మొక్కపాటివారి బారిష్టర్ పార్వతీశము నవలద్వారా తెలుసుకున్న వింతలూ, విశేషాలూ!

ఓం ప్రథమంగా – నేను ”బారిష్టర్ పార్వతీశము అను గొప్ప హాస్యనవల” అను అంశమ్మీద ఉపన్యాసం ఇవ్వబోవడంలేదు. నిజానికి నేను కూడా మొదట్లో దీన్ని హాస్యంగానే తీసుకుని నా ఊసుపోకధారలో ఆషామాషీగా రాద్దాం అనుకున్నాను. కానీ ఈ రచయితగురించీ, నవలగురించీ వివరాలకోసం వెతకడం మొదలెట్టేక, ఇది చాలా సీరియస్ విషయము అని తోచింది. అంచేత, హాస్య విశ్లేషణ మానేసి, నేను ఈనవల చదువుతున్నప్పుడు నాక్కలిగిన కొన్ని అభిప్రాయాలు చెప్తాను.  

బారిష్టర్ పార్వతీశం – నోట్లో మాట నోట్లో ఉండగానే, మాట పూర్తికాకముందే, “అవునౌవును, గొప్ప హాస్యనవల” అనేస్తారు తెలుగుసాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నవారైనా. నరసింహశాస్త్రిగారు కూడా అదే అన్నారు, తనని తాను పరిచయం చేసుకుంటే, “ఎవరీయన?” అన్నట్టు మొహం పెట్టేవాళ్లు కూడా బారిష్టర్ పార్వతీశం పేరు చెప్పగానే, ఆహా, తెలీకేం అని అంటారని(http://www.youtube.com/watch?v=Uh04ET45HtI 1971 లో నరసింహశాస్త్రిగారితో ఇంటర్వ్యూ, 2012.)

నిస్సందేహంగా ఇందులో హాస్యం ఉంది, పుష్కలంగా ఉంది కానీ ఇది కేవలం హాస్యనవల మాత్రమే, నవ్వుకోడానికీ, నవ్వించడానికీ మాత్రమే అనడానికి లేదు. ఆనాటి రాజకీయవాతావరణమూ, కోర్టు వ్యవహారాలూ, అప్పుడప్పుడే మొలకలెత్తి ననలు తొడుగుతున్న అభ్యుదయభావాలూ – మూడోభాగంలో అద్భుతంగా ఆవిష్కరించేరు రచయిత. రెండూ, మూడూ భాగాల్లో హాస్యం లేకపోయినా చదవడానికి ఇంపుగా ఉంది.

సూక్ష్మంగా చెప్పాలంటే, నేను ఈనవల ఆద్యంతం చదివేసేను కానీ ఆద్యంతాలే నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఆదిలో పార్వతీశం అమాయకత్వం, అయోమయం, అజ్ఞానంద్వారా మొక్కపాటి నరసింహశాస్త్రిగారు సృష్టించిన హాస్యం – నన్ను ఇంతగా నవ్వించిన నవల ఈమధ్యకాలంలో మరొకటి నాకు దొరకలేదు. కొన్ని చోట్ల గలగల నవ్వొచ్చేసింది. పార్వతీశం మద్రాసు వదిలి పడవెక్కి కొలంబో చేరి అక్కడినించీ లండనులో దిగింతరవాత మాత్రం వచ్చిననవ్వు తక్కువే. అదైనా చిరు చిరునవ్వు, అంతే. బహుశా ఆనాడు చాలా కొత్తగా అనిపించే అనుభవాలు ఈనాడు సర్వసామాన్యం కావడం ఒక కారణం కావచ్చు. పార్వతీశం మొగల్తుర్రులో బయల్దేరుతున్నప్పుడు కచికా, నాలుక గీసుకోడానికి తాటాకుబద్దలూ, మడతమంచం లాటివి మూట కట్టుకున్నాడంటే నవ్వొచ్చిందే కానీ “మరీ అంత చాదస్తం లేక అమాయకత్వం ఏమిటి, అసలు మడతమంచం ఎలా మూట గట్టుకున్నాడు?” లాటి  ప్రశ్నలు వేయడానికి లేదు. సైన్సు ఫిక్షనులో అసంభవం అన్నది లేనట్టే, హాస్యంలో కూడా అసంభవం లేదు. ఇలాటి ఆలోచనలు చేయగలిగిన రచయితని మెచ్చుకుని, హాయిగా నవ్వుకుని ఊరుకుంటాం. మధ్యలో ఒకచోట వీసా లేకుండా ఎలా వెళ్ళేడు అని క్షణకాలం అనుమానించేను కానీ తరవాత ఆయనే చెప్తారులే అనుకుని ముందుకు సాగిపోయేను. అనుకున్నట్టే, చివరభాగంలో  సమాధానం చెప్పేరు. రెండో ప్రపంచ మహాయుద్ధం వచ్చేకే వీసాగొడవలు కూడా వచ్చి పడినట్టు సూచించేరు. ఇది నిజమో, కథకోసం సృష్టించిన కల్పనో నాకు తెలీదు. కానీ చెప్పేను కదా మొదటిభాగం చదువుతూ మనసారా అట్టహాసంగా (వికటాట్టహాసం కాదులెండి) నవ్వుకున్నాను.

