తోచీ తోచనమ్మ!

తోచీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికెళ్ళిందని సామెత.

వెనకటిరోజుల్లోః

“పిన్నీ, ఏం చేస్తున్నావు?”

“ఏం లేదు. ఏం తోచక అలా సీతమ్మక్కఇంటికెళ్దామా అని ఆలోచిస్తున్నా. ఇంతలో నువ్వొచ్చేవు.”

“బావుంది. నేనూ తోచకే ఇలా వొచ్చేను,.”

లేకపోతే,

“ఏరా, ఇలా వచ్చేవు, నేనే అనుకుంటున్నా మీయింటివేపొద్దాంవని.”

“తోచక వచ్చేను. సినిమాకెళ్దాం, వస్తావేమిటి?”

“సినిమాకెందుకులెద్దూ, అలా బీచికెళ్దాం, కాస్సేపు కబుర్లు చెప్పుకోవచ్చు”

లేకపోతే,

“పద, నాకూ తోచడం లేదు. సినిమాలన్నీ చూడ్డం అయిపోయింది కదా ఇప్పటికే రెండుమార్లు, పద కామేశ్వరికెంటికెళ్దాం.”

“ఇప్పుడక్కడికెందుకూ?”

“ఏం లేదు. వాళ్ళక్కయ్య ఖరగ్పూర్ నించి వచ్చిందిట పండక్కి. (లేకపోతే పురిటికి.). చాల్రోజులయింది చూసి.”

ఇలా ఉండేవి కబుర్లూ, కాలక్షేపాలూ అప్పట్లో. ఇప్పుడసలు తోచలేదన్నమాటే వినిపించదు, ఖర్మ. ఎక్కడ చూసినా రోజుకి ముప్ఫైయారు గంటలుంటే బాగుండనేవాళ్ళే కానీ, అబ్భ ఇంత తీరక, చెయ్యడానికి పనేం లేక తోచక ఛస్తున్నా అన్నవాళ్లు కనిపించరు కదా. ఈ టీవీలూ, ఐపాడులు లేనిరోజుల్లో ఏం చేసేవారో అని అంటూ అక్కులు నొక్కుకునే వాళ్ళే ఎక్కువిప్పుడు, మ్ … ఏమో బాబూ, నామటుకు నాకు ఏ పనీ లేకపోతే, ఏదో  కల్పించుకుని పొద్దు పుచ్చుకునేస్తాను. మరీ అంత 36 గంటలు అఖ్ఖర్లేదు కానీ 24 గంటలుంటే నేను సణక్కుండా గడిపీగల్ను. ఎలా అంటావూ …

ఏమో, చెప్తే నువ్వు నవ్వుతావు, లేదా విసుక్కుంటావు నామొహంలా ఉందని…. … సరే, నువ్వు అంత మొహమాట పెడుతున్నావు కనక చెప్పక తప్పదు. నువ్వన్నట్టు నిజంగానే ఈమధ్య … మూణ్ణాలుగు నెలలయినట్టుంది … … మరీ బతుకు నిస్సారం అనిపిస్తోంది. అబ్భ, పొద్దెప్పుడు పోతుంది బాబూ, ఎప్పుడు మంచంమీద వాలిపోడం అంటూ ప్రాణం గుబగుబలాడుతోంది.

వెనకటిరోజుల్లోలా గబుక్కున ఇరుగింటికో పొరిగింటికో పోయే సౌఖ్యాలు ఇప్పుడేవీ? మామూలుగా మీఅందరిలా  ఏ స్నేహితుల్నో చుట్టాల్లో పక్కాల్నో ఫోనులో పిలిచి మాటాడలేను మరి. ఎందుకంటావా, ఏమో … అసలు నాకెప్పుడూ అశ్చర్యంగానే ఉంటుంది ఏముంటాయి మాటాడ్డానికంతసేపు అనీ. అంతెందుకూ, నిన్నే పిలుద్దాం అనుకుంటాననుకో పొద్దున్నే మొదలు పెడతా అలా అనుకోడం. ఇప్పుడు కాఫీలవేళేమో, ఇప్పుడు పిల్లల్ని స్కూలికి పంపేవేళేమో, ఇప్పుడు పడుకుంటుందేమో, మళ్ళీ వంట చేసుకుంటోందేమో … పోనీ, రాజుని పిలుద్దాం అనుకుంటే ఏదో కుర్రాడు పనిలో ఉంటాడు, లేదా తన సాటికుర్రాళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంటాడు … ఎలా ఎవర్ని పిలవాలనుకున్నా వాళ్ళపనులు వాళ్లకుంటాయి, ఎందుకు నేను వాళ్లని ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది. వాళ్ళు నన్ను పిలవరా అంటావేమో … పిలుస్తారు, కాని వాళ్ళకి వీలయినప్పుడు పిలుస్తారు కద, నేనంటే ఏ పనీ పాటూ లేకుండా ఉన్నాను కనక నన్నెప్పుడు పిలిచినా ఫరవాలేదు … అవున్లే నీకు నవ్వుతాలుగానే ఉంటుంది. పోనీ, మాలుకెళ్ళొచ్చు కదా అంటావు, ఏముంది మాలులో, అవే బట్టలూ, అవే జోళ్ళూ, ఆ మనుషులూ … ఏ షాపులోనూ పట్టుమని పదిమంది కనిపించరు కొనేవాళ్ళు. మరి వాళ్ళకి ఎలా చెల్లుతాయో ఆ సరుకులు, వాళ్ళకి ఆదాయం ఎలాగో  …

