈదేశపు ఆనవాయితీలు వివరించడానికి ప్రయత్నించేడు ఓ పావుగంటసేపు. “అది కాదత్తా,  ఈదేశంలో అందరూ అలా డాన్సు చేస్తారు. అందులో తప్పు లేదు. ఊరికే తమ ఆనందాన్ని పంచుకోడం, అంతే.”

“ఏమో బాబూ, మీఅందరికీ బాగానే ఉంటే నాకేంటి బాధ, కందకి లేని దురద కత్తిపీటకా అనీ …” అంటూ సాగదీసింది.

విషి ఆవిడకైతే చక్కగానే వివరించేడు కానీ ఆ వ్యాఖ్యానం మాత్రం అతన్ని బాగా కలవరపెట్టి మనసులో రొద పెడుతూనే ఉంది కొన్నాళ్ళపాటు.

000

ఇంటికి వచ్చేక లీల చాలాసేపు ముభావంగా ఉండిపోయింది. ప్రభాస్రావుగారింట్లో నలుగురు అమ్మలక్కలు భోజనాలబల్లదగ్గర చేరి అర్థం పర్థం లేకుండా ఆడిన పలుకులు ములుకులై బాధిస్తున్నాయి ఆమెని.

చీరె మార్చుకుని ముందుగదిలోకి వస్తే, పెద్దక్కయ్య ఇంకా అక్కడే కూర్చునుంది. ఫలానా అని ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, ఎవరో ఏదో అని ఉంటారనీ, లీల బాధ పడుతోందనీ మాత్రం గ్రహించిందావిడ.

“రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను,” అంది లీలని చూడగానే.

“అయ్యో, నాకోసం కూర్చున్నారా? ఏం? ఏమైనా కావాలాండీ?” అంది లీల ఆతురతగా.

“అఁ ఆఁ. అదేంలేదులే. నాకేం అఖ్ఖర్లేదు కానీ నువ్వే ఏం అనుకుంటున్నావో అని.”

“ఏ విషయం? అనుకోడానికేం ఉంది?”

పెద్దక్కయ్య రెండు నిముషాలూరుకుని, “ప్రభాస్రావుగారింట్లో సుందరం కనిపించేడు. ఏమీ జరగనట్టు, పక్కనుంచి పోతూ,  బాగున్నారాండి అని నావెనకనున్న గోడతో అనేసి, సమాధానంకోసం చూడకుండా వెళ్ళిపోయేడు. నీక్కూడా కనిపించేడేమో, ఏమైనా అన్నాడేమో అని …”

“లేదు. నాతో ఏమీ అన్లేదు. దూరంనుంచి చూసేను ఒకట్రెండుమాట్లు కానీ మాటలేం లేవు.”

000

సాయంత్రం ఆరుగంటలవేళ పేపరు చూస్తున్న లీల, టీవీ చూస్తున్న పెద్దక్కయ్య ఉలిక్కిపడ్డారు తలుపు తట్టిన చప్పుడయితే. ఈవేళప్పుడెవరా అనుకుంటూ తలుపు తీసింది లీల.

ఎదురుగా సుందరం నిల్చుని ఉన్నాడు.

లీల సందిగ్ధంగా పక్కకి తప్పుకుంది.

“ఎలా ఉన్నారండీ. చెయ్యి ఎలా ఉంది?” అని పెద్దక్కయ్యగారితో అంటూ చొరవగా లోపలికి వచ్చేడు సుందరం.

“బాగానే ఉంది. నయంవవుతోంది నెమ్మదిగా. నువ్వెలా ఉన్నావు? ఆరోజు ప్రభాస్రావుగారింట్లో కనిపించేవు కానీ మాటాడ్డానికే పడలేదు. అంతా హడావుడి.”

“అవుండీ. అదే. అందుకే ఇవాళ తీరిగ్గా మాటాడదాం అని వచ్చేను. మీకెలా ఉందో, ఏం చేస్తున్నారో అడుగుదాం అని. మీకేమైనా కావలిస్తే, నేను చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పండి, మొహమాటపడకండి,” అన్నాడు సుందరం కలివిడిగా.

పెద్దక్కయ్య చిన్నగా నవ్వింది, “నాకేం కావాలి గానీ నీ సంగతి చెప్పు. నువ్వే ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ప్రయాణాలూ, అవీ –  వాటితో బాగా తలమునకలుగా ఉన్నావేమో?”

