సారంగ పత్రికలో తూలిక.నెట్ ఇంటర్వ్యూ

తూలిక.నెట్ కి రానున్న జూన్ పన్నెంఢేళ్ళు నిండుతాయి. ఆ సందర్భంలో కల్పనతో నేను జరిపిన ఇంటర్వ్యూ  సారంగ పత్రికలో ప్రచురించారు. మీఅబిప్రాయాలు ఇక్కడ కానీ సారంగ పత్రికలో కానీ చెప్పవచ్చు.

————————-

పూర్తి పాఠం, సారంగ సౌజన్యంతో –

1.మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తూలిక ప్రయాణం ఎలా జరిగింది?

తూలిక మొదలు పెట్టినప్పుడు నాకేమీ పెద్ద ఆశలూ, ఆశయాలూ లేవు. అది కాకతాళీయంగా జరిగిందనే చెప్పాలి. 80వ దశకంలో యూనివర్సిటీలో ఉద్యోగం మొదలు పెట్టేక, South Asian conference లో పాల్గొనడం,  Journal of South Asian studies వారు వ్యాసాలో అనువాదాలో ఇవ్వమని అడగడంతో రెండు, మూడు కథలు అనువాదం చేసేను. తూలిక మొదలు పెట్టింది జూన్ 2001లో. దానికి కారణం కేవలం కొత్తగా వెబ్ సైటు చెయ్యడం నేర్చుకోడంవల్ల వచ్చిన ఉత్సాహం. అంతకుముందు, యూనివర్సిటీలో పని చేస్తున్నప్పుడు, అమెరికనులు మన సంస్కృతి, సాంప్రదాయాలపట్ల ఆసక్తితో అడిగే ప్రశ్నలు రెండో కారణం.  అనువాదాలూ, వ్యాసాలూ తూలిక.నెట్‌లో పెట్టడం ప్రారంభించేక, నా వ్యాసాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలలో తెలుగు పరిశోధకులు, తెలుగులు కానివారు చూడడం, వాటిని తమసైటుల్లో పెట్టుకోడం, రిఫరెన్సులివ్వడం చూసేక, క్రమేణా ఒక నిర్దుష్టమైన ధ్యేయం రూపు దిద్దుకుంది. అదేమిటంటే, మన కథలద్వారా విదేశీయులకి మనసంస్కృతిగురించి తెలియజేయడం అని.

తెలుగుకథకి పద్మరాజుగారు అంతర్జాతీయఖ్యాతి ఆర్జించేరని చెప్పుకోడమే కానీ నిజానికి తెలుగు అనే భాష ఒకటి ఉందని తెలీనివాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్రా అంటే మద్రాసీ అంటారంటే మనం ఏమనుకోవాలి? ఇంతకీ నేను చెప్పేది ఈ సైటువల్ల ఏదో సాధించేస్తాను అనుకుంటూ మొదలు పెట్టలేదు. అంచేత నాకు నేనై చేసిన ప్రచారం కూడా ఏమీ లేదు. నాసైటులో గెస్ట్ బుక్ పెడితే, మనవాళ్ళే మొదలు పెట్టేరు నేనేదో ఘనకార్యం చేస్తున్నానంటూ. అప్పుడు కూడా నేనెవర్నీ మీరు దీనికి లింకులివ్వండి, దీన్నిగురించి నలుగురికీ చెప్పండి అంటూ అడగలేదు. కానీ ఈమధ్య దాదాపు ఏడాదిగా అనుకుంటాను నాకు తూలిక ప్రయాణం నిరర్థకం అనిపిస్తోంది. దానికి కారణం నీరెండో ప్రశ్నకి సమాధానంలో ఉంది.

2. పాఠకులు లేదా సాహిత్యకారులు తూలిక ను ఎలా స్వీకరించారు?

పాఠకులకి సంబంధించినంతవరకూ, నేను మొదలు పెట్టింది అమెరికనులకోసమే అయినా, ఇంగ్లీషుబళ్ళో చదువుకున్న తెలుగు యువతీయువకులూ, విదేశాల్లో ఉన్న తెలుగువారూ కూడా చదువుతున్నారు ఈ అనువాదాలు. సుమారుగా 300-350 హిట్లు ఏ రోజు చూసినా కనిపిస్తాయి. కదాచితుగా 600 దాటుతాయి.

