మార్పు 45

లీల మెట్లెక్కి రెండో అంతస్థులో ఉన్న పెద్దక్కయ్య వాటాముందు అడుగు పెట్టబోతూ అక్కడ పరిస్థితి చూసి ఉలిక్కిపడి ఒకడుగు వెనక్కి వేసింది. తరవాత నెమ్మదిగా అక్కడున్న గలీజులో అడుగు పడకుండా చూసుకుంటూ, తలుపు దగ్గరికి చేరి తలుపు తట్టింది. నాలుగు క్షణాలతరవాత పెద్దక్కయ్య తలుపు తీసి, రా, అంటూ వెనక్కి ఒకడుగు వేసి, లీల లోపలికొచ్చింతరవాత తలుపు మళ్ళీ వేసేసింది, “నువ్వొస్తానని ఫోను చేస్తే రావొద్దని చెప్పి ఉండేదాన్ని,” అంది.

“ఏమయింది,” అంది లీల వికారంగా మొహం పెట్టి.

పెద్దక్కయ్య కూడా చిరాకు పడుతూ, “తెలీదు. మూడో అంతస్థులో ఉన్న ఎవరో నిన్న పొద్దున్నే సుమారు ఆరు, ఏడు గంటలప్పుడు మెట్లమీద వాంతి చేసుకున్నట్టుంది. నేను నామామూలుప్రకారం వాక్‌కి బయల్దేరి తలుపు తీస్తే, అలా ఉంది. అప్పుడప్పుడు ఓ అమ్మాయి తనకుక్కని వాకుకి తీసుకెళ్తుంది పొద్దున్నే. మరి ఆ అమ్మాయేనో, ఆకుక్కో తిన్నది అరక్క వాంతి చేసుకున్నట్టుంది. నాగుమ్మంలో చేసేరు కదా, శుభ్రం చెయ్యడమో, ఎవర్నైనా పిలిచించి శుభ్రం చేయించడమో, మేనేజరుని పిలవడమో ఏదో చెయ్యాలి కదా. ఏమీ లేదు. వాళ్ళు మాటాడకుండా ఊరుకున్నారు. మధ్య నాకూ ఈ తద్దినం.”

“మరి మీరు మేనేజరుని పిలిచి చెప్పలేదా?”

“చెప్పేను నిన్ననే. మొదట ఇమెయిలిచ్చేను, మరి ఆఫీసు అంత పొద్దున్నే తెరవరు కదా. ఆదివారాలు ఒంటిగంటకి వస్తారు. ఒంటిగంటయేక మళ్ళీ పిలిచి చెప్పేను. ఆ మేనేజరు ఆదివారాలు ఎవరూ పని చెయ్యరనీ, సోంవారంవరకూ ఆగాలనీ అన్నాడు.”

“శుభ్రతలమీద ఇంత ఉపన్యాసాలిస్తారు మరి ఇవాళయినా ఎవరూ రాలేదా?” అంది లీల. అప్పటికి మధ్యాన్నం రెండయింది. ఎవరూ వచ్చి శుభ్రపరిచే జాడ లేదు మరి.

“అదే. ఇవాళ తెల్లార్తూనే, అదేలే వాళ్లఆఫీసుకి తెల్లార్తూనే మళ్ళీ పిలిచి చెప్పేను. మానేజరు మానవుడు వర్క్ ఆర్డరు పెట్టేను అన్నాడు తీరిగ్గా. ఇప్పుడే నువ్వొచ్చే ముందు ఆఫీసుకి వెళ్ళి మళ్ళీ అరిచి వచ్చేను.”

“అదే మీరో నేనో అలా చేసి ఉంటే మనజాతి మొత్తాన్ని దులిపి ఉండేవాళ్ళు ఇండియనులకి శుభ్రత లేదూ అంటూ.”

