మన సాహిత్యచరిత్ర – సంకలనాల్లో, పత్రికలలో, విమర్శల్లో, …

జులైలో నేను  కల్పనని కలుసుకున్నప్పుడు, మాకబుర్లలో సంకలనాలప్రసక్తి వచ్చింది. ఆ తరవాత మన సాహిత్యచరిత్రగురించిన ప్రశ్నలు తలెత్తేయి. అంతకుముందు సౌమ్య మహిళావరణం చదువుతూ నాతో సంకలనాలవిషయం ప్రస్తావించడం కూడా ఒక కారణం మాకబుర్లకి.

ఈరెండు చర్చలమూలంగా నాకు కొన్ని ఆలోచనలు వచ్చేయి. ఇక్కడ మీరందరూ గమనించవలసిన ముఖ్యవిషయం – నేనూ కల్పనా చేసిన చర్చ విడియో మాసిపోయినా, ఆడియో ఉంది. దానికి లింకు ఇక్కడ.  మేం చేసిన టేపులు అట్టే ప్లానేమీ లేకుండా చేసినవి. అవి ఒక క్రమపద్ధతిలో జరగలేదు. అంచేత చిన్న చిన్న పొరపాట్లు కూడా దొర్లేయి. ఒకచోట నేను పోతన రామాయణం రాసినప్పుడు అన్నాను. పలికించెడువాడు రామభద్రుడట అన్న పాదం మనసులో మెదిలి కావచ్చు. ఏమైనా అలాటి తప్పులు మన్నించగలరని ఆశిస్తున్నాను. ఈ వ్యాసంలో అభిప్రాయాలకి మాత్రం నాదే బాధ్యత. ఈ ప్రశ్నలూ, సమాధానాలూ కూడా నావే.

నాకొచ్చిన సందేహం – మరో వందేళ్ళు పోయేక, ఈనాటి, అంటే నాకళ్ళముందు నడుస్తున్న సాహత్య చరిత్ర, 1975 నించీ 2012వరకూ, తెలుగుసాహితీ రీతులు ఎలా ఉండేవి అని ఎవరైనా పరిశీలించి చూడాలనుకుంటే, వారికి దొరికే సమాచారం ఎలా ఉంటుంది అని.

నూటికి తొంబైతొమ్మిది పాళ్ళు అసమగ్రంగానూ, అసంబద్ధంగానూ, పాక్షికంగానూ  ఉంటుందనిపిస్తోంది నాకు. కల్పన కూడా సుమారుగా అదే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇప్పుడు ఎలా ఉందన్న బాధ కన్నా ముందుతరంవారికి ఈనాటి సాహిత్య చరిత్ర భవిష్యత్తులో ఎలా అందించగలం అన్నది ప్రధానమైన విషయం.  మన సాహితీవేత్తలూ, సాహిత్యాభిమానులూ, సాహితీప్రియులూ – సమస్త సాహితీజనులూ సుదీర్ఘంగా, శ్రద్ధగా పరిశీలించవలసిన అవుసరం ఉంది. అదీ ఈ వ్యాసానికి నాందీ ప్రస్తావన.

– సూక్ష్మంగా మన సాహిత్యచరిత్ర స్వరూపం ఏమిటి?

– మనకి గ్రంథస్థం అయిన సాహిత్యచరిత్ర చాలా తక్కువ. అందులోనూ కూలంకషంగా పరిశీలించి, నిజానిజాలు పరీక్షించుకుని, అక్షరగతం చేసిన చరిత్ర  మరీ తక్కువ. పైగా సాహిత్యం అనంతంగా సాగుతూనే ఉంటుంది కనక ఎప్పటికప్పుడు దాన్ని పునః పరిశీలించుకోడం అవసరం. అయితే అలా పునః పరిశీలించుకోడానికి కావలసిన వసతి కల్పించడం ఈనాటి విమర్శకుల, వ్యాసకర్తల, ఉపన్యాసకుల, పత్రికాసంపాదకుల, సంకలనకర్తల, రచయితల బాధ్యత.

