ఊసుపోక – అతిరహస్యము అను కొండమీద గోల

(ఎన్నెమ్మకతలు 105)

చాలాకాలం క్రితం ఏదో ఇంగ్లీషు పత్రికలో ఒక పిట్టకథ చదివేను. ఇద్దరు స్నేహితులు ఉంటారు. అందులో ఒకతనికి నీ, నా తేడా లేకుండా అందిరి ఉత్తరాలూ చదవడం అలవాటు. ఒకరోజు ఆ మొదటాయన ఉత్తరం రాసుకుంటుంటే, వెనక నిలబడి చదవడం మొదలు పెట్టేడు. అది మొదటివాడు గ్రహించేడు. ఆ మిత్రసత్తముడికి బుద్ధి చెప్పదలుచుకుని, తలొంచుకుని మాటాడకుండా రాసుకుంటూ పోయేడు. చివరలో, “ఇంకో రహస్యం చెప్పాలి నీకు కానీ ఓ బుద్ధిలేని వెధవ నావెనక నిల్చుని ఈ ఉత్తరం చదువుతున్నాడు. అంచేత ఇప్పుడు రాయలేను,” అని ముగించేడు. ఆతరవాత ఆ స్నేహితుడు బుద్ధి తెచ్చుకుని ఇలా ఇతరుల ఉత్తరాలు చదవడం మానీసేడు అని ఆ కథలో చదివినట్టు జ్ఞాపకం కానీ నాకైతే నమ్మాలని లేదు. మీరూ వినే ఉంటారు కదా పుట్టుకతో వచ్చిన బుద్ధులు … … హీహీ.

ఇంతకీ ఈ privacy అనబడు రహస్యం పాశ్చాత్యులకి పుట్టిన బుద్ధి అనుకుంటా. మనకి ప్రైవేసి అన్నపదమే లేదు. అయితే ఎక్కడ privacy ఉండునో అక్కడ piracy కూడా ఉండును. దాచుకుంటేనే కదా దోపిడీ చెయ్యవలసిన అవసరం. దాపుడు లేకపోతే దోపిడీ కూడా లేదు. అప్పుడంతా దొరతనమే.

అమెరికాలో సోషల్ సెక్యూరిటి నెంబరు అని ఒకటుంది. అది బ్రహ్మరహస్యం అనీ, జాగ్రత్తగా దాచుకోమనీ ఎవరికీ ఇవ్వద్దనీ … ఇలా చాలా చాలా చెప్తారు. నిజానికి ఈ యస్సెస్సెన్ దొంగిలించి, అవతలివారిజీవితాలు నాశనం చేసేసిన కథనాలు చాలానే ఉన్నాయి. కానీ తీరా చూస్తే, తెల్లారి లేస్తే, ఎన్ని చోట్ల ఈ నెంబరు అడుగుతారో లెక్క లేదు. ఫోనుకంపెనీ, అప్పులకార్డు, బాంకు, ప్రతి షాపువాడూ ఇచ్చే కార్డు, దానికోసం మనం నింపవలసిన ఫారాలూ – అందరికీ కావాలి మన యస్సెన్. బేంకుకి ఫోను చేసి నా ఖాతగురించి అడగాలంటే నీ యస్సెసెన్ చెప్పు అంటారు నేను నేనే అని నిరూపించుకోడానికి. మరి అవతలివాణ్ణి నేనెలా నమ్మడం అని అడగడానికి లేదు. ఒకటి, మనం వాళ్ళని పిలిచేం కానీ వాళ్ళు మనని పిలవలేదు. అలా పిలిచి అడిగేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అది మరో కత. ఇంతకీ ఇలా కనీసం నెలకోసారయినా ఎక్కడో అక్కడ మన యస్సెస్సెన్ చెప్పుకు పోతుంటే ఇంక దానికి రహస్యం ఏమిటి, ఇదే కొండమీద గోలంటే. నామటుకు నాకు ఒక్కటే సుళువు కనిపించింది. ఇంతమందిదగ్గర నానెంబరుంది కనక, నేను మరిచిపోతే వాళ్ళని అడగొచ్చేమో అని. హాహా. లేదులెండి. మళ్ళీ రహస్యం అడ్డొస్తుంది వాళ్ళకి మన నెంబరు మనకి చెప్పడానికి. ఖర్మ. ఇంకా సినిమాలవాళ్ళూ, రాజకీయాల్లో వాళ్లూ అయితే మరి చెప్పఖ్ఖర్లేదు కదా వాళ్ళ ప్రైవేసి నేతిబీరకాయలో నేతివాసనపాటి కూడా ఉండదు.

