ఊసుపోక – హాలివుడ్ నటులూ, నా నటనలూ!!

(ఎన్నెమ్మకతలు 108)

డిసెంబరు 3, 2012 సోమవారం నేను సువర్ణాక్షరాలతో రాసుకుంటాను.

పదిరోజులక్రితం వర్ధమాన నటి సరయు రావు నన్ను సగౌరవంగా ఉచితమర్యాదలతో ఆహ్వానించింది హాలివుడ్ షూటింగ్ చూడడానికి. హాహా.

drnapur

నేనెంత ఉత్సాహంగా ప్రయాణమయేనో అంతకంతా, అంతకి రెండింతలు హుషారుగా జరిగిపోయిందా రోజు. ఆ ఆనందోత్సాహాలింకా అలాగే ఉన్నాయి నోరూరే వెన్నప్పాలరుచి నాలుకమీద నిలిచిపోయినట్టు.

నేను ఆరోజు ఎయిర్పోర్టునించి తిన్నగా స్టూడియోకే వెళ్ళేను సరయురావు నాకోసం పంపిన లిమోలో. నేనక్కడికి చేరేసరికి వాళ్ళటైము ఉదయం తొమ్మిదయింది కానీ సరయు అప్పటికీ అక్కడికి చేరి మూడుగంటలపైనే అయినట్టుంది.

ఆ భవనం పైకి చూడ్డానికి మామూలుగానే ఉంది కానీ లోపల అడుగు పెట్టేసరికి సరయు కొన్ని చుట్లు షూట్ చేసి, నాకోసం ఎదురు చూస్తోంది. ″మామ్, ఎక్కడున్నావు, ఇందాకట్నుంచి పిలుస్తున్నాను, ఫోను తియ్యవేం?″ అంటూ పరుగెత్తుకొచ్చి కౌగలించుకుంది.

– ఎందుకంటే గేటుదగ్గర చిన్న నాటకం అయింది. తనేమో గేటుదగ్గర గూర్ఖాలాటి అమ్మాయికి నేను వస్తున్నాననీ, నన్ను లోపలికి పంపాలనీ చెప్పడమయితే చెప్పింది కానీ ఆ అమ్మాయి నన్ను ఐడి అడిగితే నేను నా డ్రైవరు లైసెన్సు చూడపడంతో తంటా వచ్చింది.

– ఎందుకంటే, ఆ ప్రాంతాల్లో అక్కడ అందరూ నన్ను ″మామారావు″గానే ఎరుగుదురు. సరయు రావు, మామా రావు … గెటిట్?!!!

– అంచేత గేటుకాపలామనిషి ఏ ప్రొడక్షను, ఏ నటి, ఏ నిర్మాతా అంటూ ఆరాలు మొదలెట్టింది. ఆఖరికి ఎలాగైతేనేం నేను రంగప్రవేశం చేసేను.

నన్ను చూడగానే ప్రతివారూ, ″మామారావు″, ″మామారావు″ అంటూ నన్ను పలకరించడమే కాక, ఆపక్కవారికీ ఈ పక్కవారికీ ″సరయూస్ మామ్″ అంటూ పరిచయాలు చేసేస్తుంటే చెప్పొద్దూ నాకు నిజంగా కొంచెం గాభరా, బోల్డు ఆనందమూ కలిగి, మనవాళ్ళు చెప్పుకునే టూత్ పేస్టు ప్రకటన నవ్వుతో నైసు టు మీటు యూ, నైస్ ,,, నైస్ .. ప్లేజర్ .. అంటూ వాళ్ళేం అంటే నేనూ అదే అంటూ … అలా ఓ పావుగంట గడిపేను. ఒకొక్కరూ ఏం చేస్తారూ, వాళ్ళ పేర్లేమీ, … ఇవన్నీ నాకు చెప్పి, వాళ్ళతో ″మామ్ ఈ పేర్లన్నీ గుర్తు పెట్టుకోలేదులే″ అని వాళ్ళకి హామీ ఇచ్చేస్తుంటే, నాకు నిజంగానే కలయో, వైష్ణవమాయయో అనిపించింది.

