నిశ్శబ్దం

శిశిరం ప్రవేశించింది. ఉత్తరాదినించి తరలివచ్చిన కొంగలు తరవాత కార్యక్రమం ఏమిటా అని ఆలోచిస్తున్నాట్టుంది. కిటికీలోంచి ఆకులు రాలిపోయి బడుగుకొమ్మలు బోసిగా ప్రాణంలేని శవంలా నిస్త్రాణగా కనిపిస్తున్నాయి. వరండాలో ఉన్న మల్లెమొక్కని గదిలోకి తరలించేను చలి తట్టుకోలేదని. గదిలో పోషకపదార్ధాలు చాల్లేదు కాబోలు గుడ్డిపువ్వులు పూస్తోంది. ప్చ్.

కిటికిలో శిశిరం

కిటికీకవతల బోడికొమ్మలమీదికి కళ్ళు మళ్ళించేను. ఒంట్లో ఓపిక హరించుకుపోగా, గొంతుకలో శబ్దాలు గొంతుకలోనే అణగారిపోతుంటే, నీళ్ళు నిండినకళ్ళతో, పుల్లల్లాటి చేతులతో ఏవో సంజ్ఞలు చేయడానికి నానా హైరానా పడుతూ ఆస్పత్రిమంచంమీద పడున్న రామాన్ని ఊహించుకోడానికి మెదడుతో కుస్తీపట్లు పడుతున్నాను.

అలనాటి ఆంజనేయుడిలా, లక్ష్మణుడిలా నాకు సకలం అమర్చిపెట్టిన రామం ఆక్షణాల్లో నేను చూడ్డానికి వెళ్ళలేదని బాధపడ్డాడా? నాకోసం పలవరించేడా? అమ్మ పలవరించిందని నాకు చాలాకాలంతరవాత తెలిసింది. నన్ను చూడకుండానే వెళ్ళిపోయింది. నాన్నగారు పోయినప్పుడూ వెళ్ళలేదు. ఎంచేత? ఏమో, ఇప్పుడు చెప్పలేను. ఆకాలంలో నేను ఇండియా వెళ్ళకపోడానికి సవాలక్ష కారణాలు. ఆతరవాత వెళ్ళకపోవడమే అలవాటయిపోయింది.

ఆఖరికి పధ్నాలుగేళ్ళతరవాత తెగించి నేను వెళ్తున్నా అని నాకు నేనే చెప్పేసుకుని, వస్తున్నానని రామానికి ఉత్తరం రాస్తే, … అప్పట్లో ఇంకా ఉత్తరాలే, ఫోనుకాలులు లేవు. టెలిగ్రాములున్నాయి కానీ నాకెందుకో ఆ ఆలోచన రాలేదు. 14 ఏళ్ళతరవాత తొలిసారి ఇండియా వెళ్ళినప్పుడు నాకో ప్రణాళిక ఉంది. గుళ్లూ గోపురాలూ చూడాలనుందని చెప్పేను. సరే, నేనిక్కడ ఏర్పాట్లు చేస్తానన్నాడు రామం. ఏ గుళ్ళు, ఏ గోపురాలు అన్న ఆలోచన నాకు లేదు. అతనే మొత్తం కార్యక్రమం ఆయత్తం చేసేడు. 14 రోజులలో 18 దేవాలయాలు … దక్షిణాదిని శ్రీరంగంలో మొదలుపెట్టి మధ్యప్రదేశ్‌లో ఏదో కొండమీద గుడి … ఇప్పుడు జ్ఞాపకం లేదు కూడాను … తిరిగేం. వెళ్ళిన చోటల్లో తన స్నేహితులఇళ్ళలోనే మకాం. ప్రతివారింట్లో ఇంటివాడిలాగే మెలిగేడు రామం. వాళ్ళు అలాగే ఆదరించేరు, అతన్నీ, అతనితోపాటు నన్నూ.
″రావుగారు ఎంత చెప్తే అంత. మాఅమ్మాయి మేం ఎంత చెప్పినా పెళ్ళి చేసుకోను కాక చేసుకోను అని ఎంత హఠం వేసుక్కూచుంది. రావుగారు చెప్తే ఒప్పేసుకుంది. పదిహేనేళ్ళయింది. ఇప్పటికీ ఏ మాటయినా సరే ఆయన చెప్తేనే ..″