పోతే, తెలుగు సాహిత్యాభిమానులూ, తెలుగు సాహిత్యోత్తములూ, తెలుగు సాహిత్యకారులూ – వీరిమాటకొస్తే, పైన చెప్పినట్టు నాతో చాలామందే నేనేదో ఘనకార్యం చేస్తున్నానని చెప్తున్నారు కానీ దానికి అనుగుణంగా వారి ఉపన్యాసాల్లో, వ్యాసాల్లో, అనువాదాలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభావేదికల్లో తత్తుల్యమైన ఇతర రూపాల్లో ఎక్కడా తూలిక ప్రస్తావన కనిపించడంలేదు. అది చూసేక, ఈ ప్రముఖులు నాతో అన్న మాటలన్నీ సొల్లు కబుర్లుగానే కనిపిస్తున్నాయి నాకు. గత పన్నెండేళ్ళలో నేను ఎంతమందిని ఎన్నిసార్లు అడిగినా, ఒక్కరు కూడా తూలికకోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి ఇవ్వలేదు. అట్టే కాదు కానీ 2, 3 సార్లు ఇండియాలో ఉన్నవారిని గౌరవసంపాదకులుగా పేరయితే పెట్టేను కానీ వారివల్ల కూడా సహకారం ఏమీ లేదనే చెప్పాలి. అంచేత ఈ సాహిత్యకారులెవరూ తూలికని సీరియస్‌గా తీసుకోలేదని గట్టిగానే చెప్పగలను. కానీ, మళ్లీ ఈ రచయితల్లో కొందరికి తమకథ తూలికలో పడాలన్న కోరిక ఉండడం కూడా చూస్తున్నాను. వీళ్ళలో కొందరు అవే కథలూ, వ్యాసాలూ మళ్ళీ మళ్ళీ పంపడం చూస్తే, తూలిక.నెట్ పట్ల వీరికున్న అభిప్రాయం ఏమిటో నాకర్థం కావడంలేదు.

విదేశీయులు నాఅభిప్రాయం అడిగినప్పుడో, నావ్యాసం తమసైటులో పెట్టుకున్నప్పుడో మాత్రం నాకు తృప్తిగానే ఉంది.

ఇక్కడే మరొక మాట – వీరినుండి నేనేమిటి ఆశిస్తున్నానో – కూడా చెప్తాను. శాలువాలూ, సత్కారాలూ, జీవితసాఫిల్య పురస్కారాలూ నేను కోరడం లేదు. నాపేరు చెప్పడం సిగ్గుచేటు అనుకుంటే నాపేరు కూడా చెప్పవద్దు. కానీ ఈ సైటుమూలంగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్న మేలు ఇదీ, కీడు ఇదీ, ఈ సైటులో వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలకి ఆధారాలు లేవు – లాటి చర్చ ధైర్యంగా చెయ్యమని అడుగుతున్నాను. నాకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. మీక్కూడా ఉంటే ఇక్కడ చెప్పమని అడుగుతున్నాను. అంతేగానీ కేవలం నామొహంమీద “గొప్ప సేవ చేస్తున్నారు” అనేసి ఊరుకుంటే, అది నాకు ఆనందించవలసినవిషయంగా తోచదు. నల్లమేక-నలుగురు దొంగలు కథలో చెప్పినట్టు, ఇంతమంది ఇలా తూలికని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఈ సైటుకి నిజంగా విలువేమీ లేదనిపించడం సహజమే కదా.

3. తూలిక మిగతా అనువాద సైట్‌ల కన్నా ఏ రకం గా భిన్నమైనది?

మిగతా సైటులకీ నా సైటులకీ ఆశయంలోనూ, కథలఎంపికలోనూ చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉంది. ఎలా భిన్నం అంటే,

1. తూలిక.నెట్ కేవలం తెలుగుకథలకే అంకితమై, తెలుగు కథలనీ, కథకులనీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రారంభించిన సైటు. ఆ నియమానికి కట్టుబడి ఉన్న సైటు. ఇతర సైటులన్నీ- తెలుగువారు మొదలు పెట్టినవి కూడా – తెలుగుసాహిత్యం కోసమే అని ప్రారంభించినా రెండోసంచికకే ఇతర భాషల రచయితలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి అది ఒకరకంగా తెలుగుకథకి అన్యాయమే అంటాను. తెలుగుకథ ప్రాచుర్యం పొందకపోవడానికి కూడా అది ఒక కారణం కావచ్చు. కేవలం తెలుగురచయితలకే పరిమితమయిన సైటు తూలిక తప్ప మరొకటి లేదు, నేను చూసినంతవరకూ.

