కీలుబొమ్మలుకి ప్రాణం పోసిన మానకలశుడు జి.వి. కృష్ణరావు

ఆర్య నాగార్జునుడు జ్ఞానానికి మానకలశం (కొలబద్ద ) అయినట్టే డా. జి. వి. కృష్ణరావు ఆంధ్రసాహిత్యానికి మానకలశం అంటారు కృష్ణరావుగారిని సన్మానించిన సందర్భంలో శ్రీఅరవింద సాహిత్యసేవాసమితివారు. (మార్చి 3, 1979.).

కృష్ణరావుగారి జననం 1914లో తెనాలి తాలూకా కూచిపూడి గ్రామంలో. (రెండవ అక్షరంలో అచ్చు హ్రస్వం “ష్ణ” అని ఆయన రాసుకున్నట్టు కనిపిస్తోంది). కృష్ణరావుగారు తనవిద్యాభ్యాసంగురించి చెప్పినకథనం ఇలా ఉందిఃచిన్నతనంలో ఆయనకి చదువుమీద శ్రద్ధ ఉండేది కాదు. తల్లీ, తండ్రీ  చదువుకున్నవారు కాదు. ఇతనిని చదువుకోమని స్కూలికి పంపితే, వెళ్ళేవాడు కాదుట. ఆసమయంలో వారిమేనత్త వచ్చి, కుర్రవానిని తనతో తీసుకెళ్ళి స్కూల్లో పెట్టింది. ఆరోజుల్లో తనరాతల్లో  “చేపలన్నీ చాపలుగా, బాబులన్నీ బూచులుగా మారేవి”ట. అప్పుడే ఒక పేరడీ పద్యం కూడా రాసి స్నేహితుడికి చూపితే, ఆస్నేహితుడు టీచరుకి చూపేడుట. ఆ టీచరు “పట్టుమని పది పద్యాలయినా నోటికి రావు, కవిత్వం మొదలు పెట్టేవా?” అంటూ మెత్తగానే చెప్పి ఆపైన అక్షరలక్షలు విలువగల సలహా ఇచ్చేరు, “కావ్యలక్షణగ్రంథాలు క్షుణ్ణంగా చచదువుకోకుండా పద్యం చెప్పటం తప్పు. అది నరకహేతువు …” అని. అది మూడవఫారం (ఎనిమిదవ తరగతి)లో జరిగిన సంఘటన. నాటినుండి కావ్యపఠనం, వ్యాకరణాధ్యయనం స్వయంకృషితో సాధించేరు. దానివల్ల జరిగిన నష్టం, కొంతకాలంపాటు పద్యరచనయే కవిత్వం, సమాసజటిలతే ఫ్రౌఢిమ అన్న భ్రమకు లోనయ్యేనంటారు కృష్ణరావుగారు. ఆ తరవాతికాలంలో పద్యం కంటే గద్యం ముఖ్యంగా వ్యవహారికభాషకి పెద్దపీట వేసేరు.

స్కూల్ ఫైనల్ క్లాసులో ఉండగా కాంపోజిషను పుస్తకం సరిదిద్ది ఇస్తూ, వారి అధ్యాపకులు శాస్త్రిగారు, “దీర్ఘసమాసపదరచన మంచిది కాదు. అర్థకైవల్యం ముఖ్యం. ప్రయోజనమేదో ఉంటే తప్ప ఝటితిస్ఫూర్తి కలిగించని పదం వాడరాదు, రచన ఎప్పుడూ అరటి పండొలిచి అందించినట్లుగా ఉండాలి. అదే గొప్పరచన,” అని చెప్పేరుట.

కృష్ణరావుగారికి చిన్నతనంలోనే వ్యాకరణాది గ్రంథాల్లో అభినివేశం ఉంది. హైస్కూల్లో ఉండగానే కవితలు, కథలు రాసేవారుట. 1931లో చిన్న నవల, 1934లో శతకం రాసేరు. పిల్లలకోసం కథలపుస్తకం రాసి అచ్చేయించేసేరు. అది స్కూళ్ళలో పాఠ్యగ్రంథంగా పెట్టించడానికి ప్రయత్నించేరు కానీ ఫలించినట్టు లేదు. స్కూల్లో ఉన్నరోజుల్లోనే ఒక టీచరుమీద కోపం వచ్చి పద్యం ఒకటి బోర్డుమీద రాసేరుట. తత్ఫలితంగా మరోస్కూలికి మారవలసివచ్చింది.

