ఊసుపోక – ప్రకటనలమీద యుద్ధం ప్రకటిస్తున్నా!

(ఎన్నెమ్మకతలు 107)

హమ్మయ్య ఎన్నికలమేళా ముగిసింది అనుకోడానికి లేదు. టీవీలూ, రేడియోలూ, కంప్యూటర్లూ ప్రకటనలకి కేటాయించిన సమయం అలాగే ఉంది. అంటే ఇది వరకు 20, 30 క్షణాలలో ముగిసే ప్రకటనలు ఇప్పుడు ఒకటిన్నర నిముషాలవరకూ సాగేయి. ఇదివరకు ఒకో విడత 3, 4 నిముషాలు అయితే ఇప్పుడు 5, 6 నిముషాలవరకూ వదల్డం లేదు. “ఫలానావాడు దుష్టుడూ, దుర్మార్గుడూ కనక మీఓటు నాకే” పోయి, ఈ వస్తువు మీకు అత్యంత అవుసరం, అది లేనిబతుకు వృథా, వృథా,” కాకపోతే “ఈమందు మీ ఆరోగ్యానికి అత్యంత అవుసరం,” అంటూ హోరు పెడుతున్నాయి.

అసలు ప్రకటన అన్న పదానికి నిగూఢార్థం ఏమైనా ఉందేమోనని అనుమానం వచ్చింది నాకు. నిఘంటువులు చూసేను. గూగుల్ చేసేను. అబ్బో, చాలానే ఉంది చదవాల్సింది. ఆ లింకులన్నీ ఇక్కడ నేనివ్వబోను మీరంతా నాకంటే సెర్చినిష్ణాతులే కదా. పైగా నేను ప్రకటిస్తున్న యుద్ధం ఈ ప్రకటనలు నా సమయాన్ని చాలా చాలా వ్యర్థం చేస్తున్నాయి అనే. మరి అలాటప్పుడు నేను కూడా మితం పాటించాలి కదా.

ఇంతకీ, నాకు అర్థమయినంతవరకూ, ఏ ఒక్కరితోనో అంటే ఇష్టసఖితోనో, వేడుకచెలికానితోనో, అమ్మతోనో, బాబుతోనో చెప్తే అది రహస్యం. నలుగురు మిత్రులతో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు చెప్తే, అది కబుర్లకిందకి వస్తుంది. సకలజనులకూ దండోరా వేస్తేనూ కరపత్రాలరూపంలో, కంఠఘోషరూపంలో తెలియజేస్తే అది ప్రకటన. అంటే ఫలానావాడికోసం అని కాక, గుడ్డివాడిచేతిరాయిలా విసురడం అన్నమాట. ఈరోజుల్లో టీవీలో, రేడియోలో, దిన, వార, పక్ష, మాసపత్రికలలో, సంవత్సరానికోమారు ప్రచురించే సంవత్సరీకాల సంచికలలో వినిపించేవీ, కనిపించేవీ ఈ కోవలోకి వస్తాయి. ఇంకా ఐపాడు, ఐఫోనూ, ఆండ్రోయడూలాటి వాటిలో కూడా ఈ ప్రకటనలు వస్తున్నాయనుకుంటా కానీ నాకు ఈవిషయంలో అట్టే అవగాహన లేదు.

ఇంతకీ, నేనిక్కడ ప్రత్యేకించి చర్చించబోయేది ఈ మూడోతరగతి ప్రకటనలు. ఇది పూర్వం దండోరా రూపంలో సాగేది అన్నాను కదా. అంటే ఏవిషయమైనా సకల జనులకూ తెలియపరచవలనంటే గ్రామబారికి లేక తలారి డప్పు వాయించుకుంటూ ఇదీ విషయం అని చెప్పుకుంటూ పోయేవాడు. ఇప్పటికీ చిన్న పల్లెల్లో పెళ్ళిళ్ళూ, పండుగలకీ వేరే పిలుపులు, పెళ్ళిపత్రికలూ లేవు, ఫలానావారింట్లో పెళ్ళి, అందరూ భోజనాలకి రండహో అని దండోరా వేయడమే అని ఈమధ్య ఒకాయన నాతో అన్నాడు. అతనివయసు ముప్ఫైలోపే కనక అతనిచిన్నప్పుడు అంటే పాతికేళ్ళకిందట అనుకుంటున్నాను.

పోతే, వ్యాపారాలకి సంబంధించినంతవరకూ ఆచార్య జి.యన్. రెడ్డిగారి తెలుగు నిఘంటువులో ఇలా ఉంది –

సంస్కృత విశేష్యము. [వాణిజ్యశాస్త్రము] సరకులకు సంబంధించిన సమాచారము అనుభోక్తులకు ఇష్టమగురీతిని వారికి అందచేసి వారి ప్రోత్సాహమును చూరగొనుట.

