ఖాళీ బుర్ర

చల్లగా, నిదానంగా, విలాసంగా ఒయ్యారాలు పోతూ చిన్న చిన్న తరగలు చిరుగాలికి కదులుతుంటే తదేకంగా చూస్తున్నాను. కళ్ళకి ప్రశాంతంగా ఉందా దృశ్యం. ఓ చిన్న  చేపపిల్ల గబుక్కున మూడంగుళాలెత్తు ఎగిరి మళ్ళీ నీటి అడుగుపొరల్లోకి జారిపోయింది. అది ములిగినచోట చిన్న తరగలు గుండ్రంగా సుళ్లు తిరుగుతూ చెలరేగేయి. నేను కళ్ళప్పగించి పరీక్షగా చూస్తున్నాను – ఆ చేపపిల్ల మళ్లీ ఎగురుతుందా? ఎంత ఎత్తుకి? ఉన్నచోటేనా? మరోచోటికి జరిగి, అక్కడ తుళ్లిపడుతుందా? నూటొక్క సందేహాలు …

అటు పది గజాలదూరంలో పది, పన్నెండేళ్లకుర్రాడు గట్టున కూర్చుని నీటిలోకి గేలం విసిరి, ముల్లుకి తగులుకొని ఎర మింగేచేపకోసం కళ్ళు చిట్లించి దీక్షగా చూస్తూ ఉన్నాడు. రెండేసి నిముషాలకోమారు నీళ్లలోకి తొంగి చూసి, గేలం  కదిలిస్తున్నాడు ఏ చేపపిల్లకో ఆశ పెడుతున్నట్టు. ఆ వయసు కుర్రాడు అంత ఓపిగ్గా ఓ చోట కూర్చోడం ఆశ్చర్యం. ఈ చేపపిల్ల ఆ గేలానికి తగులుకుంటుందా లేదా అని చూస్తున్నాను. నేను చేపలు పట్టకపోయినా పడుతున్నట్టే అనిపిస్తోంది! నా ఆందోళన చేపపిల్లకోసమా, ఆ అబ్బాయికోసమా అన్నది తోచలేదు.

“చాల్లే. ఎంతసేపు చూస్తావు. పద,” అంది నా బుర్ర.

“ఏఁవిటా తొందర? అవతల రాచకార్యాలేవో ములిగిపోతున్నట్టు,” విసుక్కున్నాను.

“ఎంతసేపు చూడ్డం, నాకు విసుగేస్తోంది.  పద, పద. పద.”

“గెలుపెవరిదో చూద్దాం, ఉండు. చేప తప్పించుకుంటుందో, వల్లో పడుతుందో.”

“వాడికీ బుద్ధి లేదు, ఆ చేపలకీ బుద్ధి లేదు. వాడికి చేపలు కావలిస్తే హాయిగా బజారులో కొనుక్కోవచ్చు. ఆచేపకి నీటిలో పురుగులు  వడ్డించిన విస్తరిలా బోలెడుండగా ఈ గేలానికున్న పురుగుకోసం ఆరాటం ఎందుకూ. ఆరెంటినీ చూస్తూ కూచున్న నీకూ బుద్ధి లేదు.”

“అవును. లోకంలోఎవరికీ బుధ్ధి లేదు. నీకొక్కడికే ఉంది.“

“ఇలా ఒకే చోట కూర్చోడంలో మార్పు లేదు, చేతన లేదు. అలాటి స్తబ్ధత అంటే నాకు అసహ్యం, చిరాకు. ఆ కుర్రాడు ఆ చేపపిల్లని పట్టగలడా లేడా అన్నది ఈ విశాలవిశ్వంలో చాలా చిన్న సమస్య,” అంటూ నాబుర్ర కదం తొక్కడం మొదలెట్టింది.

నాకీ బుర్రంటే అందుకే చిరాకు. అస్సలు నిలకడ లేదు. దమ్మిడీ ఆదాయం ఎలాగా లేదు కనీసం క్షణం తీరిక అనుభవించొచ్చు కదా. … కొమ్మల్లో కోతి నయం ఈ బుర్రకన్నా. ఛీ, ఛీ.

