కవితాత్మ నీలినీడలు

(మార్పు 47)

లీల రాసిన ఉత్తరం పట్టుకుని వరండాలో కూర్చున్నాను.

ఎండలు తగ్గేయి కానీ చలి మరీ అంతగా గజగజలాడించేయడం లేదు. అసలిక్కడ అంత చలి రాదంటున్నారందరూ. రెండేళ్ళక్రితం పడినమంచు విచిత్రమేన్ట. ఈయేడెలా ఉంటుందో … అయినా ఏదయితే మాత్రం ఏం చేస్తాం భరించడం తప్ప. కనీసం ఇవాళ్టికి నీరెండ గోరువెచ్చగా మనసుకి ఓదార్పుగా ఉంది. ఈ చల్లదనమూ శాశ్వతం కాదు. ఎండలు మళ్లీ రెచ్చిపోకా తప్పదు. బతుకంతా ఇంతే, ఎండలూ, వానలూ, చలీ, ఎండలూ, వానలూ, చలీ, ఎండలూ …

మళ్ళీ చేతిలో కవరువేపు చూసేను. ఎక్కడుందో … కవరుమీద, ఊరూ, పేరూ లేవు. లీల అని మాత్రం తెలుస్తోంది. ఆ దస్తూరి సుమారుగా నాకు జ్ఞాపకం ఉది. విప్పి చూడ్డానికి నామనసు వెనకాడుతోంది. ఏ దుర్వార్తో అన్న పిరికితనం, ఏదైనా సాయం కావాలేమో, నావల్ల కాదేమో, కాదని చెప్పలేనేమో … నాకే నవ్వొచ్చింది. ఎందుకొచ్చిన బాధ. తీసి చూస్తే పోలే … మనిషి ఎదురుగా లేదు కదా, ఏ జవాబయినా వెంటనే చెప్పి తీరాలని అనుకోడానికి. అసలు అదేం లేదేమో, ఊరికే పలకరించడానికి రాసిందని ఎందుకనుకోకూడదూ? ఎందుకంటే మన ఆలోచనలతీరు అలాటిది కనక. భయం ముందు పుట్టి, మనం తరవాత పుట్టేం.

మాలతిగారికి,

మీరు ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపోతారేమో, ఎప్పుడూ లేనిది ఇదేమిటి అని. ఎంచేతో ఈరోజు మీరే గుర్తొచ్చేరు. నేను చాలా ఊళ్ళే తిరిగేను. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. అందుకే తిరుగుటపా రాయడానికి నాకు ఎడ్రెసంటూ లేదు. మీరు నాకు జవాబు రాయఖ్ఖర్లేదు. నా ఆలోచనలు ఎవరికి చెప్పుకోడానికీ లేక, ఏం చెయ్యనా అని ఆలోచిస్తుంటే మీరు గుర్తొచ్చేరు. ముందు కాయితంమీద పెడితే చాలు అనుకున్నాను కానీ అది చాలినట్టు లేదు. హాహా. అంచేత మీమీద రుద్దుతున్నా. ఇప్పటికి సుమారుగా నేనేం రాయబోతున్నానో మీరు గ్రహించే ఉంటారు. అంచేత, మీకిష్టం లేకపోతే ఇక్కడే ఆపేయండి. మీకు పోస్టు చెయ్యగానే, నాపని అయిపోయింది. హీహీ.

నేను పెద్దక్కయదగ్గరున్నప్పుడు ఆవిడ వాళ్ళఅమ్మమ్మా, తాతగారిగురించి చెప్పేరు. ఆవిడ చెప్పిన కథ –

