ఆ తరం అంతరించింది

(మార్పు 51)

లీల మంచంమీద దొర్లుతోంది పొర్లుదండాలు పెడుతున్నట్టు. ఎటు పడుకున్నా రెండోవేపుకు తిరిగేవరకూ తోచడం లేదు. తలగడాలు సర్దుకుంది. తను ప్రత్యేకం కుట్టుకున్న బుల్లి తలగడ ఎడంచేతికింద పెట్టి, కుడిచేత్తో నొక్కి పట్టింది. కొంత సాంత్వన కలిగినట్టనిపించింది. క్షణకాలం మనసు కుదుటపడింది. క్షణకాలం మాత్రమే. మళ్ళీ విసుగు, చిరాకు, చెయ్యి నొప్పి పడుతున్న అనుభూతి. మళ్ళీ అటు తిరిగింది. లేచి, మంచినీళ్ళు తాగింది. గదిలో అటూ ఇటూ తిరిగింది. మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఏం తిందామా అని ఆలోచిస్తూ చుట్టూ చూడసాగింది. తాతగారు – ఆయన్నిగురించిన ఆలోచనలు కూర్చోనియ్యడం లేదు, నిల్చోనియ్యడంలేదు.

వాచీ చూసింది. గంటన్నర అయింది చిట్టికమలకి ఫోను చేసి.

చిట్టికమల మామూలుగానే, ″ఓ, మీరా!″ అని పలకరించి, ″మీకెలా తెలిసింది?″ అంది.

లీలకి అర్థం కాలేదు. ″ఏమిటి ఎలా తెలియడం? నేనూరికే తాతగారితో మాటాడి చాలా కాలం అయింది, ఓ మారు పలకరిద్దామని పిలిచేను,″ అంది.

″నిన్నరాత్రి హఠాత్తుగా తాతగారికి పిచ్చిలా అయిపోతే మేం గాభరా పడిపోయేం. అప్పటికప్పుడు గబగబా ఎమర్జెన్సీ రూంకి తీసుకెళ్ళేం.″

″అయ్యో. నాకు అదంతా తెలీదు. ఏమయింది. పిచ్చి అంటే ఏం చేసేరేమిటి?″

″అర్థరాత్రి లేచి స్నానం చేసి, తువాలు చేత్తో పట్టుకుని బయటికొచ్చి, హాలంతా తిరగడం మొదలెట్టేరు ఏవో మంత్రాలు  చదువుతూ. ఇంకా ఏవేవో కేకలు, ఎప్పుడో పోయిన మాఅమ్మా, మీ అమ్మా ఎదురుగా ఉన్నట్టు వాళ్లతో మాటాడ్డం. పక్కింటాయన్ని లేపి, చెప్తే, ఆయన టాక్సీ తీసుకొచ్చేరు,  పురందరం, ఆయనా కలిసి ఆస్పత్రికి తీసుకెళ్ళేరు బలవంతంగానే. నేనెక్కడికీ వెళ్ళనంటూ తాతగారు అరిచేరు కానీ ఎలాగో ఆస్పత్రి చేర్చేం. అక్కడ తాత్కాలికంగా ఆయన్ని శాంతపరచడానికి షాటిచ్చి నిద్ర పుచ్చేడు డాక్టరు. అక్కడే రెండు రోజులుంచమన్నారు psychiatric evaluation కోసం.″

లీల నిర్ఘాంతపోయి వింది. నోట మాట రాడానికి కొంచెం టైము పట్టింది. అటు చిట్టికమల కూడా ఇంకేం చెప్పాలో తెలీనట్టు ఆగిపోయింది.

ఆఖరికి లీలే అంది, ″నాకిదంతా తెలీదు. ఊరికే పిలవాలనిపించి పిలిచేనంతే. ఉంటాను మరి. ఆ పరీక్షలయింతరవాత డాక్టరేమన్నాడో వీలయితే తెలియజేయి. లేకపోతే నేనే చేస్తాను,″ అని ఫోను పెట్టేసింది.

ఆలోచిస్తుండగానే మరో ఫోనుకాలొచ్చింది. రాజు పిలిచేడు, ″మీకు తెలుసో తెలీదో తాతగారి పరిస్థితి ఏం బాగులేదని చెప్పడానికి …″ అన్నాడు.

″ఇప్పుడే విన్నాను. నేనేదో మామూలుగానే పిలిస్తే చిట్టికమల చెప్పింది,″ అంది లీల.