ఇంతకీ, మొదటిభాగం అయిపోయేక, పోను పోను, ఆ ఊపు తరిగి, ఆహా అనో హీహీ అనో అనిపించింది. కొన్నిచోట్ల అల్పాతిఅల్పంగా చిరునవ్వు పెదాలమీదకొచ్చింది. అందుచేత ఈరచనని పూర్తిగా హాస్యరసప్రధాననవల అనుకోలేకపోతున్నాను. చివరిభాగాల్లో పార్వతీశం అనుభవాలదగ్గరకొచ్చేక  చదవడానికి మళ్ళీ సరదాగా అనిపించింది. లండను వెళ్లకముందు అతనిఅమాయకత్వం, తెలివితక్కువతనం, అజ్ఞానంవల్ల మరి కొన్నిచోట్ల అతితెలివితేటలవల్లా అతను చేసే చేష్టలూ, ఆడే మాటలూ నవ్వు పుట్టిస్తాయి. తిరిగొచ్చేక మాత్రం, హాస్యంకంటే ఎక్కువగా మనకి కనిపించేది – ఆ “ఇంగ్లీషుచదువు” ప్రభావంమూలంగా అతనికి కలిగిన నూత్నోత్సాహం, దేశభక్తీను. నిజానికి నరసింహశాస్త్రిగారి ప్రతిభకి ఇదొక నిదర్శనమేనేమో.

నరసింహశాస్త్రిగారు తాను మొదటిభాగం రాసినతరవాత కథ అయిపోయిందనే అనుకున్నారుట. కానీ ఆంధ్రజ్యోతివారు ఆకథలని ధారావాహికంగా ప్రచురిస్తూ, చివరలో “మొదటిభాగం సమాప్తం” అని ప్రకటించడంతో రెండోభాగం, తరవాత మూడోభాగం కూడా రాయవలసివచ్చిందని అన్నారు (ఇంటర్వ్యూ). ఆ తేడా అంటే –  స్వచ్ఛందంగా ఒక రచయితకి తనకి తానుగా రాయాలని అనిపించినప్పుడు రాసిన రచనకీ, మరొకరు రాయమన్నారని రాసిన రచనకీ మధ్య గల తేడా ఎత్తి చూపుతున్నట్టు అనిపించింది నాకు మొదటిభాగానికీ, రెండూ, మూడూ భాగాలకీ మధ్యగల అంతరం గుర్తించినప్పుడు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