– ఎందుకంటే, వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను కలిసినందుకు పరమానందపడిపోతున్నట్టు కనిపించేరు. ఆ తరవాత సరయు నేనెక్కడ కూర్చోవాలో చూపించింది. నాచోటు మూడు మానిటర్లకి ఎదురుగానూ, సరయుకి కనిపించకుండానూ. ఆ మూడు మానిటర్లలోనూ మూడు కెమెరాలు పట్టుకున్న బొమ్మలూ కనిపిస్తాయన్నమాట. నన్ను వాటికి ఎదురుగా కూర్చోపెట్టేరు. ఆపక్కనే మరొకాయన కాయితాలు పట్టుకుని, తలొంచుకుని కూర్చున్నాడు. అతనిపేరు మైక్ అనుకుంటా.

వాళ్ళు రోల్ అన్నతరవాత నేను కిక్కురుమనకూడదని సరయు నన్ను చాలాసార్లు హెచ్చరించింది. అంచేత నేనయితే కిక్కురుమనకుండా కూర్చున్నాను రోల్ అననప్పుడు కూడా. కానీ వాళ్ళలో చాలామంది నన్ను అలా కూర్చోనియ్యలేదు. క్రూ లో చాలామంది వచ్చి సరయు చాలా టాలెంటెడ్ అనీ, జెస్టీ అనీ తెగ పొగిడేస్తుంటే నన్నే పొగిడేస్తున్నట్టు సిగ్గు పడిపోయేను.

రోల్ అని అరిచేరెవరో. ఆవెంటనే మరొకరు, ఆతరవాత మరొకరు అలా మూడు రోల్, రోల్, రోల్ వినిపించేయి. ముగ్గురెందుకు చెప్పాలో నాకు తెలీలేదు కానీ కిక్కురమనకూడదు కనక నేను అడగలేదు. అంతా నిశ్శబ్దం అయిపోయింది. అది ప్రతి మండే మార్నింగ్ జరిగే మీటింగు సీను.  డాక్టర్లు తాము చేసిన సర్జరీవో, ప్రొసీజరో వివరిస్తారు. వివరణేమిటిలెండి, ఎందుకలా చేసేవు, ఎవరిని సంప్రదించేవు అంటూ ఛీఫుగారు ఆరాలు తీస్తారు. అంచేత ఆనవాయితీప్రకారం ఆయనేదో అడిగేరు ఓ డాక్టరుని. ఆయనేదో చెప్పేడు. అది ఎందుకలా చేసేవు అని మరో ప్రశ్న … నువ్వయితే ఏం చేస్తావు మరో డాక్టరుని … సరయు వంతొచ్చింది. సరయు ఎంతో ఆవేశంతో ఛీఫుని ఎదురు ప్రశ్నిస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. తనని అలా ఏక్షనులో చూడడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు తను స్టేజి నాటకాలు వేసినప్పుడు చూసేను. ఎటొచ్చీ ఇక్కడ ఒకే సీను పదిసార్లు చేస్తున్నారు. నిజానికి 60 సార్లవరకూ తీస్తారుట.

ఇంతలో కట్ అని వినిపించింది. ఎందుకో నాకు తెలీలేదు కానీ అడుగుటకది సమయము కాదు కనక నేను నాకిచ్చిన పోర్షను కిక్కురుమనకుండా కూర్చోడం చేస్తున్నాను.

సరయు వచ్చి, ″ఇలా రా,″ అంటూ నాచెయ్యి పుచ్చుకు కెమెరాలదగ్గరికి తీసుకెళ్ళింది. ఆ  కెమెరాపక్కన నించున్నాయన, నన్ను కెమెరాముందు స్టూలుమీద కూర్చోమన్నాడు. హా, హా. ఆ క్షణం నేను కెమెరామెన్‌గా నటించేను సుప్రసిద్ధ నటుడు ఫ్రెడ్ అనబడే Alfred Molina పక్కన నిలబడి చూస్తుంటే. అంత పేరు గల నటుడూ నాతో ఎంతో మామూలుగా మాటాడుతుంటే నేను చాలా ఆనందపడిపోయేను. ఇంక మళ్ళీ మళ్ళీ ఈమాట చెప్పను కానీ ఇలా ఆనందపడ్డం లేవడం చాలాసార్లు జరిగింది ఆ పూట. ఫ్రెడ్ ఆ తరవాత కూడా ఒకటి రెండుసార్లు మాటాడేడు.

