ఊసుపోక – పండితశ్రీముఖము

(ఎన్నెమ్మకతలు 99)

కొంతకాలంక్రితం రాసేను నాకు ఆచార్యముఖం పడిందని ఇద్దరు స్నేహితులు అన్నారని. ఇప్పుడు మరో ఇద్దరు స్నేహితులు నాకు పండితశ్రీకళలు ఉన్నాయని నొక్కి వక్కాణిస్తున్నారు. నా “నాన్యెకడమీకాన్ని” అంగీకరించ నిరాకరిస్తున్నారు. అంచేత ఆనాడు ఆచార్యపదవి అంగీకరించినట్టే, ఈనాడు పండితశ్రీముఖము కూడా ఒప్పేసుకోవలసి వస్తోంది.

గొప్పతనంగురించి ఒక ప్రతీతి ఉంది మీరూ వినే ఉంటారు. కొందరికి జన్మతః గొప్పతనం ఉంటుంది. కొందరు తమకి అనువైన రంగంలో కృషి చేసి గొప్పవారవుతారు. కొందరిమీద గొప్పదనం రుద్దబడుతుంది. అలాగే పాండిత్యం కూడాను. కొందరు సహజసిద్దంగా పండితులై పుడతారు. కొందరు తమతమరంగాల్లో అవిరళంగా మెచ్చుకోదగ్గ కృషి చేసి పండితులు అనిపించుకుంటారు. కొందరిమీద పాండిత్యం రుద్దబడుతుంది. మరోరకం కూడా ఉంది లెండి. అది కేవలం పండితులం అనిపించుకోడానికి మాత్రమే చేసే కృషి. అంటే దృష్టి రంగంమీద కాక పండితులు అనిపించుకోడంమీద మాత్రమే అన్నమాట. అది ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. కనీసం నేను ఆ నాలుగోజాతిలో చేరడం ఇష్టంలేకే పండితురాలని కానని చెప్పుకుంటూ వస్తున్నాను.

ఇంకా నేను పండితురాలిని కానని ఎందుకు అంటూ వచ్చేనో కూడా చెప్తాను. ఈ మధ్య పుస్తకాలు చదువుతున్నానని చెప్పేను కదా. నిడుదవోలు వెంకటరావుగారూ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారూ, జి. వి. కృష్ణరావుగారూ – ఇలా లబ్ధప్రతిష్ఠులయినపండితులు రాసిన పుస్తకాలూ, వారిప్రాశస్త్యంగురించి రాసిన పుస్తకాలూ  చదివేక, పండితులంటే వీరూ అనిపించింది. వాళ్ళు చదివిన అనేకానేక వేదాలూ, కావ్యాలూ, ప్రబంధాలూ, పాశ్చాత్యసాహిత్యం చూసేను. చదువుకున్నాం అంటే అదీ, పాండిత్యం అంటే అంత చదువుకున్న తరవాత వచ్చేది అని అర్థం అయింది. వాళ్లతో నా చదువు పోలిస్తే, వీధిబళ్లో చదివిన వానాకాలం చదువు నథింగ్ కాక నథింగ్. అలా గట్టిగా ఓ ప్రబంధమైనా చదవని నేను పండితురాలిని అని ఎలా చెప్పుకోను? చెప్తే మీరూరుకుంటారా? మీలాటివారు నవ్విపోరా? నీదీ ఓ చదువేనా అని హేళన చేయరా?

ఇంతకీ నేను పండితురాలినే అని ఇద్దరు మిత్రులు నొక్కి వక్కాణించేక, కనీసం కొంచెమైనా కృషి చేసి కనీసం ఆ పేరు దరిదాపులకైనా చేరాల్సిన అగత్యం ఏర్పడింది. అంటే వేదాలూ, ఉపనిషత్తులూ, శాస్త్రాలూ, పురాణాలూ, ప్రబంధాలూ – ఇలాటివన్నీ చదవాలి కదా. వాటిని చేరేముందు, ముందు కిందిమెట్టుమీద అడుగు పెడదాం అని పూర్తిగా కాకపోయినా సగం సగం గ్రాంథికభాషలో ఉన్న  పుస్తకాలు చదివితే, కనీసం కొంత భాష అలవాటవుతుందని నిర్ణయించుకున్నాను.

