ఊసుపోక – సమకాలీనమూ, సర్వకాలీనమూ

(ఏన్నెమ్మకతలు 111)

సాహిత్యం ఎప్పుడు ఎలా సర్వకాలీనమవుతుంది? సర్వకాలీనము తప్పనిసరిగా కావాలా? అనేకానేకమంది, అంటే వేనవేలూ, లక్షలూ, కోట్లమంది ఒక పుస్తకం చదివితే, దాన్నిగురించి మాటాడితే, దానిమీద సమీక్షలపరంపర రాస్తే, ఆ రచయితని వేనోళ్ళ పొగిడితే అది అంతకంత ప్రాచుర్యం పొంది, సర్వకాలీనమయిపోతుందా? ఇంకో ప్రశ్న – పదిమంది నోటా నానుతూ ప్రబలిపోయే సాహిత్యమే ఆదరించదగిన, ఆస్వాదించదగిన ఉత్తమసాహిత్యమా?

మరి పాఠకులు మరిచిపోతున్న సాహిత్యంమాటేమిటి? నిన్నా మొన్నటివరకూ భండారు అచ్చమాంబగారి సాహిత్యసేవ ఎవరిదృష్టికీ ఆనలేదు. కనుపర్తి వరలక్ష్మమ్మగారిజీవితం ఎప్పుడు అంతమయిందో వాళ్ళకుటుంబంలోవారికే సరిగా తెలీదు! ఇహ ఆవిడ చేసిన సేవ సంగతి ఎంతమందికి తెలుస్తుంది? అలాగే, జి.వి. కృష్ణారావు, పూసపాటి కృష్ణంరాజు, కొడవటిగంటి – లేదండీ – కుటుంబరావు కాదు, ఆయనతమ్ముడు కృష్ణమూర్తి, నిడుదవోలు వెంకటరావు – ఇలా ఎందరో చెప్పుకోదగ్గ రచయితలగురించి ఈనాడు చాలామంది చెప్పుకోడం లేదు. అంతకంటే బాధాకరం – నేను తూలికలో ఇలా మరుగున పడిపోతున్నవారికథలు అనువదించి పెడితే, వాటికి ఆదరణ తక్కువే. కాళీపట్నం రామారావు, కొడవటి కుటుంబరావు, ముళ్ళపూడి వెంకటరమణ – ఈ పేర్లకున్నగిరాకీ అంతమంచి కథలూ రాసిన మరికొందరికి లేదు. అంటే నేను పాఠకులముందు ఉంచి ఈ కథలు కూడా చూడండి అంటే చూసేవారు తక్కువే. ఇది నామటుకు నాకు నీరసం కలిగించే విషయం.

“ఏ గతి రచియించి రేని సమకాలము వారలు మెచ్చరు గదా?” అని చామకూర వెంకటకవి నీరసపడిపోయి నాలుగువందల సంవత్సరాలకి పైనే అయింది. నిజానికి ఆయనకాలంలో ఎవరేం అనుకున్నారో నాకు తెలీదు కానీ ప్రస్తుతం ఆయనపేరు కొందరైనా – అటువంటి సాహిత్యప్రక్రియ ఆస్వాదించగలవారు, ఆసక్తిగలవారు ఆగ్రంథంగురించి చెప్పుకుంటూనే ఉన్నా, తక్కువే అని చెప్పుకోకతప్పదు. అంటే ఈనాటి పత్రికలూ, బ్లాగులూ, ఇతరమీడియాలలో విజయవిలాసం, మనుచరిత్రలాటి ప్రబంధాలమీద చర్చలు తక్కువే. చలం, కుటుంబరావు, విశ్వనాథ సత్యనారాయణ – వీరిరచనలు కూడా గుంపులుగుంపులుగా జనాలు పడీ పడీ చదవడంలేదు. మరి ఏవి సర్వకాలీనం? ఏలా సర్వకాలీనం అయేయి?