ఈ రోలుకీ రోలుకీ మధ్య తనకి తానై వచ్చి పరిచయం చేసుకుని నాతో ఎంతో స్నేహపూర్వకంగా మాటాడిన మరొక మహా నటుడు వింగ్ రేమ్స్. మీరు హాలివుడ్ వార్తలు అనుసరించేవారయితే, ఫ్రెడ్ ఫానులూ, వింగ్ ఫానులూ చాలామంది కనిపిస్తారు.

Ving 1

 

ఆయన కూడా ఇలా రా అని నన్ను చెయ్యి పుచ్చుకు నడిపించుకు గేలరీమీదకి తీసుకెళ్ళి, ″మీ అమ్మ నన్ను నీతో మాటాడమంటోంది,″ అంటూ సరయుని ఆట పట్టించేడాయన కొంచెం సేపు. ఆ తరవాత ఆయన మరోఅమ్మాయిని అడిగి నాతో ఫొటో తీయించుకున్నారు. హా, హా. అదేలెండి, అదేదో ఆయనకి మహా గౌరవం అని కాదు నేను చెప్తున్నది. ఆయన ఎంత సరదా అయిన మనిషో, ఎంత కలివిడిగా ఉంటారో చెప్పడానికి చెప్తున్నా.

ఆరోజుకి షూటింగు అయిపోయింతరవాత, సరయు నన్ను ప్రొడ్యూసర్ మరియు డైరెక్టరు అయిన బిల్ డిలియాకి పరిచయం చేసింది. ఆయన కూడా చాలా ఆదరపూర్వకంగా మాటాడేరు. వాళ్ళిద్దరూ ఇతర సీరీస్ కంటే ఈ మండే మార్నింగ్సు ఎలా భిన్నం అన్నవిషయం మాటాడడం నాకు నచ్చింది. ఎందుకంటే కొందరు ఆ ప్రశ్న అడుగుతున్నారు.

రాత్రి ఇంటికొచ్చేక, సరయు నాతో చెప్పింది తన హెయిర్ స్టైలిస్టు నా హెయిరు స్టైలు చేస్తానంటోందని. కాలం కలిసిరాలేదు కానీ అది కూడా జరిగుంటే ″హాలీవుడ్ మామ్‌″గా నాస్నాతకోత్సవం కూడా జరిగిపోను కదా అని ఉత్సాహపడిపోయేను. కానీ దురదృష్టవశాత్తు కాలం కలిసిరాలేదు. ఆ అమ్మాయి రమ్మన్నవేళకి నేను ఎయిర్పోర్టులో ఉండాలి తిరుగుప్రయాణం.

ఇతర వివరాలుః

సరయు డా. సిడ్ని నపూర్‌గా కీలకపాత్ర పోషిస్తున్న Monday Mornings సీరీస్ టి.యన్.టి ఛానెల్లో ఫిబ్రవరి 4న మొదలయి వారం వారం ప్రసారమవుతుంది. ఇతర దేశాల్లోనూ, ఇతర మీడియాల్లోనూ కూడా ప్రసారమవుతుంది కానీ వాటి వివరాలు ఎవరికి వారే కనుక్కోవాలి.


MM promo3

 

photo 5

ట్రైలర్లు, ఇతర వార్తలకి ఈ లింకులు చూడండి.

http://www.tntdrama.com/title/display/?oid=314964

http://insidetv.ew.com/2012/11/19/monday-mornings-trailer/

http://www.pizquita.com/noticia28749.html  (ఇందులో రెండో విడియో)

మీ అభినందనలూ, అభిప్రాయాలూ సరయుకి తెలియజేయాలంటే సరయు ఫాన్ పేజికి లింకు కింద ఇస్తున్నాను.

http://www.facebook.com/pages/Sarayu-Rao-Official-Fanpage/105347046184977

మాడిసన్ దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూ.

http://host.madison.com/entertainment/television/west-grad-sarayu-rao-lands-spot-in-david-kelley-s/article_e6949ee5-1d1c-5e39-9c79-3c7e62f5a011.html

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

18 thoughts on “ఊసుపోక – హాలివుడ్ నటులూ, నా నటనలూ!!”