పోతే, ఈనవలలో నాకు ప్రత్యేకంగా తోచిన కొన్ని సందర్బాలు ప్రస్తావిస్తాను. 1924లో బంధువులకి ఊసుపోకకి చెప్పేకబుర్లని కథలుగా రాస్తే బాగుండుననిపించి మొదలుపెట్టేరుట. దరిమిలా అవే ఆంధ్రజ్యోతిలో “బారిష్టర్ పార్వతీశం”గా ధారావాహికంగా ప్రచురణ అయేయి. ఇక్కడ ఆరుద్ర వ్యాఖ్యానం గమనార్హం. “ప్రథమభాగంలోనే ఒకపక్కే కనబడే చంద్రబింబంలాగ ప్రకాశిస్తుంది. తర్వాత భాగాలు వస్తాయన్న ఆశ చాలాకాలందాకా మృగ్యాలు. శాస్త్రిగారు ఉత్తరోత్తరా మిగతాభాగాలు పూర్తి చేశారు. చేయనంతకాలం చేస్తే బాగుండుననిపించే పనులు చేశాక ఇవ్వవలసిన తృప్తినివ్వవు,” అన్నారు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, సం. 4. పు. 351.) (నా “ఊసుపోక”లాగే, హీహీ). నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే.  ఆదిలో ఉన్న హాస్యం ఆతరవాత ఏష్యం అయిపోయింది. నేననుకుంటున్న మరో కారణం – గత 20 ఏళ్ళలోనూ కోకొల్లలుగా వచ్చి పడ్డ పుస్తకాలు – నావిదేశయాత్ర, నాఅమెరికాయాత్ర, నా అమెరికాఅనుభవాలు లాటివి కావచ్చు. బారిష్టర్ పార్వతీశంలో మధ్యభాగం – పార్వతీశం లండనులో దిగినదగ్గర్నుంచీ, మళ్ళీ తిరుగుప్రయాణానికి పడవెక్కేవరకూ జరిగిన సంఘటనలు – కనీసం ఇప్పటివాళ్ళకి కొత్తగా, ఉత్సాహకరంగా అనిపించవు. నాకనిపించలేదు.

పాత్రచిత్రణ విషయానికొస్తే, పార్వతీశంపాత్ర అద్భుతంగా ఉందని ఒప్పుకోకతప్పదు. మూడు భాగాల్లోనూ కూడా వాస్తవికత కనిపిస్తుంది. స్త్రీలపట్ల పార్వతీశం ఆలోచనలూ, అభిప్రాయాలూ, ప్రవర్తనా, – అతను లండనులో ఉన్నప్పుడూ, తిరిగొచ్చి, పెళ్ళయినతరవాత భార్యతో ప్రవర్తించే తీరు – ఈరెంటిలో వ్యత్యాసం ఎత్తి చూపడంలో గొప్ప నేర్పు చూపించేరు రచయిత.

లండనులో తెల్లజాతి అమ్మాయితో అతనిఅనుభవాలు సాధారణంగా అందరూ ఊహించేతీరులోనే ఉంటాయి. అతనిప్రవర్తన కూడా అంతే. తన హైందవసాంప్రదాయంమేమీ అతనికి ఆటంకం కాలేదు. కదాచితుగా కించిత్ ఆలోచనలో పడ్డా అదేమంత పెద్దవిషయంలా కనిపించదు. తిరిగొచ్చేక, ఇంట్లోవాళ్లు పెళ్ళి ప్రస్తావన చేసినప్పుడు కొంత ఆధునికభావాలు వ్యక్తం చేస్తాడు. తీరా పెళ్ళికూతురిని చూసినతరవాత తన అభిప్రాయాలూ, ఆశయాలూ కొంత సడలించుకుంటాడు. అది కూడా మామూలే. నేను ఇక్కడ ప్రత్యేకించి చెప్పబోయేది – పెళ్ళి అయినతరవాత వారిద్దరి హావబావాలూ, ప్రవర్తనా – అవి మాత్రం అచ్చు తెలుగులోగిళ్ళ నిత్యా జరిగేతంతు అత్యంతవాస్తవంగా వర్ణించేరు రచయిత. ఇది – ఏ దేశానికి తగిన వాతావరణం ఆదేశంలో ఆవిష్కరించగలగడం – రచయిస్ఫూర్తికి తార్కాణం. అంచేత రెండోభాగంలో పార్వతీశం అనుభవాలు చదువుతున్నప్పుడు సరదాగా లేకపోయినా, మూడోభాగంలో ఈ తేడా కనిపించడంతో, ఈ రెండు సందర్భాలూ పోల్చి చూసుకోడానికి పనికొచ్చేయన్న తృప్తి కలిగింది. ఇక్కడ మరోవిషయం కూడా చెప్పాలి. ఈ రెండు సందర్భాలలోనూ కూడా కథకుడు తనకి తానై “చూసేవా తేడా?” అంటూ స్వకీయమైన వ్యాఖ్యానించకపోవడం విశేషం, మంచిరచయిత లక్షణాల్లో ఒకటి. పాఠకుడే చూసుకోవాలి ఇలాటిసూక్ష్మవిషయాలు.