“హీహీ పోనీ, ఓ కోతిబుర్ర తెచ్చి తగిలించుకో.”

“హా హా. వేరే తెచ్చుకోడం ఎందుకు, ఇప్పుడే ఉంది అంటున్నా. సరేలే. ఇంతకీ ఎక్కడికెళ్దాంవంటావు?”

“ఇంటికి పద. కనీసం టీవీ అయినా చూడొచ్చు.”

“ఇప్పుడు టీవీలో ఏం లేదు.”

“ఎందుకుండదూ. రెండువందల యాభై చానెళ్ళిచ్చేడు కదా ఆ ప్రవరుడు.“

“ప్రవరుడు కాదు, ప్రొవైడరు. అందులో రెండువందలు పాతవే మళ్ళీ మళ్ళీ వేస్తారు, ముప్ఫై అమ్మకాలగోల. నిజానికి ఇది చాలా అన్యాయం. అసలు ప్రోగ్రాములకోసం డబ్బు కట్టేం. మళ్లీ వాళ్ళు అమ్ముకునే సరుకుకోసం మనడబ్బు పెట్టేం. అవి కొంటే మళ్ళీ మనకే ఖర్చు. ఆ వ్యాపారాలవాళ్ళు ఆ చెత్తతో నిన్ను నింపుతారు.”

“చెత్తేమిటి, అది విషయసేకరణ. మనకి విషయాలు తెలియాలి.”

ఈ బుర్రసమాధానాలు చూస్తే నాకు మరింత చిరాకు. ప్రతిదానికీ ఓ సమాధానం సిద్ధంగా ఉంటుంది దానిదగ్గర.

“ఒక్క నాలుగు నిముషాలు ఆగుదాం. వాడికి చేప దొరికినా దొరక్కపోయినా వెళ్ళిపోదాం.“

బుర్రకి కోపం వచ్చింది. “ఇలా మొద్దు రాచ్చిప్పలా ఓ చోట కూచోడం నాచేత కాదు. నేను పోతాను.”

 

“సరే, ఫో,” అన్నాను అంతకి పదింతలు విసురుగా.

ఖర్మ అనుకుంటూ ఇంటికొచ్చి, టెన్నిస్ ఛానెల్ పెట్టేను.

“డెమొక్రటిక్ కన్వెన్షనులో ఏం జరుగుతోందో …“ అంది బుర్ర సాలోచనగా.

సరే, అక్కడ ఎవరో మాటాడుతున్నారు. ప్రపంచంలోకల్లా గొప్పదేశం. ఇక్కడ ఉన్నన్ని అవకాశాలూ, స్వేచ్ఛా మరెక్కడా లేవు. మనం ప్రపంచానికి ప్రవక్తలం. …

“ఛానెల్ 9లో ఏం వుందో.”

ఫ్లిప్. “

“టెన్నిస్ ఛానెల్లో స్కోరు చూడు …

“టెన్నిస్ ఛానెల్లో స్కోరు చూడు …”

ఫ్లిప్. “ఫాక్స్ చానెల్ ..”

“మనం కాథలిక్ విశ్వాసాలని పరిరక్షించాలి. భ్రూణహత్య పరమ ఘోరం, నీచం. దానికి మన మతం అంగీకరించదు. ప్రస్తుతం ఈ అధ్యక్షుడికి మనవిశ్వాసాలమీద విశ్వాసం లేదు. అంచేత ఈయన్ని ఎలాగైనా తరిమేయాలి.”

