ఊసుపోక – సత్యసంధత అచ్చిరాని వేళ!

(ఎన్నెమ్మకతలు 100)

ఈ ఊ.పో. శతమానపు శుభసందర్భంలో చిత్తశుద్ధితో చెప్పుకోవలసినవిశేషం ఒకటి కనిపించింది. అది చిత్తశుద్ధి లేదా సత్యసంధత. ఎందుకంటే మనకి చిన్నప్పట్నించీ నేర్పే నీతిపాఠాల్లో మొదటిది “నిజం చెప్పు” అనే కదా. ఇలా “నిజం చెప్పు, నిజం చెప్పు” అంటూ నిప్పులాటి నిజాలు నిత్యా చెప్పకపోతే కోప్పడేవాళ్లే ఎక్కువ మనకి.

నిజానికి ఇజములవలెనే నిజాలకి కూడా అనేక ఛాయలు – నిజం, అసలు నిజం, నిజంలా కనిపించే నిజం, నిజమేనేమో అనిపించే నిజం, నిజమే కాబోలనిపించే నిజం, నిజానిజాల్లో నిజం … ఇలా. 

అయితే అంతే నిజం మరోటుంది. మనని “నిజం చెప్పు, నిజం చెప్పం”టూ చంపుకు తినేసేవారు కూడా మనకీ పొరుగువారికీ చెప్పేవి నిక్కచ్చిగా “సంపూర్ణనిజాలు, కేవలం నిజాలు, నిజం తప్ప మరోటి కాని నిజాలు” కావు, కావు, కావు అన్న నిజం. అర్థనిజాలూ, అంతంతమాత్రం నిజాలూ చెప్పి తప్పించుకు తిరగని ధన్యులు లేరు ఈ భువిలో అని నా దృఢనమ్మకం. ఎంతటి మహానుభావులైనా సరే నిజమైన నిజము చెప్పుట అన్నది కల్ల. ఏవేళ గానీ రవంత కంత ఉంచుకుంటారు తాము చెప్పే నిజాల్లో. “సత్య“ హరిశ్చంద్రుడిగా ఖ్యాతి గడించిన హరిశ్చంద్రమహరాజు కొడుకుకోసం తపస్సు చేసి, కొడుకు పుడితే, ఆ కొడుకునే ఇంద్రుడికి బలి ఇస్తానని వాగ్దానం చేసేట్ట. కొడుకు కావాలని తపస్సు చేసి, ఆ కొడుకుని బలి చేయడంలో న్యాయం ఏమిటో నాకర్థం కాలేదనుకోండి. అది వేరే సంగతి. తీరా కొడుకు పుట్టేక, బలిచ్చేడా? లేదు. మాటలు రానీ, అక్షరాభ్యాసం కానీ, ఉపనయనం కానీ … అంటూ జరుపులు పెట్టుకుంటూ వచ్చేడు. అంటే మాటలొచ్చినతరవాత బలివ్వలేదు. అక్కడికది అబద్ధమే కదా. ధర్మరాజు సంగతి సరే సరి. జగమెరిగిన  సత్యం! మరి అలాటి మహానుభావులే మాటల్లో మెలికలు పెట్టి తప్పించుకున్నప్పుడు, మనలాటి సామాన్యులమాట వేరే చెప్పాలా? “నేనలా అన్లేదు, అది కాదు నేనన్నది, నా అభిప్రాయం అది కాదు,” అని చెప్పుకు తప్పుకోడం ఈనాటి నీతి – ఇదొక్కటే నిక్కచ్చిగా సంపూర్ణ నిజం, నిజము తప్ప మరొకటి కాని నిజము.

ఇలా మాటల్ని అష్టవంకరలు తిప్పడానికి కారణాలు అనేకం. “పాపం, ఎదటివారిని నొప్పించడంవెందుకు” అనో నిజం చెప్తే తమకే చిన్నతనమనో నిజం చెప్పరు కొందరు. నిజం చెప్పలేరు కొందరు, అంటే అది వారి పుట్టుకలో లోపం. కదాచితుగా నివురు గప్పిననిప్పులా, పంచదార అద్దుకున్న చేదుమాత్రలా, చెప్పబడేదోటీ, అంతరాంతరాల అణిగిమణిగి దాగున్నది మరోటీ కావడం కూడా ప్రకృతిసహజమే.

