మార్పు 40

ప్రభాస్రావుగారింటికి వచ్చిన కవిగారు దేశసంచారం అయింతరవాత తిరిగి వస్తూ మరో ప్రముఖకవి పరమేశ్వర శర్మగారిని వెంట బెట్టుకు వచ్చేరు. క్షుణ్ణంగా శాస్త్రాలూ ప్రబంధాలు చదువుకున్న పండితులు ఆయన.

శర్మగారు కూడా ఇక్కడికొచ్చే ప్రముఖలందరిలాగే ఆధునిక సంప్రదాయసిద్ధమైన ఉత్తరఅమెరికా జైత్రయాత్ర ముగించుకుని వచ్చేరు. దాదాపు పాతిక తెలుగు కుటుంబాలున్న అన్ని పట్టణాల్లోనూ సభలూ సందర్శించి వారు కప్పిన శాలువాలన్నీ మూటగట్టుకొచ్చేరు. అవే అయేయి ఒక సూట్‌కేసు

అట్టహాసంగా జరిగిన సభలరభసలన్నీ వినడానికి ఉత్సాహపడుతూ మనందరితో పంచుకోడానికంటూ మరో సభ పెట్టించేరు ప్రభాస్రావూ, సుందరమూ. సభ అంటే కాదు. ప్రభాస్రావుగారింట్లో సమావేశమై విశేషాలు చెప్పుకున్నారు. చాలామంది ఉన్నారు కనక వారందరిపేర్లూ రాసుకుంటూ పోతే మీకందరికీ అయేమయం అయిపోయే అవకాశం ఉంది కనక ఎవరు ఏం అన్నారని కాక అక్కడ ఆరోజు జరిగిన సంభాషణలు రాస్తాను. మామూగా సభల్లో జరిగేది అంతే కదా. ఫలానా సభలో ఎవరు ఏం మాటాడేరు అంటే ఎంతమంది చెప్పగలరంటారు చెప్పండి. మహా అయితే, బాగా మాటాడేరంటారు, సభ ఘనంగా జరిగిందంటారు. అంత గొప్ప వక్తని ఎక్కడా చూడలేదంటారు. అంతే గానీ ఇదీ ఆయన లేక ఆవిడ చెప్పిన కొత్తసంగతి అని చెప్పరెవరూ. పోనీ, పేపర్లలో చూసి ఆ వార్తలే చెప్పేద్దాం అన్నా ఆ విలేఖరులు కూడా తమకి తోచింది రాస్తారే కానీ వక్తలు చెప్పిన ముక్కలు కావు కదా. ఆమధ్య నాపుస్తకం ఒకటి హైదరాబాదులో పుస్తకావిష్కరణ చేస్తే, నేను అక్కడ సభలో నాకథలగురించి, అనువాదాలగురించి మాటాడేనేనని, ఆ సంస్థవారు నన్ను దుశ్శాలువలతో సత్కరించేరనీ రాసేరు ఓ ప్రముఖ పత్రికలో. దానిమీద నాస్నేహితులు “అదేమిటి, ఇండియావచ్చి, నాకు ఫోనైనా చెయ్యకుండా వెళ్ళిపోయేవా?” అని పడతిట్టేరు. ఎందుకులెండి. ఈ విలేఖరులకథలు చెప్పుకుంటే సిగ్గు చేటు. ఇహ ఇక్కడ కథ –

“అయితే ప్రముఖులెవరెవరు వచ్చేరు?”

“మీరలా అడిగితే ఎలా అండి? వచ్చినవారందరూ ప్రముఖులే కదా. ప్రముఖులు కాకపోతే ఎందుకు పిలుస్తారూ?”

“అందులోనూ కుటుంబాలకి కుటుంబాలు. ప్రముఖకుటుంబం అనాలేమో – వెనకటికి వేదంవారూ, తుమ్మలవారూ అనేవాళ్ళం కానీ ఇప్పుడు ఓ మాధవో, ఓ అఖిలో పిలవబడితే. వచ్చినవారు వారి పిల్లా, మేకా, సకుటుంబసపరివారసమేతంగా కనీసం నలుగురుంటారన్నమాట.”

