మార్పు 39

“దివాలామొహం వేసుక్కూచున్నావు. ఏంటి కథ? ఎక్కడ కొంపలు ములిగేయి?” అంది సిరి నావేపు గుచ్చి గుచ్చి చూస్తూ.

కళ్ళు చిట్లించి, కనుబొమ్మలు ముడిచి దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాన్నేను. ఈమధ్య ఊళ్ళోనూ, ఇంట్లోనూ జరిగిన రభసల్తో విసుగెత్తి పోయి ఉన్నాను.

మేం ఇద్దరం మాటాడుకుని చాలాకాలం అయింది. ఏం చేస్తున్నానో చూద్దాం అని వచ్చింది సిరి.

“కొంపలు ములగలేదు. నాకు జీవితం నిరర్థకం అనిపిస్తోంది.”

“అదేంటలా అంటావు. నువ్వింకా చెయ్యాల్సినవి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడే మంగళం పాడేయకు.”

“నేను పాడక్కర్లేదు. అదే పాడేసుకుంటోంది.”

“అదంటే?”

“నాజీవితం.”

“ఏమైంది?”

“శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి అనుభవాలూ, జ్ఞాపకాలు చదివింతరవాత నామీద నాకే చాలా కోపంగా ఉంది.”

“ఇది మరీ బాగుంది. ఆయనేం చేసేరు మధ్యన?”

“ఆయన చూడు, ఆ అనుభవాలు రాయడం మొదలు పెట్టినప్పుడు ఆయనకి యాభైలు దాటి అరవైలు దగ్గర పడుతున్నట్టుంది. ఆరూ, ఏడేళ్ళప్పుడు ఏం జరిగిందో ఆయనకి అంత వివరంగా గుర్తుందంటే నాకు మతి పోతోంది.”

“నీకూ ఆయనకీ పోలికేమిటి?”

“పోలిక లేదులే,” అన్నాను. అవును, నన్నాయనతో పోల్చుకోడమేమిటి? ఎవరైనా వింటే నవ్విపోగల్రు. హుమ్. పోలికలేమీలేవు. కానీ ఆ పుస్తకం చదువుతుంటే రాస్తే అలా రాయాలి అనిపించి, నాచేతకానితనంమీద నాకు కోపం వస్తోంది.

కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆందులో నాకు చాలా చాలా నచ్చినవవిషయం – ఆకాలంలో విద్యయందు శాస్త్రిగారికీ, వారి తండ్రీ, అన్నలకీ గల నిష్ఠ, శ్రద్ధ ఎంతో గొప్పగా ఉన్నాయి. చదువు అంటే పుస్తకాలకి పుస్తకాలు చదివేసుకుంటూ పోడం, వాటిలో నాలుగో పదో ముక్కలు ముక్కున కరుచుకు, అవసరం ఉన్నా లేకున్నా ఒప్పచెప్పడం కాదు. ఆ విద్యార్థిదశ – అదొక జీవనసరళి. శిష్యలకి గురువులంటే, గురుపత్ని అంటే అపారమైన భక్తిగౌరవాలు. గురువులకి శిష్యులంటే ఆదరాభిమానాలు. అలాగే ఇంట్లో కూడా తోబుట్టువులని గారు అంటూ గౌరవవాచకం వాడేరు. నాకు ఆలోచిస్తున్నకొద్దీ విచారం ముంచుకొస్తోంది. ఆరోజులు మళ్ళీ రావని కాదు. ఆ విలువలు ఏమైపోయేయని. రెండోది, నాకు నాచిన్నప్పటి విశేషాలు గుర్తు లేవు. ఈయనకెలా గుర్తున్నాయి అంత విపులంగా అని. అదీ నాకోపం!

“అలా ఎందుకనుకుంటావు? ఎవరి రాతలు వారివే. నువ్వసలెందుకు రాస్తున్నావు?”

మళ్ళీ ఆలోచనలో పడ్డాను. ఎందుకు రాస్తున్నాను? ఇంతలో మరో ఆలోచన వచ్చింది. అనుభవాలూ, జ్ఞాపకాలూ చదువుతుంటే సమాజంలో వచ్చిన మార్పే కాక ఆయనలో క్రమంగా వచ్చినమార్పు కూడా ఆనాటి చరిత్ర చెప్తోందనిపించింది.

“ఎలా అంటావు?”

నేను జవాబు చెప్పబోతుంటే గడపదగ్గర కలకలం వినిపించింది. సుందరం వచ్చేడు.

“ఏంటి మీరు, నా కోణం సరిగ్గా చెప్పకుండానే ముగించేస్తానంటారు? అది second degree manslaughter,” అన్నాడతను నావేపు పొడిచేసేలా చూస్తూ.