ఎందుకొచ్చిన గొడవలివన్నీ, నాగూట్లోనే ఏదో పని కనిపెట్టుకు, చేసుకుంటే పోలే అనుకుని మన దేశవాళీ దుకాణానికెళ్ళి తాజా కూరలు గంపెడు కొనుక్కొచ్చేసేను పది రోజులకిందట. మరి అవన్నీ తినలేను కదా. అంచేత చక్కగా కడిగి, ఆరబెట్టి, చెక్కు తీసి, ముక్కలు కోసి … ఇలా కాలక్షేపం చేసేను. ఆ తరవాత వాటిని ప్లాస్టిక్ సంచులలో జాగ్రత్త చేసి, ఆసంచీలోంచి చేత్తో ఒత్తుతూ గాలి బయటికి తోసేసి, జిప్పేసి, ఫ్రీజరులో పడేసేను. అదుగో, చూసేవా, ఎందుకంత శ్రమ, వాళ్ళే చక్కగా ఫ్రీజు చేసి, అమ్ముతున్నారు కదా అంటావు.

చెప్తాను ఎందుకంటే – మొన్న అదేలే నెల్రోజులయినట్టుంది గోపాలంగారొస్తున్నారని బజారుకెళ్ళి చూస్తుంటే ఆ ఫ్రోజెన్ ములక్కాడ ముక్కలు కనిపించేయి. ఆఁ, ఆఁ, తారీకులు చూసుకునే కొన్నాను. మనసరుకులకి మామూలుగా అన్ని పేకెట్లమీదా ఉండదు కానీ ఆరోజు ఆ ములక్కాడ పేకెట్టుమీద మాత్రం జనవరి 2014 లోపున వాడేసుకోమని తారీకు కూడా ఇచ్చేడు. నేనెంతో మురిసిపోతూ ఇంటికి తెచ్చుకుని, సాంబారుకి కావలసిన సంభారాలన్నీ కూర్చుకుని, ఈ ముక్కలు ఉడకబెట్టబోతే, అడక్కు, నామొహంలా, అక్షరాలా నామొహంలాగే ఉన్నాయి. నామొహం అని ఎందుకంటున్నానా? వాటిక్కూడా నామొహానికున్న వయసే ఉన్నట్టుంది, ఫ్రీజరులోనే ఎండిపోయేయి. అక్కడికీ ఆశ చావక, వాటిని ఉడకబెట్టి, సాంబారులో పడేసి, తినడానికి కూర్చుంటే, రామ రామ, మళ్లీ నాచిన్నప్పటిరోజులే జ్ఞాపకం వచ్చేయి. ఈసారి పెరట్లో ములగచెట్టు కాదు. వేపచెట్టు. నా చిన్నప్పుడు పళ్ళు తోముకోడం జ్ఞాపకం వచ్చింది. నవ్వుతావేమిటి, నిజంగానే, నీకు తెలీదు మరి, ఆరోజుల్లో వేపపుల్లలు ఆరోగ్యం అని అప్పటికప్పుడు వేపచెట్టు కొమ్మ నమిలి, కుంచె చేసుకుని, దాంతో పళ్ళు తోముకునేవాళ్లం. అచ్చంగా అలాగే అనిపించిందనుకో ఈ ములక్కాడలు నముల్తుంటే. ఒక ముక్కయితే చేదు కూడా తగిలింది నాలుక్కి!! అంచేత, రెండిందాలా కలిసొస్తుంది, అటు పొద్దు పోతుంది, ఇటు తాజా కూరా అని నేనే వేసుకుంటున్నాను మంచు పాతర.