“అంతే కద. వెనక ఇంటిపేర్లు అంటే వంశంపేర్లు. ఫలానా పావులూరివారి చిన్నవాడు, గోపంసెట్టిగారి కోడలూ అంటే ఘనం. ఇప్పుడు భర్తలపేర్లూ, తండ్రులపేర్లూ పెట్టుకోడంతో అక్కడికక్కడ ఆముగ్గురు మాత్రమే కుటుంబం అయిపోయింది. మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళయేసరికి వాళ్లింటిపేరు నాన్నపేరే కదా.“

“సర్లెద్దురూ. ఇంటిపేర్లకేం గానీ, ఇంతకీ సత్కారాలు ఎవరెవరికేమిటి?”

“అబ్బో, చాలామందికే చేసేరండీ. అనేకరంగాల్లో ప్రముఖులు కదా. వెనకంటే ఏదో సాహిత్యం, సంగీతం, నాటకం అంటూ నాలుగో అయిదో రంగాలు. ఇప్పుడు పుట్టగొడుగుల్లా ఎన్ని రంగాలంటారు. అందులోనూ interdisciplinary studies వచ్చేక ఈరంగం ఆరంగం రంగరించి మరో రంగం తయారు చెయ్యడం లేదూ అలాగే సత్కారాలమాట వచ్చేసరికి సత్తెనకాయల్లా … “

“హాహా, భలే చెప్పేరు. ఏరంగాలో మీకు తెలీదందురూ.”

“రంగాలు తెలీనప్పుడు రంగాల్లో ప్రముఖులెవరో మాత్రం ఎలా తెలుస్తుందీవిడకి. మీరు ఈవిణ్ణి వదిలేయండి.“

“హా, నన్నొదిలేస్తానంటారా? ఆ సత్కరింపబడినవారిలో నేనున్నా.”

“ఓహో, మీకూ దుశ్శాలువలు కప్పేరన్నమాట.”

“దుశ్శాలువలంటే దుష్టులకు కప్పే శాలువ అనా?”

“నేనూ అలాగే అనుకున్నా కానీ రామకృష్ణరావుగారు చెప్పేరు అది ద్విశాలువట. ఎప్పుడూ కూడా ఒక్కటి ఇవ్వకూడదుట. అంచేత రెండిస్తారుట.”

“అయితే మీక్కూడా రెండిచ్చుకున్నారన్నమాట.”

“లేదండీ. నాకు శాలువ వద్దన్నాను. వాళ్ళేమో నామాట మరీ సీరియస్‌గా తీసుకుని ముఖ్యఅతిథి, అదేలెండి మేమందరం ప్రముఖ అతిథులం కానీ, ముఖ్యఅతిథిగారు ప్రముఖగాయని వేరే ఉన్నారు ఈశ్వరిగారని … ఇంతకీ ముఖ్యఅతిథికి మాత్రం నలుగురో పదిమందో దుశ్శాలువ అంటే రెండు కాదులెండి తలొక సంఘం తరఫున తలొక శాలువ కప్పేరు. అక్కడికే ఆవిడ ఆబరువుకి కుంగిపోయేరు. పైగా ఎండలొకటీ… పాపం, ఆవిణ్ణి చూస్తే నాకు తెగ జాలేసింది.“

“మరి నీ శాలువా ఏదీ?”

“నాకు శాలువ వొద్దన్నాను కదా. నేనయితే నాకొక్కదానికే వద్దన్నాను కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారో ఏమో మిగతా ముప్ఫైతొమ్మిదిమంది సత్కారగ్రహీతలకి కూడా కప్పకుండా దాటించేసేరు.”

“అయ్యో, పోన్లెండి, ఆపక్కనున్న ఏ కూరగాయలదుకాణంలోంచో పూలగుత్తులు తెప్పించి తలొటీ ఇస్తే పాయె. సత్కారం అంటే సత్కారమే కానీ అణాపైసలు లెక్కలు చూస్కుంటారేంటి.”

“అదీ కొంతవరకే జరిగిందిలెండి. అన్ని గుత్తులు ఎక్కడ దొరుకుతాయి?”

“మరేం చేసేరు?”