పరీక్షగా చూడండి. “అనుభోక్తులకు”, అంటే మనకి, అందజేసి, “వారి” అంటే “మన” ప్రోత్సాహమును చూరగొనుట అంట. మరి ఈరోజుల్లో ఈ వాణిజ్యప్రకటనలు ఇలా ఉంటున్నాయా లేదా అని పరిశీలించుట ఈ టపా ధ్యేయము. నాకు అమెరికాసరళి మాత్రమే పరిచయం కానీ అమెరికాఆచారాలన్నీ మనదేశంలో కూడా ఫక్తుగా అమలు అయిపోతున్నాయి కనక అక్కడా ఇలాగే ఉందనుకుని రాస్తున్నా.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతసహస్ర మాధ్యమాలలో ప్రకటనలు వస్తున్నాయి కదా. అంటే ఒక వార పత్రికలో ఒకసారి చూడ్డం, ఆకాశవాణిలో పదిసార్లు వినడం కాదు. అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాలద్వారా మూకఉమ్మడిగా మనమీద ముప్ఫై వేపులనించీ దాడి అన్నమాట. వాళ్ళకయితే, “మేం ఫలానావారిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం” అనే నమ్మకం కానీ అది అవసరం లేని ప్రజలు వేలసంఖ్యలో ఉన్నారని వాళ్ళు అనుకోరో, అది వారిఖర్మ అనుకుంటారో నాకు తెలీదు. మామూలుగా బిజినెస్ పాఠం 101 ఒకటుంది. అదేమిటంటే, ఒక లక్ష కరపత్రాలు పంచి పెడితే, వాటిలో వెయ్యోవంతు మొదటివాక్యం అంటే శీర్షిక చూడొచ్చు. వారిలో వెయ్యోవంతు సగం కరపత్రం చదవొచ్చు. వారిలో వెయ్యోవంతు తరవాత చూద్దాంలే అని పక్కన పెట్టుకోవచ్చు. అంటే కొన్ని లక్షల కరపత్రాలు పంచిపెడితే పదిమంది కొనేవాళ్ళు దొరకొచ్చు. మిగతావారందరూ, ఎందుకొచ్చినసంత అని విసుక్కోవచ్చు. హుమ్.

ఇప్పుడు ఈ టీవీలాటి మాధ్యమాలొచ్చేక, వ్యాపారులు “ఆహో, ఒహో, కొన్ని కోట్లమంది మొహాలమీదకి ఒక్కసారిగా విసిరేయొచ్చు,” అనుకుంటూ మురిసిపోతున్నారు కానీ పైలెక్కలప్రకారం అంతకంత చిరాకు పడేవారు కూడా ఉన్నారని గమనించరో, పట్టించుకోరో నాకు తెలీదు. టెలిమార్కెటర్లక్లాసులో చెప్తారు అవతలివారు ఎంత విసుక్కున్నా పట్టించుకోకండి అని. అదన్నమాట వారి మౌలికసూత్రం. నామటుకు నాకు మాత్రం ఇది ఏదో రకం “దుర్మార్గం” అనే అనిపిస్తుంది.

పంచభక్ష్యపరమాన్నాలూ, నవకాయరుచులూ కాకపోవచ్చు కానీ నేను ఎంతో ఇష్టంగా వండుకున్న మెంతివంకాయ కూరా, కరివేపాకు పొడీ కంచంలో పెట్టుకుని చవులూరా తిందాం అని కూర్చున్నప్పుడు అజీర్తి, కడుపునొప్పులూ, వాటికి సంబంధించిన ఇతర విశేషాలు వినాలనిపించదు. చేతిలో ముద్ద నోటిదాకా రాదు. లేదా, మరెక్కడో తిండికి మలమల మాడిపోతున్న పసివాళ్ళమొహాలు చూస్తూంటే, నేనేదో ఎవరికో ద్రోహం చేస్తున్నానేమో అన్న భయం కూడా కలుగుతుంది. అలాటప్పుడే, నేను టీవీ చూసే సమయం తగ్గించవలసిందన్న స్పృహ కూడా కలుగుతుంది. చూసేరా, వీటివల్ల లాభం. నాకు చాలా ఇష్టమైన షో కూడా ఈ ప్రకటనలు వచ్చినప్పుడు టీవీ కట్టేయడం బహు తేలిక. శ్మశానవైరాగ్యంలాటిదన్నమాట.

మరో సౌకర్యం, కాఫీ పెట్టుకోడం, బట్టలుతుక్కోడం, ఇరుగూపొరుగుతో చిన్న బాతాఖానీ కూడా సాధ్యం. ఈ ప్రకటనదారులు దుర్మార్గం ఇలాగే కొనసాగితే, బహుశా వీధిచివర దుకాణంలో ఒకట్రెండు వస్తువులు కొనుక్కొచ్చేయడానకి కూడా సమయం దొరకొచ్చు!! ఇలా ప్రకటనలసమయం నేను వేరే కార్యక్రమాలకి వెచ్చించడం ఒక ఎత్తు. అంతకంటే ముఖ్యాతి ముఖ్యం ఈ ప్రకటనలతో నన్ను నలువేపులనుంచి మహోదగ్రభీకరంగా చుట్టుముట్టేవారి వస్తువులు కొనను!! అంటే నేను కూడా అదే స్థాయిలో నా నిరసన తెలియజేస్తున్నాను.

సరే, ఇక్కడికిది ఆపేస్తాను. లేకపోతే, ఇది కూడా 5, 6 నిముషాల ప్రకటనలలా అనిపించగలదు.

(నవంబరు 16, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక – ప్రకటనలమీద యుద్ధం ప్రకటిస్తున్నా!”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s