తాతగారికి వయసు వచ్చేనాటికి దాదాపు జమీందారీఫాయీలో ఉంది ఆస్తి. చుట్టుపక్కల పదిక్రోసులదూరంలో పొలాలూ, ముంతమామిడి తోటలూ, తాటితోపులూ, అంతా కలిసి రంగరంగవైభవంగా ఉంది. ఆయన యాజమాన్యంలోకి అంత ఆస్తి రాగానే, ఆయనకి వళ్ళూ పై తెలీలేదేమో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం మొదలెట్టేరు మంచీ, చెడూ సకలవిధాలా. రెండు చేతులా దానాలూ జూదాలూ కలగాపులగంగా చేసేస్తూ ఆస్తంతటినీ హారతికర్పూరం చేసేసేరు. పెద్దవాడు చేతికొచ్చేవేళకి ఓ పదెకరాలు పొలం, తాటితోపూ మిగిలేయి. వాటితో తమ్ముళ్ళనే చదివిస్తాడా, చెల్లెళ్ళకే పెళ్ళిళ్ళు చేస్తాడా, ఆ పైన వాళ్ళకి పండుగలకీ పబ్బాలకీ పెట్టుపోతలు జరుపుతాడా. చేతనయినంతలో చేస్తుంటే, తోబుట్టువులే కాక మేనత్తలు కూడా తమకి అన్నగారున్నప్పుడు జరిగినట్టు జరగలేదని దెప్పుళ్ళు. ఇవన్నీ భరించలేక ఇల్లొదిలి పారిపోయేడాయన, కట్టుకున్న పెళ్ళాన్నీ, నలుగురు పిల్లల్నీ కూడా వదిలేసి. పాపం, వాళ్ళమ్మమ్మమీద పడింది భారం అంతా. ఓ చిన్న మడిచెక్క మిగిల్తే, దాంట్లో కూరగాయలు పండించి. ఇరుగూపొరుగుకి పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ సాయం చేసీ, సంసారాన్ని నెట్టుకొచ్చింది. ఆ వరసలోనే ఇల్లు పట్టిన విధవాడబడుచు అదే పెద్దక్కయ్యతల్లిని ఇంటిపనుల్లో సాయం చెయ్యమంటూ సాధించడం ప్రారంభించింది. అది వారసత్వంగా పెద్దక్కయపాల కూడా సాగింది ఆడజన్మెత్తేక పనులు చేసుకోకపోతే ఎలా, అంటూ. అప్పటివరకూ ఆవిడకి అట్టే పనులు చెప్పేవారు కారు ఎవరూ. కానీ, ఏమాటకామాటే చెప్పుకోవాలి. దారిద్ర్యంవల్ల కొంత మేలు జరిగింది. నిజంగా ఆప్తులెవరో కూడా తెలుస్తోంది. అమ్మమ్మగారూ, అక్కయ్యగారూ, మామయ్యగారూ, అన్నగారూ, తమ్ముడూ, అంటూ ఇంటిచుట్టూ తిరిగినవాళ్ళలో పదోవంతు కూడా ఇప్పుడు కనిపించడంలేదు. ఎప్పుడో అమావాస్యకీ పున్నానికీ అల్లంతదూరంలోంచి బావున్నారా అంటూ తలా చేతులూ ఊపేవాళ్ళు ఇప్పుడు గుమ్మంలోకి వచ్చి, ఏదో కూరో కాయో ఇవ్వడం, అవసరంవస్తుంది ఉంచండంటూ పాతికో పరకో చేతిలో పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పొరుగూరికెళ్ళాలంటే బండి పంపుతున్నారు. లేని పండుగలు సృష్టించి భోజనానికి పిలుస్తున్నారు! పెద్దక్కయ్యకి ఇదంతా చూస్తుంటే, జన్మెత్తిన ప్రతివారూ జీవితంలో ఒక్కసారయినా దారిద్ర్యం అనుభవించాలి అందులో గల ఆనందాన్నీ, తృప్తినీ తెలుసుకోడానికి అనిపిస్తోంది. తనతల్లికి తను అర్థం కాదు. తనేదో మందబుద్ధయినట్టు మాటాడుతుంది. ఏమిటస్తమానం అలా ఏదో లోకంలో ఉన్నట్టు, ఎటో చూస్తూ, పిలిస్తే పలకనైనా పలక్కుండా కూర్చుంటావు? బుర్ర చెడిపోతుంది. చూసేవాళ్ళు కూడా నీకు మతిలేదనుకోగల్రు. ఆమాట పొక్కిందంటే ఆ మూడు ముళ్లూ వేసేవాడు దొరకడు కూడాను. సరేలే, పెళ్ళి మాటెందుగ్గానీ, ఆడపుట్టక పుట్టింతరవాత వంటా వార్పూ రాకపోతే ఎలా. మరొకడికి వండి పెట్టఖ్ఖర్లేదు, నీకైనా నువ్వు వండుకుతినాలా, లేదా. నీవయసు పిల్లలని చూడు. ఎంత చక్కగా నవ్వుతూ, తుళ్ళుతూ, ఆడుతూ పాడుతూ ఇల్లంతా గలగల తిరుగుతూ ఇంటికి కళ తెస్తారు. అల్లికలూ, కుట్లూ, ముగ్గులూ ఎంత నేర్పుగా చేస్తున్నారో. చూస్తే ముచ్చటేస్తుంది. … నీకాయావే లేదే ఖర్మ, … ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో … ఇలా గంటసేపు సాధించి పోసి కళ్ళొత్తుకుంటూ వంటింట్లోకో పెరట్లోకో వెళ్ళిపోతుంది.