“స్కోరు …”

ఫ్లిప్. “6-3, 6-6, … అమ్మో. ఇద్దరూ హేమాహేమీలే. వాలిసుగ్రీవుల్లా విజృంభించేస్తున్నారు. … ”

“ఈ తాడు ఇప్పుడప్పుడే తెగదు. ఆ లాటినో మేయరేం అంటున్నాడో …”

ఛప్. నాకు కోపం వచ్చింది. చాలీ ఛానెళ్ళ గెంతుళ్ళు అని విసుగ్గా పుస్తకం తీసేను. ఎంతవరకూ చదివేనో జ్ఞాపకం లేదు. సరే ఇదేమైనా నవలా? అని తెరిచినచోట చూసేను. మరో బాధ ఇంగ్లీషులో ఉంది. ముందు సంస్కృతం కూడబలుక్కుంటూ చదివి, ఇంగ్లీషు అర్థం చదివి అది తెలుగులో అర్థం చేసుకోవాలి.

प्रमाणविर्ययविकल्पनिद्रास्म्रुतय:

pramāṇa – correct perception; viparyaya – incorrect perception; vikalpa – imagination; nidrā – sleep; smṛtayaḥ – memory.

They are correct perception, incorrect perception, imagination, sleep and memory.

అంటే సరైన అవగాహన, తప్పు అవగాహన, ఊహ, నిద్ర, ధారణ అని కాబోలు. అంటే  …

ఆలోచనలు సాగలేదు. పోనీ, అంతర్జాలంలో చూద్దాం తెలుగులో దొరుకుతుందేమో అని చూసేను. ఆరో ఏడో కనిపించేయి కానీ అన్నీ ఇంగ్లీషులోనే. పైగా వాటిలో నాలుగు ఇంగ్లీషువారు అనువదించినవి. తెలుగువాళ్లు పతంజలి యోగసూత్రాలు తెలుగులో చదువుకోరా? ఆశ్చర్యమే.

“చాల్లే ఇవాళ్టికి. ఇది చాలా బరువు.  ఇంత బరువు మొయ్యలేను. మిగతాది రేపు చదువుదాం,” అంటూ నస పెట్టింది నాబుర్ర.

నేను కోపం పట్టలేకపోయేను.

“ఏంటీ సుకుమారాలు. ఏ పనిమీదా శ్రద్ధ లేదు. ఏకాగ్రత లేదు. చిత్తశుద్ధి ఉందో లేదో తెలీదు. నాకఖ్ఖర్లేదీ బుర్ర,” గట్టిగా అరిచేను.

“హా, నాకూ అలాగే ఉంది. నువ్వూ నాకఖ్ఖర్లేదు,” అనేసి, టప్పున కిందపడి దొర్లుకుంటూ పోయింది నా బుర్ర.

హమ్మయ్య, నాప్రాణం హాయిగా ఉంది.

000

సంపాదకుడు విలేఖరికి ఫోను చేసేడు.

వాలుకుర్చీ విలేఖరి విలాసంగా ఫోనందుకుని, “హలో సార్,” అన్నాడు అరమూసిన కన్నులతో చిదానందస్వామిలా.

“ఊళ్ళో పీర్లగుట్టదగ్గర ఓ బుర్ర కనిపించిందిట. అదేమిటో కనుక్కుని ఓ రిపోర్టు పంపించు వివరంగా. వీలయితే ఫొటో కూడా తియ్యి.”

“అలాగేనండీ,” అని వాలుకుర్చీ విలేఖరి ఫోను పెట్టేసి, మళ్ళీ కునుకుపాట్లో పడ్డాడు. ఆ తరవాత అరగంటకి వార్త తయారయిపోయింది. ఫొటోకి కబురు పెట్టేడు. ఆ ఫొటోగ్రాఫరు తనదగ్గరున్న ఏదో ఆకాశరామన్న ఫొటో తీసి, దాన్లోంచి తల తీసి, కాస్త రంగులేసి వా.వి.కి పంపేశాడు.

ఊళ్ళో ఉన్న మూడు ప్రముఖ పత్రికలు ఆ వార్తని ప్రముఖంగా ప్రకటించేయి “అచ్చయ్యపాలెం పొలిమేరల్లో కని విని ఎరగని అద్భుతమైన వింత – కదిలే, వాగే బుర్ర ప్రదర్శన” అన్న శీర్షికతో. అదే వార్త చిన్నా పొన్నా మార్పులతో అంచెలంచెలుగా తెల్లారేసరికి ఊరి పొలిమేరలు దాటి, దేశపు ఎల్లలు దాటి, దేశాంతరాలకి చేరింది.

