ఊసుపోక – అ. రాచకీయాలు!

(ఎన్నెమ్మకతలు 103)

మీరు రిపబ్లికనా? అని అడిగింది రెండురోజులక్రితం ఓ స్నేహితురాలు, అమెరికాలో రాజకీయాలగురించి మాటాడుతూ.

ఆ మాట వినగానే నాకు భగ్గుమంది. కోపం ఆ అమ్మాయిమీద కాదు. ఈనాడు ఎన్నికలపేరున అమెరికాలో జరుగుతున్న వీరవిహారం, వైర స్వైర విహారంమీద. అవేవీ చెప్పుకు మురిసిపోయేవి కావు. అంటే ఈ టపాలో హాస్యం లేదు, వ్యంగ్యం లేదు. అనునిత్యం చూస్తున్న వాగ్‌ హింసలవల్లా గోడమీద పిల్లివాటం వాదాలవల్లా నాకు కలుగుతున్న వ్యథ మాత్రమే. నేను విన్న, ఇంతవరకూ వింటున్న గాలికబుర్లలో ఏ ఒక్కరూ నిజంగా ఎదుటిమనిషి మేలు కోరి చెప్తున్నమాటల్లా కనిపించలేదు ఒఠ్ఠి నినాదాలే తప్ప.

నేను చిన్నప్పట్నించీ రాజకీయాలకి దూరమే. నాచిన్నప్పుడు ఒకసారి కాబోలు మానాన్నగారితో చిన్న సంభాషణ జరిగింది. ఆయన కాంగ్రెస్ పక్షం అనుకుంటా. కాకినాడలో జరిగిన అఖిలబారత కాంగ్రెస్ మహాసభకి నడిచి వెళ్ళేరని మాఅమ్మ చెప్పినట్టు గుర్తు. 1952-53 ప్రాంతాల్లో అనుకుంటా నెహ్రూ అవలంబించిన ఏదో విధానం ప్రజలకి నచ్చలేదు. దేశంలో ఉధృతంగా అలజడులు చెలరేగేయి. ఆసమయంలో అన్నాను, “ప్రజలే కదా ఆయన్ని ఎన్నుకున్నది, వాళ్ళఇష్టాయిష్టాలు పాటించఖ్ఖర్లేదా నెహ్రూ?” అని.

దానికి మానాన్నగారి సమాధానం, “నువ్వు మాకు నాయకత్వం వహించు అన్నతరవాత, ఆయనకి తోచినట్టు ఆయన చేస్తాడు కానీ వీళ్ళందరిమాటలూ వింటాడా?” అని. ఇవే మాటలు కాదనుకోండి, సుమారుగా ఇదే అర్థం వచ్చేమాట చెప్పినట్టు గుర్తు. ఈనాటి రాజకీయాలు చూస్తుంటే ఆయనమాటే నిజం అనిపిస్తోంది!

నాకు సాహిత్యంలో వాదాలమీద నమ్మకం లేనట్టే, ఎన్నికల్లో ఇచ్చే వాగ్దానాలమీద కూడా నమ్మకం లేదు. అరిగిపోయిన రికార్డులా వాళ్లమాటే వాళ్ళు వల్లించుకుంటూ పోతారు కానీ మనం అడిగినమాటకి జవాబు చెప్పరు. నిస్సిగ్గుగా ఎదటివారిగురించి అబద్ధాలు చెప్పడానికి సంకోచించరు. అంచేత నేను చేసేదేం లేదని తీర్మానించుకుని రాజకీయాలకి దూరంగా, నా సొంతబుర్రకి చేరువగా ఉంటూ వస్తున్నాను.

దాదాపు నలభై ఏళ్ళగా లేని స్ఫూర్తి ఈసారి ఎన్నికల కోలాహలంలో వాళ్ల బులిబుచ్చికబుర్ల మూలాన, ముఖ్యంగా రిపబ్లికనులు ఆడవాళ్ళగురించి అంటున్న మాటలు విన్న తరవాత జడభరతుడిలాటి నాలో కూడా చలనం కలిగింది. అది చెప్పుకు గర్వపడదగిన చలనం కాదు!

ఇంట్లో టీవీ, లాపుటాపూ నా ఇష్టసఖి అని చాలాసార్లే చెప్పేను కదా. గత ఆరునెలలుగా టీవీ తెరిచి ఏ ఛానెలు చూసినా ఆ రాజకీయనినాదాలు తప్పడం లేదు. ఇన్నాళ్లూ ఖాళీగా ఉంచుకున్న నాబుర్ర వీళ్ళ కాకిగోలతో భ్రష్టు పట్టిపోతోంది.