ఇంతకీ ఇవాళేమయిందనుకున్నావు … అసలు ఈపాతరలేసుకోడం వచ్చేక, తెల్లారి లేస్తూనే, రాత్రికి ఏం కూర చేసుకుందామా అని ఆలో చించి, నాఫ్రీజరులో ఏమున్నాయో నెమరేసుకుని, తరవాత మిగతా పనులు చేసుకోడం కూడా నారోజువారీ పనుల్లో ఒకటయిపోయింది. ఇవాళ కూడా అలాగే తిథివారనక్షత్రాలు చూసుకుని, ఈ దినము బూడిద గుమ్మడికాయ ముక్కలకి సుదినము అనుకుంటూ ఫ్రీజరు తెరిచేను. తీరా చూస్తే, నాలుగు సంచుల్లో ఏది బూడిదగుమ్మడో తెలీలేదు. ఇంత చాకిరీ చేసినదానివి ఆ సంచులమీద పేర్లు రాసిపెట్టుకోలేదూ అని అడక్కు. నిజానికి ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలమీద తేదీ అని ముద్రలేసేస్తారని కూడా నాకు తెలుసులే. …అవునవునవునవును. … నాక్కూడా తెలుసు ఆ సంగతి. ఏం చెయ్యను, హుమ్, నా నిర్మాణక్రియాశీలతలో లోపం అది. మరియు ఇంకో అవునవునవునవునవు… హాయిగా మంచుపాతరేసినవే కొనుక్కుంటే సరి అంటూ మళ్ళీ మొదలెట్టకు కచేరీ. బాగులేకపోతే పారేసి, మళ్ళీ కొనుక్కోవచ్చు కదా … అవునవునవునవునవును …

కాదు, కాదు, అన్నీ కాదులే. కాకరకాయ ముక్కలూ, బెండకాయముక్కలూ స్పష్టంగానే తెలుస్తాయి. కానీ బూడిదగుమ్మడికాయా, సొరకాయా, బెంగుళూరు వంకాయా, ఇవన్నీ ఒక్కలాగే ఉంటాయి కదా. ఏ కూరయితేనేమిటి, పోపేసి, ఉప్పూ, కారం చల్లేస్తే సరి, ఏ కూరయినా, ఏకసూత్రం అంటుంది మా అక్కయ్య కానీ నాకలా కాదు. బూడిద గుమ్మడికాయ అయితే అవియల్, బొప్పాయికాయయితే పోపేసి, నువ్వులపొడి, సొరకాయయితే ఆవ పెట్టి చెయ్యకపోతే నాకసలు అది కూరే కాదు. ఇన్ని పద్ధతులు నీకే చెల్లు అని సుందరి నన్ను హేళన చేస్తుంది. అవును మరి, ఆవిడగారికి ఆపీసులో పని, ఇంట్లో స్కూళ్ళకెళ్ళే పిల్లలు, నెలకి ఇరవై రోజులు ఊళ్ళంట తిరిగే ఇంటాయనా, వారం వారం వచ్చే పోయే చుట్టాలూ… ఆవిడకెక్కడ తీర్తుంది ఇలాటి ఎంపుళ్ళకి. ఉహుఁ. చిక్కదు. కానీ దానిక్కారణం నేను కాదు కద, నన్ననేం లాభం. కావలిస్తే ఉద్యోగం మానేసుకోమను. ఉద్యోగం మానేయడం సుళువే కానీ  పిల్లలెక్కడికి పోతారు? వాళ్ళు పుట్టకముందయితే అదో దారి. ప్చ్.

