స్వీయచరిత్ర, రాజశేఖరచరిత్ర

స్వీయచరిత్ర నూటికి నూరు పాళ్ళు నిస్సంగతతో రాయడం సాధ్యం కాదు. ఎంతో కొంత అహం తెలిసీ తెలియకా వెలికి రాక తప్పదు ఆ రచనలో. వీరేశలింగంగారు కూడా తన స్వీయచరిత్రకి ముందుమాటలో ఈవిషయం ప్రస్తావించేరు. స్వీయచరిత్ర సొంత బూరా వాయించుకుంటున్నట్టు ఉండకూడదు. అలాగని అతిమర్యాదలకి పోయి తాము సాధించిన ఘనవిజయాలు తక్కువ చేసి చెప్పడం కూడా న్యాయం కాదు. ఈ రెంటికీ అతీతంగా సున్నితంగా కథ నడుపుతూ, తాను చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రతిపాదించగలగాలి రచయిత.

స్వీయచరిత్రల్లో సత్యాన్ని పరిపూర్ణంగా పట్టుకోడం కష్టం. అంటే అది గ్రంథకర్త దోషం  అనడంలేదు నేను. అది మానవనైజం, లేదా మనిషితత్త్వంలో లోపం అనుకుందాం. రాసేవారికీ, చదివేవారికీ కూడా వర్తించే లోపం ఇది. అంచేత నాకు స్వీయ చరిత్రలంటే అట్టే ఆసక్తి లేదు. ఈమాట మనసులో నస పెడుతున్నా, పని గట్టుకుని కందుకూరి వీరేశలింగంగారి పుస్తకాలు రెండు – స్వీయచరిత్ర,, రాజశేఖరచరిత్ర చదివేను ఈమధ్యనే. నిజం చెప్పాలంటే ఇవి రెండూ ఇ-రీడరులో చదువుకోడానికి అనువుగా దొరకడమే నేను చదవడానికి ప్రధానకారణం. రెండోది, అనేకమంది పాఠకులూ, పండితులూ ఎంతగానో మెచ్చుకుంటున్న ఈ రెండు రచనల్లోనూ నాకు నచ్చేది కూడా ఏమైనా కనిపిస్తుందేమోనన్న కుతూహలం.

వీరేశలింగంగారి స్వీయచరిత్ర చదివేక నాకు ఆయనజీవితంగురించిన అవగాహన అట్టే కలక్కపోయినా, ఆనాటి తెలుగువారి ఆలోచనల తీరుతెన్నులూ, కొన్ని ఆచారాలూ, మరిన్ని తెలుగు పదాలూ తెలుసుకోడానికి బాగా ఉపకరించింది.

వీరేశలింగంగారికి చిన్నప్పటినుండీ అబ్బనాకారిట. కొన్ని రుగ్మతలకారణంగా చదువు కుంటుపడుతూ వచ్చినా, క్లాసుకి వెళ్ళినప్పుడు మాత్రం బాగానే నెగ్గుకొచ్చేరు. చిన్నప్పటినుండీ ఋుజువర్తనమీదా, న్యాయంమీద అపారగౌరవం. తాను అబద్దాలు చెప్పరు. చేసిన తప్పులని ఒప్పుకుంటారు. ఛాందసాచారాలని గర్హిస్తారు, నీతిని హర్షిస్తారు. ప్రతివిషయంమీద నిర్దిష్టమైన అభిప్రాయాలు గలవారు.

తన తల్లిగారివిషయంలో చెప్పిన ఒకటి, రెండు అంశాలు నాకు ఆసక్తికరంగా అనిపించేయి. ఆస్తులు హరించుకుపోయినతరవాత పెత్తండ్రి ఆయన్నీ, తల్లీ తమయింటికి తీసుకెళ్ళి ఆయనఆలనా పాలనా చూసేరు. తల్లీ, పెత్తండ్రీ వీరేశలింగంగారికి చిరుతిళ్ళు పెడుతూ, ఆయన అనారోగ్యానికి మరింత కారణమయేరే కానీ అలాటి తిండివల్ల ఆరోగ్యం మరింత పాడవుతోందని గ్రహించలేదు.

