మార్పు 37

విషి ఉప్మా తిని కాఫీ తాగి తనగదిలోకి వెళ్ళిపోయి మధ్యాన్నం మూడుగంటలవరకూ కిందకి రాలేదు. రాత్రంతా పాపం జైల్లో నిద్ర ఉండి ఉండదు, పడుకోనియ్యిలెమ్మని ఊరుకున్నారు ఇంట్లోవాళ్ళు.

000

విషి కిందకి వచ్చేసరికి, ప్రభాస్రావూ, రామలక్ష్మీ భోజనాలయిపోయేయి. పాపం, వాడు తినలేదే అనుకుంటూ శివాని కంచందగ్గర కూచుంటుండగా, వచ్చేడు.

“రా. ఇప్పుడే అనుకుంటున్నా లేపనా అని,” అంది శివాని లేచి అతనికి మరోకంచం బల్లమీద పెడుతూ.

విషి మాటాడకుండా కంచంముందు కూర్చున్నాడు. ఏక్షణంలోనైనా పిడుగులు పడొచ్చు. ఆ పిడుగులు తట్టుకోడం కన్నా ఆ క్షణంకోసం వేచి ఉండడం ఎక్కువ కష్టంగా ఉంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా అరిచో, శోకాలు పెట్టో ముగించేస్తే బాగుండు.

“పిల్లలు దారి తప్పకుండా, సన్మార్గంలో ఉండేలా పెంచడం కత్తితో సాములాటిది. నిప్పుతో చెలగాటం. మనం ఎంత జాగర్తగా ఉన్నా ఎక్కడో అక్కడ తప్పటడుగు వేస్తాం. దానిఫలితం పిల్లలమీద కనిపిస్తుంది,” అంది రామలక్ష్మి.

మామూలుగా “నీకెందుకు?” అంటూ కేకలేసే ప్రభాస్రావు మౌనంగా పేపరులో తల పెట్టుకు కూర్చున్నాడు.

గంటక్రితం వచ్చిన ఫోనుకాలు ఆయన్ని నిరస్త్రుడ్ని చేసింది. ఊళ్ళో కాస్త పరిచయమూ, మరింత దూరపు చుట్టరికమూ గల రామనాథం పిలిచి, “ఏంటి, మన విశ్వేశ్వరశర్మ జైల్లో పడ్డాట్ట. పొద్దున్నే ఈవార్త వినగానే నాప్రాణం గిలగిల్లాడిపోయింది. ఎంత చెడ్డా మనం మనం ఒకటి కదా. ఇవాళ మీవాడయింది, రేపు మావాడవుతుంది. మావాణ్ణి కూడా పిలిచి గట్టిగా చీవాట్లేసేను, ఇలాటి వెధవ్వేషాలు వేసేవంటే డొక్క చీరేస్తానని. నాదగ్గర ఇలాటి ఆటలు సాగవులే. ఇంతకీ, ఏం చేసేడేమిటి? అసలేమయింది? పోన్లే, ఇప్పుడదంతా ఎందుగ్గానీ … ఇలాటివి ఎవరు మాత్రం దండోరా వేసుకుంటారేమిటి? అయివా మనవాళ్ళున్నారు గద నసంతిగాళ్ళు ఊరంతా చాటడానికి. హాహ. నాకలాగే తెలిసింది, ఇంతకీ నీకేమయినా సాయం కావలిస్తే చెప్పు అని చెప్పడానికి పిలుస్తున్నాను.”

మరో అంజనీపుత్రుడు, “ఏమయ్యా, ప్రభాసు, మనవాడేమిటి వార్తల్లోకెక్కేడు. ఏమైందేమిటి. ఏం లేదూ, హమ్మయ్య, నేనూ అదే అనుకున్నాలే, పిల్లలు ఏదో కోతివేషాలేస్తారు, దానికింత రాద్ధామేమిటి అనీ … ఇంతకీ నేను పిలిచిన కారణం, ఊళ్ళో పెద్దతలకాయల్లో తెలిసినవాళ్లు ఇద్దరుముగ్గురు మనజేబులో ఉన్నారులే. వాళ్ళచెవిని ఓ మాటేస్తే, సర్వం కొత్తగా చెక్కిన పలకలా నీటుగా చక్కబడిపోతుంది, పాలలో కడిగిన ముత్యమే అనుకో. … కొమ్ముల్తిరిగిన, అరివీరభయంకరులవంటి లాయర్లు కూడా ఉన్నారు అంతగా అవసరమైతే. నువ్వు ఊఁ అంటే చాలు, వాళ్ళకి ఫోన్చేస్తాను ….”

