ఊసుపోక – పాదరక్షలూ, ఈతిబాధలూ

(ఎన్నెమ్మకతలు 106)

నిన్న ఒక వార్త – కొలరెడోలో ఓ నాలుగేళ్ళమ్మాయి కారులో వాళ్లమ్మతో బజారుకి వెళ్తుంటే ఏడవడం మొదలటెట్టింది, I am tired of Obama and Romney అంటూ, రేడియోలో వస్తున్న ఆ ఇద్దరి ప్రకటనలు భరించలేక. బహుశా, ఇంట్లో టీవీలో కూడా అవే చూస్తుండడంవల్ల ఆపిల్లకి ఏడుపొచ్చి ఉండొచ్చు. నిజానికి చాలామంది పెద్దలకి కూడా అలాగే ఉంది. ఇతర వ్యాపారస్థులు మళ్ళీ మా సమయం మాకెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూన్నేరేమో కూడా. ఇంతకీ ఈ ఎన్నికలసంరంభానికీ నా పాదరక్షలకీ ఏమిటి సంబంధం అంటే – చెప్తాను.

నాజోళ్ళఘోషగురించి రాసి రెండేళ్ళయినట్టుంది, అవి మళ్ళీ ఇప్పుడు మార్చవలసిన అవుసరం ఏర్పడింది. అప్పట్లాగ మంచు కురవకపోయినా, అప్పుడు కొన్న జోళ్ళు అరిగిపోయేయి కనక ఇప్పుడు మరో జతకోసం వేట. వేట అని ఎందుకంటున్నానంటే, మూడు రోజులపాటు ముప్ఫై మైళ్ళ పరిధిలో ఉన్న జోళ్ళ షాపులన్నీ, లేదా నాకు నచ్చినవి దొరుకుతాయనుకున్న షాపులన్నీ తిరిగేను. అసలు మొదట నేను పూర్వం కొన్న షాపుకే వెళ్ళేను అక్కడ కొనుక్కొచ్చేస్తే ఇట్టే పనయిపోతుందని. ఊహు, లేదు. ఈనాటి వ్యాపారసరళిలో పదికాలాలపాటు మన్నేవి చెయ్యకపోవడమే కాక పది కాలాలపాటు ఏ వస్తువూ బజారులో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా డిజైనరు జోళ్ళే. రెండో మూడో జతలు స్నీకర్సు కనిపించినా అవి నాకు నప్పలేదు. అయితే రెండు సైజులు పెద్ద, కాకపోతే రెండు సైజులు చిన్న. పైగా నాకు ఓ పాదం కాస్త వంకర అంచేత నాకు వైడ్ కావాలి. అవి కనిపించడం మరీ కష్టమయింది. ఏ షాపులో అడిగినా, అవి ఇప్పుడు అట్టే రావడం లేదుట, ఓ సైజు పెద్దది తీసుకోమన్నారు. ఇంకోవిషయం కూడా కనిపెట్టేను. ఇదివరకు షాపులో పనివాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ద్వారం దగ్గరే పలకరించి, ఎలాటి జోళ్ళు కావాలో, ఎంత ధరలో కావాలో … ఇలా ఆనూ పానూ కనుక్కుని, చక్కగా పీటేసి, కూచోపెట్టి, సుమారుగా మనకి పనికొస్తాయనుకునే జతలు నాలుగు తెచ్చి కాలికి తొడిగి చూపేవారు కదా. … ఆరోజులు పోయేయి. ఇప్పుడు దుకాణంలో అడుగెట్టగానే ఏమూలనుంచో హాయని ఓ పలుకు వినిపిస్తుంది. తరవాత మనకేం కావాలో మననే చూసుకోమనీ, అవసరమైతే పిలవమనీ చెప్తుంది ఆ గొంతు. అంటే నాకా బోగం లేకుండా పోయిందే అని విచారిస్తున్నానుకునేరు. అదేం లేదండి. ఇది తీసుకో, ఇది నీకు బాగుంది అంటూ ఊదరపెట్టేసే అమ్మకందారు కన్నా నాకు ఇదే ఎక్కువ ఇష్టం. ఇంతకీ, నాకు కావల్సిన స్నీకర్లు ఏ షాపులోనూ లేవు. ఎంత పెద్ద షాపయితే అంత ఎక్కువగా ఉన్నవి డిజనైరు షూలే. నైకీ లాటి స్నీకర్లే అమ్మే దుకాణంలో కూడా నాకేం కనిపించలేదు. అక్కడున్నవాటి షోకులూ, రంగులూ చూసి ఝుడుసుకున్నాను. చాలా నిస్పృహ వచ్చేసింది. రెండున్నర రోజులు చుట్టుపట్ల ముఫ్ఫైమైళ్ళపరిధిలో ఆరు దుకాణాలు తిరిగేను.