“నిజం చెప్పమంటారా? లీల లేక ఇల్లు చిన్నబోయిందండీ. అంతే కాదు. ఊళ్లో వాళ్లకి చెప్పలేక ఛస్తున్నాను. అక్కడికీ మీకు అవసరమని ఇక్కడికి పంపించేనని చెప్పేను కానీ వాళ్లు వదిల్తేనా,” అంటూ లీలవేపు తిరిగి, “నీతో కొంచెం మాటాడాలి,” అన్నాడు.

“ఏం మాటాడాలి?” అంది లీల.

పెద్దక్కయ్య, “నిన్నంతా ఆ సందడితో నాకింకా అలసటగానే ఉంది. కొంచెంసేపు పడుకుంటాను,” అంటూ లేచింది నెమ్మదిగా.

“అవునండీ, అంత జనం నాకే నీరసం వచ్చింది. పడుకోండి. ఏమైనా కావలిస్తే నాకు ఫోను చెయ్యండి, మరిచిపోకండి,” అంటూ సుందరం మరోసారి ఆవిడయందు తనకి గల అభిమానం వ్యక్తం చేసేడు. తరవాత ఆవిడ మాట వినపడనంత దూరం వెళ్ళిపోయిందని నమ్మకం కుదిరేక, లీలవేపు తిరిగి, “మ్. చెప్పు,” అన్నాడు.

“ఏం చెప్పను?”

“అదే ఎప్పుడొస్తావు ఇంటికి?”

లీల మాటాడలేదు.

“ఆవిడకి బాగానే ఉన్నట్టుంది కదా. ఇప్పుడొచ్చేయి. కారు సిద్ధంగా ఉంది.”

లీల చిన్నగా నవ్వింది, “కారు లేకేమిటి ఇంతవరకూ ఇక్కడున్నది?”

“ఏమో, నాకేం తెలుసు. అసలు ఎందుకు అలా ఉన్నట్టుండి ఇల్లొదిలేసి వచ్చేసేవు?”

“ఉన్నట్టుండి ఏమిటి. నాలుగేళ్ళుగా చెప్తున్నాను మీవరస నాకు బాగులేదని.”

“ఏం చెప్పేవు?”

“మీరలా అడిగితే నేనేం చెప్పను? నన్నో మనిషిలా చూడాలని మీకు తోచాలి గానీ.”

“అదేమిటి అలా అంటావు. నీకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేసేను కదా. నువ్వేం చేసినా ఎందుకిలా చేసేవని ఎప్పుడయినా అడిగేనా?”

“అలా అడిగే పరిస్థితులు వస్తే కదా. ఎంతసేపూ మీరూ, మీపనీ, మీ స్నేహితులే కానీ, నేను కూడా మనిషినే అని మీకెప్పుడయినా అనిపించిందా?”

“నువ్వలా మాటాడితే నాకర్థం కావడం లేదు. నువ్వు నీస్నేహితులతో కాలక్షేపం చేస్తే నేను కాదన్నానా?”

“పెళ్ళి చేసుకోడం స్నేహితులతో కాలక్షేపం చెయ్యడానికా? అయినా అసలు నేను కాలక్షేపం మాట కాదు అంటున్నది.”

“సరే, ఏం మాటో మరోసారి చెప్పు. నేను మూర్ఖుణ్ణి. నాకు స్పష్టంగా చెప్తే కానీ తెలీదు.”

“అదుగో, అలాటిమాటలే నాకు చిరాకు.”

“చూడు లీలా, నీకు నాపద్ధతి నచ్చలేదు. నాక్కూడా నీపద్దతి, కనీసం కొన్ని విషయాల్లో నచ్చలేదనుకో. అవి నువ్వూ, నేనూ మాటాడుకోవాలి గానీ, ఇలా ఇల్లొదిలేసి వచ్చేస్తే ఎలా. సరే. అలా మాటడను. అయినా ఇవన్నీ తరవాత ఇంటికెళ్లేక తీరిగ్గా మాటాడుకుందాం. పద.”