“బహు సుందరంగా నవ్వుతూ పేర్లు పిలిచేరు. మాపేర్లు వినిపించగానే లేచి స్టేజిమీదకెళ్ళి నించున్నాం ముఖ్య అతిథివెనక వరస తీరి.”

“వేడుక చెలికత్తెలలాగా?”

“ఐదోక్లాసులో వెనకబెంచీలో కూర్చుని గోలచేసే కుర్రాళ్ళని వరసగా పిలుస్తారు చూడండి, అలాగే.”

“బాగుందిలే. ఇంతకీ నువ్వేం మాటాడేవు. అసలు కార్యక్రమం ఏమిటి?”

“కార్యక్రమం అంటూ కాయితం ఉన్నట్టు కనిపించలేదు.”

“నువ్వడగలేదా?”

“అడుగుతూనే ఉన్నాను. నాకీసంగతి తెలిసిందగ్గర్నుంచీ. ఎప్పటికప్పుడే ఏదో చెప్తారు. మర్నాటికి మారిపోతుంది. ఇక్కడంటారు చూడు as it goes అని. ఆరోజు ఆలా కార్యకలాపాలు జరుగుతుండగా కార్యక్రమం ఏర్పడిందన్నమాట.”

“ఇంతకీ నువ్వేం మాటాడేవో చెప్దూ.”

“మీరేంటి ఆవిణ్ణలా గొడవ పెట్టేస్తారు. ఇదసలు స్పీచిల సభ కాదండీ. సత్కారసభ. అంచేత పెళ్ళిళ్ళలో సందర్పణవడ్డనలా ఒకొకరినే పిలిచేసి, వారి ప్రత్యేకరంగం చెప్పో చెప్పకో పత్రాలో పలకలో ఇచ్చేసి పంపేయడమే. ఫొటోల్లో మాత్రం పకడ్బందీగా పలకలందుకుంటున్నవేళ చిరునవ్వుతో కెమేరావేపు చూసేలా చూసుకున్నారు. అంతే.”

“పోన్లెండి. మీకు పలకలిచ్చి, కుఠోలేనా తీసేరు. వెనకోసారి నాసభలో ఏదో పుస్తకావిష్కరణ పెట్టినప్పుడు ఆపుస్తకరచయిత ఆప్తులు పదిమందీ ఆపుస్తకం అంతా మూడుసార్లు చదివడం పూర్తి చేసేవేళకి హోటలువారొచ్చి టైమయిపోయింది. ఖాళీ చెయ్యాలన్నారు. దాంతో  నాస్పీచి మర్నాడు ఏదో ఎలిమెంటరీస్కూలు పాకలో పెట్టేరు. కార్యకర్తలేమో వచ్చినవారందరినీ తిరిగి రావాలని మరీ మరీ కోరేరు కానీ ఆహూతులకి అంత సరదా లేదేమో మర్నాడెవరూ రాలేదు.”

“పత్రికలవాళ్ళయినా రాలేదా?”

“ఎవరో ఒకాయన వచ్చేడు. ఆయన మిగతావారికి చెప్తాట్ట నేనేం మాటాడేనో. తమిళుడిలా ఉన్నాడు. ఆయనకి తెలుగొచ్చో రాదో నాకనుమానమే.”

అక్కడ కూడినవారిలో రాఘవేంద్రపురందరశర్మగారు పెద్దవారు. నేనూ, సిరి ఆయనపక్కన చేరేం.

“వెనకటిరోజుల్లో ఈ సాహిత్యసభలు ఇలాగే జరిగేవాండి?” అన్నాను. పై రిపోర్టులన్నీ వింటుంటే నాకు మనసు జావగారి పోతోంది. విశ్వనాథ సత్యనారాయణగారూ. పురిపండా అప్పలస్వామిగారు, తల్లావఝ్ఝల శివశంకరస్వామిగారూ, వేదం వెంకటరాయశాస్త్రిగారూ, వేలూరి శివరామశాస్త్రిగారూ, తిరుపతి వెంకటకవులూ – ఇలాటివారు సభలంటూ జరిపితే ఇలా జరిగివుంటుందని అనుకోలేకపోతున్నాను. ఆరోజుల్లో సాహిత్యసభలంటే సాహిత్యంగురించే మాటాడేవారనీ, ఫొటోలూ, పూలదండలూ ముఖ్యం కాదనీ నామనసు పదే పదే చెబుతోంది. నాకెలా తెలిసంటే చెప్పలేను కానీ సాహిత్యాభిమానులన్నవారు ఇంత లేకిగా ఉంటారని మాత్రం అనుకోడానికి మనసొప్పడం లేదు. అప్పట్లో దుశ్శాలువలు కప్పడం, గండపెండేరాలు తొడగడం, కనకాభిషేకాలు చెయ్యడం ఉండొచ్చు కానీ అవే ప్రధానం అయి, సత్కరింపబడినవారికృషిగురించి ఒక్కమాట కూడా లేకపోవడం ఎప్పుడయిపోయిందో తెలీడం లేదు.”