అమ్మకి అర్థం కాదు తనక్కూడా ఎనలేని ఆనందమూ, పట్టలేనంత దుఃఖమూ అనుభవించగల మనసుందనీ. తనకి కూడా అనుభూతులూ, అనుభవాలూ మనసులోనే పుట్టి మనసులోనే సమసిపోతున్నాయని ఆవిడ ఊహించలేదు. ఊహించగలమేధ లేదు ఆవిడకి. అయినా అవి అనవసరమేమో కూడా. తను చెల్లెలిలా అందగత్తె కాదు. ఇంటికొచ్చినవాళ్ళు చెల్లెలిని చూడగానే చక్కగా చెక్కినబొమ్మలా ఉంది, చిదిమి దీపం పెట్టొచ్చు అని, తనవేపు తిరిగి ఓ జాలిచూపు విసిరి, నీకూ ఎక్కడో పుట్టే ఉంటాడులే గంతకి దగ్గ బొంత అంటారు. అలా అంటే తనకి నొప్పి అని వాళ్ళకి తోచదు. ఆమాటలు తనకి ఓదార్పునిస్తాయనే వాళ్ళు మనసా నమ్ముతారు. సందేహం లేదు. మ్.

పెళ్ళిచూపులతంతు మొదలయినతరవాత కూడా అంతే. తనని చూడ్డానికి వచ్చినవాళ్ళు చిన్నమ్మాయిని చేసుకుంటాం అని కబురు పెట్టడం, వీళ్ళు పెద్దది ఉండగా చిన్నదానికెలా చేస్తాం, దానికింకా పద్నాలుగేళ్ళే కదా …  ఇలా జరుపుకుంటూ వస్తుంటే పెద్దక్కయ్యకి మహా చిరాగ్గా ఉండేది. అసలు అందం అంటే ఏమిటి? అందానికింత ఎందుకు ప్రాధాన్యం? ఎందుకంటే అందానికీ మంచితనానికీ కూడా లంకె పెట్టేరు. దేవతలందరూ రూపు కట్టిన సౌందర్యమూర్తులు, పరమ వికృతాకారం దుర్మార్గులది. అందం పూర్వజన్మసుకృతం. పెద్దక్కయ్య అద్దంలో మొహం చూసుకుంది. అందం అంటే ఏమిటి? చిన్నకళ్ళూ, పెద్దముక్కూ ఎందుకు అందం కాకూడదూ, కోటేరేసిన ముక్కూ, విశాలనేత్రాలే ఎందుకు అందం కావాలీ? తెల్లతొక్క అందం, నల్లతోలంటే చిన్నచూపు ఎంచేత? శ్రీకృష్ణుడూ, ఆషాఢమేఘాలూ అందం అంటూ వర్ణిస్తారు కానీ ఓటిమాటలే, నాలుక చివర నాట్యాలే. క్రియదగ్గరకొచ్చేసరికి, తెల్లపిల్ల కావాలి, పెద్దకళ్లు కావాలి, తమలపాకు తొడిమల్లాటి చేతులు కావాలి. ముత్యాలకోవలాటి పలువరస కావాలి. … అవేవీ తనకి లేవు.

