ఆనేల, ఆ నీరు, ఆ గాలి కథాసంకలనం.

వేలూరి వేంకటేశ్వరరావుగారి ఆ నేల, ఆ నీరు, ఆ గాలి (కథాసంకలనం). 

మొదట చెప్పవలసినమాట ఇది సమీక్ష కాదు. సాధారణంగా డయాస్ఫొరా కథలనబడే కథలు, విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాసినకథలు, నేను చదవడం తక్కువే.  కారణం గట్టిగా చెప్పలేను కానీ చాలామటుకు ఆ కథల్లో నాకు  ఏమాత్రమూ అనుభవంలో లేని, అనుభవానికి రాని, వచ్చే అవకాశాలు లేని జీవనవిధానం, ఈతిబాధలూ చిత్రించడం అనుకుంటాను. ఆ కథల్లో భాష కూడా కొంత కారణమే నా విముఖత్వానికి. కానీ ఏటికీ కోటికీ ఓమారు ఓ సంకలనం నాచేతికొస్తుంది. వాటిలో కదాచితుగా కొన్ని కథలు నాకు నచ్చడం కూడా జరుగుతుంది.

వేలూరి వేంకటేశ్వరరావుగారు ఈమాట.కాంలోనూ ఇతర పత్రికలలోనూ రాస్తున్నవి చూస్తున్నా కానీ చదివినవి తక్కువే. ఈ సంకలనం నాచేతికొచ్చేక రవంత సందేహిస్తూనే చదవడం మొదలు పెట్టేను. వీటిలో నాకు కొన్ని నచ్చేయి. అంచేత సమీక్షలా కాక, ఈ సంకలనంలో కొన్ని కథలు తీసుకుని, అవి ప్రాతిపదికగా నా అభిప్రాయాలు కొన్ని ప్రతిపాందించాలనుకుంటున్నాను.

సమీక్ష కాదు కనక ఇది మంచికథ, ఇది మంచి కథ కాదు అంటూ నేను చర్చించబోవడం లేదు. దానికి కూడా కారణం చెప్తాను. కథకి ఇతివృత్తం ఎంత ముఖ్యమో చెప్పేవిధానం (శైలి) కూడా అంతే ముఖ్యం అనే నా నమ్మకం. మంచి ఇతివృత్తం తీసుకుని నేలబారుగా చెప్పుకుపోతే చదవలేం అని మీక్కూడా తెలుసు కదా. కానీ చెప్పడానికి ఏమీ లేకపోయినా కేవలం తమ వాక్చాతుర్యం, బాషాచాతుర్యంద్వారా పాఠకులదృష్టినాకట్టుకుని కథలు చెప్పగలరు కొందరు. అలాటి కథలు నాకిష్టమే. ఎందుకంటే, కథ ఒకొకప్పుడు కాలక్షేపం. నలుగురు స్నేహితులు కూచుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, నలుగురిలో ఏ ఒక్కరో ఆ గంటసేపూ తమసొంతం చేసేసుకుని హుషారుగా తాము నవ్వకుండానే మిగతా ముగ్గుర్నీ నవ్విస్తూ గడిపేస్తారు కదా. అలా ఉంటాయన్నమాట ఈ జాతికి చెందిన కథలు. అలా సమయాన్ని సొంతం చేసుకోడం వాక్చాతుర్యం గలవారికే సాధ్యం. వేలూరి వేంకటేశ్వరరావుగారికి వాక్చాతుర్యం పుష్కలంగా ఉంది. ఈ సంకలనంలో కొన్ని కథలు ఈ కోవకి చెందుతాయి. రచయిత వాక్చాతుర్యం అన్ని కథల్లోనూ కనిపిస్తుంది.

ఈ సంకలనంలో అంశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు. దేశంలో ఉన్నప్పుడు, వెనకటితరంజీవితం ఎలా ఉండేదో, ఆనాడు మనపెద్దలు ఎలాటి విలువలను ఘనంగా పాటించేరో చెప్పేవి కొన్ని, పురాణపాత్రలను తీసుకుని ఆధునికజీవితంమీద వ్యాఖ్యానాలు చేసేవి రెండోరకం, కేవలం కాలక్షేపం బఠాణీల్లా ఏదో ఒక చిన్న సంఘటనో సన్నివేశమో తీసుకుని సరదాగా కబుర్లు చెప్తున్నట్టు వర్ణించేవి కొన్ని.