పిల్లలంటే గుర్తొస్తోంది ఈమధ్య టీవీ చూడ్డం కూడా దుర్భరంవయిపోతోంది ఈ ఎన్నికలమేళంతో. చెప్పుకోడానికి సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో పెద్ద చదువులు చదువుకున్నాం అంటూ డంబాలు పోతారు. తమలాటి మేధావులు మన నెత్తిమీద దేవతలు, అదేలే నాయకులు కాడం మనం చేసుకున్న పుణ్యం అన్నట్టు కబుర్లు చెప్తారు, తీరా వాళ్లు వెలిబుచ్చే ఒక్కొక్క అభిప్రాయం వింటే, వీళ్ళా మనల్ని ఉద్ధరించేది అని ఏడవాలనిపిస్తోంది. చూసేవా ఈమధ్య  ఆడాళ్లబతుకులమీద వీళ్లు చేసే వ్యాఖ్యానాలు. వింటుంటే కడుపులో దేవినట్టుంటోంది నాకయితే. వీళ్లు ఏ స్కూల్లో చదువుకున్నారో … ఆడమనిషిమీద అత్యాచారం చేస్తే, ఆఆడమనిషి హాయిగా వెనక్కివాలి ఆనందించొచ్చు కదా అనేవాడొకడూ, రేప్ వల్ల పిల్లలు పుట్టడం సైంటిఫిగ్గా అసంభం అనేవాడు మరొకడూ… వీళ్లమెదళ్ళలో ఓ భాగం, బాగా పెద్ద భాగమే తొర్ర అయి ఉండాలి. వీళ్ళు నాయకులైతే ఆడాళ్లబతుకులు చెప్పఖ్ఖర్లేదు, పాతరాతియుగంవే మేలు. … వీళ్ళనించి మనని బ్రోచేవారెవరురా అని పాడుకోవాలి. పాపం, అమెరికాలో ఆడాళ్ళకి ఆ పాట కూడా రాదు కనక వీళ్ళని రక్షించేవాళ్ళు లేరన్నమాటే. ఖర్మ! వాళ్ళకి మిగిలింది పాట్లే…

ఇంతకీ టీవీ చూడలేక, మరో పన్లేక, పుస్తకాలు చూస్తే ఎప్పుడో నాలుగు దశాబ్దాలకిందట మా అన్నయ్య పంపిన పతంజలి యోగసూత్రాలు కనిపించేయి. సరే, ఆయనేం అంటారో చూద్దాంవని తీసేను. అథో బ్రహ్మ జిజ్ఞాసా! హాహా. తత్వజిజ్ఞాస అని కాదు కానీ అంత చిన్న వాక్యాలు చూడగానే చదవగలిగినందుకూ, అంత చిన్నవాక్యంలో అంత అర్థం సాగదీసి ఆయనెవరో వివరించినందుకూ. అల్పాక్షరం అనల్పార్థం అంటారు కదా. పతంజలికి ఈవిషయం చక్కగా అవగతమయినట్టుంది. చిన్న వాక్యంలో నర్మగర్భంగా మనం ఆలోచించుకోడానికి కావలసినదెంతో ఉన్నట్టుంది. యోగాసనాలమాట ఎలా ఉన్నా నిత్యజీవితంలో పనికొచ్చేవి కూడా చాలానే ఉన్నాయనిపిస్తోంది. నాకిలాటివి నచ్చుతాయి. పైగా ఇలాటి చిన్నవాక్యాలు మననం చేసుకుంటున్నందువల్ల మనసులోకి వస్తున్న దుష్ట ఆలోచనలు పక్కకి తప్పుకోడం కూడా జరుగుతుంది కదా. అదే అంటున్నా. దేవుళ్ళూ, దెయ్యాలూ నమ్మకాలున్నా, లేకున్నా, మనకి కలిగే కోపాలూ, తాపాలూ, కక్షలూ, కార్పణ్యాలూ వదిలించుకోడానికి ఇలాటివి ఉపయోగపడతాయి కద. చూడు, ప్రత్యక్షానుమానాగమః ప్రమాణాని – సరైన అవగాహన కలగాలంటే సరైన విశ్లేషణ, సరైన ఉదాహరణలు అవశ్యంట. ఇది మరి ఎవరికైనా ఉపయోగపడేదే కదా, ఆస్తికులా నాస్తికులా అన్నమాట లేకుండా. అనుభూతవిషయ అసంప్రమోషః స్మృతిః అంటే జ్ఞాపకం అంటే అనుభవపూర్వకమైన వస్తురూపం. వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్ – సందేహాలమూలంగా మనస్తాపం కలిగినప్పుడు, ప్రతిపక్షభావన, అవతలివేపునుండి ఆలోచించడం అవసరం అంటారు. ఇది ఎవరికైనా ఆలోచించదగ్గ భావనే కదా. ఎదటివారు ఎందుకలా ప్రవర్తించేరు అని ఆలోచిస్తే, మన మనస్తాపాలు చాలామటుకు తొలగిపోతాయి. … అదేమిటి లేస్తున్నావు.. ఆఁ అప్పుడే మూడున్నరయిందా. … చూసుకోనేలేదు. అవున్లే పిల్లలు, మరిది గారు … టిఫిన్లు, కాఫీలు …వాళ్ళంతా వచ్చేలోపున ఇంకా ఏవో పనులు … సరే పద, పద, మూడుగంటలసేపు ఇట్టే గడిచిపోయింది. మాటాడుకున్నట్టే లేదు. … …

(ఆగస్టు 23, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “తోచీ తోచనమ్మ!”