ఈరోజు ఏ సినిమానటి అదీ హిందీ సినిమానటి గురించి ఓ నాలుగు ముక్కలు రాసినా, ఆ నాలుగు ముక్కలకీ తగిలే చూపుల్లో సగం కూడా రావు పైన చెప్పినరచయితలగురించీ, వారి పుస్తకాలగురించి రాస్తే. మరోలా చెప్పాలంటే పాప్ సంస్కృతిగా పేరు తెచ్చుకుంటున్న రచనలు, కనీసం అన్ని రచనలూ సార్వజనీనం అనుకున్నా, తాత్కాలికం కూడానేమో అని అనిపిస్తోంది నాకు. ఇవాళ్టివిషయాలకి ఇవాళ ఆదరణ ఎక్కువ. న్యాయమే కూడాను. కానీ సాహిత్యపరంగా అవి సర్వకాలీనం అవాలంటే, వాటికి అంతకంటే మరేదో బలం కూడా ఉండాలి. ఆ బలం మౌలికమైన మానవీయవిలువలు ఆవిష్కరించడంద్వారా వస్తుందనుకుంటా. ఏకాలంలోనూ ఏదేశంలోనూ ఆదరించగల విలువలయితేనే తరతరాలా వాటికి ఆదరణ ఉంటుంది.

ఉదాహరణకి మన సాహిత్యంలో ఏవి సర్వకాలీనం అయేయి అంటే రామాయణం, మహా భారతం, భగవద్గీతలాటివే. వీటిల్లో కూడా ఎప్పటికప్పుడు కొత్తవ్యాఖ్యానాలతో, కొత్తకోణాలు ప్రతిపాదిస్తూ పాఠకులకి అందిస్తున్నారు రచయితలు. వాల్మీకి రామాయం చదివేవారికంటే విశ్వనాథ సత్యనారాయణగారి కల్పవృక్షమో, రంగనాయకమ్మ విషవృక్షమో చదివేవారే ఎక్కువ కాడానికి ఎక్కువ అవకాశం ఉంది కదా. ఎందుకంటే, వాటికి “పాప్”ని, అంటే ఈనాటి వేలాది పాఠకులని ఆకర్షించే లక్షణాలు ఉన్నాయి. వేరు వేరు కాలాల్లో వేరు వేరు కవులు అందుకే వాటిని తిరగరాసేరు, తమ సమకాలికుల అభిరుచులకీ, ఆచారాలకీ అనుగుణంగా, తమ సమకాలీకులు అర్థం చేసుకోగల అలంకారాల, పదవిన్యాసాలతో. కల్పవృక్షానికి బలం విశ్వనాథ సత్యనారాయణగారి శైలి, ఆవిష్కరించిన తీరూ అయితే విషవృక్షానికి వచ్చిన ఖ్యాతి ఆ రచయిత్రి సాంఘికదృక్పథం. అలాగే లత రామాయణం కూడాను. మరి వీటిలో ఏది కాలానికి నిలుస్తుంది అంటే, సుమారుగా నాఅభిప్రాయం, కల్పవృక్షమేనని. దానికి కూడా కారణం చెప్తాను. కొన్నివేల కాకపోతే కొన్ని వందలసంవత్సరాలుగా ప్రజానీకం ఆదరిస్తున్న విలువలు, సంప్రదాయాలూ గౌరవిస్తుంది కల్పవృక్షం. విషవృక్షం ఒక రాజకీయసిద్ధాంతాన్ని ఆశ్రయించినది. రాజకీయనినాదాలచరిత్ర చూస్తే, ఏ రాజకీయసిద్ధాంతమూ కూడా కాలానికి నిలవలేదన్నది స్పష్టమే. సిద్ధాంతాలు మేధకి సంబంధించినవి. ఆచరణలో పెట్టినప్పుడు కానీ ఆ సిద్ధాంతాల్లో ఉన్న లోపాలూ, అవకతవకలూ బయలుపడవు. మార్క్సిజం, కాపిటలిజం, సోషలిజం – ఏదో సమయంలో కంఠసోషలుగానే భాసించడం జరుగుతోంది. తెల్లారి లేస్తే, ఈరోజు తిండి ఎల వస్తుందనుకుంటూ మనుగడ సాగించేవారికి ఈ సిద్ధాంతాలు నీటిమీద రాతలు. ఇండియాలో రాచరికాలూ, తరవాత కంపెనీయుగం, ఆ తరవాత సోషలిజం, అమెరికాలో కాపిటలిజం – ఏదీ సామాన్యులకి చేసిన మేలేమి లేదు గట్టిగా ఆలోచించి చూస్తే. హుమ్. శాఖాచంక్రమణం అయిపోయింది. క్షమించాలి.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే సాహిత్యంలోనూ అంతే. ఒక పుస్తకం పాప్ సాహిత్యం అనిపించుకోడానికి సాగే తతంగం ఎలా ఉంటోందో చూస్తున్నాం కదా.