నేను తొలిసారిగా సాహిత్యచరిత్రగురించి ఆలోచించింది నిడుదవోలు వెంకట్రావుగారి సాహిత్యం చదువుతున్నప్పుడు. ఆయన తనకి ముందు మానవల్లి కవిగారు కవులచరిత్ర రాసినట్టు చెప్పేరు. మానవల్లి కవిగారూ, నిడుదవోలు వెంకటరావుగారూ కూడా కవులను మాత్రమే గణనలోకి తీసుకున్నారు తమ గ్రంథాలకి. అలాగే మొట్టమొదట కవయిత్రులచరిత్ర గ్రంథస్థం చేసినవారు ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు కూడా రచయిత్రులని మాత్రమే పరిచయం చేసేరు. ఆ తరవాత మళ్ళీ సాహిత్యచరిత్ర ఒక బృహత్కార్యంగా చేపట్టింది ఆరుద్రగారు. సమగ్రాంధ్రసాహిత్యం పేరుతో ఆనాడు ఎమెస్కోవారు ఇంటింట గ్రంథాలయం పేరున నెలకో సంపుటం చొప్పున అందించిన సంపుటాలు తెలుగు సాహిత్యచరిత్రలో మైలు రాళ్ళు. సంపుటాల సంఖ్య చెప్పాలంటే కాలక్రమంలో 12, 13, చివరకి 4 అయేయి. ఇంకా ఉన్నాయేమో నాకు తెలీదు.

సమగ్రాంధ్రసాహిత్యం ఆధునికయుగంలో ఆరుద్రగారు కథ, నాటకం, విమర్శ, సంకలనాలు, సాహిత్యసంస్థలూ, సంఘాలూ – ఇవన్నీ కూడా స్వీకరించేరు. అయినా కొందరు ప్రముఖ కవులు, రచయితలు సమగ్రాంధ్రసాహిత్యంలో కనిపించరు. నేను వ్యాసాలు రాస్తున్నప్పుడు ఈ సంపుటాలు చూస్తే, కనుపర్తి వరలక్ష్మమ్మగారిపేరు. ఈమాట నేను చెప్తున్నది ఆరుద్రగారిని తప్పు పట్టడానికి కాదు. ఇటువంటి బృహత్ కార్యక్రమం చేపట్టినప్పుడు వారు నిర్ణయించుకునే పరిధులమాట అలా ఉండగా, ఇతరత్రా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనగలరు కదా. ఆరుద్ర కవులనీ, రచయితలనీ ఎందుకు తమ గ్రంథంలో చేర్చుకోలేదూ అని నేను ప్రశ్నించడం లేదు. అలా వదిలివేయపడిన కవులగురించీ, రచయితలగురించీ భావితరం పాఠకులకి తెలియజేడానికి, మన సాహిత్యచరిత్రలో వారికి తగిన స్థాయి కల్పించడానికి ఇప్పుడు మనం చేయగలిగినది ఏమిటి అనే నాప్రశ్న.

నావైబ్‌ సైటు తూలిక.నెట్‌ కి కథలనీ, రచయితలనీ ఎన్నుకోడంలో నేను కొంతవరకూ ఈ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకునే చేస్తున్నాను. మంచిరచనలు చేసినా, కొమ్ము కాసేవారు లేక ఈనాడు ఆనవాలు లేకుండా పోతున్న రచయితలను, వారి రచనలను ఎంచుకోడం కూడా ఒక నియమంగా పెట్టుకున్నాను. మిగతా పత్రికలూ, విమర్శకులూ, వ్యాసకర్తలూ, తదితర పండితులూ విస్తృతంగా ప్రాచుర్యంలోకి తెస్తున్న రచయితలకి నేను అట్టే ప్రాధాన్యత ఇవ్వని కారణం కూడా ఇదే. అస్సలు తీసుకోనని కాదు కానీ, వారివిషయంలో తాత్సారం చేస్తాను.