అలా స్నేహితులూ, పరిచయస్తులూ, ఏ పార్టీలోనో యాదాలాపంగా కలిసినవాళ్ళతో సహా – ఒకొకళ్ళే పిలిచి, ఎడతెరిపి లేకుండా వరదల్లా భరోసాలమీద భరోసాలిచ్చేస్తుంటే ప్రభాస్రావుకి కోపం ఓ పక్కా నిస్సహాయత మరో పక్కా తల తినేస్తుంటే, వినగలిగినంతసేపు విని, ఆ ఊ లాటి ఉపశబ్దాలతోనూ, “అబ్బే, ఒద్దొద్దు,” “అంత ప్రమాదమేమీ లేదు”, “వాడికేమీ మరణశిక్షో, ఆజన్మకారాగారవాసమో పడబోవడం లేదు,” అంటూ అరకొర వాక్యాలతోనూ జవాబులిచ్చుకుని, ఆఖరికి, “బయటికెళ్తన్నా, తరవాత పిలుస్తాలే,” అని ఫోను పెట్టేసేడు. జవాబు చెప్పి ఫోను పెట్టేస్తున్న ముప్ఫై క్షణాల్లోనూ ఆవతలాయన మరోసారి, “ఏమాత్రం అవసరమైనా తప్పకుండా పిలు, ఆలోచించకు, మొహమాటపడకు,” అని మూడుసార్లు చెప్పేడు. ప్రభాస్రావు మరోమారు సరే, అలాగే అన్చెప్పక తప్పలేదు.

ఇలాటివే మరోరెండు కాలులొచ్చేక, ఆయనగారి నిస్సత్తువ పరాకాష్టనందుకుంది. వీళ్ళందరికీ తనమీద నిజంగా అంత ఆపేక్ష ఉందా, గొడ్డు గోతిలో పడిందని మురిసిపోతూ అన్యాపదేశంగా తనని హేళన చేయడమా అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నారు. అలా ఆయనకి సందేహం రాకపోడానికి కారణం లేకపోలేదు. ఈ పరిస్థితే అట్నుంచి ఇటయితే, నిజానికి అయినప్పుడూను తను చేసిందీ ఇంతే. అవతలివాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలియగానే పరమోత్సాహంతో పలకరించడం. తీరా అవసరమై, ఆదుకుంటారా అని అడిగితే, “అయ్యో నువ్వు అడక్కడక్క అడిగేవు, ఏం చెయ్యను, సమయానికి …” అంటూ ఏదో – ఒకటీ రెండూ కాదు – పది అవాంతరాలు చెప్తారు. ఇప్పుడు వాళ్ళమీద అరవడమా, తనని ఈపరిస్థితిలో ఇరికించిన కొడుకుమీద అరవడమా – అన్న సందిగ్ధావస్థలో ఉన్నారు.

తమ్ముడిమొహం చూస్తూ ఎదటిసోఫాలో కూర్చున్న రామలక్ష్మికి ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి. తమ్ముడిమొహం చూస్తూ, పాపం, వాడికెంత కష్టం ఒచ్చింది అని నొచ్చుకుంది. “నువ్వూరికే బాధ పడకు. ఇంటికొచ్చేడు కదా. ఆ పోలీసువాళ్ళకి తృణమో, పణమో ముట్టచెప్పి కేసు మాపు చేయించీ. ఆయనెవరో చెయ్యగలనని చెప్పేరు కదా ఇందాక ఫోనులో. ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు, ఈనాటికీ అవస్థ రావాలీ నీకు. అరవైలు దాటేయి, ఇంతకాలం ఒకరిచేత మాట పడకుండా బతికేవు. మనదసలు మచ్చలేని కుటుంబం. వెతికితే స్ఫటికరాయిలోనైనా మచ్చ కనిపిస్తుందేమో కానీ మనవంశంలో ఇంటా వంటా లేదు, ఇలాటి విడ్డూరం. …”

“అబ్భబ్భ, నువ్వూరుకో,” కసిరేడు ప్రభాస్రావు.