“అదే మరి. ఇందాక నేను వాళ్ళ ఆఫీసుకి వెళ్ళినప్పుడు చెప్పేను ఇప్పటికిప్పుడు క్లీనింగు క్రూని పిలిచి శుభ్రం చేయించమని. అలా చేయించకపోతే, తన్మూలంగా నాకేమైనా రోగాలొస్తే వాళ్ళనే అడుగుతాను అని కూడా చెప్పేను.”

“మంచిపని చేసేరు.”

ఆ క్షణంలోనే తలుపుకవతల వాక్యూమ్ శబ్దాలు వినిపించేయి. “క్లీనింగువాళ్ళు వచ్చినట్టున్నారు.”

“ఇందాకా మీరన్నారు మనవాళ్లకి శుభ్రత లేదని. నాకు ఆమధ్య వచ్చిన సినిమా గుర్తొస్తోంది.”

“ఏం సినిమా?”

“అదే స్లమ్ డాగ్ … అందులో ఓ సన్నివేశం ఉంది. మీరు చూసేరా?”

“లేదు సినిమా చూడలేదు గానీ నువ్వంటున్న సన్నివేశం ఎవరో యూట్యూబులో ఉందని లింకు పంపించేరు. నేనూ నీలాగే అనుకున్నాను.”

“ఆ ఒఖ్ఖ సన్నివేశం తప్పిస్తే, మిగతా సినిమా బాగానే ఉంది. మీరేమనుకున్నారు?”

“ఓ. ఆ సన్నివేశం చూసింతరవాత నేను సినిమా ఎంత దరిద్రంగా ఉంటుందో అనుకుని చూడ్డం మానేశాను.”

“లేదండీ. సినిమా బాగానే ఉంది మామూలుగా అన్ని సినిమాల్లాగే. ఆ సన్నివేశం మాత్రం – నాకాశ్చర్యం మనవాళ్ళు దానికెందుకు అభ్యంతరం చెప్పలేదో.”

“ఏం చెప్తారు మనవాళ్ళు? వాళ్ళకి అమెరికన్ అభిప్రాయాలే కదా.”

“మరీ అంత ఘోరంగానా? మనవాళ్ళ అశుభ్రత ఎంత ఎత్తి చూపాలని ఉంటే మాత్రం.”

“కొంతవరకూ నిజమే కదా.”

“అలా కాదు. అందరూ అలాగే ఉండరు కదా. నేనంటున్నది మనవాళ్ళకి శుభ్రత ఉందా లేదా అన్నది ఎలా చూపించేరు అన్నది. ఒకకొప్పుడు పిల్లలకి ఆ ధ్యాస ఉండదు. ఒక చిన్న పిల్లాడు మలకూపంలో దూకడం వేరు. వాడు పదిమందిమధ్యకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అసహ్యించుకున్నట్టు కనిపించదు ఆ సినిమాలో. అతి మామూలుగా వాడికి దారి ఇస్తారు, వాడు వెళ్లి అమితాబ్ సంతకం తీసుకుంటాడు. అది చాలా అసహజంగా ఉంది అంటున్నాను. దానిమూలంగా మనజాతి అంతటినీ హేళన చేస్తున్నట్టు అనిపించింది నాకు.”

పెద్దక్కయ్య ఆలోచిస్తూ, “నిజమే. మనదేశంలో పైతరగతివాళ్ళకి స్నానాలూ, కాళ్లూ చేతులూ కడుక్కోడాలూ చాలానే ఉన్నాయి కదా. స్నానాల్లో అనేక విధులూ, వాటివల్ల లాభాలూ చాలానే ఉంది తరిచి చూసుకోదలుచుకున్నవారికి. మనం పొద్దున్నే లేవగానే స్నానం చేస్తాం మనసూ, శరీరమూ కూడా శుభ్రంగా ఉంచుకోడానికి.“

“ఇక్కడ వీళ్ళు స్నానం సాయంత్రం చేస్తారు.”

“కానీ అంతకంటే ఎక్కువగా డియోడరైజర్లుతో గడిపేవాళ్లే ఎక్కువ. నిజానికి వీళ్ళు శుభ్రత అంటూ, క్రిమిదోషాలంటూ వాడే సానిటైజర్లు ఎంత మితి మీరిపోతున్నాయో చూసావా?”