పెదతల్లికి ఈయనంటే ప్రత్యేకాభిమానం. వీరేశలింగం పెంపకంవిషయంలో ఇద్దరికీ వాదోపవాదాలు జరిగేవి. తల్లీ, పెత్తల్లీ తరుచూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆ కారణంగా వారు వేరు పడడం జరిగింది. ఆడవాళ్ళు చదువుల్లేకపోవడంవల్లే “కలహించుచు, తిట్టుకొనుచు కాలము వెళ్ళబుచ్చుకొందురు,” అంటూ ఆయన తమవ్యాసాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకి ఇక్కడ ప్రారంభమయిందేమో అనిపించింది ఆభాగాలు చదువుతుంటే. అయితే, ఆయనకి చిన్నతనంలో చదువుయందు శ్రద్ధ లేకపోతే, ప్రోత్సహించి స్కూలికి తోలింది కూడా ఆ తల్లే. ఎన్నో కష్టాలు పడి తనని ఎంతో ప్రేమగా పెంచిందనీ కూడా రాసేరు.

అలాగే బార్య రాజ్యలక్ష్మమ్మగారిని గురించి కూడా ఉదాత్తమయిన మంచిమాటలే చెప్పేరు. రాజ్యలక్ష్మమ్మగారు ఒక వితంతు వివాహసమయంలో వంటబ్రాహ్మణుడు వంట చెయ్యనని లేచి పోతే, ఆవిడే “గోదావరినుండి నీళ్ళు మోచుకుని వచ్చి వంట మొదలయిన పనులెల్లను స్వయముగా చేసి యెంతో కష్టపడవలసినదయ్యెను. ఈ కార్యములందు నావలెనే నాభార్యయు బద్ధాదరము కలదయి, సర్వకష్టములను సంతోషపూర్వకముగా సహించి నన్ననుసరించుచు సహధర్మచారిణి యన్న పేరన్వర్థము చేయుచుండెను. నా భార్యయొక్క యానుకూల్యమే లేక యుండినయెడల నేనిన్ని కార్యములను నిరంతరాయముగా నిర్వహింపలేకయుందునేమో!” అని రాసేరు.

ఈవిషయంలో కనుపర్తి వరలక్ష్మమ్మగారూ, నార్ల వెంకటేశ్వరరావుగారూ కూడా వీరేశలింగంగారి అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చేరు “వీరేశలింగము, యుగపురుషుడు” అన్న సంకలనంలో. (నాదగ్గర ఈ పుస్తకం ఇప్పుడు లేదు కానీ నేను అనువదించిన ఈ భాగాలు ఇంగ్లీషులో నా తెలుగు రచయిత్రులమీద నేను రాసిన పుస్తకంలో 8, 9 పుటల్లో చూడొచ్చు.) స్థూలంగా, వీరేశలింగంగారు వితంతువివాహాలవంటి కార్యక్రమాలు చేపట్టినతరవాత, వాటికి నిరసిస్తూ ఊరివారు వారిని వెలి వేయగా, పనివారు కూడా పనులు మానివేస్తే, పంతులు గారు తీసుకొచ్చిన బాలవితంతువులు చిన్నపిల్లలు కనక వారిని అనునయించి, కావలసినవి అమర్చడం, ఇంటిపనీ, వంటపనీ, చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చుకోడంలాటి పనులతో అనేక బాధలు పడ్డారనీ, ఆపనులవల్ల కష్టంగా ఉందని చెప్తే ఆయన “చేయలేకపోతే పుట్టింటికి పొమ్మ”న్నారనీ రాసేరు.