″ప్రసాదుగారు విల్లు రాయకుండా పోయేరు. మీ అన్నగారే పూనుకుని ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులూ తవ్వి తీసి మొత్తం స్థిరచరాస్తులన్నీ ఓ కొలిక్కి తెచ్చి పిల్లలకి పంపకాలు పెట్టేరు. రెండున్నరేళ్ళు పట్టింది. నిజంగా ఆయన ఋణం తీర్చుకోలేం.″

″నన్నెవ్వరూ నమ్మనప్పుడు చిన్నాన్నగారు యాభైవేలెచ్చి, వ్యాపారం మొదలు పెట్టడానికి సర్వవిధాలా తోడ్పడ్డారు. ఆయనఋణం ఈజన్మంలో తీర్చుకోలేం.″

ఇంటింటా ఇలాటి కథలే విన్నానే గానీ ఆయనవల్ల మాకీకష్టం కలిగిందని గానీ ఈ నష్టం వచ్చిందని గానీ వినలేదు. ఆతరవాత కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు, రామం స్నేహితులు పరిచయమవుతూనే వచ్చేరు. ప్రతిసారీ రామం ఎంతమందికి ఎన్ని విధాల తోడ్పడ్డాడో తెలుస్తూనే ఉంది. ఇలా అభిమానాలే పోగు చేసుకున్నాడు కానీ తనకంటూ కూడబెట్టుకున్న ఆస్తులేమీ లేవు. అసలు తనఉద్యోగకాలంలో బాగానే సంపాదించేడు కాస్ట్ ఎకౌంటెంటుగా. అదంతా మరి ఇప్పుడేదీ? … తనకంటూ ఏమీ కోరలేదు కనక వారందరూ నాకు చేసి ఋణం తీర్చుకున్నారు! నేను వసూలు చేసుకున్నాను! అంతే కానీ వాళ్లెవరూ రామానికి చేసిందీ లేదు, చేయగలిగిందీ లేదు. అలాటి నిస్సంగీ, నిష్కామయోగీ రామం. అలాటి రామాన్ని చిట్టికమల, పురందరం తమ అవసరాలు తీరగానే పొమ్మనగలిగేరు. అణాపైసల్లో లెక్కలు చూసుకుని, ఆయన మదుపుగా ఇచ్చిన యాభైవేలూ తిరిగి ఇచ్చేసేం, ఋణం తీరిపోయింది అన్నారు. అంతేగానీ రామం అణాపైసల్లో లెక్కలు చూసుకోలేదనీ, మొత్తం కుటుంబాన్ని తనకుటుంబంగా స్వీకరించి సొంతం చేసుకున్నాడనీ అర్థం చేసుకోలేదు. మాతరంలో తండ్రికీ పినతండ్రీ, తాతకీ, చినతాతకీ వ్యత్యాసం లేదు. తండ్రెంతో పినితండ్రీ అంతే. అందరూ మనవాళ్ళే కష్టానికీ సుఖాలకీ కూడా. బాగున్నప్పుడు రారమ్మనడం, ఓగున్నప్పుడు పోపొమ్మనడం వీళ్ళకే చెల్లింది.

పురందరం వ్యాపారం మూడు పువ్వులూ తొమ్మిది కాయలూగా వృద్ధి పొందేక, ఇంటికి దూరంగా మరో ఆఫీసు తీసుకుని, అక్కడే మరో వాటా తీసుకుని రామాన్ని ఉండమన్నప్పుడు కూడా అతనికి అర్థం కాలేదు అది వాళ్ల కుట్రలో భాగం అని. ఆఫీసుకి దగ్గరే కనక ఆఫీసు వ్యవహారాలు చూసేడు. కొత్తగా చేరినవాళ్ళందరికీ వాళ్ల పనులు నేర్పేడు. శనాదివారాల్లో చిట్టికమలా, పురందరం సినిమాలకీ, షికార్లకీ వెళ్తే, పిల్లల్ని చూసేడు.