కథ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే కథ అంటూ చట్రాలు బిగించుకుని, వాటిమధ్య కథని కుక్కి ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించడం నాకంతగా రుచించదు. దానివల్ల రచయిత సృజనాత్మకతకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నా నమ్మకం. వెంకటేశ్వరరావుగారు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చేరు ముందుమాటలో. అదే పద్ధతి అవలంబించేరు తమరచనల్లో. అంచేత వీటిని ఆదృష్టితోనే చూడాలనుకుంటున్నాను.

దేశంలో వెనకటితరం జీవితాన్ని చిత్రించే కథలు తరం మారినా, యాది. వీటిని నాస్టాల్జియాకథలు అనలేను. నామటుకు నాకు, ఇవి ఈనాటి పాఠకులకి, ముఖ్యంగా ఇంగ్లీషు చదువులు చదివిన యువతకి మాకాలం జీవనసరళి పరిచయం చేస్తున్నాయి అనిపిస్తున్నాయి.

యాది కథలో రచయిత తనకి ప్రాచీనసాహిత్యంతో గల పరిచయాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూనే, ఒక అతిముఖ్యమైన, సాంస్కృతికపరమైన విషయాన్ని పాఠకులముందుంచడం జరిగింది. ’యాస కాదు ముఖ్యం; ’’యాది” ముఖ్యం. యాది పోయిన్నాడు మనసాహిత్యం సోదిలోకి కూడా రాదు,’ అంటారు రచయిత. ఈ అభిప్రాయాన్ని నేను మరికొంత సాగదీసి భాషసంగతి కూడా అంతేనంటాను.

తెలుగుకథలు తెలుగులోనే, అంటే వీలయినంత తెలుగుపదాలు, నుడికారం, సామెతలూ, జాతీయం ప్రయోగిస్తూ  రాస్తే కథ రక్తి కడుతుందనీ, తెలుగు పాఠకుల మనసుల నాటుకుంటుందనీ చాలాకాలంగా చాలా చోట్ల చెప్తూ వస్తున్నాను. ఆమధ్య ఒక స్నేహితుడు ఒక కథ నాకు పంపినప్పుడు మనం తరుచూ వాడే తెలుగుమాటలు, బాగ్, సండేలాటి పదాలకి బదులు సంచీ, ఆదివారంలాటివి వాడొచ్చు కదా అన్నాను. నిజానికి ఆకథలో ఉన్న ఇంగ్లీషు తక్కువే అయినా, తెలుగు మాటలు ఉన్న చోట అవే వాడితే బాగుంటుందని ఎత్తి చూపడానికి ఆ సలహా ఇచ్చేను. ఆయన, ’’మరొక స్నేహితుడు అంత తెలుగఖ్ఖర్లేదు, మనం వాడే ఇంగ్లీషుమాటలే వాడితే బాగుంటుందని సలహా ఇచ్చేడని” జవాబు రాసేరు. అంటే తెలుగులో ఇంగ్లీషు అంత సర్వసాధారణమయిపోయిందన్నమాట. నిజానికి ఒకరకంగా వ్యావహారికభాష అంటే వ్యావహారంలో ఉన్నభాషే కనక గిడుగు రామ్మూర్తిపంతులగారిఅభిప్రాయానికి సరిపోతుందని కూడా వాదించవచ్చునేమో (హా హా). ఇదే డార్విన్ సిద్ధాంతం కూడానేమో, అంటే సత్తా ఉంటే పదాలు నిలుస్తాయి, లేని పదాలు నశించిపోతాయనీ. నిజానికి భాష సజీవం అన్న వాదన తీసుకున్నా, ఏ భాషలో గానీ కొత్తమాటలు వచ్చి చేరడం, వాడుకలో లేని పాతమాటలు కాలగతిలో మట్టి గొట్టుకుపోవడం మామూలే అని ఒప్పుకోవాలి కద. ఉదాహరణకి, ఇంగ్లీషులో కర్మా, యోగా, దాల్, మామూల్, లాటి పదాలు అలాగే చేరేయి. అలాగే తెలుగులో మధ్యయుగంలో తురుష్కులు మనకి పెట్టిన భిక్ష ఫిరంగి, కైజారు, కుర్తా, చోలీ లాటివి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఆయా సంస్కృతులలో ఆ వస్తువో, ఆ భావనో లేనప్పుడే ఆ కొత్తమాటలు తీసుకోడం జరిగింది. ఇప్పుడు మనదేశంలో వాడుకలో ఉన్న తెలుగు ఆనియన్ కట్ చేసి, సాల్టు, పెపర్ స్ప్రే చేసి … ఇలా ఉంది. ఇదే తెలుగులో ఉల్లిపాయ ముక్కలు తరిగి, ఉప్పూ, కారం చల్లి … అని రాయొచ్చు కదా అని నేనంటున్నాను. నా ఈ వాదనకి రెండు కారణాలు. గిడుగువారి రోజుల్లో సంగతి నాకు తెలీదు కానీ ఈతరంవారికి ఈ తెలుగుమాటలు ఉన్నాయని తెలీకుండా పోతున్నాయి. అసలిప్పుడే నాకథల్లోనే (అంటే నా తెలుగు అంతంత మాత్రమే కనక) నేను ఉపయోగిస్తున్న కొన్నిమాటలూ, సామెతలూ కొందరికి కొత్తగా ఉన్నాయంటే మరి సాహిత్యంలాగే భాష కూడా సోదిలోకి కూడా రాకుండా పోయే పరిస్థితి వస్తున్నట్టే కదా. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు లేరు. కానీ ఉంటే ఇదే మాట అని ఉండేవారని నా ప్రగాఢ విశ్వాసము! ముఖ్యంగా మనసంస్కృతీ, సంప్రదాయాలకి సంబంధించిన విషయాలు కథల్లో కనిపించాలి. ఈనాటి రచయితలు ఈ విషయం అంటే భాషని, నుడికారాన్ని పరిరక్షించే విషయం కూడా కథారచనలో ఒక అంగంగా స్వీకరించి కృషి చేయాలని నాకోరిక.