నేను చూసినంతవరకూ ఈనాడు వస్తున్న వ్యాసాలూ, సంకలనాలూ, సాహిత్యచరిత్ర పుస్తకాలూ కూడా ఒకే ఒరవడిలో పోతున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి ముందు రచనలన్నీ జాతీయోద్యమం, జాతీయదృక్పథం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని కొనసాగినవయితే, స్వాతంత్ర్యం వచ్చినతరవాత వచ్చిన రచనలన్నీ దేశ పునర్నిర్మాణానికీ, సాంఘికసంక్షేమానికి దోహదం చేసేవిగా ఉంటూ వస్తున్నాయి. అది దోషం కాదు. కానీ, ఆ ఊపులో సాంఘికప్రయోజనం మాత్రమే పరమార్థం అయిపోయి, తదితర రచనలకి, ముఖ్యంగా ప్రయోగాత్మక రచనలకీ దిక్కు లేకుండా పోవడం న్యాయమా, మన సాహితీక్షేత్రం బహుముఖంగా విస్తరిల్లడానికి ఆటంకం కాదా అని నా సందేహం. ఇది మనం అందరం ఆలోచించుకోవలసిన, పునః పరిశీలించుకోవలసిన పరిస్థితి అనుకుంటున్నాను.

– కథల్లో సాంఘికప్రయోజనం ముఖ్యం కాదా?

– సాంఘికప్రయోజనం కథల్లో ఉండకూడదని కాదు. కానీ అదొక్కటే తిరుమంత్రం అయిపోడం శ్రేయస్కరం అనుకోను. ఈనాడు బహుమతులు పొందిన కథలు, సంకనాలకోసం ఎంచుకున్న కథలు, వ్యాసాలూ, ఉపన్యాసాలూ, పత్రికాసంపాదకులు, పత్రికాధిపతులు ఆదరించి ప్రచురణకి అంగీకరించిన కథలు – వీటిల్లో ఏవి తీసుకుని చూసినా సాంఘికప్రయోజనం ఉంటేనే వాటికి పుట్టగతులు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

– ఈనాటి సంకలనాలు ఎలా ఉంటున్నాయి?

– సంకలనాలయితే విస్తారంగా వస్తూనే ఉన్నాయి కానీ పైన చెప్పిన సాహిత్యప్రయోజనం మాత్రమే ఏకైక సూత్రంగా ఎంపికలు జరుగుతున్నాయి. ఏ సంకలనం తీసుకున్నా ఆ రచయితలే, ఆ కథలే కనిపిస్తున్నాయి తెలుగుదేశంలో మరి కథకులు లేరేమో అన్నట్టు. పైగా ఆ భాగోతం చాలనట్టు ఆ సంకలనాల్లోంచే అవే కథలు తీసి మళ్ళీ మరో సంకలనంగా ప్రచురిస్తున్నారంటే, తెలుగు సాహిత్యంలో రెండోసారి క్షీణయుగం దాపురించిందేమో అనుకోవాలి. (పూర్వం 1775-1875 తెలుగుసాహిత్యాన్ని క్షీణయుగంగా అభివర్ణించారు.)

విశాలాంధ్రవారు ప్రచురించిన బృహద్గ్రంథం “తెలుగు కథ, 1910-2000” తీసుకోండి. ఈ సంకలనం పేరు చూసినప్పుడు ఆ తొంభై ఏళ్ళలో తెలుగుకథ తీరుతెన్నులు ఎలా ఉండేవో తెలుస్తాయనే అనుకుంటాం కదా. నేను అలాగే అనుకున్నాను. అంటే తెలుగులో వస్తున్న వివిధ కోణాలూ, వివిధ దృక్పథాలూ, వివిధ శైలులూ, వివిధ భాషావిన్యాసాలు చూస్తాం కాబోలు అని. కానీ ఈ కథలన్నీ ఒకే ఒక కోణం – పైన చెప్పిన సామాజిక ప్రయోజనం – సమాజకేంద్ర దృష్టిని ప్రధానంగా పెట్టుకుని ఎంచుకోడం జరిగిందన్నారు సంపాదకులు. అంచేత  వైయక్తికమైన మానసికచిత్రణ, తదితర కోణాలు ఈ సంకలనంలో చోటు చేసుకోలేదు. ఉదాహరణకి, బుచ్చిబాబు నాగురించి కథ రాయవూ, లేదా శ్రీరమణ రాసిన మిథునం లాటి కథలకి ఇక్కడ స్థానం లేదు. నిజానికి, మిథునం కథలో సమాజకేంద్ర దృష్టి ఉంది- ఒక తరం ముందు దంపతులమధ్య సంబంధం. కానీ అది హింసాత్మకం కాదు, సాత్వికం. అంచేత అది సమాజకేంద్ర దృష్టి కాకుండా పోయింది. అంటే మానవసంబంధాలకి సంబంధించిన కథలు ఎంచుకోలేదు.