మన సంస్కృతిలో అదే పూర్వకాలంలో రహస్యాల్లేవు హాయిగా. “ఎవరికీ చెప్పకేం, నీక్కనక చెప్తున్నాను,” “నీకు మాత్రమే చెప్తున్నా,” అని రహస్యం చెప్తే, “అమ్మతోడు ఎవరికీ చెప్పను,” అంటూ అవతలిమనిషి మాట ఇచ్చేక, ఇలాటి మాట ఇచ్చిపుచ్చుకోడాలు అనేకం అయేక కూజా ఆ రహస్యం తెల్లారేసరికి ఊరంతా పొక్కిపోతుంది పొగమంచులా. None of your business అన్న వాక్యానికి తెలుగు సమానార్థకం లేదనుకుంటా. “నాఊసు నీకెందుకూ” అనొచ్చు కానీ నాకు మాత్రం ఆ రెండు వాక్యాలూ ఒక్కలా ధ్వనించవు J).

మనకి రహస్యాలు లేకపోవడానికి ఒక కారణం స్థలాభావం కావచ్చు. రెండుగదుల కొంపల్లో పదిమంది ఉన్నప్పుడు బట్టలు మార్చుకోడానికే నానా అవస్థా అయేచోట రహస్యాలకి ఆస్కారం ఎక్కడ? మాటామంతీ, కొట్టుకోడాలూ, అతిరహస్యం బట్టబయలు, లేదా కొండమీద గోలేమిటంటే … లాటి సామెతలు ఇలాగే వచ్చేయి. ఎవరూ వాటిని గట్టిగా పట్టించుకోరు. అన్ని హాస్యాల్లాగే అది మరో వేళాకోళం.

 

సాంకేతికం విజృంభించేక, ముఖాముఖీ మాటాడుకోడం తగ్గిపోయింది కదా. ఒకే గదిలో ఉన్నా ఐఫోనుల్లో texting చేసుకుంటారు. లాపుటాపులో చాటు చేసుకుంటారు. వాటికి పాస్వర్డులుంటాయి కనక మరెవరికీ తెలీదు. హాహాహా. ఈ పాస్వర్డు సంత నాకెంత నవ్వొస్తుందో చెప్పలేను.

ఈ సైటులూ, బ్లాగులూ వచ్చేక రిజిస్టరు చేసుకోమనడం, లాగినవమనడం … ఒక సరదా అయిపోయింది చాలామందికి. అది కూడా నాకయితే వేళాకోళంగానే అనిపిస్తుంది అవసరం ఉన్నా లేకపోయినా ఈ లాగినులు. నేను చూసే సైటులు తక్కువే. అయినా నాకిప్పటికి ఓ డజనున్నర పాస్వర్డులు ఉన్నాయి. మరి అదే పనిగా జాలవిహారం చేసేవారికి ఎన్ని ఉంటాయో. అవన్నీ వాళ్ళెలా గుర్తు పెట్టుకుంటారో … నాకు ఎప్పుడూ సందేహమే. అవన్నీ గుర్తు పెట్టుకోడానికి ఓ చిన్న పుస్తకం, మళ్ళీ ఆ పుస్తకానికి తాళాలూ, ఆ తాళం పారేసుకోకుండా దానికి మరో చిన్న పెట్టె, … ఇలా అనంతంగా సాగిపోవచ్చు ఈ రహస్యనాటకాలు కదా.

ఈమధ్య కొన్ని బ్లాగుల్లో వ్యాఖ్య రాయడానికి ఉన్న తంతు చూడండి. మొదట ఏ ఐడి వినియోగించుకుంటున్నామో వారికి మనవి చేసుకోవాలి. ఆ తరవాత, వ్యాఖ్య రాసి మునుజూపు చేసుకోవాలి. కొన్ని చోట్ల మరేదో కోడు కూడా టైపు చెయ్యాలి. కొన్ని కోడులు నాలుగేళ్ళపిల్లాడు కూడా తిరిగి రాయగలిగేలా ఉంటే, కొన్ని ఎన్నిమార్లు టైపు చేసినా సరిగ్గా లేదంటూ సణుగుతాయి. నేను చాలాసార్లు దణ్ణం పెట్టేశాను నాతరం కాదని.