వితంతువివాహాలు చేయించడంలో గల కష్టనష్టాలు చాలా వివరంగా రాసేరు వీరేశలింగంగారు. బంధుమిత్రులూ, అధికారులూ హర్షించకపోకపోయినా, ఆంక్షలు పెట్టినా, వాటన్నిటినీ తట్టుకుని, పట్టుదలగా తన ధ్యేయం సాదించుకోడం ఘనమైన విషయమే. అయితే, కేవలం వివాహం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని, వరులని ఒప్పించడానికి వారికి డబ్బూ, ఇళ్లూ, ఉద్యోగాలూ అమర్చిపెట్టేరు. డబ్బూ, ఇళ్ళూ లంచాలే. దరిమిలా కొన్ని మోసాలు కూడా జరిగేయని ఆయనే గుర్తించేరు. వితంతువులందరికీ పెళ్ళిళ్ళు చేసేయాలనే గానీ, వారికి చదువు, నిజంగా జ్ఞానాన్ని ప్రసాదించే విద్య, చెప్పించి వారివ్యక్తిత్వాలని తీర్చి దిద్దే ప్రయత్నం లేనట్టే కనిపిస్తోంది ఆ రోజుల్లో. ఇది సాధారణంగా సంఘసంస్కర్తలందరిలోనూ కనిపించే దోషమే. అంటే ఏదో ఒకే ఒక ధ్యేయం పెట్టుకుని, దానికి అనుబంధంగా ఉండే తదితర విషయాలని గుర్తించకపోడం. ఈవిషయంలో వారికాలంలోనే, పులుగుర్త లక్ష్మీ నరసమాంబగారూ, బత్తుల కామాక్షమ్మగారూ వంటి విదుషీమణులు ఆయనరచనలతోనే స్ఫూర్తి పొందినా, వారిని గుడ్డిగా అనుకరించక, తమదైన మార్గం చూసుకుని తమ వ్యక్తిత్వాలకి వన్నె తెచ్చుకున్నారు.

చదువుకోని ఆడవారిమీద ఆయనకి అట్టే గౌరవం ఉన్నట్టు కనిపించదు. చదువు అంటే ఇంగ్లీషు చదువేనని కూడా ఆయనఅభిప్రాయంలా కనిపిస్తుంది. ఆయన తలపెట్టిన ఒక వితంతు వివాహసందర్బంలో “వరుడు మొదటినుండియు పట్టణములోనుండి నాచేతశిక్షితుడయి ఇంగ్లీషు విధ్యాభ్యాసము చేసిన నవనాగరీకుడు; వధువు మొదటినుండియు పల్లెలలో గ్రామ్యజనులలో నుండి విద్యాగంధము లేక మోటుదేశములో పెరిగిన మృగప్రాయురాలు.” వారి దాంపత్యజీవితం సుఖవంతం కాలేదు. “నేను మొట్టమొదటనే యీ చిన్నదానిని వివాహమునిమిత్తమయి నావద్దకు వచ్చుచుండిన యొక మోటువానికిచ్చి వివాహము చేసియుండినపక్షమున, ఆ దాంపత్యము నిజముగానే సుఖవంతమయి యుండియుండును,” అంటారు వీరేశలింగంగారు. సంఘసంస్కరణలాటి బృహత్కార్యాలు తలపెట్టినప్పుడు ఎదురు చూడని అవాంతరాలు అనేకం ఎదురవుతాయి. ఆందులో ఆశ్చర్యం లేదు. ఆసందర్భంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు మాత్రం ఆశ్చర్యకరమే. ఈ సందర్భంలోనే ఆయన మరొక యువతిగురించి చెప్పిన కథ కూడా నాదృష్టిని ఆకట్టుకుంది. ఒక అమ్మాయికి ఆమె అన్నగారు వితంతువులు ధరించే చీర ప్రత్యేకంగా తెచ్చి యిచ్చేడు. ఆ అమ్మాయి తాను మళ్ళీ పెళ్ళి చేసుకుంటాననీ, ఆ చీరె వదినగారికి ఇవ్వమని చెప్తుంది. ఆయింట ఉన్న పెద్దలు, చదువుకున్నవారయిన మగవారు ఆమెని మళ్ళీ పెళ్ళి చేసుకోనివ్వలేదట. వారు ఆ అమ్మాయికి చెప్పి, అమలులో పెట్టిన పరిష్కారం – ఇంటనే ఉండి, వివాహముతో నిమిత్తము లేక ఇచ్చనచ్చిన వానితో స్వేచ్ఛగా విహరించవచ్చుననీ, నీ స్వైరిణీవిహారవ్యవహారమునకెవ్వరునూ అడ్డు రారనీ! తమ జీవితకాలంలోనే ఇలాటి మగవారిని చూసిన వీరేశలింగంగారు కేవలం ఆడవారే అజ్ఞానాంధకారంలో ములిగి పోయేరనీ, మగవాళ్లే వారికి విద్య గరపాలనీ అనడం ఆశ్చర్యం. మూర్ఖత్వం కేవలం ఆడవారిసొత్తు మాత్రమే కాదనడానికి ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి?