వెనక భండారు అచ్చమాంబగారి కథలూ, కనుపర్తి వరలక్ష్మమ్మగారి వసుమతి, విశ్వామిత్ర లాటివి చదివి ఉన్నాను కదా. అవి చదవలేకపోయేం అన్నవాళ్లు ఉన్నారు కనక నేను చూపువాసి మెరుగే అనుకోవచ్చు. ఇది నిజము కానిచో పాఠకులు అవశ్యము మన్నింతురు గాక.

ప్రస్తుతం మల్లాది వసుంధరగారి తంజావూరు పతనం పదిరోజులక్రితం మొదలు పెట్టి మొన్ననే పూర్తి చేసేను. నాకు సరదాగానే ఉంది. మొదటి విషయం సుదీర్ఘ సమాసాలు – శరద్రాకాకళాధరస్నిగ్ధసుధాంశుమాల, అస్తమయోన్ముఖభానుబింబసౌందర్యరాగకిరణఛ్ఛటాపాళి లాటివి. ఈపుస్తకంలో పదాలు కొంతవరకూ విడదీసి ఉన్నాయి కానీ కొన్నిపుస్తకాల్లో అంతా ఒకే పదంలా కనిపిస్తుంది ఎక్కడా విరామం అన్నది లేకుండా. నిజానికి వ్యాకరణరీత్యా అదే సరైన పద్ధతి కూడాను. ఎందుకంటే కిరణచ్చటావళి (కిరణాలగుంపు)కి మిగతాదంతా విశేషణం. ఇలాటిసందర్బాల్లో నాసరదా ఏమిటంటే, ఏ అక్షరంతో ఒక విశేషణం సమాప్తమవుతుందో చూసుకోడం. ఒకక్షరం, రెండక్షరాలు, మూడక్షరాలూ – ఇలా వరసగా కూడబలుక్కుంటూ చూస్తాను ఎక్కడోఅక్కడ అర్థవంతంగా కనిపించేవరకూ. అది మెదడుతో కుస్తీ అన్నమాట.

అన్నట్టు ఇక్కడ మరోమాట కూడా చెప్పాలి. నాకీమధ్య తెలుగుభాష మీద మక్కువ మిక్కుటమగుటచేత వీలయినంతవరకూ తెలుగే వాడాలని నిశ్చయించుకున్నాను. అంటే మాటకి మాట తెలుగు అనువాదం కాదు కానీ (cow dust time, performed karma లాగ) ఏ  సందర్భంలో గానీ అస్సలు ఇంగ్లీషు రానివాళ్ళు చెప్పవలసి వస్తే ఎలా చెప్తారు అని ఆలోచిస్తే వచ్చే మాటల్లో అన్నమాట. అంచేత మెదడుతో కుస్తీ అన్నది మెంటల్ జిమ్నాస్టిక్స్‌గా అర్థం చేసుకోవాలి మీరు. ఆమధ్య ఎక్కడో విన్నాను వయసు ముదిరిపోతున్నప్పుడు మెదడుని పదును పెట్టడానికి క్రాసవర్డు పజిలులాంటివి పనికొస్తాయని. గ్రాంథికబాషలో ఉన్న పుస్తకాలకి కూడా అలాటి ఉపయోగం ఉందని నానమ్మకం.

రెండోది వర్ణనలు. సాధారణంగా కథల్లో వర్ణనలకి ప్రాధాన్యం ఉంటుంది. పాత్రలనీ, పరిసరాలనీ వర్ణించడంవల్ల పాఠకుడికి ఆ ప్రదేశాలూ, పాత్రలూ చక్కగా బోధపడి, కథలో లీనమవడానికి సాయపడతాయి. కనీసం ఇది ఈనాటి విమర్శకుల అభిప్రాయం. వెనకటికథల్లో వర్ణనలు చూస్తే మాత్రం అది గ్రంథకర్తలపాండిత్యం ప్రకటించడానికేమో అనిపించకమానదు.

