(మార్పు 46)
అమానుషం?!!! అంటే మానవులకి ఉండకూడని నీతి. జంతువులకి ఉండగల నీతి అని కూడా అనిపిస్తుంది. మ్.
నదివెంట పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే అనేక ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి నామనసులో.
పడవలా పరుచుకున్న ఎండు దుంగమీద తాబేళ్ళు తీరిగ్గా మెడలు నిక్కబొడుచుకు చూస్తున్నాయి. వాటికి కొలువు తీరి అటో బాతు, ఇటో కొంగ, పొలిమేర పహరా కాస్తూ మరో కొంగ! చూస్తున్నకొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించే సుందరదృశ్యం. ఆగి చూస్తున్నాను. ముచ్చటగా ఉంది. అదేమిటో అనుకోకుండా, ఎదురు చూడని శాంతి ప్రవచనాలు బోధిస్తున్న భావన కలిగింది. తాబేళ్ళకి కొంగలంటేనూ, బాతులంటేనూ భయం లేదు కాబోలు. అల్లంతదూరంలో ఒకటి, రెండు చేపలు తుప్పున తుళ్ళి పడుతున్నాయి “నేను నీకు నాస్తా అవుతానా” అని ఏ కొంగనో సవాలు చేస్తున్నట్టు. వాటికి కొంగలంటే భయంలేదేమో? గతిలేనివాళ్ళు చేతికందనంత దూరాన నిలబడి ఉన్నవారిని సవాలు చేస్తున్నట్టు. కానీ నాకు మాత్రం ఆనుమానంగానే ఉంది ఈ బక్కజీవాలు నిలువెత్తు కొంగలని రొకాయించి బతికేనా? అని.
గట్టున తీరిగ్గా నడుస్తున్న బాతుల్ని చూస్తుంటే నాకు నవ్వాగలేదు. చక్కగా రెక్కలు పరుచుకు ఎగరగలిగిన కొంగలూ, విసనకర్రల్లాటి పాదాలతో నీళ్ళలో ఈదులాడగల బాతులూ గట్టున గడ్డిలో నడుస్తుంటే నాకు నవ్వొస్తోంది.
ఎగిరిపోగల కొంగలు ఎందుకు నేలమీద నడుస్తాయో? ఇచ్చవచ్చినరీతి జలకాలాడుకోగల బాతులు ఒడ్డున గడ్డిపరకలు కొరకడమేమిటో … ఇంతకాలం నేనొక్కదాన్నే నేలమీద నేలబారు బతుకు సాగిస్తున్నాననుకున్నాను … హాహా.
ఈమధ్య చీకటితోనే లేచి బయటికి వెళ్తున్నాను.
తలెత్తి చూస్తే అటు అస్తమిస్తున్న పూర్ణచంద్రుడూ
మసక మసగ్గా నీళ్ళలో నీడలు పరుస్తూ రవితేజస్సూ
ఈ సుందర చిత్రమాలిక మధ్య, ముద్దుకుక్కలని షికారు తిప్పుతూ సామాన్యజనాలూ …
“మీరు కుక్కని నడిపిస్తున్నారు. నేను నన్ను నడిపించుకుంటున్నాను,” అన్నానో రోజు ఒకావిడతో.
ఆవిడ అతి మామూలుగా, “ఈ పిల్లకి ప్రకృతి చూడడం ఇష్టం. అంచేత బయటికి తీసుకొస్తాను, ” అంది. అంతవరకూ ఆ కోణం చిన్నినాబుర్రకి తట్టలేదు. ఏటివార ఈ కుక్కలు చేసే గలీజు మాత్రమే చూస్తున్నాను. అంచేత నాకు ఆ కుక్కలూ, కుక్కయజమానులంటే కాస్త చిరాగ్గా ఉన్నమాట కూడా నిజం. కానీ నాలుగ్గోడలమధ్య కుక్కలకీ, పిల్లులకీ, చిలకలకీ కూడా ఊపిరాడనట్టే ఉంటుందని ఇప్పుడే అర్థమయింది.