మంచు లేదు కనక ఆకుచెప్పులతో తిరిగితే పోలే అని కూడా అనిపించింది. కానీ చాలా దూరం – అదే ఒళ్ళు కొవ్వెక్కిపోకుండా దారిలో ఉంచడానికి – ఆకుచెప్పులతో నడవడం కష్టం కదా. ఏమిటో, ఇక్కడికొచ్చేక ఇన్ని రకాల జోళ్ళు అంటూ కొంచెంసేపు కారులోనే కూర్చుని విచారించేను కూడా. తాతగారికాలంలో –మీలో కొందరికైనా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక్క జత వీదిచివర గోనెసంచీ పరుచుకు కూర్చున్న గొడారిచేత కుట్టిస్తే .. ఎంత కాలం మన్నేదో! మీలో కొందరైనా కథల్లో చదివే ఉంటారు చెప్పులజత కతలు. ఉంగరం తెగిపోతే ఉంగరం, మడమ అరిగిపోతే మడమ – పాపం ఆ గొడారి మళ్ళీ అతికించి ఇచ్చేవాడు. అలా ముక్కలు ముక్కలు మార్చుకుంటూ వచ్చి, ఆఖరికి మార్చడానికి ఏమీ మిగలకుండా పోయినప్పుడే మరో జత కుట్టించుకోడం.

అమెరికాలో జోళ్ళకల్చరని ఒకటుందసలు. ఆడవాళ్ళజోళ్ళనీ, మగవాళ్ళ టైలనీ మెచ్చుకోడం ఓ అనవాయితీట. మొదట్లో, మొదట్లో ఏమిటిలెండి నాకు ఇప్పటికీ సరిగ్గా అర్థం కాదు ఇదేం మర్యాదో. మాటాడ్డానికేమీ లేకపోతేనూ, మాటాడుతున్న విషయం ఇష్టం లేకపోతేనూ జోళ్ళనీ, టైలనీ మెచ్చుకోడం ఓ దారి. పని గట్టుకుని మీ షూ నైసూ, టై నైసూ అంటూ కేవలం అవతలిమనిషిని మురిపించడానికే మెచ్చుకోడం మాత్రం నాకు తమాషాగానే ఉంది.

ఆపిల్ల బాధ ఆ పిల్లది. నాబాధ నాది. నాక్కూడా నిజానికి కాండిడేటుల వరస అర్థం కావడం లేదు. నేను ఏపార్టీకి చెందనని ఇదివరకోసారి మనవి చేసుకున్నాననుకుంటా. కానీ liesలో white lies వేరయినట్టుగానే, బుకాయింపులలో రామ్నీ బుకాయింపు వేరుగా కనిపిస్తోంది. నిజానికి రామ్నీ బోల్డ్ మోముతో బుకాయిస్తే, రయన్ బేబీమోముతో బుకాయిస్తున్నాడు. కిందటివారం రయన్ ఏదో soup kitchen  గిన్నెలు కడుగుతున్నట్టు నటిస్తూ ఫొటో తీయించుకుని తన సేవాతత్పరతని ప్రకటించుకుంటే, ఈవారం రామ్నీ శాండీ బాధితులకోసం ఓ అయిదువేలు ఖర్చు పెట్టి భోజనసామగ్రి కొని, తన సేవాతత్పరత సీను సృష్టించేడు. మరి వీళ్ళు ఇంత బాహాటంగా తమ నటనలు ప్రదర్శిస్తున్నా, దేశంలో దాదాపు సగంమంది ఓటర్లు ఆయనకి మద్దతు ఇస్తున్నారు. ఎన్నికలు ముగియకముందే ఇంత బాహాటంగా, నిస్సంకోచంగా నటనలు  అయితే  రేపు వీళ్ళు గద్దె ఎక్కినతరవాత ఎలా ప్రవర్తిస్తారు? తమ వాగ్దానాలు ఎలా నిలబెట్టుకుంటారు? అసలు ఏ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు? ఈ ప్రశ్న ఎందుకంటే చాలా రకాల వాగ్దానాలు చేసేరు కదా. విస్కాన్సిన్ గవర్నరు రెండోసారి ఎన్నిక అయినతరవాత, నా పింఛనులో పది శాతం కోత పడింది. ఆయన ఎన్నికకీ, నా పింఛనులో కోతకీ సంబంధం ఉందో లేదో నాకు తెలీదు. కానీ ముందు ముందు పరిస్థితులు ఎలా తగలడతాయో అన్న బెంగ మాత్రం పెరిగిపోతోంది ఇతోధికంగా.