″మానాన్నగారిని పిలిచి, మీరొచ్చి వెంటనే తీసుకెళ్ళిపొండి, మావల్ల కాదింక ఆయనికి చెయ్యడం అంది,″ అన్నాడు రాజు.

″ఆఁ?″ అంది లీల ఆశ్చర్యపోతూ.

″అదేనండీ నేను కూడా … నాక్కూడా అలాగే అనిపించింది. నిల్చున్నపాటున ఆరోగ్యం బాగులేని మనిషిని నాలుగువందల కిలోమీటర్లు తీసుకెళ్ళిపోండంటే జరిగే మాటేనా.  అసలు కనీసం డాక్టర్లేంవంటారో, ప్రయాణానికి వీలవుతుందో కాదో, ఏర్పాట్లేం చెయ్యాలో … ఇవన్నీ చూసుకోవాలి కదా.″

″అవును, డాక్టర్లని సలహా అడిగితే బాగుంటుంది,″ అంది లీల సాలోచనగా. చిన్నవాడయినా రాజే నయంలా ఉంది. చిట్టికమలకీ, పురందరానికీ ఆమాత్రం తెలీదూ?

మర్నాడు మళ్ళీ రాజే ఇమెయిలిచ్చేడు, మతిస్థిమితం లేకపోవడం అదీ ఏమీ లేదు కానీ గర్భకోశంలో ట్యుమరుందేమో అని అనుమానంగా ఉందిట. పరీక్షలు చేస్తున్నారు అని.

తాతగారు మాత్రం నేనిప్పుడు బాగానే ఉన్నాను ఇంటికెళ్ళిపోదాం అని పేచీ పెడుతున్నారుట. ట్యుమరుగురించి చెప్తే, ఆ డాక్టరుకేం తెలీదు, నేను హోమియోపతి వాడతాను, నాకు నేనే నయం చేసుకోగలను అంటున్నారుట.

పురందరం, చిట్టికమల, రాజు, వాళ్ళనాన్న శ్రీనివాసు, ఇంకా తాతగారి ప్రాణస్నేహితుడు ఆనందరావూ … ప్రతి ఒక్కరూ పరిపరివిధాల చెప్తే, అప్పటికి శాంతించేరుట. బహుశా వీళ్ళందరితో వాదించే ఓపిక లేక అయివుంటుంది.

మర్నాడు చిట్టికమల మళ్ళీ వచ్చి, ″మిమ్మల్ని పెదనాన్నగారు తీసుకెళ్తాం అంటున్నారు. మీరు వెళ్తేనే బాగుంటుంది. నాకు పిల్లలూ, కంపెనీపనీ .. వీటితోనే సరిపోతోంది. మీరిప్పుడు మీపనులు మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరి మీకు బట్టలు మార్చడానికీ, అన్నం తినిపించడానికీ అన్నిటికీ రోజంతా ఒక మనిషి కావాలి. ఎవరున్నారు చెప్పండి నాకు మాత్రం. అంచేత … ఈపరిస్థితుల్లో మీరు వాళ్ళతో వెళ్ళడమే బాగుంటుంది. నేనింతకాలం చేసేను కదా,″ అంటూ ఉన్నవీ లేనివీ ఓ గంటసేపు కచేరీ పెట్టింది.

″ఇంతకాలం నువ్వు నాకు చేసిందేముంది? ఇంట్లో ఉన్నానేమో అంతకంతా నేనే చేసేను నీకూ, నీపిల్లలకీ. మీకు లేనప్పుడు డబ్బు పెట్టేను,″ అని తాతగారు అనలేదు. చిట్టికమల మాటలు మౌనంగా విన్నారు. ఆయనకి శ్రీనివాసుమీద కోపం వచ్చింది. మనసులో మండిపడ్డారు. చిట్టికమల తనఅవసరం తీరిపోయింతరవాత పొమ్మంటోందని ఆయనకి తట్టలేదు. ఆయనఆలోచనలు మరోలా ఉన్నాయి. శ్రీనివాసు, ముఖ్యంగా అతడిఇల్లాలు – వాళ్ళబాధ తాము తాతగారిని ఆదుకోవాలని కాదు, ఊళ్ళోవాళ్ళకి జవాబు చెప్పుకోలేక. తాతగారు మీకు బాగానే పెట్టేరు, ఇల్లు కట్టించి ఇచ్చేరు, పిల్లలకి చదువులు చెప్పించేరు, ఇప్పుడు కష్టకాలంలో ఆయన్ని ఆదుకోవలసినధర్మం మీకు లేదా అంటూ జనాలు కొరుక్కుతినేస్తున్నారు. ఆమాట వాళ్ళే తాతగారితో ఒకసారి అన్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక తీసుకెళ్తాం అన్నారేమో.