నాఆలోచన గుర్తించేరేమో ఆయన నిట్టూర్చేరు. “అమ్మా, మీకు కనీసం ఆ తలపు అయినా కలిగింది. ఇన్ని ఊళ్లు తిరిగేను. ఇన్ని దుప్పట్లు నొల్లుకొచ్చేను కానీ ఒక్కరయినా మీరేం రాసేరని అడగలేదు. ఫలానా కావ్యంమీద కాకపోతే కవితమీద, కథమీద మీ అభిప్రాయం ఏమిటి? అని అడుగుతారేమోనని చూసేను. కానీ ఎవరికీ ఆధ్యాసే ఉన్నట్టు లేదు. అందులో కొందరయితే నేనిప్పుడే కలం పట్టి ఏదో ఒకటో రెండో కవితలు రాసేననుకుని, వృద్ధిలోకి వస్తానని నన్ను దీవించేరు. మరొకబ్బాయి ‘అయ్యో, మీకవిత్వం అంతా ఏకధారగా చదివేశాను’ అంటూ గబగబ నాలుగు పద్యాలు చదివేశాడు.”

“బాగుందండీ. కనీసం ఒక్కరైనా ఉన్నారు కదా మీకవిత్వం చదివినవారు.”

“లేదమ్మా. అది నారచన కాదు. అతనికి ఆమాత్రం నోటికొచ్చింది కదా అని సంతోషించాలంతే.”

నాకేం చెప్పాలో తోచలేదు.

“అదేదో హస్తఫలకం ఉంది చూడూ, ఐఫోనో ఐపాడో ఏదో అది చూసుకుంటూ చదివినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంఠతా పట్టడం అనాగరీకం అనిపించుకుని ఆనందించే స్థితిలో ఉన్నాఁవిప్పుడు”

“అంటే మీసాహిత్యకృషిగురించి తెలిసినవారెనరూ లేరా అక్కడ?”

“నాసాహిత్యం కాదు, ప్రతివారూ సాహిత్యపిపాసువులే. మనం ఏం చేసేం అన్నదానికన్నా వారిరచనలు ప్రచారం చేసుకోడంతోనే సరిపోయింది. మీరేం చేసేరు అని మనం అడిగినప్పుడల్లా ఎంతో ఉత్సాహంతో ఆపకుండా గంటలతరబడి మాటాడతారు. వారిపుస్తకాలు పంచిపెడతారు.”

“మరి కొత్తగా రంగప్రవేశం చేస్తున్నవారికి అదొక్కటే కదండీ దారి వారిరచనలగురించి నలుగురికి తెలియడానికి.”

“నాకేమీ కొత్తా పాతా తేడా కనిపించలేదు. అందరూ అంతే. తమని తాము ప్రచారం చేసుకోడమే యుగధర్మం అయిపోయింది. కానీ కొంతకాలం సాహిత్యకృషి చేసినవారితో మాటాడ దలుచుకున్నప్పుడు వారేం రాసేరో కాస్త చదివి దానిమీద ప్రశ్నలడిగితే చర్చకి అవకాశం ఉంటుంది కదా.”

“అంటే అక్కడెవరూ మీరచనలగురించి అడగలేదా?”

“మీరు మరీ అంత కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు అడిగితే, నాక్కూడా అలాగే అనిపిస్తోంది. నేను కూడా నారాతలగురించి మాత్రమే ఆలోచిస్తున్నానా అని.”