హైస్కూల్లో ఆయన స్నేహితులు తుమ్మల వెంకట్రామయ్యగారు చెప్పిన ఒక ఉదంతం ఇంటిపేరువిషయంలో. అప్పట్లో ఆయనపేరు “గవిని వెంకటకృష్ణయ్య”గా నమోదు అయిందిట. కానీ కృష్ణరావుగారు తమకి గల శబ్దార్థ అన్వేషణ కారణంగా తమఇంటిపేరు గవను అని మార్చుకున్నారు. వెంకట్రామయ్యగారు వివరాలు గుర్తు లేవు గానీ, పరీక్షించి చూస్తే, “గవఁక” అంటే దుర్గమపురద్వారమనీ, తరవాత గవను, గవని రూపాంతరాలనీ, కృష్ణరావుగారు గవను అన్నపదమే చాలాకాలం వాడేరనీ రాసేరు. ప్రస్తుతం మాత్రం గవిని అనే వాడుకలో ఉన్నట్టుంది.

ఆరోజుల్లోనే ఒకసారి, పరీక్షల్లో ప్రశ్నలకి సమాధానాలు రాయకుండా, చిన్నయసూరి వ్యాకరణసూత్రాలు ఆధారంగా ఆ ప్రశ్నల్లో వ్యాకరణదోషాలు ఎత్తి చూపుతూ నింపేరుట కాయితాలు. ఆరోజుల్లోనే పెళ్ళిళ్ళలో వధూవరులని ఆశీర్వదిస్తూ పంచరత్నాలు చెప్పమని కోరేవారుట ఊళ్ళోవారు ఆయన్ని. (పు. 112).

కాలేజీలో రోజుల్లో అష్టావధానం, శతావధానం చేసేరుట.ఈ శతావధానానికి అడవిలో చెట్లు పృచ్ఛకులుగా ఊహించుకుంటూ ప్రశ్నలు తనే వేసుకుని, సమాధానాలు చెప్పుకుంటూ ప్రాక్టీసు చేసేరని తుమ్మల వెంకట్రామయ్యగారు రాసేరు. వరూధిని అన్న ఖండకావ్యం కూడా కాలేజీరోజుల్లో రాసిందే. “అయితే వీటివల్ల అలవడిన జల్లినేత వదిలించుకోడానికి చాలాకాలం పట్టింది,” అంటారు కృష్ణరావుగారు.

డిగ్రీకాలేజీలో ఉండగానే ప్రముఖ రచయిత గోపీచంద్‌తో పరిచయమేర్పడింది. పాశ్చాత్యసాహిత్యాభిలాష, ఆధునిక సాహిత్యరీతులు అతనివల్లనే అలవడ్డాయి. యం.యన్. రాయ్ రచనలూ, మార్క్సిజం అధ్యయనంతో ఆయన దృష్టి మారింది. వ్యావహారికభాషావాదం సముచితమని గ్రహించేరు. ప్రాచీనమార్గానుయాయులతోపాటు, ఆధునికులు చక్రపాణి, కొడవటిగంటి వంటి రచయితలతో ఏ మందులషాపులోనో కలుసుకుని విమర్శలు, కథాలక్షణాలు చర్చించేవారు.

డిగ్రీచదువు ముగిసినతరవాత ఉద్యోగంకోసం ప్రయత్నించేరు కానీ దొరకలేదు. కాశీఖండంలో వ్యాసుడిపాత్ర మనసులోకి వచ్చిందిట. ఆ సాక్షాత్కారఫలితమే భిక్షాపాత్ర నాటిక. “అనుభూతితప్తకటాహంలోనుంచి వెలువడిన నా మొదటి రచన” అంటారు కృష్ణరావుగారు. పత్రికలకి పంపేరు కానీ అది ఏసంపాదకుడికీ రుచించినట్లు లేదుట. కానీ, తరవాతికాలంలో ఆ నాటిక విశేష ఆదరణ పొందింది.

ఆంధ్రాయూనివర్సిటీ రిజిష్ట్రారు కూర్మా వేణుగోపాలస్వామిగారు గొప్ప నాటకాభిమానులు. ఆయన ఆధ్వర్యంలోనే ఆంధ్రా యూనివర్సిటీలో experimental theater వెలిసింది. లండన్ నించి షేక్స్పియర్ నాటకసంఘంవంటి ప్రముఖ నాటకసంస్థలు వచ్చి ఆ థియేటర్లో ప్రదర్శనలిచ్చేవారు. కృష్ణరావుగారి బిక్షాపాత్ర నాటకం ఆ థియేటర్లో అనేకసార్లు ప్రదర్శించారనీ, తాను ఎన్నోసార్లు  చదివేననీ వేణుగోపాలస్వామిగారు రాసేరు. అనేకభాషల్లో ఈనాటకానికి అనువాదాలు కూడా వచ్చేయిట.