లీలకి తాతగారు పూర్వం ఒకసారి తనతో అన్నమాటలు జ్ఞాపకం వచ్చేయి. ″నాకెక్కడికీ వెళ్ళడం ఇష్టం లేదు. ఊళ్ళో ఎవరో ఏదో అన్నారని నేనెందుకు వెళ్ళాలి? శ్రీనివాసు రమ్మంటాడు కానీ అతనిభార్యా, ఆవిడతల్లీ – వాళ్ళదే పెత్తనం అక్కడ. నాకు వాళ్ళతీరు నచ్చదు. ముందోమాటా, వెనకోమాటా, శ్రీనివాసుకి నోట్లో నాలుక లేదు. వాణ్ణో కీలుబొమ్మని చేసి ఆడిస్తారు వాళ్లు. అవన్నీ చూస్తూ నేనక్కడ ఉండలేను. ఇక్కడ నాకు బాగుంది. చిట్టి, పురందరం కూడా నేనంటే ప్రాణం పెడతారు. పిల్లలు ప్రాణం పెడతారు.″

హుమ్. తాతగారు వెనకటితరం మనిషి. ఆయనధోరణి ఈకాలం పిల్లలకి అర్థం కాదు. కొన్నాళ్ళు రాజు కూడా ఆయనతో మాటాడ్డం మానేసేడని చెప్పినప్పుడు కూడా అదే అనుకుంది. అప్పట్లో లీలకి అర్థం అయిందేమిటంటే, తాతగారు చిన్నపనీ, చితకపనీ అలా ఏదో ఒకటి అతనికి చెప్తూనే ఉంటారు, ఇక్కడికెళ్ళు, అక్కడికెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ. ఓసారి లీల, అతన్నెందుకులెండి పంపడం, చదువుకుంటున్నట్టున్నాడు, అంటే, తాతగారు తేలిగ్గా, ″చిన్నవాడు, చేస్తేం ఏంపోయింది. తరవాత చదువుకుంటాడు,″ అనేశారు. ఆయనకి అర్థం కాదు ఈకాలం పిల్లలకి వాళ్లవ్యాపకాలు వేరే ఉంటాయనీ, ఇరవైనాలుగ్గంటలూ పెద్దలు చెప్పినపని చెప్పింది చెప్పినట్టు చెయ్యడం వాళ్ళపద్ధతి కాదని. అలాగే తిట్టినా, తప్పులు పట్టినా, పెద్దలు, ″ఏదో పెద్దవాళ్ళం, నాలుగుకాలాలు చూసినవాళ్ళం కనక చెప్తాం. దానికి కొంపలు ములిగిపోయినట్టు అంత రాద్ధాంతం ఏమిటి″ అంటారు.

చిట్టికమలగురించి వాళ్లచిన్నక్కయ్య సావిత్రి చెప్పిన అనేకఫిర్యాదులలో ఒకటి తాతగారు చిట్టికమలయింట్లో ఉండడంచేత ఆ దంపతులకి ప్రైవేసీ లేకుండా పోతోందని. ఈనాటిధోరణి ఇది. ప్రైవేసీ. వెనకటిరోజుల్లో అది ఒక జాతీయవిలువ కాదు. కుటుంబం అన్నాక ప్రతిఒక్కరూ రెండోవారి జీవితాలలో కష్టం, సుఖం అన్నీ పంచుకుంటారు. తిట్టుకోడం, దీవించుకోడం, వేసి వేయించుకోడం – అన్నీ సర్వసాధారణం. లీల కొంచెంసేపు ఆలోచించింది. అక్కడి సంఘటనలు ఊహించుకోడానికి ప్రయత్నించింది అప్పట్లో. ఇంట్లో మనిషి ఉన్నాక, ఇద్దరు వాదించుకుంటుంటే, ఎదురుగా ఉన్నమనిషి చూస్తూ ఊరుకోలేరు కదా. పైగా అందులో ఒకరు ″చూడండి నేనేం అన్నాననీ …″ అంటూ ఆ ఎదటిమనిషిని రంగంలోకి లాగొచ్చు కూడా. మీరు చెప్పండి అని సలహా అడగడం జరగొచ్చు. తామే ఆమనిషిని రంగంలోకి ఈడ్చేం అని మరిచిపోతారు తరవాత. అదుగో, మాయిద్దరిమధ్య జోక్యం కలగజేసుకుంటున్నారంటూ తరవాత ఏడుస్తారు. వెనకటితరంవాళ్ళకి ఈ ప్రైవేసీగొడవ తెలీదు. వాళ్ళఆలోచనలు వేరు. పెద్దలు చెప్పాలి, పిన్నలు వినాలి. రోజులు మారిపోయేయని తెలిసినవాళ్ళు కూడా ఒకొకప్పుడు ఈవిషయం గుర్తించరు.