2, కథలఎంపికలో కూడా చెప్పుకోదగ్గ భిన్నత్వం ఉంది. దాదాపు అన్ని సైటులూ దేశంలో ప్రతి విమర్శకుడూ, ప్రతి రచయితా మెచ్చుకున్న కథలే మళ్లీ మళ్లీ ప్రచురిస్తున్నారు. ఈనాడు అతిగా ప్రాచుర్యం పొందిన కథలు అంటే “సామాజికస్పృహ” గల కథలు. అంటే సమకాలీనసమాజంలో లోపాలూ, వాటివల్ల హింసకి గురవుతున్నవారి కథలు. ఈ కథలు ఆశించే ప్రయోజనం మనసమాజంలో లోపాలను పాఠకులు గుర్తించి ఆ దురాగతాలని అరికట్టాలని. ఇది మంచిదే.

విదేశీయులకోసం చేసే అనువాదాలధ్యేయం అది కాదు, కాకూడదు. మనయిల్లు మనం చక్కబెట్టుకోవాలంటే మన కష్టసుఖాలు మనవాళ్లతో చెప్పుకుని, మనలో మనం పరిష్కరించుకుంటాం. ఇతరజాతులతో మాటాడుతున్నప్పుడు ఆ పాఠకులు ఆశించేది అది కాదు. నువ్వు అమెరికాలో ఉన్నావు. నిన్ను ఏ అమెరికనో, మరోదేశం మనిషో అడిగే ప్రశ్నలకి పైన చెప్పిన “సామాజికస్పృహ” కథల్లో సమాధానాలు దొరుకుతాయా? వారికి మనం చెప్పవలసిందేమిటి? అలాటి కథలవల్ల వారు గ్రహించేది ఏమిటి? నా అభిప్రాయం అవి కాదనే. నేను ఎంచుకునే కథలు తెలుగుజాతిని విడిగా నిలబెట్టేవి, తనదైన, మనకే  ప్రత్యేకమయిన విలువలూ, సంస్కృతి, ఆచారాలూ, సంప్రదాయాలు – ఇవి ఆవిష్కరించే కథలు.

కష్టాలూ, కన్నీళ్ళూ, ఈతిబాధలూ అందరికీ ఒక్కలాగే ఉంటాయి. ఏదేశంలో ఏ మనిషికైనా కూడూ, గుడ్డా, కొన్ని సాధారణసౌకర్యాలూ , ఏమాత్రమో తానూ ఒక మనిషినన్న గుర్తింపూ,– ఇవే కదా కావలసినవి. కుటుంబం, స్నేహితులు, తోటిమనిషి ఆలంబనా ప్రతి మనిషికీ కావాలి. అలాగే వీటిమూలంగా వచ్చే చిక్కులు కూడా అన్ని దేశాల్లోనూ అందరికీ ఒక్కలాగే ఉండొచ్చు. కానీ, వాటిని ఎదుర్కొనే విధానంలో, అనుభవించేతీరులో, పరిష్కరించుకునే పద్ధితిలో వ్యత్యాసాలున్నాయి. ఆ వ్యత్యాసాలే ఒకజాతిని మరొకజాతినించి వేరు చేసి విడిగా నిలబెడతాయి. లేకపోతే, నేను తెలుగువాణ్ణి, నేను తెల్లవాణ్ణి అని వేరుగా చెప్పుకోవలసిన అగత్యం లేదు. ఒక ఉదాహరణ కావాలంటే, మనదేశంలో ఇద్దరు అమ్మాయిలు గానీ ఇద్దరు అబ్బాయిలు గానీ ఒకరిభుజంమీద ఒకరు చేతులేసుకు తిరగడం సర్వసాధారణం. మనకి అది ఎబ్బెట్టు కాదు. అది కేవలం ఆత్మీయమైన మైత్రికి చిహ్నం, అంతే. అదే అమెరికాలో అయితే, ఆ ప్రవర్తన గే, లెస్బియన్లమధ్య మాత్రమే ఉంది. ఇండియా వెళ్ళి వచ్చిన ఒక అమెరికనమ్మాయి ఒకసారి నాతో అంది “ఇండియాలో చాలామంది గే” అని. ఇలాటి భిన్నత్వం మనం కథలద్వారా విశదమవుతుంది. అలాగే మనసంస్కృతి, సంప్రదాయాల్లో మనజాతికి ప్రత్యేకమయినవి అష్టావధానాలూ, తోలుబొమ్మలాటలూ, కలంకారీ, బిళ్లంగోడూ, గోరింటాకు, జడకోలాటం లాటివి ఎన్నో ఉన్నాయి. వీటిగురించి చెప్పే కథలు ఒకరకం.