కృష్ణరావుగారు ఉద్యోగం లేక, పైచదువులకి కాశీ వెళ్ళి ట్యూషన్లు చెప్పుకుంటూ యం.ఏ. ఆంగ్లసాహిత్యాధ్యయనం చేసేరు. అక్కడ ఇంగ్లీషు లిటరేచరు, లిటరరీ క్రిటిసిజం, పాలిటిక్స్ చదువుకున్నారు. ఆ అధ్యయనఫలితమే కావ్యజగత్తు అన్న పుస్తకం. “భరతునినుంచి పండితరాయలదాక, ప్లేటోనించి మార్క్స్ దాక ఉన్న మహామనీషులసూక్తులను ప్రామాణికంగా ఉదహరించి కావ్యవస్తువు రూపం ఎలా పరిణామం పొందుతుందో, మార్క్సిస్టు దృక్పథంతో వివరించాను,” అని చెప్పుకున్నారాయన ఆగ్రంథంగురించి. “ఆధునిక సాహిత్య ఉద్యమాలను, వాటికి మూలమైన సామాజిక స్థితిగతులను, ఉద్యమకర్తల రచనలు, వీటి గుణగణాలను దానిలో పరామర్శించాను,” అని వివరించేరు. (పు. 344).

రెండవప్రపంచయుద్దం ముగిసేక, radical democratic party ఏర్పాటు చేసిన రాజకీయ మహాసభకి హాజరయేరు. అక్కడ యం.యన్. రాయ్ ఆనాడు అమలులో ఉన్న రాజకీయ పక్షాలని నిశితంగా విమర్శిస్తూ, పక్షరహిత ప్రజాస్వామ్యంతో కూడిన నవ్యమానవతావాదాన్ని ప్రతిపాదించేరు. ఆ ఉపన్యాసం కృష్ణరావుగారిని దిగ్భ్రాంతులని చేసి, భవిష్యత్ జీవితానికీ, సాహిత్యహేలకి మార్గం నిర్దేశించింది. అదే ఆయన తత్వశాస్త్రాధ్యాయనానికి నాంది. ఆతరవాత కళాపూర్ణోదయంమీద పరిశోధన చేసి పి.హచ్.డి పొందేరు.

కృష్ణరావుగారిజీవితం శబ్దార్థవిచారణనించీ జీవితార్థవిచారణవరకూ ఆసాంతం అంతులేని జిజ్ఞాసగా కనిపిస్తుంది ఆయన రచనలు చూస్తే. కీలుబొమ్మలు నవలకి కూడా అదే ప్రాతిపదిక అంటారాయన. ”స్వాతంత్ర్యమంటే ఏమిటి? మానవుడు దానిని ఎలా కోల్పోతున్నాడు!  తిరిగి దానిని సాధించే మార్గమేమిటి? ఆర్థిక సామాజిక రాజకీయహేతువులెంతవరకు మానవజీవితాన్ని మార్చివేస్తున్నవి? వ్యక్తుల కర్తవ్యమేమిటి? ఈ జిజ్ఞాసను రేకెత్తించటమే కీలుబొమ్మలలక్ష్యం” అంటారు రచయిత (పు. 346). ఈనవలను సుఖాంతం చేసిఉంటే బాగుండేదని రాసిన పాఠకునికి ఆయన సమాధానం, “మీకోరిక చెల్లించివుంటే మీవద్దనుంచి ఈముక్కయినా నాకు లభించి ఉండేది కాదు” అనిట.

కాలేజీలో ఉండగానే నాగార్జునులగ్రంథాలను కాపీ చేసుకుని, విగ్రహవ్యావర్తిని, రత్నావళి, ఇంకా ఏడు రచనలను పద్యాలుగా అనువదించేరు. అవన్నీ దొంగలపాలు కాగా, విగ్రహవ్యావర్తిని మాత్రం తిరిగి అనువదించి విపులభూమికతో ప్రకటించేరు. కాలేజీలో పని చేస్తున్నప్పుడే ప్లేటో రిపబ్లిక్ కూడా అనువదించేరు.

1962లో మళ్ళీ కాలేజీఉద్యోగం పోయింది. అప్పుడే పాపికొండలు నవల ప్రారంభించేరు కానీ రేడియోలో ఉద్యోగం దొరకడంతో నవలారచనకి విఘాతం కలిగింది. ఆ సమయంలోనే కొన్ని పద్యరచనలు, భాసుని ప్రతిమానాటకానికి అనువాదం, ఉదబిందువులు అన్న కథానికసంపుటి ప్రచురించేరు.