సరదాకి మరోసారి మననం చేసుకుందాం. ఒక మేధావో, నాఅంత మేధావి మరి లేడు అనుకునేవారో ఓ పుస్తకం పుచ్చుకు, “ఇంత గొప్ప పుస్తకం మును  రాలేదు, మున్ముందు రాబోదు, నభూతో నభవిష్యతి” అంటూ ఎలుగెత్తి చాటుతారు. మరో సాహిత్యప్రియుడు వెంటనే భారీఎత్తున ఓ సభ ఏర్పాటు చేసి, ఆ రచయితకి కాశ్మీరుశాలువ కప్పుతాడు. “ఛట్, వారు ఒక శాలువ కప్పితే మనం దుశ్శాలువలు రెండు కప్పుదాం,” అంటూ మరో సాహిత్యసేవకుడు హడావుడిగా హైదరాబాదు వెళ్ళి మరో మహా సభ ఏర్పాటు చేసి దుశ్శాలువలు కప్పుతాడు. ఆ రచయిత నాసాహిత్యప్రస్థానం అని వ్యాసం రాస్తాడు. దుశ్శాలువతోపాటు ఓ లక్షిద్దాం అని లక్షించి లక్షిచ్చేస్తారు డాలర్లు రూపాయలరూపంలో అమెరికాసాహిత్యసంఘంవారు. పత్రికలన్నీ ఫలానా రచయితని విచ్చు లక్షతో అమెరికా సాహితీవేత్తలు సత్కరించేరని ఘోషిస్తాయి మూకుమ్మడిగా. బ్లాగ్ మిత్రులూ, వారిమిత్రులూ యథాశక్తి వ్యాసాలు రాసేస్తారు ఆరచయిత సామర్థ్యాన్ని వేయినోళ్ళ పొగడుతూ. ఆవెంటనే వారి శత్రువులూ, ఆ శత్రువులమిత్రులూ రచయితనీ, రచయితని పొగడుతున్న వారినీ తెగడుతూ మరిన్ని వ్యాసాలు రాసేస్తారు తెగడుతూ. ఈ సాహిత్యహోమం హోరు చూసి, అమెరికాలో ప్రముఖ సాహిత్యసంఘం ఒకటి రచయితకి జీవితసాఫల్యపురస్కారం ప్రకటించేస్తుంది. దాంతో మరో సాహితీవేత్త ఆ రచయితకి సాహిత్య ఎకాడమీ ఎవార్డు ఇచ్చితీరాలని ప్రతిపాదిస్తారు. ఇహ పైమెట్టు జ్ఞానపీఠమే కదా. నేనిలా రాస్తున్నందుకు కోపం రావచ్చు కానీ నాకు శాలువలు కప్పినవారిలో, నన్ను సభలకి ఆఙ్వానించివారికి అసలు నాసాహిత్యకృషికి ఏమిటో, దానికి విలువ ఉందో లేదో అన్న ఆలోచన ఆవంతయినా లేకుండా, ఉదారంగా శాలువలు కప్పేస్తున్నారని గ్రహించిన తరవాత కలిగిన ఆలోచన ఇది.

