ఊసుపోక – మందపత్రాలు

(ఎన్నెమ్మకతలు 104)

అంతర్జాలంలో ఓ గుంపుకి ఉత్తరాలు పంపడం మామూలే. ఈవిషయంమీద నేను ఓ టపా రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నా. రెండు రోజులక్రితం నాకొచ్చిన మందపత్రంతో ఆ ఆలోచనకి సమయం ఆసన్నమయింది ఇవాళ.  

నేను చాలా కాలంగా రాయాలనుకున్న కారణం నాకు ఈ మందపత్రాలు చికాకు కలిగిస్తాయి. ఇవి చూసినప్పుడల్లా వీళ్ళు నన్నొక మనిషిలా చూడ్డంలేదు అనిపిస్తుంది. వీటిలో నిజంగా మీరూ నేనూ మాటాడుకున్నట్టుండదు. ఆత్మీయతలూ, కనీసమర్యాదలూ కనిపించవు. డియర్ అంటూనో, రెస్పక్టెడ్ సర్స్, మేడమ్స్ అని మొదలు పెట్టినా ఏమండీ, బావున్నారా అన్నట్టుండదు. ప్చ్. ఏం చేస్తాం. ఇది కలికాలం. ఇక్కడ మర్యాదలు ఇట్లే ఉండును అని సరిపెట్టుకుందాం. కానీ వాటికి సంబంధించిన మరి కొన్ని మర్యాదలు కూడా తెలుసుకోవాలి ఈ మందకబుర్లు అంపేముందు.

ఈ మందకబురు సాధారణంగా తాము చేస్తున్న ఏదో సామాజికసేవో, మరోరకం కృషో పదిమందికీ తెలియడానికీ, ఆ పదిమందీ వీలయితే సాయం చెయ్యడానికీను. ఈమధ్య తాము రాసిన కథో వ్యాసమో చదవమని పంపేస్తున్నారు మనకి ఆ విషయంలో ఆసక్తి ఉందో చూసుకోకుండా. ఎందుకంటే వాళ్ళు ఒక జాబితా తయారు చేసుకుంటారు దొరికిన  ఐడి అల్లా చేర్చేసి. ఆ తరవాత దాన్ని అవసరానికి అనుకూలంగా దిద్దుకోడం ఉండదు. రాసిన ప్రతివాక్యం దగ్గర్నుంచీ పిల్లల పుట్టినరోజులవరకూ ప్రతీదీ మీకొచ్చేస్తుంది. గుమ్మంముందూ, వీధుల్లోనూ పారేసిన కరపత్రాల్లాటివే.

కానీ ఈ ఐడీలు ఏ పెట్టెలో పెట్టాలి అన్నది చాలామందికి తెలిసినట్టు లేదు. To అన్న పెట్టెలోకి తమరికి తోచిన చిరునామాలన్నీ ఎక్కించేస్తే, ఆ జాబితాలో ఉన్నవారందరికీ మీరు ఆ ఐడీలన్నీ పంచిపెట్టేస్తున్నట్టే. అది చట్టవిరుద్ధం. మీరు నా అనుమతి లేకుండా నా ఐడి అంతమందికి పంచిపెట్టేరు అన్నమాట. అలా అందుకున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ అది ఉపయోగించుకుని మరిన్ని కబుర్లు నా ఇన్బాక్సులోకి అంపుతారు.

రెండో బాధ, ఉప్పూ కారం తినే ప్రతిమనిషికీ ఏదో ఓ అభిప్రాయం ఉంటుంది. వారు ఆ అభిప్రాయానికి జవాబొకటి కొట్టొచ్చు. ఎటొచ్చీ మీరు అడిగిందొకటీ వారు చెప్పేది మరోటి అయితే, రామక్కా అంటే తామరాకా అన్నట్టు, అది కూడా అంతమందికీ పంచిపెట్టబడుతుంది. హీ. హీ.

నిన్న నాకొచ్చిన కబురు – ఎవరో ఒకాయన కథలమీద పరిశోధన చేస్తున్నాననీ, తమ కథలు పంపమనీ ఓ మందపత్రం పెట్టేడు. ఎవరెవరికి అన్నది నేను మొదటి రోజు చూడలేదు కానీ దానిమీద మరికొందరి ఉత్తరాలు వచ్చేక, ఓహో, ఇది చాలామందికి అంపిన మందమెయిలు అని అర్థమయింది.

వాళ్లు రాసినలాటి ఆలోచనలు నాక్కూడా కలిగేయి. ఈ పత్రం తెలుగులో రాయక ఇంగ్లీషులో ఎందుకు రాసేరు, ఒక్కొక్క రచయితనీ విడిగా అడక్కుండా, ఇలా మందమెయిలు పెట్టడమేమిటి – ఇలా. కానీ నేను నా ఆలోచనలు సాధారణంగా ఆ పత్రరచయితతో పంచుకోను ఎందుకొచ్చినవగొడవలెద్దూ అనుకుని.