ఆరోజుల్లో భూత, ప్రేత పిశాచాలనమ్మకాలూ, ఆచారాలూ, ఇనుమును బంగారంగా మార్చే విద్యలూ,  లాటివిషయాలు కూడా చదవడానికి ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని వివరిస్తూ, వీరేశలింగంగారు తనకి వాటిల్లో నమ్మకాలు లేకపోయినా, తల్లిని సంతోషపెట్టడానికి వాటిని పాటించడం చూస్తే సంప్రదాయాలకి మనిషిమీద ఎంత పట్టు ఉందో ఋజువవుతోంది మరోసారి.

ఈ స్వీయచరిత్రలో చట్టాలూ, న్యాయస్థానాలూ అమలు పెట్టిన నీతుల, న్యాయాల తీరు నాకు కొత్తగా అనిపించలేదు. నూటముప్ఫై సంవత్సరాలతరవాత, అప్పటికీ ఇప్పటికీ న్యాయరక్షణలో ఏమీ మార్పు లేదని స్పష్టంగాలుస్తోంది. సాంఘికంగా, యాంత్రికంగా పురోభివృద్ధి చాలానే జరిగిందేమో కానీ మనిషి మనిషిగా ఎదగలేదు. మానవీయవిలువలనేవి పుస్తకాల్లోనూ, ఉపన్యాసాల్లోనూ మాత్రమే మిగిలేయి.

వీరేశలింగంగారు తనకీ కొక్కొండ వెంకటరత్నం పంతులుగారికీ స్త్రీవిద్య, వితంతువివాహాలవంటి విషయాల్లో పత్రికాముఖంగా వాదోపవాదాలగురించి రాసిన భాగాల్లో కూడా ఆయనకోణమే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తాను ఎంతో సంయమనంతో రాస్తుంటే, వెంకటరత్నం పంతులుగారు ఆవేశంతో రాసేరంటారు వీరేశలింగంగారు. ఒకానొక సందర్భంలో వెంకటరత్నంగారు వీరేశలింగంగారిని హేళన చేయడానికి తమ పత్రిక ముఖచిత్రం గణపతికి కొలువుగా నిలిచిన ఎలుక బొమ్మ ప్రచురించేరనీ, దానికి ప్రతిగా వీరేశలింగంగారు దానికి దీటుగా మరో బొమ్మ ప్రచురించేరనీ చెప్తూ, ఆచార్య నాయని కృష్ణకుమారిగారు “అలా ఒకరినొకరు హేళన చేసుకుంటూ రాయడం అలాటి మహానుభావులకే చెల్లింది” అని రాసేరు. అంటే ఇరుపక్కలా నిందలు సమానస్థాయిలోనే అన్న అర్థం వస్తోంది కదా.