ఎదటిమనిషిని మనిషిగా చూడాలని చెప్పడం ఎలాగో తెలీలేదు లీలకి. కొంచెంసేపు ఆలోచించి, “ఆరోజు పీటర్ ఇంట్లో ఉన్నంతసేపూ హేళన చేస్తూనే ఉన్నారు. ఒకటి రెండుసార్లు మాట మార్చడానికి ప్రయత్నించేడు కూడా. మీరు మాత్రం నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మీకు తెలీదేమిటి ఈదేశంలో భార్యాభర్తలు అలా నలుగురిలో ఒకరినొకరు చులకన చేసి మాటాడుకోరని.”

“ఒస్, అదా, మనిద్దరం పెళ్ళయిన మొదటిరోజునించీ హాస్యాలాడుకుంటూనే ఉన్నాం కదా. అది మన సాంప్రదాయంలోనే ఉంది. నువ్వే అంటావు కదా కాంతంకథలు ఎంతో బాగుంటాయని. దాన్నిండా ఆయన ఆవిడ్ని హేళన చేయడమే కదా.“

“అందుకు ప్రతిగా ఆవిడమీద అలిగి, ఆయన వెళ్ళిపోయి అయ్యరుహోటల్లో తింటే ఏం జరిగింది?” అంది లీల. అది తల్చుకుని నవ్వింది.

లీల నవ్వినందుకు సుందరం సంతోషించాడు. అతనిదృష్టిలో ఆమె తనకి సుముఖంగానే ఉంది. మధ్యవాళ్ళెరో పెడుతున్నట్టుంది ఈ పీటముళ్ళు.

కానీ లీల సుముఖంగా లేదు.

పాఠకులారా! వారిద్దరిమధ్య జరిగిన సంభాషణ సంపూర్ణమూగా వ్రాయుటకు ఈ కథకుడికి సమ్మతము కాదు. సూక్ష్మంగా లీలగారు తనకి ఏవిషయంలో బాధ కలిగిందో చెప్పిన ప్రతిసారీ, సుందరంగారు, “ఒస్, అంతేనా, సరే, అలాగే, నీయిష్టం వచ్చినట్టే చేస్తానం”టూ రావడం జరిగింది. వివరములు మీమీ ఊహలకే వదిలివేయడమైనది.

రెండున్నరగంటలసేపు అలా సాగేయి ఆ వాదోపవాదాలు. అస్త్రసన్యాసం చేసినవాడితో యుద్దం చెయ్యడం ఎలా సాద్యం? అనిపించింది లీలకి.

మళ్ళీ సుందరమే అందుకున్నాడు. “నాకు తెలీకే అడుగుతున్నాననుకో. నీమటుకు నీకు షష్టిపూర్తిరోజున వాళ్ళింట్లో సుఖంగా అనిపించిందా? నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుకోవలసివచ్చింది? ఎంతమంది నిన్ను ఎన్ని మాటలన్నారు?”

“మీకెలా తెలుసు వాళ్ళేం అన్నారో?”

“ఎలా తెలియడమేమిటి, నాతోనూ అన్నారు. అక్కడికీ నేనే సర్థి చెప్పేను పెద్దక్కయ్యగారికి సాయం చెయ్యడానికి వచ్చేవనీ, మనిద్దరిమధ్యా ఎలాటి పొరపొచ్చాలూ లేవని. … అయినా నువ్వే చెప్పు, ఎంతకాలం ఇలా వీళ్ళింట్లో ఉంటావు? ఆతరవాత ఎక్కడికెళ్తావు? ఏం చేయగలవు?”

సుందరంతో వచ్చిన చిక్కే ఇది. అతను ఏ పరిస్థితిలోనైనా తనమాటే సబబు అనిపించగలడు ఎదటివారిచేత. నిజమే. ఇక్కడ ఎంతకాలం ఉండగలదు? ఆతరవాత ఎక్కడికి వెళ్ళడం? ఏం చెయ్యడం? ఇంతకాలం ఉద్యోగం సద్యోగం లేనిమనిషి ఉద్యోగంవేట మొదలు పెట్టడం ఎలా? దొరికితే ఎలాటి ఉద్యోగం దొరుకుతుంది?

“నామాట విని, పద. నీపెట్టె తీసుకురా. చెప్పేను కదా. ఇంటికెళ్ళేక మాటాడుకుందాం. అప్పటికీ నీకు నమ్మకం లేకపోతే, వేరే దారి చూద్దాం. నిన్ను ఈదేశం నేనే తీసుకొచ్చేను కనక నీకోదారి చూపెట్టడం కూడా నాబాధ్యతే. నేనే చూసిపెడతాను.”

