మార్పు 38

విషి వస్తున్నానని సెల్లో చెప్పి, తలుపు తట్టేడు.

“వచ్చేసి, వస్తున్నానంటావు,” అంది అరవింద తలుపు తీసి.

విషి చిన్నగా నవ్వేడు లోపలికొచ్చి సోఫాపక్కన నిలబడి.

“మీనాన్న రానివ్వరన్నావు?”

మ్, అన్నాడు విషి పెదిమలు బిగబట్టి. ఇంట్లో జరిగిన రంధి అంతా చెప్పడం అతనికిష్టం లేదు.

ఇద్దరూ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయేరు. ఇద్దరికీ తెలీడం లేదు ఎలా మొదలు పెట్టాలో.

ఆఖరికి అరవిందే అడిగింది, “ఏంటి మాటాడాలన్నావు.”

“నీక్కోపం వచ్చింది నేనేం తప్పు చేసేనని?”

“నేను మాత్రం ఏం తప్పు చేసేను?”

“నాకు ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఆ దండేసుకోడం?”

“నేన్నీకోసమే అన్నీ చెయ్యాలేంటి? నా ఇష్టాయిష్టాలు నాకుండకూడదా?”

“ఉండకూడదన్నానా?”

“మరేంటంటున్నావో తిన్నగా చెప్పకూడదూ?”

“అది కాదు. ఎంతో సరదాగా జరిగిపోవాల్సిన పార్టీ. నన్ను చిరాకు పెట్టడానికి కాకపోతే అప్పుడే వేసుకోవాలా అది?”

“నేను వేసుకున్న బ్లౌజుమీద అది చాలా బావుంటుందని వేసుకున్నా, అదెందుకు ఆలోచించవు నువ్వు? కాథీ కూడా అది చాలా బావుందంది.”

“నీకు నాకంటే కాథీయే ఎక్కువయిపోయిందా?”

“అదుగో, ఈ తలతిక్క వాదనలొస్తాయనే నే మాట్టాడనన్నాను.”

“సారీ.”

అరవింద కిటికీలోంచి చూస్తూ ఊరుకుంది. ఆ క్షణంలో పాపం అని కూడా అనిపించింది. తను ఆ దండసంగతి అతనితో ముందు మాటాడి తరవాత వేసుకునుంటే పోయేదేమో అని కూడా అనిపించింది.

“పోన్లే ఏదో ఓటి అయింది లెద్దూ,” అంది సద్దుకుపోయే తత్వంతో.

విషికి కూడా ఏం మాటాడాలో తోచలేదు.

అరవింద లేచి వెళ్ళి ముత్యాలదండ తీసుకొచ్చి, “మీనాన్నగారికిచ్చేయి నువ్వే. మనిద్దరిమధ్యా తంటాలు తెస్తూ ఎందుకిది?”

“నువ్వే ఇచ్చేయి. మధ్య నన్నెందుకూ ఈడవడం ఇందులోకి?”

“ఆయన్ని మళ్లీ చూడ్డం నాకిష్టం లేదు.”

“ఇది మీఇద్దరిమధ్య విషయం. నన్నందులో ఇరికించకు.”

అరవిందకి అనుమానం వచ్చింది. “నువ్వు మీనాన్నగారితో మాటాడేవా?”

“మాఅమ్మ ఇండియాస్టోరుకి వెళ్ళి ఏదో తెమ్మంది. రారాదూ, అక్కడ టీ తాగుతూ మాటాడుకుందాం.”

అరవింద కొంచెం ఆలోచించి, “సరే, పద,” అంది. తనప్రశ్నకి అతను జవాబు చెప్పలేదు. అంటే అతను వాళ్ళ నాన్నతో మాటాడలేదన్నమాటే. మరెందుకు తనతో అలా అన్నాడు? కానీ, అదేదో తేల్చుకోవాలి. మరి మాటాడ్డం అంటే అదే కదా. సత్యశోధన! ఒకరి తత్వాలు మరొకరు స్పష్టం చేసుకోడం!

“నువ్వు మీనాన్నకి నిజంగా చెప్పేవా?”

“చెప్తాను,” అన్నాడు ఎటో చూస్తూ.

అరవింద మాటాడలేదు. చెప్పేను అంటే ఆశ్చర్యపోవాలి కానీ చెప్తానంటే, హా, అది మామూలే.