 1. @ లక్ష్మి రాఘవ, బాగా చెప్పేరండీ అమెరికా వాతావరణం తెలుగవారికోణంలలో. మనదేశంలో మనకి జనాభావల్ల కలిగే లాభాలు చాలామంది గమనించరు.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ ,
  తోచీ తోచనమ్మ లో అమెరికాలో తోచనప్పుడు దేశవాళీ షాపుకెళ్ళి తెచ్చికుని వాటిని ఖండించి ఫ్రీజరు లో దాచుకున్న విధానం బాగుంది ..
  ఎప్పుడైనా అమెరికా వచ్చినప్పుడు నాకు జరిగిన అనుభవాలు గుర్తుకు తెచ్చాయి…పలకరించని పక్కింటి వాళ్ళు , టంచనుగా ఆఫీసులకేల్లె ఇంటివాళ్ళు ..ఎక్కువగా తెలియని కంప్యూ టరు..అర్థం కాని ఇంగ్లీషు టి.వీ చానళ్ళు. పోనీ బయటకు వెడదామా అంటే కనుచూపు మేర కనిపించని మనుష్యులు…కారులో వెళ్ళేవాళ్ళు వింతగా చూసే నా చీర అందాలు ..అక్కడక్కడా రోడ్డుమీదే విరగ కాసిన ఆపిల్ చెట్లు..ఒకటి తీసుకుంటే ..అనుకునే నా మనస్తత్వం !! ఇలా ఎన్నో ….. అదే మా వూర్లో వుంటే..బయటకెళ్ళి నా …ఇంట్లోవున్నా ఎలా వున్నారు ఏమీ చేస్తున్నారు?అన్న పలకరింపులు …అందరికి అన్నీ కావాలి ఇక్కడ….ఏమిటి ఇలా రాసేస్తున్నాను …తోచనమ్మ నన్ను తోచింప చేసిందా?

  మెచ్చుకోండి

 3. @ సున్నా, మీ మేలుపిలుపుకి ధన్యవాదాలు. గుర్తు పెట్టుకుంటాను.
  @ జ్యోతిర్మయి, అలాగేనండీ, ధన్యవాదాలు.
  @ మోహన్, అదేనండీ ఈ టపాలో నీతి. పిల్లలూ, చుట్టపక్కాలూ మనకేదో చేస్తారనీ, చెయ్యాలనీ ఎదురు చూడకూడదు, మనని మనమే ఉద్ధరించుకోవాలి, మనకాలక్షేపాలు మనమే ఏర్పాటు చేసుకోవాలి అని.

  మెచ్చుకోండి

 4. కబుర్లు బాగున్నాయి, వయస్సు పైకి వచ్చే సరికి,
  సాంగత్యాలు , సంగతులు తగ్గి పోతాయని
  నాకు కూడా అనిపిస్తూ దిగులుగా ఉంది.

  మెచ్చుకోండి

 5. మీకు తోచనప్పుడు నాకు ఈమెయిల్ కొడుతూ ఉండండి. నాకు పనీ లేదు తీరికా లేదు. నాకు అందిన ఒక్క అరగంటలో మీకు రిప్లై గారంటీ. రోజూ వెబ్ సైట్లు చూడ్డం, తినేసి పూర్తిగా పడుకోడమే పని. గత పది పదిహేను మాసాలుగా రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తానా అనే మధ్య వయసు క్రైసిస్ తో ఉన్నాను. ఎందుకు ఇలా పుట్టానో, అసలెందుకు ఇలా ఏడవ వల్సి వస్తోందో తెలీటల్లేదు. పాపం ఐదుగురు అబ్బాయులు కార్లో వెళ్తూ పోయేర్ట ఏక్సిడెంట్లో. నాలాంటి వాళ్ళు మాత్రం రోజూ శ్లేష్మం లో పడ్డ ఈగ లాగా చావలేకా బతకలేకా ఏడుస్తున్నాము. మీరు రిటైర్ అయిపోయాకా వచ్చే ఆలోచన్లు బాగానే ఉన్నాయి, సబబే.

  మరి నా సంగతో? ‘వ్యర్ధ జీవితాలు అని ఆ మధ్యన చందమామలో ఒక కధ చదివినట్టు గుర్తు. నాకు అతికినట్టు సరిపోతుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.