మాపక్కవాటాలో ఉన్నాయన రెండు కుక్కలని తీసుకు ఎదురొచ్చేడు. అదేం ఖర్మో, అందులో ఓ కుక్క నేను కనిపించినప్పుడల్లా తెగ అరుస్తూ మీద పడిపోతుంది. ఆయన దాన్ని అదుపులో పెట్టడానికి నానా అవస్థా పడతాడు ప్రతిసారీ. నాకు కుక్కలంటే భయం లేదు కానీ ప్రేమ కూడా లేదు. చాలామంది ఎదురైన ప్రతి కుక్కనీ దగ్గరికి తీసుకుని, దానితలా ఒళ్ళూ నిమురుతూ ముద్దులు కురిపిస్తూ దాంతో ఊసులాడతారు కనీసం ఓ రెండు క్షణాలపాటు. నేనలా చెయ్యలేను. పైగా మరో ఆశ్చర్యం ఆరెంటిలో ఒకటి మాత్రమే నామీద అరుస్తుంది, ఏ జన్మలోనో అత్తగారో ఆడబడుచో అయినట్టు.
ఆ కవలలనీ, వాటి పూర్వ యజమానులు టిబెట్నించి తీసుకొచ్చేరుట. అంటే నాకు పొరుగుదేశంవాళ్ళు! మనసాంప్రదాయరీతులు తెలిసినవాళ్ళు. కనీసం మన జాతిమర్యాద అయినా పాటించి నేను దాన్ని (క్షమించాలి నాభాషలో పశువులకి వాడే పదాలే నాకింకా అలవాటు.) పలకరించవచ్చు కదా అనీ, నాకు ఆమాత్రం జ్ఞానం లేదన్న సంగతి తాను గ్రహించినట్టు తెలివిడి చేయడానికి బహుశా అది నిరసన కాబోలు. మరి ఆ రెండోకుక్కకి లేదేం ఆ అభిజాత్యం? ఆ పెద్దమనిషి అవి రెండూ జాతికుక్కలనీ, వాటిని టిబెట్లో అంగరక్షకులుగా వాడుకుంటారనీ కూడా చెప్పేడు. ఇంటికెళ్లి అద్దంలో మొహం చూసుకోవాలి – నామొహం దొంగమొహంలా కనిపిస్తోందేమో …అక్కడికీ సందేహం తీరక, ఒక రోజు ఆయన్ని అడిగేను ఆ రెండూ వంతులవారీగా అరుస్తున్నాయా అని. ప్రతిసారీ అదొక్కటే అరుస్తుంది అన్నాడాయన. నాకు మాత్రం రెంటిలో తేడా ఇంచుకయినా తెలీలేదు అరుస్తున్నప్పుడు అరుస్తున్నది తప్ప.
ఇలా ఆలోచిస్తూ నడుస్తుంటే, ఆ జంటకుక్కలతో మా పక్కింటాయన కనిపించేడు. నన్ను చూడగానే, అలవాటుప్రకారం ఆ కుక్క మొరగడం మొదలు పెట్టింది. ఆయన హలో అన్నారు. నేను ఓ ఫొటో తీసుకోనా ఆ కుక్కలని, అన్నాను, నాచేతిలో ఉన్న కెమెరా చూపిస్తూ అనాలోచితంగానే. ఆయన సరే న్నారు. ఆశ్చర్యం, నేను విల్లమ్ములు సంధించినట్టు కెమెరా ఎత్తి పట్టగానే ఆ కుక్కపిల్ల మొరగడం మానేసింది. నాకు నవ్వొచ్చింది. ఆహా, ఇదన్నమాట చిదంబరరహస్యం. నేను ఆ జీవిని నిర్లక్ష్యం చేస్తున్నానని నిరసన తెలియజేయడానికే ఆ అరుపులు. ఆలోచిస్తున్నకొద్దీ మరిన్ని ఆలోచనలు తరుముకొస్తున్నాయి. మనుషులలో “పాశవిక” ప్రవృత్తిని చాలా హీనంగా చూస్తాం. కానీ పశువుల్లో, పక్షుల్లో ఉన్న నీతిలో సగమైనా మనుషుల్లో ఉందా అని.