“మహ బావుంది. నన్ను కసుర్తావేమిటి, కొడుకుని అదుపులో పెట్టుకోలేక,” అంటూ రామలక్ష్మి చటుక్కున లేచి, వంటింట్లోకి వెళ్ళింది.

అప్పటికే విషి గబగబ నాలుగు మెతుకులు కతికి మళ్ళీ తనగదిలోకి వెళ్ళిపోయేడు. శివాని టిఫినుకి పకోడీలు తలపెట్టి ఉల్లిపాయలు తరుగుతోంది. నిజానికి అదేమంత అవసరకార్యం కాదు కానీ వదినగారిని ఎదుర్కొనే తలుపు లేదావిడకి. ఆదేమీ గ్రహించలేదు రామలక్ష్మి.

“ఏంటి తరుగుతున్నావు, ఉల్లిపాయలా? పకోడీలకా, రాత్రి సాంబారుకా?” అని ప్రశ్నించి, సమాధానానికి ఎదురు చూడకుండానే, తమ్ముడిముందు సాగని కథ అందుకుంది, “వాడిమొహం చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతోంది. వాడికి మహ పౌరుషం అడుగులేయడం వచ్చేనాటికే. ఒక్కమాట పడి ఎరగడు ఏరోజూ.“

“అవును, చూసేను కదా కాలేజీలో,” అంది శివాని. వదినగారి హరికథ ఏలాగైనా ఆపడానికి అవుతుందేమోనని ఆవిడఆశ.

రామలక్ష్మి ఏడాకులెక్కువ చదివింది. ఆవిడ జీవితంలో ఎవరినీ అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ సాగనిస్తుందేమిటి? “అది కాదు నేంచెప్పేది విను. విషి నీకెంతో నాకూ అంతే. తమ్ముడికొడుకయితే ఒకటీ, నాకొడుకయితే ఒకటీనా? అలా నేనెప్పుడూ అనుకోలేదు. అసలది మావంశంలోనే లేదు,” అంటూ ఆగింది రామలక్ష్మి.

మావంశం అంటూ మరదల్ని వేరుపెట్టడం శివాని గమనించింది కానీ జవాబు చెప్పలేదు.

“నీకు తెలీదు గానీ, మాచిన్నప్పుడు ఎలాటి క్రమశిక్షణ ఉండేదో తెలుసా. చీకటితోనే లేచి, స్నానాలు చేసి, ఉతికారేసిన బట్టలేసుకుని, చద్దన్నాలు తిని స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం ఇంటికి వచ్చేదూరం అయితే నడిచి రావడం, అన్నం తినేసి మళ్ళీ స్కూలికెళ్ళడం. సాయంత్రం ఇంటికొచ్చేక టిఫిను తిని, బయట ఆ చుట్టుపక్కల పిల్లలతోనే ఓ గంటసేపు ఆడుకుని రావడం, రాత్రి భోజనాలయేక హోంవర్కు చేసుకుని పడుకోడం. ఇప్పట్లా ఈతిరుగుళ్ళన్నీ లేవు మాకు ఆరోజుల్లో. స్నేహాలు కూడా ఇరుగూపొరుగుతోనే. లేకపోతే చుట్టపక్కాలు, అంతే. ఓసారేమయిందనుకున్నావూ. వాడికింకా ఆరోయేడేమో, నాకు పదహేను, పదహారుంటాయి – మానాన్నగారి స్నేహితుడొకాయన వాళ్ళబ్బాయి సరిగ్గా చదువుకోడంలేదని మాయింట్లో పెట్టేడు. కాకినాడలో ఉండేవారు. మానాన్నగారు సరే, చదువు చెప్పిస్తానని చెప్పి ఇంట్లో పెట్టుకున్నారు. ఏదో ఆకతాయితనం, పదేళ్ళంటే చిన్నపిల్లాడే కదా. ఓరోజు మానాన్నగారు నాకు ఐదు రూపాయలిచ్చేరు నాపుట్టింరోజని. ఏంటో, ఆరోజుల్లో ఏం చేస్తాం డబ్బుతో. నేనలాగే తీసుకుని నా పెట్టెలో పెట్టుకున్నాను తరవాతెప్పుడో ఏదైనా కొనాలనిపిస్తే కొనుక్కోవచ్చులే అని. ఆ అబ్బాయి ఎప్పుడు చూసేడో ఆ నోటు కాస్తా కొట్టేసి, బజారులో సైకిలు అద్దెకి తీసుకుని తొక్కుతుంటే ఎవరో చూసి మానాన్నగారికి చెప్పేర్ట. వాడు ఆ సాయంత్రం ఇంటికొచ్చేక, ముందు వాడిచెంప ఛెళ్ళుమనిపించి, తరవాత అడిగేరు, “నీకు డబ్బెక్కడిదీ?” అని. వాడు కుయ్యోమని అరిచి, బెక్కుతూ నాపెట్టెలోంచి తీసేనని ఒప్పుకున్నాడు. నాన్నగారయితే మళ్ళీ కొట్టలేదు కానీ ఆ ఒక్కదెబ్బతో వాడికీ, అది చూస్తూ నిలుచున్న మాతమ్ముడికీ కూడా బుద్ధులొచ్చేసేయి.”