అంతవరకూ నిద్ర పోతున్న లేదా ఆరచయితగురించిగానీ ఆపుస్తకం గానీ వినివుండని నాలాటి సామాన్య చదువరులు, మత్తు వదిలించుకుని, “ఇంతమంది పొగుడుతున్నారు, ఇందులో ఏముందో చూద్దాం” అని ఆ పుస్తకం కొంటారు. లేదా, “అందరూ కొంటున్నారు నేను కొనకపోతే నామోషీ” అని కూడా కొనొచ్చు. “లైబ్రరీ ఎడిషను నడవలో అందంగా అమర్చుకోవచ్చ”ని కొనవచ్చు. “నాకు సాహిత్యాబిలాష ఉందని మాఇంటికొచ్చినవాళ్ళకి తెలియాల”ని కొని పెట్టుకోవచ్చు. పుస్తకం.నెట్ లో ఈపుస్తకం కొన్నానని ప్రకటించుకోడానికి కూడా కొనచ్చు. “కొత్త పుస్తకాలేవైనా ఉన్నాయా?” అని అస్తమానం చంపుకుతినే మామయ్యకొడుక్కి ఎరువివ్వడానికి పనికొస్తుందని కూడా కొని పెట్టుకోవచ్చు. (ఈపుస్తకం చూసిన తరవాత మరింక నన్ను పుస్తకాలు ఎరువివ్వమని అడగడని ఏమూలో ఆశ కూడా కావచ్చు.) … ఇలా అన్నమాట కనీసం కొన్ని పుస్తకాలు బహుళప్రచారానికి నోచుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆధునిక విశ్వవిద్యాలయాల్లో బిజినెస్ పాఠాల్లో ఒకవస్తువుని అమ్ముకోడానికి ఏం చెయ్యమని చెప్తున్నారో అవన్నీ ఈనాడు సాహిత్యానికి ఆపాదించి ప్రచారం చేయడం జరుగుతోంది. సాహిత్యం ఒక కళ, కళ కళకోసమే అన్న సూత్రాలు మాయమయిపోయి, సాహిత్యానికి మూలసూత్రం ప్రచారం, అదొక వ్యాపారం అన్నది పరమార్థం అయిపోయింది. వ్యాపారం అనగానే అది తాత్కాలికం అని కూడా ఒప్పుకోవాలి.

పోతే, ఈ పాపు పుస్తకాలకి ప్రధానగుణం లేదా కేంద్రం, అంటే ఇంతమందిని ఆకర్షించి ఆకట్టుకోడానికి వాటిలో వస్తువు సమకాలీనసమాజం కావడం. సమకాలీనం అంటే ఈనాటి రాజకీయాలూ, సినిమాలూ, నాయకుల దురాగతాలూ, దుర్మార్గాలూ, వినాయకులఅవినీతులూ, వీటన్నటికీ మించిన ఘనాతిఘనమైన విషయం – స్త్రీ, పురుషసంబంధాలు, వారిమధ్య ఆకర్షణ – ఈ కథలన్నీ సమకాలీనపాఠకులని ఆకర్షిస్తాయి. వీటికి విలువ లేదని కాదు నా అభిప్రాయం. వాటికి సర్వకాలీనత – ఏ కాలంలోనైనా ఆదరణకి నోచుకోగల బలం – ఉంటుందా, లేదా అన్నదే నాప్రశ్న, ఎప్పుడు ఎలా సాధ్యం అని నేనడుగుతున్నాను.

ఇలా రాస్తుంటే నాకో ఓ చిన్న కథ స్ఫురిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఓ కథ రాసేస్తున్నా :p.