అలాగే లండనులో ఉన్నప్పుడు పార్వతీశం తెలిసీ, తెలికా అక్కడిమర్యాదలు అతిక్రమించడం జరిగినా, తోటి భారతీయుడు మరొకడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చిరాకుపడతాడు. తనస్నేహితుడు చెప్పిన నీతులన్నీ మరచి, తాను రోడ్డువార “అవశిష్టాలు” తీరుచుకున్న సంగతి మరిచి, మరొక అబ్బాయి ముక్కుపొడం ఓ పట్టు పట్టి, ఆ చేతులు గోడలకీ, సీటులకీ రాచుకుంటున్నాడని విసుగు ప్రదర్శించడం చూస్తే, మానవనైజంమీద రచయిత పరిశీలనాదృష్చి కనిపిస్తుంది. ఇక్కడ కూడా కథకుడు కలగజేసుకుని “చూసారా, అతనికి తనప్రవర్తన గుర్తులేదు,” లాటి వ్యాఖ్యానాలు చెయ్యడు. మంచికథ లక్షణాల్లో ఇదొకటి.

స్త్రీపాత్రలని బలమైనపాత్రలగా సృష్టించడం మరొక విశేషం. పార్వతీశంభార్య సరస్వతికి 14 ఏళ్ళు పెళ్ళినాటికి. ఇంకా పసితనం వదలనట్టే లెఖ్క. వారిద్దరిమధ్య అనురాగం, ఆ తరవాత ఆమె కాపురానికి వచ్చినతరవాత, ఆమె అలవరుచుకున్న జాణతనం వాస్తవికతతో కూడుకున్నది. మద్రాసులో కాపురం పెట్టేక, పార్వతీశం ఆనాటి రాజకీయాల్లో పడి, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నప్పుడు, తను కూడా అలాటి కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించి, ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది. ఆవిషయం పార్వతీశానికి ఒకరోజు ఇంటికి త్వరగా రావడంతో తెలుస్తుంది. అతనలా త్వరగా వస్తాడని తెలియని సరస్వతి అరుగుమీద కూర్చున్న భర్తని చూసి, “అయ్యో, నాకు తెలీదు మీరు ముందుగా వస్తారని” అని గబగబా లోపలికి వెళ్లి, దీపారాధన చేసి, బయటికొచ్చి, జ్వరపీడితుడైన భర్తని లోపలికి తీసుకెళ్ళి, వేడి వేడి కాఫీ యిచ్చి సకలోపచారాలు చేస్తుంది. ఈ ఘట్టం నాకు నచ్చింది. ఇది తెలుగుసంప్రదాయంలో ఒక గొప్ప అధ్యాయం, ఒకరకం జాణతనం –  “మీరు ఇంటిపట్టున ఉండడంలేదు, నన్ను పట్టించుకోడంలేదు” అంటూ రచ్చ చెయ్యకుండా, తన వ్యక్తిత్వాలనీ, చిత్తస్థైర్యాన్నీ ఋజువు చేసుకోడం.

ఆనాటి రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించిన దువ్వూరి సుబ్బమ్మ వంటి తెలుగువనితల ఘనత కథలో చక్కగా వాడుకున్నారు. సహాయనిరాకరణోద్యమంలో, ఇతర కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొన్న దువ్వూరి సుబ్బమ్మగారు వితంతువుట. ఏదోసభలో పాల్గొన్నందుకు పోలీసులు పట్టుకుని కోర్టుకి తీసుకొస్తే, ముసుగు తొలగించి, “మనయిద్దరి తలలూ బోడులే” అంటూ జడ్డిగారూ ఏవిధంగానూ తనకంటే అధికులు కారని తెలిపేరుట! నాకు భలే నవ్వొచ్చిన ఘట్టాల్లో ఇదొకటి. నిజం మనుషులనీ, నిజ సంఘటనలనీ నవలల్లో చొప్పించడం సాధారణం కాదనుకుంటాను కానీ, సందర్భానుసారం వాడుకోడంవల్ల మాత్రం కథకి మరింత బలం వస్తుందనే నా నమ్మకం. అంచేతే, ఇక్కడ నవలలో భాగాలు ఉన్నవి ఉన్నట్టు ఇస్తున్నా.