నేను తెల్లబోయేను. తేరుకుని, “హా, హా, చంపడాలదాకా తీసుకెళ్ళిపోయేరేంటండీ. అది ఒఠ్ఠి కథే కదా,” అన్నాను. ఇంతా చేస్తే అతను కథలో ఓ పాత్రే కదా, కాయితప్పులిలా అనుకుంటూ.

“కథా గిథా, మాపాత్రలు మీరు పుట్టించేరు. పుట్టించింతరవాత మేం కూడ జీవులమే మా ప్రపంచంలో.  మాపాత్రలు మీరు పూర్తిగా ఆవిష్కరించకుండా ముగించేయడం అన్యాయం, అక్రమం. కొండొకచో దౌర్జన్యం కూడాను,” అన్నాడు సుందరం ఎదురుగా ఉన్న సోఫాలో సుఖాసీనుడై.

“అవును. ఆయన చెప్పిందే సబబు,” అంది సిరి అతనిపక్షమే తీసుకుని.

నేను తగ్గేను. “అది కాదండీ. నాకు మీలాటివారితో పరిచయం లేకపోవడంచేత మీవ్యక్తిత్వం నిర్దుష్టంగా చిత్రించడానికి కావలసిన సరంజామా నాదగ్గర లేదు మరి. పోనీ, మీరే చెప్పేయండి మీతత్వం ఏమిటో. అలా రాసేస్తాను,” అన్నాను వినయంగా.

“వ్యాసుడు గణపతిచేత రాయించినట్టు మీచేత రాయించనా? ఖర్మ, నాపాత్ర నేనే చెప్పుకోడం?” అన్నాడు సుందరం శాంతించి.

“రచయితకి తెలీనప్పుడు పాత్రలే చెప్పాలి మరి.”

సుందరం సోఫాలో సర్దుకుని కూర్చుని, సిగరెట్టు వెలిగించబోతూ, సిరివేపు చూసేడు ఫరవాలేదు కదా అన్నట్టు.

సిరి సరేనన్నట్టు తలూపి, “కానీండి, పొగ లేక బండి నడవదంటే,” అంది నవ్వుతూ.

సుందరం సిగరెట్టు ముట్టించి, పెడమొహంగా పొగ అవతలివేపుకి ఊది, మొదలు పెట్టేడు, “అసలు మీకు నేనర్థం అవాలంటే మీకు మొత్తం మానవాళి చరిత్ర తెలియాలి.”

నాకు గుండెలు గుభేలుమన్నాయి. “మీరిప్పుడు మానవజాతి చరిత్ర సమస్తం క్లాసు పెడతారా?”

“లేదులెండి. మీలాగే నాకూ అవతల రాచకార్యాలున్నాయి కదా. వీలయినంత పొడిపొడిగా నాలుగు ముక్కల్లో చెప్పేస్తాను. ఓ నాలుగో అయిదో యుగాలవెనకనుంచీ 1950 వరకూ.”

నేను కూడా సర్దుకు కూర్చున్నాను.

“అసలు మొట్టమొదట మనం గ్రహించవలసింది All men are created equal అన్నది అర్థరహితం అని.”

“అంతవరకూ నేనూ ఒప్పుకుంటాను. మీరు చూడండి ఆరడుగుల మూడంగుళాలు. నేనేమో అయిదడుగులకి అరంగుళం తక్కువ.”

“హాహ్హహా, మీరు చాలా హాస్యంగా మాటాడతారు. దానికేం గానీ, నేనంటున్నది బౌద్ధికంగానూ, మానసికంగానూ మాత్రమే కాక శారీరకంగా, అంటే ఒడ్డూ పొడుగూ మాత్రమే కాదు – మెదడూ, మెదళ్ళో నరాలూ, నరాలు ప్రసారం చేసే మనోవికారాలూ – ఇవన్నీ స్త్రీపురుషులకి వేరువేరుగా ఉంటాయని వైద్య శాస్త్రం నిరూపించింది కదా.”

“కదా అనకండి. నాకు తెలీదు. మీరేం చెప్తే అదే.”

“నేనే కాదు చాలామంది శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి సాధికారకంగా నిరూపించేరు. బౌద్ధులకాలంలోనూ, ఇంకా అంతకుముందూ, తరవాత శాతవాహనులకాలంలోనూ కూడా స్త్రీలకి మెచ్చుకోదగ్గ ప్రతిపత్తి ఉండేది. మీకు తెలుసో, తెలీదో వేదకాలంనించీ స్త్రీలలో చదువుకున్నవారున్నారు. చదువే కాదు. ఆర్థికంగా కూడా వారికి మంచి స్థాయి ఉంది సమాజంలో. శాతవాహనులకాలంలో స్త్రీలు, రాజవంశంలోనే కాదు సామాన్యులు కూడా దానధర్మాలు చేసేరు. సత్రాలు కట్టించేరు అంటే వారికి ఇంటా బయటా కూడా చెప్పుకోదగ్గ పరపతి ఉండబట్టే కదా.”

