ఉభయభాషాప్రవీణ

ఒకొకప్పుడు ఆలోచిస్తుంటే కొందరి తరహా చూస్తుంటే ఇంగ్లీషొక్కటే భాష కాబోలు అనిపిస్తుంది. ఇంగ్లీషులా ధ్వనించని ఏ భాష మాటాడినా తెల్లమొహం వే్స్తారు అదేదో అవాచ్యం అన్నట్టు. రెండక్షరాల పేరు కూడా ధ్వంసం చేయగల జనాల్ని చూస్తే ఏం అనాలో నాకు తోచదు

అదే మనదేశంలో చూడండి జనాభై లెక్కల్లో నిరక్షరాస్యులుగా తేలేవాళ్ళు కూడా రెండో మూడో భాషలు తడుముకోకుండా మాటాడగలరు. మీరిక్కడికొచ్చి ఎంతకాలం అయిందీ అనడక్కండి. బాలాప్రాయం వదిలేస్తే, నాజీవితం సరిగ్గా సగం పుట్టినగడ్డమీదా సగం మెట్టినగడ్డమీదాను. నేనిక్కడ అడుగెట్టగానే పాపం చాలామందే నన్నుద్ధరించడానికి పూనుకున్నారు కానీ నేనే మొండికేశాను వల్లకాదని నాపేరూ, మొహమూ, బాసా, యాసా మొత్తం అంతా ఒకటే పేకేజీ, మీకు నచ్చకపోతే మీఖర్మ అని స్పష్టంగా చెప్పేశాను.

“Assimilation” అను విద్య నాకు పట్టుబడలేదు. నా కార్యక్రమంలో లేదు. నిజానికి అలా ఆ మెయిను స్ట్రీములో కొట్టుకుపోకుండా ఉండడానికే ఎక్కవ జాగ్రత్త పడ్డాను. పడ్డాననే అనుకున్నాను. కానీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయిందది కొంతవరకూ. చాపకింద నీరులా ఇంగ్లీషు నాబుర్రలో కమ్ముకునేసింది. Colonialismలాటిదే ఈ ఉభయభాషా పాటవం కూడా. నేను తెలుగులో ఆలోచించడం ఎప్పుడు మానేశానో నాకే తెలీదు. ఇంగ్లీషులో ఆలోచించడం స్వయంకృతాపరాధం కాదు.

000

నాలుగు నెలలకిందట మాపక్క వాటాలో ఓ కొత్త కుటుంబం దిగేరు. ఆయనా, ఆవిడా, ఓ పదేళ్ళ కుర్రాడూను. వాళ్ళది ఏ దేశమో కానీ ఈ దేశం వాళ్ళకి అయోమయం అని నాకు అర్థం కావడానికి అట్టే కాలం పట్టలేదు.

వాళ్ళు దిగిన వారంరోజులకనుకుంటాను ఏదో పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. తలుపు తట్టిన చప్పుడు విని లేచి తలుపు తీసేను. మా పక్కవాటాలో కొత్తగా దిగినావిడ. హాయ్ అన్నాను నేను ఆహ్వానపూర్వకంగా ఓ అడుగు వెనక్కి వేసి.

ఆవిడ మొహంలో ఏదో భయం. నాచెయ్యి పుచ్చుకు గుమ్మంఅవతలికి లాగి ఎదురుగా దూరంలో ఉన్న ఇల్లు చూపింది. ఆ ఇంటిచిమ్నీలోంచి పొగ వస్తూంది. నాకు నవ్వొచ్చింది. ప్రమాదమేమీ లేదని చెప్పబోయేను. అప్పుడు తెలిసింది ఆవిడకి ఇంగ్లీషు రాదని. రకరకాల హావభావాలతో ఓ పావుగంట పాటు పడి ఆవిడని అనునయించి పంపేశాను.

ఆ తరవాత వారంరోజులపాటు నేను కారెక్కుతున్నప్పుడూ దిగుతున్నపుడూ కనిపించి చెయ్యూపేది. అంతే.