తమ్ముడు జీవితంలో ఏనాడూ ఒక్క మాట పడిఎరగడని తనదగ్గరేమిటి కోతలు! తల్లి పుట్టింటిగొప్పలు మేనమామదగ్గరా అని. శివానికి నవ్వొచ్చింది కానీ వదినగారు గానీ చూసిందంటే బాగుండదు. ఘ్, ఘ్ అంటూ ఓమారు దగ్గి, గ్లాసందుకుని కొళాయివేపు తిరిగింది.

“కాలేజీలో నీవెంట బళ్లేదా అంటావేమో, అది నీమీద ప్రేమతోనే కానీ పోకిరీవేషాలు కావు కదా. నిన్ను చూస్తే వాడికంత ఇష్టం. నాతో ఎన్నోమార్లు అన్నాడు శివాని కానీ ఒప్పుకునుండకపోతే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయేవాణ్ణని. ఇంతకీ ఏదో చెప్పబోయేను, ఆఁ మాయింట పెంపకం అలాటిది. మానాన్నగారు మమ్మల్నెప్పుడూ పల్లెత్తు మాటనకపోయినా, ఆయన గదిలో అడుగు పెడితే చాలు ఎక్కడివాళ్ళం అక్కడ గుప్‌ చిప్. అలాటి పెంపకం మాది. ఆ క్రమశిక్షణ ఎక్కడుంది ఇప్పుడు. మాఅమ్మదగ్గరే ఏ గారాలు పోయినా. అదీ నేనంటున్నది. పిల్లలపెంపకం అంటే తల్లిదే బాధ్యత. తండ్రిశిక్షణకంటే తల్లి ఆలనాపాలనలో పిల్లలు మప్పితంగా పెరుగుతారు. తల్లివల్లే పిల్లలు రాటు దేలినా మానినా. మంచిగా మాటాడుతూనే వాళ్ళని మంచిమార్గంలో పెట్టగల చాకచక్యం తల్లికే ఉంటుంది. విషి ఈరోజు ఇలా తయారయేడంటే …నువ్వు వాణ్ణి కనిపెట్టుకుని ఉండలేదన్నమాట అనుకోవాలి అంటే నిన్నంటున్నాను అనుకోకు.”

శివాని ఉలికిపడింది. … ఉరిమిఉరిమి మంగలంమీద పడ్డట్టు, ఇదెక్కడి గోల …

“నిన్ననడంలేదులే. పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావు, దేశం కాని దేశం. నాఅన్నవాళ్ళెవరూ లేరు మాటసాయానికయినా, చెప్పుకునేడవడానికైనా …”

“అన్నట్టు లీలని పిలుస్తానని చెప్పేనివాళ. పిలవాలి,” లీల చేతిలో కత్తి పక్కన పెట్టేసి.