తరిచి చూస్తే మీ జీవితాల్లో కూడా ఇలాటి సందర్భాలు కనీసం ఒక్కటైనా వచ్చుంటాయి. చిన్నవిషయమే తీసుకుందాం. ఆయన తెచ్చిన పచ్చచీరె కట్టుకుని వచ్చి, “బాగున్నానా?” అంటుంది ఇల్లాలు. “అతిలోకసుందరిలా ఉన్నావు” అంటాడాయన. నిజానికి ఆయన ఆ పచ్చచీరె కొన్నది పక్కింటి సరోజో, ఎదురింటి విమలో కట్టుకుంటే చూసి ముచ్చట పడి కొన్నది. ఆమాట ఆవిడకి చెప్పగలడా ఆయన? లేడనే అనుకుంటాను. ఆ పచ్చచీరెలో అ చిన్నది అందంగా కనిపించింది కానీ తనఅర్థాంగి ధరించినప్పుడు అలాటి వికారాలు కలగడంలేదు ఆయనకి. ఆమాట ఆవిడకి చెప్పగలడా ఆయన? చెప్తే ఎలాగుంటుంది, “అచ్చు సరోజలా లేక విమలలా ఉన్నావు,” అన్నా అది సంపూర్ణ నిజం కాదు. “ఏదో అనుకున్నాను కానీ నిన్న కట్టుకున్న నీలం చీరెలోనే ఎంతో అందంగా ఉన్నావు,” అంటాడాయన డొంకతిరుగుడుగా. ఇది సగం నిజం కావచ్చు. అలాగే ఆవిడ కూడా మామిడికాయ పచ్చడి తన చిన్నప్పుడు మేనబావ ఎంతో ఇష్టంగా తినేవాడని పెళ్ళవగానే భర్తకి మామిడికాయ పచ్చడి చేసి పెట్టొచ్చు. ఆయనకి మామిడికాయ మరో సుందరికి జ్ఞాపకచిహ్నం కావచ్చు. ఇల్లాలు మామిడికాయ పచ్చడి చేస్తే ఉగాదిపచ్చడిలా తీపీ, చేదూ. … ఆమాట ఆవిడకి చెప్పలేడు. అంచేత “నాకు మామిడికాయ పడదు. ఇంకెప్పుడూ చెయ్యకు,” అంటూ ఆవిడకి అన్యాపదేశంగా చెప్పడం జరుగుతుంది.

ఇలా అన్యాపదేశాలకి పెట్టింది పేరు ఆంగ్లేయసంస్కారం. రచయితలందరికీ అనుభవమైన ఉదాహరణే చెప్పుకుందాం. మీకథ మరో గొప్పరచయితకి చూపిస్తారు, అభిప్రాయం చెప్పమని. ఆ గొప్పరచయితకి నూటికి తొంభైతొమ్మిది పాళ్లు నచ్చదు. మరి ఆమాట ఆయన చెప్తారా? చెప్పరు. అసలు మీరు తీసుకున్న అంశం, అది ఆవిష్కరించిన తీరూ వదిలేసి, అక్షరదోషాలున్నాయంటారు. అన్వయదోషాలున్నాయంటారు, అన్వయదోషాలంటే అర్థం తెలిసో తెలీకో. ఇంకా మార్జినులమీద కూడా వ్యాఖ్యానించవచ్చు. లేదా, ఒకే ఒకముక్కలోనో, అరముక్కలోనో ఆహా బాగుంది అనేసి ఊరుకోవచ్చు. ఇదంతా నిజమైనా కాకపోయినా మీకు కావలసింది ఆ నిజం కాదు కదా. కథ మలిచినతీరు ముఖ్యం కదా. ఆవిషయం వాళ్లు మాటాడకపోవడానికి కారణం – 1. నిజంగా కథ చదవలేదు. 2. చదివేరు కానీ తమకి నచ్చలేదు. 3. కథాంశం తమకి అగమ్యగోచరం – వీటన్నిటికీ ఒకటే అర్థం, “నేను నిజం చెప్పలేను.”