“మీరు అందరూ సమానం కాదంటూ మొదలు పెట్టి అందరూ సమానులే అనో కొందరు కొంచెం ఎక్కువ సమానులనో ప్రతిపాదిస్తున్నట్టుంది,” అన్నాను.

“ఉండండి వస్తున్నానక్కడికే. అసలు నాకు సుందరం అన్నపేరెలా వచ్చిందో తెలుసా?”

“ఎలా వచ్చింది?”

“మా అమ్మమ్మపేరు సౌందర్యవల్లి. ఆవిడపేరు నాకు పెట్టేరు. అసలు ఇది వేదకాలంనుంచీ ఉంది. కర్ణుడు కౌంతేయుడు. సుమిత్ర తనయుడు సౌమిత్రి. గౌతమీపుత్రశాతకర్ణి కూడా అంతే.”

“ఆహా, బాగుంది.”

“ఇంతకీ నేను చెప్పేది మన సంస్కృతీసాంప్రదాయాలంటే నాకు మాచెడ్డ గౌరవం. ఇక్కడ చూడండి అమెరికా కంటే నాగరిక దేశం లేదనీ, అసలు నాగరికత అంటే అమెరికావారిదగ్గర్నుంచే నేర్చుకోవాలనీ అంటారు. వాళ్ళు అలా అనుకోడంలో తప్పులేదు. మనదేశం అంటే మనకీ అంతే. ఆర్యావర్తభూములలో పుణ్యభూమి ఇదీ అన్నాడు వ్యాసభగవానుడు. మన సంస్కృతి మనకి ఎంత గొప్పదంటే మనం వీళ్ళని అప్రాచ్యులు అంటాం. మీకు జ్ఞాపకం ఉందా లండను వెళ్ళి వచ్చినవాళ్ళని ప్రాయశ్చత్తం చేయించి తప్ప ఇంట్లోకి రానిచ్చేవారు కారు. మీరు The Moral and Intellectual Diversity of Races With Particular Reference to Their Respective Influence in the Civil and Political History of Mankind అన్న పుస్తకం చదివేరా? Arthur, T. S. (Timothy Shay), Gobineau, comte de రాసింది నూటయాభై ఏళ్ళక్రితం. అందులో మానవజాతి చరిత్రగురించి సిద్దాంతీకరించిన విషయాలు ఇప్పటికీ ఆదరణీయమే.”

“లేదు, నేను చూడలేదు. ఏమంటారేమిటి?”

“ఆ చర్చ మరోసారి చేస్తాను. ప్రధానంగా ఆయన చెప్పేది ఆర్యసంస్కృతి speculative, చైనావారిది utilitarian. యూరోపియనులది ఈ రెంటి మిశ్రమం అని. అంటే మనం ఆర్యసంస్కృతికి చెందినవారం – మనకొక ప్రత్యేకమైన ధర్మం, తత్త్వం ఉంది. H. G. Wells Mankind in the making చూసేరా?”

“లేదు.”

“పోనీ భారతం, రామాయణం, … ఏమైనా చదివేరా?”

“లేదు, లేదు, మహాప్రభో. నేనేం చదవలేదు. నాకేం తెలీదు అన్నమాట ప్రాతిపదికగా మీరు చెప్పదలుచుకున్నది కానివ్వండి. కొంచెం fast forward చెయ్యండి,” అన్నాన్నేను.