నాలుక్కరుచుకున్నాను. “క్షమించండి. నేనలా అనడంలేదు. మీరు అర్థశతాబ్దంగా విస్తృతమైన కృషి చేసేరు. నాకు తెలుసు. పోనీ సాహిత్యసభలు ఎలా ఉండాలో చెప్పండి.”

“నువ్వు నోరి నరసింహశాస్త్రిగారి రుద్రమదేవి చదివేవా అమ్మా.”

“చాలాకాలం అయిందండీ చదివి. అట్టే గుర్తు లేదు.”

“ఆయన రాసిన చారిత్ర్యకనవలలన్నిటిలోనూ కవిపండితులచర్చలు వివరిస్తారు. ఉదాహరణకి రుద్రమదేవిలో ఒక అధ్యాయం ఉంది చూడు. పల్లవరాజు కొప్పెరుంజింగని ఆంధ్రదేశం ఆక్రమించుకోడానికి వచ్చి వశిష్ఠగోదావరితీరంలో స్థావరం ఏర్పరుచుకున్న సందర్భం. ఆయన సరసుడు, లలితకళలందు విశేషంగా ఆదరము గలవాడు. యుద్దానికి వచ్చినప్పుడు తనతో వేదవేదాంగ. శాస్త్రపారంగతులైన విద్వాంసులనీ, నటులనీ, పండితులనీ తీసుకొచ్చి సాహిత్య, నాటక, గానకళావినోదాలు ఏర్పటు చేసి తాను ఆనందించి స్థానికులని ఆనందింపజేసేవాడు. ఒకసారి స్థానిక వేదపండితులని ఆహ్వానించి, వారిసమక్షంలో “ఊరుభంగం” నాటకం వేయించేరుట. ఆనాటకంలో అపాణీనీయాలూ, సంప్రదాయవిరుద్ధమయిన యుధ్దాలు ఉండడంతో గోదావరితీరంలోని వైదికబ్రాహ్మణులు కృద్ధులయి, సభ విడిచి వెళ్ళిపోతే రాజుగా వారిచర్య తనకి అవమానం అయినా సభ్యత పాటించి వారిని వారించక వదిలిపెట్టేడుట. ఆనాడు రాజులకి పండితులయందు గల గౌరవభావం అటువంటిది.”

“ఆకాలంలో పండితులూ. పాండిత్యాన్ని ఆస్వాదించేవారూ కూడా పరిమితసంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు పాఠకులసంఖ్య పెరిగింది. వారి అవగాహన సరళి మారింది. ఇమీరన్నట్టు ఆ సంప్రదాయమే వేరు. ఇప్పుడు అలా జరగగలదని మనం ఆశించవచ్చునా?” అన్నాను నెమ్మదిగా, సందేిస్తూ.

“నిజమే. మనం ఆ వాతావరణం ఇప్పుడు కోరడం సమంజసం కాదు. నిన్నా మొన్నా జరిగిన సాహిత్యసమాలోచనలు చూసినా ఇంత అధ్వాన్నంగా అనిపించదు పరిస్థితి. సాధారణంగా విశేషమైన కృషి చేసినవారో, అసామాన్యమైన ప్రతిభ చూపినవారో అయినప్పుడే జరిగేవి భారీఎత్తున సత్కారాలు. ఆసభలో వారికృషిగురించి విపులంగా ఒకరిద్దరు మాటాడేవారు. తరవాత ఆ సత్కారగ్రహీత కూడా సాహిత్యపరమైన తమ అనుభవాలు, సమకాలీనసాహిత్యంలో ఏదో ఒక అంశం తీసుకుని విపులంగా చర్చిస్తూ మాటాడేవారు. ఇలాటి ఉపన్యాసాలద్వారా సభాసదులకి సాహిత్యచరిత్రగురించి నాలుగు ముక్కలు వినే అవకాశం, తెలుసుకునే అవకాశం కలిగేది. ఇప్పుడు సభల్లో శాలువాలూ, పూలదండలూ, ఫొటోలూ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ మరేం తెలియడం లేదు.”

“పూర్వం ఇన్ని సన్మానాలూ, ఇన్ని బహుమానాలూ లేవు.”