ఇది రచయత తమ సాహిత్యకృషిగురించి చెప్పుకున్న విశేషాలు (నాసాహితీయాత్ర, 340-46). ఉదబిందువులు కథానికసంపుటం అంటున్నారు కానీ ప్రస్తుతం నాకు దొరికిన కాపీలో కవితలూ, నాటికలూ, రెండు వ్యాసాలూ కూడా ఉన్నాయి. ఇది బహుశా పునర్ముద్రణ కావచ్చు. ఈవిషయం తరవాత చర్చిస్తాను.

పాపికొండలు నవల పూర్తి కాకుండానే కృష్ణరావుగారు దివంగతులు కావడం తెలుగువారి దురదృష్టం.

హైందవసంప్రదాయాలూ, ప్రాచీనసాహిత్యం, పాశ్చాత్యసిద్ధాంతాలూ క్షుణ్ణంగా చదివి ఆకళించుకుని, ఆలోచించుకుని తమదైన ఒక దృక్పథం ఏర్పరుచుకుని రచనలు చేసిన మేధావి కృష్ణరావుగారు. జేగంటలు, కావ్యజగత్తు వంటిగ్రంథాలు అందుకు నిదర్శనాలు. ఆదినించీ వారికి ధర్మచింతన, తాత్త్వికచింతన అధికంగానే ఉన్నట్టు బోధపడుతుంది ఈ పుస్తకాలు చదివితే.

మనమీద పాశ్చాత్యసంస్కృతి ప్రభావంగురించి కృష్ణరావుగారి అభిప్రాయం ఏమిటింటే, “ఆధునిక శాస్త్రీయ సాంకేతికపరిజ్ఞానాలు మనకి లభించాయి. హేతువాదం చోటు చేసుకొంది. పరిశ్రమలు నెలకొని సంపద పెరిగింది. అది ఏదో విధంగా చేజిక్కించుకోవాలనే తాపత్రయమూ పెరిగింది. వస్తుగతసంస్కతి బాగా అబ్బి విలాసాలవెంట పరిగెత్తటం జరుగుతున్నది. వస్తుదాస్యంతో భావదాస్యమూ ప్రబలింది. సీతినియమాలు అడుగంటి ధర్మం, ఉదారవర్తన, రసజ్ఞత లుప్తమయిపోతున్నాయి. ఆర్థికవిలువల్ని నిర్లక్ష్యం చెయ్యరాదు. పాశ్చాత్యసంస్కృతినించి అది నేర్చుకున్నాం. కాని ఆర్థికవిలువలే అన్ని విలువలూనా? … దురదృష్టవశాత్తు ఆ పరుగుపందాలే నేడు కనిపిస్తున్నాయి. ఏమవుతున్నదీ సమాజం? ధర్మానికి పట్టం కట్టి, సత్యం, శివం, సుందరాలని దర్శింపజేసే జీవితాన్నిచ్చిన సంస్కృతిని మనం క్రమంగా మర్చిపోతున్నామా అంటే మనల్ని మనం మర్చిపోతున్నామా?” అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, కృష్ణరావుగారు ఉటంకించిన వస్తుదాస్యానికి, భావదాస్యానికి, నేను భాషదాస్యం కూడా చేరుస్తాను. ఈనాడు ఇంగ్లీషో, హిందీవో లేకుండా గట్టిగా పది  తెలుగువాక్యాలు మాటాడలేకపోతున్న తెలుగువారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.  మనసంస్కృతిగురించి మరోసారి మనం గట్టిగా ఆలోచించుకోవాలి.

చాలాకాలం నాకు కృష్ణరావు అంటే కీలుబొమ్మలు, కీలుబొమ్మలు అంటే జి.వి. కృష్ణరావు. అంతకుమించి తెలీదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్లో వెతికితే వారి ఇతర రచనలు కనిపించేయి. వీటి వివరాలు ఇవి –

సాహితిచైత్రరథం. ఇది జి.వి. కృష్ణరావు సాహితీ సమాలోచన సమితి, తెనాలి, వారు కృష్ణరావుగారి సాహిత్యకృషినీ, మూర్తిమత్వాన్నీ ఆవిష్కరించే ఉద్దేశంతో  ప్రముఖ రచయితలు, విమర్శకులు, సాహిత్యాభిమానులూ రాసిన వ్యాసాలని సమకూర్చి ప్రచురించిన సంకలనం. ఇందులో కృష్ణరావుగారు రాసిన వ్యాసాలు కూడా మూడు ఉన్నాయి.

