ఊసుపోక – భక్తి, భక్తి, భక్తి …

(ఎన్నెమ్మకతలు 114)

మనకి భక్తి మంచినీళ్ళప్రాయం. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి, పతిభక్తి, రాయిభక్తి, రప్పభక్తి  … ఇలా మన జీవితాలు భక్తిమయం. మిత్రభక్తి లేదెంచేతో. పుత్రభక్తి కూడా లేదు. మిత్రుల, పుత్రులవిషయంలో ప్రేమ. మిత్రప్రేమ, పుత్రప్రేమ అంటే ప్రేమే భక్తి అనేమో …  ఏమో మరి. రెండింటిలోనూ రెండోవారిమీదే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది కదా.

మీరాకి కృష్ణప్రేమే కృష్ణభక్తి. స్వతంత్రంకోసం పోరాడే రోజుల్లో చాలామంది రాట్నాలకి పూజలు చేసేరు. నాయకులబొమ్మలు గోడలకి తగిలించి దండలేసేరు. అలాటి భక్తితోనే బాపూ, గాంధీ పేర్లు కూడా పెట్టుకున్నారు తమ పిల్లలకి. అన్నట్టు ఈపేర్లు అయాచితంగా కర్మానుసారం వచ్చినవే కానీ పేరులు ధరించినవారు గాంధీమతం స్వీకరించేరనుకోడానికి లేదు. పాపం, వారి అమ్మలూ, నాన్నలూ బారసాలనాడు పళ్లెంలో బియ్యం పోసి, ఆరాసిలో రాసిన రాతలుగానే మిగిలిపోవచ్చు. వీళ్ళేమో పెరిగి, మంచి చదువులు చదువుకుని తదితర ఇజాలలో పడి పేరుకీ ప్రవృత్తికీ పొంతన లేకుండా చేసి, ఆ పేరుని నిరర్థకం చేసేస్తున్నారు. ఇంకా కొందరు తెలివి మీరి, బాప్ అనో ధీం అనో పేరు మార్చేసుకోవచ్చు కూడాను.

ఈ దేశభక్తిలో మరో విచిత్రం దేశమును ప్రేమించుమన్నా అంటూ దేశభక్తి గీతాలు, అదే వరసలో జార్జి చక్రవర్తిగారిని కొనియాడుతూ రాజభక్తి గీతాలూ అప్పారావుగారు రాసేరంటే, ఇక్కడ భక్తి మాత్రమే ప్రధానం కాని ఎవరికోసం అన్నది కాదేమో అనిపించకమానదు ఎవరికైనా. మనకి నిజంగా స్వతంత్రం ప్రధానం కాదేమో అని కూడా అనిపించింది నాకైతే.

పతిభక్తి ఉంది కానీ పత్నీభక్తి లేదు. అందుకు ప్రతిగా ఏకపత్నీవ్రతం అని ఒకటి పెట్టేరు. ఎవరూ, మనువేనా? నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం మన ప్రభుత్వం దీనికో చట్టం తయారు చేసేసింది కానీ అన్ని చట్టాల్లాగే ఇదీ  కాయితపుచట్రాల్లోనే బందీ అయిపోయింది. బహుభర్తృత్వం నిషేధిస్తూ చట్టం ఉందో లేదో నాకు తెలీదు. నిత్యజీవితంలో మాత్రం ఎవరూ ఎక్కడా దీన్నిగురించి అట్టే పట్టించుకున్నట్టు కనిపించదు. ఒకొకప్పుడు బహుపత్నులుంటే తప్ప గొప్పకవులు కారేమో అని కూడా అనిపిస్తోంది!

ఇంతకీ భక్తీ, ప్రేమా ఒకటేనా? కాదా? అని సుదీర్ఘంగా ఆలోచించేను యథావిధిగా భ్రూకుటి ముడిచి, అర్థనిమీలితనేత్రురాలినై. ముక్కు మూసుకోలేదు తీరి కూచుని ప్రాణంమీదకి తెచ్చుకోడం ఎందుకని.