దీనికి నాందీ ప్రస్తావన మనవి చేసుకుంటాను మొదట. ఎంత కాదనుకున్నా కొంత బయటిప్రపంచంతో సంబంధం ఉంది కనక, కొందరు అమెరికన్ మిత్రులు ఏర్పడ్డారు కనక, నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి అమెరికాలోని ఈ రెండు ప్రముఖ రాజకీయపక్షాలగురించి.

రిపబ్లికనులకి పెట్టుబడిదారీవిధానంమీద మాచెడ్డ నమ్మకం. అందులో ప్రధానభాగం, వాళ్ళు చెప్పే సూత్రం, పని చేస్తే ఫలం, ఉచితలంచి కోరడం హేయం, ఇంకా మాటాడితే నేరం అని. ఇది వినడానికీ చెప్పుకోడానికీ ఎంతో సొంపుగా ఉంది. నేను కూడా నమ్ముతాను – దేశమంటే మనుషులనీ, ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టాలనీ, అంటే అర్థం ప్రతి ఒక్కరూ కష్టించి పని చేయాలనీ. నేనూ ఒప్పుకుంటాను ఇది.

డెమొక్రటులేం అంటారంటే, దేశ సౌభాగ్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న మాట నిజమే అయినా, అలా పాటుపడలేని జనాలనీ – అంటే పిల్లలు, ముసలీ ముతకా, వికలాంగులూ, అనారోగ్యంతో బాధ పడేవాళ్లూ, అనేకరకాల హింసలకి గురయి సహాయం పొందవలసినవాళ్ళూ – వీళ్ళని కూడా ఆదుకోవాలంటారు. ఇది కూడా వినడానికి సొంపుగా ఉంది.

చెప్పేను కదా బుర్ర ఖాళీగా ఉంటే ఎవరేం పెడితే అదే తీసుకుంటుంది. కానీ ఇప్పుడు అలా తీసుకోవాలనిపించడం లేదు. ఎందుకంటే నాకున్న అణాపరక పింఛను డబ్బులకి ఎసరు అయేలా ఉంది. ప్రాణంమీదకొస్తే ఆస్పత్రి ఖర్చులకి దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.

ఇంకా ఇలా కనిపిస్తున్నాయి వార్తలు చూస్తుంటే – పెట్టుబడి అంటే డబ్బుతో పని. బాగా డబ్బున్నవాళ్లు రాళ్లూ, ఫైళ్లూ మోయరు. తమకున్న డబ్బుతో వాల్‌స్ట్రీట్‌లో జూదమాడి తమఆస్తిని మరింత వృద్ధి చేసుకుంటారు. అందులో తప్పు లేదు కానీ ఏదో మామూలు బేంకులో ఉన్న నాడబ్బుకి నెలకి అక్షరాలా ఒక సెంటు జమ అవుతోంది వడ్డీరూపంలో. హాస్యం కాదు, నిజంగానే. చూసారా, ఇదన్నమాట డబ్బున్నవాళ్ల డబ్బుకీ, అట్టే లేనివాళ్ళ డబ్బుకీ రాగల ప్రతిఫలంలో తేడా.

ఇప్పుడు నాకు కడుపెందుకు మండుతోందో చెప్తాను. వ్యక్తి స్వేచ్ఛకీ, నాగరికతకీ అమెరికా పెట్టింది పేరు కదా. అసలు వ్యక్తి స్వాతంత్ర్యం అమెరికాయే కనిపెట్టి, యావత్ ప్రపంచానికి మార్గదర్శకులయేరన్నట్టు చాలామంది మాటాడ్డం విన్నాను. తుమ్మినా దగ్గినా క్షమాపణ కోరే దేశం. మరి ఇంత నాగరికత అభివృద్ధి సాధించిన దేశంలో ఆడవాళ్లనిగురించి అంత హీనంగా ఎలా మాటాడగలుగుతున్నారు అని నా ప్రశ్న. ఇక్కడ మొత్తం అమెరికా రాజకీయాలన్నీ చర్చకి పెట్టబోవడం లేదు నేను. కానీ కొందరు ఎంత జుగుప్సాకరంగా మాటాడుతున్నారో ఒకటి, రెండు ఉదాహరణలిస్తాను.