రెండోరకం, సార్వజనీనమయిన కథాంశాలు. ఆరుద్రగారి ముఫ్ఫైలక్షలు పందెం కథ (యస్. నారాయణస్వామి అనువాదం) తీసుకో. సిగరెట్టు పెట్టె అట్టముక్కలు కత్తిరించి, వాటికి ఆర్థికవిలువ ఆపాదించి, పిల్లలు ఆడే ఆట ఆకథ. చిన్నతనంలోనే పిల్లలకి ఆర్థికసూత్రాలు ఎలా పట్టుబడతాయో అద్భుతంగా ఆవిష్కరించేరు ఆరుద్రగారు ఆ కథలో. అంతే కాదు, అది ఏ మాత్రం ఖర్చు లేని ఆట. ఇలాటి ఆటల్లో పిల్లల సృజనాత్మకత, ఊహాశక్తి ఎంతగానో వ్యక్తం అవుతాయి. మరో ఉదాహరణ – వాళ్లు పాడిన భూపాలరాగం కథ. అందులో పదహారేళ్ళ అబ్బాయిద్వారా మధ్యతరగతి బతుకుల్లో అవకతవకలు ఆవిష్కరిస్తారు శ్రీదేవి. ఇందులో మన సంస్కృతిగురించి గర్వపడదగిన విశేషాలు లేవు. కానీ రచయిత్రి కథ ఆవిష్కరించినతీరు నన్ను ఆకట్టుకుంది. ఈకథలో నాకు నచ్చిన మరో అంశం ఒక అబ్బాయి ప్రధానపాత్ర కావడం. ఆడపిల్లలకి పెద్దలు పెట్టే ఆంక్షలగురించి కొన్ని వేల కథలు వచ్చేయి. స్త్రీవాదం పేరుతో వచ్చే కథలన్నీ అవే. వాటికి భిన్నంగా, మనసంస్కృతిలో అబ్బాయిలకి కూడా ఆంక్షలు ఉన్నాయి కనీసం కొన్ని కుటుంబాల్లో. అంటే ఇక్కడ అబ్బాయా, అమ్మాయా అని కాక, పిల్లలబతుకులలో పెద్దవాళ్ళ జోక్యం చాలా ఉండేది అన్నవిషయం ఎత్తి చూపుతుంది. అంచేత అది విలక్షణమైన కథ అయింది. అంటే నేను ప్రత్యేకించి చూస్తున్నది కొత్త కోణం ఆవిష్కరించినకథలు. ఇలా అందరూ రాస్తున్న విషయాలే అయినా మరొక కోణం, సాధారణంగా ఎవరూ గమనించని, లేదా పట్టించుకోని కోణం ఎత్తి చూపే కథలద్వారా, కథాచరిత్రకి పరిపూర్ణత ఏర్పడుతుంది.

నిజానికి నేనెక్కడా చెప్పలేదు కానీ ఈ కథగురించి మరో రెండు విషయాలు కూడా చెప్పొచ్చు. మొదటిది, కథ పేరు వాళ్ళు పాడిన భూపాలరాగం అని. మామూలుగా భూపాలరాగం హృద్యంగమంగా ఉంటుంది. చల్లగా, ప్రేమగా పాడే మేలుకొలుపు. ఆపాట పాడినప్పుడు పిల్లలు ఉలికిపడి లేవరు. అందులో ఉన్న ఆప్యాయత రామం బంధువులు రామానికి వినిపించిన రాగంలో లేదు. అది శ్రవణానందకరమైనది కాదు. రెండోది, రామం చదువుగురించి చెప్పినమాట. అతనికి కాలేజీచదువు గొప్ప ఉద్యోగం సంపాదించుకోడానికి కాదు. కాలేజీపేరున ఆలోచించుకోడానికి కొంత వ్యవధి తీసుకోడమే అతనిఉద్దేశం అని అనిపించింది నాకు చివరి పేరా చదువుతుంటే. నేను ఉదహరించదలుచుకున్న మూడో కథ రాజారాం గారి జీవనప్రహసనం. ఈకథలో చిత్తూరుదగ్గర ఒక కుగ్రామం, అక్కడ జరిగే ఒక పండుగ, “భారతయజ్ఞం” ఎన్నో సూక్ష్మవిషయాలు చక్కగా కళ్ళకి కట్టినట్టు వివరించడం జరిగింది. అలాటి వివరాలు మనకి మాత్రమే ప్రత్యేకమైన జీవనసరళిని విదేశీయులకి విశదం చేస్తాయి. ఇలా ప్రతికథలోనూ ఏదో ఒక ప్రత్యేకత  – విదేశీయులకి మనజాతిగురించి ప్రత్యేకించి చెప్పగల విషయం – ఉన్నకథలు ఎంచుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