“ఎందుకూ?”

“ఊరికే. ఇంటికెళ్లిపోయింది కదా. నిన్న పిలిచింది, ఏదో పన్లో ఉండి, రేపు పిలుస్తానని చెప్పేను,” అంది శివాని గబగబ పక్కగదిలోకి వెళ్లిపోతూ.

తనని మాట పూర్తి చెయ్యనివ్వకుండా మరదలు అలా వెళ్ళిపోవడం రామలక్ష్మికి నచ్చకపోయినా చేసేదేం లేదు. మళ్ళీ హాల్లోకొచ్చి చూస్తే తమ్ముడూ కనిపించలేదు.

శివాని పక్కగదిలో కూర్చుని ఆలోచనలో పడిపోయింది. వదినగారిమాటల్లో ఏమైనా సత్యం ఉందేమోనన్న శంక తొలిచేస్తోంది ఇప్పుడు. తనదే తప్పా? తన పెంపకంలో లోపమే కారణమా ఇవాళ విషి జైలుకెళ్ళడానికి? తనేం చేసింది? ఇంతకన్నా చెయ్యగలిగింది ఏముంది? వదినగారు చెప్పినట్టు అమ్మా, నాన్నా తనని పెంచినతీరు వేరు. తను పెరిగిన వాతావరణం వేరు. ఆనాటి పరిస్థితికీ ఈ పరిస్థితికీ పోలికెక్కడ? ఆరోజుల్లో పెద్దలు చెప్పింది వినడమే కానీ ఎదురు చెప్పడం అన్నది లేదు. నాయిష్టం, ఇది కావాలి, అది అఖ్ఖర్లేదు, ఇది తినను అది చేస్తేనే తింటాను అంటూ పేచీలు ఎరగరు పిల్లలు. ఇప్పుడు ప్రతిపూటా ఇంట్లో ప్రతి ఒక్కరినీ ఏం తింటావు, ఏం చెయ్యమంటావు అని అడగాల్సొస్తోంది. ఆరోజుల్లో అలా ఎవరైనా అడిగేరా? అమ్మ ఏం చేస్తే అది తినడమే కదా. కంచందగ్గర కూర్చునేవరకూ, అమ్మ వడ్డించేవరకూ తను తినబోయేదేమిటో తెలిసేది కాదు. ఇప్పుడలా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ కొందరిళ్ళలో, చాలా కొద్దిమంది ఇళ్ళలో చూసింది పిల్లలు తల్లులు వడ్డించిందే తినడం. వాళ్ళనిగురించి ప్రభాస్రావు ఏంవన్నాడు? వీళ్ళు మరీ ఇంత మడి గట్టుకు మనవంటలూ, మన మాటలూ అంటూ పట్టుక్కూచుంటే బయట అమెరికనులతో ఎలా నెట్టుకొస్తారు? నీటిలో దిగింతరవాత ఈత కొట్టాలి కానీ నేలమీద నడిచినట్టు నడుస్తాం అంటే ఎలా? ఈ సంఘంలోకి వచ్చి పడ్డాక, వీళ్ల ఆచారాలూ, మర్యాదలూ పాటిస్తేనే బతుకు. అసలు అలా పాటిస్తేనే అంతంత మాత్రంగా ఉంది. ఇదే మనవాళ్ళతో వచ్చిన చిక్కు. మనం వేరు అనుకుంటూ ఓపక్కన మన ఆచారాలూ, వ్యవహారాలూ మనపద్ధతిలోనే చేసుకుంటాం అంటూ, మరోపక్కన వాళ్లు మనని వేరు పెట్టేరని ఏడుపులూ. … విషిని అదుపాజ్ఞలలో పెట్టలేదని వదినగారు అంటున్నారు కానీ నిజానికి విషి చాలా మెరుగు ఈ కాలప్పిల్లల్తో పోలిస్తే. మరీ అంత రెచ్చిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిరగబడడు. ఏదో ఓ పూట ఆటకాయితనానికి పోయేడేమో, పోనీ,  కావాలనే, తెలిసే ఓ చుక్క పుచ్చుకున్నాడనుకున్నా, సాటి కుర్రాళ్ళు తాగుతుంటే, ఆయన చెప్పినట్టు మడి గట్టుక్కూచుంటాననగలడా? అలా అంటే వాడ్ని అక్కడ ఉండనిస్తారా? పైగా, ఆ పంచిలో స్కాచి కలిపేరని తనకి తెలీదంటున్నాడు. అది కూడా నిజమే అయిఉండొచ్చు కదా. పిల్లలు ఎంతకైనా తగుదురు. ఇక్కడ “ఫన్”కోసం అంటూ చేసే ఆగడాలకి అంతే లేదు.