భారతదేశంలో ఓ జీవము గల, హిందూధర్మసూక్ష్మాలు ఎరిగిన ఒక బుర్ర నవ్యనూతన దృష్టితో అవతరించిందిట. హిమాలయ సానువులలో తపస్సు చేసిన మహాజ్ఞాని అయిన ఓ సిద్ధుని బుర్ర అయి ఉండవొచ్చని అభిజ్ఞవర్గాలు అభిప్రాయపడుతున్నాయంటూ పత్రికలలో కలకలం, గలగలలు సాగేయి.  …

“బ్రిటిష్ మ్యూజియంలో ఓరియంటల్ లైబ్రరీ ప్రపంచంలోకల్లా ప్రాచీనమయింది. ఆ సజీవ బుర్ర మా మ్యూజియంలో ఉండాలి, వెంటనే తిరుగుటపాలో మాకు పంపండి,” అని ఆంగ్లప్రభుత్వం ఓ తాఖీదు పంపింది భారతప్రధానికి.

“అనేక ఉత్తమ బారతీయ గ్రంథాలని అనువాదాలు చేసి, పరిష్కరించి, ప్రచురించి వెలుగులోకి తెచ్చింది మా జర్మన్ పండితులు. మా జర్మన్ పండితులు చెప్పేవరకూ మీకు అంత గొప్ప సాహిత్యం ఉందని మీకే తెలీదు. అంచేత మీ బుర్ర మాదేశంలో ఉండడమే ఉచితం,” అని జర్మను ఛాన్సలరు కబురు పెట్టేరు.

“ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా. మాలా ఖరీదు కట్టగల షరాబులు మరొకరు మీకు దొరకరు. రేపు పదిగంటలకి మా ప్రత్యేకవిమానం పంపుతున్నాను. మేం ఆ బుర్రని సగౌరవంగా, రాజలాంఛనాలతో తెప్పించుకుంటాం. ఆ బుర్రని మా వ్రతినిధికి మీరు సత్వరం ఒప్పచెప్పవలసింది,” అని అమెరికాలో బహుళ కోటులు గల ఒక బకొనీరు చెప్పేడు. ఇది “అడుగుట కాదు, చెప్పుట అని గ్రహించవలసింది” అని కూడా స్పష్టం చేసేడు. ఆ సొంత జెట్టులోనే ముగ్గురు డాక్టర్ల జట్టుని కూడా పంపుతున్నాడుట ఈ బుర్ర ఏ విషక్రిములూ బట్వాడా చేయడం లేదని ఖరారు చేసుకోడానికి.

000

ఎన్నికలసంరంభం ఉధృతం అయిపోయింది. ఎవర్ని అధ్యక్షులుగా నిలబెడదాం అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరడంలేదు. నలుగురయిదుగురు నేనంటే, నేనని తగువులాడుకుంటున్నారు.

“ఎవరైతేనేమిటి, మనకి కావలసింది మనం చేసిన తీర్మానాలమీద సంతకం పెట్టడమే కదా.” అన్నాడు పార్టీ నాయకుడు.

“అందుకే ఇదుగో. ఈ బుర్రని తెచ్చేను,” అన్నాడు బకో.

“అదేమిటి, ఒట్టి బుర్ర!” అందరూ ఆశ్చర్యం వెలిబుచ్చేరు.

నలుగురూ నాలుగు ప్రశ్నలేశారు.

“అమెరికా ఆర్థికవిధానంమీద నీ అభిప్రాయం ఏమిటి?”

“ఇజ్రేల్ సమస్యపట్ల అమెరికా అవలంబిస్తున్న విధానంగురించి రెండుమాటలు చెప్పు.”