పెద్దక్కయ్యకి అందరు ఆడపిల్లల్లా అందాలమీదా, అలంకారాలమీదా ధ్యాస లేదు. దాంతో మరో ప్రశ్న – అందంగా ఉన్నవాళ్ళకే మరింత అలంకరించుకోవాలన్న తపన ఉంటుందా? పెద్దక్కయ్యని అందరూ అందగత్తె గాదనడంచేత అందంమీద ధ్యాస లేకుండా పోయిందా? … స్కూల్లో మిగతా పిల్లలంతా మొగపిల్లలమీద ఓ కన్నేసి, వాళ్ళు వీళ్ళవేపు చూడ్డానికి నానా అవస్థలూ పడుతుంటే, పెద్దక్కయ్య నిర్వికారంగా వాళ్ళని చూస్తూ, వాళ్ళెందుకంత అవస్థలు పడతారో అర్థం కాక సతమతవుతూండేది. ఆవిడకి తన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రాపంచికవిషయాలూ అన్నీ అర్థరహితంగానే తోచేయి. కనీసం ఆ అర్థం ఏమిటో తనకి అర్థమయితే బాగుండునన్న తపన కూడా ఉండేది. అలాటి తలాతోకా లేని ఆలోచనలతో, తనలోకంలో తను ఉంటుంటే, నీళ్ళు తీసుకురా, బట్టలుతుకు, పాదులకి నీళ్ళు పెట్టు అంటే తనకి ఎక్కళ్ళేని చిరాకూ ముంచుకొచ్చేది. ఈ పనులన్నీ అర్థం పర్థంలేని చాకిరీలా కనిపించేయి. బట్టలు ఏరోజుకారోజు ఉతక్కపోతే ఏం? ఎవరిబట్టలు వాళ్ళే ఉతుక్కుంటే అమ్మ ఒక్కతే చెయ్యఖ్ఖర్లేదు కదా. అమ్మ ఒక్కత్తే చెయ్యకపోతే తనకి కూడా ఈ పోరు ఉండదు కదా …