“అదే చెప్తున్నా. మనసంప్రదాయంలో గార్హ్యస్థధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది. అది వైయక్తికమే కాదు, సామాజికధర్మం గూడా. అక్కడ గృహస్థు అంటే భర్త ఒక్కడే కాడు. భార్యకి కూడా అందులో పాలుంది. ఇద్దరూ తమతమ ధర్మాలని పాటించాలి. పాటిస్తేనే సమాజశ్రేయస్సు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈవిషయం మీక్కూడా బోదపడుతుంది. మనయిళ్ళలో స్త్రీలు ఎంతో భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తూనే తమ పనులు సాధించుకుంటారు. రామాయణంలో సీత చూడండి. రాముడు అగ్నిప్రవేశం చెయ్యమంటే నేను చెయ్యను అన్లేదు. అగ్నిప్రవేశం చేసి, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. రాముడు సంతుష్టుడే, సరే పద రాజధానికి పోదాం అన్నప్పుడు మాత్రం, నేను రాను, నాపాత్ర ముగిసింది అంటూ భూదేవిలో కలిసిపోయింది. భారతంలో ధర్మరాజు జూదంలో ఓడిపోయినతరవాత, సైంధవుడు ద్రౌపదిని సభలోకి తీసుకురావడానికి వెళ్తే, ‘నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?’ అన్న ధర్మసందేహం వెలిబుచ్చింది కానీ పంచపాండవులతో అడవులకి వెళ్ళడానికి వెనుదీయలేదు. అచ్చమాంబగారు ఆనాటి సమాజనీతిననుసరించి ఘోషా పాటిస్తూనే సామాజసేవ చేసేరు. అంటే మనస్త్రీలు మొదట్నుంచీ సమాజం విధించిన నిబంధనలు పాటిస్తూనే తమ ఆశయాలు నెరవేర్చుకునే సుళువులు చూసుకున్నారు. స్త్రీవాదంలో ఔద్ధ్యతం ఇప్పుడొచ్చింది కానీ మనవాళ్ళు ముచ్చుల్లా పైకి కనిపించకుండానే తమకి కావలసినవి సాధించుకున్నారు. ఆ బలం తీరు వేరు. ఇక్కడయితే దాన్ని passive aggressive అంటారు కానీ మనకి అది ఆదరణీయమూ, ఆచరణీయమూను. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుపడుచులకి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. నాకది ఘనమైన విషయంగానే అనిపిస్తుంది. నేను స్త్రీలని గౌరవిస్తాను. లీల కానీండీ, మీరు కానీండి, మాఅమ్మ కానీండి మీరందరూ అంటే నాకు అపరిమితమయిన గౌరవం. అసలు ప్రపంచంలో ఈ ఎక్కువతక్కువలన్నీ కొందరు పండితులు సృష్టించేరు కానీ ప్రతి యుగంలోనూ, ప్రతి తరంలోనూ మగవారు ఆడవారికి ఎంతో గౌరవమర్యాదలిస్తున్నారు.”

“ఇదా మీ పాత్రచిత్రణ?” అన్నాను చిరాకునణుచుకుంటూ.

“నేను లీలని గౌరవించడం లేదన్నట్టు మీరు నన్ను చిత్రించేరు. నేనెవరో, ఎలాంటివాణ్ణో, నాప్రవృత్తేమిటో, నా పరిస్థితులేమిటో ఆలోచించకుండా మీరెలా ఆ నిర్ణయానికొచ్చేరు అని నేను ప్రశ్నిస్తున్నాను,” అన్నాడు సుందరం తన నిజరూపం ప్రదర్శిస్తూ.

“నేనలా అన్లేదు. ఆరోజు జరిగినసంగతి జరిగినట్టు రాసేను. కనీసం నాకు తెలిసినవిషయాలు నేను రాసేను. మీరు చెప్పండిప్పుడు మీతరఫు కథ.”

“అదే నేనంటున్నా. మీరు విస్తృతపరిధిలో ఆలోచించడం నేర్చుకోవాలి. ఏదో ఒక సంఘటన తీసుకుని అదే ఆదీ అంతమూ అనుకుంటూ నిర్ణయాలు చేసీకూడదు.”

తెల్లబోయేను మళ్ళీ. ఇదే మాట లీల కూడా అంది పూర్వం. నాకంటే వీళ్ళిద్దరికే ఎక్కువ తెలుసులా ఉంది. “సరే, మీరే వివరించండి స్వామీ ఆ విస్తృతపరిధి,” అన్నాను మిక్కిలి భక్తితో.

“మీకు వేళాకోళంగా ఉన్నట్టుంది. రెండు నిండు జీవితాలు చిత్రిస్తున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే బాగుంటుంది,” అన్నాడు సుందరం ఆచార్యోత్తమకళలు మొహాన పులుముకుని.

“చెప్తున్నా కదా, నాకు ఆ ఆచార్య లక్షణాలు తక్కువ. అంచేత నేనిలాటివాణ్ణి, నా ప్రవృత్తి ఇదీ అని చెప్పేస్తే రాసి సుఖపడతాను.”

“నిజం చెప్పమంటారా?”

“దానికోసమే కదా ఇంతసేపట్నుంచీ ఎదురు చూస్తున్నది.”

“లీలని అర్థం చేసుకోడం చాలా కష్టం. తనకేం కావాలో, ఏం అఖ్ఖర్లేదో, ఏం ఆలోచిస్తోందో ఏదీ చెప్పదు. నోట ముత్యాలు రాలిపోతాయని భయమో ఏమో. అంచేత మీలాగే నేను కూడా ముందు జరిగినవి జ్ఞాపకం చేసుకుని, ఇది కావాలి కాబోలు, ఇది ఇష్టమే అయిఉంటుంది అనుకుని చేస్తాను. అసలు నిజం చెప్పాలంటే నేను చేసేదేదో చేసింతరవాత కూడా తనకి నచ్చిందో లేదో నాకు తెలీదు.”