“అమెరికా ఉద్యోగాలు మీఇండియాకి తరలించడం మేం నిరసిస్తున్నాం. ఏమంటావు?”

“అవును. నిరసించాలి.”

“మీ భారతదేశపు యోగా మేం అందరం ఆహ్వానిస్తున్నాం. అది మంచి పద్ధతేనా?”

“మంచి పద్ధతే.”

“స్త్రీల ఆరోగ్యసమస్యలవిషయంలో ప్రభుత్వం చేసిన నిర్ణయాలే తుది నిర్ణయాలని మా అభిప్రాయం. ఆడవాళ్ళు ఏ చికిత్స అయినా సరే పొందడానికి ముందు గవర్నరు అనుమతి పొందాలి. ఉద్యోగస్థులు అయితే, వాళ్ళ యజమాని అనుమతి కూడా తీసుకోవాలి. మంచి పద్ధతే అంటావా?“

“అంటాను.”

“ఆడవాళ్లకి సగం జీతం చాలు.”

“చాలు.”

నలుగురూ మొహమొహాలు చూసుకున్నారు. ఈ బుర్రలో మనం ఏది కావలిస్తే అది పెట్టగలం. ఇది మనకొచ్చే బుర్ర అని తీర్మానించేరు.

“మన తీర్మానాలమీద సంతకాలకి అది చాలు.”

“మరి చేయి లేదు కదా సంతకం ఎలా?”

“ఆఁ, దానికేంవుంది, చిటికెలో పని. ఇది ఇది యాంత్రికయుగం. ఇది సాంగేతికధర్మం. ఇది తెలుగు బుర్ర. ఓ ప్రోగ్రాం రాసి ఇట్టే పుట్టించీగలదు సంతకం.”

మళ్ళీ అందరూ హాహా అంటూ నాలుగ్గోడలూ, అద్దాలతలుపులూ అదిరిపోయేలా నవ్వేరు.

000

నామనసు ఏడుస్తోంది. అక్కడ నా బుర్ర ఎలా ఉందో, ఏమయిపోతోందో, పాపం. ఇప్పుడు విచారిస్తున్నాను కూడా చిన్నప్పుడే ఆ బుర్రలో ఇంత మేలు గడ్డి పెట్టి ఉంటే ఈ తిప్పలు తప్పును కదా అని.

000

 

(సెప్టెంబరు 7, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “ఖాళీ బుర్ర”

 1. anta ఖాళీ యే కానీ చెప్పడం బాగుంది .ఎప్పుడో ఒకప్పుడు ఇలా అందరికి అనిపిస్తుందేమో .మీరు రచయితలు కాబట్టి ఖాళి బుర్రకథ రాసి మెప్పించేసారు !

  మెచ్చుకోండి

 2. @ sunnA, హా, హా. నేనలా తెలుగుపాఠాలు చెప్పడంలాటి మంచిపనులు చేస్తే ఇలా బుర్రలేని కబుర్లు ఎవరు చెప్తారండీ. రేపు చూడండి, మరో బుర్రలేని రచన -:).

  మెచ్చుకోండి

 3. ఈ మధ్యన మీరు వేస్తూన్న టపాలు చూస్తూ ఉంటే మీకు పనీ లేదు తీరికా లేదు అని తెల్సిపోతూంది. అంచేత వెంటనే మీరు టిక్కెట్టు కొనేస్కుని మా ఊరొచ్చేయండి. మా ఇంట్లో ఇడ్లీలు తింటూ, పిల్ల రాక్షసుడికి తెలుగు నేర్పిద్దురు గాని. ఎప్పుడు వెళ్ళిపోతారని అడగం. 🙂 వారాంతంలో నేను కొట్టే సుత్తికి మీరు మళ్ళీ ఇటువైపు రాకుండా శపధం చేసుకుంటారు. అప్పుడు మీకు తెల్సి వస్తుంది – తోచీ తోచనమ్మ, ఖాళీ బుర్రలు ఎంత విలువైనవో?

  డీలా, నో డీలా? చెప్పండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.