ఈసంకలనంలో పన్నెండు పంపులకథ అలాటిదే. ఆకథలోనే చూసేను “ఏరులూరు” అన్నపేరు “ఏళ్ళూరు” అయి “ఏలూరు” అయిందిట. దాన్ని “హేలాపురి అని పండితులెవరో సంస్కృతీకరించేరుట”. ఇలాటివి తెలుసుకోడానికి నాకు సరదాగా ఉంటాయి. నిజానికి ఈకథలో వర్ణనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి తెలుగుదనం ఉట్టిపడుతూను, అమరావతి కథల్లా.

అలాగే, తెలుగు నుడికారం, జాతీయాలూ (రెండూ ఒకటేనా, నాకు తెలీదు) కూడా మర్చిపోకుండా ఈనాటి కథల్లో దాచుకోడం, చాటుకోడం ఈనాటి సమాజంలో అవసరమయిపోతోంది రాను రాను. “దిష్టిపిడతల్లా”, “వస పోసినట్టు వాగే అత్తయ్య”, “కొబ్బరిపీచుతో ఇత్తడిబిందెలు తళతళా మెరిసేలా తోమడం” లాటివి చదువుతుంటే తెలుగుదేశం కళ్ళకి కట్టినట్టుంది నాకయితే. (ఇప్పటి హైదరాబాదు మాట కాదులెండి J).

తెలుగుకథల్లో ఇంగ్లీషుపదాలని హాస్యం సృష్టించుకోసం వాడడం మొక్కపాటి నరసింహశాస్త్రిగారి రోజుల్లో మొదలయింది.  తీన్ కన్యా కథలో ఇంగ్లీషు నవనాగరీకాన్ని ప్రతీకగా, వ్యంగ్యంగా వాడినట్టు అనిపించింది నాకు. ఆ కారణంగానే కావచ్చు (ఆమె నవనాగరీక అభిప్రాయాలు కూడా కావచ్చు) కథానాయకుడు ఇంగ్లీషులాటి తెలుగులో మాటాడిన అమ్మాయిని చేసుకోడానికి ఇష్టపడలేదు. అంటూ, అత్తగారూ – మారుతున్న ఆచారాలమీద, అక్కడిసంగతులూ, ఇక్కడిసంగతులూ ఓచోట చేర్చి చమత్కరించిన హాస్యకథ. మడి ఎందుకో సూచనప్రాయంగా చెప్పినా, పాఠకులని నవ్వించడమే ప్రధానంగా కనిపిస్తుంది.

