ఊసుపోక – ప్రచారసాధన, విధానం

(ఎన్నెమ్మకతలు 98)

తొల్లి నారదులవారు శ్రీమహావిష్ణువును యథాశక్తి పొగిడి, “మహాప్రభూ, కలికాలంలో అమెరికాదేశములో మీసందేశమును ప్రచారము చేయుటకు సాధనములెవ్వి?” అని ప్రశ్నించెను.

అప్పుడు శ్రీమహావిష్ణువు కించిత్ విచారించివాడయి, “నాయనా, మనకాలములోవలె జనులు జమ్మిచెట్టుకింద, దేవాలయ మండపములో కూడి చర్చ చేయరు. వారికి కలికాలములో పీసీలూ, టీవీలూ, ఐఫోనులూ ..వంటి ఇతరసాధనములు సమకూడును. వాటిద్వారా ప్రచారము జరుగును,” అని శలవిచ్చెను.

నారదుడు ఆందోళితమనముతో, అర్థనిమీలితనేత్రములతో, “అవి ఏమి స్వామీ? అవి ఎట్లుండును? వాటిని ఎట్లు ఉపయోగింతురు?” అని ప్రశ్నించెను.

అప్పుడు శ్రీమహావిష్ణువు ఇచ్చిన జవాబు నేను తిరిగి చెప్పనవసరం లేదు కదా. అమెరికాలో ఈమధ్య తపాలా ఆఫీసులకి కాలం చెల్లిపోయేలా కనిపిస్తోంది ఈ ఆధునిక ప్రచారసాధనాలమూలాన. అంచేత వాళ్లు ఆ ప్రచారసాధనాల్లోనే ఒకటి వినియోగించుకుంటూ మరోటి సూచిస్తున్నారు. అంటే టీవీలో బల్క్ మెయిలు అనబడే కాయితాలకట్టల ప్రచారం అన్నమాట. వ్యాపారస్థులు పోస్టుద్వారా ఇంటింటికీ ఫ్లైయర్లు పంపడంద్వారా సకలజనులకీ వారిసంగతి తెలిసి వారివ్యాపారం మూడింతలో తొమ్మిదింతలో కాగలదని. ఇందులో కిటుకు గ్రహించేరా? ఆ వ్యాపారాలమాట ఎలా ఉన్నా తపాలాఫీసుకి పని తగలడం తథ్యం.

మాఅపార్టుమెంటులన్నిటికీ తపాలాపెట్టెలస్థానం ఒకటుంది. అందరం అక్కడికెళ్ళి తెచ్చుకుంటాం మాఉత్తరాలూ, తదితర చెత్తాను. నిజానికి ఈ చెత్తరాలు ఇళ్ళదాకా తెచ్చుకునేవారు తక్కువే. ఆసంగతి మామేనేజ్మెంటువారికి తెలుసు కూడాను. అంచేత ఈ టపాలడబ్బాలపక్కనే ఓ చెత్తడబ్బా కూడా పెట్టేరు వాళ్ళు. మేం చాలామందిమి ఈ ప్రకటనలదొంతరలు మాటపాపెట్టెలోంచి తీసి ఆ పక్కనే ఉన్న చెత్తడబ్బాలోకి గిరవాటేస్తాం అక్కడికక్కడే చెత్తభ్రమణం నిమిత్తం. వాటిని చెత్త మేనేజర్లు అంటే చెత్తని మేనేజి చేసేవారు పరిగ్రహించి పునరుద్ధరిస్తారు. చూసేరా, ఈవిధంగా మరిన్ని చెత్త ఉద్యోగాలు సృష్టించడం జరుగుతోందని ప్రభుత్వంవారు గర్వపడవచ్చునేమో కూడా.

నాబాధ ఏమిటంటే సమాజశ్రేయస్సు కోరే కొందరు “కాయితంవాడకం తగ్గించండి, తరుసంపదని సంరక్షించండి” అని మొత్తుకుంటుంటే, మరోపక్క మరికొందరు ఆ కాయితాలవాడకాన్ని హెచ్చించే సూత్రాలు వల్లిస్తున్నారు. లేకపోతే వారి ఉద్యోగాలు పోతాయిట. ఇదే ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అంటి. హా.

నేనిలా తరులకోసం బాధపడనా, పోస్టాఫీసుకోసం బాధపడనా అని తికమక పడుతుంటే. ప్రత్యక్షమయేడు తారకం.

“మిమ్మల్ని కలుస్తానంటే తీసుకొచ్చేనండీ. ఈయన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కథకుడు, పండితుడు, సాహిత్యచరిత్రకారుడు,” అంటూ మరొక పెద్దమనిషిని కూడా వెంటబెట్టుకొచ్చేడు.