లీల రెండు నిముషాలూరుకుని, “ఇప్పుడు కాదులెండి. రేపొస్తాను,” అంది.

“ఏం, రాహుకాలం, వర్జ్యంలాటివేవేవా ఉన్నాయేమిటి ఇప్పుడు?”

“సుముహూర్తం కాదు నేను చూస్తున్నది, సుగమం, సుభగం అయిన మార్గంకోసం. పెద్దక్కయ్యగారు పడుకున్నారు. ఆవిడని లేపి వెళ్లిపోతున్నానని చెప్పనా, ఓ చీటీముక్క రాసి ఫ్రిజ్ మీద పెట్టి బయల్దేరనా?”

“సరే, రేపు వస్తాలే. నువ్వు సిద్ధం అయేక ఫోను చేయ్యి,” అన్నాడు సుందరం లేస్తూ.

లీల సరేనన్నట్టు తలూపి, అతను వెళ్ళేక తలుపు వేసుకుని, ఆలోచిస్తూ తనగదిలోకి వెళ్ళిపోయింది. మంచంమీద పడుకునేసరికి ఎక్కళ్లేని నీరసం వచ్చింది. ఎలా చూసినా తను వెనక్కి వెళ్ళకతప్పేట్టు లేదు ఆయనగారిమాటలు నమ్మి కాదు … పాముకి నాలుకలు రెండయితే, సుందరానికి పన్నెండు. కానీ ప్రస్తుతపరిస్థితుల్లో మరో దారి ఏదీ? ఇండియాలోనే ఉండి ఉంటే కథ వేరేగా ఉండేదేమో. ఆయనెవరో అన్నట్టు, పెళ్ళికి వచ్చినవాళ్ళందరూ సాక్షులు. దంపతులమధ్య ఏ తగువులొచ్చినా ఇంట్లోవాళ్లో పైవాళ్ళో ఎవరో ఒకరు కలగజేసుకుని ఇద్దరికీ బుద్ధి చెప్పి సంసారం కుదుటపడేలా చేస్తారు. అలాగని ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవడానికీ లేదు. ప్చ్. అక్కడ ఎలా ఉంటుందో? ఎవరైనా ఆదుకోవచ్చు. మ్. అంటే అది కూడా మరొకరిమీద ఆధారపడడమే కదా. అక్కడ మరోరకం పొరపొచ్చాలు రావని హామీ ఏముంది? పైగా అక్కడ బాగులేదని ఇక్కడా, ఇక్కడ బాగులేదని అక్కడా – అలా తిరగడం సాధ్యమా ఇంత దూరంలో ఉన్నప్పుడు. ఇదేమైనా విశాఖపట్నం, గాజువాకానా?

సుందరం మారకపోవచ్చు. అతనిప్రవర్తన తనకి బాధ కలిగిస్తోందని అతనికి తెలియజేయడమే తన ఉద్దేశ్యం. అది కొంతవరకూ జరిగినట్టే ఉంది. తనకి తానై వచ్చేడు, తనని యింటికి రమ్మంటున్నాడు. అవునా? … హుమ్. లీల నిట్టూర్చింది. గట్టిగా ఆమాట అనుకోలేకపోతోంది. తనకే నమ్మకం కలగడం లేదు. సుందరం మారడు. ఆవిడెవరో అమెరికన్ రచయిత్రి చెప్పినమాట గుర్తొచ్చింది. If you cannot change the way things are, change the way you think (‌Maya Angelou). అంతే, తను ఆలోచించేవిధానం మార్చుకోవాలి. అంటే తన అభిప్రాయాలు, నమ్మకాలు, ఇష్టాయిష్టాలు మార్చుకోవాలి. దాని ఫలితాలు ఎలా ఉంటోయో …

ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే కళ్ళు మూతలు పడిపోయేయి నిద్ర బరువుకి.

000

ఉదయం లేస్తూనే, లీల ముందు రోజు తనకీ, సుందరానికీ మధ్య జరిగిన సంభాషణ పెద్దక్కయ్యకి చెప్పి, “మీరేఁవంటారు?” అనడిగింది.