ఆలోచిస్తున్న శివానికి కునుకు పట్టింది.

000

విషి సెల్ తీసి అరవిందని పిలిచేడు.

అరవింద సెల్లందుకుని విషి పేరు చూసి, ఊరుకుంది. ఆపిల్లకి అతనంటే ఒళ్ళు మండిపోతోంది. తను ముత్యాలదండ వేసుకోడం అతనికి నచ్చకపోతే పోవచ్చు. అది పార్టీతరవాత తీరిగ్గా మాటాడుకోవచ్చు. అంతే గానీ బెటీతో సరసాలేమిటి తనని రెచ్చగొట్టడానికి కాకపోతే. పైగా బెటీ అంటే తనకి చిరాకు అని తెలిసీ …

విషి సందేశం పెడుతుంటే అరవింద సెల్వేపు చూస్తూ కూచుంది. “నువ్వక్కడున్నావని తెలుసులే. రా, ఒక్కమాట, ప్లీజ్. ఒక్కనిముషం, మాటాడతానంతే. సెల్ తియ్యి. మాటాడు,” … సెల్ ఆగిపోయింది.

విషి వదల్లేదు. రెండోసారి పిలిచి మళ్ళీ అదే సందేశం పెట్టేడు. ఓ పావుగంట అయింతరవాత మళ్లీ పిలిచి, “సరే నేనొస్తున్నా. నువ్వు తలుపు తియ్యకపోతే, గుమ్మందగ్గరే కూచుంటా తలుపు తీసేవరకూ,” అని సందేశం పెట్టి, బట్టలు మార్చుకుని, జోళ్ళేసుకుని బయల్దేరేడు.

కిందకొచ్చేసరికి, తండ్ర్రి కనిపించేడు, జయవిజయులు ఇద్దరు ద్వారపాలకులసాటి!

“ఎక్కడికి?”

విషి చిక్కులో పడ్డాడు. ప్రస్తుతం అరవిందపేరు చెప్పడం తన ఆరోగ్యానికి భంగం. “బయటికి?”

“ఎందుకు?”

“ఊరికే, అలా తిరిగొస్తాను, చల్లగాలికి.”

“ఏం, ఇంట్లో ఉన్న గాలి చాలదేమిటి?”

విషి మాటాడకుండా గుమ్మంవేపు నడవసాగేడు.

“నీకే చెప్తున్నది. ఫో, నీగదికి. ఇవాళే కాదు, మరో రెణ్ణెల్లు స్కూలికి తప్ప మరెక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు. వెధవ్వేషాలూ నువ్వూను.”

“నేను వెళ్తాను,” అన్నాడు విషి గుమ్మందగ్గరే నిలబడి.

“వీల్లేదని చెప్తున్నానా?”

“వెళ్తున్నా.”

“వెళ్ళేవంటే మళ్ళీ రాకు. ఈ గుమ్మంలో అడుగు పెట్టేవంటే పోలీసులకప్పచెప్తా బెయిలు రద్దు చేసి.” ప్రభాస్రావు కోపంతో ఉక్కిరిబిక్కిరయిపోయి, మాట రాక ఆగిపోయేడు.