“ఆహా,” అని రండి, రండి అంటూ మర్యాదగా ఆహ్వానించేను, కుర్చీలు చూపుతూ.

ఆ వెనకే సంద్రాలు కూడా వచ్చింది. “పెద్ద సదూకున్న పండితులోరు వస్తన్నరంటే ఏటి సెప్తరో యిందాంవని వొచ్చిన,” అంది.

ఆయన కూడా ఎంతో మర్యాదగా మాయిద్దరికీ నమస్కారాలు చేసి, ఎదురుగా సోఫాలో కూర్చున్నారు. సావధానచిత్తులయి అన్న పదం నామనసులో మెదిలింది.

మామూలుగా నన్ను చూడ్డానికంటూ వచ్చేవారు తక్కువ. ఒకవేళ వస్తే, నారచనలేవో చదివుంటారనీ, వాటినిగురించి మాటాడతారనీ, కనీసం అదేమిటీ, ఇదేమిటీ అని ప్రశ్నిస్తారనీ అనుకుంటాం కదా. నేను ఎదురు చూస్తున్నాను వారేమంటారోనని.

“నేనో క్లాసిక్ రాసేనండీ,” అన్నారాయన. భుజాన తగిలించుకొచ్చిన ఖద్దరుసంచీలోంచి ఓ కట్ట కాయితాలు తొంగి చూస్తున్నాయి.

నాకంటే ఓ దశాబ్దం పెద్దవారిలా కనిపిస్తున్నారు. ఆయనే క్లాసిక్కంటే కాదనడానికి నాకెన్ని గుండెలు!

“బాగుందండీ. సంతోషం, అభినందనలు,” అన్నాను.

“దీన్ని పాఠకులదృష్టిలోకి ఎలా తేవడమా అని,… మీరేమైనా సలహాలు చెప్తారేమోనని ..” అన్నాడు తారకం.

ఓ. ప్రచారంకోసం! … నాప్రాణం క్షణకాలం ఉసూరుమంది. రెండోక్షణంలో తేరుకుని, “మీరు కవి, ప్రముఖ రచయిత, విమర్శకుడు, కథకుడు, పండితుడు, సాహిత్యచరిత్రకారుడు. మీకు నేను సలహా చెప్పడమేమిటండీ?” అన్నాను వినయంగా.

“అమ్మా, అలా అనకండి. బంగారు పళ్ళెరానికైనా గోడచేరుపు. మీరు మంచి విమర్శలు రాస్తున్నారని, మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుందనీ” అన్నారాయన అంతకంత వినయంగానూ.

కనీసం ఇంతవరకూ బండి బాగానే నడుస్తోంది. పరస్సర అభినందనసభ.

“క్లాసిక్కని మీరే అంటున్నారు కద. ప్రజలే దాన్ని వెతుక్కుంటూ వస్తారులెండి,” అన్నాను ఆ కాయితాలకట్ట అందుకుంటూ.

“ఎంత క్లాసిక్కయినా మోసేవారుంటేనే మోక్షం కదమ్మా,” అన్నారాయన.

ఆయనకీ కొంత అవగాహన ఉన్నట్టే ఉంది ఏ పుస్తకం ఎలా క్లాసిక్కవుతుందో అన్నవిషయంలో.

“అదిగాత్తల్లీ, నీస్నేయితలకి సెప్పమంతన్నారాయన. గాపోతే ఆబొక్కుమీన నాలుగుముక్కలు గూడ రాయి,” అంది సంద్రాలు. ఆవులిస్తే పేగుల్లెక్కపెట్టేస్తుంది ఆవిడ.

ప్రముఖ రచయతగారు కాస్త ఇబ్బందిగా చూసేరు. “అంటే మీకు వీలయితేనే. మీరు నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు రాయండి,” అన్నారు.

ఇది మరోబాధ. ఆయన అలా అన్నతరవాత కాస్త పొగడకపోతే బాగుండదు. ఇదొక లోపాయికారీ నియమం. ఆమాట ఎవరూ పైకి అనరు. పైగా, దానిమూలంగా నాకు “వచ్చే” లేక “పోయే” పరువు కూడా ఉంటుంది కదా.

“అసలు నాకు తెలీకే అడుగుతున్నా. పూర్వం మనదేశంలో అంటే ముప్ఫై, నలభైల్లో రాసిన పుస్తకాలకి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. అదెలా జరిగందండి?” అన్నాడు తారకం.

“అప్పట్లో రాసేవాళ్ళు తక్కువుండే వాళ్ళు. చదివేవాళ్లు కూడా కొంతవరకూ తక్కువేనేమో. పత్రికలద్వారానే ఎక్కువ ప్రచారం. ఇప్పట్లా సన్మానసభలూ, పుస్తకావిష్కరణ సభలూ కూడా తక్కువే. రాసి, ప్రచురించి, దేశంమీదకి వదిలెయ్యడమే.”

