మార్పు సింహావలోకనం

2010 డిసెంబరులో నేను ఈ మార్పు ధారావాహిక ప్రారంభించినప్పుడు చెప్పేను ఇది ఎలా సాగుతుందో అన్నవిషయంలో ఒక నిశ్చితమైన ఆలోచన లేదని. అప్పట్లో దేశం ఆమూలనించి ఈ మూలకి – ఉత్తరపు కొసనించి దక్షిణపు కొసకి – వచ్చి పడగానే దాదాపు ఇండియానించి అమెరికా వచ్చినరోజులు తలపుకొచ్చేయి. సంస్కృతిపరంగా అంత తేడా ఉంది ఈ రెండు ప్రాంతాల్లోనూ, ఇండియాలోలాగే. ఆ అనుభవం అక్షరగతం చెయ్యాలని అనుకున్నాను. అప్పట్లో “ఇది దేన్నిగురించి అంటే మార్పుగురించే … మనలో, మన పరిసరాల్లో, మాటతీరులో, ఆశల్లో, ఆశయాల్లో … మార్పు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ …J. )” అని కూడా అనుకున్నాను.

అప్పట్లో నేను గుర్తించిన మార్పులతో మొదలుపెట్టినా, క్రమంగా ప్రపంచవ్యాప్తంగా మనజీవితాల్లో వచ్చిన మార్పులు నామనసులో మెదిలేయి. ముఖ్యంగా మూడు తరాల్లో – మా అమ్మానాన్నగారి తరం, నాతరం, ఈనాటి తరం, నిజానికి నావయసు దృష్ట్యా నాలుగు తరాలవుతాయి కానీ కొంత గిట్టుబాటు చేసుకున్నాను నా సౌలభ్యంకోసం – కాలక్రమంలో వచ్చినమార్పులు రాయడం మొదలు పెట్టేను.

అలాటి సందర్భంలో అనుకోకుండా అప్రయత్నంగా పరిచయం చేసిన పాత్రలతో కథ పాత్రగతం అయిపోయింది. కథగా అస్తవ్యస్తంగానే అనిపించినా, ఈ “మార్పు”లో నేను ప్రధానంగా అక్షరగతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది ఏ ఒక్క పాత్ర జీవితచిత్రణో కాక, సామూహికంగా మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, ధ్యేయాల్లో వస్తున్న మార్పులు. పాఠకులు కూడా ఈపాత్రల ఆవిర్భావానికి బాగా స్పందించడంతో ఇది నవల అనిపించుకోగల రూపురేఖలు సంతరించుకోడం మొదలయింది.  ఇది ఈ ధారావాహికలో నేను ఊహించని మార్పు.

“పాత్రలు కథని నడిపించేయి” అని రచయితలు అనడం మామూలే. ఇక్కడ ఈమార్పువిషయంలో పాఠకులు కథని నడిపించడం మొదలు పెట్టేరు అనాలి. వారి స్పందనలద్వారా నేను నాకథని మార్చుకుంటూ ఇంతకాలం నడుపుకుంటూ వచ్చేను.

అయితే నవలకీ, ధారావాహికగా రాసే పిట్టకథలకీ (నా ఊసుపోక ధారలా) చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది. నవలలో ప్రధానంగా కావలసింది “తరవాతేమయింది”, “ఎలా ముగిసింది” అన్న ప్రశ్నలకి సమాధానం. అది నవల ప్రాథమిక లక్షణం. ఇలా తరవాతేమయింది అన్నప్పుడు, ఏదో అవుతుంది, అంతటితో ఆ కథ సమాప్తమవుతుంది. అంటే నవలకి ముగింపు ఉంటుంది.

కానీ మార్పుకి ముగింపు లేదు. అనాదిగా మార్పు జరుగుతూ వస్తోంది. అనంతంగా సాగుతూ పోతుంది. కథకోసం పాత్రలని సృష్టించినప్పుడు అనంతంగా సాగడం కష్టం. టీవీలోdaytime soap సంవత్సరాలతరబడి కొనసాగిస్తారు కానీ అక్కడ కూడా వాళ్లు కొత్తపాత్రలు ప్రవేశపెడుతూ, తరవాతితరానికి మారుస్తారు కధని.