మరి ఒక వంద సంవత్సరాలయింతరవాత తెలుగుకథగురించి ఎవరైనా పరిశోధన చేస్తే ఈ పుస్తకం పరీక్షించి చూస్తే వారికి కలిగే అభిప్రాయం ఎలా ఉంటుందంటారు? సాధారణంగా పరిశోధకులు ఇంకా అనేక సంకలనాలు కూడా చూస్తారు కనక నాప్రశ్న మరీ విపరీతం అనుకుందాం. కానీ ఈనాడు వచ్చే సంకలనాలన్నీ సాంఘికప్రయోజనం తప్ప కథకి మరో ప్రయోజనం లేదన్నట్టుగానే ఉంటున్నాయి కదా. మరి సాముదాయికంగా ఎవరికి గానీ కలిగే అభిప్రాయం ఎలాటిదై ఉంటుంది ఈ సంకలనాలవల్ల?

ఇలా ఆలోచించినప్పుడు, విశాలాంధ్రవారి సంకలనానికి, “తెలుగుకథల్లో సామాజిక ప్రయోజనం” లాటి పేరేదో పెట్టి ఉంటే మరింత స్పష్టంగా ఉండేది. శైలికి ప్రాధాన్యం లేదిక్కడ. అప్పుడు, బుచ్చిబాబులాటి రచయితలు రాసిన విలక్షణమైన కథలకి అక్కడ లేని లోటు కనిపించదు. నిజానికి బుచ్చిబాబు కథ ఇందులో లేనంతమాత్రాన ఆయనకి పోయిందేమీ లేదు. ఆయనకథలు చాలా సంకలనాల్లో వచ్చేయి. కానీ నామటుకు నాకు ఈ పుస్తకంలో కొన్ని కథలు “మంచికథలు” అనిపించలేదు. సంకలనకర్తలు “సామాజికకేంద్ర దృష్టి” మాత్రమే తీసుకుని ఎంపిక చేసిన కథలవి. ఏతా వాతా నేనంటున్నది – తెలుగు సాహిత్యచరిత్ర సమగ్రంగా బావితరాలకి అందించాలంటే. ఆ వదిలేసిన కథలూ, రచయితలూ కూడా ఎక్కడో అక్కడ గ్రంథస్థం కావాలి.

– ఒక కోణం మాత్రమే ప్రాతిపదికగా సంకలనాలు సమకూర్చకూడదా?

– సాహిత్యం మహా సాగరం, నిరంతరప్రవాహం. సంపూర్ణంగా సాహిత్యచరిత్ర రాయడం ఎప్పుడూ సాధ్యం కాదు. అంచేతే తెలంగాణా సాహిత్యచరిత్ర, రాయలసీమ సాహిత్యచరిత్ర, స్త్రీల సాహిత్యచరిత్ర, కృష్ణాజిల్లా సాహిత్యచరిత్ర, స్త్రీవాదం, దళితవాదం … ఇలా ఒక్కొక్క విభాగం తీసుకుని సంకలనాలు వస్తున్నాయి. అది మంచిదే. కానీ ప్రస్తుతం ఇందులో కూడా రెండు లోపాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎవరు చేసిన సేవ ఏమిటి, ఎవరికథలు ఎంచుకోవాలి అన్న విషయంలో వ్యక్తిగతమైన అభిమానాలు ఆధారంగా సంకలనాలు తయారు చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. “ఇరవయ్యశతాబ్దపు రచయిత్రులు” అని పేరు పెట్టిన కథలసంకనలంలో నాకు తెలిసిన కొందరు ప్రముఖ రచయిత్రులకథలు లేవు. కనీసం కొన్ని కథలు సంకలనకర్తల స్వంత ఇష్టాయిష్టాలమీద తీసుకున్నట్టు ఉన్నాయి. ఇది సాహిత్యచరిత్ర దృష్ట్యా ఆరోగ్యం కాదు అంటున్నాను.