ఇదంతా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి, నా ఎంపిక అర్థమయినట్టు లేదు. పదిమంది “మంచి కథ” అంటూ మెచ్చినకథ, ఫలానావారి పోటీలో “బహుమతి పొందిన కథ” అయితే చాలదు నాకు. ఏకథ కానీ, దానివల్ల విదేశీయులకి మనజాతిగురించి మనం ఏం చెప్తున్నాం అన్నది కూడా ముఖ్యం. బహుశా చాలామంది తెలుగువాళ్ళకి నాసైటు అట్టే ఆకర్షణీయం కాకపోవడానికి ఇది కూడా కారణమేనేమో.  మన తెలుగువాళ్ళకి మాత్రమే పనికొచ్చే కథలు – సామాజిక స్పృహ గల కథలు – అనువాదానికి పనికిరాకపోవచ్చు అన్నది చాలామందికి తెలీడంలేదు.

4.  తూలిక మీకు సంతృప్తి నిచ్చిందా?

తూలిక నాకు సంతృప్తి ఇచ్చిందా అంటే వ్యక్తిగతంగా ఇచ్చింది. నాకు ఏది చేయడం తృప్తిగా ఉంటుందో అది చేస్తున్నాను. ఆ తృప్తి నాకుంది. కానీ సాహిత్యపరంగా చూస్తే, నిరాశ కలుగుతోంది. పైన చెప్పేను. తమకథలు తూలికలో అనువదించి ప్రచురించమని కోరేవారెవరూ తూలిక చదవరు. తమ కథ తూలికలో (లేదా మరో పత్రికలో) కనబడితే చాలనే కానీ, తూలికద్వారా ఏమిటి సాధించగలం, ఆ ఆశయానికి – తెలుగుకథని ప్రపంచవ్యాప్తం చెయ్యడానికి – మనం ఎలా తోడ్పడగలం అన్న ఆలోచన ఉన్నవారెవరూ నాకు కనిపించలేదు. పంపినకథలే పంపడం, అనువాదం చేసినకథలే అనువాదం చెయ్యమని అడగడం, నేను వేసుకోనని చెప్పిన కథలూ, వ్యాసాలు తిరిగి పంపడం – ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం ఉత్సాహంగా ఉంటుంది? వీరికి నిజంగా తూలికమీద, తూలిక ఆశయాలమీద నమ్మకం ఉందా అనిపించదా?

5. తూలిక భవిష్యత్తు ఏమిటి?

తూలిక భవిష్యత్తు ఏమిటో నాకూ తెలీదు. అయితే తూలికని అభిమానించేవారు కొందరైనా ఉన్నారని మాత్రం ఋజువైంది ఈమధ్యనే. నెలరోజులక్రితం నేను తూలిక.నెట్ ఎకౌంటు రద్దు చేసేను. దానికి పైన చెప్పిన కారణాలన్నిటితోపాటు, సాంకేతికాభివృద్ధి మూలంగా వచ్చిన కొత్త కష్టాలు కూడా ఉన్నాయి. నాకు విసుగేసి సైటు రద్దు చేసేను. వెంటనే, తూలిక.నెట్ కొనసాగాలని కాంక్షించిన ఒకరు వేరే సర్వరులో కావలిసిన ఏర్పాటు చేసి, దానికి తగిన సాంకేతికసహాయం కూడా అందించి, తూలిక ఫైల్స్ అన్నిటినీ అక్కడికి తరలించమన్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నాను.