దువ్వూరి సుబ్బమ్మ

అలాగే మరోసారి జైల్లో పాటలూ పద్యాలూ పాడుకుంటూ ఆనందిస్తున్న అబ్బాయిలని చూసి, ఎందుకలా చేస్తున్నారని ఆవిడ అడిగేరుట. దానికి మేం మగవాళ్ళం ఏదో సరదాగా పాడుకుంటున్నాం అన్నారుట. సుబ్బమ్మగారి సమాధానం చూడండిః

దువ్వూరి సుబ్బమ్మదవ్వూరి 2

మరొక స్త్రీగురించి కూడా ఇలాటికథే చెప్పేరు మరి అది కట్టుకథో, నిజమో నాకు తెలీదు కానీ మొత్తమ్మీద నరసింహశాస్త్రిగారు బలమైన, స్వతంత్రస్వభావాలు గల స్త్రీపాత్రలు సృష్టించేరన్నమాట ఒప్పుకుతీరాలి.

అంతర్జాలంలో పరస్పరవిరుద్ధమైన యథార్ధాలు కనిపిస్తున్నాయి. మీకెవరికైనా ఈ కిందివిషయాలు రూఢిగా తెలిస్తే, దయచేసి చెప్పండి.

1. ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యంలో నరసింహశాస్త్రిగారు 1972లో దివంగతులైనట్టు ఉంది. జాలంలో అనేక చోట్ల 1973 అని ఉంది. ఏది సరైన తేదీ

2. నరసింహశాస్త్రిగారు కూడా విశ్వనాథ సత్యనారాయణాగారిలా ముఖతః చెప్తుంటే, వేరేవారు గ్రంథస్థం చేసేరని విన్నాను. ఆ రాయసకాళ్ళెవరో చెప్తారా? (ఇది పరస్పరవిరుద్ధంకిందకి రాదులెండి. సమాచారసేకరణ మాత్రమే.)

(ఫిబ్రవరి 18, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “మొక్కపాటివారి బారిష్టర్ పార్వతీశము నవలద్వారా తెలుసుకున్న వింతలూ, విశేషాలూ!”

 1. 2013 లో మీరు రాసింది ఈ రోజే చూసాను.అందుకే ఇంత ఆలస్యం.బారిస్టర్ పార్వతీశం నవల మొదటి భాగాలే నాకు నచ్చాయి చివరి భాగం ,చాలా కాలం తర్వాత వచ్చింది నచ్చలేదు. బహుశా అందులో హాస్యం లేక పోవడం వల్ల అనుకొంటాను.బారిస్టర్ పార్వతీశం సినిమా కూడా వచ్చింది .మీకు తెలుసా.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. నిమ్మగడ్డ చంద్రశేఖర్, అలాగా. సరేనండి. ఎప్పుడైనా కావలిస్తే మీకు రాస్తాను. ఆవ్యాసం రాసినతరవాత మళ్ళీ అంతకుమించి ఏమీ చెయ్యడం లేదు. అవసరమైతే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను.

  మెచ్చుకోండి

 3. మాలతి గారు నమస్కారం,

  మీరు గత సంవత్సరం బారిస్తర్ పార్వతీశం గారి మీద పెట్టిన పొస్టు నేను ఇప్పుడే చదివాను. ఆయన గారి మనవడు (మొక్కపాటి శ్రీనివాసు) నా సహ ఉద్యొగి. ప్రస్తుతం ధిల్లీలో వున్నాడు. మీకు ఆయన గురించి ఏ వివరాలు కావాల్సినా నాకు మైల్ పెట్టండి. నేనైనా పంపుతాను లేదా అతనినే మీతొ మాత్లాదిస్తాను.

  మెచ్చుకోండి

 4. బారిస్టర్ పార్వతీశం కాలంలో భారతదేశం ఇంకా బ్రిటిష్ ఇండియా గానే ఉన్నది కాబట్టి అందరూ క్రౌన్ సబ్జెక్ట్ సే అవటం మూలాన భారతీయులు ఇంగ్లాండ్ వెళ్ళటానికి ఆరోజుల్లో వీసాల అవసరం లేకపోయుండవచ్చని అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 5. పింగుబ్యాకు: వీక్షణం-20 | పుస్తకం
 6. @ Narayanaswamy, అవునండీ, ముఖ్యంగా రెండోభాగం సాగదియ్యడం, పునశ్చరణ కాస్త ఎక్కవే అనిపించింది. మురారిగారి కథ నిజమేనన్నమాట.

