ఊసుపోక – అనువాదప్రస్థానమను అనుభవాలూ, అభిప్రాయాలూ

(ఎన్నెమ్మకతలు 112)

నేను అనువాదాలు చేయడం మొదలుపెట్టి పన్నెండేళ్ళకి పైనే అయింది. ఈ పన్నెండేళ్ళలోనూ ఈ విషయంలో చాలామాటలే విన్నాను. ఉదాహరణకి, అందులో కొన్ని –

 • సొంతంగా రాయగలవాళ్ళెందుకు అనువాదాలు చేస్తారు?
 • అనువాదాలు ఫలానావారిని చెయ్యమంటే, “నువ్వే చేసుకో” అంటున్నారు. నాకెక్కడ తీరిక, నాకథలు రాసుకోడానికే నాకు టైం చాలడం లేదు. (ఇది కూడా పై అభిప్రాయానికి పర్యాయరూపం అనుకుంటాను).
 • ఏ రెండుభాషల్లోనో నాలుగు ముక్కలు వస్తే చాలు అనువాదం చేయొచ్చు. (ఇది విన్నప్పుడు 70వ దశకంలో ఏదో పత్రికలో వచ్చిన ఓ కార్టూను గుర్తొచ్చింది. ఓ తల్లి నాలుగోక్లాసు పంతులుగారితో అంటుంది, “మాఅమ్మాయి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్లేలా, అక్షరాలు నేర్పండి చాలు. కథలు రాసుకు బతుకుతుంది, అని.)
 • అనువాదం అంటే ముక్కస్య ముక్కకి సమానార్థకాలు కావలిస్తే నిఘంటువు చూసుకుని రాసేయడమే. అదే ఉత్తమపద్ధతి. ఇక్కడ మరో ఉపకథ – బ్రిటన్లో ఉండే ఒక ప్రముఖ అనువాదసంస్థ నాకో ఒక అనువాదప్రణాళిక ఒప్పచెప్పి, ఇలా చెయ్యమని సలహా ఇచ్చేరు. అలా చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెలిసి కూడా. నేను ఇలా అనుకోడానికి కారణం, వారే నాకు ఇచ్చిన ఉదాహరణ. ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కూడాను. వారితో నాకున్న కాంట్రాక్టుమూలంగా ఇంతకంటె ఎక్కవ వివరాలు ఇవ్వలేను కానీ వారి ఉదాహరణకి దీటురాగల మరో ఉదాహరణ ఇస్తాను. ఒకరోజు నా అమెరికన్ స్నేహితురాలు పక్కనుండగా, ఒక తెలుగమ్మాయి, ఏదో కథ చెప్తూ, “ఆయన హాండిచ్చేరు” అంది. వెంటనే నా అమెరికన్చెలి ఆ అమ్మాయి ఏం చెప్తోందని అడిగింది. “ he gave her a hand,” అన్నాను. తెలిసింది కదూ, అర్థం మారిపోయింది. అంచేత, వెంటనే మన తెలుగమ్మాయి, “అది కాదండీ, ఆయన నాచేత ఖాజా తినిపించేరు అంటున్నా” అంది. “నా మదర్ టంగు నాకు అదర్ టంగు,” అయిపోయిందని నాకప్పుడే అర్థమయింది. అంతవరకూ నాకు ఆ “జాతీయం”  తెలీదు. అన్నట్టు ఇది శాఖాచంక్రమణఁ కిందకి వస్తుంది. నేను మొదలు పెట్టిన నా హృదయబాధ ఇది కాదు కదా. సరే, మళ్ళీ ఆదినించీ మొదలు పెడతాను.

అనువాదాలు ఎందుకు చెయ్యడం, ఎలా చెయ్యడం అన్న విషయంలో ప్రస్తుతం మహోధృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సాహితీసంస్థలు ఏటా లేదా రెండోళ్ళకోసారి కాదా నాలుగేళ్ళకోసారి జరిపే సభల్లో తప్పనిసరిగా అనువాదవేదికకి ఓ పూట, ఓ గదీ, నలుగురు అనువాదవేత్తలనీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ప్రముఖ అనువాదకులూ, అనువాదాచార్యులూ, అనువాదభీష్ములూ అనేకానేక అనువాదరహస్యాలూ, చిట్కాలూ, తదితర కిటుకులు విశదం చేస్తున్నారు. పత్రికలు ప్రముఖంగా వాటిగురించి వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. తరవాత అవే పుస్తకరూపంలో కూడా భావి అనువాదకులకు అందించబడుతున్నాయి. అంచేత తెలుగు సాహిత్యచరిత్రలో అనువాదము ఒక ప్రముఖ ప్రక్రియ అనే అభిప్రాయానికి ఇప్పుడు వచ్చేను. మరి ప్రముఖప్రక్రియ అయినప్పుడు అంత తేలిగ్గా తీసిపారేయడం ఎందుకు జరుగుతోంది మరో పక్కన?