“మీనాన్న నన్ను కోడలనంటూ ఏమిటా ప్రకటనలు.”

“నీకూ తెలిసిందా?”

“మాఅమ్మతో ఆయన అన్లేదు. మరెవరో అడిగేర్ట.”

“సారీ.”

“మ్. అలా ప్రతిదానికీ సారీ, సారీ అనకు అస్తమానం. ఆయనకి చెప్పు అలాటిమాటలు మాటాడొద్దని.”

“నామీద విసుక్కుంటావేమిటి, నేనేం చేసేను?”

“ఏం చేసేవని కాదు. ఏం చెయ్యడంలేదనీ అంటున్నా. ఆయన అలా చెప్తుంటే నువ్వెందుకూరుకున్నావు?”

“ఆయన చెప్తున్నట్టు నాక్కూడా తరవాతే తెలిసింది.”

“మరి తెలిసింతరవాతైనా చెప్పేవా?”

“నన్నూరికే సతాయించకు. నీకూ తెలియాలి. మన సంస్కృతిమీద అన్ని పుస్తకాలు చదివేవు. అంత పెద్దవాళ్ళకి మనదేశపు సంస్కారం అంత త్వరగా పోదని తెలీదా ఏం?”

“మహ బాగుంది. ఆయనా చదివేరు కదా ఇక్కడి సంస్కృతిమీద పుస్తకాలు. ఆయనకి తెలియఖ్ఖర్లేదా?”

“తెలియడం వేరూ, ఆచరణలో పెట్టడం వేరూ కదా.”

“సరే, అందుకే నిన్నే చెప్పమంటున్నాను.”

“చెప్తానంటున్నాను కదా,” అన్నాడు విషి విసురుగా.

ఇద్దరూ మరోగంటసేపు అలా ఆ “కోడలు” పదంమీద తందనాలు తొక్కి, కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. స్నేహితులుగానే విడిపోడానికి ఒప్పందం అయింది! అంటే స్నేహంగానే ఉంటారు కానీ కదాచితుగా మరొక అబ్బాయితోనూ, అమ్మాయితోనూ కాఫీకో, సినిమాకో వెళ్ళడానికి రెండోవారికి అభ్యంతరం ఉండరాదు. వీలయినంత త్వరగా, వీలయినంత సుకుమారంగా ఈ కోడలు, అల్లుడు “బిజినెస్సు”కి చుక్క పెట్టేయమని తమతమ కుటుంబాలకి తెలియజేయాలి. అదీ ఒప్పందం.

000

“అది కాదక్కయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేసేవంటే నీకు ఇక్కడ బాగుందన్నమాటే కదా,” అంది అరవింద.

లీల ఆ అమ్మాయి మొహంలోకి తేరి చూస్తోంది, “ఇదే నీకూ నాకూ తేడా. నువ్వేమో ప్రతివిషయం, విషయందాకా ఎందుకూ, ప్రతిమాటకీ వివరణలు నిర్ధారణ చేసేస్తావు. నాకేమో, ఎంత తెలిసినా ఇంకా తెలీందేదో ఉన్నట్టే ఉంటుంది.”

“ఎంచేతంటావు?”

“ఏమో మరి. బహుశా నా పెంపకం అంటే నేను పెరిగినవాతావరణం అలాటిదేమో.”

“అంటే దేనికీ స్పష్టమయిన అర్థాలు చెప్పుకోలేకపోవడం అంటావా? అదీ గొప్పేనా?“

లీల నవ్వింది. “చూసేవా, మళ్ళీ మరో నిర్ణయం చేసేసేవు. ఇదే నేనంటున్నదీ, నీకూ నాకూ, మనసంస్కృతికీ ఇక్కడికీ, నీ సంస్కృతికీ తేడా.“

అరవింద కూడా నవ్వి, “ఏం చెయ్యను నాకు తెలిసిందీ, అలవాటయిందీ అదే మరి. అంచేత మళ్ళీ అడుగుతున్నా చెప్పు. నీకు కనిపించిన తేడాలేమిటి?”

“ఏమో, అదే నేను చెప్పలేనంటున్నది. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం కలుసుకుని ఆర్నెల్లు కూడా కాలేదు. నువ్వు చుట్టరికం కలిపేసి నన్ను అక్కయ్యా అంటున్నావు. అదే అమెరికనులయితే అలా చుట్టరికాలు కలపరు. అది ఒకటి. రెండోది, నన్ను అక్కయ్యా అంటున్నావు కానీ సుందరంగారిని మటుకు సుందరంగారనే అంటావు. ఎంచేత?”