అలాగే ఏ పిహెచ్ డి కోసం పరిశోధనలు చేసేవారూను. పరిశోధన తొలిపాదంలో ఇలాగే సాగుతుంది. కనిపించిన ప్రతివారినీ, కనిపించిన ప్రతిచోటా అడగడమే. కొంత సమాచారం సేకరించుకున్న తరవాత, వాటిని కాస్త పరిశీలించి చూసినతరవాత ఒకొక రచయితని విడివిడిగా సంప్రదించడం జరుగుతుంది. ఇలా ఆలోచిస్తూ, చెత్తబుట్టతలపులు కట్టిపెట్టి, నా తెలుగు తూలిక చూడమని జవాబిచ్చి ఊరుకున్నాను. ఒక వాక్యం. అంతే. అలాగే ఇమెయిళ్ళలో ఇంగ్లీషు కూడాను. నూటికి 99 పాళ్లు మెయిళ్ళన్నీ ఇలాటి ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. బ్లాగుల్లో తెలుగులో రాస్తున్నవారు కూడా ఇంగ్లీషులో నాకు పత్రాలు పంపుతున్నారు. ఇలా పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కనక మనం ఏం చెయ్యాలో విడిగా  ఆలోచించి  సమాధానాలు వెతుక్కోవాలని నా అభిప్రాయం.:p.

ఈ మందపత్రాలు అందుకున్నవారిలో కొంతమంది అంత తేలిగ్గా పోనివ్వలేదు. ఆ విజ్ఞాపన తెలుగులో లేదని ఒకరు, ఇంగ్లీషులో బోలెడు తప్పులున్నాయని మరొకరు, రచయితలని ఎలా అర్థించాలో “సరైన పద్ధతులు” బోధించేవారొకరూ … ఇలా. అసలు reply to the sender అని కాక reply to all అని తెలిసో తెలియకో జవాబిచ్చేయడంవల్ల వచ్చిన తిప్పలవి. .

అవన్నీ చూసింతరవాత, నేను కేవలం నాకథలగురించి మాత్రమే జవాబు ఇచ్చి, నా అజ్ఞానం ప్రదర్శించుకున్నానేమో అనిపించింది నాకు. చూసేరా వీరి కబుర్లమూలంగా నా తెలివితేటలమీద నాకు నమ్మకం పోయింది. ఆత్మన్యూనతాభావము ఏర్పడింది! హతవిధీ!

ఇంతకీ నేను చెప్పేది, ఈ మందపత్రాలు అంపుతున్నప్పుడు కనీసం మీరు గుర్తు పెట్టుకోవలసినవి –

1. To అన్న పెట్టెలో మీపేరే పెట్టుకోండి. మిగతా ఐడీలు అక్కడ చేర్చకండి.

2. BCC (blind carbon copy) లో మిగతా ఐడీలు పెట్టండి.

3. రిప్లై అని జబాబు ఇస్తున్నప్పుడు ప్రత్యేకించి, reply all అన్నది ఉపయోగించవద్దని మనవి చేసుకోండి.

4. మీ మందపత్రాలజాబితాలోంచి నా ఐడి వెంటనే తొలగించండి. నా ఈ టపా ప్రధానోద్దేశ్యం ఇదే అని గమనించగలరు.

ఈ నియమాలు పాటిస్తే, మీరు కొన్నిరకాల జాలబాధలు మరి పరోక్ష చీవాట్లు తప్పించుకోగలరు.

అన్నిటికంటే ముఖ్యం ఈ వసతిని పొదుపుగా వాడుకోండి. చాలామందికి ఈ మందకబుర్లు ఆనందదాయకం కాదు. నూటికి 90వంతులు చెత్తబుట్టకి దఖలు అయిపోతాయి. మీకు తెలీదేమో మీనుంచి నేరుగా చెత్తబుట్టకో స్పామ్ ఫోల్డరులోకో పంపగల సదుపాయం అంతర్జాలంలో ఉంది. :))

(సెప్టెంబరు 23, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – మందపత్రాలు”

 1. మంద అంటే గ్రూపు కదండీ,
  యాహు/ గూగుల్ గ్రూపులలో,
  స్కూలు, కాలేజి,కలిసి చదివిన/
  ఉద్యోగం లో కలిసి పనిచేసిన వారు
  అందరితో ఒకే సారి విషయాలు అంద చెయ్యడానికి,
  సమాచారాలు పంచుకోనేదానికి ఎంతో సదుపాయంగా ఉంటుంది.
  మీరు చెప్పే మూక ఉమ్మడి టపాలు, మాత్రం చిరాకే!
  మీతో ఏకిభవిస్తున్నాను.
  మోహన్

  మెచ్చుకోండి

 2. @ sunnA, చూడండి, మరి, మీరూ, నేనూ ఎంత మొత్తుకున్నా ముందు వ్యాఖ్య ఇంగ్లీషులోనే!
  నాకు రాయడానికి వస్తువులందిస్తున్నందుకు ధవ్యవాదాలు.
  @ నారాయణస్వామి, నాబాధ మీకర్థమయిందంటారు :))

  మెచ్చుకోండి

 3. ఆ మెయిల్ చదివాక రిప్లై ఇస్తూ నేను అనుకున్నాను మాలతి గారు. నేను పంపిన మెయిల్ చూసి ఈవిడ ఒక ఎన్నెమ్మ కధ రాస్తారులా ఉంది, అని. నా అంచనా తప్పు కాలేదు. 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s