రచయిత బాధ్యత అన్న వ్యాసంలో ఈనాటి రచనలమీద కృష్ణరావుగారి వ్యాఖ్యానం, “ఈ పంచేంద్రియాలకు గోచరమవుతున్న లోకాన్ని దర్శించలేక, మనరచయితలు ఎప్పుడో ప్రర్తిల్లులోకాలను సంస్మరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటి మన ఈ లోకాన్ని దర్శిస్తున్నా అవగతం చేసుకోలేకపోతున్నారు. అవగతం చేసుకొన్నా స్వార్థప్రాకారంలోపల నాలుగు కంబాలాట ఆడుతున్నారే కాని ఈ లోకంకోసం స్పందించలేకపోతున్నారు. ఇప్పటి మన యీ లోకాన్ని అవలోకించి అవగతం చేసుకుని దీనికోసమే ఆవేదన పొంది నివేదింపగలిగినప్పుడే రచయిత కవి ఔతున్నాడు. కానినాడు కవి యశఃప్రార్థి అవుతున్నాడు.” (సాహితీచైత్రరథం, పు. 89.)

జేగంటలు. ప్లేటో దార్శనికసిద్ధాంతానికి తెలుగుసేత. ఇది అనువాదం అన్నారు కానీ ప్లేటో రచనలు కొన్ని తీసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, నిశితంగా పరిశీలించి తమదైన అవగాహనతో తెలుగులో అభివ్యక్తం చేసినట్టుంది ఈ పుస్తకం. ఇటువంటివిషయాల్లో నాకు అవగాహన బొత్తిగా లేదు. చదవడానికి ప్రయత్నించేను కానీ అర్థమయిందని చెప్పలేను. అంచేత నేను ఇక్కడ చర్చించబోవడంలేదు. ఈవిషయాల్లో ఆసక్తీ, అభిరుచీ గలవారు తప్పక చదువుతారని ఆశిస్తాను.

కావ్యజగత్తు వ్యాసంలో అలంకారశాస్త్రానికి సంబంధించిన విపులచర్చ ఉంది.

ఉదబిందువులు – కవితలు, కథలు, నాటికలతోపాటు రెండు వ్యాసాలు కూడా ఉన్నాయి. ఈసంకలనంలోనే ఆయన రాసిన తొలినాటిక, భిక్షాపాత్ర కూడా ఉంది. ఇది తాను కాశీలో యం.యే. అయినతరవాత ఉద్యోగం దొరక్క అవస్థలు పడుతున్న రోజుల్లో రాసిన నాటకం అని చెప్పుకున్నారు రచయిత. అయితే సహృదయుడయిన రచయిత ఎప్పుడూ కూడా తనబాధని కేవలం తనబాధగానే అక్షరగతం చెయ్యడు. దానికి విశ్వజనీనత కల్పించినప్పుడే అది రాణిస్తుంది. కృష్ణరావుగారు ఈనాటకంలో అది సాధించేరు.

నేను చాలాకాలంగా కృష్ణరావుగారి కీలుబొమ్మలు నవలకోసం వెతుకుతున్నానని చెప్పేను కదా. కృష్ణరావుగారి అమ్మాయి డా. ఉమాదేవిగారి ధర్మాన ఈ నవల ఇప్పటికి నాచేతికొచ్చింది.

నలభై, యాభై దశకాల్లో స్వాతంత్రసమరం, స్వాతంత్రేచ్ఛ ప్రబలంగా ఉన్న రోజులు కనక ఆనాడు వచ్చిన నవలల్లో చాలా భాగం జాతీయస్ఫూర్తికే ప్రాధాన్యం. అందుకు భిన్నంగా వచ్చిన నవలల్లో మనోవిశ్లేషణ నవలగా ప్రసిద్ధి పొందిన నవల బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది. జి.వి. కృష్ణరావుగారి నవల కీలుబొమ్మలు కూడా అదే కోవలోకి వస్తుందని నాఅభిప్రాయం. అయితే చివరకు మిగిలేది నవలకి వచ్చిన ప్రాచుర్యం కీలుబొమ్మలుకి రాకపోవడం బహుశా ఇది కాంతాసమ్మతం కాకపోవడం కావచ్చు. నామటుకు నాకు చివరకు మిగిలేది కంటే కీలుబొమ్మలు ఎక్కువ నచ్చింది. కారణం చెప్తాను.