“గుడ్డోడిసేతి రాయినాగ తగిల్తే తగుల్తాది, నేకపోతే నేదు,” అంది సంద్రాలు.

“అయితే రాసేవాళ్లూ, చదివేవాళ్లూ కూడా తక్కువే అయితే మరి ప్రచారం ఎలా?”

“ప్రచారం, ప్రచారం అంటూ ఎవరూ అంతగా గోలెట్టలేదనుకుంటా అప్పట్లో. సత్తా ఉంటే దానికదే నిలబడుతుంది. చదివినవారు తమకి నచ్చితే, ఇలాటివి మరొకరికి చెప్పొచ్చు. అది కూడా అవతలివారి అభిరుచికి తగును అనుకుంటేనే.”

“మరి ఇప్పుడు పనికొచ్చే పద్ధతులు నాలుగు చెప్దురూ.”

“పనికొచ్చే అంటే చెప్పలేను కానీ జరుగుతున్నది – అంతర్జాలంలో కనిపిచిన సైుల్లోనూ, బ్లాగుల్లోనూ ప్రచురించిన కథమీదో, వ్యాసంమీదో ఓ వ్యాఖ్య రాయడం ఓ పద్ధతి. లేదా మీపుస్తకంవివరాలు మాత్రం ఆవ్యాఖ్యలపెట్టెలోనే పెట్టేయడం, దొరికిన ఐడీలన్నిటికీ మెయిళ్ళంపేయడం. జాలసందేశం అనుకోండి. సభలకీ, సమావేశాలకీ హాజరయి, కనిపించినవారందరికీ కాపీలు పంచిపెట్టడం.”

“వాళ్ళందరూ చూస్తారంటారా?”

“ఆల్లకి ఇస్టంవైన ఇసీయం ఔవుతే సూత్తారు. నేదా, సెత్తబుట్లలోకి ఎట్టీస్తారు,” అంది సంద్రాలు నవ్వుతూ.

“అంతేనంటారా?”

“ఆ యమ్మ అట్నే సేస్తంది గంద,”

“అవునా?” అన్నాడు తారకం.

తారకం, అతనితో వచ్చిన కవీ ఎట్సెటరా తెల్లబోయి చూసేరు నావేపు.

“అది గాదు బాబు, ఆయమ్మవి చదవకండ, ఆరివి సదవమంటే ఆమెకి మాత్తరం ఉండదా నాయి ఈల్లు సదవనేదే అని.”

నాక్కోపం వస్తోంది. ఈ సంద్రాలు నాపరువు తీసేస్తోంది. “అది కాదు తారకం, మరి మీలాగే నాక్కూడా టైం ఉండాలి. నువ్వు రాసినవిషయంలో నాకు ఆసక్తి ఉండాలి … ఇలా ఏవో ఆటంకాలనుకో. చదవకూడదని కాదు,” అన్నాను విచారం వెలిబుచ్చుతూ.

“మీరేదో పెద్దవారనీ, తెలిసినవారనీ అడుగుతాం. మీకు ఇదొక్కటే వ్యాపకం కదా. టైం ఎందుకుండదండీ,” అన్నాడు తారకం. అతనిచిరాకు స్పష్టంగానే తెలుస్తోంది. నాకు మరింత ఆశ్చర్యం.

“అన్నీ పారేయనులే. కొన్ని చదువుతాను. నిశ్చయంగా నారచనలంటే గౌరవం ఉన్నవారూ, నాస్నేహితులూ, నాకు ఆసక్తి ఉన్న విషయాలూ … ఇలా ఎంపికలున్నాయి నాకు. అయినా నువ్వు ఇలా చిరాకు పడ్డం బాగులేదు. నీకథలు చదివేను కదా,” అన్నాను.

“మరి నాబ్లాగులో మీరు ఒక్కసారి కూడా వ్యాఖ్య పెట్టలేదు. ప్రతిటపా పంపిస్తున్నాను.”

“నీబ్లాగా? ఏ బ్లాగు? నాకు తెలీదే?”

“టెక్సనానంద ఎవరనుకున్నారు?”

హతోస్మి!!

తారకంతో వచ్చిన కవిగారు తనపుస్తకం తరవాత పంపిస్తానని చెప్పి శలవు తీసుకున్నారు.

పోస్టాఫీసువాళ్ళ అభ్యర్థనా, పోస్టుబాక్సులపక్కనే ఉన్న చెత్తబుట్టా నాకళ్ళముందు మెదిలేయి.

000

(మే 26, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s