నేను మొదట్లో ఉదహరించిన వాక్యాలు విన్నతరవాత నాఅనువాదాలమీద నాకే నానమ్మకమ్ము వమ్ము అయినవెనుక, నాకు మళ్లీ ఉత్సాహం కలిగించినవి రెండు. మొదటిది, సుప్రసిధ్ద రచయిత, పూజ్యులు మునిపల్లె రాజుగారు నాకథలు మాలతి అనువాదం చెస్తే బాగుంటుంది అని ప్రకటించడం. ఇంతవరకూ, నాకు నేనై అడిగి పుచ్చుకు అనువాదాలు చేస్తున్నాను. నాకథలు చెయ్యండి అన్నవారి కథల్లో నాకు నచ్చినవి లేవు. అంచేత, రాజుగారికోరిక నాకెంతో ఆనందాన్నిచ్చింది. రెండోది, రెండురోజులక్రితం నాకళ్ళబడి, నాచేత చదవబడిన సింహాసనద్వాత్రింశిక. నిజానికి నేనింకా కథలన్నీ చదవలేదు. ఈ పుస్తకానికి గడియారం రామకృష్ణశర్మరాగు రాసిన పీఠిక చదివేను. అదే ఉంది అరవై పేజీలకి పైన.

ఆ పీఠిక చదువుతుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో చెప్పలేను. ఇదివరకోసారి నిడుదవోలు వెంకటరావుగారి గురించి ఎవరో అన్నమాట జ్ఞాపకానికొచ్చింది. వెంకటరావుగారు రాసే పీఠికలో ఎన్నో విశేషాలు విపులంగా చర్చిస్తారనీ, ఒకొకప్పుడు పుస్తకం కన్నా వెంకటరావుగారి పీఠికకే ఎక్కవ ఆదరణ లభిస్తుందనీ.

రామకృష్ణశాస్త్రిగారు తమపీఠికలో కొరివి గోపరాజు ఇంటిపేరు, కవికాలం, కవి పాండిత్యం ఇలా ఎన్నో విషయాలు చర్చించి, ఈ సింహాసనద్వాత్రింశిక సంస్కృతం విక్రమార్కచరిత్రకి అనువాదం అన్నారు. అయితే ఇది కేవలం అనువాదం అనడానికి వీల్లేదుట. తెలుగు పుస్తకంలో గోపరాజు తనకావ్యానికి ఉపయోగించుకున్న ఇతరగ్రంథాలు – కథాసరిత్సాగరం, పంచతంత్రంలాటివి ప్రస్తావించి, వాటికీ ఈ రచనకీ మధ్యగల వ్యత్యాసాలూ, గోపరాజు స్వయంప్రతిభ విశదం చేసేసమయాలూ కూడా రామకృష్ణశాస్త్రిగారు ఎత్తి చూపేరు. అంతే గాదు, గోపరాజు చేసిన మార్పులూ, చేర్పులూ -వీటివల్ల కొత్తగా సాధించింది ఏమీలేని సమయాలు చూపేరు. ఎందుకు అలా చేసేడో తెలీదని స్పష్టం చేసేరు. అలాగే, ఆయన చేసిన మార్పులవల్ల కావ్యం సంతరించుకున్న కొత్త అందాలు కూడా విశదీకరించేరు.

అది నాకు చాలా ఆనందం కలిగించింది. అంటే గోపరాజు రచనని మరొకరు తప్పు పట్టినందుకు కాదు నాఆనందం. అనువాదచరిత్రలో ఇలా సొంతతెలివితేటలు చూపింది నేనొక్కదాన్నీ కాదు, మొదటిదాన్నీ కాదు అని. ఇలా మార్పులూ, చేర్పులూ చేయడం అనూచానంగా వస్తోందని తెలిసి అన్నమాట నేను  బ్రహ్మానందపడిపోయింది.

అలాగే నన్నయ వ్యాసభగవానుడి భారతం తెలిగించేడు అన్నా, సాధారణంగా నన్నయ మహాభారతము అనే వాడుక. నిజానికి మహాభారతం నన్నయ ఒక్కడే రాయలేదు కదా. పూర్తి చేసినవారు మరో ఇద్దరున్నారు. కానీ బారతం అనగానే మనందరికీ తోచేది నన్నయే. ఎంచేతంటే, రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఆయన తెలుగుభాష గొప్పగా వాడుకున్నాడు. రెండోది, ప్రజలు మరిచిపోతున్న సనాతన ధర్మాలనీ, మౌలికమైన సమాజికవిలువలనీ ఆనాటి ప్రజలకి మరోసారి గుర్తు చెయ్యడంకోసం, వారికి అర్థమయేవిధంగా మార్పులు చేసి రాసేడంటారు. మళ్ళీ అనువాద ప్రక్రియ అంటే, కేవలం మక్కికి మక్కీ ఎక్కించేయడం కాదని మరోసారి చెప్పుకోవాలి మనం.