తంజావూరుపతనంలో మొదటి అయిదు పేజీలలో రచయిత్రి సహ్యజనదీ, ఆ నదీతీరంలో తోట, ఆ తోటలో పెద్దిదాసు ఉంటున్న ఆరామం వర్ణిస్తారు. అందులో పదచ్ఛేదం చేసుకోవాల్సిన అవసరం రాలేదు కానీ ఆ తరు, లతా గుల్మాదుల పేరులు చూసి గుమ్మయిపోయేను. అవన్నీ కథలో చొప్పించడానికి ముందసలు తెలియాలి కదా. ఆతరవాత మంచి కవిహృదయం కూడా అయిఉండాలి అంతగా వాటిలో మమేకమయిపోయి వాటిని వర్ణించడానికి. అవన్నీ నాకిప్పుడు గుర్తు లేవు కానీ ఎప్పుడేనా రాయవలసివస్తే, ఆ పుస్తకం తీసి అవన్నీ కాపీ చేసేస్తాను మక్కికి మక్కీ!

ఈనాటి కథల్లో ఇలాటివర్ణనలు అట్టే చూడం. నాకు తెలిసి, ఆ సంప్రదాయాన్ని కొంతవరకూ తమకథల్లో పెట్టినవాళ్లు మధురాంతకం రాజారాంగారూ, కాళీపట్నం రామారావుగారు. మధురాంతకం రాజారాంగారి కథ జీవనప్రహసనం చూడండి. ఓ చిన్నపలెటూరిని చిత్రించడానికి రెండు పేజీలు పట్టింది ఆయనకి. అక్షరాలా అది బొమ్మ గీయడమే!

అలాగే పాత్రలు కూడా. వసుంధరగారు ప్రతిపాత్రనీ, నాట్యగత్తెలనీ, వర్ణించినతీరు ముచ్చటగా ఉంటుంది. కన్నులకి గట్టినట్టు అనొచ్చు కానీ ఆ నర్తకీమణులు ధరించిన ఆభరణాలూ, కాసె పోసి చీరె కట్టినతీరూ – వాటి అసలు రూపులేమిటో తెలిస్తే కదా వాటిని ఊహించుకోగలగడం. చూ.

అంచేత, ఆ పదాలు కూడా ఓహో ఇలాటివేవో ఉండేవి కాబోలు అనుకుని సంతోషించాలిసిందే. అయితే వాటి వివరాలన్నీ సేకరించడానికి వసుంధరగారు ఎంత శ్రమ పడ్డారో తలుచుకున్నప్పుడు మాత్రం నేను ఆ స్థాయికి చేరుకోడానికి చాలా చాలా జన్మలు పట్టునని తోచుచున్నది.

అలాగే విజవరాఘవనాయకుని భోజనకార్యక్రమం వర్ణించడానికి నాలుగు పేజీలు పట్టింది. ఆయన స్నానానికి పరిచారికలు ఒకొకరు పీఠం అమర్చడం దగ్గర్నుంచి, సుగంధద్రవ్యాలపూతలూ, అడుగులకి మడుగులొత్తడం …వంటివి చదువుతుంటే తలమున్కలయేను. చూడుము. ఇహ అక్కడ అమర్చిన వంటకాలు – అప్పడాలూ, నువుపొడి వంటి నాకు తెలిసిన వంటకాలతోపాటు “వడియములు వపకలిపి వండినపొడికూర”, “క్రొందునుకలుచేసి క్రొవ్విన  వేటకందనకాయ దక్రమంబున గడిగి, జంబీరసార సేచనము చేసి, గంబూర కస్తూరులు కలిపి … ” లాటి ఏనాడు కనివిని ఎరుగని భక్ష్యాలు మూడు పేజీలుంది. వాటిల్లో పదోవంతు రుచి చూడ్డానికి కూడా చాలదు చిన్ని నా కుక్షి!