 1. సెలబ్రిటీ అయ్యారన్న మాట.
  హారీపాటర్ స్కూలుకు వెళ్ళగానే హారీపాటర్ అని అందరూ అడిగినట్టుంది మీరు వెళ్ళగానే మామారావు అని అందరూ పలకరించడం.
  మీ సైటు పేరు తూలిక కాకుండా మామారావు అను పెట్టుకోవాల్సింది, బాగుండేది🙂

  ఇష్టం

 2. మాలతి గారూ,
  ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది ఈ రోజు. నా పేరు పలకడం ఎలా నేర్చుకున్నానో చెప్పాడు కొత్తగా పరిచయమైన ఒకతను. ‘బిగ్ బ్యాంగ్ థీరీ’ అనే సిట్‌కాంలో ‘లలితా గుప్తా’ అనే పేరుని పదే పదే పలుకుతాడట అందులోని ఒక పాత్ర. అందువల్ల నా పేరు ఎలా పలకాలో తెలిసిందట. కుతూహలం కొద్దీ వెతికితే ఆ పాత్ర సరయూ వేసిందని తెలిసింది🙂 Monday Mornings కోసం ఎదురు చూస్తున్నాను🙂

  ఇష్టం

 3. Wow. చాలా బాగుంది. నాకా నటులెవ్వరో తెలీదు కానీ, మీ ఆనందం మాత్రం తెలుస్తోంది🙂

  ఇష్టం

 4. సత్యవతిగారూ, @ మామా మాలతి కి ఇంతచక్కని అమ్మాయి ,వుందని కాస్త అసూయకూడా అనిపించింది. – మీరలా అంటే నాకు మరింత సంతోషంగా ఉంది. మీ సహృదయతకి ధన్యవాదాలు.
  వెంకట్, తప్పకుండా మీ అభినందనలు సరయుకి తెలియజేస్తానండి. థాంక్స్,

  ఇష్టం

 5. మీరు చెప్పిన నటులు తెలియరుగానీ మీ పోస్ట్ లో పుత్రికోత్సాహం నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ ఆనందం మీ మొహంలో ఎంతబాగా కనిపించిందొ! మామా మాలతి కి ఇంతచక్కని అమ్మాయి ,వుందని కాస్త అసూయకూడా అనిపించింది.(ఏం లేదు నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం) సరయు కి నా అభినందనలు .మీరిచ్చిన లంకెలు నా అమెరికా పిల్లలకి పంపాను..

  ఇష్టం

 6. పుత్రికోత్సాహము తల్లికి ఇలాంటప్పుడే కలుగుతుంది కదండీ.
  సరయూ కు ఆశీర్వాద పూరక అభినందనములు.
  మీ ఆనంద సంబరాలు మాతో పంచుకున్నందుకు థాంక్స్ !

  ఇష్టం

 7. @ లక్ష్మి రాఘవ గారూ, achchatelugu raase malathigarenaa anipincharu picture lo – హా, నా దశావకతారాలు.
  దాదాపు 40 ఏళ్ళగా ఇక్కడున్నాను, నాక్కూడా తెలీదండీ ఈ నటీనటులగురించి. ఈ టీవీసీరీస్ వచ్చేక, వీళ్ళందరిగురించీ తెలుసుకుంటున్నాను.

  ఇష్టం

 8. Narayanaswamy, నాకు ఇంతకుముందు తెలీదు కానీ వింగ్ రేమ్స్ ఎంతో ఆప్యాయంగా, ఏనాటి పాత చుట్టాన్నో చూసినంత ఆదరణతో నాతో మాటాడుతూంటే, అవునండీ మీలాటివారు ఈర్ష్య పడగలరనే ్నుకున్నాను. ఫిబ్రవరి 4, టియన్.టి గుర్తు పెట్టుకోండి.😛

  ఇష్టం

 9. Wow – you met Ving Rhames?? I am a big fan of his Marsellus Wallace! So so jealous!
  ” అంచేత నేనయితే కిక్కురుమనకుండా కూర్చున్నాను రోల్ అననప్పుడు కూడా. ” Hilarious!! Glad you had a good time.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s