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో రిపబ్లికను గవర్నర్లు తయారు చేసిన చట్టాలప్రకారం ఎబార్షను నేరం. ఒకవేళ ఆడవాళ్ళు ఎబార్షను కావాలనుకుంటే వారు పరమనీచంగా అనిపించే మరియు వైద్యరీత్యా అవసరం లేని  కొన్ని ప్రొసీజర్లకి సిద్ధపడాలి. ఒకొకచోట ఉద్యోగస్థులయితే వారి యజమాని అనుమతి కూడా కోరాలిట! స్వేచ్ఛమాట అలా ఉంచి, ఈ మధ్య సెనేట్‌‌లో ఈ విషయం చర్చకి వస్తే, రిపబ్లికనులకమిటీలో స్త్రీలు లేరు. అందరూ మొగాళ్లే. డెమొక్రటులు ఒక అమ్మాయికి అవకాశం ఇచ్చేరు. ఆ అమ్మాయిపేరు Sandra Fluke. దాంతో కొందరు రిపబ్లికనులకి మాచెడ్డ కోపం వచ్చేసింది. ఆ అమ్మాయి చర్చించింది మొత్తం ఆడవాళ్లకి రాగల వివిధ రోగాలూ, వాటికి అవసరమైన చికిత్సలగురించే అయినా, దాన్ని కేవలం సెక్స్ కి సంబంధించిన సమస్యగానే గుర్తించి, ఓ రేడియో హోస్ట్ ఆ అమ్మాయిని స్లట్ అని, తనకి సెక్స్ విడియో పంపమని తాఖీదు ఇచ్చేడు. మరొక రిపబ్లికను కాళ్ళమధ్య ఆస్పిరిన్ పెట్టుకుంటే పోయేదానికి ఇంత గొడవేమిటి అన్నాడు. నాప్రశ్న – హక్కులమాట పక్కన పెట్టినా, సాటి మనిషిగురించి ఇంత జుగుప్సాకరంగా ఎలా మాటాడగలరనే, అదీ బాహాటంగా. వీళ్ళంతా బోలెడు చదువుకుని బహిరంగసభల్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చేవాళ్లూ, చట్టనిర్మాతలూ అయితే, సామాన్యులగతి ఎలా ఉంటుందో? అది తలుచుకుంటే నాకు భయం వేయదా? డెమొక్రటులు ఏం చేస్తారో నాకు తెలీదు కానీ కనీసం వీళ్ళు ఆడవాళ్ళగురించి ఇంత హేయంగా మాటాడ్డం వినలేదు నేను.

ఎబార్షను వల్ల నరకానికి పోతామో లేదో నాకు తెలీదు కానీ ఇక్కడ ఇప్పుడు అంటే ఈ లోకంలో బతికుండగా, ఈ ఎబార్షనులు నేరం అంటే, మరి అలా బలవంతాన పుట్టిన పిల్లలగతి ఏమవుతుంది? పిల్లలు పుట్టగానే పనిలోకి వెళ్ళలేరు. తల్లి పనిలోకి వెళ్తే, పిల్లని చూసుకునేవాళ్ళు కావాలి. పబ్లిక్ ఛైల్డ్ కేర్ కూడా రిపబ్లికనుల ఆలోచనల్లో లేదు. … ఇలా అనేకరకాల సమస్యలు తలెత్తుతాయి కదా. ఈ విషయం అనేక కోణాల్లోంచి, చర్చించి, పరిశీలించి, మానవత్వంతో కూడిన సమాధానాలు వెతకండి అనీ సాండ్రా అడిగింది. దానికీ ఆ అమ్మాయిని అంత హేయంగా తూలనాడడం!

ఇది చూసి, మీరు నేనేదో స్త్రీవాదం మొదలు పెడుతున్నానకండి. ఇది ఒక్క స్త్రీలమాటే కాదు, ఇనప్పెట్టెల్లో ఇబ్బడిముబ్బడిగా మూలుగుతున్న ధనం లేనివారి అందరిమాటా మాటాడుతున్నాను. రేప్పొద్దున్న నా సోషల్ సెక్యూరిటీకి సెక్యూరిటీ లేకుండా పోవచ్చు! ఈ వైద్యచికిత్సలు కావలసింది నాలాటి మధ్యతరగతి, కింది తరగతి జనాలకే. డబ్బున్నవాళ్ళు ఇక్కడ కాకపోతే ఏ లండనో స్విట్జర్లాండో వెళ్ళి తమ అవసరాలు తీర్చుకుని వచ్చేస్తారు.