ఈ స్వీయచరిత్రలో్ నాకు ఆసక్తి కలిగించిన మరోవిషయం ఆరోజుల్లో వేశ్యలస్థానంగురించి. పెళ్ళిళ్ళలో భోగం మేళం సర్వసాధారణమే అని తెలిసినా, ఈ పుస్తకంలో మరింత వివరంగా ఉన్నాయి. ఎంత తప్పనిసరి అంటే వాటికి ఎదురొడ్డి నిలిచిన వీరేశలింగంగారు కూడా ఆయనఆధ్యర్యంలో చేయించిన తొలి వితంతువివాహానికి భోగమేళం పెట్టించక తప్పలేదుట. పెళ్ళికి వచ్చిన అతిథులు ఆ మేళం కట్టిన వేశ్యలకి “ఒసగులు” వేయకపోతే మిగతావారు చులకనగా చూస్తారుట. ఆరోజుల్లో బాలికలపాఠశాలలంటే బాలికలని వేశ్యావృత్తికి అనుగుణంగా నేర్పించే విద్యలే, సంగీతం, నాట్యంలాటవి.

శ్రీరంగరాజ చరిత్రము నవలకి ముందుమాటలో గోపాలక్రిష్ణమ్మ సెట్టిగారు తనరచనలో కొన్ని ప్రబంధలక్షణాలు పాటించినట్టు చెప్పేరు. ఈనవల ఇప్పుడు ఎక్కడా దొరుకుతున్నట్టు లేదు కనక పూర్తిగా తెలీదు. నేను ఎక్కడ చదివేనో కూడా ఇప్పుడు గుర్తు లేదు కానీ ఆయన రాసిన ముందుమాట చదివినట్టే గుర్తు. అందులో ఆయన తనగ్రంథం నిజానికి సోనాబాయి అను లంబాడీ యువతికథే అయినా, గ్రంథానికి కథానాయకుడిపేరు పెట్టడం, సందర్భానుసారం విస్తృతమయిన వర్ణనలు చేయడంలాటివి ప్రబంధలక్షణాలకారణంగానే అని రాసేరు. బహుశా భాష కూడా తదనుగుణంగానే ఉందేమో. నిజానికి సోనాబాయి లంబాడీజాతికి చెందిన పడుచు కాదనీ, లంబాడీవారిమధ్య పెరిగిన రాచకూతురుగా, రంగరాజుగారి తప్పిపోయిన మేనగోడలుగా స్పష్టమవుతుంది. అంచేత ఇక్కడ కులప్రసక్తి లేదు. ఒకవేళ రంగరాజుగారు ఆమెని మొదట ప్రేమించినప్పుడు లంబాడీ కన్యగానే ఎరుగుదురు అనుకున్నా, మన వివాహసంప్రదాయాల్లో ఉన్నతతరగతి మగవారు కిందితరగతి స్త్రీలని వివాహం చేసుకోడం (అనులోమవివాహం) ధర్మసమ్మతమే. అంచేత అది ఆనాటి సంప్రదాయానికి విరుద్ధం కాదు. వీరేశలింగంగారు స్వీయచరిత్రలో శాఖాంతర వివాహం చేయించేరు. ఈనాడు వర్ణాంతర, జాత్యంతరవివాహాలు కూడా జరుగుతున్నాయి. బహుశా ఇదొక్కటే చెప్పుకో దగ్గ మార్పేమో.

Vicar of Wakefield  చదివినతరవాత, ఆ స్పూర్తితో రాజశేఖరచరిత్ర రాసేనని వీరేశలింగంగారు ముందుమాటలో రాసేరు. నేను ఆ నవల చదవలేదు కనక సామ్యాలేమీ చెప్పలేను కానీ, రాజశేఖర చరిత్రలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు బాగానే ఆవిష్కృతమయేయి. వీరేశలింగంగారిజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలూ, ఆయనవ్యక్తిత్వం, విలువలూ, కోరుకున్న సాంఘికాభివృద్ధి – ఇవన్నీ కూడా కథలో బలంగా చోటు చేసుకున్నాయి. అలా మనం అనుకోడానికి వీలుగా ప్రచురణకర్తలు నవలలో అవసరమనిపించిన చోటల్లో విస్తృతంగా నోట్సు రాసేరు. ఒకటి, రెండు చోట్ల అనవసరమనిపించే వ్యాఖ్యలు కూడా చేసేరు.