ఆనేల, ఆ నీరు, ఆ గాలి నాస్టాల్జియా కథేమో అనుకున్నాను కానీ చదివినతరవాత నాఅభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. ఆనేలా, ఆగాలీ ఆనీరూ – వీటిమధ్య జీవితం ఇలా ఉండేదని చెప్పి ఊరుకుంటే నాస్టాల్జియా కథ అయి ఉండేది. కానీ ఆ నేల, ఆ నీరు, ఆ గాలి – వీటిప్రభావం మనిషిమీద ఎలా ఉంటుందో చెప్పడంలో రచయిత నేర్పు చూపించారు. “ఆ నేల అలాటిది, ఆమట్టిమీద కాలెట్టగానే మొత్తం మనిషే మారిపోయేడు” లాటి వ్యాఖ్యానాలు మనం వింటూనే ఉంటాం. ఆ అంశాన్ని రచయిత తెలుగుకథగా మలిచినతీరు బావుంది. అంటే శీర్షిక చూసినప్పుడు నాకు కలిగిన అభిప్రాయం కథ చదవడం పూర్తయేసరికి మారిపోయింది. ఇది మంచికథ లక్షణాల్లో ఒకటి.

ఈకథలో ఉన్న రెండో గుణం పురాణపాత్రలని వాడుకున్నతీరు. మళ్లీ నాఅభిరుచులప్రస్తావన తేవాలిక్కడ. సాధారణంగా పురాణపాత్రలని తీసుకుని ఈనాటిఅభిప్రాయాలని వాటికి అంటగట్టి రాసినకథలు నాకంతగా రుచించవు. అసలు ఇలా పురాణపాత్రలని తీసుకుని తిరగరాసినందువల్ల కథకి అదనంగా చేకూరే మేలు ఏమిటి అని నాకు చాలాకాలంగా సందేహం కూడాను. బహుశా పరాయిదేశంలో ఆ నేల, ఆ నీరు, ఆ గాలి అనేవి ఏ కాలంలోనూ వ్యక్తులని తమని తాముగా ప్రవర్తించనీయవు అని చెప్పడానికేమో.

మొత్తంమీద కథలలో కావలిసినంత వైవిధ్యం ఉంది. అంచేత, ఈ సంకలనం చాలామందిని ఆకర్షిస్తుంది. మొత్తం పాఠకులోకాన్నంతటినీ అని చెప్పలేను కానీ, ఏ ఒక అంశం తీసుకున్నా, నాలుగైదు కథలు ఆ ఆంశంమీద ఉంటాయి కనక మొత్తం సంకలనం అనేకమంది పాఠకులదృష్టిని ఆకర్షిస్తుందనుకుంటాను.

ఈ సంకలనంలో నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నది రచయిత తన తెలుగుమాష్టారిగురించి రాసిన వ్యాసం. అలాటి మాష్టారులు ఆరోజుల్లో ఉండేవారు. వేంకటేశ్వరరావుగారు ఆ గురువుగారిని ఆప్యాయంగా స్మరించుకోడం కూడా ఆనాటి విలువల్లో ఒకటి. కేవలం తద్దినం పెట్టినట్టు తలుచుకుని ఊరుకోడమే కాక, ఆనాటి పాఠాలు గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఈనాటి కథల్లో చొప్పించి మనందరికీ మరోసారి తెలుగుదనం అందించడం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు అలాటి మేష్టారులు కనిపించడంలేదు. ఉండే ఉంటారు కానీ ఇలా గుర్తు పెట్టుకు తెలుగుభాషని వాడుకోడం తక్కువగానే ఉంది. అందుకే అంటున్నాను. ఈనాటి కథారచయితలు ఆ తెలుగు మాష్టారులకర్తవ్యం కూడా తమబాధ్యతగానే స్వీకరించాలి. లేకపోతే, “సారీ టై చేసుకోడం” అంటే చీరె కట్టుకోడం అని ఎలా తెలుస్తుంది? చెప్పండి :p). వారాలకీ, అంకెలకీ తెలుగు మాటలున్నాయనీ, సండే మండే, ఫోరూ, సిక్సూ తెలుగు మాటలు కావనీ తెలీకుండా పోయే రోజులొచ్చేస్తున్నాయి. అన్నట్టు సంక్రాంతి పండుగొచ్చేసింది. మీరు హాపీ పొంగల్ అన్న పదాలు చూస్తే నాకు బాధేస్తుంది.

ప్రచురణ

నవోదయ పబ్లిషర్స్,

ఏలూరు రోడ్డు, విజయవాడ.

(జనవరి 13, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఆనేల, ఆ నీరు, ఆ గాలి కథాసంకలనం.”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.