ఆరోజుల్లో, ఆ వాటాలో ఉన్నప్పుడే నేను వెళ్లేను. అదే ఆఖరుసారి చూడ్డం. అక్కడున్నప్పుడు మాత్రమే నాకు హాయిగా సొంతింట్లో ఉన్నట్టు అనిపించింది. వంటమనిషి పదిగంటలయింతరవాత వస్తుంది మధ్యాన్నంభోజనం చేసి పెట్టడానికి. రామం పొద్దున్నే లేచి, కాఫీ పెట్టేవాడు. ఆ తరవాత నేనే పెట్టడం మొదలెట్టేను. కాఫీ తాగి హోటలునించి పెసరట్లూ, ఇడ్లీలూ, పూరీలు … ఇలా అచ్చమైన తెలుగు వంటకాలు తెచ్చేవాడు. రోజూ ఎందుకులే బయటికెళ్ళడం, సీరియల్ నాకలవాటే అంటే, అక్కడున్నప్పుడు ఎలాగా అదే తింటావు కదా అంటూ బయల్దేరేవాడు. ఏం కావాలని నన్ను అడక్కుండా, ఇది కావాలని నేను చెప్పకుండా చేసుకుపోతూండేవాడు. మాయిద్దరిమధ్యా మాటలు తక్కువే ఏ సభలకో, నా పుస్తకాలు ప్రచురణకో ఎవరితోనో మాటాడాలనో, మాటాడేననో చెప్పడం తప్పిస్తే.

నాసాహిత్యం పదిముందు పెట్టడానికి రామం వెచ్చించినసమయం తలుచుకుంటే ఇప్పుడు నాకు బాధగా ఉంది. నేనేదో గొప్పకథలు రాసేననీ, అవి అందరూ గుర్తించాలనీ, పుస్తకాలు ప్రచురించాలనీ చాలా తాపత్రయపడ్డాడు. అతన్ననడం ఎందుకూ, నేనూ అలాగే అనుకున్నాను. కానీ నాకు ఇప్పటికి తెలిసింది సాహిత్యంలో నాస్థానం. అయ్యో, అతన్ని ఎంత ఇబ్బంది పెట్టేను అయాచితంగానే అయనా అని ఇప్పుడు విచారిస్తున్నాను.

″పుస్తకం కొన్నాను.″ ″చదివేను. కొన్ని బాగున్నాయి.″ ″కొని మాలైబ్రరీలో పెట్టుకున్నాను.″ హుమ్. ఈ పొడివాక్యాలు చెప్పినంతగా పెద్ద పెద్ద సమీక్షలు చెప్పవు. ఇదే నిజమైన వ్యాఖ్యానం నా సాహిత్యసేవకి. నేనేదో గొప్ప సాహిత్యం సృష్టించేసేనని భ్రమ పడి, రామాన్ని కూడా ఇబ్బంది పెట్టేను. నేను ముందులాగే నామూలన నేను పడి ఉండి, ఏదో రాసుకుంటూ పోతే, రామం మరో పదిమందికి సాయం చెయ్యడానికి వెచ్చించి ఉండేవాడు ఆ సమయం, లేదా, తను రాయాలనుకుంటున్న ఆధ్యాత్మిక చింతనలు రాసుకునేవాడేమో అని మనసు గుబగుబలాడుతోందిప్పుడు.

మాటలు తక్కువే అయినా, ఒకటి రెండుసార్లు కాబోలు తనమనసులోకి వస్తున్న ఆధ్యాత్మికచింతనలగురించి. తన పూర్వజన్మవృత్తాంతాలు కొన్ని చెప్పేడు. వాటికి ఋజువుగా మధుర వెళ్ళినప్పుడు అక్కడ ఆచార్యులు చెప్పిన సంగతులు చెప్పేడు. ఈ జన్మలో తనకి సాంసారికజీవితంమీద ఇచ్ఛ లేకపోవడానికి కారణం వెనకటిజన్మట. వెనకటిజన్మతాలూకు అనుభవాలు అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పేడు.