– అంటే సంకలనాలన్నీ తప్పనిసరిగా వైవిధ్యం కలిగి ఉండాలా?

– ఒక రచయితో ఒక సాహిత్యాభిమానో తనకి నచ్చిన కథలు మాత్రమే ఎంచుకుని సంకలనం వెయ్యాలనుకుంటే అది వారి కష్టం కనక వారిష్టం. “ఈవారం నన్ను దర్శించుకున్న రచయితలకథలే నాసంకలనంలో చేర్చుకుంటాన”నో, “నల్లచీరె కట్టుకున్నవారి కథలకి మాత్రమే నాసంకలనంలో స్థానం” అనో నియమం పెట్టుకుని, అలా ఓ సంకలనం తయారు చేస్తే ఎలా కాదనగలం? ఎటొచ్చీ వారు ఆమాట ముందుమాటలో స్పష్టం చేస్తే పాఠకులకి మరింత సుకరం అవుతుంది. నాలాటివారికి చక్కగా అది అర్థం అవుతుంది.

– మరి నాదృష్టిలో సమగ్రమైన సాహిత్యచరిత్ర సృష్టించడానికి ఎవరు పూనుకోవాలంటే –

– ఎకాడమీలు, విశ్వవిద్యాలయాలు వేసే సంకలనాలు బాధ్యతాయుతంగా ఉండాలి. బహుముఖాలుగా విస్తరించుకుంటున్న మన సాహిత్యాన్ని తమ ఎంపిక ప్రతిబింబిస్తోందా లేదా అన్నది పరిశీలించి చూసుకోవాలి. వారు సంకలనం సమకూర్చే పని ఎవరికి అప్పచెప్తున్నారో, వారి సామర్థ్యాలు, అర్హతలూ, ఏమిటో జాగ్రత్తగా పరిశీలించి చూసి, ఆమాట అంటే సంకలనంయొక్క ధ్యేయం ఆ సంపాదకులకి చక్కగా వివరించి చెప్తే, ఆ సంపాదకులు ఆ విషయం మనసులో పెట్టుకుని ఎంపిక చేస్తేనే మనకి మంచి సంకలనాలు వచ్చే అవకాశం.

– రచయితలు ఎవరికి వారు ప్రచురించుకుంటున్న సంకనాలమాట ఏమిటి మరి?

– ఈసంకలనాల్లో రచయితలు తీసుకున్న వస్తువులో, కథ నడిపిన తీరులో వైవిధ్యం ఉండొచ్చు కానీ మళ్లీ మార్కెటింగుమాట వచ్చేసరికి, ముందు చెప్పిన బాధే. “సాంఘికప్రయోజనం ఉన్న కథలయితేనే పాఠకులు కొంటారు” అంటారు ప్రచురణకర్తలు. అంతే కాక, ఈ కథలన్నీ పత్రికలశంఖంలో పోసి, తీర్థం అనిపించుకున్న తరవాతే కదా సంకలనాలుగా వెలువడడం. అంచేత ఆ కళలే ఇక్కడ కూడా కనిపిస్తాయి.

అయితే కదాచితుగా మినహాయింపులుండొచ్చు. కిందటేడు కొత్తపాళీ నాకో సంకలనం ఇచ్చేరు. రచయిత పోలవరపు కోటేశ్వరరావు. ఆయన ముందుమాటలో ఆ కథలు ఏ పత్రికలలోనూ ప్రచురించినవి కావనీ, సంపాదకులనియమాలు తమకి నచ్చక, ఇలా నేరుగా పుస్తకరూపంలో ప్రచురిస్తున్నాననీ అని రాసేరు. (అప్రస్తుతమే అయినా నాకథలు పత్రికలకి ఇవ్వకుండా, నాబ్లాగులోనే ప్రచురించుకోడానికి కూడా ఇదే కారణం.)

– పత్రికలు, ఎడిటర్లు, పత్రికాధిపతులు – వీరి బాధ్యలు ఏమిటి?