“అలా అంటారేమిటి. తనకి నచ్చనివిషయాలు చెప్పేనని చెప్పిందే,” అన్నాను జాగ్రత్తగా.

“ఊమ్. ఆఁ … చెప్పిందేమో కానీ నిజంగా నచ్చలేదు అన్నట్టుండదండీ … న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని ఎందుకన్నారో తెలుసా?”

“తమరే శలవీయండి.”

“ముందు చెప్పేను కదా. శారీరకధర్మాలూ, మేధాసంపత్తీ కూడా స్త్రీలకి లేవనను కానీ అవి వేరు విధంగా ప్రవర్తిస్తాయి. స్త్రీలకి పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వడంలో నన్ను మించినవారు లేరు.”

నాకు కొంత టైం పట్టింది నాప్రశ్న మాటల్లో పెట్టడానికి. “సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వడం అంటే ఏమిటి చేసేరు?” నా అనుమానం సంపూర్ణస్వాతంత్ర్యం పేరుతో లీలని పూర్తిగా పట్టించుకోడం మానీసేడని. సంపూర్ణస్వాతంత్ర్యం ఇవ్వడానికీ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడానికీ మధ్య గల తేడా చాలా సున్నితం. మాటల్లో చెప్పడం కష్టం.

“ఆమె అవసరాలకి తగ్గట్టు సహాయం చేస్తూ ఆమెని పరిరక్షించుకోడం భర్తగా నాధర్మం. నేనలా లీలని ఎంతో అప్రమత్తతతో పరిరక్షించుకోడానికి తాపత్రయపడ్డాను. ఒకసారి ఏమైందో తెలుసా. పెళ్ళయిన కొత్తలో ఏదో ఊరు వెళ్ళేం. హోటల్లో దిగేం. తెల్లవారు ఝాము ఐదుగంటలకి లేస్తుంది తను. మాహోటల్లో ఏడు గంటలు దాటితే కానీ కాఫీ రాదు. తను ఐదుగంటలకి ఇంకా చీకటి ఉండగానే లేచి బయట గాస్ స్టేషనుకి వెళ్ళి కాఫీ తెచ్చుకుంది. అలా అంత రాత్రప్పుడు ఒక్కత్తీ బయటికి వెళ్తే ఎంత ప్రమాదం చెప్పండి. నేనదే అంటే తను నవ్వేసి, క్షేమంగా వచ్చేసేను కదా అంది. మీ ఇందాకటి ప్రశ్నకి ఇదీ జవాబు. మొదట్లో బయటికి వెళ్ళవలసినప్పుడల్లా నేనే వెళ్ళేను. ఇంట్లో తనేం చేసుకున్నా నేను ప్రశ్నించలేదు. అదన్నమాట సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వడమంటే.”

“మరి మీరిద్దరూ కూర్చుని ఈవిషయాలు చక్కగా, ప్రశాంతంగా తెలివితేటలు గలవారివలె చర్చించుకోవచ్చు కదా.”

“ఉహుఁ. లాభం లేదు. ఆడవాళ్లమెదళ్ళు చిన్నవి. వాళ్లకి విస్తృతపరిధిలో ఆలోచించడం చేతకాదు.” అంటూ లేచి మాయమయిపోయేడు.

ఉలిక్కిపడి చుట్టూ చూసేను. ఎదురుగా సోఫాలో సిరి నవ్వుతూ నావేపు చూస్తూ  …

“ఏడీ?” అన్నాను గాభరాగా చుట్టూ చూస్తూ.

‌“సుందరమేనా?”

“ఆఁ. సుందరమే. అతనే కదా ఇప్పటివరకూ మాటాడుతున్నది.”

సిరి గట్టిగా నవ్వి, “ఏమంటాడేమిటి?”

“నన్నడుగుతావేమిటి నువ్వూ విన్నావు కదా.”

“ఏం వినడం. అసలు ఈ కలవరింతలంటే నాకందుకే చిరాకు. నువ్వు మాటాడినవి వినిపిస్తాయి కానీ నీకల్లో అవతలివారిమాటలు తెలీవు.”

“సుందరం ఇక్కడికి రాలేదూ?”

“వచ్చే ఉంటాడులే. నాక్కనపించలేదంతే. ఇంతకీ ఏమంటాడు?”

నాకర్థం కాలేదన్నట్టు తలూపేను, “మోకాలికీ బట్టతలకీ ముడి పెట్టగల చతురుడు. పుస్తకాలు తెగ చదువుతాడులా ఉంది.”