వీరేశలింగంగారి తాతగారిలాగే రాజశేఖరుడు ఆస్తిపరుడు. ఆయనలాగే దానధర్మాలు, ఒకొకప్పుడు అపాత్రదానాలు కూడా, చేసి, నిర్ధనుడయేడు. వీరేశలింగంగారిజీవితంలోలాగే కప్పలవలె ధనం ఉన్నప్పుడు రాజశేఖరుడిదగ్గర చేరడం, లేనప్పుడు ఎవరూ పలక్కపోవడంలాటివి జరిగేయి. తరవాత ఆయన సకుటుంబంగా కాశీ యాత్రకి బయల్దేరడం, మార్గమధ్యంలో దొంగలు ఎదురై, కొట్టి ఉన్న ధనం దోచుకోడం, రాజులు మారువేషంలో దేశసంచారం చేయడం, అమ్మాయి అబ్బాయిదుస్తులు ధరించి అబ్బాయిగా కొంతకాలం గడపడం, చని పోయేరనుకున్నవారు తిరిగి సజీవంగా ప్రత్యక్షమవడం – ఇలా సాగుతుంది నాటకీయంగా. వయసులో ఉన్నవారికి తగినవారిని చూసి పెళ్ళి జరిపించేయడంతో, సర్వే జనాః సుఖినో భవంతు అంటూ సంప్రదాయకంగా ముగుస్తుంది నవల. మనవాళ్ళకి అలవాటయిన భూతవైద్యాలు కూడా ఉన్నాయి. ఇది కూడా స్వీయచరిత్రలో కూడా ఉంది. అంచేత అంటున్నాను, ఏదో ఇంగ్లీషు నవల చదివి రాసేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవుసరం లేదు. కాకపోతే, ఆయనిష్టం అనుకోండి.

ఈనవలలో నాకు ప్రత్యేకంగా కనిపించింది ముందే చెప్పినట్టు, ఆనాటి భావజాలం, సంప్రదాయాలూ, అచ్చ తెలుగు పదాలు. ఒకచోట “ఎలుగు చేసుకుని” అని ఉంది. దానికి పరిష్కర్తలు ఇచ్చిన వివరణ ఎలుగు అంటే వెలుగు అంటే కంఠస్వరం అని. ఎలుగెత్తి పిలిచాడు అన్నవాక్యం నాకు పరిచితమే అయినా ఎలుగు అంటే గొంతు అని తెలీదు ఇంతవరకూ. అలాగే వేశ్యలకి ఇచ్చే “ఒసగులు.” బ్రాహ్మణుడికి ఇస్తే సంభావన, దక్షిణ, వేశ్యలకిస్తే ఒసగులు అన్నమాట. ఇలాటివి నాకు రెండు పుస్తకాల్లోనూ కనిపించడంతో కట్టకడపటివరకూ చదివేసేను రెండు పుస్తకాలూను.

(జనవరి 23, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “స్వీయచరిత్ర, రాజశేఖరచరిత్ర”

 1. తొలి నవల రాజశేఖర చరిత్ర (1878)కాదని ,
  శ్రీ నరహరి గోపాల కృష్ణమ శెట్టి విరచిత
  రంగరాజ చరితము లేక సోనా బాయి చరితము
  1872 లోనే ప్రచురించ పడినదని తెలిసింది.
  కానీ అందుబాటులో ఉన్నట్లు లేదు.
  తొలి యాత్ర చరితము(ట్రావ లాగ్) శ్రీ ఏనుగు వీరా స్వామి
  కాశి యాత్ర చరితము తొలి తెలుగు గద్య రచన అని తెలిసింది.
  మీ బ్లాగు చదవినందు వల్ల తెలిసుకున్న విషయాలు.

  మెచ్చుకోండి

 2. పింగుబ్యాకు: వీక్షణం-16 | పుస్తకం

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s