బ్రిటిష్ పార్లమెంటులో అబద్ధం అన్నమాట సమ్మతం కాదు. దాన్ని unparliamentary అంటారు. ఒకసారి మన క్రిష్ణమీనన్ ఏదో సందర్భంలో అది “white lie” అన్నాట్ట. వెంటనే పక్కనున్నవారెవరో లై అనరాదు అని వారికి గల అభ్యంతరం తెలియజేసేరు. క్రిష్ణమీనన్ “నేను లై అనలేదు. వైట్ లై అన్నాను” అని సమాధానం ఇచ్చేరుట. చూసారా, “అశ్వత్థామ …” అన్నలాటిదే ఇదీను.

ఇవి కాక మరోరకం నిజం ఉంది. అసలు నేను ఈ ఊ.పో. మొదలు పెట్టింది ఇది చెప్పడానికే. మనకి నిజం చెప్పాలని ఎంత ఆతురతగా ఉన్నా, నిజం చెప్పనివ్వరు సిస్టావధానులు. “సిస్టముననుసరించి మాకిది సమ్మతము కాదు” అని జవాబిస్తారు.

నా నిజ పుట్టినరోజు తెలుసుకుని సకల జనులకు విదితం చేయదలుచుకున్న సందర్భంలో జరిగిన ఉదంతం ఇది. తారీకు కాదు, సంవత్సరంవిషయంలో కలిగింది నాకు ఈ జ్ఞానోదయం.

చాలాకాలం నేను మన రచయితల పుట్టిన సంవత్సరాలు వేరు వేరు పుస్తకాల్లో, వ్యాసాల్లో వేరు వేరుగా ఉన్నప్పుడు రచయితలు నిజాలు చెప్పడం లేదు అనే అనుకుంటూ వచ్చేను. నాదాకా వచ్చేక నాకు తెలిసొచ్చింది అలా రెండు మూడు జననసంవత్సరాలు ప్రచురించడం ఎలా జరుగుతుందో, హీహీహీ.  నామటుకు నేను ఎంతో చిత్తశుద్ధితో ప్రవర్తిస్తాను ఇలాటివిషయాల్లో. ఇలా ప్రవర్తించబోతే చావు తప్పి కన్ను లొట్టపోయినవైనం ఈ కథ.

ఈ సందర్భంలోనే మరొక హెచ్చరిక. ప్రస్తుతం ఊపిరితో ఉన్నరచయితలు వ్రాతమూలకంగా, చట్టసమ్మతమైన కాయితంమీద తమ జననవివరాలు పుట్టించి ఆర్కైవు చేస్తే భావితరాలకి ఉపయోగపడుతుందని నా నిశ్చితాబిప్రాయం.

మీకు తెలుసు కదా మనకి బర్త్ సర్టిఫికేటులు లేవు. కనీసం నాతరంలో. మనకి పుట్టినరోజులు అంటే పెద్దగాలివానకి బోర్లా పడ్డాడు, గోదావరివంతెన కూలిపోయినప్పుడు లేచి నిల్చున్నాడు – ఇలా మనకి ప్రకృతిసిద్ధమైన కితాబులే.

ఈమధ్య అమెరికాలో ప్రెసిడెంటుగారి బర్త్ సర్టిఫికేటుగురించి జరుగున్న రగడ చూసింతరవాత, ఇంకా నయం, నేను ప్రెసిడెంటుగిరీకి పోటీ చేయబోలేదని చాలా సంతోషించేను.

ఇంక అసలు కథకి వచ్చేస్తాను. అసలు నేను పుట్టడమే ఇంట్లో పుట్టేను. ఆస్పత్రికెళ్ళడానికీ, డాక్టర్లసేవలందుకోడానికీ టైము లేకపోయిందిట. తెల్లారి పదిగంటలవేళ మా అమ్మ నొప్పులొస్తున్నాయి అందిట. మంత్రసానికి కబురు పెట్టేరు కానీ ఆవిడ వచ్చేలోపున నాజననం అయిపోయింది వంటమనిషిసాయంతో. ఇప్పుడు ఆ వంటావిడని సాక్ష్యం చెప్పమనడానికి ఆవిడ ఎక్కడున్నారో తెలీదు. మ్.