అరవింద గతుక్కుమని, “నువ్వనేవరకూ నాకు తోచనేలేదు. అవును, ఆయన్ని చూస్తే ఆ బెత్తెడు ఎడం అలా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అయినవారితో మాటాడుతున్నట్టుండదు. నీతో మాటాడుతుంటే నాకు అక్కయ్య లేదు కానీ ఉంటే ఇలా ఉండు అనిపిస్తుంది.”

ఇద్దరూ కొంచెంసేపు మాటాడకుండా ఊరుకున్నారు. లీల లేచింది, టీ పెడతానంటూ. అరవింద ఆవిడవెనకే వంటింట్లోకి నడిచింది.

“నాకు ఈ విషితో ఏం చెయ్యాలో తెలీడం లేదు.”

లీల తలూపింది, ఆహా. అంతే మరి. ఎంత చెట్టుకంత గాలి. చిన్నా, పెద్దా – అందరికీ ఎవరిబాధలు వాళ్ళకి భరించలేనంత ఘనంగా కనిపిస్తాయి. “ఇంకా ఇరవయ్యయినా దాటలేదు. ఇప్పట్నుంచీ ఎందుకింత ఆలోచన. ముందు చదువు కానీ. మనపద్ధతి అదీ. ఒకటి తరవాత ఒకటి. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అనుభవాలు చదివేవు కదా. ఆయనేం చెప్పేరు. విద్య తరవాత వివాహం, గృహస్థు ధర్మాలూ, తరవాత సన్యాసం … అదీ వరస.” – ఈమాటలు లీల తనలో తను అనుకుంది. అరవిందతో అనవలసిన మాటలు కావివి. ఆ అమ్మాయి ఇది అవగాహన కావడం కష్టం. ఈ పద్ధతిలో పెరగలేదు మరి!

“అక్కయ్యా, ఒకమాట అడుగుతాను, చెప్పు. నీకు సంతోషంగా ఉందా? నువ్వు వెనక్కి మళ్ళీ సుందరంగారింటికి రావడానికి కారణం నిజంగా నీకు ఆయనతో జీవితం చాలా బాగుండడంచేతనేనా?”

లీలకి మళ్లీ మన సంప్రదాయాలు గుర్తొచ్చేయి. ఇదే ఇండియాలో అయితే 18ఏళ్ళ అమ్మాయి తనతల్లి వయసున్న పెద్దావిడతో ఇలాటి ప్రశ్న వెయ్యదు. కనీసం తను పెరిగినసంప్రదాయంలో అది లేదు. కానీ, ఇంత చిన్నవయసులో అంత పెద్ద ఆలోచనలు చేస్తున్న పిల్లతో తన మనసులో కలకలం చెప్తే, కనీసం ఊరట కలుగుతుందేమో, కనీసం చెప్తే తప్పు లేదు, అనిపించింది ఆవిడకి.

“ఏమో, చెప్పేను కదా నా ఆలోచనలు మాటల్లో చెప్పలేను.”

“ఎంచేత?”

“ఎంచేతంటే … ఏం చెప్పను? మాయింట్లో ఎవరూ అంతగా మాటాడకపోవడం కావచ్చు. నాకు కలిగిన ప్రశ్నలు, ఆలోచనలూ, ఊహలూ కథల్లో పెట్టడం కావచ్చు.”

“పోనీ, కథ చెప్తున్నాననుకునే చెప్పు.”

“ఆహా, గడుసుదనం,” అంది లీల అరవింద బుగ్గమీద చిన్న చిటిక వేసి.

అరవింద “ఔచ్,” అని, “నాఒంటిమీద చెయ్యేసేవు. అది చైల్డ్ ఎబ్యూస్,” అంది చిలిపిగా.

“అదుగో చూసేవా, మళ్ళీ …”

“ఏంటి?”

“ఇలాటి మాటలు నేను ఈదేశం వచ్చేవరకూ వినలేదు. అసలు మాయింట్లో మాఅమ్మకీ నాన్నగారికీ మేం ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, ముప్ఫైలు దాటినా.“

“ముప్పై తరవాత అనొచ్చా?”