ఇప్పుడు జోళ్ళకథకి వస్తాను. పూర్వకాలంలో తెలుగుదేశంలో చెప్పుకునే పిట్టకథ – ఒకాయన బజారుకెళ్ళి ఓ జత తీసుకున్నాడు. ఆ షాపు యజమాని, “అవి మీకు చిన్నవండీ. కరుస్తాయి. దానికంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి,” అని సలహా ఇచ్చేడు.

ఆయన, “లేదు నాయనా, ఇవే ఇయ్యి. ఇంట్లో అవస్థలు మరిచిపోగలను ఈ బాధతో,” అని సమాధానం ఇచ్చేట్ట.

నేను నాకు కావలసిన సైజులో వైడ్ దొరక్క, నేను మామూలుగా కొనే సైజుకన్నా ఒకటిన్నర సైజు పెద్జది తీసుకున్నాను. అది కూడా పాదానికి చుట్టుకుపోతోంది సంపెంగకొమ్మకి చుట్టుకున్నపాములా. అంతకంటే పెద్దది కొంటే, నడక తడబడి బోర్లా పడతాను. మిగతా కథ మీకే వొదిలిపెడతాను.

మీరు ఇక్కడినుంచి తరిలిపోయేముందు, బాబ్బాబు, కనీసం నాజోళ్ళు మెచ్చుకుందురూ!!!!!

(నవంబరు 2, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – పాదరక్షలూ, ఈతిబాధలూ”

 1. @ Bindu, హాహా, @ మా సగం closet నా జోళ్ళకే సరిపోతుంది. మాఅమ్మాయికి మీరు పోటీ. వెనకోసారి తను 200 పెట్టి జోళ్ళు కొంటుంటే, అంత డబ్బేమిటి అన్నాను (నాడబ్బు కాకపోయినా అమ్మబుద్ధితో అడ్డుకోబోయేను :))). మరో మూడేళ్ళవరకూ కొననులే అంది. ఆర్నెల్లు తిరక్కుండా మళ్ళీ జోళ్ళు, జోళ్ళు… అదేం అంటే, నేను జోళ్ళు కొనను అని చెప్తే నువ్వు నమ్మకూడదు,అంది. నాజోళ్ళు మెచ్చుకున్నందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 2. మీ జొళ్ళకేమండీ బహు అద్భుతంగా ఉన్నాయి! జోళ్ళరిగిపోయేలా తిరిగి మరీ కొన్నారాయే.

  నా అదృష్టంకొద్దీ నావి average పాదాలు. తేలిగ్గానే దొరికేస్తాయి. మా సగం closet నా జోళ్ళకే సరిపోతుంది 🙂

  మెచ్చుకోండి

 3. @ లక్ష్మీ రాఘవగారూ, అవునండీ ఇప్పుడు పాదరక్షలు, పాదాలకోసం కాదు, అవి సాంఘికచిహ్నం. ఏం చేస్తాం, ఖర్మ. అక్కడివిషయాలు నాకు తెలీవుకదా, మీరే రాయాలి. మీలాగే సున్నాగారివ్యాఖ్యమూలంగా నాకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. పిల్లలకి జోళ్ళు లేవా, హా :)). స్నేకరు, ఔచ్, పొరపాటు, అవి స్నే కాదు స్నీ. sneakers. మీరక్కడ టెన్నిస్ షూస్ అంటారా?

  మెచ్చుకోండి

 4. మాలతి గారు
  మీ పాద రక్షల కథనం చదివాక మీ జోళ్ళు బాగున్నాయండి అని రాయ బోయాను ..కాని మీరు ఎన్నో గుర్తు చేసారు . యాభయ్యవ దశకం లో ఒక చిన్న పల్లె లో ఎలిమెంటరి పాటశాలకు వెళ్ళిన మాకెవ్వరికీ పాదరక్షలు వుండేవి కావు .వేసుకోవాలని ఎవరు చెప్పలేదు. మరికొన్ని రోజులు చెప్పులు పెద్దవాల్లకేకాని చిన్న వాళ్ళ కు దొరికేవి కావు .హవాయి చెప్పులే మొదట చిన్నపిల్లలకు వచ్చాయని గుర్తు ..ఇప్పుడు మీరు చెప్పిన రక రకాల చెప్పుల కల్చరు ఇండియా లోను వచ్చేసింది తమాషా ఏమిటంటే ముందు ఒక చెప్పుల జత పాడయి పోతేనే ఇంకోటి కొనుక్కునే వాళ్ళం . తమాషాగా మాతరం కూడా మారినట్టే ..ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు చాల చెప్పులు వున్నాయి. కాని ఎప్పుడు మెత్తగా వుండే చెప్పులపైనే నా కన్ను !!.
  ఇంతకీ నాకు స్నేకర్స్ అంటే ఏమిటో అర్తం కాలేదు ..
  మీ రు ఇక్కడి ప్రచార విశేషాలు గమనించండి ..ఇస్త్రీ చేసేవాళ్ళు, చీపుర్లు పట్టుకునేవాలు. బజ్జీలు వేసేవాళ్ళు అందరు రాజకీయ నాయకులే …మీరు రాయడానికి మంచి సబ్జెక్టు…ఏమంటారు