– పత్రికలలో రెండు రకాలున్నాయి కదా. వార్తలందించేవీ, కథలు అందించేవి. మొదట, వార్తలమాట చూద్దాం. ఈమధ్య విలేఖరులు ఇంట్లో కూర్చుని తమకి తోచింది రాసి పత్రికలకి ఇచ్చేస్తున్నారు. సంపాదకులు తిరిగి చూడకుండా వేసేసుకుంటున్నారు. ఈ పత్రికలు విదేశాల్లో లైబ్రరీల్లో మైక్రోఫిష్ రూపంలో దాచుకుంటున్నారు. మరి ఈ విలేఖరులు తమకి తోచినట్టు గిలికి పారేస్తే అది సాహిత్యచరిత్రకి ద్రోహం కాదా? సభకి ఎవరు వచ్చేరు, ఎవరు రాలేదు వంటి చిన్నవిషయాలు వదిలేయండి. నిజానికి అవి కూడా ఆ వ్యక్తుల అభీష్టాలూ, అభిప్రాయాలూ తెలుసుకోడానికి కొంతవరకూ దోహదం చేస్తాయి. కానీ అంతకంటే ఘోరం ఒక వ్యక్తి నమ్మకాలనీ, అభిప్రాయాలనీ, విలువలనీ తారుమారు చేసేసేవి. నేను హైదరాబాదులో ఓ సభలో మాటాడినప్పుడు నేను చెప్పినమాటలు వదిలేసి, ఓ ప్రముఖవిలేఖరి “మాలతిగారు అమెరికాలో తెలుగుసంఘాలు చేస్తున్న సేవని అభినందిచేరు,” అని రాసేడు. నిజానికి నేనసలు తెలుగుసంఘాలమాట ఎత్తనేలేదు. ఎప్పుడూ ఎక్కడా నా ఉపన్యాసాల్లో నేనాప్రసక్తి తేలేదు. దానికి ప్రత్యేకమైన కారణం ఉండడంచేతే నేను తేను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారికి నాకృషిమీద గౌరవం లేదు. నాకు వారికృషిమీద గౌరవం లేదు. మరి చరిత్రలో నా అభిప్రాయం ఈ విలేఖరుడిమూలంగా అసంబద్ధంగా మారిపోయింది. వీళ్ళంతా జర్నలిజం క్లాసుల్లో ఏమిటి నేర్చుకుంటున్నారు?

– మరి కాల్పనిక సాహిత్యం మాటేమిటి?

– పూర్వం ఆంధ్రపత్రిక, భారతి, కృష్ణాపత్రిక, ఆంధ్రప్రభ లాటి పత్రికలలో ఒక కథ వచ్చినా, ఒక వ్యాసం వచ్చినా దానికి చెప్పుకోదగ్గ స్థాయి ఉందని పాఠకులు నిశ్చింతగా నమ్మగల స్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ తలా తోకాలేని కతలమూలంగా పత్రికలస్థాయి దిగజారిపోయినట్టే అనిపిస్తోంది.

ఆరోజుల్లో ఫలానా పత్రికలో నాకథ వచ్చిందని గర్వపడడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడలా అనిపించడం లేదు. ఎందుకంటే పత్రికలు కూడా ఈ సాహిత్యప్రయోజనం పేరున మూస కథలకే పెద్దపీట వేస్తున్నారు. మిధునంలాటి కథలు ఏటికో కోటికో ఒకటి రావొచ్చు కానీ సర్వసాధారణం కాదు. ఆకథకి అంతటి ప్రాచుర్యం వచ్చిందంటే మనకి భిన్నకోణాలు గల కథలు వస్తున్నాయి, వాటిని పాఠకులు ఆదరిస్తున్నారనే కదా. ఇలాటి కథలని ఏరి విశాలాంధ్రవారు “తెలుగుకథ” రెండో సంపుటం ప్రచురించాలి మన కథాచరిత్ర సమగ్రం కావాలంటే.