“అవును. నేను వచ్చిన కొత్తలో సబ్బుతో చేతులు కడుక్కోడం అన్నారు. తరవాత ఈ లోషనులూ, లోషనుతో కూడిన కాయితపు రుమాళ్ళూ … ఇప్పుడు స్ప్రేలూ … ఈమధ్య ఎక్కడో చదివేను ఆ లోషనులలో వాడే ఆల్కహాలు మూలంగా కూడా ఓ బీరు తాగిన ఫలితం కలగొచ్చని. తెల్లారి లేస్తే వందమార్లు ముఖ్యంగా పిల్లలచేతులూ మొహమూ ఆ ఆల్కహాలు రుమాళ్ళతో తుడిస్తే వాళ్ళకి ప్రమాదం అంటున్నారు.”

“అవును. అలాగే తిళ్ళు కూడాను. వేళపట్టున ఓ చోట కూర్చుని చక్కగా భోంచేస్తే ఏ బాధలూ ఉండవు. స్నాకులంటూ రోజంతా ఎక్కడ పడితే ఏది కనిపిస్తే అది నవులుకుంటూ పోతారు. ఆపైన కాలరీలో అంటూ గిలగిల్లాడతారు.”

పెద్దక్కయ్య లేచింది టీ పెట్టడానికి. లీల కూడా ఆవిడ్ని అనుసరించింది వంటగదిలోకి.

“దేవుడున్నాడంటావా?” అంది పెద్దక్కయ్య హఠాత్తుగా.

లీల ఉలిక్కిపడింది, “ఇప్పుడాయనగారి సంగతెందుకొచ్చిందీ?”

“ఏం లేదు, ఊరికే. కొందరు మనుషుల్ని చూసినప్పుడు వీళ్లని ఆయనే తయారు చేసేడా అనిపిస్తుంది.”

“హా.”

“ఉంటే మాత్రం చేతగాని ఇంజినీరు అని నా అనుమానం.”

“ఎంచేతా?”

“నువ్వొక మరబొమ్మని తయారు చేస్తున్నావనుకో. దానికి రెండో మూడో బొత్తాయిలు పెడతావు. ఒకటి నొక్కితే నవ్వుతుంది. మరొకటి నొక్కితే కుశలమా అంటుంది. … మరొకటి నొక్కితే ఏడుస్తుంది. కానీ నువ్వు ఆ ఏడుపు బొత్తాయి లేకుండా తయారు చేయొచ్చు కదా. మరి దేవుడు మనిషిని సృష్టిస్తే అలాగే అంటే కేవలం సుఖప్రదమైన ఆలోచనలూ, అలవాట్లూ గల మనిషిని సృష్టించి ఉండవచ్చు కదా.”

“మీతో వాదించలేను కానీ నాకు ఏం అనిపిస్తోందంటే మనిషిని దేవుడు తన ప్రతిరూపంగా, చిన్న సైజులోనే అనుకోండి సృష్టించేడు, తనలాగే స్వనిర్ణయాలు చేసుకోగల అధికారం జోడించి. ఆయన ధర్మం దుష్టశిక్షణ, శిష్టరక్షణాను. దుష్టులుంటేనే కదా శిష్టులని రక్షించవలసిన అవసరం వస్తుంది. అందుకన్నమాట దురూహలనీ, దుర్లక్షణాలనీ కూడా మనిషిలో పెట్టడం జరిగింది.”

ఇద్దరూ నవ్వుకున్నారు. “వితండవాదం అంటే ఇదే.”