అలాటి రోజుల్లోనే అన్నయ్యకోసం రోజూ ఇంటికొచ్చే హనుమంతు ఒకరోజు, చుట్టూ ఎవరూ లేకుండా చూసి, “అమ్మ నాకిష్టమయితే నిన్ను చేసుకోమంటోంది,” అన్నాడు. పెద్దక్కయ్యకి మాట తోచలేదు. ఏం చెప్పాలో తెలీలేదు. “నీకిష్టమయితే సరా, నాకిష్టం అవఖ్ఖర్లేదా?” అని అడగాలనిపించింది. “ఆస్తి ఉంది కనక తనిష్టమే అనుకుంటున్నాడేమో, ఎంత పొగరు,” అనుకుంది. “నాకు తెలీదు. పెద్దలున్నారు కదా. వాళ్ళనడుగు,” అనాలనిపించింది. “నాకసలు పెళ్ళి చే్సుకోవాలని లేదు,” అని కూడా చెప్పాలనిపించింది. “ఏం, నేనంటే నీకిష్టం లేదా? నాకేం తక్కువ, చెప్పు పోనీ,” అన్నాడతనే మళ్ళీ. పెద్దక్కయ్య మరో రెండు నిముషాలు ఆలోచించి, “నాకింకా పదహారు కూడా నిండలేదు. నీకు ఇరవై. మరో నాలుగేళ్ళు పోనీ, చూద్దాం, నీకింకా అప్పుడు నన్నే చేసుకోవాలనుంటే చూద్దాం,” అంది. ఇంట్లో ఈవిషయం ఎవరికీ తెలీదని పెద్దక్కయ్యకి అర్థమయింతరవాత హనుమంతు ఆమాట తనని వేళాకోళం చెయ్యడానికి అన్నాడేమో అనుకుంది. లేకపోతే, పెద్దలు ఎందుకూరుకుంటారు. ఊళ్ళో స్థితిమంతులు. తాతగారితరవాత మళ్ళీ తాతగారంత పలుకుబడి ఉన్నవాళ్ళు. అతను కావాలనుకోవాలే కానీ ఏదో సామెత చెప్పినట్టు కో అంటి కోటిమంది వచ్చి కాళ్లముందు వాల్తారు. పెద్దక్కయ్యకి అభ్యంతరం కూడా అదే. అందగత్తెలూ, స్థితిపరులూ ఎంతో మంది అతన్ని చేసుకోడానికి సిద్ధంగా ఉండడమే కాదు ఆరాటపడిపోతుంటే, అతడు తనకి తానై వచ్చి తనని అడగడమేమిటి? హనుమంతు ఆలోచనలు వేరు. తనని కోరి చేసుకునేవారందరూ తనఆస్తి చూసి చేసుకుంటాం అంటున్నారు. పెద్దక్కయ్యకి ఆ ఆలోచన లేదు కనక ఆమెని ఇష్టపడ్డాడతను. అతను, “సరే, నాలుగేళ్ళతరవాత వస్తాను,” అని వెళ్ళిపోయేడు. అది అంతటితో సరి అనే అనుకుంది. ఏడాది తిరిగేసరికి, పరిస్థితులు మారిపోయేయి. హనుమంతు ఆస్తి హరించుకుపోయింది. ఎలా అన్నది అటుపెడితే, హనుమంతుకి పెద్దక్కయ్యమీద మనసు మాత్రం అలాగే ఉంది. “అప్పట్లో నా సంపద నీకు అభ్యంతరమయింది. ఇప్పుడు అది లేదు కనక, నీకు మరి ఆటంకాలేమీ ఉండకూడదు,” అన్నాడు మళ్లీ వచ్చి. కానీ పెద్దక్కయ్య అందుకు సిద్ధంగా లేదు. “ఏమో, ఇప్పుడు అతడివెంట ఎవరూ పడడంలేదు కనక తనని చేసుకోవాలనుకుంటున్నాడేమో.” “చెప్పేను కదా, నాలుగేళ్లు ఆగాలి, అని, నాలుగేళ్లు. అంతే,” అంది. క్రమంగా వాళ్ళమధ్య దూరం ఏర్పడింది. ఈలోపున ఇంట్లో పెద్దలు మేనమామతో పెళ్ళి కుదిర్చేసేరు. …

… నేను ఆగేను. లీల ఇదంతా ఇప్పుడు నాకు ఎందుకు రాస్తోంది అన్న ప్రశ్నతో. జవాబు దొరకలేదు. నాచేతిలో కాయితం, వెనక్కి తిప్పేను మిగతా కథ చదవడానికి.

ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు రాస్తున్నానంటే, ఇక్కడ పదిరోజులక్రితం మాపొరుగావిడ నాకో పుస్తకం ఇచ్చేరు My Brilliant Career అని ఒక ఆస్ట్రేలియన్ రచయిత్రి రాసిన పుస్తకం. ఆవిడేమో అది కథ కాదనీ, స్వీయచరిత్ర కనక, మామూలుగా కథల్లో ఉండే గొప్ప సంఘర్షణలూ, సమస్యలూ, అవీ ఉండవనీ ముందుమాటలో రాసింది కానీ ఆ పుస్తకం మాత్రం నవలగానే ప్రాచుర్యం పొందింది. ఆవిడజీవితం 16-18 ఏళ్ళమధ్య జరిగిన కథ 19వ ఏట 1899లో రాసింది. ఆ తరవాత చాలా పుస్తకాలు రాసినా, మొదటి పుస్తకానికి వచ్చిన ఖ్యాతి మరి దేనికీ రాలేదు కానీ ఆవిడ మాత్రం ఫెమినిస్టుగా పేరు సంపాదించుకుంది. అమెరికా వచ్చేసి, స్త్రీల అభ్యుదయానికి చెప్పుకోదగ్గ కృషి చేసింది. ఇంతకీ ఆనవల నన్ను చాలా ఆకట్టుకుంది. పైన చెప్పిన పెద్దక్కయ్యకథకీ ఈరచయిత్రి, Miles Franklin కథకీ తేడా లేదు, కాకపోతే, ఆవిడ ఆస్ట్రేలియన్ కనక ఊర్లూ, పేర్లూ మారతాయి అంతే. ఏదేశంలో కానీ సుమారుగా ఒక కాలం తీసుకుంటే, ఆలోచనలూ, ప్రవర్తనలూ ఒక్కలాగే ఉంటాయనిపించింది. రెండోది, ఏదేశంలోనూ కాలంలోనూ కాలాతీతవ్యక్తులు ఉంటారనిపిస్తోంది. నిజానికి నేను ఆ నవలే సమీక్షించి ఉండొచ్చు పెద్దక్కయ్య కథ చెప్పకుండా. కానీ ఆ నవల చదివినంతసేపూ మనదేశంలో మనుషులూ, సంఘటనలూ గుర్తుకొస్తూనే ఉన్నాయి. అంచేతన్నమాట పెద్దక్కయ్య కథని అంత విపులంగా రాసేను.