నాతరంలో చాలామందికిలాగే నా స్కూలు కవిలెలో 1938 అని ఉంది. నా పుట్టినరోజు అడిగిన చోటల్లా అదే రాస్తూ వస్తున్నాను. ఇది ఇలా ఉండగా, నేను ఒకసారి మాఊరు వెళ్లినప్పుడు పాతకాయితాలు తీసి చూస్తుంటే, మాతాతగారు (మాతామహులు) మానాన్నగారికి రాసిన పోస్టుకార్డు నాకళ్లబడింది. అందులో అచ్చతెలుగులో ఫలానా తిథి, వార నక్షత్రాలతో ద్వితీయ పుత్రికాజననం అని ఉంది. ఆ కార్డుమీద ఉన్న తేదీ 1937! అలా నేను పుట్టిన నిజం సంవత్సరం నాకు నిజంగా తెలిసిందన్నమాట. నేనేమో అమెరికాలో ఉన్నాను కదా. ఇక్కడ తెల్లారి లేస్తే, ఎక్కడికెళ్ళినా, ఏ కాయితమ్ముక్కమీద ఏం గిలకాల్సొచ్చినా పుట్టినతేదీ అడుగుతారు. దానిమీద దాఖలా చూపమంటారు. ఇది నా సత్యసంధత నిరూపించుకోవాల్సిన సమయం. తప్పుడు పుట్టినరోజులు చెప్పేవాళ్లు కోకొల్లలని నాకు తెలుసు, ముఖ్యంగా ఉద్యోగాలకి అర్జీ పెట్టుకున్నప్పుడు. కానీ నాకా అవసరం లేదు కదా. హాహా.

నేను బుద్ధిగా మా ఆఫీసుకి వెళ్లి, నిజంగా నాకు ఒక ఏడు ఎక్కువుంది అని చెప్పేను. మరి నీ birth certificate ఏదీ అని అడిగేరు వాళ్ళు. నాదగ్గర అలాటిదేమీ లేదనీ, మాతాతగారు రాసిన కార్డుముక్క ఉందనీ చెప్పి చూపించేను. వాళ్లు నవ్వుతారనుకున్నాను కానీ నవ్వలేదు. ఎంతో సీరియస్‌గా ఆ కార్డు తీసుకుని, పరీక్షగా చూసి, సరే, మా కవిలె మారుస్తాం అన్నారు.

ఆ తరవాత మరి మిగతా కార్డులు – డ్రైవర్స్ లైసెన్సు లాటివి – కూడా మార్చాలి కదా. అదుగో, అక్కడొచ్చింది తంటా. Department of transportation వాళ్లు పురాతన పోస్టుకార్డుని appreciate చెయ్యలేదు. నీ బర్త్ సర్టిఫికేటు చూపించాల్సిందే అన్నారు. మాకలాటివి లేవు మహా ప్రభో అని ఎంత మొత్తుకున్నా ఒప్పుకోం కాక ఒప్పుకోం అన్నారు. ఇది పదేళ్లకిందటి మాట.

ఈమధ్య నాకు ఆస్పత్రిదర్శనాలు అవసరమైనప్పుడు చిక్కొచ్చింది. ఇన్యూరెన్సు కార్డుప్రకారం చూపిన సంవత్సరం, డ్రైవర్స్ లైసెన్సుమీదున్న సంవత్సరం తేడా! “అది తరవాత సరి చేస్తాను, ప్రస్తుతానికి 1937 వాడుకోండి” అన్నాను ఆస్పత్రివారితో. “ప్రస్తుతానికి చూస్తాం. కానీ అవి సరి చేయండి వీలయినంత త్వరగా” అన్నారు వారు కూడా సామరస్యమనస్కులై.

నాకయితే ఎగిరి గెంతేయాలనిపించింది ఆ క్షణంలో. “నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పినట్టు ఋజువయింది. దాన్ని చట్టప్రకారం పెర్జురీ అంటారు,” అంటూ అతను కానీ చట్టమంత్రాలు చదివేడంటే నేను మట్టి కొట్టుకుపోవాల్సిందే కదా.

అంతే కాదు. నేను స్వయంగా వాళ్ళఆపీసుకి వెళ్లేను కనక ఇలా జరిగింది. నిజానికి నా అర్జీ పోస్టులో కూడా పంపొచ్చు అన్నారు. నిజంగా నేను పోస్టులో పంపి ఉంటే ఏమైఉండును? తలుచుకోడానికి భయమేస్తోంది. ఈ పరమసత్యాలన్నీ నాకిప్పుడు తెలిసొచ్చేయి. నాసత్యసంధతలో మార్పులఅవసరం కూడా నాకిప్పుడే అవగతమైంది!!