“పోనీండి. మరోలా ఆలోచిద్దాం. మొట్టమొదట మనిషిని ఒక్కణ్ణే సృష్టించలేదన్నది స్పష్టం. ఒక అబ్బాయినీ ఒక అమ్మాయనీ – ఇద్దర్ని సృష్టించేడు. ఆ మనిషి మొదట్లో ఆకులూ అలములూ తినేవాడు కానీ క్రమంగా వేటాడ్డం నేర్చుకున్నాడు. అతను బయటికి వెళ్ళి వేటాడి భోజనానికి కావలసిన సామగ్రి తెస్తుంటే, ఇంట్లో అమ్మాయి వంట నేర్చుకుని వంట చేసి, ఇద్దరూ తింటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. అప్పట్లో ఇది నాపనా కాదా, అది నీపనా కాదా అంటూ మాటల్లో చెప్పుకోడం, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లాటి చర్చ లేదులెండి. అలాటిరోజుల్లో ఒకడికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. కలిసి ఉంటే కలదు సుఖం అని. అందుకని చుట్టూ ఉన్న పదిమందిని పోగేసి, మనం ఒక గణం, మనం అందరం సమసమాజం సృష్టించుకుందాం. దానికోసం కొన్ని నియమాలు పెట్టుకుందాం అని చెప్పి, ఆ నియమాలు కూడా తానే రాసేసి సిద్ధం చేసేనని చెప్పేడు. అలా గణనాయకుడు పుట్టేడన్నమాట. అదుగో, అప్పుడే ఎక్కువ తక్కువలు కూడా వచ్చేసేయి. ఎలా అంటే గణనాయకుడిమాట మిగతా వారంతా వినాలి కదా. అలా గణనాయకుడు ‘ఎక్కువ’ అయేడు. గుంపులో అంటే సమాజంలో గణనాయకుడు ఎక్కువ అన్నతరవాత మరి ఇంటికొచ్చినతరవాత ఎవరు ఎక్కువ అన్న ప్రశ్న తలెత్తింది. బువ్వ తెచ్చేది నేను కనక నేనే ఎక్కువ అన్నాడతను. నువ్వు తెచ్చింది సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే సరిపెట్టి అవన్నీ నేను కదా చేస్తాను, అంచేత అసలు నేనే ఎక్కువ అంది అమ్మాయి. ఆతరవాత పెద్ద పనీ, చిన్నపనీ, చేత్తో చేసే పనీ, తలతో చేసే పనీ,… వీటి ఎక్కువ తక్కువలూ నిర్ణయమవుతూ వచ్చేయి,” లీల చెప్పడం ఆపి వింటున్నారా అన్నట్టు చూసింది పెద్దక్కయ్యవేపు.

పెద్దక్కయ్య కళ్ళు చికిలించి లీలని పరీక్షగా చూస్తూ ఏ స్వామివారో, అమ్మగారో ఓ బ్రహ్మరహస్యం బోధిస్తుంటే వింటున్నంత శ్రద్ధగా వింటోంది. “తరవాతేమయింది?” అంతే సీరియస్‌గా.

“ఏముంది. మనుషులకి కష్టాలు మొదలయేయి. అప్పుడు, బుద్ధుడూ, జినుడూ, … ఇలా ఒకొకరు ఒకొక మతం సృష్టించడం మొదలు పెట్టేరు. ఈలోపున సమాజంలో ఇతర గణనాయకులు కూడా పుట్టుకొచ్చేరు. వాళ్ళతో కక్షలు మొదలయేయి. మాగణం ఎక్కువ అంటే మాగణం ఎక్కువ అంటూ వాదించుకోడం మొదలు పెట్టేరు. అప్పుడే మొదలు యుద్ధాలు.”

“సరే, ఆ యుద్ధాలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. అంచేత అదే నీకథకి ముగింపు అనుకుందాం. అసలింతకీ ఈ కథంతా ఎందుకొచ్చింది?”

“ఏమో, నాకేం తెలుసూ?” అంది లీల అమాయకంగా మొహం పెట్టి.

ఇంతలో సిరి వచ్చింది.

“ఓ, లీల కూడా ఇక్కడే ఉందని తెలీదు. ఇంటిముందు వాకిలి కడిగించేవు ఏమిటి కథ. ముగ్గులు పెట్టలేదేం?,” అంది సిరి లోపలికొస్తూ.