ఇంతా చేస్తే అందులో బ్రహ్మరహస్యాలేమీ లేవు. మరి ఇవన్నీ ఎందుకంటే ఆ సైటుదారులు కొత్తగా నేర్చుకున్న విద్య అనుకోవాలి. కొత్తబిచ్చగాడు పొద్దెరగడని. లేదా, “మేం చెయ్యగలం కనక” అంటారేమో కూడా తెలీదు. నిజానికి ఈ పాస్వర్డులు తలుచుకుంటే నాకు మానాయనమ్మ చెప్పే సామెత గుర్తొస్తోంది. “కొబ్బరిచెట్టుకి మడిబట్ట కట్టేన,”ని. నేనింకా ప్రయత్నించలేదు కానీ ఈ పాస్వర్డులు నిజానకి మన పొడుపుకథలకి విడుపులాగే చాలా చాలా తేలికట, కొబ్బరిచెట్టుకి కట్టిన మడిబట్టకంటే ఓ చూపువాసి మాత్రమే మేలేమో.

ఆమధ్య ఒకావిడ వాళ్ళమ్మాయి మెయిళ్ళు చూస్తానంది ఏదో మాటలసందర్భంలో. నేను ఆశ్యర్యంగా చూసేను అవిడవేపు. “ఏం నువ్వు చూడవా మీ అమ్మాయిమెయిళ్లు?” అంది నాకంటే ఆశ్చర్యపోతూ.

“లేద”న్నాను.

“ఏముంది చూస్తే తప్పేమిటి? ఏం రహస్యాలుంటాయి మనలో మనకి,” అందావిడ మళ్లీ.

“చూడ్డానికి మాత్రం ఏముంది. నాకు తెలియాల్సిందేదేనా ఉంటే తనే చెప్తుంది కదా,” అన్నాన్నేను.

అమెరికాలో ఎంతో కాలంగా ఉంటున్న ఆవిడ, ఇక్కడే పుట్టి పెరిగిన ఆ అమ్మాయి అంత రహస్యాలు లేకుండా ఉండడం నాకు ఆశ్యర్యంగానే ఉంది. అంటే రహస్యాలు ఉన్నాయా లేవా అని కాదు. ఎవరిబతుకులు వాళ్ళవి అన్న తేడా వచ్చేక, మరి ఎవరిగౌరవాలు వారు నిలుపుకోవాలి కదా. పైన చెప్పినకతకంటే ఘోరం పిల్లలేం చేస్తున్నారో అన్న భయం అన్న కారణంతో వాళ్ల మెయిళ్ళు చూడ్డం. అవునండీ ఇది కూడా చేస్తున్నారు. నాకు ఇది మరీ వింతగా ఉంటుంది. ఎందుకంటే, ఈ దొంగచదువుల్లో మరోభయం ఏమిటంటే ఆ పిల్లలకి తమ దొంగచేతలు తెలిసిపోతాయేమోనన్న భయం, వాళ్ళు హన్నా నాఉత్తరాలు చూసేవా అని నిలదీస్తే ఏం చెప్పాలన్న బెరుకు, వాళ్ళరహస్యాలు తెలిసినతరవాత ఏం చెయ్యలేం కదా అన్న ఏడుపు, … … ఎందుకొచ్చిన సంత, ఎందుకింత అవస్థ? అనన్నమాట నాకు హాచ్చెర్యమ్.  . హుమ్. ఏమిటో, నాకీ మనుషులు అర్థం కారు. ప్చ్.

 

(అక్టోబరు 17, 2012.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

12 thoughts on “ఊసుపోక – అతిరహస్యము అను కొండమీద గోల”

 1. @ Kaavyanjali, మీరు హైస్కూలు నయసుపిల్లలగురించి చెప్తున్నారనుకుంటా. కొంతవరకూ నిజమే కానీ ఈ పిల్లలు కూడా తెలివి మీరిపోయేరండీ ఈరోజుల్లో. వాళ్ళెప్పుడూ మనకంటే ఓ అడుగు ముందే ఉంటారనిపిస్తోంది నాకయితే. తాడిని తలదన్నేవాడుంటాడని సామెత కదా :)). కానీ పెద్దవాళ్లవిషయంలో మాత్రం ఈ ఉత్తరాలు చదవడం, వాళ్ళసమస్యలు పరిష్కరించేస్తాం అనుకోడం అమాయకత్వమే అంటాను. ఎదిగిన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళబతుకులు వాళ్లు బతుకుతున్నప్పుడు, వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళనే పరిష్కరించుకోనివ్వాలి.మనం అలా వదిలేసినప్పుడే వాళ్ళకీ, మనకీ కూడా మర్యాద ఉంటుంది. కనీసం ఇది నాఅభిప్రాయం. మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు. మీబ్లాగు ఇప్పుడే చూసేను. మీ హలోవీన్ కథ బాగుంది.

