ఊసుపోక – ముంగిట మల్లెలు

(ఎన్నెమ్మకతలు 102)

చీకటితోనే లేచి వరండాలోకి వెళ్లేను అలవాటు ప్రకారం చుక్కలెక్కడున్నాయో, చందమామెక్కడున్నాడో చూడ్డానికి. నిర్ధారణగా తెలీడంలేదు కానీ కృష్ణపక్షంలో చంద్రుడు కళలు తరుగుతూ ఎడమనించి కుడికి జరుగుతూ చీకటి పడుతున్నవేళ కనిపిస్తున్నాడు. బహుళపక్షంలో కుడినించి ఎడమకి జరుగుతూ నాలుగోఝామున దర్శనమిస్తాడు. ఇదేదో మీరే కనిపెట్టినంత కొత్తగా చెప్తారేమిటి అని మీరు అడగొచ్చు కానీ అమెరికా వచ్చేక నేనీఇంటికి వచ్చేవరకూ చందమామలూ, చుక్కలూ గమనించలేదు. నిజానికి నేనిక్కడికి వచ్చేకే తొలిసారి తోకచుక్కలు రాలుతుంటే చూసేను. రూపాయిబిళ్ళంత తాబేలు పిల్లని చూసేను. నదిఒడ్డున చేపలు పట్టడం నేర్చుకుంటున్న పిల్లలు, తల్లిబాతువెంట తిరిగే పిల్లబాతులూ, పొద్దువాలే వేళ  జలయంత్రాలు ఎగసి విరజిమ్ముతున్న నీటిధారల్లో హరివిల్లులు … ఇవేవీ నేను కనిపెట్టినవి కావు, కానీ వీటిని చూస్తుంటే జీవితంలో ఎంత మరిచిపోయేనో ఇప్పుడు తెలుస్తోంది.  రెండు వారాలక్రింతం ఆస్టిను వెళ్ళినప్పుడు కల్పన నాకో మల్లెమొక్క బహూకరించింది.

c

ఇప్పుడు బహుమానాలెందుకూ అంటారా. ఏమో, తననే అడగండి. ఇంతకీ ఇవాళ తెల్లవారుఝామునే లేచి, తలుపు తీసేసరికి నేలమీద రాలి ఉన్న మల్లెపూలు చూసి గుమ్మయిపోయేను.

ఇలా నేలమీద వాడినపూలు కనిపించడం ఎప్పుడో నాచిన్నప్పుడు విశాఖపట్నంలో మా పెరట్లోనే – అప్పట్లో అవి పారిజాతాలు. మళ్ళీ ఇవాళ చూస్తున్నాను. ఇవి మల్లెలు. ప్రాణం లేచొచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

నేను ఆస్టిను వెళ్ళబోయేముందు అక్కడ చూసేవి చాలా ఉన్నాయని చాలామందే చెప్పేరు. ఎక్కడికేనా వెళ్తే అక్కడ ప్రముఖ విహారస్థలాలు చూడ్డం ఆచారం కదా. గుడికెళ్ళినంత నిష్ఠతో బజార్లంట తిరిగేవారున్నారు. నేనూ, కల్పనా ఎక్కడికంటే ఎక్కడికి అని అక్కడున్న 264 ఆకర్షణీయ ప్రదేశాలగురించి సుదీర్ఘంగా చర్చించుకు ఆఖరికి పిట్టల్నీ, పువ్వుల్నీ చూడ్డానికి బయల్దేరేం.

మొదట పిట్టలకోసం చూసేం. ఎండ మండిపోతోంది. ఎక్కడ చూసినా పక్షి జాడ లేదు. మేం సరైన ప్రదేశంలో ఉన్నామో లేదో తెలుసుకోడానికి కూడా కొంత టైం పట్టింది. ఆ దారినే కారులో వస్తున్న మరో విజిటరులని ఆపి అడిగితే, “మీరున్నది సరైన ప్రదేశమే కానీ సరైన సమయం కాదు. రెణ్ణెల్లకిందట రావలసింది. అయినా ఫరవాలేదు, అలా వెళ్ళి చూడండి, ఏదో ఓ పక్షి కనిపించకపోదు”  అన్నారు. సరే, సరైన ప్రదేశంలోనే ఉన్నాం కదా అని సంతసించి, ముందుకి సాగేం. మామూలుగా ఏ ఇంటిముందైనా కనిపించే పిట్టలు ఓ నాలుగు కనిపించేయి. ఆ తరవాత గోరింటపువ్వుల్లాటి పువ్వులు కనిపించేయి.