000

వాళ్ళబ్బాయిని స్కూల్లో వేశారు. తల్లిదండ్రులకి ఇంగ్లీషు రాదు కనక నన్ను వాళ్ళతో రమ్మన్నారు. అక్కడ కాయితాలన్నీ నేనే నింపేను నాకు తోచినట్టు. చివర సంతకాలు పెట్టవలసిన చోటు చూపించి సంతకాలు పెట్టమన్నాను. తండ్రి వా       ళ్ళభాషలోనే ఏదో గిలికేడు. అదేమిటో ఎవరికీ తెలీదు కనక నన్ను సాక్షి సంతకం పెట్టమన్నారు ప్రిన్సిపాలుగారు. పెట్టేను. వాళ్ళు సంతకాలు పెట్టిందెందుకో వాళ్ళకి తెలీదు. అది విడమర్చి చెప్పే భాషాపాటవం నాకు లేదు. అది గమనించనట్టు ఆరోజు నేనూ ప్రిన్సిపాలుగారూ కూడా మన సిస్టముని ఆ విధంగా పరిరక్షించి తృప్తి పడ్డాం.

అందరం ఫ్రిబుయమేని క్లాసుకి తీసుకెళ్లేం. టీచరు ఎనీనా ఎంతో అనునయంగా ఆ అబ్బాయిని పిల్లలకి పరిచయం చేయబోయింది. “మన క్లాసులో కొత్త అబ్బాయి” అని, వాడివేపు తిరిగి పేరడిగింది.

ఆ కుర్రాడు మాటాడలేదు. ప్రిన్సిపాలుగారు అంతకుముందుచెప్పేరు కానీ ఆవిడకి పట్టుబడలేదు ఆ నామధేయం. రెండోమారు కూడా అడిగి, జవాబు రాకపోవడంతో నిన్ను “ఫిల్ అంటాం, సరేనా” అని, క్లాసులో అందరికీ ఆ పేరు విదితం చేసింది.

కుర్రాడికి ఇదంతా అయోమయంగా ఉందో అవమానంగా ఉందో పళ్ళు గిట్టకరిచి చూస్తున్నాడు అందరినీ.

క్లాసంతా ముక్తకంఠంతో “హాయ్ ఫిల్” అన్నారు.

ఆవిధంగా ఆరోజు ఆ కుర్రాడికి పేరు పెట్టడం, స్కూల్లో వేయడం అయిపోయేక, మేం ఇల్లు చేరుకున్నాం. అదృష్టవశాత్తు స్కూలు అట్టే దూరం లేదు. గట్టిగా అడుగులేస్తే పదినిముషాలు, అంతే.

మర్నాడు స్కూలు కెళ్ళడానికి పేచీ పెట్టినట్టున్నాడు, మళ్లీ నా తలుపు తట్టేరు తెల్లార్తూనే. నేను మాత్రం ఏం చెప్పగలను? వాళ్ళ భాష నాకు రాదు, నా మాట వాళ్ళకర్థం కాదు. వాళ్ళు రకరకాలుగా చేతులూపుతూనూ, ముఖకవళికలతోనూ నాకు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చిదానందసాములారిలా మొహం పెట్టుకు వింటున్నానే కానీ ఎంతసేపు ఈ వీధి భాగోతం? అవతల నాకు వేళయిపోతోంది. ఆ కుర్రాడి చెయ్యి పుచ్చుకు నాకారు చూపించేను పదమంటూ. వాడేం అనుకున్నాడో మారు మాటాడకుండా వచ్చి కారులో కూర్చున్నాడు.

నేను వాళ్ళనిగురించి ఆలోచిస్తున్నాను. తండ్రి గాస్ స్టేషనులో పని చేస్తున్నాడు. తల్లి మా చుట్టుపక్కల నాలుగిళ్ళలో క్లీనింగ్ లేడీ. 1970 లనాటి పాతకారొకటి కొన్నారు 500 డాలర్లకి. ఆ కారుకి కొత్త బాటరీ కావాలి, టైర్లు కావాలి, కార్బొరేటరు కావాలి.