“కాదు. వాళ్ళు పోయేరు. ఉంటే జీవితాంతం అలాగే ఉండేవాళ్లం.”

ఇద్దరూ నవ్వుకున్నారు.

“నిజానికి నాకు చాలా విషయంలో అసంతృప్తి. నేను కూడా చాలా ఆలోచించేను. ఎందుకిలా అయింది. నేనేం చేసేను. లేదా ఏం చెయ్యలేదు. ఏం చెయ్యగలను. ఒకొకప్పుడు అనిపిస్తుంది ఎక్కడి అక్కయ్యపాలెం, ఎక్కడి టెక్సస్. ఇక్కడికెలా ఎందుకొచ్చి పడ్డానో అని. నాకసలు మొదట్నుంచీ రెండు అలవాట్లు వచ్చేయి. వాటికి కారణాలు ఇదమిత్థమని చెప్పలేను కానీ … ఒకటి, ఏ విషయంలోనూ అట్టే పట్టింపు లేకపోవడం, రెండోది, నాకు నేనై నాకిది కావాలని అడక్కపోవడం. అసలు ఎవరైనా ఇస్తే కూడా నానోట మొదట వచ్చే మాట నాకొద్దనే. ఎందుకలా అంటానా అని ఇప్పుడు ఇక్కడికొచ్చేక, నీలాటివాళ్లని చూసి నేర్చుకుని, ఆలోచిస్తే నాకనిపిస్తున్నది అది కూడా మన సాంప్రదాయంలో భాగమేనని. ఎవరైనా ఏదైనా ఇస్తే, తీసుకోడం “ఆబ” అనుకుంటారు. అది ప్రలోభం. అంచేత వద్దనడం ఆత్మసంయమనానికి చిహ్నం అన్నమాట.”

“వాళ్ళకి వాళ్ళయి ఇస్తుంటే ప్రలోభం ఎందుకవుతుంది?”

“ఏమో మరి. నేనూ అంత స్పష్టంగా చెప్పలేను. ఈమధ్య శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అనుభవాలూ, జ్ఞాపకాలూ చదువుతున్నాను. అందులో ఆయన కూడా వివరించేరు. భగవద్గీతలో కూడా ఉంది కదా

యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||

అపరిగ్రహః అని అంటే పుచ్చుకోనిచ్చగించనివాడని అర్థం మరి.”

“భగవద్గీత చదివేవా?”

“చదివేనంటే చదివేను కానీ అదంతా అర్థమయిపోయిందని కాదు. బహుశా ఇలా నా ప్రవర్తనకి అడ్డం పెట్టుకోడానికి పనికొస్తోంది అనుకో.”

“పోన్లే ఈ పుచ్చుకోకపోడాలు తరవాత చూద్దాం. ముందు ఈ సంగతి చెప్పు. నువ్వు సుఖంగా ఉన్నావా?”

“అసలు సుఖం అంటే ఏమిటి?”

“అదే నాకు కావలసింది. సుఖం అంటే ఏమిటో నువ్వు చెప్పినతరవాత ఆలోచించుకుంటాను,” అంది అరవింద.

“నామటుకు నాకు సుఖం అన్నది ఒక ప్రత్యేకపదార్థం కాదు ఇదుగో, ఇక్కడుంది, ఇక్కడ లేదు అనుకోడానికి. అది సాపేక్షకం. నాకు సుఖం అనిపించింది నీకు సుఖం కాకపోవచ్చు. నేను ఏ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకుని ఎలా ప్రవర్తిస్తాను అన్నది నా మనస్తత్వంమీదా, పరిస్థితులమీద ఇంకా అనేక ఇతరవిషయాలమీదా ఆధారపడి ఉంటుంది కదా. అలాగా నీ నిర్ణయాలూను. అందుకే ఎవరూ మరొకరికి చెప్పలేరు ఇలా చెయ్యి అని. చెప్పకూడదు కూడాను. పోతే, అసలు మనం చేసే ప్రతి పనీ మనకి సుఖంగా ఉందా లేదా అని మాత్రమే ఆలోచించుకుంటూ చెయ్యం అనే నేననుకోడం. మనచుట్టూ ఉన్న జనాలవిషయం కూడా ఆలోచించుకుని వాటన్నటిమధ్య మనం చెయ్యగలిగిందేమిటి అని వితర్కించుకుని ఓ నిర్ణయానికొస్తాం. నిజానికి అది నిర్ణయం అని కూడా అనలేం. ఎంచేతంటే నిర్ణయం  అనగానే దానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. మన నిర్ణయాలు ఏరోజుకారోజు మారిపోతుంటాయి.”