అలా నిర్వికారంగా, నిరామయంగా ఎవరికేం సాయం కావలిస్తే ఆ సాయం చేయడమే పరమావధిగా రోజులు గడుపుకున్నవాడు ఆఖర్న అప్రయత్నంగా, అనాలోచితంగా, అసంబద్ధంగా అసందర్భంగా సంసారంకూపంలో చిక్కుకుపోయేడు. అవే రుగ్మతలయి ప్రాణాంతకంగా పరిణమించేయేమో.

శ్రీనివాసూ, మరదలూ, పిల్లలూ ఎంత ఆప్యాయంగా చూసుకున్నా, రామానికి మాత్రం చిట్టికమలా, పిల్లలమీద ధ్యాసంతా ఉన్నట్టుంది. బహుశా లివర్లో పుండుకంటే చిట్టెమ్మమీద తపనే ఎక్కువగా బాధించిందేమో.

నాకు చిట్టికమలమీద మాచెడ్డ కోపం ఉవ్వెత్తున ముంచుకొచ్చేసింది. దానికి అంతరాత్మ లేకుండా పోయిందేం ఆఖరిదశకొచ్చేసరికి. పైగా దాని అక్కలిద్దరూ యాభైలు దాటి ఉంటాయి కదా ఆమాత్రం జ్ఞానం వాళ్ళకయినా ఉండఖ్ఖర్లేదూ. చిట్టెమ్మకి బుద్ధి చెప్పడం పోయి, మరింత పురెక్కించేరు చిన్నాన్నగారిని ఎలాగైనా ఒదిలించుకోమని. నన్నూ, రాజునీ పోరేరు మీకు మాత్రం ఆయన చెయ్యలేదా, మీకు మాత్రం బాధ్యత లేదా, మీధర్మం మీరు ఆచరించఖ్ఖర్లేదా … అంటూ.

రామంతో ఆరోజుల్లోనే మాటాడేను. సావిత్రి, వరాలు నాతో రాజుతో చెప్పినవిషయాలు చెప్పేను. నువ్వక్కడ ఉండడం వాళ్ళకిష్టంలేదని వీలయినంత నాజూగ్గా చెప్పేను. అప్పుడే తొలిసారిగా తన మనసులో మాట చెప్పేడు సగం, సగమే అయినా … చాలా విషయాలు మాటాడేడు, అమ్మసంగతులు, మామయ్యసంగతులు … అవన్నీ ఇప్పుడెదుకంటే, ″చెప్పనీ. మళ్ళీ ఈసంగతులు మాటాడను″ అన్నాడు. మొత్తంమీద రామంమాటల్లో సారాంశం, చిట్టికమలకి తనంటే మాచెడ్డ అభిమానం. పురందరం అయితే ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. తనకిక్కడే బావుంది. అలాటప్పుడు మరోచోటికి ఎందుకు వెళ్ళడం? తనకి ఇక్కడే, చిట్టికమలింట్లోనే బావుంది. అలాటప్పుడు ఇక్కడికీ అక్కడికీ ఎందుకు తిరగడం? అన్నాడు. వామనుడిలా – నాకు ఒరులు గారు, నేను ఒరలకు ఔదు – అన్నవాక్యం రామంవిషయంలా అక్షరాలా నిజం.

నాప్రాణం గిలగిల కొట్టుకుంది. అయ్యో, ఎంత అమాయకుడివి అని అరవాలనిపించింది. ఏడవాలనిపించింది. సావిత్రీ, వరాలూ నాటకం ఆడుతున్నారంటే రామం నమ్మలేదు. ″ఎక్కడో ఉన్న రాజునా .. నేను నమ్మను″ అన్నాడు. ఇంకేమిటి చెప్పడం. అప్పుడే వాళ్ళందరికీ ఓ మెయిలు పెట్టేను. నాకక్కడిసంగతులేమీ అర్థం కావడం లేదు. ఓ ఒక్కరూ పూర్తిగా నిజం చెప్పడంలేదు. అంచేత నన్నింక వదిలేయండి. నేనింక జోక్యం కలగజేసుకోనని. కలగజేసుకున్నా వాళ్ళు వినరు, ఎందుకొచ్చిన గొడవ అనిపించింది. అంతే.