నెల రోజులతరవాత ఓ సాయంకాలం ఊరుకోలేక వాళ్ళింటికెళ్ళేను ఏం చూస్తున్నారో చూద్దాం అని. నన్ను చూడగానే ఆవిడమొహం మతాబాలా వెలిగింది లిప్తపాటు. వాళ్ళదేశంనించి తెచ్చుకున్నవేవో చూపిస్తోంది. నాలుగు ఇంగ్లీషు ముక్కలు పట్టుబడ్డాయి. చురుకైనఆవిడలాగే ఉంది. తమదేశంలో ఇంజినీరుట. ఇదా వీళ్ళ అమెరికన్ డ్రీం అనిపించి నా ప్రాణం ఉసూరుమంది.

ఇంటికొచ్చేసరికి ఎనిమిదవుతోంది. గోపు ఎదురుచూస్తున్నాడు నాకోసం. కాలేజీలో మొదటేడు చదువుతున్నారు. నా వెనక పదేళ్ళకి పుట్టేడు కానీ అభిప్రాయాల్లో, ఆలోచనల్లో నేను ఒక తరం వెనకుంటే వాడు రెండు తరాలు ముందున్నాడు. వెరసి మూడు తరాల అంతరం మామధ్య అన్నమాట. పట్నంలో ఇంగ్లీషుమీడియం స్కూల్లో చదువు వెలగబెట్టి అమెరికాకి వచ్చేడు. అమెరికన్ యాస కూడా అక్కడే నేర్చేసుకు దిగేడు. యాతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఇంగ్లీషుయాసతో తెలుగు మాటాడే borderline bilingual.

“ఎక్కడున్నావింతసేపూ?” అన్నాడు నన్ను చూడగానే.

వాడు కాలేజీనించి ఇంటికొచ్చేవేళకి నేను సాధారణంగా వంట పూర్తి చేసి టీవీ చూస్తూనో పుస్తకం పుచ్చుకునో ఎదురవుతాను మరి.

“పొరుగింటికెళ్ళేను పిచ్చాపాటీ కబుర్లకి,” అన్నాను.

వాడు నవ్వేడు, “ఏఁవిటి మాటాడేరు ఇంతసేపు? నీకు ఆవిడభాష రాదు. ఆవిడకి నీమాట అర్థం కాదు.’’

“ఏం ఇక్కడ జనాలు కుక్కలతోనూ మొక్కలతోనూ ఊసులాడతారు. ఆపాటి చెయ్యదేమిటి సాటి మనిషి” అన్నాను విసుగ్గా.

ఫిల్ ఇంచుమించు రోజూ పేచీ పెడుతూనే ఉన్నాడు స్కూలికెళ్ళడానికి. ఒకరోజు కమిలిన మొహంతో వచ్చేడింటికి. మరోరోజు ముక్కులోంచి రక్తం కారుకుంటూ, మూడోరోజు కుంటుకుంటూ.

వారంరోజులనాడు యెనీనా ఇంటికొచ్చింది ఫిల్ తల్లిదండ్రులతో మాటాడ్డానికి కానీ కొత్తగా సాధించిందేమీ లేదని నాకు సుళువుగానే అర్థమయింది నాకు. ఆవిడ మంచి టీచరే పాపం నిజంగా పిల్లలంటే బోలెడు అభిమానం. వాళ్ళకి ఇంగ్లీషు నేర్పాలని మహ ఆరాటపడిపోతోంది. ఆవిషయంమీద అందిన పుస్తకఁవల్లా చదువుతోంది. వర్కుషాపులకి వెళ్తోంది. ఇంగ్లీషు రెండోభాషగా చర్చించే కాన్ఫరెన్సులన్నిటికీ హాజరవుతోంది. ఆవిడకి తిండీ, నిద్రా నిద్రలో కలలూ కూడా ఈ ఈయస్సెలే! ఫిల్‌కి ఇంగ్లీషు నేర్పడం ఆవిడకొక పెద్ద పరీక్షగా తయారయింది. అందులో ఫెయిలయితే ఆవిడకి మహా అవమానం. అటువంటి పరాజయం ఆమెగారు భరించలేదు.