ఇలా కొత్త సర్వరులో పునః ప్రారంభించడంవల్ల జరిగిన ఒక లాభం ఏమిటంటే ప్రతిరచనా మరోసారి చూసుకోడం, మొహమాటానికనో మాట ఇచ్చేననో ప్రచురించినవాటిని మరోసారి పరీక్షించి చూసుకోడానికి, నిజంగా తూలిక ఆశయాలకి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకోడానికి అవకాశం ఏర్పడింది. ఇలా మరొకరు పూనుకుని ఈసైటు ప్రత్యేకతని మరోసారి నాకు ఎత్తి చూపడం మూలంగా నాకు నేనే గుర్తు చేసుకున్నది ఏమిటంటే, తూలికలో నేను ప్రచురించిన నావ్యాసాలు ఇతరదేశాల్లో ఆసియా పండితుల, తెలుగు పరిశోధకులఆదరణ పొందేయన్న సంగతి. అలాగే కొందరు లింకులిచ్చేరు. కొందరు మొత్తం వ్యాసాలు తమసైటుల్లో పెట్టుకున్నారు. ఆవిధంగా నావ్యాసాలకి ఆదరణ ఉంది కనక ఈ సైటు ఇలాగే కొనసాగుతుందనీ, నాకు చేతనయినంతకాలం సాగించాలనీ అనుకుంటున్నాను.

చివరిమాటగా, పైకారణాలన్నిటిమూలంగా నేను వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు కూడా చేసుకున్నాను. ఇంటర్వ్యూలివ్వడం, సభలకి హాజరవడం లాటివి మానుకున్నాను. అయితే, నీకు ఈ జవాబులు ఇవ్వడం ఎలా జరిగిందంటే, దానికి కారణాలు రెండు.

1. ఎప్పుడో పదినెలలక్రితం మొదలు పెట్టింది పూర్తి చె్యాలి కనక,

2. తూలిక సైటు మాయమయిందని తెలియగానే, క్షణాలమీద మరొకరు పూనుకుని దాన్ని పునరుద్ధరించడానికి ఉత్సాహం చూపేరు కనక. నేను మరోసారి తూలిక ధ్యేయం పాఠకులకి స్పష్టం చేయడం న్యాయం మరియు నాధర్మం అనుకుని ఇక్కడ ఇంత వివరంగా చెప్పేను.

నువ్వు అడిగినప్రశ్నలు ఐదే అయినా మౌలికమైన ప్రశ్నలు కనకనూ, తూలిక.నెట్ సైటుని మరొకసారి పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో ఉన్నాను కనకనూ ఇంతగా రాసేను. నీకు నచ్చకపోతే, ప్రచురించకపోతే, నేనేమీ అనుకోను.

అన్నట్టు గణాంకాలు కూడా ఇక్కడ జత చేస్తున్నాను:

– తూలిక.నెట్ ప్రారంభించింది జూన్ 2001లో

– అనువదించిన కథలు ఇప్పటివరకుః 150. ఇందులో శారద (ఆస్ట్రేలియా) అనువదించినవి 10,

– ఇతర అనువాదకులు చేసినవి 10.

– నేను రాసిన పరిశీలనాత్మక, విశ్లేణాత్మక వ్యాసాలుః 25.

– ఇతరుల రచయితలవ్యాసాలు (వేరే సైటుల్లో ప్రచురించినవి తూలికలో పునర్ముద్రించినవి 3.

– నేను తూలికకోసం అనువదించినవి. 3.

– సంకలనాలు: 52 అనువాదాలు 3 సంకలనాల్లో వచ్చేయి. ప్రచురణకర్తలు జైకో, కేంద్ర సాహిత్య ఎకాడమీ (బెంగుళూరు విభాగం), లేఖిని సాహిత్య సాంస్కృతిక సంస్థ (హైదరాబాదు.).

ధన్యావాదాలు.

http://www.thulika.net.

లింకు ఇక్కడ

నిడదవోలు మాలతి సాహిత్య ప్రస్థానం గురించి పొద్దు వెబ్ మాగజైన్ లో విపులంగా వచ్చిన ఇంటర్వ్యూ ల ద్వారా మరింత తెలుసుకోవచ్చు.

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-1/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-2/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-3/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-4/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-5/

http://podduparty.com/poddu.net/2009/%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-6/

————

మాలతి.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “సారంగ పత్రికలో తూలిక.నెట్ ఇంటర్వ్యూ”

 1. మీ అజ్ఞాత జాల మిత్రులకి నా తరపున కూడా ధన్యవాదాలండీ. ఇన్ని ధన్యవాదాల దిష్టి తగలకుండా చూసుకొమ్మని చెప్పండి.. హీహీ. 🙂

  మెచ్చుకోండి

 2. తూలిక తో మీరు చేసే సాహిత్య సేవ అమోఘం ,
  సారంగ సాహిత్య పత్రికను పరిచయం చేసినందుకు
  ధన్యవాదాలు, మీ జాల ప్రక్రియ ను కొన సాగించడానికి
  సహకరించిన అజ్ఞాత జాల మిత్రునకు ధన్యవాదాలు .
  ‘Bash on regard less’

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.