“అదంతా ఓపెద్ద కథలే. రా. అంతకంటే లీల ఇంకో మంచి కథ చెప్తోంది, విను. నువ్వు కూడా ఓ చెయ్యో మాటో వెయ్యి. పుణ్యం, పురుషార్థం కూడా కలగొచ్చు.”

“ఏమంటుందేమిటి?” అంది సిరి చిర్నవ్వుతో లీలవేపు తిరిగి.

“భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు లోకంలో ఇంతటి దురన్యాయాలు జరుగుతున్నాయి? మరి దుష్టశిక్షణా, శిష్టరక్షణకి చెయ్యడానికి భగవంతుడు ఇంకా అవతరించలేదేం? లేదా, అవతరిస్తే, మనకి ఎలా తెలుస్తుంది? ఇదీ సూక్ష్మంగా.”

లీలకి సిగ్గేసింది ఆ ఉపోద్ఘాతం వింటుంటే. “అది కాదండీ. ఈమధ్య ఒకట్రెండు పుస్తకాలు చదివేను. అవి చదివింతరవాత నాకు సందేహాలు ఎక్కువయేయే కానీ తగ్గలేదు. ఒకరకంగా నిస్పృహ కూడా కలుగుతోంది. అది మరి నాలో లోపమేనేమో … తెలీదు.”

“ఏం సందేహాలు?”

“మానవనైజం ఏమిటి? ఎలా ఏర్పడింది? అని.”

“ఆహా, చాలా పెద్ద సందేహాలే.”

“అది కాదండీ. సందేహాలు కాదేమోలెండి. నాకంతా రాను రాను గందరగోళం అయిపోతోంది. మానవజాతి చరిత్ర ఇప్పుడున్న అవతారంలోనే తీసుకోండి. అంటే రాగద్వేషాలూ, ఇష్టాష్టాలూ, కోపతాపాలూ, కక్షలూ, కార్పణ్యాలూ, దురాశలూ, దురూహలూ – ఇవన్నీ ఎప్పడు ఎలా వచ్చేయా అని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య చదివిన పుస్తకాలు చూస్తే ఇవన్నీ క్రీస్తుపూర్వంనించీ అంటే దాదాపు ఏడు వేల సంవత్సరాలకి పూర్వమే ఉన్నట్టుంది కదా.”

“అలా ఎందుకనుకుంటున్నావు?”

“వేదాలూ, మతాలూ – బౌద్ధమతం, జైనమతం – ఇవన్నీ పుట్టి ఏడువేల ఏళ్ళయిందంటున్నారు కదా. అది కూడా మనకి తెలిసినంతవరకే. నిజానికి అంతకు పూర్వమే ఉండి ఉండాలి. వాటిలో ఏం చెప్తున్నారు? మనోనిగ్రహం, ధర్మచింతన, మోక్షసాధన ప్రధానంగా చెప్తున్నారు. ఆ తరవాత సంఘం. సాటిమనిషికి సేవ కానీ సాయం కానీ చెయ్యడం మానవధర్మంలో భాగం అని.”

“అందులో తప్పేముంది?”

“తప్పనడం లేదు. అవి ఎప్పుడు చెప్పవలసివస్తుంది అంటే అవి లేనప్పుడే కదా. మీకు మనోనిగ్రహం ఉంటే, నేను పని గట్టుకుని మీ మనసుని నిగ్రహించుకోండి అని చెప్పను కదా. అంచేత ఈ విరుద్ధబావాలు కానీ విపరీతస్వభావాలు కానీ అంతకు పూర్వమే ఉండాలి.”

“ఉండే ఉండొచ్చు. అందుకే కదా వాటిని అదుపులో పెట్టుకోమని శాస్త్రాలూ, పురాణాలూ ఘోషిస్తున్నాయి.”

“హా. బాగా చెప్పేరు. ఘోషిస్తున్నాయి. నిజానికి నా ఘోష కూడా అదే.”