ప్రతి రోజూ వీధిలోకెళ్లినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. పశువులనీ, పక్షులనీ, … “మానవులు” కాకపోవచ్చు కానీ మానవీయ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి ఆ జీవులలో. జన్మలన్నిటిలో మానవజన్మ ఉత్తమం అంటారు. ఎవరూ? మానవులే! మనకి మనమే కితాబులిచ్చుకున్నాం. ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోగల తెలివితేటలు మనకే ఉన్నాయి మరి.
తాబేళ్ళూ, బాతులూ, కొంగలూ ఒక్క దుంగమీద నిశ్చింతగా కూర్చున్నాయి. కుక్కలు మనిషి పలకరింపుకోసం అలమటిస్తున్నాయి. ఆ కుక్క నన్ను కసురుకోడానికి కారణం మరోప్రాణి సహవాసం కోరి. మామూలుగా చెప్పుకునే పెంపుడు జంతువులకథలు గుర్తుకొచ్చేయి. పూర్వజన్మలో ఒక చిలకని పంజరంలో బంధించినందుకు భద్రాచల రామదాసుకి కారాగారవాసం ప్రాప్తించిందంటారు. ఆచంట శారదాదేవిగారి కథలో చిలక పారిపోయిన తరవాత కానీ ఆ చిలకని చేరదీసిన కామాక్షమ్మకి గుంపుమనస్తత్వం అర్థం కాలేదు. అందుకు కొంచెం వేరుగా శారద (ఆస్ట్రేలియా)గారి అతిథి కథలో పారిపోయిన చిలక మళ్ళీ వస్తుంది తనకి ఆతిథ్యమిచ్చిన గృహిణిని పలకరించడానికి. ప్రతి ప్రాణికి ఆలంబన కావాలి. అది క్షణికం కావచ్చు. ఆమరణాంతం కావచ్చు. కానీ అనుక్షణం మరో ప్రాణి తోడు కావాలి. పక్షులూ, పశువులూ, బాతులూ, కొంగలూ అన్నీ గుంపులు గుంపులుగానే కనిపించడానికి కారణం ఇదేనేమో. అది ప్రాణి తత్వం కాబోలు. మరి ఆ కుక్కలకి ఆ కుక్కయజమాని సాహచర్యం ఉంది కదా. మళ్ళీ నామీద పడడం ఎందుకూ? ఎందుకంటే ఆ ఒక్కమనిషి సాహచర్యం చాలడం లేదనేమో?! సహజంగా మానవులలో ఉండే పేరాసేనేమో! ఉన్నకొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. డబ్బున్నవాళ్లూ ఇంకా ఇంకా పోగేసుకునేమార్గాలు చూస్తారు. లేనివాళ్ళు ఆపూట ఎలా గడుస్తుందో చూసుకుంటారు.
నాకాలంలో పెంపుడు కుక్కలు ముఖ్యంగా ఆల్సేషియన్ జాతి శునకాలు కలవారిలోగిళ్ళలో వారి సాంఘికస్థాయి తెలియజేసేవిగా రాజిల్లేవి. మాది సామాన్యసంసారం. పెంపుడు పిల్లీ, పెంపుడు కుక్కా అనిపించుకోగలవి రెండు ఉండేవి. మాఅమ్మ అన్నానికి కూచునేవేళకి ఓ పిల్లి వచ్చేది. మాఅమ్మ దానికిన్ని పాలు పోసేది. అలాగే వీధిగుమ్మంలోకొచ్చిన ఓ ఊరకుక్కకి నాలుగు మెతుకులు పెట్టేది. అవి తాగీ, తినీ వెళ్ళిపోయేవి. అంతే. వాటికి పేర్లు పెట్టడాలూ, బట్టలు తొడగడాలూ లేవు. అంచేత నేనింకా ఆ మానసికావస్థలోనే ఉన్నాను. ఇలా అంటే నేనేదో నాస్టాల్జియాలాటి బాధతో కుమిలిపోతున్నానని కాదు. నేనంటున్నది ఆ విలువలు. అవి సార్వజనీన, సార్వకాలీనవిలువలు. సాటి మనిషినీ, జంతువుని కూడా ఒక ప్రాణి అన్న దృష్టితో చూడగలగడం.