ఇలా ఆలోచిస్తుంటే నాకు మరో విషయం తట్టింది.. భక్తి మరియు, లేక, ప్రేమ ఎటునించి ఎటు పారుతుంది అని. మాతృభక్తి, పితృభక్తి పిల్లలనుండి పెద్దలవేపు ప్రసరిస్తుంది. మాతృప్రేమ మాత్రం ఎటునించి ఎటైనా ప్రసరించవచ్చు. పిల్లలకి ఉండేదీ మాతృప్రేమే, తల్లులకి ఉండేదీ మాతృప్రేమే. పితృప్రేమ కూడా అంతే. ఎవరిని గురించి మనం మాటాడుతున్నాం అన్నదాన్ని బట్టి ఎగువకా దిగువకా, అంటే తరాలదృష్ట్యా, అన్నది మనమే నిర్ణయించుకోవాలన్నమాట. గురుభక్తికి ఈ వసతి ఉన్నట్టు లేదు. ఇది శిష్యులకి గురువులయందు మాత్రమే ఉండుకోగలదు. దానికి ప్రతిగా గురువులకి శిష్యులయందు ఉండేది ప్రేమ లేదా ప్రీతి. అతను గురువులకు ప్రీతిపాత్రుడు అంటారు చూడండి, అదన్నమాట.

ప్రేమ ఉన్నచోట కోపాలు ప్రదర్శించడానికి కూడా అస్కారం ఉంది. “నీమేలు కోరే చెప్తున్నాన్రా, లేదా చెప్తున్నానే” అంటూ మొదలు పెట్టి నోటికొచ్చిన తిట్లు తిట్టొచ్చు. పత్ని పతికి ఎంతో ఇష్టమైన కూర చేసినప్పుడూ, చీరె కట్టినప్పుడూ ప్రేమతో చేస్తోందా, భక్తితో చేస్తోందా అంటే చెప్పడం కష్టమేనని నా అభిప్రాయం. గిట్టనివాళ్ళు పతిభక్తి, సాంప్రదాయం అంటూ మెచ్చుకోనూ వచ్చు, తెగనాడనూ వచ్చు. మరో గుంపు ఆయనంటే ఆవిడకి ప్రేమ, అంతే కాదు ఆయనకి ఆవిడంటే ప్రేమ, ఆవిడకి పుట్టినరోజునాడు ఉప్మా చేసి పెట్టేరు అని సమర్థించవచ్చు. రెండూ నిజమే కావచ్చు. ఈ మనిషితత్వాలతో ఇదే బాధ. ఏదీ నిక్కచ్చిగా రెండురెళ్ళు నాలుగు అన్నంత ఖరారుగా చెప్పలేం. హుమ్.

కొంతకాలం క్రితం 70 ఏళ్ళు పైపడ్డ ఒకాయన ఆడపిల్లలని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయి భూగృహాల్లో ఇనపగొలుసులతో కట్టిపడేసేవాడు. ఆఖరికి పట్టుబడ్డాడు. పిల్లల్ని అలా గొలుసులతో కట్టిపడేయడం ఏమైనా బాగుందా అని పోలీసులు గట్టిగా అడిగితే, ఆయన సమాధానం, “వాళ్లు నగలు పెట్టుకోరా, ఇదీ అంతే,” అన్నాట్ట. ఆయనదృష్టిలో అది ప్రేమే. ఒకొకరి బుర్రలు అలా పని చేస్తాయి కాబోలు. నాలాటి సామాన్యులకి అది హింసగానే కనిపిస్తుంది.

ఈ సకల భక్తులలోనూ, ప్రేమలలోనూ అత్యంత భయంకరమైనది మిత్రప్రేమ అనుకుంటా. అంటే మిగతా ప్రేమలలో కూడా ప్రేమపేరుతోనూ, భక్తిపేరుతోనూ ఒకమనిషిని మరొకరు ఉక్కిరిబిక్కిరి చేసేయడం జరుగొచ్చు కానీ మిత్రప్రేమలో ప్రేమతోపాటు నమ్మకం కూడా ఉంటుంది. “నా ప్రాణస్నేహితుడు నాకు ద్రోహం చెయ్యడు” అన్న ధీమా కూడా ఉంటుంది. “నాకు కష్టకాలంలో చేయి అందించివాడు నాకు సమయం చూసుకుని హాండిచ్చేస్తాడా?” అని విస్తుపోవలసిరావడం ఎంత కష్టం! ఆ బాధ ఇంతా అంతా కాదు. నేను మోసపోయేనే అనే కాక, నేను ఈమనిషిని ఎలా నమ్మేను, నాతెలివేమైంది అన్న బాధ అంతకంతా …

ఈరోజు తెల్లారి లేస్తూనే అనుకోకుండా మధురవాణి రాసిన కథ ఒకటి నాకళ్ళ బడింది. ఈ కథ చదివి గంటన్నర పైనే అయినా దాన్నిగురించిన ఆలోచనలు నన్ను వదల్డం లేదు. బహుశా ఈకథగురించి రేపు రాస్తాను.