రిపబ్లికనులు అందరూ ఇలాగే మాటాడరు. వాళ్ళలో కొంతమంది ఎబార్షనుకి వ్యతిరేకం కాదు. అలాగే డెమొక్రటులలో కూడా భ్రూణహత్య మహా పాతకం అని నమ్మేవాళ్లు ఉన్నారు. ఎటొచ్చీ, వీళ్ళు ఆడవాళ్ళ ఈ పరిస్థితిగురించి ఇంత హీనంగా మాటాడుతున్నట్టు లేదు. కనీసం నాకెక్కడా వినిపించలేదు. అంచేత, నేననేది చర్చల్లో కనీస సభ్యత పాటించాలి కదా అని. సాటి మనిషిని గౌరవించడం నాగరికత అయితే, ఆడవాళ్లు ఆ కోవకి చెందరా?

ఇక్కడ నేను వెలిబుచ్చిన అభిప్రాయాలన్నీ మీలో కొందరికి ఆమోదకరం కాకపోవచ్చు. ఆహ్లాదకరం కాకపోవచ్చు చాలామందికి. కానీ రోజూ వార్తలు వింటుంటే నాకు కనిపించిందీ, వినిపించిందీ ఇంతే.

ఖాళీ బుర్ర కథలో ఈవిషయమే చెప్పడానికి ప్రయత్నించేను. అంటే బుర్ర ఖాళీగా ఉంచుకోడం చాలా కష్టం, కష్టతరం. మనం దాన్ని ఖాళీగా ఉంచితే ఇదుగో పైన చెప్పినలాటి డొల్లకబుర్లు మన బుర్రలోకి వచ్చేస్తాయి. మన బుర్రలని మనమే సముచిత జ్ఞానంతో నింపుకోవాలి. అప్పుడు పైన చెప్పిన రేడియో హోస్టు మాటాడినట్టు మాటాడం, మాటాడలేం.

ఒక్కమాటలో అమెరికాలో ఈనాటి ఎన్నికల్లో ఆడవాళ్ళూ, డబ్బు లేనివాళ్ళూ మనుషులు అన్నట్టు మాటాడ్డం లేదు. వారి అవసరాలు అవసరాలు కావని ఈ అభ్యర్థులు చెప్పకయే చెప్తున్న అభిప్రాయంలా కనిపిస్తోంది.

000

44 మిలియన్లమంది దరిద్రులు ఈ సంపన్నదేశంలో. 17 మిలియన్లమంది పిల్లలకి తిండి లేదు, 46 మిలియన్ అమెరికనులకి హెల్త్ ఇన్స్యూరెన్సు కొనగల స్తోమతు లేదు. ఏన్ రామ్నీకి గల ఏదో యమ్మెస్ జబ్బుకి డ్రెసాజి గుర్రం ఉపశమనం కలిగిస్తుందిట. దాన్ని పోషించడానికి ఏడాదికి 77 వేల డాలర్లు ఖర్చు అవుతుందిట. అదే రోగంతో బాధ పడే అనేకమంది సామాన్యులకి డ్రెసాజి గుర్రాలు అఖ్ఖర్లేదు కనీసవైద్య సౌకర్యాలు కల్పించమని కోరడం తప్పెలా అవుతుంది? పని చేసి సంపాదించుకోండి అంటున్నారు. అందరికీ, బాగా చదువుకున్నవారికి కూడా తమ అర్హతలకి తగిన ఉద్యోగాలు దొరకవు. అందరూ మిలియన్లు సంపాదించలేరు. అది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అంచేత డబ్బు లేనివారందరినీ సోమరిపోతులే అనడం న్యాయం కాదు.

మరో విషయం – రిపబ్లికను అభ్యర్థులు ఎన్నికలయింతరవాత తాము దేశాన్ని ఎలా ఉద్ధరించగలరన్న విషయం ఎన్నికలయింతరవాతే చెప్తారుట. నామటుకు నాకు ఇది సిసలు వ్యాపారలక్షణంలా కనిపిస్తోంది. అంటే దేశాన్ని కూడా పెద్ద కంపెనీలా నడపడం అన్నమాట. ఇందులో చిన్నచక్రాల యోగక్షేమాలగురించిన ప్రస్తావన ఉన్నట్టు లేదు మరి.

(సెప్టెంబరు 11, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక – అ. రాచకీయాలు!”

  1. “పని చేసి సంపాదించుకోండి అంటున్నారు. అందరికీ, బాగా చదువుకున్నవారికి కూడా తమ అర్హతలకి తగిన ఉద్యోగాలు దొరకవు. అందరూ మిలియన్లు సంపాదించలేరు. అది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అంచేత డబ్బు లేనివారందరినీ సోమరిపోతులే అనడం న్యాయం కాదు.”
    పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతే కాదు పని అంటే డబ్బు తెచ్చేదే కాదు కూడా.ఖాళీ బుర్ర అని మీరంటున్నారు కానీ, మీ విశ్లేషణ బావుంది.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s