ఆమధ్య ఓ వార్త చూసేను. రోడ్డుపక్కన చెత్తకుండీలో పడ్డ ఎలుగుబంటి తల్లినీ, పిల్లల్నీ ఆదుకున్న దంపతులు. సాధారణంగా ఈదేశంలో ఇలా ఇళ్ళమధ్య ఎలుగుబంటిలాటి జంతువులు కనిపిస్తే, హడావుడిగా animal controlని పిలిచేయడమో, తుపాకీ తీసుకుని కాల్చేయడమో జరుగుతుంది. ఆ మధ్య ఒక చిన్నవాడిని ఏ కారణంలేకుండా, కేవలం “నాకు ప్రాణభయం కలిగింది” అన్న వాదనతో ఓ 17ఏళ్ళ కుర్రాడిని మరో 28 ఏళ్ళ మనిషి కాల్చి పారేయడం అమెరికాలో చాలామందికి తెలుసు. అలా కాకుండా, ఒకాయనా, ఒకావిడా తమ ట్రక్కు తీసుకుని, ఆ ఎలుగుబంటులని రక్షించేరు. ఇది ఒక మామూలు విషయం అన్నంత తీరిగ్గా అవి చెత్తకుండిలోంచి బయటికి రావడానికి సాయం చేసేరు. నాకు ఆ విడియో చూస్తుంటే ఉల్లాసంగా అనిపించింది. అంచేత లింకు ఇస్తున్నాను. కావలిస్తే చూడండి. కానీ మీకు కొంచెం ఓపిక కావాలి. మొదట ఓ ప్రకటన, తరవాత ఆ వార్తాహారిణి కబుర్లు, ఆ తరవాత అసలు విడియో వస్తుంది.
http://www.msnbc.msn.com/id/26315908/ns/msnbc_tv-rachel_maddow_show/#48365093
నేను పక్కనించి రైలు పోతుంటే తిరిగి చూస్తాను. ఇప్పటికీ పైన విమానం చప్పుడు వినిపిస్తే తలెత్తి చూస్తాను. విమానంలో ప్రయాణం చేస్తూ కిందకి చూడ్డం గుర్తు చేసుకుంటాను. అంటే విమానాలూ, రైళ్ళూ చిన్నప్పుడు మనదేశంలో వింతగా ఉండేవి. ఇప్పటికీ నాకు ఆ వింత అనుభూతి కలుగుతుంది. చిన్న చిరునవ్వు మెరుస్తుంది మొహమ్మీద అయాచితంగా. నాపక్కనించి పోయేవాళ్ళు ఏం అనుకుంటారో నాకు తెలీదు. నేను ఇలా రాస్తే ఇది నాస్టాల్జియా అని పేరు పెడతారేమో తెలీదు. నాకు మాత్రం అలా అనిపించదు.
ఈ పక్షులూ, పశువులూ ఇవన్నీ నాకు ఎల్లవేళలా సమస్తప్రాణికోటికీ, మానవాళికీ ఉండవలసిన, ఉండగల విలువలు గుర్తు చేస్తాయి. పైన విడియోలో చెప్పినట్టు ఇంకా అక్కడక్కడా, మనుషులు మనుషుల్లా ప్రవర్తిస్తారు, ప్రవర్తించగలరు అన్న ఊహ ఎంతో తృప్తినిస్తుంది.