నవలలో ప్రధానాంశానికి సంబంధించని సన్నివేశాలూ, సంఘటనలూ పెట్టడం కష్టం కాదు కానీ వాటికోసం మరి కొన్ని పాత్రలు చేర్చవలసి వస్తుంది. ఉదాహరణకి విషి నల్లవారి అమ్మాయిని ఇంటికి తెచ్చినందుకు తండ్రి మండిపడ్డాడు. కానీ వారి పెద్దకోడలు కూడా తెలుగుపడుచు కాదు. మరి అప్పుడు ఆయన ఎలా అంగీకరించేరు అన్నది ఇంతవరకూ వివరించలేదు. అప్పుడు కూడా ఆయన ఆగ్రహం చూపించే ఉండొచ్చు. ఇలాటి సందర్భాల్లో కాలక్రమేణా సమాధానపరుచుకోడం జరుగుతుంది. మళ్ళీ రెండో కొడుకు కూడా మరోజాతిఅమ్మాయిని తెస్తే, ఆయనకి ఆప్పటికోపం మరొకసారి రేగి ఉండొచ్చు. పైగా అమెరికా తెల్లవారిదేశం, నల్లవారికి ఇక్కడ గౌరవం లేదు అన్న మరొకకోణం ఎత్తి చూపడానికి ఆస్కారం అయింది. అలా ఎక్కడికక్కడ పెంచుకుంటూ పోవచ్చు. అందుకు తగినట్టు పెద్దకోడలు, ఆమె తల్లిదండ్రులు – ఇలా మరికొన్ని పాత్రలు కూడా చేర్చి అమెరికన్ సాంప్రదాయాలు చర్చించవచ్చు.

ఇది నవల అనుకుంటే మొన్నటి టపా మార్పు 45లో సుమారుగా ఒక ముగింపు కూడా చూపించడం జరిగింది. కొన్నివేల సంవత్సరాలుగా మతంపేరున, సంఘంపేరున, చట్టాలపేరున మనిషిని ఉదాత్తునిగా, ఉన్నతునిగా చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచీకరణపేరుతో దేశాలమధ్య దూరాలు తరిగిపోతున్నాయి. ప్రజలు జ్ఞానసంపన్నులు అవుతున్నారు, పూర్వంకంటె ఇప్పుడు ఎక్కువమందికి అనేక విషయాలు అవగతమవుతున్నాయి. మొత్తం మానవాళి అంతా నాగరీకం అవుతోంది. Personal development పేరుతో వ్యక్తి తనని తాను ఉద్ధరించుకోడానికి పడే తాపత్రయం ఎక్కువయింది. ఉద్ధరేదాత్మానం ఆత్మనా అన్న గీతావాక్యానికి ఇది మరొక కోణం అని కూడా అనుకోవచ్చు! ఎటొచ్చీ ధ్యేయాలు వేరు.

ఏడువేల ఏళ్ళక్రితం బుద్దుడు. ప్లేటో, మనువు, మహమ్మదు, క్రీస్తు వంటి విజ్ఞులు గుర్తించిన నీతి, చిత్తశుద్ది, సదసద్వివేచన, ఎదటిమనిషియందు దయ, ఆదరణ, గౌరవం చూపడం వంటి గుణాలు తీసుకుని చూస్తే మాత్రం మార్పు ఏమీ కనిపించడం లేదు. ఇదివరకొకసారి రాసేను లోకాల తలుపులు తెరుచుకున్నవేళ మనసులు మూసుకుపోతున్నాయని, ఎదల్ని చెదలు తినేస్తున్నాయని. ఈనాడు ఏమనిషిని తీసుకుని చూసినా కనిపించేది అహంకారం, స్వోత్కర్ష, స్వార్థం. ఇవి పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. తద్వారా దౌర్జన్యం, హింస కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నీతులు వల్లించినా, ఎన్ని పూజలూ, జపాలూ చేసినా, స్వార్థం, స్వోత్కర్ష పరిధిలోనే కానీ వాటికి దూరం కావడంలో లేదు, కావడానికి ప్రయత్నించడం లేదు. మౌలికంగా మనిషి మారలేదు.

విలువలు మారేయి. పూర్వం సచ్ఛీలుడు, చిత్తశుద్ధి గలవాడు, సద్గుణసంపన్నుడు అంటే ఎంతో గౌరవం. ఇప్పుడు వ్యక్తివిజయానికి కొలమానం ఆర్జన. సాంఘికంగా విజయం సాధించేడు అంటే అర్థం బాగా సంపాదించేడు అని. “నీకు ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అది చేయడం నీకు ధర్మమే” అన్నది ఈనాటి ప్రాథమికసూత్రం.