“కొన్ని చోట్ల చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోడం కనిపిస్తోంది. పెద్దపేరున్న ఒకరిని పిలవడం, కార్యక్రమం అంతా తమ ప్రచారాలకి వినియోగించుకోడం.”

“ఇందాకా మీరన్నట్టు ఇప్పుడు ఇదే యుగధర్మం. మరి దీనివల్ల సాహిత్యానికి మేలు జరగదంటారా?”

“ఏమో మేలేమిటో ఎలా జరుగుతుందో నాకు తెలీడం లేదు. ధర్మప్రచారం, నీతిప్రచారం పోయి ఆత్మప్రచారమే ధ్యేయం అయిపోయింది. నీలాటి ఒకరో ఇద్దరో నేను చేస్తున్న కృషి గొప్పగా ఉందని నాతో అంటారు కానీ మరే సభల్లోనూ ఉపన్యాసాల్లోనూ, వ్యాసాల్లోనూ కనిపించదు. మరి నేను చేస్తున్న కృషి నిలవడానికి ఆస్కారం ఏదీ? అలాటి ఆస్కారం లేదు కనక అది చరిత్రలో నిలవదగినది కాదా అన్న అనుమానం కూడా వస్తుంది కదా. అలా ఆలోచిస్తుంటే ఏ సాహిత్యం కాలానికి నిలుస్తుంది? ఎలా నిలుస్తుంది? ఇలా ప్రచారం చేసుకుంటే తప్ప నిలవదు అనుకుంటే ఈ ప్రచారాలకి అలవాటు పడని నాతరం రచయితలకృషి అంతర్థానం కావలసిందేనా? ఇవీ నాప్రశ్నలు. ఇవి ఒఖ్ఖ నారచనలగురించే నేను అడగడంలేదు. ఎంతో సాహిత్యం మరుగున పడిపోతోంది. ఈనాడు లతవంటి ఎంతోమంది రచయితలసాహిత్యం అందుబాటులో లేదు. ఇప్పుడు ఉన్నమాతరం గతించిపోయేక, వారిగురించి ఎవరికీ తెలీను కూడా తెలీదు. దాన్నిగురించి ఏం చెయ్యాలని అడుగుతున్నాను,” అన్నారాయన ఆవేశంతో.

నేను అవాక్కయి చూస్తూ కూర్చున్నాను.

(మే 10, 2012.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మార్పు 40”

 1. C V R Mohan, ఇంకా ఆలోచిస్తున్నాను ఈవిషయం. బహుశా చదువుకున్నవారు, రాస్తున్నవారూ కూడా చాలా ఎక్కువ అవడంచేత, మీడియా కూడా ఉధృతంగా పెరిగిపోవడంచేతా ఈ స్వరచన ప్రచారం అవసరం అవుతోందేమో కానీ వీటన్నటిమధ్య మంచి సాహిత్యం అనిపించుకోదగ్గది కూడా ప్రవాహంలో కొట్టుకుపోతోందేమో అనిపిస్తోంది. ఈవిషయం మరింత వివరంగా పాఠకులు చర్చిస్తే బాగుండు.

  మెచ్చుకోండి

 2. C V R Mohan, అవునండీ ఈ సొంత ప్రచారాలు ఎక్కువయిపోయి, నిజంగా ఎవరిఅభిప్రాయం ఏమిటో, ఏదీ నిజంగా మెచ్చదగ్గ సాహిత్యమో తెలీకుండా పోతోంది. చాలా విచారించవలసినవిషయం.

  మెచ్చుకోండి

 3. మొదటి సారి చదివినప్పుడు నవ్వు వచ్చింది,
  మలిసారి బాధ వేసింది.
  మూడో సారి మంది వరస
  తలచుకుంటే అసహ్యం వేసింది.
  మొత్తం మీద బాగా ఆలోచింప చేసింది.
  అభినందనలు.

  మెచ్చుకోండి

 4. మొదటి సారి చదువుకొని నవ్వుకున్నాను.
  మలిసారి కొంచం బాధ అనిపించింది.
  మూడోసారికి మంది నైజాన్ని తలుచుకొని అసహ్యం వేసింది.
  చాల బాగా వ్రాసారు, అభినందనలు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s