సింహాసనద్వాత్రింశికకి ముందు గీతాంజలి చదువుతుంటే కూడా నాకు ఇలాటి అనుమానమే వచ్చింది.  అందులో కొన్ని వాక్యాలు అద్భుతంగా అనిపించేయి. కొన్ని బావాలు అంతకంటే అద్భుతంగా అనిపించేయి. అప్పుడే నాకు అనుమానం వచ్చింది టాగోర్ ఇది అసలు రాయడమే ఇంగ్లీషులో రాసేడా, నేను చదువుతున్నది  అనువాదమా అని. వెంటనే వెతికితే, అట్టే శ్రమ లేకుండానే తెలిసిపోయింది ఆయన మొదట బెంగాలీలోనే రాసేడనీ, తరవాత తనే ఇంగ్లీషులోకి అనువాదం చేసుకున్నాడనీను.

మరి కొన్నిచోట్ల ఇంగ్లీషు వాక్యాలు నాకెందుకు అంతగా నచ్చలేదు అంటే, సొంత రచన అయినా కూడ బాష అలాటి గమ్మత్తులు చేస్తుంది. ఇది ఒకటి. రెండోది, నాకు అమెరికనింగ్లీషు అలవాటయిపోయి, బ్రిటిషింగ్లీషులో కొన్ని పోకడలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి అక్కడ for ever రెండు పదాలయితే మాకిక్కడ forever ఒకటే పదం. అలాగే copyright copy right, everyone every one, లాటివి. నిజానికి ఒకమాటని రెండు మాటలు చేస్తే అర్థాలు మారిపోతాయి కూడా ఒకొకప్పుడు. ఉదాహరణకి, Every body చూడండి. Everybody అంటే ప్రతి ఒక్కరూ. అదే విడదీస్తే, ప్రతి ఒక్క దేహమూ  (శవములాగ) అన్న అర్థం వస్తుంది. మూడోది, నాకు బెంగాలీ రాదు. అంచేత బెంగాలీలో ఆ రచన ఎలా ఉందో నాకు తెలీదు. అంటే నాకు తెలిసిన ఇంగ్లీషులో మాత్రమే నేను అర్థం చేసుకుంటున్నాను అని కదా. మరోలా చెప్పాలంటే, నేను అనువదించిన ఒక తెలుగుకథని తెలుగుపాఠకులు చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. తెలుగురానివాళ్ళు చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి వేరు కదా.

నేను అనువాదాలు మొదలు పెట్టినప్పటికంటే, ఇప్పుడు నాఅనువాదాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు కొందరు. దానికి కారణం నిజంగా నా సామర్థ్యం మెరుగుపడిందా, చదివేవారికి అలవాటయిపోవడమా అన్న సందేహం నాకింకా ఉంది. అంతే కాదు. నామీద ఏదోరకమైన అభిమానమో, జాలో ఏర్పడి కూడా, పాపం, బాగానే చేస్తోంది అనిపించవచ్చు.

ఇదంతా మొదలు పెట్టడానికి కారణం, పైన చెప్పిన రెండు పుస్తకాలే కాక, తూలిక.నెట్ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా, ఆ కథలూ, వ్యాసాలూ మరోసారి చూసి అక్కడ పెడుతున్నాను. రెండు రోజులక్రితం శ్రీదేవిగారి వాళ్ళు పాడిన భూపాలరాగంకి నా అనువాదం మరోసారి చూసుకుంటుంటే అనిపించింది. ఇప్పుడు నేను చేసిన మార్పులవల్ల అది నిజంగా మెరుగుపడిందా? లేక, డిల్లీనించి దేవగిరికీ, దేవగిరినించి ఢిల్లీకి మారినట్టు, ఏదో ఒక మార్పు మాత్రమే ముఖ్యం అని మారుస్తున్నానా అని. నిజానికి ఏనాడూ నూటికి నూరుపాళ్ళూ పర్ఫెక్ట్ అనువాదం అంటూ ఎక్కడా ఉండదేమో అని.

(మే 3, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక – అనువాదప్రస్థానమను అనుభవాలూ, అభిప్రాయాలూ”

 1. వాళ్ళు పాడిన భూపాల రాగం
  జీవితపు తొలి మెట్లు ఎక్కే టప్పుడు,
  తన చుట్టూ ఉన్న సమాజం నుంచే నేర్చు కోవాలి అన్ని.
  మంచి నడవడిక , చెడు అలవాట్లు ఆ సమయంలోనే పట్టు ఏర్పరచుకుంటాయి
  peers , వరిష్టులు, గురువులు మంచివారు దొరికితే జీవితంలో తప్పటడుగులు ఉండవు.
  కథ సర్వకాలీనము అందువల్లే సమకాలీనము.

  మెచ్చుకోండి

 2. పింగుబ్యాకు: Home | A p Net News .Com

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s