“లీల ప్రసక్తి ఏమైనా తెచ్చేడా?”

“తాను లీలని అర్థం చేసుకున్నాడు కానీ లీల తనని అర్థం చేసుకోలేదంటాడు.”

కొంచెంసేపు ఇద్దరం ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.

“ఇందాకా శ్రీపాద వారి అనుభవాలూ, జ్ఞాపకాలలో ఆయనలో వచ్చిన మార్పు కూడా కనిపించిందన్నావు. ఏమిటది?”

“ఆదిలో చూడు ఆయన వేదాలూ, ఉపనిషత్తులూ, ప్రబంధాలూ చదువుతున్నరోజులగురించి రాస్తున్నప్పటి భాష మూడోభాగం వచ్చేసరికి మారింది. మూడోభాగంలో రెండు, మూడు ఇంగ్లీషుమాటలొచ్చేయి. అప్పటికాయన చొక్కాలు తొడుక్కోడం, క్రాపు పెట్టించుకోడం జరిగింది. సమాజంలో వస్తున్న మార్పులు ఆయనజీవితంలో కూడా కనిపించడం మొదలయింది. నువ్వు గమనించేవో లేదో సంస్కృతశ్లోకాలు ఉదహరించినప్పుడు కూడా మొదటిభాగంలో అర్థాలు లేవు. చివరికొచ్చేసరికి ఆయన తెలుగులో వివరించడం కనిపిస్తుంది అక్కడక్కడ. అంటే ఆయన కూడా అప్పటికి గ్రహించేరన్నమాటే కదా మనవాళ్ళలో సంస్కృతం అర్థం చేసుకునేవారు తగ్గిపోతున్నారని.”

 

 

 

(మే 3, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “మార్పు 39”

 1. Thanks మాలతి గారూ. నేను మీ “Telugu Women Writers” చదువుతున్నాను. అది కాక అచ్చమాంబ గారి అబలా సచ్చరిత్ర కూడా చదివాక ఈ విషయం పై మీతో చర్చ కొనసాగిస్తాను. బ్లాగ్ముఖంగా లేదా e-mail ద్వారా.

  మెచ్చుకోండి

 2. సరే, లలితా, మొదటి ప్రతిపాదనకి :)).
  మిగతా విషయాలు, చాలా ఉంది చర్చించడానికి. తప్పకుండా ఇలా కొనసాగించి చూద్దాం ఎక్కడ తేలుతుందో. నాకున్న కొన్ని పరిమితులమూలంగా నేను అట్టే వివరంగా రాయలేకపోతున్నాను.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  Thanks. మీరు చెప్పిన కోణం నుంచీ (అంటే అప్పటి పరిస్థితులని విశ్లేషించడం మీద ఇప్పటి భావజాలం ప్రభావం) ఆలోచించి కూడా అభిప్రాయాలు పంచుకుంటాను వీలైనప్పుడు. ప్రస్తుతం రెండు విషయాలు. ఒకటి ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్నది, మనం సంభాషించుకునే విషయం ప్రధానమనిపించి చెప్పడానికి మొహమాటపడుతున్నది నన్ను మీరు “గారు” అని సంబోధించవద్దని మనవి 🙂 కొంచెం సేపు పడుతోంది నాకు మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని అవగాహనకు రావడానికి 🙂 ఇంకొకటి “మినిమం క్వాలిటీ” అంటే నా ఉద్దేశ్యంలో ఎవరి కాలి మీడ వాళ్ళు నిలబడి ఆత్మాభిమానంతో బ్రతకడానికి అని. ఉదాహరణకు మగవారి అండ లేని ఆడవారు ఒకరి పంచన పడి బ్రతకాల్సిన అవసరం లేకపోవడం. అలాగే మగవారికీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఓ మాదిరి విద్య చేతిలో ఉంటే అవకాశాలు చాలా ఉండడం. ఉదాహరణకు శ్రీపాద వారు వారి స్నేహితులొకరిని ఆంగ్ల విద్య అభ్యసించడానికి ప్రోత్సహించడం వంటి చిన్న మార్పుతో మొదలైన అనేక మార్పులు.
  ఇక శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకాలలో నాకు నచ్చిన ఆ నాటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థి దశ గురించి. ఐతే ఈ రోజుల్లో ఆ రోజులను ఆశించడం కూడా ఆ రోజులను ఈ నాటి పరిస్థుతలతో విశ్లేషించడం లాగే అనిపిస్తుంది నాకు. ఇన్ని చెప్పుకున్నా ప్రాథమికమైన విలువలంటూ కొన్ని ఉంటాయనేది ఏ కాలంలోనూ ఒప్పుకోవల్సిన విషయం. మీతో సంభాషణ నా ఆలోచనలకీ స్పష్టతనిస్తుందని ఆశిస్తున్నాను.
  నా వ్యాఖ్యలని సహృదయంతో స్వీకరిస్తూ మీ అభిప్రాయాలతో నా ఆలోచన పెంచుకోవడానికి ఉత్సాహాన్నిస్తున్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. లలితగారూ, మరో విషయం – పురాణాల్లోనూ వేదకాలంలోనూ ఆడపిల్లలకి చిన్నతనంలోనే పెళ్ళి చేసినట్టు కనిపించదు (జాంబవతికథ తప్పిస్తే. అది అసలు అస్తవ్యస్తంగా ఉంది). మరి 9 ఏళ్ళపిల్లకి 50 ఏళ్ళ మగవాడికిచ్చి పెళ్ళి చెయ్యడంలాటివి ఎప్పుడు ఎలా ప్రారంభం అయేయి అని వెతుకుతున్నాను. ఒక వాదన మధ్యయుగంలో, మహమ్మదీయ దండయాత్రలకాలంలో మొదలయిందని. బాల్యవివాహాలమీద చాలా స్టడీస్ కనిపిస్తున్నాయి కానీ ఎలా మొదలయేయి అన్నది దొరకడంలేదు. మీకేమైనా ఆలోచనలున్నాయా?