స్కూలయింతరవాత వాడిని కూర్చోబెట్టి అనేకరీతుల పాఠాలు చెప్పడానికి ప్రయత్నించింది. అలా ఆవిడ తనకొక ప్రత్యేకతనివ్వడం వాడికయితే బాగుంది. ఆవిడతో కాలక్షేపం చెయ్యడానికి వాడికేం అభ్యంతరం లేదు కానీ నోట పరాయి భాష  పలకడం మాత్రం మహ సంకటంగా ఉంది రోజుకి రోజూ. ఏ రోజు చూసినా ఫిల్ కళ్ళలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ నన్ను కూడా కలవరపెడుతోంది.

ఆఖరికి ఆరోజు కూడా వచ్చింది. వాడిని స్కూల్నించి తగిలెయ్యడానికి సిద్ధం అయేరు ప్రిన్సిపాలుగారు. కుర్రాడు మేకలు నరుక్కునేకత్తి తీసుకెళ్ళేట్ట స్కూలికి!

యెనీనా పిల్లవాడితల్లిదండ్రులతో మరోసారి మాటాడి చూస్తానని ఆయనకి నచ్చచెప్పి వాళ్ళింటికి మళ్ళీ వచ్చింది. ఆవిడ వచ్చేవేళకి నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉండేలా చూసుకునే వచ్చిందావిడ. అక్కడ జరుగుతున్న విషయాలు నాకు వివరంగా చెప్పి, పిల్లాడిని ఎలాగైనా కాపాడమని వేడుకుంది. తెలివైనవాడంది. వాడు మెయిను స్ట్రీములో కలిసిపోయేలా చేయడమే తనధ్యేయం అంది. ఇంగ్లీషు చక్కగా మాటాడడంవల్ల కలిగే లాభాలూ, మాటాడలేకపోతే వచ్చే నష్టాలూ, కష్టాలూ, తను తన ధ్యేయం సాధించడానికి పడుతున్న అవస్థలూ – అన్నీ ఎంతో విపులంగా చెప్పింది నాకు. ఆ అబ్బాయిదేశ సంస్కృతీ, సంప్రదాయాలూ, ఆచారాలూ, వ్యవహారాలూ, పండుగలూ, దేవతలూ, పిండివంటలూ – సమస్తవిషయాలూ సేకరించి ఫ్లాష్ కార్డులు తయారు చేసిందిట. ఎంత చేసినా ఫిల్ ఏమాత్రం ఉత్సాహం చూపడంలేదు వాటిలో.

ఓపినంతసేపు విన్నాన్నేను. ఇదీ అని స్పష్టంగా చెప్పలేను కానీ నాకెందుకో ఫిల్ ప్రవర్తన విపరీతంగా తోచలేదు.

“కుర్రాడికి కొంచెం టైమివ్వండి,” అన్నాను మరేం తోచక.

యెనీనా మళ్ళీ అందుకుంది – కోర్సు కంటెంటూ, స్థానిక ఆచారాలూ, మర్యాదలూ, … ఇక్కడి సినిమాలూ, సంగీతం, హిప్ హాప్, జాతీయనాయకులూ, సంబరాలూ – ఫిల్‌కి ఇవీ పట్టలేదుట. ఆఖరికి సింగెలాంగ్ కాసెట్లు ఇచ్చింది. వాడు మరీ అంత పసిపిల్లాడు కాదని తోచలేదావిడకి. ఆ మాట వాడఅనలేదు కానీ ఆ మొహం చెబుతోంది.

యెనీనా ఉభయభాషాప్రావిణ్యంవల్ల లభించే ఆనందం, సౌభాగ్యంగురించి ఉపన్యసిస్తోంది. ఆఖరి అస్త్రంగా “మీరు ఇంట్లో మీ భాష మాటాడకండి. ఇంగ్లీషే  మాటాడాలని కట్టడి చెయ్యండి,” అంది.

ఆ వెంటనే ఒక హ్రీంకారంతో గది ప్రతిధ్వనించింది “…. …” ఫ్రిబుయమే అరిచేడు ఒంట్లో ఉన్న శక్తినంతటినీ కూడగట్టుకుని. వాడు పలికిన వాక్కు శిష్టజనవ్యావహారికం కాదు కనక ఇక్కడ రాయలేను.