ఇప్పుడు నాప్రశ్న చెప్తాను. అంటే ఇది మీకెందుకు రాసేను అన్నది. ఆ రచయిత్రి ఆలోచనలు నన్ను ఆకట్టుకున్నాయి.

My curious ideas regarding human equality gave me confidence. My theory is that the cripple is equal to the giant, and the idiot to the genius. అంటుంది ఒకచోట.

If the souls of lives were voiced in music, there are some that none but a great organ could express, others the clash of a full orchestra, a few to which nought but the refined and exquisite sadness of a violin could do justice. Many might be likened unto common pianos, jangling and out of tune, and some to the feeble piping of a penny whistle, and mine could be told with a couple of nails in a rusty tin-pot. Why do I write? For what does any one write? Shall I get a hearing? If so–what then? (Franklin, Miles (2009-10-04). My Brilliant Career (p. 236). Public Domain Books. Kindle Edition.)

అంటూ ముగించింది. నాకు ఈ వాక్యాలలో ఆవిడ అంతర్మమథనం, జీవితసారం కూడా పొందుపరిచింది అనిపిస్తోంది. మరో సంగతి తనతల్లిగురించి కూడా ఆ రెండేళ్ళలోనే – ఆవిడ ఎంత దృఢచిత్తంతో, మనోబలంతో సంసారాన్ని ఈదుకువచ్చిందో కూడా తెలిసింది అంటుంది. మరి నాక్కూడా అలాటి ఆలోచనలే వస్తాయి. నేను కూడా అలాగే అనుకుంటాను. నవ్వకండి మరి, నేను ఆవిడంత గొప్ప రచయిత్రిని కానని. నాకూ తెలుసు ఆ సంగతి. కానీ ఆమెలా జీవితంలో ఏది ముఖ్యం, ఏమిటి సాధించడానికి ఈ జీవితం అన్న ప్రశ్నలతో సతమతయేవారు ఎవరూ ఉండరా? జీవితాన్నిగురించి, జీవితంలో ఒకొకరిధ్యేయాలగురించిన ఆలోచనలు అంత గొప్పవాళ్ళకి మాత్రమే చెల్లుతాయా? … …

ఏం చెప్పను? లీల ఎదురుగా లేకపోవడం కొంత మేలయింది అనిపించిందా క్షణంలో. బహుశా చాలామందికే అలాటి సందేహాలు కలగొచ్చు. కానీ అందరూ మాటల్లో పెట్టలేరు. అందుకే ఇలాటి పుస్తకాలు చదవడం. అవును సుమా, నాకూ అలాగే అనిపించింది, నేనూ అలాగే అనుకున్నాను అనుకోడానికి. ఏ నూటికో కోటికో ఒకరు ప్రభావితులై కర్తవ్యోన్ముఖులు కూడా అవుతారేమో వీరివల్ల.

నాచేతిలో కాయితాలు మళ్ళీ చూసేను. లీల పుస్తకం వివరాలు కూడా ఇచ్చింది.

My Brilliant Career by Miles Franklin Gutenberg.orgలో ఉచితంగా దొరుకుతుంది, చూడండి అని రాసింది. link: http://www.gutenberg.org/ebooks/11620

చూడాలి!