  మెచ్చుకోండి

 5. లలితగారూ, మీరు చెప్పిన అన్ని విషయాల్లోనూ నేను ఏకీభవిస్తాను. కాకపోతే, మనం ఆలోచించవలసిన విషయం, అట్నుంచి ఇటు అనుకోండి, సీతగారి జీవితం ఎలా జరిగి ఉంటుంది, తొమ్మిదేళ్ళపిల్లని యాభై ఏళ్ళ వాడికిచ్చి చేస్తే వారిసంసారం ఎలా ఉంటుంది లాటి భావాలు ఆరోజుల్లో లేవు కదా. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినభావజాలంతో ఆలోచిస్తే అవన్నీ వస్తున్నాయి. అందుకే మనం చరిత్రగురించి ఆలోచించుకోడం అనుకుంటా. శ్రీపాదవారి అనుభవాలు అందుకే నాలో ఆలోచనలు రేపుతోంది. ఇంకా వివరంగా రాయాలి ఎప్పుడో.
  పోతే, కట్టుబాట్లమూలంగా నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికి ఉపయోగపడడం లేదు అనడం కూడా అలాటిదే. ఇప్పుడు మనం నాణ్యమైనది అనుకుంటున్నది నాణ్యమా, పూర్వం వారు జీవించినది నాణ్యమా అంటే మనం ఏకోణంలోంచి దర్శిస్తున్నాం అన్నదాన్ని బట్టే కదా. ఉదాహరణగా చెప్పాలంటే మీచేతిలో ఈరోజు కారుంది కనక కారు లేకుండా అపుడు ఎలా బతికేరు అన్న ప్రశ్న వేసుకోడానికి అవకాశం ఉంది, కానీ కారు అనే వస్తువే లేని రోజుల్లో ఈ ప్రశ్న రాదు కదా. అలాగే ఇప్పుడు మనం కారువల్ల అనుభవిస్తున్న అనేక బాధలూ వాళ్ళకి లేవు అనుకోం. నిజానికి శ్రీపాదవారి పుస్తకంలో నాదృష్టినాకర్షించిన అంశం వారు ఊరినించి ఊరికి ఎన్ని మైళ్ళు నడిచేరో చూడండి. అమెరికాలో వీధిచివరనున్న కొట్టుకెళ్ళడానికి కారెక్కేవారిని నేను చూసేను.
  మీరు అంటున్న miniimum quality లేని వారు అమెరికాలాటి సంపన్నదేశంలో 43 మిలియన్లు వున్నారు కదా. మనం ఎలా అనగలం ఈనాటి జీవితం మెరుగు అని. నాకయితే అనిపించడంలేదు.
  మీరు జేన్ ఆస్టిన్ నవలగురించి చెప్పింది నిజమే. నిజానికి 19వ శతాబ్దపు బ్రిటన్ జీవితానికీ మన 20వ శతాబ్దంలో మొదటి అర్థశతాబ్దం జీవితానికి చాలా సామ్యాలున్నాయి.
  మీ వ్యాఖ్య నన్ను కూడా చాలా ఆలోచించేలా చేస్తోంది. మళ్ళీ ఏమైనా తోస్తే మళ్ళీ రాస్తాను. మీరు కూడా రాస్తూ ఉండండి