“అంటే?”

“అంటే ఇన్నివేల సంవత్సరాలుగా బుద్ధి తెచ్చుకోండి బాబో అని శాస్త్రాలూ, పురాణాలూ ఘోషిస్తున్నా, మనుషులు అట్టే మారినట్టు కనిపించడంలేదు. మార్పు వచ్చింది కానీ అత్యంత ప్రధానమైన విషయంలో కనిపించడం లేదు. స్వార్థం, స్వోత్కర్ష ఎక్కువయినట్టే కనిపిస్తున్నాయి కానీ తక్కువైన జాడల్లేవు. కోరికలు దుఃఖహేతువు. అంచేత కోరికలు చంపుకోవాలి. కర్మ ఆచరించాలి కానీ నిస్సంగత్వంతో ఆచరించాలి ఇలా దాదాపు అన్ని మతాలు చెప్తున్నాయి. హింస చేయరాదు అంటారు జైనులు. బౌద్ధులు తాము ప్రాణహింస చేయరు కానీ వేరేవారు చంపితే, ఆ మాంసం తినడానికి అభ్యంతరం లేదు. శైవులు వర్ణాశ్రమాలు అంగీకరించరు.

వేదాలు అపౌరుషేయాలు అంటున్నారనుకోండి. కానీ ఎవరో ఒకరు వాటిని ప్రచారంలోకి తెచ్చేరు కదా. ఆ మీదట మిగతా మతాలకి నాయకులున్నారు. బుద్ధుడూ, మహావీరుడూ, మహమ్మదూ, క్రైస్ట్ … ఇలా.  వాళ్లు కూడా నిజానికి మానవజన్మ ఎత్తేరు కనక మానవులే. ఎటొచ్చీ నాయకత్వం వహించగల కొంచెం ఎక్కువ మానవులు. వాళ్లు ఆచార్యత్వం వహించి బోధలు చేస్తే మిగతావారు అంగీకరిస్తున్నారు. ఎందుకంగీకరించాలో నాకు అర్థం కాదు. ఎంచేతంటే నాదృష్టిలో మనిషి అనగానే మానవులందరికీ ఉండే వికారాలు కొన్నయినా కొంత వరకైనా వారికి  కూడా ఉంటాయనే నానమ్మకం. వాళ్ళెవరూ దేవుళ్లు కారు. వాళ్ళని దేవుళ్లగా పూజించడం న్యాయం కాదు. ఇలాటి ఆలోచనలు ఒక బాధ నాకు. రెండోది, ఈ ధర్మాలన్నిటిలోనూ ఏం చెప్పేరు? వేదాలనాటికే సమాజం అంటూ ఏర్పడింది. ప్రతివారికీ ఓ ధర్మం, కర్తవ్యం – నువ్విలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అంటూ మొదలు పెట్టేరు. దానికి ప్రతిగా, అలా చెయ్యకపోతే ఏమవుతుంది. అది నేరం అవుతుంది. దానికి శిక్ష అనుభవించాలి. అలా వచ్చిందన్నమాట ఒకరిమీద మరొకరు అధికారం చెలాయించడం, ఒకరిని మరొకరు హింసించడం. అసలు హింస అన్న పదం ఉంది చూడండి. దానికి వ్యతిరేకం అహింస, హింస కానిది. అంతే గానీ అహింసకి వేరే పదం లేదు. సాహిత్య ఎకాడమీవారి నిఘంటువులో హింస చేయమి అని ఉంది. అంటే హింస అన్నదే ఒరిజినల్, సహజం అనిపిస్తోంది నాకు.”

పెద్దక్కయ్య, సిరి నవ్వేరు, ”నువ్వు చాలా గందరగోళంగా మాటాడుతున్నావు,” అంది సిరి.