విషి అంతకంటే విసురుగా వెనక్కి తిరిగి తనగదికి వెళ్ళిపోయేడు. మహ ఉక్రోషం వచ్చేసింది. ఎంతోమంది తన వయసువాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతారు. తనొక్కడే ఈ అమ్మా, నాన్నల కట్టడికి తలవొంచి ఉంటున్నాడు. ఏదో ఓమారు ఓ పొరపాటు జరిగితే అర్థం చేసుకోనక్కర్లేదా. పైగా తనింకా చిన్నవాడే కదా. చిన్నపిల్లలకుండే చాపల్యం సంగతి వాళ్ళకి తెలీదూ.. ముఖ్యంగా నాన్నకి. ఆయనధోరణి అరవిందవిషయంలో ఏం మర్యాదగా ఉంది అడిగేవాళ్ళు లేక గానీ. లేకపోవడమేం, ఉన్నారు. అమ్మ అడగాలి, అడగదు. అత్తయ్య అడుగుతోంది కానీ ఇద్దరూ ఎవరిధోరణిలో వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు ఆవిడమాట. … అంతే … అసలు నాన్న అలా అరవిందయందు అంతగా ఆ ప్రత్యేకశ్రద్ధ చూపకపోతే ఇంత దూరం రాకపోను …

విషి మళ్ళీ సెల్లందుకున్నాడు, “అరూ, ప్లీజ్, నన్నర్థం చేసుకో. మానాన్న లంఖిణిలా తలుపుదగ్గర కూర్చున్నాడు నన్ను బయటికి వెళ్ళడానికి వీల్లేదని. కనీసం సెల్లో మాటాడుకుందాం. ప్లీజ్, ప్లీజ్,” అతనిగొంతు బొంగురుపోయింది.

అరవింద, ”హలో,” అంది.

“మానాన్న బయటికి వెళ్ళడానికి వీల్లేదంటున్నాడు.”

“మంచిపనయింది.”

“అది కాదు. నేనంటే నీకెందుకంత అలుసు?”

“నాకా అలుసు? నువ్వా నేనా వేరేవాళ్ళతో సరసాలాడింది?”

“నీనించే. తెలిసి, తెలిసి ఎందుకు ఆ దండ వేసుకొచ్చేవూ నన్నుడికించడానికి కాకపోతే.”

“నేను ఉడికిస్తే నువ్వెందుకు ఉడుక్కోవాలీ, హీహీ.”

“మరి నువ్వూ అంతే కదా. బెటీతో నేను కాస్త చనువుగా ఉన్నానని నువ్వెందుకు ఉడుక్కుంటావు?”

“నేనేం ఉడుక్కోలేదు.”

“మరి ఇప్పుడెందుకు మాటాడవు?”

“నాకు తలనొప్పిగా ఉంది.”

“ఆస్పిరిన్ తీసుకురానా?”

“ఇంట్లో ఉంది.”

“మందేసుకు పడుకో. సాయంత్రం పిలుస్తాను. మాటాడుకుందాం.”

“సాయంత్రం నాకు వేరే పనుంది.”

“రాత్రి పదయేక పిలవనా?”

“ఎందుకసలు పిలవడం. ఏముంది మాటాడ్డానికి.”

“చెప్పేను కదా, మానాన్న బయటికెళ్తే ఒళ్ళు చీరేస్తానంటున్నారు. కనీసం రెండురోజులు నీతో ముఖాముఖి మాటాడ్డానికి వీలుండదు.”

“ఏముంది మాటాడ్డానికి?”

అరవిందకి విసుగేసింది – ఒకే బిందువుచుట్టూ గింగరాలు తిరుగుతున్నారు తామిద్దరూను. తను మాటాడేవరకూ అతను వదిలిపెట్టేట్టు లేడు. “సరేలే. పిలు మేలుకునుంటే సెల్ తీస్తా. లేకపోతే రేపే,” అంది.

విషికి కావలసిందంతే. జరిగిందాంట్లో ఎవరిదెంత తప్పు అని కాదు తన బాధ. అరవింద చాలా మంచి అమ్మాయి. అలాటి అమ్మాయి మళ్ళీ తనకి దొరకదు. ముత్యాలదండ అనో, పంచిలో స్కాచ్ అనో, బెటీ అనో చెప్పి అరుని వదులుకోడానికి మనసొప్పడం లేదు. తండ్రికి కూడా ఈవిషయం తెలియజేయడం చాలా అవసరం. ఆమాట అరవిందకి స్పష్టం చేసేడు.