అసలు ఈ సంకలనాలకి కథలఎంపికల్లో ఆశ్రితపక్షపాతం కనిపిస్తోంది అన్నా తప్పు లేదేమో. ఈరోజుల్లో ఏ పత్రికలో ఎవరికథలు ప్రచురిస్తారో చెప్పగలం. ఎవరికథ ఎలా ఉంటుందో చెప్పగలం. ఏ సంపాదకుడికి ఎలాటి కథ కావాలో తేలిగ్గానే చెప్పగలం. మళ్ళీ ఈ సంపాదకులే మంచికథలు రావడం లేదంటారు. కొత్తరకం కథలు రావడం లేదంటారు. కొత్తరకమైన కథ ఎలా వస్తుంది తమరు ప్రచురించుకోడానికి సిద్ధంగా లేకపోతే.

సంకలనాల్లాగే చారిత్ర్యకవ్యాసాలూ, విమర్శనాత్మకవ్యాసాలూ కూడా ఇలా స్వకీయమైన ఒక కోణంలోనే రాయడం జరుగుతోంది. వ్యాసాలు ఎవరు రాసేరో చూస్తే,  వారు ఎవరిని తమ వ్యాసంలో ఉదహరించి ఉంటారో తేలిగ్గా ఊహించుకోగల పరిస్థితి ఏర్పడింది. సాహిత్య చరిత్ర రాసేవారు కూడా – ఇందాకా ఆరుద్రగారిగురించి అన్నాను – తమపరిధిలో తాము ఏ సూత్రాన్ని పాటించి చరిత్ర రాస్తున్నారో ముందే నిర్ణయించుకుని చరిత్ర అలా రాయడం ఒక పద్ధతి. అది తప్పని కాదు కానీ వాటిలో కొంత సమతుల్యత పాటించవలసిన అవసరం ఉంది. కథలకంటే వ్యాసాల్లో ఇది మరీ అవసరం. వ్యాసకర్త మరింత సమ్యగ్ దృష్టితో విషయాన్ని పరిశీలించినప్పుడే మన సాహిత్యచరిత్ర పటిష్ఠమవుతుంది.

రెండో బాగం ఇక్కడ

( ఆగస్టు 4, 2012)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మన సాహిత్యచరిత్ర – సంకలనాల్లో, పత్రికలలో, విమర్శల్లో, …”

 1. @ శశిధర్, పింగళి, నిజమే. ఇది ఒక్కరివల్ల అయేది కాదు. సామూహికంగా జనాల్లో, వారు ఆలోచించే తీరులో మార్పు రావాలి. ఒక్కరివల్ల సాధ్యం కాదు కానీ ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అని ఈ చర్చ మొదలు పెట్టేను. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఒకరిని ఒకరు హింసించే కథనాలు మాత్రమే సామాజికప్రయోజనం సాధించే కథలనే వాదన నిజంగా అన్యాయమే. దానిమూలంగా సాహిత్యానికి మేలు జరగడంలేదు. మీరన్నట్టు ఇతరకోణాలూ, మానవీయ విలువలు, సుహృద్భావం పెంపొందించే కథలు రావాలి. వాటిని సంపాదకులు, ప్రచురణకర్తలు … మొదలయినవారు ఆదరించాలి.

  మెచ్చుకోండి

 2. దీనిపై వ్యాఖ్యవ్రాయటానికి నాకు పెద్ద అర్హత వుందని నేననుకోనుగానీ, వ్యాసం చదివినతర్వాత వ్రాయాలనిపించి వ్రాస్తున్నానంతే. సమీక్షకుల పరిధి వివిధ కారణాలవల్ల పరిమితమైపోతోందని నేనూ ఏకీభవిస్తాను. ఆరుద్ర కానీ మరొకరు కానీ కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకుని వాటి పరిధిలో సమీక్షింస్తారనిపిస్తోంది.
  వైయక్తికమైన యిష్టాయిష్టాలు చోటుచేసుకోవడం సాధారణవిషయమే ననిపిస్తుంది. నిస్పక్షపాతమైన సమీక్షకి ఇజాలకు లోనుకాని ఒకరికంటే ఎక్కువమంది పూనుకుంటే కానీ సాధ్యపడదేమో. ఇక సాంఘిక / సామాజిక ప్రయోజనం అనేవి ఒక సంకుచితార్ధంలో వాడుతున్నట్లు నా అభిప్రాయం. ఒక బడుగు వర్గాన్ని ఉద్దరించడమో, భిన్నజాతులను సంకలనం చేయటంలాంటివేవో ఈకోవలో ఆలోచిస్తున్నారని నేననుకుంటున్నాను. నిజమైన సామాజిక ప్రయోజనం భిన్న మనస్తత్వాలు,వాటి మధ్య మానసిక సంఘర్షణ, సామాజిక కట్టుబాట్లు చిత్రించి పాఠకుడికి ఒక కధో, నవలో చదవగానే ఇందరి భిన్నమనస్తత్వాలని చదివి అనుభవించి,అర్ధంచేసుకుని తద్వారా తన క్యారెక్టర్ ని మలచుకోటానికి పనికి రావాలని అనుకుంటున్నాను. ఇంకా వ్రాయలనివున్నా ఇప్పటికే ఎక్కువ వ్రాసేసానేమోనని విరమిస్తున్నాను.