లీల కూడా నవ్వేసి, “సరేలెండి. నాది తలతిక్క వాదనే అనుకుందాం. ఇంతకీ ఈ మతాలన్నిటిలోనూ సామ్యాలు ఉన్నాయి. కొన్ని ప్రతివాదనలున్నాయి. మొత్తంమీద చూస్తే మాత్రం అందరు కోరేది – శాంతియుత సహజీవనం. బుద్ధుడు హింస కూడదన్నాడు. జైనులకీ అంతే. హిందూమతం మాటకొస్తే, అసలు హిందూమతం అంటూ ఒక్కటి లేదు, అది అనేక మతాల సమాహారం అంటారు వీరభద్రరావుగారు..”

“ఆయనెవరు?”

“ముదివేడు వీరభద్రరావుగారని. ఆయన రాసిన పుస్తకం భారతీయ సంప్రదాయ భూమిక. భిన్వత్వంలో ఏకత్వం లీల ఆమధ్య చదివిందిలే.”

“మీరెందుకు నవ్వుతున్నారో నాకు తెలీదు కానీ నిజంగానే ఆపుస్తకం నాకు చాలా నచ్చింది. ఆయన వేదాలదగ్గర మొదలు పెట్టి, ప్రతిమతంలోనూ మూలసూత్రాలూ, వాటి అంతర్భావాలూ, వాటికీ ఇతరమతాల్లో భావాలకీ సమన్వయం ఎలా కుదరగలదో చక్కగా వివరించేరు. భారతీయ సంప్రదాయాలన్నా, ఇతర దేశాల్లో మతాలు – జొరాస్ట్రియన్, జూయిష్, క్రిస్టియానిటీ …  కూడా స్థాలీపులాకన్యాయంగా ఎత్తి చూపుతూ – పీఠమే వాటికన్ అయిఉండగలదు లాటివి … కూడా చెప్పేరు. ఇంతకీ అసలు విషయం, నేనంటున్నది లేదా నాకు కలుగుతున్న ధర్మచింతన – ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా అనేకమంది ఆచార్యులో మతప్రవక్తలో ధర్మనిర్ణయాలు చేసి, మానవులంతా ఆచరించాలని చెప్తున్నారు. ప్రతి ఆచార్యుడికీ, ప్రతి ప్రవక్తకీ లక్షలసంఖ్యలో అనుయాయులు తయారవుతున్నారు తామరతంపరగా. కానీ ధర్మం ప్రతిష్ఠాపితమయిందా? అన్యాయాలూ, అక్రమాలూ, దురంతాలూ ఆగిపోయేయా? కనీసం తగ్గేయా? గణాంకాలు సరి చూసేవారు ఏదో ఒక ఊళ్ళో ఏదో ఓ నెల లేదా ఓ వారం – ఇంత శాతంలో హత్యలో తగ్గేయి, దొంగతనాలు తగ్గేయి అని చూపవచ్చు కానీ, నిజంగా గట్టిగా తరిచి చూస్తే మానవాళిలో, అంతరాంతరాల ఏమార్పూ రాలేదనే అనిపిస్తోంది నాకు. ఇలా తరిచి చూస్తే చాలామంది నిత్యా వల్లించే ధర్మపన్నాలన్నీ పైపై మైపూతలే కానీ మానసికమైన ప్రవర్తన మాత్రం ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టు ఉంది. అందులో మార్పు లేదు. ఇంకా చెప్పాలంటే హీనం అయిందేమో కూడా. పూర్వం మతంపేరున ఎన్ని దురాగతాలు జరిగేయో ఇప్పుడు చట్టంపేరునా, వ్యక్తిగతవిజయంపేరునా అంతకి పదిరెట్లు అన్యాయాలూ, అక్రమాలూ, దౌర్జన్యాలూ, హింసలూ సాగుతున్నాయి. ఏరోజు వార్తలు చూడండి. ఎవడో ఒకడు ఎదటివాణ్ణి తప్పు పట్టని రోజుండదు. అదేసమయంలో తాను చేసిన తప్పులు ఒప్పుకోడు.  చిన్నవిషయమే – పెద్దక్కయ్యగారి గుమ్మంలో గలీజు చేసిన మనిషిని చూడండి. వీళ్ళు తుమ్మినా దగ్గినా క్షమాపణలు చెప్పుకునే జాతి కదా. అంత నికృష్టంగా వాంతి చేసుకుని ఊరుకుంటారా. ఏమాత్రం బాధ్యత తెలిసినమనిషి అయినా కనీసం వచ్చి ఈవిడకి క్షమాపణ చెప్పక్కర్లేదా? తనకి వీలయినంతవరకూ అక్కడ శుభ్రం చెయ్యొచ్చు. ఏమీ లేదు. హాయిగా తనయింట్లో వెళ్ళి కూర్చుంది. చూసినవాళ్ళంతా అది పెద్దక్కయ్య చేసిన గలీజు అనుకుంటారు కదా. “నాహక్కులేమిటో నాకు తెలుసు” అనే దోషిని చూసిన ప్రతిసారీ నాకు నవ్వొస్తుంది. తనహక్కులే కానీ తాను ఎవరికి ద్రోహం చేసేడో వారి హక్కులు తాను గౌరవించలేదని గుర్తించడు. ఈనాడు న్యాయస్థానాలన్నీ దుష్టులనే పరిరక్షిస్తున్నాయి.”