  మెచ్చుకోండి

 6. మగవాళ్ళకి ఆడవాళ్ళే కాదు, ఆడవాళ్ళకి మగవాళ్ళు అర్థం కావడం కూడా కష్టమే అంటారు 🙂 ఇదే సారాంశమని నేను అనెయ్యట్లేదులెండి. సుందరం గారి పాత్ర ప్రత్యక్షం అవ్వడం బావుంది 🙂
  కొన్ని ఆలోచనలు పంచుకోవాలనిపిస్తోంది:
  శ్రీపాదవారూ, తాము నిర్బంధాలనుకున్న వాటి మధ్యలో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం, చాలా సార్లు దొంగతనంగా శ్రమించడం అనే అసౌకర్యాన్నీ భరించి తన ఆశయం వైపు ప్రయాణం కొనసాగించారు. తన ‘కష్టాలను ‘ ఆయన చాలా సార్లు నెమరు వేసుకున్నారు. ఆర్థిక బాధల గురించి కన్నా ఆశయ సాధనలో ఎదురైన కష్టాల గురించే ఎక్కువ పరితపించారు. ఆ సమయంలో సీత గారు ఏం చేశారన్నది చాలా తెలుసుకోవాలనిపించింది. ఆమెకి తన గృహిణి ధర్మాలను మించి ఇంకేదైనా విషయ శోధన మీదో, విద్య మీదో మనసు పోయిందనుకోండి. అప్పుడు ఆమె ఏం చెయ్యగలిగి ఉండే వారు? అదీ తేడా ఆడవారి పరిస్థితులలోనూ, మగవారి పరిస్థితులలోనూ. ఎప్పుడూ ‘బంగారు ‘ రోజులు అందరికీ ఉన్నట్టు కనిపించవు. ఇప్పుడు (కొంతమంది)ఆడవారికి కలిగిన “స్వాతంత్ర్యం” వల్ల మగవారి convenience కి ఇబ్బంది కలుగుతోంది అన్న భావన (కొంతమందికి) మగవారికి కలుగుతోంది. ఆలోచించండి, సీత గారు ఏ విధంగానూ ఆర్థికంగా ఉపాధి వెతుక్కునే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. శ్రీపాద వారి జ్ఞాపకాలలో ఇంకో చోట తొమ్మిదేళ్ళ అమ్మాయిని యాభై సంవత్సరాల ఆయన పెళ్ళి చేసుకొన్నారు. వారి సంసారం ఎంత చక్కగా సాగినట్లు చెప్పినా అది మనం ఊహించుకోగలమా ఇప్పట్లో? ఏ తండ్రైనా ఇష్టపడతాడా నేటి రోజుల్లో? ఇలాంటి విషయాలలో మగవాళ్ళు, కూతుళ్ళు ఉన్న వాళ్ళు ఒకప్పటి బంగారు రోజులను ఆహ్వానించగలుగుతారా లేక నేటి అసౌకర్యం పోలికలో చిన్న విషయం అని అనుకుంటారా? ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చాయి నాకు శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకాలూ చదువుతుంటే.
  మాలతి గారూ, నాకు ఇంకో విషయం కూడా చెప్పాలనిపిస్తోంది చాలా రోజులనుంచీ. Jane Austin నవల sense and sensibility చదివినప్పుడు నన్ను ఆలోచింపచేసినవి రెండు విషయాలు. ఒకటి ఆ రోజుల్లో ఆ దేశంలో ఆడవారికి అసలు వ్యాపకాలే లేనట్లనిపించింది. ఎంత bore కొడుతుందో వారికి జీవితాలలో అని అనిపించింది. ఇంకొకటి మగవారికి కూడా తమకు ఆస్తిలో భాగం రావడం లేదా పెళ్ళి చేసుకుని భార్య ఆస్తి సంక్రమించడం అనేవి జీవితంలో తాము తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేసేవి. నిజానికి ఆ కథలో హీరో పరిస్థితి మన దగ్గర ఆ కాలంలో మగవారి అండ లేని స్త్రీల పరిస్థితికి ఏమంత భిన్నంగా అనిపించలేదు.
  సమాజంలో కట్టుబాట్లు అనేవి మనుషులు హద్దు మీరి ప్రవర్తించకుండా ఉండడానికి ఉపయోగపడ్డాయో లేదో తెలియదు కానీ నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికి పెద్దగా ఉపయోగపడనందువల్లే ‘మార్పు ‘లు చోటు చేసుకున్నాయి కాబోలు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఒకటే మెరుగు – జీవితంలో minumum quality కి కొద్దిగానైనా గ్యారంటీ ఉంది సమాజంలో చాలా మందికి, వారు నిజంగా అది కావాలి అని కోరుకుంటే. principles మాట్లాడినా, పేదరికం గురించి ఆలోచించినా ఇక అది పూర్తిగా వేరే యుద్ధం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s