అందరం నిర్ఘాంతపోయేం క్షణకాలంపాటు. తరవాత మొహమొహాలు చూసుకున్నాం. కుర్రాడితండ్రి ఏదో అరిచేడు. బహుశా మాటలు తిన్నగా రానియ్ లాటివాచకం కావచ్చు.

“ఇంగ్లీషు రాలేదన్నారు. అదుగో ఇంగ్లీషు,” అన్నాను నేను. అలా అనడం మర్యాద కాదని నాకు తెలుసు. నా అభిప్రాయం పిల్లలు మనం అనుకున్నదానికంటె వేగంగానే భాష నేర్చుకోగలరనీ, మనం అనుకోని పద్ధతులలో నేర్చుకుంటారనీను.

“అది నేను నేర్పిన మాట కాదు,” అంది యెనీనా పాలిపోయినమొహంతో నీరసంగా. తననెక్కడ తప్పు పడతారో అని ఆవిడభయం. మళ్ళీ తన సిద్ధాంతం అందుకుంది. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవుసరం ఉంది కనక ఇంట్లో అందరూ ఇంగ్లీషే మాటాడ్డం సమంజసం అని నొక్కి వక్కాణించింది.

నాకు ప్రాణం చాలుకొస్తోంది.

“మీరు వాళ్ళకి నచ్చచెప్పండి. వాళ్ళు ఈదేశంలో బతకడానికి ఇంగ్లీషు చాలా అవుసరం,” అంది నావేపు తిరిగి. ఆవిడకి కూడా ఓర్పు నశిస్తోంది.

నేను తెలివిగా తప్పుకున్నాను, “అదంతా చెప్పడానికి కావలసిన భాషాపాటవం నాకు లేదు,” అంటూ. అంతకు మించితే నేను మాట తూలగలను. అప్పుడు నాభాష ఆవిడకి శ్రవణానందం కాకపోవచ్చు.

“కానీ మీరు వాళ్ళతో మాటాడుతున్నారు కదా!”

దాంతో నాకు అరికాలిమంట నెత్తికెక్కింది. పళ్ళు గిట్టకరిచి అత్యంత శాంతంగా అన్నాను, “నేనీమాట అంటే బాగుండదని ఇంతసేపూ ఊరుకున్నాను. భాష సంస్కృతిలో భాగం. చాలా ముఖ్యమైన భాగం. ఈ దౌర్భాగ్యపునేలమీద వాళ్ళకి మేమూ మనుషలమే అనుకోడానికి తమదైన భాష కావాలి. ఆభాషకి ఇల్లొక్కటే గతి. ఆ ఇంట ఆమాత్రం స్వేచ్ఛ వాళ్ళకి అవుసరం. మీరు ఇంట్లో కూడా ఇంగ్లీషే మాటాడాలని ఆంక్ష పెడితే ఏం చెప్పను? మీరు వాడిని ఉభయభాషాప్రవీణగా కాదు కేవలమూ ఇంగ్లీషే మాటాడే ఏకభాషాజీవిని చేస్తున్నారు.” అనేసి నాకు పనుందని చెప్పి అక్కడ్నుంచి బయట పడ్డాను.

ఇంటికొచ్చేనే కానీ మనసంతా మహ చిరాగ్గా ఉంది. అన్నం అడుగంటింది. కూర ఉప్పు కషాయం. పులుసు చిక్కని వార్నిష్‌లా తయారయింది.

“ఏమైంది?” అనడిగేడు గోపు, ఫ్రిజ్‌లోంచి టీవీడిన్నరు  తీసి మైక్రోవేవులో పెట్టుకుంటూ.

“ఆ పంతులమ్మ వాడిని ఉభయభాషాప్రవీణుడిని చేస్తుందిట.”

“అయితే తప్పేమిటి?”