  మెచ్చుకోండి

 5. చిన్నప్పుడు అంటే పదో క్లాసులోకి వెళ్ళేదాకా హవాయ్ చెప్పులే వేసుకునేవాళ్ళం. అవీ కూడా ఎందుకో వెంటనే తెగిపోయేవి. కాళ్లలో ముళ్ళు గుర్చుకోవడం, మా నాన్నగారు అవితీసి నల్ల జీడిపిక్కతో వైద్యం చేయడం అదో ప్రహసనం. అసలు మొదట షూ కొన్నది ఇంజినీరింగ్ పేసయ్యాకా, ఉద్యోగంకోసం ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి. ఉత్తరోత్తరా నేను షూ అంటే ఒక లక్జరీ అనే భావనలో గడిపేను. అమెరికా వచ్చాక ఓ రోజు కారు కడగడానికి స్నేహితుడు పిలిస్తే వెళ్ళేను దర్జాగా హవాయి చెప్పులేసుకుని అక్టోబర్ నెలలో. అప్పటికి వచ్చి నాలుగు నెలలే అయింది. ఎలాగా ఉత్తరాంధ్రాలో బతికేను కదా ఆ మాత్రం చలి తెలీదా అని ఒక అహంకారం. కారు కడిగి ఇంటికొచ్చేసరికి మోకాళ్ళ కిందనుంచీ ఏమీ స్పర్శ లేదు. రెండు గంటలు వేణ్ణీళ్లలో కాళ్ళు నానబెట్టాక అప్పుడు అర్ధం అయింది – షూ లగ్జరీ కాదు ఇక్కడ. నిత్యావుసరం. 🙂

  ఓ సారి ఒక మంచి షూ (ఆడిదాస్) కొన్నాను. అది కరిచి కరిచి వదిలిపెట్టింది. అప్పుడు తాళ్ళన్నీ పీకి మళ్ళీ పెట్టేను స్నీకర్లకి. అప్పటికి అది కొని నాలుగు నెలలు అయింది. వార్నీ ముందే ఈ తాళ్లు పీకి ఉంటే లూజ్ అయ్యేది కదా, ఈ కరవడం అదీ లేకపోవును అనిపించి ఏడుపొచ్చింది. ఎందుకంటే అది కరిచాక వాల్ గ్రీన్స్ లో ఇరవై డాలర్లు తగలేశాను మందులకి.

  నవ్వుతున్నారా? నవ్వరు మరీ? మీకు ఆ అధికారం ఉంది.

  ఆ తర్వాత్తర్వాత కనపడిందల్లా కొనడం, పనికిరానివి కొనడం అలవాటు అయ్యేక కొనడం వాడినా వాడకపోయినా పారేయడం అలవాటు అయింది. ఇక్కడంతే కదా? అన్నట్టు మాలతిగారు మీరు జే.సీ.పెన్నీ ఔట్లెట్ లో ట్రై చేసారా? ఇది జే సీ పెన్నీయే కానీ మాల్ లో ఉండేలాంటిది కాదు. అక్కడ నేను కొన్నాను ఓ సారి. కొంచెం పాతకాలం వాసనేసినా నాక్కావాల్సింది చీప్ గా దొరికింది.

  మీ షూ ఫర్వాలేదు, బాగానే ఉంది. నడిచేటప్పుడు బురద మీ షూ మీద పడి పాతదైపోవాలని నా కోరిక. 🙂 (యూనివర్సిటీ లో కుర్రాళ్ళు కొత్త షూ కొంటే ఇలాగే ఏడిపిస్తారు మొదట్లో) అప్పుడు మీరు ఎలాగా ఇంకోటి కొనుక్కుంటారు కదా? సర్దాగా అంటున్నాను ఏమనుకోకండి. శుఖ వారాంతం!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s