  మెచ్చుకోండి

 3. @ teresa, చాలాకాలానికి కనిపించేరు. మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు.
  @ సౌమ్య, నిజానికి విశాలాంధ్ర సంపాదకులు సామాజికకేంద్ర దృష్టి అన్నారు. ఆదృష్టితో ముళ్ళపూడివారివి, మిగతావారివీ కూడా ఆ పరిధిలోకి రావాలి. హాస్యం, వ్యంగ్యం, నిత్యజీవనవిధానంలో అనేకానేక కోణాలు సామాజికకేంద్రం కాకుండా ఎలా పోతాయి. పోతే, అచ్చమాంబగారికథలు వీరిపరిధిలోకి రాకుండా 1910నించీ అనడంతో ఓ అడ్డుగోడ ఏర్పడింది. :p.

  మెచ్చుకోండి

 4. వివరంగా వ్యాఖ్య రాయాలని ఉంది కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ క్రింది వాక్యం చదవడం వల్ల కలిగిన ఆశ్చర్యం ప్రస్తావన తేక తప్పడం లేదు.

  “సాంఘికప్రయోజనం ఉన్న కథలయితేనే పాఠకులు కొంటారు” అంటారు ప్రచురణకర్తలు.
  -నిజమా! సాంఘిక ప్రయోజనం అంటే ఏమిటి? దైనందిన జీవితాల్లోని హాస్యం ప్రాతిపదికగా వచ్చే కథలు గట్రా… శతాబ్దాలూ, దశాబ్దాలూ నిలుస్తాయో లేదో కానీ, జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయని అనుకుంటూ ఉన్నా ఇన్నాళ్ళూ! ఉదా: ముళ్ళపూడి వారి కథలు తీసుకుందాం – నా తరం స్నేహితుల్లో, తెలుగు సాహిత్యం పెద్దగా చదవని వారు చాలా మంది చదివే కొంచెం తెలుగు కథల్లో వీరి పేరు చాలా తరుచుగా వింటాను. మరి ఇవి ఇన్ని దశాబ్దాలుగా జనం మధ్య ఉన్నాయే! ఉంటాయే! ఆయన “సామాజిక ప్రయోజనం” ముఖ్యోద్దేశంగా కథలు రాశారని నేను అనుకోను. అలాగే, ఇంకొంతమంది స్నేహితులు/రాళ్ళు, నా ముందు తరం వారు విరివిగా చదివిన – యద్దనపూడి, యండమూరి, మధుబాబు, మల్లాది తరహా నవలలు – సాంఘిక ప్రయోజనం కలవని కూడా నేను అనుకోను. ఇదంతా…ఆ “సాంఘిక ప్రయోజనం ” పదం నాకర్థం అయినంతలో మాత్రమే.

  భండారు అచ్చమాంబ గారి ఆ తొమ్మిది కథలు పూర్తిగా సాంఘిక ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని రాసినవని నా అభిప్రాయం. మరి – అవెందుకు అంత ఎక్స్ట్రా ఆర్డినరీ పేరు తెచ్చుకోలేదు? 🙂

  కొలిచేవారు ఉన్న రచనలు కొలువుల్లో నిలుస్తాయి – అని ఇటీవలి కాలంలో నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.