లీల ఆగింది తన ఆవేశం మితి మీరిపోతోందని అప్పుడే గ్రహించినట్టు.

పెద్దక్కయ్యా, సిరి కూడా తనని తదేకంగా చూస్తున్నారు ఏదో సినిమా చూస్తున్నట్టు.

లీలకి ఒక్క లిప్తపాటు సిగ్గేసింది. తేలిగ్గా నవ్వేసి, “నాకు పిచ్చెత్తిందనుకుంటున్నారేమో మీరు.”

“అహ, అది కాదు. ఎంతకాలంనించీ ఇదంతా కడుపులో పెట్టుకున్నావో, ఇంకా ఏం చెప్తావో, చెప్పవలసింది ఇంకా ఏముందో అని.”

లీల తల అడ్డంగా ఊపుతూ, “ఇప్పటికే చాలా మాటాడేను. ఇంక వెళ్తాను.”

“సరే. వెళ్లి రా.”

“ఇంక రాను.”

“అదేమిటి? ఎక్కడికేమిటి ప్రయాణం.”

“దిగంతాల్లోకి.”

పెద్దక్కయ్యా, సిరీ నవ్వేరు. “దిగంతాల్లోకా?”

“ఇదివరకోసారి అన్నాను కదా. ధ్యేయం లేకుండా తిన్నగా కారు తోలుకుంటూ పోవాలని నాకోరిక అని. దానికిప్పుడు సమయమాసన్నమయింది.”

“సుందరానికి చెప్పేవా?”

“సుందరంగారికా? అవసరం లేదనుకుంటా. ఆయనకి చెప్పినా ఒకటే. ఈ తలుపుకి చెప్పినా ఒకటే. బహుశా మరోవారం రోజులగ్గానీ ఆయనకసలు నేనింట్లో లేనన్నసంగతి తెలియదేమో కూడా,” అంటూ లీల బయటికి నడిచింది.

పెద్దక్కయ్యా, సిరి ఆమెని అనుసరించేరు.

“వెళ్లి రా.”

“నేను దిగంతాల్లోకి వెళ్ళిపోతున్నానంటే మళ్ళీ రమ్మంటారేమిటి.”

“అలా డ్రైవు చేసుకుంటూ పోతానని కదా అన్నావు. భూమి గుండ్రంగా ఉంది కనక మళ్ళీ నువ్వు ఇక్కడే తేల్తావని.”

“లేదా, మరో జన్మలో,” అంది సిరి.

లీల తల అడ్డంగా ఆడించి, కారెక్కింది.

కారు వీధి మలుపు తిరిగేవరకూ చూసి, చిన్నగా నిట్టూర్చి పెద్దక్కయ్యా, సిరి లోపలికి నడిచేరు.

(జులై 7. 2012)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.