అంతే కాక, నాకు మరొక సమస్య ఎదురైంది. ఈ ధారావాహిక ఇలా పొడిగించుకుంటూ పోతుంటే నాకు ఇదొక్కటే వ్యాపకం అయిపోతోంది. తరవాత ఏం రాయడం అని ఆలోచించుకోడం, ఆ ఆలోచనలు కథ రూపంలో కాయితంమీద, అదేలెండి కంప్యూటరుమీద పెట్టడంతో నేను మరో పని చేసుకోలేకపోతున్నాను. ముఖ్యంగా తూలిక.నెట్‌కి న్యాయం జరగడం లేదు.

అంచేత ఇప్పుడు సుదీర్ఘంగా ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చేను. ఈ పాత్రలకి ఇక్కడ చుక్క పెట్టేయడం ఒక్కటే నాకు తగిన మార్గంగా కనిపించింది.

కానీ ఆ మార్పు ధారావాహికని మీరందరూ ఆదరించినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ స్పందనలమూలంగా మరిన్ని విషయాలు విషయాలు తెలుసుకున్నాను. మరింత ఆలోచించే అవకాశం కలిగింది. అంచేత, సందర్భాన్నిబట్టి నేను మొదట వేసుకున్న పథకంప్రకారం ఎప్పుడైనా ఏదో ఒక “మార్పు” నాదృష్టికి వస్తే అది టపాగా రాస్తాను. ఈ పాత్రలపేర్లే వాడతానేమో కూడా. కానీ ఏ టపాకి ఆ టపాయే ఓ చిన్న కథలా, ఓ అంశంమీద కేంద్రీకరించి నేను గమనించిన మార్పులు ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తాను, ఊసుపోక ధారావాహికలాగే. అప్పుడు తరవాతేమయిందన్న ప్రశ్న రాదు. నాసందేహాలు మీముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉభయతారకంగా కనిపిస్తోంది నామటుకు నాకు.

ఇంతవరకూ మార్పుధారని ఆదిరించిన పాఠకులకి మరొకసారి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ముందు ముందు కూడా ఈ టపాలు మీ అదరణకి నోచుకుంటాయని ఆశిస్తూ …

మీ సౌకర్యార్థం మొత్తం మార్పు టపాలన్నీ పిడియఫ్ లో ఒకచోట చేర్చి పెట్టేను. వీలయినంతవరకూ తప్పులు దిద్ది.

మార్పు 1 to 21

మార్పు 22 to 45

000

 

(జులై 12, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “మార్పు సింహావలోకనం”

 1. @ దీప, సారీ. నిజమే, మార్పు ఇంకా కొనసాగించవచ్చు. కానీ నాకు రాయడానికి తోచడంలేదు. ప్రస్తుతం ఇంకా రాయవలసినవి ఉన్నాయి. అవి పూర్తి చేసి, కాస్త ఆలోచించి, మళ్లీ మరోవరస మొదలు పెడతాను. మీరు నారచనని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. @ mohan, సారీ. ఏమోలెండి, పాత్రని చంపేలేదు కదా. అంచేత మరీ అంత విషాదం కాదు.
  @ సౌమ్య, నీవిషయంలో కూడా ఆరోజుకోసం ఎదురు చూస్తుంటాను. :p

  మెచ్చుకోండి

 3. “మార్పు ఒక్కటే ఎప్పటికీ ముగింపు లేనిది”
  కానీ లీల పాత్రని ట్రాజిక్ గా ముగించడం బాగా లేదు.

  మెచ్చుకోండి

 4. @ లక్ష్మి రాఘవ, ధన్యదాలు.
  @ లలిత, మీరు నా పుస్తకాలన్నీ చదువుతానంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అలాగే మీకు వీలయినప్పుడే మీ అభిప్రాయాలు రాయండి. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ, అన్నీ ఒక చోట పెట్టి లింక్ ఇచ్చిందందుకు Thanks.
  అన్నీ చదివి అభిప్రాయాలు పంచుకుంటాను ఎప్పటికైనా 🙂
  చాలా ఆలోచనలు పెండింగులో ఉన్నాయి. మీ కథలతో మొదలు పెట్టుకుని మీ పుస్తకాలు, మీరు పరిచయం చేసిన పుస్తకాలు, వాటిని చదివి నేను పంచుకోవాలనుకునే ఆలోచనలూ, పిల్లల కోసం చెయ్యాలనుకున్న తెలుగు ప్రాజెక్టులూ అన్నీ తగిన సమయం, శ్రద్ధ కోసం ఎదురు చూస్తున్నాయి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s