పోయేముందు నాగురించి అడిగేడా, ఏమైనా చెప్పేడా అన్నది తెలీడం లేదు. అసలు నాగురించి అడగలేదేమో, అడిగితే ఎవరో ఒకరుచెప్పే ఉండేవాళ్ళు. మర్నాడు పోతాడనగా ముందురోజు బాగానే మాటాడేడుట. వంకాయబజ్జీ చేసి మెత్తగా అన్నం కలిపి పెడితే, ఎంతకాలం అయిందో ఇది తిని అంటూ తృప్తిగా తిన్నాడుట. మరి ఏం మాటాడేడు … తెలీదు. తరవాత … తెలీదు. నన్ను కాకపోతే మరెవరినైనా చూడాలని ఉందని అడిగేడా. అదేం లేదన్నాడు రాజు. మాట పడిపోయిందప్పటికే.

ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. కోపంతో తల పగిలిపోయేలా ఉంది. ఎప్పుడో ఎవరో పంపిన పుస్తకం తీసేను. గదినిండా ఆవరించుకున్న నిశ్శబ్దం చెవుల్లో హోరు పెడుతోంది. ఉలికిపడ్డాను. నిశ్శబ్దం ఇంత బలంగా నన్ను తనలో పొదువుకోడం చిన్నప్పుడు జరిగింది. ఆ నీరవగళం చెప్పిన కథలు ఎన్నో అక్షరగతం చేసేను. మళ్ళీ ఇవాళ అలాగే ఉంది. చీకటీ, నిశ్శబ్దం నాకెంతో ఇష్టంగా ఉన్నాయి.

గబుక్కున లేచి, కోటూ, బూటూ వేసుకుని బయటికి నడిచేను.

ఉత్తరపొలిమేరలనించీ తరలి వచ్చిన తెల్లటి పావురాళ్ళు గుంపుగా గట్టున కూర్చుని భవిష్యత్తు చర్చిస్తున్నట్టున్నాయి. శాంతి, శాంతి అని అరుస్తున్నాయి నిశ్శబ్దంగానే. వాటిని చూస్తుంటే మనసు తేలిక పడింది.

ఇంటికొచ్చి సోఫాలో తూలి పడ్డాను. కిటికీకవతల ముసురు. ఇవతల నిశ్శబ్దం. ఎదురుగా మల్లెమొక్క మరో రెండు గుడ్డిపువ్వులు పూసింది. గోడమీద కేలండరు 2012కి శలవు చెప్తోంది 31ని ఆర్భాటంగా ఎత్తి చూపుతూ.

కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి …

(డిసెంబరు 31, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “నిశ్శబ్దం”

 1. కొన్ని కొన్ని విషయాల్ని గురించి రాయలేం. మనసుకి మరీ దగ్గరైన విషయాల్ని గురించి. అక్కడక్కడా మా అమ్మగురించి ప్రస్తావించినప్పుడు కొందరు మిత్రులు అడిగారు ఆవిణ్ణి గురించి వివరంగా రాయమని. రాయలేనని చెప్పాను. మీరు రామంగారి గురించి రాయడానికి ఉపక్రమించారు అంటేనే అర్ధమవుతున్నది మీ మనసు పడుతున్న వత్తిడి. We are with you.

  మెచ్చుకోండి

 2. హృదయాన్ని పిండేసే స్మృ తుల రచన ,
  మీరు మీ రామం అన్నయ్య తలంపులలో మునిగి ఉన్నారు.
  త్వరలో కోలుకొని ఇంకా మంచి రచనలు కొనసాగించాలని,
  తద్వారా ఆయనకు అంజలి ఘటిస్తారని ఆశిస్తాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s