(జూన్ 21, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

18 thoughts on “ఊసుపోక – సత్యసంధత అచ్చిరాని వేళ!”

 1. హమ్మయ్య! నా అదృష్టం ఏమిటి అంటే, నా నిజం పుట్టిన రోజూ, రికార్డుల్లో పుట్టినరోజూ, బర్త్ సర్తిఫికేట్ పుట్టిన రోజు అన్నీ ఒక్కటే! 😉 నా స్నేహితులు కొందరికి అఫిషియల్, అనఫిషియల్ పుట్టినరోజులు ఉన్నాయి. ఒక్కోసారి తికమకగా ఉంటుంది నాకు ఏదన్నా సందర్భంలో వాళ్ళ అఫిషియల్ పుట్టినరోజు ఫాం లో ఫిల్ చేస్తూ ఉంటే! 😉

  మెచ్చుకోండి

 2. @ C V R Mohan, అదేనండీ. వయసు మనకి జాతకాలున్నాయి అది కూడా జరిగేవారికి కానీ చాలామంది సామాన్యులకి మాత్రం ఏ కాయితాలు లేవు. మరో తమాషా, పిల్లలు 6, 8 … 18, 19 వరకూ ఎక్కువ చెప్పుకోడానికే సరదా పడతారు. ఆ తరవాత, తగ్గించుకు చెప్తారు. మళ్లీ 80 దాటేక, అబ్బో, ఇంతకాలం బతికేం అని గొప్పగా చెప్పుకోడానికే ఇష్టపడతారు. మనస్తత్వాలలో ఈ వైచిత్ర్యం రికార్డు చెయ్యడానికే ప్రయత్నిస్తున్నాను. అంతే గానీ, నా సొంత గొడవ కాదు. నిజానికి వీటిలో కల్పనలే ఎక్కువ.

  మెచ్చుకోండి

 3. మీరు గమనించారో లేదో కానీ,
  ఇక్కడ పటాలం పెద్ద (ఆర్మీ చీఫ్) గారి పుట్టిన రోజు
  తిరకాసు గురించి పెద్ద ముసలం/ దుమారం లేచింది.
  ఆయన జన్మ దిన పత్రాన్ని కాదని,
  ఒక సంవత్సరం ముందుగానే ఇంటికి పంపించారు.
  చాల వరకు వయస్సు తగ్గించే ప్రయత్నాలే జరుగుతాయి,
  మీలా వయస్సు ఎక్కువని చెప్పే చిత్త శుద్ధి ఎవరికీ ఉండదు.
  నాకు మీ మీద గౌరవం ఎక్కువైంది.

  మెచ్చుకోండి

 4. @ మౌళి, హమ్మో, మీకు విషయపరిజ్ఞానం (అనుభవం) నాకంటే చాలానే ఉన్నట్టుంది. అయినా చెప్పేను కదా నలభై ఏళ్ళక్రితంమాట – వీసా సంగతి. అసలు అంతకుమున్ను ఈధ్యాసే లేదు. ఈ టపాకి ఫలం ఇదే -మీరిచ్చిన వివరాలు :p

  మెచ్చుకోండి

 5. చెప్పడం మరిచాను మాలతి గారు, నాకు బర్త్ సర్టిఫికేట్ అవసరం అయినపుడు పాస్పోర్ట్ లో ఉన్న తేది తోనె తెప్పించుకొన్నాను. నిజమైన తేది తో తెప్పించుకొంటే వీసాకి కావాల్సిన సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ లలో అప్పటికప్పుడు నేనెక్కడ మార్పించ గలను !

  మీరు నిజమైన తేది చెప్పినా,అబద్దం తేది చెప్పినా ఆ సర్టిఫికేట్ కి అయ్యే లంచం ఖర్చు మాత్రం మారదు, ఒకటే !