ఈలోపున ఈ భక్తి, ప్రేమలగురించి మరోమాట చెప్పి ముగిస్తాను. నాకు ఆలోచించినకొద్దీ, భక్తి, ప్రేమ, రక్తి, అనురక్తి – అన్నీ ఒకే మాణిక్యానికి వేరు వేరు పలకలు అనిపిస్తోంది. విరక్తి కూడా మరో పలకే. బహుశా వ్యత్యస్తం అయిన పలక, అథోముఖం అనుకోవాలి హిరణ్యకసిపుడికి విష్ణువుయందున్న పగలాగ.

ఏది ఏమైనా వీటన్నటిలోనూ ఒకవిషయం స్పష్టం. ఒకమనిషికి మరోమనిషియందున్న ఆసక్తి కానీ ఆకర్షణ కానీ ఇలా ఆపాదితమవుతుంది. మనిషి జన్మ ఎత్తేక మరోమనిషితో ఏదో విధమైన “లింకు” పెట్టుకోకుండా ఉండలేడు.

(మే 14, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – భక్తి, భక్తి, భక్తి …”

 1. @ లలితా, ఆహా, చూసేరా, నిజంగానే మిమ్మల్ని నొప్పించేనేమోనని భయపడిపోయేను. మీరు శ్రమ అనుకోకుండా వివరంగా రాయడం మంచిదే అయింది. స్మైలీలమాట అలా ఉండగా మీ అక్క సంస్కృతంలో నాటకంగా రాసేరంటే నాకు ఆనందం, అశ్చర్యం. అది మీ బొమ్మలకథలో రాయకూడదూ …

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  కథ గుర్తుకు వచ్చింది కదా అని గబుక్కున వ్రాసేశాను. స్మైలీలు పెట్టడం మర్చిపోయాను, సీరియస్సుగా అనిపించిందేమో 🙂 భక్తీ, ప్రేమా గురించి నా అయోమయాన్ని నేను వ్రాయలేకపోయాను. మీరు మీ అయోమయాన్ని వ్రాయగలిగారు. అంతే 🙂
  ఈ కథ చిన్నప్పుడు చాలా సార్లు విన్నాం మేము, మూఢ భక్తి పనికి రాదని చెప్పడానికి ఇలాంటి కథ ఇంకోటి కూడా చెప్పేవారు. అందులోనూ నారదుడు ఉంటాడు. ఆ కథ ఇంకెప్పుడైనా 🙂 నేను చెప్పిన కథని (సంస్కృతంలో ) నాటకంగా వ్రాసి కొన్నేళ్ళ క్రితం మా అక్క తన విద్యార్థులతో బడి వార్షికోత్సవంలో ప్రదర్శించింది. అందుకని కూడా ఉత్సాహం ఎక్కువై వ్రాసేశాను.

  మెచ్చుకోండి

 3. @ లలితా, ఏం లేదండీ. నాకు ఈరోజుల్లో కనిపించే భక్తీ, ప్రేమా కూడా అయోమయంగా ఉన్నాయి. ఇది ఒక దృక్కోణం మాత్రమే. మీరు చెప్పినకథ నాకు తెలీదు. అది కూడా నిజమే కావచ్చులెండి.

  మెచ్చుకోండి

 4. భక్తి గురించి ఎందుకింత ఇదిగా వ్రాశారో మీరు. కానీ భక్తికీ ప్రేమకీ తేడా చెప్తూ, ప్రేమే గొప్పదని శ్రీకృష్ణులవారు నిరూపించారని ఒక కథ ఉంది కదా. ఒకసారి ఆయన తలనొప్పి నటిస్తూ పడుకుంటారట. తగ్గాలంటే తన భక్తుల పాదధూళిని తను తల పై రాసుకోవాలని అంటారట. నారదుల వారూ, రుక్మిణీ, సత్యభామా మొదలైన కృష్ణ భక్తులందరూ ఇవ్వకపోగా, కృష్ణుణ్ణి ప్రేమించే గోపికలు మాత్రం, ఆయన బాధ తగ్గుతుందంటే అంతకన్నానా అని తమకి అంటే పాపం గురించి ఆలోచంచకుండా తమ పాద ధూళి ఇవ్వడానికి సిద్ధమౌతారట.

  మెచ్చుకోండి

 5. vbsowmya, ఔచ్, నిజమే. మరిచిపోయినందుకు క్షంతవ్యురాలిని. అయినా సాహితీభక్త బృందాలకి విడిగా వేరే టపా రాయాలేమో ;P పోనీ, నువ్వు రాయకూడదూ.

  మెచ్చుకోండి

 6. ఇదిగో ఏవండోయ్… సాహితీ భక్తి గురించి రాయలేదు. భక్తుల్లోకెల్లా భరించలేనంత భక్తి ఉండేది అదే. మీ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నా! 😉

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s