టైము చూస్తే పన్నెండయినా అవలేదు. సరే ఇప్పుడే ఇంటికెళ్ళడం ఎందుకని, అదేదో బొటానికల్ గార్డెను చూద్దాం అని అక్కడికి వెళ్ళేం. అక్కడ మాకు కనిపించినవి –

సీతాకోక చిలుక బారలు చాచి తీరిగ్గా సేదదీరుతున్నదొకటీ

ఆకులందున అణిగి మణిగి ఆడుతున్నదొకటీ

అంతకంటే విచిత్రమైనవి ఆరగమీ అనబడే కాయితపు బొమ్మలు. కత్తెరలూ, తుమ్మజిగురూ లేకుండా కేవలం కాయితం మడతలు పెడుతూ చెయ్యగలిగిన ఆ బొమ్మలు భలే ఉన్నాయి. అక్కడున్నవన్నీ Robert J. Lang చేసినవి.

ఆయన ఇవి చెయ్యడానికి మొదట ఇలా గీతలు గీసుకుంటారుట.

ఈ దేశసంచారం పూర్తి చేసుకుని ఇంటికొచ్చేం. మరోగంటకి కాంపుకెళ్ళిన వాళ్ళబ్బాయి ఇంటికొచ్చేడు. మామూలుగా ఆ వయసుపిల్లలు పెద్దవాళ్లతో మాటాడరు కానీ చిన్ను మాత్రం చక్కగా మాటాడేడు. వారంరోజులకేంపులో తను పట్టిన ఒక పౌను చేప, తనస్నేహితుడు పట్టిన 80 పౌనులచేప, చేపల్లో రకాలూ – ఆరోజు నాకు చేపలవేటగురించి చాలా విషయాలు తెలిసేయి. నేను ఇన్నాళ్ళూ “చేపలు పట్టడం స్పోర్టు ఏమిటి, నీళ్ళలో గేలం వేసి చూస్తూ కూర్చుంటారు” అనుకునేదాన్ని. కానీ పదమూడేళ్ళ చిన్ను అంత సరదాగా ఆ విద్యగురించి చెప్తుంటే, ఆ చేపలబొమ్మలు చూపిస్తుంటే, ఓహో చేపలు పట్టడానికి ఇంత కథా, కమామీషూ ఉందన్నమాట అనుకోకుండా ఉండలేకపోయేను.

నాకు అంతకంటే సరదా అనిపించిన మరో విషయం – వాళ్ళిద్దరి సంభాషణలు. కల్పన తెలుగులో మాటాడుతుంటే చిన్ను ఇంగ్లీషులో జవాబులు చెప్పడం. అంటే కల్పన మాటాడ్డంమూలంగా చిన్నుకి తెలుగు వినే అవకాశం కలుగుతోంది. అదీ నాకు నచ్చింది. నిజమే కదా మనం పిల్లలు తెలుగు మాటాడ్డం లేదంటాం కానీ దానికి కావలసిన వాతావరణం కల్పించడం మర్చిపోతాం. వాళ్లు తెలుగులో ఉపన్యాసాలు ఇవ్వఖ్కర్లేదు కనీసం ఆదివారం, రేపు సాయంత్రం, వంకాయకూరలాటి మాటలయినా తెలుసుకోవాలంటే  పెద్దలు కనీసం ఆ నాలుగు తెలుగుముక్కలయినా ఇంట్లో వాడుతుంటేనే కదా. లేకపోతే తెలుగులో ఆమాటలు లేవనుకోగల్రు కూడా పిల్లలు. ముంగిట్లో మల్లెలూ, అంగిట్లో తెలుగు అని పాట కట్టబోతున్నాను. :))

సరే, నేనూ, కల్పనా కలిసి టేపులసంగతి ముందే చెప్పేసేను కదా.

చివరిమాటగా, ఆ మల్లెపూలు నన్ను వెనక్కి తీసుకెళ్లినతరవాత, ఆచంట జానకిరామ్‌ గారు జ్ఞాపకం వచ్చేరు. నేను తిరపతిలో ఉన్నప్పుడు ఆయన మాయింటికి వస్తుండేవారు. ఆ సంగతి మరొక టపాలో.

(జులై 29, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – ముంగిట మల్లెలు”

  1. మాలతి గారు,అన్నీ విశేషాలు చక్క గా రాశారు. ఇది మల్లెల వేళయన్న మాట మీ ఇంట్లో..:-)) పిట్టల కోసం వెళితే పిట్టలు లేవు. పువ్వుల కోసం వెళితే మన పెరట్లో రోజూ కనిపించే మందారాలు :-))
    చిన్నూ చేత మీ బ్లాగ్ పోస్ట్ చదివిస్తాను.:-))

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s