ఆవిడ సుదీర్ఘంగా నిట్టూర్చి అంది, “ఆమధ్య మనదేశంలో స్త్రీవాదంగురించి అడిగేవు. ఇప్పుడు చెప్తాను. ముందొకసారి చెప్పేను కదా మనవాళ్ళు స్త్రీవాదం అన్న పదం చాలా తేలిగ్గా, అర్థరహితంగా వాడుతున్నారని. ఒకసారి నువ్వే అన్నావు ఓ ఆడమనిషి ఓ మగాడిని కాస్త మంచినీళ్లు తెచ్చి పెట్టు అన్నా స్త్రీవాదమే అని దెప్పుతున్నారు అని. అంటే ఆడవాళ్ళమాటలో ఏమాత్రం ప్రతిఘటనలా కనిపించినా స్త్రీవాదం అని పేరు పెట్టేస్తున్నారు. ప్రతిఘటన లేకపోయినా వాళ్ళకి నచ్చని ఏపనీ ఏమాటా అయినా స్త్రీవాదమే.

అమెరికాలో స్త్రీవాదం స్త్రీల అస్తిత్వానికి చిహ్నంగా, బయటిప్రపంచంలో స్త్రీల రాజకీయ, ఆర్థికసమస్యలరూపంగా అవతరించింది. మనకి ఆ స్త్రీవాదం సరిపడదు. ఎందుకంటే మనకీ, ఈదేశంవారికీ సామాజికవిలువల్లోనూ, భౌగోళికంగానూ కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మన కుటుంబపరిస్థితులు వేరు. మన కుటుంబజీవనం చాలా సంక్లిష్టమైంది. మనసమాజంలో సంఘబలానికి ప్రత్యేకస్థానం ఉంది. మనఇళ్లల్లో మందే ఆస్తి. వ్యవసాయం ప్రధాన వృత్తి కావడం ఒక కారణం కావచ్చు దానికి మంది కావాలి కనక.

మనకి జనమే బలం. మనం పదిమందిం ఒక పంచన బతుకుతాం. అందుచేత కోపాలూ, తాపాలూ కూడా ఎదుట ఎవరుంటే వారితో చెప్పేసుకుని మనసులు తేలిక పరిచేసుకోడానికి అవకాశం ఉంది. అది మనకి రెడీమేడ్ థెరపి.  అదీ మనజీవనసరళి. అంటే మనయిళ్ళల్లో గతిశీలత (డైనమిక్స్) వేరు. మన సంబందాలూ, బాంధుత్వాలకి సంబంధించిన పదాలు చూడూ. అత్తయ్య, మామయ్య, అక్కయ్య, బావమరిది, మేనగోడలు, వదిన, బావ … ఇలా ఇవన్నీ కేవలం పదాలే కాదు. వాటిద్వారా ఆ యిద్దరు వ్యక్తులమధ్యా గల పరస్పరసాన్నిహిత్యం, గౌరవమర్యాదలూ, ఆదరాభిమానాలు కూడా వ్యక్తం చేస్తాం. వాటిలో  ప్రత్యేకమైన గతిశీలత ఉంది. అది చాపచుట్టగా కజిన్ అనో ఆంటీ, అంకుల్ అనో ఉద్దిష్టం కాదు. మన బంధుత్వాలలో భాగంగానే ప్రతివాళ్ళు ప్రతివాళ్లబతుకుల్లోనూ జోక్యం కలగజేసుకోడం సహజంగా వచ్చింది.

నువ్విందాకా అన్నావు ఇండియాలో అయితే ఎవరో ఒకరు కలగజేసుకుని నీసంసారం చక్కదిద్దేవారేమోనని. నాకలా అనిపించడంలేదు. అక్కడా అంతా బాగా మారిపోయేరు. ఎందుకంటే, ఎదటివారు కలగజేసుకోడం కొంతవరకూ ఇంకా ఉన్నా, మరొకపక్క ఆధునికత వచ్చి, నాజోలి నీకెందుకూ అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళకి సౌఖ్యంగా ఉన్నంతసేపు బాగుంటుంది. చిరాకేస్తే, నా వ్యక్తిగతవిషయం, నీకెందుకూ అంటారు. తమాషా ఏమిటంటే వేరింటికాపురాలు పెట్టినవాళ్ళే మళ్ళీ అవుసరం అయినప్పుడు, అమ్మా, నాన్నా అంటూ ఆ పంచకే చేర్తారు. స్థూలంగా మనవాళ్ళు పక్షికీ మృగానికీ చెందని జాతిగా తయారయేరు ఇప్పుడు.