చివరకు మిగిలేది నవలలో దయానిధి పాత్రచుట్టూ నడుస్తుంది మొత్తం కథ. తనగురించి, ఇతరపాత్రలగురించీ దయానిధి అభిప్రాయాలే పాఠకుడికి తెలుస్తాయి, దయానిధికోణం తప్పిస్తే ఆపాత్రలకి అస్తిత్వం లేదు.

అందుకు భిన్నంగా, కీలుబొమ్మలు నవలలో రచయిత ప్రతిపాత్రఆలోచనలు పాఠకులకి తెలుస్తాయి. ఏపాత్రకి ఆపాత్ర విడిగా తానుగా పాఠకుడికి దర్శనమిస్తుంది. ఏపాత్ర ఎలా ఆలోచిస్తోందో తెలియడంమూలంగా పాఠకుడు తనకు తానై ఆ పాత్రగురించి ఆలోచించుకోడానికీ, అబిప్రాయాలు ఏర్పరుచుకోడానికి అవకాశం కల్పించేరు రచయిత.

సాధారణంగా కీలుబొమ్మలు అనగానే మనకి స్ఫురించేది మానవుడు విదిచేతిలో కీలుబొమ్మలు అన్నది. మరొకరెవరో తాళ్లు పుచ్చుకు మనని ఆడుస్తున్నారని. కృష్ణరావుగారు తాము ఈనవల ఆ దృష్టితో రాయలేదని స్పష్టం చేసేరు ముందుమాటలో. మానవతావాదం స్ఫూర్తితో మానవుడు తనకి తాను ఆలోచించుకుని, ధర్మనిర్ణయం చేసుకోవాలని రచయిత ఆశయం. ఒక క్లిష్టసమస్య సంక్రమించినప్పుడు, మనం ఎలా ఆలోచిస్తాం, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటాం అంటే నూటికి తొంభై వంతులు ధర్మం మరిచి, తాత్కాలికమైన సౌకర్యాన్నే ఆశ్రయిస్తాం.

పుల్లయ్య భార్యకి చెప్పకుండా చంద్రశేఖరంతరఫున అప్పుపత్రంమీద పూచీ సంతకం పెట్టేడు. అప్పు తీర్చవలసినసమయం వచ్చేవేళకి శేఖరందగ్గర డబ్బు లేదు. పుల్లయ్య తీర్చాలి న్యాయానికి. కానీ ఆ అప్పు తీరిస్తే, తాను పూచీ పడ్డట్టు భార్య లక్ష్మమ్మకి తెలుస్తుంది. అది ఆయనకి ఇష్టంలేదు. కథలో ఇదీ కీలకసమస్య. ఊళ్లో అందరూ తలో విధంగా అనుకుంటారు. కూతురు నిలదీసి అడిగినప్పుడు, పుల్లయ్య కేవలం జవాబు చెప్పకపోవడంద్వారా, ఆమె అనుకున్నమాట తండ్రి పూచీ పడలేదు అన్న వాదనే స్థిరం చేస్తాడు. ఆ తరవాత అదే సత్యమని పుల్లయ్య తనని తాను నమ్మించేసుకున్న తీరు చూస్తే, మనకి ఆశ్చర్యం వేస్తుంది. పుల్లయ్య ధర్మాధర్మవిచక్షణ మరిచిపోయేడు. అజ్ఞానంతో కాదు, సంపూర్ణంగా తానేం చేస్తున్నాడో తెలిసి, ఆ స్పృహతోనే. రచయిత ఎత్తి చూపుతున్నది అదే. ధర్మాధర్మవిచక్షణ – ఎవరికి వారు చేసుకోవాలి. ఎవరికి వారు ధర్మం ఆచరించాలి. అది ఒకరు మరొకరికి సాధించిపెట్టేది కాదు.

ఇక్కడే మరొక కోణం కూడా ప్రస్తావిస్తాను ఈనాటి భావజాలం ప్రాతిపదికగా. పుల్లయ్య భార్యమాటకి ఇచ్చిన విలువ. సంపాదన ఆయన వంతు. సంసారం నడపడం, డబ్బు సంబాళించుకోడం ఆమె వంతు. తను చేసిన పని ఆమె అంగీకరించదన్న అభిప్రాయంతో ఆవిడకి చెప్పకుండా చంద్రశేఖరానికి అడ్డు ఉండడానికి ఒప్పుకున్నాడు. ఆసమయంలో తాను ఆ డబ్బు ఇవ్వవలసిన అవసరం రాదనే అనుకుని ఉంటాడు. అయితే, పుల్లయ్య భార్యతో చెప్పడానికి ఎందుకు భయపడ్డాడు అంటే అదే మనసంస్కృతిలో ప్రత్యేకత. భార్యాభర్తలు  పరస్పరం ఒకరినొకరు గౌరవించుకునే తీరు. ఆనాడు దంపతులు ఆచరించే నియమనిష్ఠలు వాచ్యం చెయ్యకుండా చూపించడం జరిగిందిక్కడ.