  మెచ్చుకోండి

 2. ఈ రోజుల్లో పిల్లల గురించి తెలుసుకోవాలంటే పిల్లల మెయిల్స్ చదవక తప్పట్లేదేమోనండి తల్లిదండ్రులకి….వ్యక్తిగత స్వతంత్రం కోణం లో చూస్తే తప్పే అయినా…తల్లిదండ్రుల భయం లో కూడా తప్పులేదేమో అనిపిస్తోంది

  మెచ్చుకోండి

 3. బిందు, కాలం మారుతోంది కదండీ. తదనుగుణంగానే మన అలవాట్లూ, అభిప్రాయాలూ కూడా మర్చుకోవాలి. మనం మారకపోయినా, పిల్లలు మారిపోతారు. మనం ఏం చెయ్యలేం కదా. మీ స్పందనకి సంతోషం.

  మెచ్చుకోండి

 4. నాకు తెలిసి చాలామంది వాళ్ళ పిల్లల ఈమైళ్ళు చదువుతారు. చిన్నప్పుడు తప్పదేమో కానీ, కొంచం పెద్దయ్యాకా వారి స్వాతంత్ర్యం వారికి ఇవ్వాలేమో అనిపిస్తుంది.

  మీరు చెప్పిన స్థలాభావం కూడా మంచిదేనేమో! ఇదివరకు చూడండి, మొగుడు పెళ్ళాం కొంచం మాటా మాటా అనుకోంగానే పెద్దలు కల్పించుకునేవాళ్ళు. ఇప్పుడు వ్యవహారం చెయ్యి దాటిపోయి విడాకులదాకా వచ్చాక కానీ ఎవరికీ తెలియటం లేదు. ఎవరి privacy వాళ్ళకి ఉండాలికానీ కొన్ని కొన్ని రహస్యాలు ఆప్తులతో పంచుకుంటే మరిన్ని కాపురాలు నిలుస్తాయేమో!

  మెచ్చుకోండి

 5. @ C V R Mohan, ) ఈరోజుల్లో అంతో ఇంతో చదువుకున్నవారందరూ కంప్యూటర్లమీదే కాలం గడుపుతున్నారు కదండీ. పోతే, కథ అడిగేరు కనక చెప్తాను. నిజానికి ఇది కూడా మార్పుగురించే. మార్పులోనే రాయవలసింది. వెనకటితరం ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఇంటివారూ, ఇరుగూ పొరుగూ అందరివిషయాల్లోనూ జోక్యం కలిగించుకోడం ఉండేది. ఇప్పుడు సర్వత్రా, ఎవరిబతుకులు వారివి, స్వకీయమైన వ్యక్తిత్వాలపేరుతో. అంచేత కంప్యూటరులోనో మరోవిధంగానో అదే పనిగా వారేం చేస్తున్నారూ, వీరేం మాటాడుకుంటున్నారూ అంటూ తవ్వి తీయడాలు హేయంగానే పరిగణింపబడుతున్నాయి. ఇందులో మరో కోణం ఏమిటంటే, అంత శ్రమపడి తీసి చూస్తే, 99 శాతం ఏమీ ఉండదు, మీరన్నట్టు చిదంబరరహస్యం అంటే శూన్యం. సున్నకి సున్న, హళ్ళికి హళ్ళి, హాహా. ఆమాత్రం దానికి వీరు (ఇలా తవ్వకాలకి పూనుకునేవారు) తమ పరువెందుకు పోగొట్టుకోడం అని. ఇదీ నా టపాలో అంతర్లీనంగా నేను ఇవ్వదలుచుకున్న సందేశం.

  మెచ్చుకోండి

 6. కంపూటర్ ముందు తీరి
  కుర్చుని, చీటికి మాటికి దెబ్బలాడుకుంటూ
  గంటల సమయం వృధా చేసే వారికి,
  చిదంబరమా? గండికోటా?
  ఏమా రహస్యం ?
  ఏమా కథ?

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s