ఈ స్త్రీవాదంలో వాదాలమాట వదిలేస్తే, వాస్తవంగా చూస్తే, మనదేశంలో స్త్రీలస్థాయి చాలావరకు మెరుగే. ఆమధ్య ఎక్కడో దొరికితే, అచ్చమాంబగారి అబలాసచ్చరిత్రరత్నమాల చదివేను. ఆవిడ చమత్కారం చూడు. పుస్తకం పేరులోనే అబల కానీ ఆవిడ చిత్రించిన స్త్రీలందరూ అవసరమైనప్పుడు అచంచలమైన ఆత్మవిశ్వాసం, అమేయమయిన ధైర్యసాహసాలూ ప్రదర్శించినవారే. అద్భుతంగా ఉన్నాయి ఆ కథలూ, ఆవిడ ప్రవచించిన తీరూ కూడా. ఆకథల్లో నాకు ద్యోతకమయింది – మన స్త్రీలు మగవారిమీద ధ్వజమెత్తలేదు. నిశ్శబ్దంగా తమ పని సాధించుకున్నారు. ఆవిడ తీసుకున్న కథలు చాలావరకూ పద్ధెనిమిదీ, పందొమ్మిదీ శతాబ్దాలకి సంబంధించిన స్త్రీలవే. అంచేత ఆకాలంలో స్త్రీవిద్య, సహగమనం, వితంతువుల కేశఖండనం వంటి అనేక సాంఘికసమస్యలమీద వ్యాఖ్యానించేరు. అంచేత అవి ఆత్మకథలుగా మాత్రమే కాక, అచ్చమాంబగారి అభ్యుదయభావాలు కూడా తెలుస్తున్నాయి.”

లీల ఆవాక్కై, పెద్దక్కయ్యవేపు చూస్తూ కూర్చుండిపోయింది.

ఆవిడ కూడా ఉలికిపడి, “హా, ఈ గుడుగుడుకుంచం వదిలి, మొదటికొస్తాను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ప్రారబ్ధార్థములుజ్జగింపరు గదా ప్రజ్ఞానిధుల్. నీపరిస్థితేమిటో, నీసామర్థ్యమేమిటో, నీకు ఏది సుఖతరమో నీకొక్కదానికే తెలుస్తుంది. నీకు తెలిసినట్టు మరెవరికీ తెలీదు. నువ్వు మళ్ళీ ఆయింటికి వెళ్ళడమా, మానడమా అన్నది నువ్వు మాత్రమే చెప్పగలవు. చెయ్యగలవు. మరొకరితో ప్రమేయం లేదు. ఇండియాలో ఉంటే అమ్మానాన్నో, అన్నో తమ్ముడో ఆదుకునేవారన్న భ్రమ వదిలెయ్. నువ్వక్కడ లేవిప్పుడు. ఒకవేళ ఎవరైనా ఆదుకున్నా, నీకే అంగీకారం కాకపోవచ్చు. సుందరం కూడా అంగీకరించడు. ఎంచేతంటే అలాటి రోజులు ఇప్పుడు లేవు. ఆనాటి ఆలోచనాధోరణి వేరు, ఈనాటి ధోరణి వేరు. మొత్తం సమాజంలో, ఆలోచనలతీరులో, మనదృష్టిలో  ఇంత ఉధృతంగా మార్పు వచ్చింతరవాత, అప్పుడున్నట్టు ఇప్పుడు లేదే అనుకుని బాధ పడి ఏం లాభం? నువ్విప్పుడున్నది అమెరికాలో. సుందరం కూడా తెలుగువాడే అయినా, అతనిలో ఇంకా ఆ పాతవాసనలు పోలేదేమో. అప్పుడప్పుడవి పైకి తన్నుకొచ్చినా, అతను కూడా అమెరికావాసానికే ఎక్కువ అలవాటు పడుతున్నాడు.“

“అలాగని అమెరికనులు భార్యలని ఆదిరంచే విధానమూ అలవాటవలేదతనకి,” అంది లీల.