ఫోను మోగింది. లీల ఉలికిపడి, లేచి ఫోనందుకుంది, గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి.

″నేనండీ, రాజుని.″

″ఆఁ?″

″తాతగారు … పోయేరు … ″

లీల నిట్టూర్చింది. రెండువేపులా రెండు క్షణాలు నిశ్శబ్దం. తరవాత లీలే అడిగింది, ″ఎప్పుడు పోయేరు?″

″తొమ్మిదిగంటల యాభైనిముషాలకి.″

లీల వాచీ చూసింది. గంట సేపయిందన్నమాట. లీల మాటడలేదు. రాజే కొనసాగించేడు, ″అమ్మ అన్నం, వంకాయ బజ్జీ చేసి తెచ్చింది. తిన్నారు, చాలాకాలం అయిందంటూ. మరో అరగంటకి అమ్మ వెళ్తానంటూ లేచింది గిన్నెలు తీసుకుని. గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు మాట రాలేదు. ఉండుండు అన్నట్టు చేత్తో సంజ్ఞ చేసేరు. తిన్న అన్నం వాంతి అయిపోయింది. నేను డాక్టరుని పిలవడానికి బయటికి వెళ్ళేను. వెళ్ళిపోతున్ననన్నట్టు చేయి ఊపేరు. అంతే. ప్రాణం పోయింది.

తాతగారు పోయినందుకు దుఃఖం లేదు కానీ ఆయన చివరిక్షణాల్లో ఏం తలుచుకుంటున్నారో ఎంత ప్రయత్నించినా తోచడం లేదు. ″నన్నుగురించి తలుచుకున్నారా?″ అన్న ప్రశ్న వేధిస్తోంది. రాజు, వాళ్లమ్మ, చెల్లెలు … ఎవరూ చెప్పలేదు. నాగురించి అడగలేదా అని తనకి తానై అడగలేకపోతోంది. అక్కడికీ ఎవరినైనా చూడాలనుందని అడిగేరా అని అడిగింది. ″చివరిక్షణాల్లో మాట పడిపోయింది కదా. ఏదో చెప్పబోయేరు కానీ గొంతు పెగల్లేదు,″ అంది రాజు తల్లి. అసలు ఎప్పుడైనా నాగురించి ఏమైనా అన్నారా అని అడగాలంటే అహం అడ్డొస్తోంది. ″ఎంతసేపూ నీకు నీగురించే యావ″ అని హేళన చెయ్యరా? ఇంకా ఆ చిట్టికమలతో పోల్చినా పోల్చొచ్చు, మరీ ఘోరం.

చివరిసారిగా తను తాతగారితో మాటాడినప్పుడు ఆయన బాగానే మాటాడేరు. పతంజలి యోగసూత్రాలు చదువుతున్నానని చెప్పింది.

″ఏ పుస్తకం?″ అని అడిగేరు.

″మీరే చాలాకాలంక్రితం పంపేరు కదా. Four chapters of freedom అని. అది చదువుతున్నాను. ఆ వ్యాఖ్యానం బాగుంది.″

″అవును, అది మంచి పుస్తకం.″

″కానీ, నాకు తెలుగులో అయితే బాగుంటుందని ఉంది. తెలుగులో ఏం లేవా?″

″ఏవో ఉన్నాయి కానీ మంచివి లేవు.″

అంతే. ఆ తరవాత, కొంచెం చదివినతరవాత మళ్ళీ మాటాడాలనుకుంది … కానీ ….

——————————————-

NSRao

ఇరవై ఏళ్ళగా నాసాహిత్యకృషికి అనేకవిధా సహాయపడిన మా అన్నయ్య నిడదవోలు  సీతారామారావు  డిసెంబరు 9, 2012, తారీకున పరలోకాలకి తరలిపోయేడు. నాకే కాక అనేకమంది బంధువులకీ, మిత్రులకీ సాయం చేయడమే పరమావధిగా జీవితం సాగించిన మాఅన్నయ్య దివ్యస్మృతికి …

(డిసెంబరు 15, 2012)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఆ తరం అంతరించింది”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.