వసుంధరగారిదే మరో నవల కూడా చదివేను. నవలపేరు పాటలి. మొదటిది చారిత్రకనవల అయితే ఇది  చారిత్ర్యకకథా, ప్రేమకథా కూడా. ఇందులో కథానాయిక పాటలి బ్రాహ్మణయువతి. తండ్రి గ్రామణి అనగా గ్రామాధికారిట. ఆయన తన తమ్ముడిని గ్రామసంరక్షణకి నియమిస్తాడు. గ్రామరక్షణకోసం మరి ఆయనకి క్షాత్రం కూడా రావాలి కదా. ఆయన పాటలిని చేరదీసి క్షాత్రవిద్యలు కూడా నేర్పుతాడు. కథ గౌతమీపుత్ర శాతవాహనుడికీ మహారాష్ట్రులకీ మధ్య జరిగిన యుద్ధంచుట్టూ అల్లినా పాటలీ, శాతవాహనుడికొలువులో గూఢచారి అయిన పురందరుడూ – వీరి ప్రేమకథ. ఇందులో పాటలి శక్తిసామర్థ్యాలు చిత్రించినవిధానంలో అద్భుతమైన పాండిత్యప్రకర్ష తెల్లమవుతుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే పాండిత్యం అంటే అది. పండితులంటే వారు. మరి నాలాటివారం ఏం చేస్తాం అంటే అవి చదివి అందులోవి కాపీ కొట్టి రెండవశ్రేణి రచయితలుగా స్థిరపడాలి. లేదా వారిలాగే కృషి చేసి అలాటి పాండిత్యం సంపాదించాలి. మరి వారందరూ చాలా చిన్నతనంలోనే మొదలు పెట్టేరు కదా. మరి నేనిప్పుడు, ముక్కాల్‌వాసి బతుకు ముగిసేక మొదలు పెడుతున్నాను కదా. అంచేత మీరందరూ నాయందు రవంత కటాక్షము కలిగి ఉండాలని మనవి చేసుకుంటున్నాను. మీరు ఆశించిన, లేదా అనుకుంటున్న స్థాయికి కలికాలం నాలుగోపాదం దాటకుండానే చేరుకొనుటకు కృషి చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఉన్నది కలికాలం ప్రథమపాదం కనక నాధ్యేయం సాధ్యమేనని నా దృఢనమ్మకము.

000

గమనిక – నేను ఇక్కడ ఉదహరించిన నవలలు నిజంగా మంచి నవలలు. ముఖ్యంగా తంజావూరు పతనం నాకు చాలా నచ్చింది. అది డియల్లై లైబ్రరీలో ఉంది. చూడండి

 

(జూన్ 10, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక – పండితశ్రీముఖము”

 1. @ విన్నకోట నరసింహారావుగారూ, మీకు నావ్యాసాలు నచ్చినందుకు చాలా సంతోషం. బారిష్టర్ పార్వతీశం వీసా విషయం కూడా మీరు రాసింది నిజమే అనుకుంటున్నాను. మరొకసారి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. (నేను రెండురోజుల క్రితమే మీ ఈ వెబ్ సైట్ చూడటం మొదలైంది). మల్లాది వసుంధర గారి తంజావూరు పతనము ఒక అద్భుతమైన పుస్తకం. అరవయ్యవ దశకంలో మేము నాన్-డిటెయల్డ్ పుస్తకం గా చదివాము. విజయరాఘవనాయకుడు, మన్నారుదాసు, రంగాజమ్మ, రఘునాధనాయకుడు తదితర పాత్రలు, రచయిత్రి వర్ణన ఇప్పటికీ మర్చిపోలేనివి. వసుంధర గారు మీ సమకాలీకులే అవడం చాలా బాగుంది. ఇటువంటి మంచి పుస్తకాన్ని ఈతరానికి పరిచయం చేసిన మీ ప్రయత్నం మెచ్చుకోదగినది.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  ఈ వ్యాసం నేను కొంచెం ఆలస్యంగా చదివాను. తర్వాత మళ్ళీ చదివాను. మంచి విషయాలు చెప్పారు.
  కొత్తపాళీ గారి వ్యాఖ్యలో “మీ రచనల్లో నాకు బాగా నచ్చే గుణం – బహుశ అది పాండిత్యం కిందకి రాదేమో – పదునైన విశ్లేషణ, విశ్లేషించి కనుగొన్న విషయాన్ని చదువుకునేందుకు హాయిగా, మనసుకి హత్తుకునేలాగా రాస్తారు మీరు –” పూర్తిగా నిజం.
  పాండిత్యం అంటే చెప్పలేను కానీ మీరు ఎంచుకునే వస్తువు / విషయం, మీకు వ్రాయాలనిపించే విషయాలని బట్టి మీ కథనం, భాష ఉంటాయి కదా. ఆయా విషయాల గురించి వ్రాసేటప్పుడు అవసరమైన వర్ణనలు, వివరాలు,భాషా ప్రయోగాలు పుష్కలంగా ఉండి చక్కగా ఇముడుతాయి కదా మీ కథలలో.
  “వసుంధరగారు ఆంధ్రా యూనివర్సిటీలో నా సమకాలీనురాలు, లేదా ఏడాది అటో ఇటో. ” నేను మీరీ మాటలు వ్రాయక ముందు ఒక వ్యాఖ్య వ్రాసి సరిగా చెప్పలేకపోయానని అది పోస్ట్ చెయ్యలేదు. మంచి పనే అయ్యింది. ఆమె మీకంటే చాలా ముందు వారనుకున్నాను 🙂
  మీకు ఇంకా బాగా వ్రాయవచ్చు, వ్రాయాలి అనిపిస్తుండవచ్చు. అది మంచి రచయిత లక్షణం కదా 🙂
  మీ మాటలు “We breed what we read” అని చెప్పారు మీరొకసారి. అది గుర్తుకు వస్తోంది.