(అక్టోబరు 11, 2012)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “కవితాత్మ నీలినీడలు”

 1. Hmmm…
  ఒకరికి పేరొచ్చాక ఇలాంటి ఆలోచనలకీ హోదా పెరుగుతుండచ్చు. లేదా మామూలు మనుషులు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వారందరూ, వారి ద్వారా లేదా వారి రచన, వ్యక్తీకరణలో తమ ఆలోచనలకి గుర్తింపు వచ్చిందనుకోవచ్చు. కొన్ని రచనలు చదివితే కలిగి తృప్తి అందుకే కావచ్చు. అంటే సాధారణ వ్యక్తి ఆలోచనలను అతనికి సాధ్యం కాని విధంగా వ్యక్తపరచగలగడం. నాకైతే అలాంటి తృప్తినిస్తాయి కొన్ని రచనలు.
  నేనూ ఇలాంటి ఆలోచనల మీద సాగిన పుస్తకాలనే చదువుతున్నాను ఈ మధ్య. కొందరికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. (నాకు వస్తాయి. నాకు తెలిసిన కనీసం ఇంకొకరికి వస్తాయి. నా ఉద్దేశ్యంలో కొన్ని phasesలో దాదాపు ప్రతి ఒక్కరికీ వస్తాయి.) అందులో కొందరు వాటికి తమ జీవితం కొనసాగించడానికి కావల్సిన ప్రశాంతతను చేకూర్చే సమాధానాలు వెతుక్కోగలుగుతారు. కొందరు ప్రశ్నలతోనే జీవితమంతా అటూ ఇటూ కాకుండా వెళ్ళదీస్తారు. కొందరు అదృష్టవంతులు ఇలాంటి సంఘర్షణ లేకుండా తమ చేతిలో ఉన్న జీవితాన్ని చాలా సులభంగా జీవించేస్తారు. కొందరు సమాధానాలు తప్పుగా (అంటే మనకు అర్థవంతమనే జీవితానికి వ్యతిరేకంగా) వెతుక్కుని ఆ దోవలో వెళ్తారు. ఇదీ నాకు అర్థమయ్యింది.
  నేను ఈ మధ్యే చదివిన సోమెర్సెట్ మామ్ “అఫ్ హ్యూమన్ బాండేజ్” లో పర్షియన్ తివాచీలో నేతతో జీవితాన్ని పోల్చుకుంటాడు. ఇక్కడ సంగీత వాయిద్యాలతో జీవితాలని పోల్చిన తీరు చూస్తే అది గుర్తుకు వచ్చింది.

  మెచ్చుకోండి

 2. sunnA, మీ అక్మగారివిషఁయం సారి. అవునండీ, నేను కూడా అలాటిపరిస్థితుల్లో చిక్కుకున్నవారిని చూసేను నిజజీవితంలో. నా సానుభూతి తెలియజేస్తున్నాను. అందుకే రాసేను. మళ్ళీ ఎలాటి పోస్టు రాస్తానంటే మాత్రం చెప్పలేనండీ. నాకలం నామాట వినదు దాశరథిగారి హృదయవీణలాగే. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. ఆ ఇంగ్లీష్ పుస్తకం ఎందుగ్గానీ మీరు రాసిన లీల కధ బావుంది. అది నిజమో కాదో నాకు తెలీదు కానీ. దాదాపు ఇలాంటి జీవితమే మాదీను ఇండియాలో ఉన్నప్పుడు. ఎటొచ్చీ మా పెద్దక్కకి పెళ్ళవలేదు. పెళ్ళీడు దాటిపోయేక రొమ్ము కేన్సర్ వచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా నాలుగేళ్ళు దాచుకుని వెళ్ళిపోయింది. కేన్సర్ వచ్చినవాడు ఒకసారే చస్తారుట. వాళ్ళు పోయేక మిగిలన వాళ్ళు వాణ్ణి తల్చుకుంటూ జీవితాంతం చస్తారుట. ఇది మాత్రం పూర్తిగా నిజం.

  గుండె పిండేసారు మళ్ళీ ఈ కధతో. మళ్ళీ ఇలాంటి పోస్టు రాసి ఏడిపించారంటే మీ మీద కేసు వేస్తా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.