అరవింద తుళ్ళిపడి చటుక్కున లేచి మంచంమీద నిటారుగా కూర్చుంది కళ్లు పొడుచుకు సెల్లోకి చూస్తూ. ఆశ్చర్యంతో తలమునకలైపోతోంది. అవతల ఉన్నవాడు విషియేనా అని చిన్న అనుమానం కూడా వచ్చింది. నిజానికి వాళ్ళిద్దరిమధ్యా వచ్చిన తగువు చాలా చిన్నది. ఆమాత్రందానికి అతను అంతగా మారిపోగలడంటే నమ్మడం కష్టంగా ఉంది.

సరేనని మరోమారు చెప్పి ఫోను మళ్ళీ బల్లమీద పెట్టి నిద్రకొరిగింది, ఆస్పిరిన్ వేసుకుని.

000

శివానికి రామలక్ష్మిమాటలు ములుకులై తగిలినా, మరోరకంగా ఏదో దారి చూపినట్టు కూడా అయింది. విషిని పిలిచింది ఓమారిలా రా అంటూ.

విషి ఇంకా కుతకుత ఉడికిపోతున్నాడు. ఇన్నేళ్ళలో తండ్రి తనకెప్పుడు “గ్రౌండింగు” విధించలేదు. ఇప్పుడు, నిజంగా తన తప్పేం లేకపోయినా, బయటికి పోరాదని ఆంక్ష విధిస్తున్నాడు. తల్లి మూడోమారు కూడా పిలిచింతరవాత, “ఎందుకూ?” అన్నాడు ఉన్న చోటినించే.

ఆవిడ మెట్లదగ్గరకొచ్చి, “కొంచెం ఆ ఇండియాబజారుకి వెళ్ళి జిలేబీ తీసుకురా,” అంది.

విషి వెళ్లను అని చెప్పబోయి. తమాయించుకుని కిందికి వచ్చేడు తండ్రి ఏమంటాడో అనుకుంటూ.

“ఇప్పుడు జిలేబీలెందుకూ?” అన్నారు ప్రభాస్రావు.

“రేపు జన్మాష్టమి. ఎంతసేపూ పరమాన్నమో, రవ కేసరో చేస్తున్నాను. కాస్త కొత్తగా ఉంటుందని,” అందావిడ.

ప్రభాస్రావు మాటాడలేదు.

విషికి అర్థం కాలేదు కానీ మాటాడకుండా డబ్బు తీసుకున్నాడు.

శివాని డబ్బు అతనిచేతిలో పెడుతూ, “వాళ్ళు ఒకోప్పుడు అరలో ఉన్నవి అమ్ముడు పోయేవరకూ తాజాగా చేసినవి బయట పెట్టరు. గట్టిగా కనుక్కుని తాజాగా ఉన్నవి అడిగి తీసుకురా,” అని గొంతు మరింత తగ్గించి, “ఆలస్యమయినా ఫరవాలేదు,” అంది.

విషి క్షణకాలం ఆవిడమొహంలోకి చూసి, తలూపి బయల్దేరేడు.

ఇండియాబజారుదగ్గరికి రెండు మైళ్ళదూరంలోనే అరవిందఇల్లు.

000

(ఏప్రిల్ 19, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మార్పు 37”

 1. శారద, నేను మీకు జవాబు ఇచ్చేననుకున్నా. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. అంచేత మళ్ళీ చెప్తున్నా, మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. కథ చాలా బాగా సాగుతోంది మాలతి గారూ. ఫ్లాటరీ అనుకోకపోతే, చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది.
  పద్దెనిమిదేళ్ళ కూతురి తల్లిగా అనుభవంతో చెప్తున్నాను :). మీ కథలోని చాలా సంఘటనలూ, చాలా మంది మనుషులూ ఈ మధ్య నేనూ చూస్తున్నాను.
  శారద

  మెచ్చుకోండి

 3. లలిత4కిడ్స్, :)) ఈతరంవారికి ఉన్న బలం అదనుకుంటా. కథంతా వాళ్ళే ఆక్రమించేసుకుంటున్నారు. నేను అనుకున్నట్టు కథ సాగడం లేదు కానీ సాగుతున్న విధానం బాగానే ఉంది. మీ ఆదరణకి థన్యవాదాలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s