  మెచ్చుకోండి

 6. హ్మ్ స్కూల్ రికార్డ్స్ లో ఒక సంవత్సరం ఎక్కువ వేయిస్తారు కాని, తక్కువ కాదు. కాబట్టి గుర్తులేక కూడా అలా చెప్పి ఉండవచ్చు. తప్పువేయించి మీరు పొందిన లాభం ఏమి లేదు కాబట్టి , మీరు చేసే ఇప్పటి ప్రయత్నం సత్యసంధత క్రిందికి వస్తుందా అన్నది అనుమానమే 🙂 కేవలం మీది ఆసక్తి, అభిమానము మీ వివరాలపై. ఇండియా లో ఆ లెటర్ చూపి బర్త్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించవచ్చు. అసలా చిన్న ఆధారం లేకుండా కూడా మన దేశం లో బర్త్ సర్టిఫికేట్ వస్తుంది అండీ.

  మెచ్చుకోండి

 7. @ మౌళి, అవునండీ. నాదే బుద్ధి తక్కువ అని ఇప్పటికి తెలిసిందని చెప్పడానికే ఈ తాపత్రయం అంతా. అయినా అసలు మానవజీవితమే శాశ్వతం కానప్పుడు ఈ తారీకులు, దస్తావేజులు మాత్రం శాశ్వతమా ఏమటి, హా. మీరన్నట్టు ధర్మరాజు, ఇంద్రుడు … నాకు అస్సలు అర్థం కాని పాత్రలు. మ్. మీ అభిప్రాయాలు ఇక్కడ వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. పాపం హరిచ్చంద్రుడికి బుద్ది లేక అప్పటికి పుత్ర ప్రేమ అంటే తెలీక మాట ఇచ్చాడనుకోండి, ఇంద్రుడికో , ఆకాలపు పెద్దలకో బుద్ది ఉండక్కర్లా 🙂 కొడుకుని బలి ఎలా ఇస్తారు అని సర్ది చెప్పాల్సింది పోయి ,తూచ్ అనాలి లేకపోతె ఒట్టు తీసి గట్టుమీద పెట్టాలి అని .అవునూ ఈ ఇంద్రుడే కదా కొడుకుని కాపాడుకోడానికి కర్ణుడిని మోసం చేసి కవచకుండలాలు కొట్టేసి 😀

  ఇక ధర్మరాజు, నిజం చెప్పడం వల్ల ఆయినకి ఒక్క కష్టం వచ్చినట్టు కూడా చెప్పరు.కనీసం అన్నదమ్ములలో ఆయనొక్కడే నిజాలు మాత్రమే చెపుతుంటే, మిగిలిన నలుగురితో ఎన్ని సమస్యలు వచ్చుంటాయో పాపం 🙂

  అయినా కావాలని ఒకసంవత్సరం తగ్గించుకొని బడిలో చేరి, ఇప్పుడు అవసరం అయిపోయాక నిజం చెపుతున్నా అని మీరంటే చెల్లుతుందా 🙂 అబద్దం కాకుండా పోతుందా 😛 సరదాగా అన్నానండీ.

  మీరు తేది మార్చుకోవాలని ప్రయత్నించడం సరి కాదు అని నా అభిప్రాయం. రచయిత్రి గా ఎలాగు మీ వివరాలలో సరి చేయిమ్చుకొన్నారు కదా, అంతకన్నా ఎక్కువ ఆశించడం వృధా. ఎవరయితే మీ వివరాలు అలా రిజిస్టర్ చేయించారో వారి పరువు నిలబెట్టడానికయినా ధర్మరాజులా మీరు కూడా మీ ఖాతాలో ఒక అబద్దాన్ని అలా వదిలెయ్యాలి 🙂

  మెచ్చుకోండి

 9. “ఈమధ్య అమెరికాలో ప్రెసిడెంటుగారి బర్త్ సర్టిఫికేటుగురించి జరుగున్న రగడ చూసింతరవాత, ఇంకా నయం, నేను ప్రెసిడెంటుగిరీకి పోటీ చేయబోలేదని చాలా సంతోషించేను.” 🙂 🙂

  మెచ్చుకోండి

 10. 🙂
  రెండు రోజుల తేడాతో నాకూ పుట్టినరోజు తేదీకి ఉన్న విలువ తెలియక పట్టించుకోక చేసిన పొరపాటు, నిజమే చెప్పాలని నిర్ణయించుకుని నాకున్న అనుమానాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఇక్కట్లు (నాకు కావలిసిన వారి మీద అభాండాలు) నాకూ అనుభవం 😦

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s