కాలం పాతికేళ్ళక్రితం అనుకుందాం. ఒకాయన మరొకాయనతో “ఇవాళ మీఆవిడని ఎవరితోనో ఏదో పార్కులో ఓ చెట్టుకింద చూసేను” అంటాడు. వెంటనే మొదటాయన ధుమధుమలాడుతూ ఆఘమేఘాలమీద ఇంటికొచ్చేసి, “ఏంటి ఎవరితోనో పార్కులూ, షికార్లూ, చెట్టుకింద సరసాలూ,” అంటూ హుంకరిస్తాడు. భార్య “అయ్యో, నాస్నేహితురాలు సుందరితో వెళ్లేనండి. ఎవరితో వెళ్ళేననుకుంటున్నారేమిటి?” అంటూ సంజాయిషీలిచ్చుకుంటుంది ఒణికిపోతూ. “ఓస్, అమ్మాయా,  ఆ దౌర్భాగ్యుడు నాకు ఆమాట చెప్పలేదు,” అంటూ చల్లబడిపోతాడు ఆయన. ఇది పాతకేళ్లకిందటి కథ. అదే ఈనాటి కథ అయితే, అమ్మాయి అయినా అపార్థాలకి తావుంది! ఈనాడు ఈ రెండోకథ గొప్ప సమకాలీనకథ కాగలదు. వేడి వేడి పకోడీల్లా పాఠకులు తినేస్తారు. కథఖ్యాతీ, రచయితఖ్యాతీ కూడా కార్చిచ్చులా వ్యాపించేస్తుంది. ఇదే కథ మరో్ పాతికేళ్లతరవాత అయితే, పాఠకులు, “ప్చ్, ఇలాటికథలు చాలా చూసేం” అని చప్పరించి, తీసిపారేస్తారు. అంటే, అప్పటికి ఈ ఆడా-ఆడా, మగా-మగా సంబంధాలు సరఫరా చేసే ఉత్సాహం, కుతూహలం, కొత్తదనం ఉండదు. ఉండదని కనీసం నేనిప్పుడు అనుకుంటున్నాను. అప్పటిసంగతేమో. ..  . అదీ సమకాలీనవస్తువులకుండే సత్తా. అంటే ఈ గే, లెస్బియన్ కథలు కాలానికి నిలవవు అని కాదు నేనుంటున్నది. నిజానికి ఈ కాలానికి నిలవడం అన్నది కొంతవరకూ రచయిత చాకచక్యంమీద ఆధారపడి ఉంటుంది. వస్తువుని రచయిత ఏ కోణంలో ఆవిష్కరించేడు, ఎంత బలంగా ఆవిష్కరించేడు అన్నదాన్ని బట్టి ఉంటుంది.

పోతే, పాఠకులు పుస్తకాలని ఆదరించే విధానంలో కూడా మార్పు వచ్చింది. ఎలా అంటే నేనూ, నారాతలూ, నాప్రాంతంవారి రాతలూ, నాకులంరచయితల రాతలు (కులవ్యవస్థని గర్హించేవారిలో కూడా ఈ కులాభిమానం కనిపించడం విశేషం.) – ఇవి కేంద్రం అయినంతగా రచయితని గౌరవించడం, అంటే నిజంగా రచనాసామర్థ్యం చూసి గౌరవించడం కనిపించదు. వారు చెప్తున్నదానిలో మనకి తెలీని కోణాలూ, తోచని ఆలోచనలు, లేదా కొత్త ఆలోచనలు కలిగించే గుణం ఉందా లేదా అన్న దృష్టి తక్కువా, మనం ఈ రచయితకి చెప్పగలదేమిటి అన్నయావ ఎక్కువా అయేయి. పాఠకులు తమకి స్ఫురించిన అభిప్రాయాలు చెప్పకూడదు అని అనడంలేదు నేను. ఏదో ఒకటి చెప్పడమే ప్రధానమయి, కేవలం “చెప్పడమే” జరుగుతోంది. అలాకాక తాము చెప్తున్నది చర్చకి సంబంధించినదా కాదా, అనుబంధంగా ఉందా లేదా అన్న ఆలోచన కూడా ఉంటే, చర్చ పక్కదారి పట్టి, రామక్కా అంటే తామరాకా అన్నట్టు తయారు కాదు.

ఇలా వస్తువుమీద చర్చ కేంద్రీకరించి ఎక్కువమంది ఒక కథ బాగుందనో, బాగులేకపోతే ఎందుకు బాగులేదనో చర్చ చేసినప్పుడు ఆకథకి ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంటుందని అభిప్రాయం. ఎందుకంటే, అలా చర్చించినప్పుడు కాలాతీతమయిన విలువలు చర్చించడం జరుగుతుంది కనక.

(ఏప్రిల్ 22, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s