వైదేహికవిత నాబొమ్మకి!

మాయింటివెనక ఏరు నిరంతరప్రవాహంగా రోజుకో రూపంలో దర్శనమిస్తూ నన్ను అలరిస్తూ ఉంటుంది. వారంరోజులక్రితం నేను తీసిన ఈ బొమ్మ  వైదేహికి పంపితే, తను బోలెడు ఉత్సాహంతో క్షణాలమీద రచించిన కవిత ఇది.

ఆమె “నిద్రితనగరం” కవితాసంకలనానికి ఇస్మాయిల్ బహుమతి వచ్చినసంగతి అందరికీ తెలుసు.  విశేషంగా పాఠకులఆదరాభిమానాలు సంతరించుకున్న వైదేహి నాబొమ్మకి స్పందించి కవిత రాయడం నాకు పరమానందంగా ఉంది. వైదేహీ, ధన్యవాదాలు.

—————

కొలను గట్టున

– డా. వైదేహి శశిధర్.

చూపుల గాలాల్ని నిలకడగా నీటిలోకి దింపి
చెట్టు మానుకి  అరమోడ్పు కళ్ళతో జేరగిలబడి
రోజంతా  కొలను ఒడ్డునే కూర్చున్నా


కొలనిగట్టున
పూరేకుల పెదవుల్ని గుండ్రంగా చుట్టి
బుంగ మూతితో గారాలు పోతూ
ఒడ్డుని ఆనుకుని సగం విచ్చిన డాఫడిల్స్

సుతారంగా వెన్నువంచి అన్ని భంగిమలలో
తమ నాట్యాన్ని ప్రదర్శిస్తూ
మురిపెంగా మిడిసిపడే రెల్లుపొదలు

వసంతం వచ్చీ రాగానే ఎండిన కొమ్మల చివర్ల
పచ్చల పతకాలు వ్రేలాడదీస్తూ
పచ్చివాసనలతో పచ్చటి చిగుర్లు

ఉండుండీ నా జుట్టుని చిందర వందర జేస్తూ
కూనిరాగాలు పాడే అల్లరి గాలీ
ఇవన్నీ నా నేస్తాలే.

నాలాగే కొలనులో హృదయాన్ని పారేసుకున్న నీలాకాశం
నీటి అద్దం లోకి వంగి మెళ్ళో పతకాలని సరిజేసుకునే చెట్టుకొమ్మలు
కొలను మధ్యలో  తాపడం చేసిన రాగి రేకులా తాపీగా పవళించిన ఒండ్రుమట్టి
నా చూపుల గాలానికి చిత్రంగా చిక్కుకుపోతాయి.

రోజంతా గడచినా
సంధించే చూపులకి
విరబూసే  కలలకు అలసటేది?

– వైదేహి శశిధర్
– 3/27/12

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “వైదేహికవిత నాబొమ్మకి!”

 1. vaidehi garu,
  ఇంకా NRI కవయిత్రుల గురి౦చి కూడా వుంది ఆ ఆర్టికల్ లో. మీరు కావాలంటే వీలు చూసుకుని స్కాన్ చేసి పెడతాను .మాలతి గారి ఐ డి కి పంపనా?
  లక్ష్మీ రాఘవ
  మీ కవితలు కూడా చదవాలని వుంది

  మెచ్చుకోండి

 2. లక్ష్మీ రాఘవ గారూ ,
  మిసిమి గురించి విన్నాను .కొన్నిసంచికలు నెట్ మీద చూసాను .
  మీరు చెప్పిన సంచిక చూడలేదు.
  ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ
  ఈరోజు పాత పుస్తకాలు తిరగేస్తుంటే “మిసిమి” అన్న సంచికలో {2009- june}
  NRI కవయిత్రులు అని వైదేహి శశిధర్ గురించి ఇలా రాసారు
  ” తెలుగుదనం మీద బెంగా తగ్గని ఎన్.ఆర్.ఐ. కవయిత్రి వైదేహి శశిధర్ “నిద్రిత నగరం ” లో విశాఖ పట్నం కళ్ళముందు తచ్చాడు తుంది . ఆమె “జ్ఞాపకాల భోగిమంటలు ” లో మనం కూడా మనస్సుల్ని వేచ్చచేసుకోవచ్చు”

  వైదేహి గారు నాకు తెలిసింది పై కవిత ద్వారానే …ఇదీ మీకు చెప్పాలనిపించింది .బహుశా మీరు మిసిమి ‘ చదివి వుండవచ్చు . ఇదీ నాత్రుప్తి కోసమే ..
  లక్ష్మీ రాఘవ

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ ,
  నా కవిత బ్లాగ్ లో పెట్టిన మీకు, అభినందనలు తెలిపిన సాహితీ మిత్రులందరికీ అనేక ధన్యవాదాలు .
  వైదేహి శశిధర్

  మెచ్చుకోండి

 5. nice.
  మా పాత ఆఫీసు వెనకాల ఒక చిట్టడివీ, ఆ అడివిలో పారే సెలయేరు, అప్పూడప్పుడూ గడ్డి తినడానికి వచ్చే లేళ్ళు .. అన్నీ గుర్తొచ్చాయి.

  మెచ్చుకోండి

 6. మేము కూడా పా రేసుకున్నాము మా హృదయాల్ని
  మీ ఏరు లో స్పందించిన వైదేహి కవిత చూసి,
  ఈసారి మీరు తీసే దృశ్యంలో కనబడతా ము
  రెల్లుపోదల మద్యలో… అలసటే లేని కలలప్రపంచంలో….
  లక్ష్మీ రాఘవ ….

  మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s