  మెచ్చుకోండి

 7. ఇందాకనే కాట్రగడ్డ మురారిగారి ఆత్మకథ చదువుతున్నను. అందులో 1914 ప్రాంతంలో వారి పెదనాన్నగారు (పార్వతీశంలాగానే) ఇంట్లోంచి పారిపోయి ఇంగ్లండు వెళ్ళి చదువుకున్నారని రాశారు. పాస్పోర్టు వీసా అవసరం లేకపోవడమే గాక భారత రూపాయలు అంతర్జాతీయ విపణిలో బాగానే చెల్లుబాటయేవి లాగుంది. ఆ మధ్య చదివిన ఒక అమెరికను నవల్లో ఇంచుమించు అదే సమయంలో గ్రీసునించి అమెరికాకి వలస వెళ్ళిన పాత్రలు బయల్దేరేముందు బోలెడు డబ్బు ఖర్చుపెట్టి అప్పటికప్పుడు ఏవో తప్పుడు పత్రాలు సృష్టించుకున్నారు అని రాశాడు. మరి అవి ఏమి పత్రాలో? పార్వతీశం చివరిసారి చదివి చాలా ఏళ్ళయింది. స్పష్టంగా గుర్తు లేదు. చిరాఖు పుట్టించిన ఒక అంశం గాళ్ఫు ఆట గురించి పొడుగ్గా చెప్పారొకచోట. ఆసక్తి కలిగించిన విషయం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒక పాత్ర వారి ఇంగ్లండు రోజుల్లో.

  మెచ్చుకోండి

 8. బారిస్టరు పార్వతీశం నాకు చాలా ఇష్టమైన నవలల్లో ఒకటండి. చివర్లో మీరడిగిన రెండు ప్రశ్నల్లో ఒక సమాధానం కాస్త చెప్పగలను.. ఈ నవల మూడవ భాగం ఎక్స్టెన్షన్. (పత్రిక వారు పొడిగించమని అడిగితే రాసినది.) ఆ భాగం మొక్కపాటివారు చెప్తూంటే ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు రాసారు. మొదటి రెండు భాగాలూ ఎవరు రాసారో శర్మగారు చెప్పగలుగుతారు.

  మెచ్చుకోండి

 9. @ Sowmya, నీవ్యాఖ్య ఇప్పుడే చూసేను. ఎంచేతో స్పాంలోకి వెళ్ళిపోయింది. ఔచ్. అయితే, పాస్పోర్టు అక్కర్లేదు కానీ ఉంది కూడా అన్నమాట. బాగుంది. ఈనవలమీద నీకు ఇంకేమైనా ఆలోచనలుంటే తప్పకుండా రాయి. ఒక నవలకి హాస్యనవల అనో మరోడో ముద్ర పడిపోయినప్పుడు, మిగతా విషయాలు మర్చిపోతామేమో అనిపించింది. అంచేతన్నమాట ఇది రాసింది.

  మెచ్చుకోండి

 10. @ kapilram, అలాగేనండీ, రెండు వ్యాసాలూ కూడా తీసుకోండి. మర్యాద పాటించి నాకు తెలియజేసినందుకూ, మీరు ఈవ్యాసాలని మరింత వ్యాప్తిలోకి తెస్తున్నందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 11. తక్కిన విషయాల గురించి వీలైతే మళ్ళీ వ్యాఖ్యానిస్తాను కానీ, వీసాలు మాత్రం మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వచ్చాయట.
  “Visas were not generally necessary before World War I (1914–1918), but have since become standard, even while the initial fears of spying ceased with the end of the war.”
  http://en.wikipedia.org/wiki/Visa_%28document%29#History

  అది అటు పెడితే, సంబంధంలేని trivia: బెంగళూరు సమీపంలోని ముద్దెనహళ్ళి గ్రామంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మస్థలం ఉంది. అక్కడ ఇప్పుడో మ్యూజియం ఉంది. అందులో, ఎప్పటిదో 1900ల నాటి విశ్వేశ్వరయ్య గారి బ్రిటీష్-ఇండియా పాస్పోర్ట్ చూసినపుడు మహా థ్రిల్ అనుభవించాను 😛

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s