“ఆవిడ వాడికి రెండు భాషలు నేర్పడంలేదు. వాడి సంస్కృతిని నాశనం చేస్తోంది సమూలంగా. నీకూ నాకూ ఆ పుట్టించినవాడికీ తెలుసు ఇక్కడ ఉన్నాక ఇంగ్లీషు రాక చస్తుందా? తల్లిభాష మరిచిపొమ్మని ఆవిడ పనిగట్టుకు పోరు పెట్టాలా? మరిచిపోకుండా నిలబెట్టుకోడమే బ్రహ్మప్రళయం అవుతుంటే.”

“అలా అంటున్నావు కానీ నీకూ తెలుసు అది నిజం కాదని, ” అన్నాడు గోపు, సంస్కృతి నాశనం అవుతుందన్న నామాటనుద్దేశించి.

నేను మళ్ళీ అందుకున్నాను, “నిన్న మాఆఫీసులో ఎమిలీ నాకో వ్యాసం చూపించి నా అభిప్రాయం అడిగింది. ఎవరో పెన్సిల్వేనియాలో ప్రొఫెసరుట వసుధైకకుటుంబానికి ప్రాతిపదికగా సకలజనులూ ఒకేమూసలోంచి వచ్చిన అచ్చుల్లా ఒక్కలా ఆలోచించాలనీ, లోకంలో విజ్ఞానం అంతా అందరూ పంచుకోవాలనీ.”

“అది నీకు తప్పుగా తోచిందా?” అన్నాడు గోపు నన్ను ఎత్తిపొడుస్తూ. అందర్నీ తప్పు పట్టడమే నాకు పరమావధి అని వాడి అభిప్రాయం.

“లేదు. ఆ తరవాతివాక్యమే నన్ను శివాలెత్తిస్తోంది. ఏమన్నాడు తెలుసా? ఆ అధమాధమ తరగతి దేశాలన్నీ తమకున్న పుంజీడు పుస్తకాలూ కంఠస్తం చేసి అవే మళ్ళీ మళ్లీ వల్లె వేసుకుంటూ అజ్ఞానతిమిరంలో కొట్టుకుంటున్నారూ,  వాళ్ళకి మనం పుస్తకాలూ, కంప్యూటర్లూ, విడియోగేములూ సరఫరా చేసి, మన ఫుట్బాలూ, బేస్బాలూ, చదరంగంలాటి ఆటలు నేర్పి వాళ్ళని విజ్ఞానవంతులని చేయాలి అని.”

“చదరంగం కూడా ఆయనే కనిపెట్టేనంటాడేమిటి?” అన్నాడు గోపు. అప్పటికి తోచిందివాడికి అవతలివాడి వాదనలలో అవకతవకలు.

“అదే మరి. పుస్తకాలు లేకుండా జ్ఞానం సముపార్జించొచ్చని ఆయనకి తెలీదు. ఆమధ్య ఓ కుర్రాడు ఉద్యోగానికి అర్జీ పెట్టుకుంటూ, తనకి తెలుగొచ్చని రాసుకున్నాడు. ఏ మాత్రం వచ్చో నన్ను చూడమన్నారు. తీరా చూస్తే అతగాడి నోట్లోంచి ఒక్కముక్క కూడా ఊడిపడలేదు. మా క్లాసులో చెప్పిందంతా పుస్తకంలో ఉంది, పుస్తకం ఇంట్లో ఉంది అన్నాడు.”

గోపు నామానానికి నన్నువదిలేశాడు ఆ సమయంలో అదే క్షేమమనుకుని కాబోలు.

నేను నాగదిలోకి వెళ్ళిపోయేను.

000

కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను ఏం తోచక.

ఫ్రిబుయమే మాయింటిముందు కొంచెం ఎడంగా తచ్చాడుతున్నాడు. పది నిముషాలయేక గోపు బాస్కెట్ బాల్ తీసుకుని బయటికొచ్చేడు. రెండుసార్లు బంతి హూప్‌లోకి విసిరి, ఫిల్‌ని రమ్మన్నట్టు చెయ్యూపి బంతి విసిరేడు. ఫిల్ దానికోసమే ఎదురు చూస్తున్నట్టు ఎగిరి బంతి అందుకున్నాడు. చురుకైన కుర్రాడే. బంతి సునాయాసంగా హూప్ లోకి విసురుతున్నాడు. వారిద్దరిమధ్య మాటల్లేవు ఉండీ ఉడిగీ గుడ్, వవ్ లాటి ఊతపదాలు తప్పిస్తే, మనిషికీ మనిషికీ మధ్య ఉదయించే స్పందన తప్పిస్తే.