కీలుబొమ్మలు నవలమీద ఆర్.యస్. సుదర్శనంగారు సాధికారకంగా చేసిన విమర్శ  సాహితిచైత్రరథంలో ఉంది. ఆయనవ్యాసంలో ఒక అంశం – వాసుదేవశాస్త్రిపాత్ర – నాకు అంతగా పట్టుబడలేదు.

సుదర్శనంగారి వ్యాఖ్య – “కృష్ణరావుగారు ధర్మాచరణవిషయంలో వ్యక్తికీ, అతని అంతఃకరణకూ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. పుల్లయ్య ధర్మాన్ని విస్మరించడంలోనూ డా. వాసుదేవశాస్త్రి ధర్మచ్యుతిలోనూ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన అవచేతన ప్రమేయం చాలా ఉంది” అంటూ పుల్లయ్య తనధర్మాన్ని పిరికితనంతోనూ స్వార్థంతోనూ ధర్మనిర్వహణ చేయలేదనీ, వాసుదేవశాస్త్రి జరిగిన పొరపాటుకు బాధ్యత వహించి సామాజికంగా దాన్ని సవరించడానికి సిద్ధపడతాడనీ అంటున్నారు. నాకు వాసుదేవశాస్త్రి సూచించిన పరిష్కారం ధర్మసమ్మతంగా తోచడంలేదు.

సన్నివేశం ఏమిటంటే, వాసుదేవశాస్త్రి మగతనిద్రలో ఉండగా పద్మ తనకు తానై వచ్చి ఆయనతో సంభోగం జరిపింది. వాసుదేవశాస్త్రి అది కల అనుకుంటాడు.  మళ్ళీ పద్మే వచ్చి తాను గర్భవతిననీ, ఆ బిడ్డ శాస్త్రిబిఢ్డ అనీ చెప్పేవరకూ అది కల అనే ఆయన నమ్మకం. ఆతరవాత ఆయన చాలా ఆలోచించి చేసిన నిర్ణయం పద్మభర్త సత్యనారాయణకి చెప్పకుండా తనతో లేచిపొమ్మని. పద్మ దానికి అంగీకరించకపోవడం ఆమె చేసిన నేరం. ఆమె పిరికితనాన్ని గర్హిస్తూ శాస్త్రి “ఆమెని బయటికి నెట్టివేసి దభేలును తలుపు వేసుకున్నాడు”. ఇక్కడే నాకు శాస్త్రిధర్మాచరణ సబబుగా కనిపించడంలేదు. జరిగిన అధర్మంలో సత్యనారాయణకి పాలు లేకపోయినా, పద్మభర్తగా అతనికొక స్థానం ఉంది. జరిగిన తప్పు దిద్దుకోడానికి ఏ పరిష్కారం ఆలోచించినా, అందులో సత్యనారాయణకి కూడా పాలు ఉండాలి. ముగ్గురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కదా ధర్మయుతమైన పరిష్కారం. (సాహితిచైత్రరథం. పు. 92).

సుదర్శనంగారు రచయిత శాస్త్రిమాటలలో తన అభిప్రాయాలని వ్యక్తం చేసేరంటున్నారు కానీ శాస్త్రి కూడా పిరికితనం ప్రదర్శించడంద్వారా కేవలం పాత్రగానే మనం తీసుకోవాలని నాఅభిప్రాయం. రచయిత ఇతరపాత్రలద్వారా కూడా తనఅభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్బాలున్నాయి.

రచయిత మున్నుడిలో “వ్యక్తులను గాని, పార్టీలను గాని, వస్తున్న ఎన్నికలను గాని ఉద్దేశించి దీనిని (ఈనవలని) రాయలేదు. … ఈ రచనకు కళానుభూతే ప్రధానం. పార్టీ ఆవేశాలను సాధ్యమైనంతవరకు మరచి చిదవినప్పుడే ఈ అనుభూతి ఇందులో సాధ్యం.” అంటారు.