“అంటే మనకి స్థిరమైన అభిప్రాయాలు లేకనా?”

“అదొక కారణం కావచ్చు. చుట్టూ ఉన్న వ్యక్తులూ, పరిస్థితులూ మారిపోతూండడంచేత కూడా మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనలు తిరగరాసుకుంటాం కదా. నేను ఈ యింటినించి వెళ్ళిపోయిన కారణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయినా వచ్చేసేను.”

అవేమిటి అనడగడానికి అరవింద సంకోచించింది. దాదాపు రెండున్నరగంటలసేపు తానిక్కడ ఉంది. లీల ఎక్కడా తొణకలేదు. అదే ఆమె వ్యక్తిత్వమా? అలా అయితే తను మరో రెండున్నర గంటలు కాదు రెండున్నర ఏళ్ళున్నా తొణకదు ఆమె.

“నీమాటలు వింటుంటే మా టీచరన్న మాటలు గుర్తొస్తున్నాయి.”

“ఏమిటది?”

“ఆయన ముప్ఫైయేళ్ళక్రితం మనదేశం వెళ్ళేరు తెలుగు నేర్చుకుని. మనవాళ్ళగురించి ఆయన్ని అడిగేను ఏంఅనుకుంటున్నారని. తీరిక అన్నారు ఒక్కమాటలో.”

“తీరికా?”

“అక్కడ అందరూ చాలా relaxedగా ఉంటారని. ఏంవడిగినా చూద్దాం, అలాగే అంటారు తీరిగ్గా. ఎవరికీ ఏ విషయంలోనూ తొందర లేదు.”

“నిజమే. మనది ప్రాథమికంగా వ్యవసాయ దేశం కదా. పొలం దున్నాలి, విత్తనాలు నాటాలి, నారు పోయాలి, విత్తు వేయాలి … ఆకార్యక్రమంలో తొందర పడ్డానికేమీ లేదు. అవన్నీ ఆ వరసలో వాటిక్కావలసిన టైము తీసుకుంటూ జరుగుతాయంతే,” అంది లీల.

“ఆయన మళ్ళీ కిందటేడు వెళ్ళొచ్చేరు. మళ్ళీ ఎలా ఉందని అడిగితే చాలా మారిపోయిందన్నారు. ఉరుకులూ. పరుగులూ, … భాష కూడా ఇప్పుడెవరూ తెలుగు నేర్చుకోనక్కర్లేదు ఇండియా వెళ్లడానికి. అక్కడ అందరూ ఇంగ్లీషే మాటాడుతున్నారు అన్నారు. ఆయనకి మళ్ళీ ఇండియా వెళ్ళాలన్న ఉత్సాహం చచ్చిపోయింది ఈ చివరి ప్రయాణంతో.”

లీల నవ్వి ఊరుకుంది.

“నీకు పెద్దక్కయ్య యింట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉందా?”

లీల కొంచెం ఆలేచించి అంది, “ఇందాకా సుఖంగురించి అడిగేవు. అక్కడ ఉన్నప్పుడు, ఆ తరవాత ఇక్కడికి వచ్చేకా నాకు అర్థమయింది సుఖానికి ఎవరి నిర్వచనం వారిదే. సుందరంగారికి ఎవరో ఒకరు చేసి పెట్టేస్తే చాలు. తను కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నచోటినించి కదలకుండా వాళ్ళకీ వీళ్ళకీ చెప్పి పని చేయించేసుకుంటారు. మరి చేసేవాళ్లు ఎందుకు చేస్తారూ అంటే వారిలాభాలు వారూ ఎలాగోలా చూసుకుంటారు. కానీ కొంతకాలం అయేక వారికి అర్థమవుతుంది, తాము ఇచ్చేది ఎక్కువా, పుచ్చుకునేది తక్కువా అని. వాళ్ళు విసుక్కోడంతో మొదలుపెట్టి, చివరికి తఏదో తగువు తెచ్చుకుని వెళ్ళిపోతారు. అలా జరిగిన ప్రతిసారీ సుందరంగారు తను చేస్తున్నపనిలో హైన్యం గుర్తించి ఉంటారనీ మళ్ళీ అలా జరగదనీ అనుకున్నాను. నాకు అలా పరులని ఉపయోగించుకోడం చాలా హీనంగా అనిపిస్తుంది.