గోపుకి నామనోవేదన అర్థం కాదు. వాడికి చాలా సులభంగా వచ్చేసింది ఈ జోడుగుర్రాలస్వారీ. ఈదేశంలో అడుగెట్టకముందే ఈదేశపు వ్యవహారాలూ ఆహారాలూ కరతలామలకం చేసేసుకున్నాడు సవ్యసాచిలా. మనదేశంలో ఇంగ్లీషుమీడియం స్కూల్లో తెలుగు పలికినప్పుడల్లా చీవాట్లు తింటూ, ఫైనులు కట్టుకుంటూ ఇంగ్లీషు పాండిత్యం సాధించేశాడు. కానీ ఎంత చెడ్డా దేశంలో ఉంటే ఎక్కడో అక్కడ తెలుగు వినిపిస్తూనే ఉంటుంది కనక వాడితెలుగు ఫిల్ ఇంగ్లీషుకన్నా చూపువాసి మెరుగు.

నాబాధ – పరాయిగడ్డమీద బతుకు వెళ్ళదీసుకుంటున్నప్పుడు భాషే మన సంస్కృతి. ఇల్లొక్కటే అది మనగల ప్రదేశం. తమ మట్టి కానిచోట తమ అస్తిత్వాలని నిలుపుకోడానికి ఆఖరిమజిలీ.

కిటికీలోంచి చూస్తున్నాను వాళ్ళిద్దర్నీ. తమ ఉనికి మరిచి హాయిగా ఆడుకుంటున్నారు. దేశం, భాష, తోలురంగు, నమ్మకాలు, ఆచారాలు – ఏవీ వారికి స్పృహ ఉన్నట్టు లేదు. కేవలం ఇద్దరు పిల్లలు – అంతే!

నామనసు అట్టడుగు అగాధాల్లోకి జారిపోతోంది. వీళ్ళిద్దరూ అమెరికన్ బంగారం పండించుకుంటారు. అందుకు సందేహం లేదు. ఉభయభాషాప్రవీణులు కూడా అవుతారు – కనీసం కడుపు మండినప్పుడు!

000

(తొలిసారి ఇంగ్లీషులో నా వెబ్ సైట్ thulika.net లో, సెప్టెంబరు 2002లో bilingual kid అన్న పేరుతో ప్రచురింపబడింది. దీనిమీద ఇతర సైటులలో చర్చలు జరిగేయి.­­ )

(జనవరి 9)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఉభయభాషాప్రవీణ”

 1. @ Brig (Dr) C V R Mohan లేదండీ, పేరుకి ఉభయభాషలూ నేర్పడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ ఒక్క ఇంగ్లీషుకే ప్రాధాన్యం ఇస్తున్నారని. … . 19వ శతాబ్దంలో అమెరికనులు నేటివ్ అమెరికన్లని హింసించేరు వారి భాష మాటాడరాదని. … thulika.net లో ఈ విషయంమీద నావ్యాసం http://thulika.net/2003March/Ed0303.html చూడండి.

  మెచ్చుకోండి

 2. తెలుగు మరిచిపోతున్న తెలుగువారు పశ్చిమ దేశాలలోనే కాదు ,
  తమిళనాడు , కర్నాటకం , మహారాష్ట్రం మధ్య భారతం , ఒడిస్సా ,పశ్చిమ బంగ్లా లోనే
  కాకుండా ఉమ్మడి సంపత్తి (కామన్ వెల్త్ ) దేశాలలోకూడా ఉన్నారు.
  ఇప్పుడిప్పుడే వీరి సంఖ్య ఆంధ్ర ప్రదేశం లో కూడా దినదినాభి వృ ధ్ధి అవుతోంది.
  ఉదాహరణ కి ప్రస్తుత ముఖ్య మంత్రి గారే ఉన్నారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.