“అదే మరి. సంధిసమయం. మనకి యుగసంధి మాత్రమే కాక విలువలు, భావాలూ కూడా సందిగ్ధం అయిపోయేయి, దేశాంతరం కూడా కనక. అందుకే వివాహం అంటే మనదృష్టిలో ఉన్న అభిప్రాయాలు కూడా మారిపోయేయి కదా. పూర్వం అది తిరుగులేని శాశ్వతబంధం. అందులో వెనక్కి తిరగడం లేదు. ఇప్పుడు సంసారం సవ్యంగా లేకపోత విడిపోడానికి అవకాశం ఉంది అన్న స్పృహతో ప్రారంభిస్తున్నారు వైవాహికజీవితం.”

లీల ఉలికిపడింది, “అదేమిటండీ, అలా అంటారు? విడిపోవచ్చులే అనుకుంటూ చేసుకుంటారా పెళ్ళి ఎవరైనా?”

“అహఁ, కాదు, నేనలా అనడంలేదు. కానీ ఓరవేసిన వాకిలిలా అలా చిన్న సందు ఉందన్న స్పృహ అంతరాంతరాల, అచేతనావస్థలో చాపకింద నీరులా పని చేస్తుంది అంటున్నాను. కనీసం అలాటి స్పృహ అనుకోకుండానే ఏర్పడే అవకాశం ఉందేమోనని నాకు సందేహం కలుగుతోంది. సమాజంలో మనచుట్టూ కనిపిస్తున్న జరుగుతున్న నాటకంమూలంగా. అదీ అసలైన విషాదం అమెరికాలో తెలుగుపడుచుల జీవితాల్లో. ఇది కూడా మారొచ్చు కొంతకాలానికి. కానీ ప్రస్తుతం నువ్వు చెయ్యగలిగింది – నీకు నువ్వే ఆలోచించుకుని, నీకు ఏది సాద్యం అనిపిస్తే అదే చెయ్యడం,” అంటూ ఆగింది పెద్దక్కయ్య.

లీల తలొంచుకుని ఆవిడమాటలు నెమరు వేసుకుంటూ, అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది.

“ఈ తలుపులు నీకోసం సదా తెరిచే ఉంటాయని నేనిప్పుడు చెప్తే, ఇందాకా చెప్పిన ఓరవాకిలి కధే అన్నట్టుంటుందేమో,” అంటూ పెద్దక్కయ్య కాఫీకప్పులు రెండూ తీసుకుని సింకువేపు నడిచింది.

లీల నవ్వేసి, “ మీతలుపులు తెరిచే ఉంటాయన్నసంగతి నేను మర్చిపోతానులెండి,” అంది.

ఆ తరవాత ఆవిడవేపే చూస్తూ ఆలోచించుకోసాగింది. ఈవిడ తనకేమవుతుందని ఇలా తనని ఆదుకోడానికి? నిజానికి ఆవిడకి తనఅవసరం తీరిపోయి చాలాకాలమే అయింది. తనకీ ఆవిడకీ అలవాట్లలో చాలా వ్యత్యాసం ఉంది. ఎన్నో తేడాలున్నాయి. అయినా ఆవిడెప్పుడూ ఎలాటి అసంతృప్తి ఛాయామాత్రంగానైనా వెలిబుచ్చలేదు. సుందరం అన్నమాట గుర్తొచ్చింది. ఇక్కడ మాత్రం ఇంటిపని చెయ్యడం లేదా అన్నాడు. హుం. …

లీల ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే, ఆ మధ్యాహ్నంపూట సుందరం ఫోన్ చేసేడు, “రానా? సిద్దంగా ఉన్నావా?“ అంటూ.

“ఆఁ“ అంది లీల నిర్లిప్తంగా.

జీవితంలో రెండోసారి కళ్ళు మూసుకుని గోతిలో దూకుతున్న అనుభూతి కలిగిందామెకి.

000

పాఠకులకి – మీ వ్యాఖ్య నమోదు కాకపోతే నాకు ఇమెయిలివ్వండి. malathini@gmail.com.

 

 

(మార్చి 23, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మార్పు 33”

 1. @ లలిత4కిడ్స్, మాయా ఏంజెలో చెప్పినవాక్యానికి మీరు చెప్పిన అర్థమే కరెక్టు. మనకుటుంబంలో సంబంధాలవిషయంలో కూడా మీరు చెప్పింది నిజమే. అందుకే క్లిష్టమైనది అన్నది. ఇలాటివిషయాలు వివరించడం గానీ, ఆచరణలో పెట్టడానికి సూత్రాలు చెప్పడం కానీ చాలా కష్టం. మీ వివరణకి ధన్యవాదాలు. నా నవలలో మీమాటలుగానే (బహుశా మరోపాత్ర చెప్పినట్టు) పెట్టేసుకుంటాను. అప్పుడు మళ్ళీ అనుమతి అడుగుతానులెండి.
  ఐడి సమస్య పరిష్కరించుకున్నందుకు కూడా సంతోషం. ఇది మామూలుగా పని చేసింది.