  మెచ్చుకోండి

 4. @ కొత్తపాళీ, సరే, అలాగే కానీండి. :)). వసుంధరగారు ఆంధ్రా యూనివర్సిటీలో నా సమకాలీనురాలు, లేదా ఏడాది అటో ఇటో. ఆకాలంలో ఆంధ్రా యూనివర్సిటీవారు చారిత్రకనవలలు పోటీ పెట్టినప్పుడు వసుంధరగారు తంజావూరు పతనం రాసి బహుమతి గెల్చుకున్నారు. విశ్వనాథ, బాపిరాజు అప్పటికే ప్రతిష్ఠ గలవారు కనక వారిప్రభావం ఆమెమీద ఉండి ఉండొచ్చు. తంజావూరు పతనం కూడా ఆ శైలిలోనే ఉంది. రెండోవిషయం మీకు నాట్యం తెలుసు కనక ఇందులో నాట్యకత్తెల అలంకరణలూ, ఆభరణాలూ, నాట్యవిశేషాలూ వర్ణించినతీరు మీకు ఎక్కువ అర్థమవుతుందనుకుంటాను. వీలయితే చూడండి.

  మెచ్చుకోండి

 5. చాలా బావుంది.
  మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరూ పండితులే. 🙂
  వేదాలూ ఉపనిషత్తులూ చదువుకోకపోయినా, ఇలాగ పేరయినా విని ఉండని గ్రంధాలని మాకు పరిచయం చేస్తున్నారు కదా!
  అయినా, మీ రచనల్లో నాకు బాగా నచ్చే గుణం – బహుశ అది పాండిత్యం కిందకి రాదేమో – పదునైన విశ్లేషణ, విశ్లేషించి కనుగొన్న విషయాన్ని చదువుకునేందుకు హాయిగా, మనసుకి హత్తుకునేలాగా రాస్తారు మీరు – ఈ రెందు లక్షణాల వల్లా మీ రచనలు విలువైనవని నా అభిప్రాయం. పాండిత్యం అవనీయండి, కాకపోనీయండి – ఏం పర్లేదు.
  సరళ వచనం చదివి అలవాటయ్యి, వచన భాషని మరీ అరిటి పండొలిచి నోట్లో పెట్టినట్టుగా ఉండాలని జనాలు ఆశిస్తున్నారు. అడివి బాపిరాజు, విశ్వనాథల వచనమే వీరికి కష్టంగా తోస్తుంది. పద్యాన్ని స్వంతంగా చదివి పద విభజన చేసుకుని అర్ధం చేసుకో గలిగిన వారికి ఇటువంటి సంస్కృత సమాస విభజన అంత కష్టం కాదు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s