ఆయన సత్యాన్వేషి. తత్వానుసంధాత. ఇంత విస్తృతమైన ధార్మికచింతనతో తదేకనిష్ఠతో సాహిత్యకృషి చేసిన మేధావి కృష్ణరావుగారు బహుశా తెలుగువాడుగా కాక ఏ పొరుగుదేశంలోనో పుట్టి ఉంటే, ఆయన ఇంగ్లీషులోనో హిందీలోనో రచనలు చేసి ఉంటే విపులఖ్యాతి గడించి ఉండేవారేమో. ఆయనకాలంలో ఎందరో ప్రముఖకవుల, రచయితల, సాహిత్యాబిమానుల మన్ననలు పొందిన కృష్ణరావుగారిగురించి ఈనాటి పాఠకులు చాలామందికి తెలీదంటే, ఆయనపేరు కూడా వినిలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ  ఆయనే చెప్పినట్టు ఆయన “యశఃప్రార్థి” కారు!

అంతర్జాలంలో కృష్ణరావుగారిరచనలూ, రచనలమీద విశ్లేషణలు నాకు దొరికిన కొన్ని వ్యాసాల, పుస్తకాలవివరాలు –

1. సాహితీచైత్రరథం, జేగంటలు ఆర్కైవ్.ఆర్గ్ లో

http://archive.org/search.php?query=creator%3A%22G.V.+Krishna+Rao%22

2. తెలుపు.కాంలో కృష్ణరావుగారి రచనలన్నీ దొరుకుతాయి అని ఉంది కానీ నాకు వివరాలు తెలీవు.

http://www.telupu.com/booklistGVK.html  (distributors)

3. సి.పి.బ్రౌన్ ఎకాడమీవారి సైటులో కృష్ణరావుగారి కథ చేసుకున్న కర్మ Performed karma అన్న శీర్షికతో ప్రచురించేరు. http://www.cpbrownacademy.org/chesukunna_karma.asp

4. DLI వారి సైటులో కీలు బొమ్మలు కూడా దొరుకుతుందని నాకిప్పుడే తెలిసింది. ఎటొచ్చీ మనకి వారి స్పెల్లింగులు తెలియాలి – రచయితపేరు – ji vi krxshhnd-araavu. పుస్తకంపేరు – kiilubommalu. బార్ కోడ్ – 2990100061623.

000

కృతజ్ఞతలు: డా. కానూరి ఉమాదేవిగారికి, అడిగిన వెంటనే తాత్సారం చెయ్యకుండా కీలుబొమ్మలు పుస్తకం  పంపినందుకు, ఆమెవివరాలు అందించిన డా. ఇన్నయ్యగారికీ, డా. జంపాల చౌదరిగారికీ.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “కీలుబొమ్మలుకి ప్రాణం పోసిన మానకలశుడు జి.వి. కృష్ణరావు”

 1. మాలతి గారు
  వ్యాసం చదివాను .కృష్ణారావు గారితో సన్నిహితం గుర్తు చేసారు .ఇంచు మించు మీరు రాసినవన్నీ బాగావున్నాయి .నాకు నచ్చాయి .
  ఒకటి రెండు మాటలు .1938 లోనే రాయిజం అనే వ్యాసం మహతి మాస పత్రికలో రాసారు .దేవరకొండ వెంకట సుబ్బయ్య తెనాలి నుండి కొన్నేళ్ళు అది నడిపారు .రాయ్ కాంగ్రెస్ రాజకీయం లో ప్రవేశించి సందర్భం గా ఆ వ్యాసం విపులంగా రాసారు.
  గోపీచంద్ ప్రభావం కంటే ,ఎలవర్తి రోశయ్య, ఆవుల గోపాల క్రి ష్ణ మూర్తి ,గూడవల్లి రామబ్రహ్మం ప్రభావం ,గుత్తికొండ నరహరి, కోగంటి రాధా క్రి ష్ణ మూర్తి ,ప్రభావం వున్నది.
  ౧౯౪౧ నాటికే రాడికల్ డెమోక్రటిక్ పార్టి రాగా ఆయన అందులో వుంది, రాయ్ రచన తెలుగులో వర్గ సంబంధాలు గా ప్రచురించారు .
  =======================
  మిగిలిన విషయాలు అన్ని బాగా వున్నవి.
  కళాపూర్ణోదయం పై సిద్దాంత రచన ఇంగ్లిష్ లో రాగా నేను తెలుగులోకి చేసి 1962 లో గోలకొండ పత్రిక లో సీరియల్ గా ప్రచురించాను .
  మీకు అభినందనలు .
  ఇన్నయ్య
  బ్లాగు http://innaiahn.tripod.com

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s