  మెచ్చుకోండి

 2. జీవితంలో రెండోసారి కళ్ళు మూసుకుని గోతిలో దూకుతున్న అనుభూతి కలిగిందామెకి. 🙂 😦
  If you cannot change the way things are, change the way you think (‌Maya Angelou). అంతే, తను ఆలోచించేవిధానం మార్చుకోవాలి. అంటే తన అభిప్రాయాలు, నమ్మకాలు, ఇష్టాయిష్టాలు మార్చుకోవాలి.
  హ్మ్మ్మ్… మాయా ఏంజెలో చెప్పిన మాటలకి అర్థం నాకు వేరేలా తోస్తోంది. తన అభిప్రాయాలు, నమ్మకాలు, ఇష్టాయిష్టాలు మార్చుకోవాలని కాదేమో. తనకి నచ్చని వాటిని ఎదుర్కునే తీరు మార్చుకోవడం, తను అతనికి సమాధానం ఇచ్చే తీరు మార్చుకోవడం కానీ, అతనిని సమాధానపరచాలి అనుకోవడమే మానెయ్యడం కానీ, తనకి ఉన్న పరిస్థితులలో ఏం చెయ్యడానికి వీలౌతుందో, తను ఏం చేస్తే తనకి సంతోషంగా ఉంటుందో తెలుసుకుని అది చెయ్యడం కానీ, అతని ద్వారా, లేదా తమ బంధంలో సంతోషాన్ని వెతుక్కోవడం అనే వృథా ప్రయాసను మానెయ్యడం కానీ ఇలా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి అని నాకనిపిస్తోంది.
  ఇండియాలో బంధువులో స్నేహితులో వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తారు అనేది కూడా (ఒకప్పటి రోజుల్లో కూడా) పూర్తిగా నిజం కాదేమో. కొన్ని కుటుంబాలలో అలా ఒకరికొకరు అండ దండగా ఉంటూ వస్తుంటారు. కానీ ఎక్కువ శాతం ఒకరికొకరు సాయం చెయ్యడం వల్లకంటే కూడా, మనకి ఎక్కువ మంది మనుషులతో క్రియాత్మక సంబంధాలు ఉండి మనకి కావలిసిన “అనుబంధం” అనేది కొద్ది కొద్దిగా అందరిలో కలిపి ఎక్కువ శాతం దొరికే అవకాశం ఉంది అనిపిస్తుంది నాకు. భార్యా భార్థా “నీవో సగం, నేనో సగం” అని పాడుకుంటూ గడిపే జీవితాలు ఆదర్శం అనుకునే దాన్ని ఒకప్పుడు. కానీ అలా ఒకరికి ఒకరు మాత్రమే అనుకోవడంలో కూడా సమస్య ఉంది అని అనిపిస్తోంది. ఎవరికి వారు పరిపూర్ణంగా ఉంటూనే ఒకరికి ఒకరు కావాలి.ఎన్నో అనుబంధాలు, ఒక్కో దానిదీ ఒక్కో ప్రత్యేకత. అన్నీ అనుభవించగలిగే వారు అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు. అవి “లేవు” అనుకోకుండా ఉన్నంతలోనే మొదలు పెట్టి మెల్లగా పెంచుకుంటూ, సమాజంలో అల్లుకుంటూ పోగలిగితే జీవితంలో తృప్తిని తెలుసుకోగలుగుతామని అనిపిస్తోంది నాకు.
  “మార్పు” బాగా నడుస్తోంది. చాలా ఆలోచింపచేస్తున్నారు. నిదానంగా కథను నడపడం బావుంది.
  (మాలతి గారూ, మీరు వర్డ్‌ప్రెస్ సమస్య గురించి శోధించి చెప్పింది చూశాను. నిన్న సౌమ్య చెప్పిన కిటుకు ఉపయోగిస్తున్నాను. వేరే e-mail అడ్రస్ ఇస్తున్నాను.)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.