ఇలాటప్పుడే, ఈ ప్రాణులలో – మనుషుల్లో, జంతువుల్లో – తేడా ఉందనుకుంటే, అది ఒకటే. ఈనాడు మనుషుల్లో కనిపిస్తున్నంత ఆత్మప్రదక్షణలు, స్వోత్కర్షా – ఆత్మవికాసం, సాంఘికవిజయం పేరుతో – ఈ పశువుల్లోనూ, పక్షుల్లోనూ కనిపించదు. అవి ఆనాటికీ ఈనాటికీ ఒక్కలాగే ఉన్నాయి. నాచిన్నతనంలో అహంకారం కాక వినయం ప్రాథమికవిలువగా ఉండేది. ఇది ఏకాలంలోనైనా ఆదరించదగిన విలువే కదా. మరి ఇప్పుడు ఎందుకు ఎలా మారిపోయింది? ఈ మార్పువల్ల మనిషికీ, సమాజానికీ ఎలాటి శుభం చేకూరుతోంది?
(అక్టోబరు 4, 2012)
మీ స్పందనకి ధన్యవాదాలు
మెచ్చుకోండిమెచ్చుకోండి
మనిషి మనిషికో నీతి
జనారణ్యము లోన ఆటవిక
న్యాయ మొక్కటే నీతి అడవిలోన
వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
నేను రాసుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ ఈ టపా చదివితే.ఏజంతువు తన స్వభావిక లక్షణం వదులుకో దు.కాని మనిషి తన మనుగడకయి ఏమైనా ఏదైనా మార్చ గలడు మార్చగలడు. అందుకే ఈ విధ్వంసం అంతా..
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఈ మార్పువల్ల మనిషికీ, సమాజానికీ ఎలాటి శుభం చేకూరుతోంది?. సమాజం, తోటి మనిషి గురించి ఆలోచన లేకే ఇలా ఉంది ప్రపంచం అనుకొంటాను. చాలా బాగుందండి.
మెచ్చుకోండిమెచ్చుకున్నవారు 1 వ్యక్తి
నీకు నచ్చినందుకు సంతోషం. పోతే ఎలా రాస్తానంటే నాకు మీ అందరిలా బోలెడు వ్యాపకాలు లేవు. ఉన్న ఒకటి రెండు విషయాలే అస్తమానం ఆలోచిస్తుంటాను కనక అవే రాసేస్తుంటాను. ఈవిడేమిటి ప్రపంచంలో ఉన్న విషయాలను పట్టించుకోకుండా అని మీరందరూ అనుకోకుండా నారచనలను చదవడం నా అదృష్టం. నమః
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఎందుకంటే ఆ ఒక్కమనిషి సాహచర్యం చాలడం లేదనేమో?!
నిజమే. కుక్కలకీ పిల్లలకీ-చుట్టుఅపక్కల ఎంతమంది ఉంటే అంతే ఉత్సాహం కాబోలు.
——————
అది అలా ఉణ్ణీయండి కానీ మీరిలా ఇన్ని టపాలు ఇంత అవలీలగా ఎలా రాస్తారో అని నాకెప్పుడూ ఆశ్చర్యమే.
మెచ్చుకోండిమెచ్చుకోండి
సి వి ఆర్ మోహన్, ప్చ్. ఏం చేస్తామ్. మనుషులు మారరేమో అనిపిస్తోంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీ జంతుజన్య ఆలోచనలు నన్ను చలింప చేసాయి,
సంకెళ్ళలో పెంపుడు జంతువులను ఉంచినట్ట్లుగానే,
మనుష్యులను బానిసలుగా వాడుకునే కర్కసులైన
మనుష్యులున్నారనేది మనకు తెలిసిందే
కొన్ని అరబ్బు దేశాలలో భారత సంతతి వారి భూలోక నరకం,
భారత దేశం లోనే కట్టు బానిసత్వం లో ఉన్న దీన జీవులెందరో?
పర పీడన పరాయణత్వం- అంతు లేని చరిత్ర !
అమానుషం గా ప్రవర్తించేది దానవుడైన మానవుడే
నోరు లేని జీవాలు కావు.
మెచ్చుకోండిమెచ్చుకోండి