కానీ ఆయనకి మరో మనిషి దొరుకుతారు. అంచేత ఆయన జీవితాంతం అలాగే జరుపుకుంటారు. నాకది అర్థం అయేక, నేను నాదారి చూసుకుందాం అనుకున్నాను. కానీ పెద్దక్కయ్యగారిదగ్గర చేరేక చూసేను. ఆమెకి సాయం చెయ్యడంలో నాకానందం కనిపించింది. ముఖ్యంగా ఆవిడకి అలా చేయించుకోడం ఇష్టంలేదని తెలిసింతరవాత. తప్పనిసరి అయినంతవరకూ ఒప్పుకున్నారు కానీ ఆతరవాత సాగనివ్వలేదు. అప్పుడనిపించింది. సాయం తెలిసిన ఉత్తమురాలు ఆవిడ. అది అర్థమయింతరవాత నాకు ఎక్కడున్నా ఒకటే అనిపించింది. ఇప్పుడు నాకాలక్షేపాలు నావి. ఆయన కాలక్షేపాలు ఆయనవి. ఇంటిపని కూడా నాకిష్టమయింది చేస్తాను మిగతాది వదిలేస్తాను. నిస్సంగంగా ఉన్నంత ఉత్తమం లేదు.“

“అంటే నిస్సంగంగా ఉంటే ఎక్కడ ఉన్నా ఒకటే అంటావా?”

“అలాగే అనిపించింది నాకు. ఎదటివారిని అర్థం చేసుకోమంటారు కానీ అంతకంటే ముందు నన్ను నేను అర్థం చేసుకోవాలి. అదే నాకు అర్థమయింది. ఆ తరవాతే ఎక్కడుండడం అన్నది.”

“మరి నువ్వు చదువుకున్నావు కదా. ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించలేదా?”

“చేసేను. కానీ నాకు తగిన పనులేవీ దొరకలేదు. నిజానికి నాచదువువిషయంలో కూడా నాకు తృప్తి లేదు. ఏదో చదివేం అంటే చదివేం అనే కానీ ఈ చదువులు నిజంగా మనిషి పరిపూర్ణుడు కావడానికి అవసరమైన విద్య అందించడంలేదు. వ్యక్తిని వ్యక్తిగా తీర్చి దిద్దడం లేదు. ఇది ఒఖ్ఖ ఆడవారే కాదు, మొగవారి చదువులు కూడా అంతే. కమ్మెచ్చులో పోసి తీసిన “మూస పనివాళ్ళ”ని తయారు చేసే దేశమ్మీదకి తోలేస్తున్నారే కానీ మౌలికవిలువలని ఆదరించి అనుసరించేవారిని తయారు చేయడంలేదు.”

అరవింద మాటాడకుండా కూర్చుంది. ఈ అక్కయ్య మనస్తత్వం ఏమిటో అర్థం కావడం లేదు.

లీల అది గమనించి, “ఇవాళ్టికి చాల్లే. నామాటలు ఇలా వింటూ కూర్చుంటే నీక్కూడా మతి పోతుంది. వెళ్లి చదువుకుంటావో ఏదో మరో పనికొచ్చే పని చూసుకుంటావో చూడు,” అంది లీల.

“మతి పోయినా పోకపోయినా, చేసుకోవాల్సిన పనులున్నాయిలే. మళ్ళీ వస్తాను, ఇంకా మాటాడుకుందాం,” అంటూ అరవింద లేచింది.

000

(గమనిక. Font size  మార్చడానికి ప్రయత్నించేను కోడ్ మార్చి. ఇప్పుడెలా ఉందో చెప్పండి దయచేసి.)

(ఏప్రిల్ 26, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “మార్పు 38”

  1. ,@ SunnA, లక్ష్మీ రాఘ వ, టెంప్లేట్ మారిస్తే కానీ ఆ చిన్నిఅక్షరాలకి విముక్తి లేదని తెలియడానికి ఇంతకాలం పట్టింది. పాఠకులందరికీ నా క్షమాపణలు.
    ఈరోజు చేసిన పోస్టు ఎలా ఉందో చెప్పండి.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.