115 ఊసుపోక – నాకెందుకీ కథ నచ్చిందో …

(ఎన్నెమ్మకతలు 115)

మధురవాణి రాసిన ప్రకృతిఒడిలో బతుకు పాఠం,  పేరు చూడగానే ఇది గంభీరమైన అంశంలా ఉంది, ఇప్పుడు చదివేస్థితిలో ఉన్నానో లేనో అనిపించింది. ఆలోచిస్తూనే మొదలు పెట్టేను. మొదలు పెట్టినతరవాత కథ హాయిగా సాగిపోయింది.

ఎత్తుగడలోనే టీవీలూ సెల్ ఫోనులూ కాక రేడియో ప్రసారం, వానతో పాటు ప్రకృతి వర్ణనా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తడి అలా ఉండగానే, అంతవానలోనూ ఓ రేకులషెడ్డులో ఒంటరిగా నిశ్చలంగా  మునిపుంగవుడిలా కూర్చున్న యువకుడు. అతనిగురించి మనకి అనేక ప్రశ్నలు రావడానికి ఆ ఎత్తుగడ చాలు. అది నా మొదటి మెట్టు చదవడం కొనసాగించడానికి.

నన్ను ఆపకుండా చదివించిన రెండో అంశం కథనంలో చక్కని తెలుగుదనం. అట్టే ఆర్బాటాలు లేకుండా, ఇంగ్లీషూ, సంస్కృతం కూడా లేని జాను తెనుగు. ఇటీవలికాలంలో ఇలాటి తెలుగులో వచ్చే కథలు చాలా తక్కువే అనుకుంటున్నాను. మరోమాట కూడా ఒప్పుకుంటాను. నేను బ్లాగులూ, జాలపత్రికలూ అట్టే చూడడం లేదు కనక నా వ్యాఖ్య నాపరిమితిలోనే అని అర్థం చేసుకోవాలి.

కథాంశం సర్వజనీనం.  నడక కూడా తూచినట్టు సాగింది. ఎక్కడా అనవసరమైన శాఖాచంక్రమణాలు కానీ కథకురాలి సొంత అభిప్రాయాలు కానీ చొప్పించకుండా, పాఠకులు తమ తమ అభిప్రాయాలు ఏర్పరుచుకోడానికి అనువుగా కథ నడపడం నాకు నచ్చింది.

కథలో మరోకోణం – మిత్రలాభం. ముందు టపాలో రాసేను, మనిషికీ మనిషికీ మధ్య ఏదో ఒకరకం లంకె ఉండి తీరుతుందని.

నన్ను బాబాయి అనుకో అంటూ చేరదీసిన వ్యక్తి మోసగాడని తెలియడం క్షోభ కలిగిస్తుంది. కానీ, ఆయనవల్ల అతను బొత్తిగా ఏమీ లాభం పొందలేదనడానికి లేదు. కథ విషయం కొంచెంసేపు పక్కకి పెట్టి, నిత్యజీవితంలో మనం రోజూ చూస్తూనే ఉంటాం ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి ఎప్పడో అప్పడు ఏదో సాయం చేస్తూనే ఉంటారు. ఒకొకప్పుడు మరోఉద్దేశం ఏమీ పెట్టుకోకుండా సాయం చెయ్యొచ్చు. ఒకొకప్పుడు, అంతరాంతరాల మరో ప్రణాళిక వేసుకుని చెయ్యొచ్చు. ఏది ఏమైనా సాయం పొందిన మనిషికి కొంత లాభం తప్పకుండా కలుగుతుంది. ఏమీ లేకపోతే, కనీసం జ్ఞానోదయం. ఈకథలో బాబయితో ఉన్నంతకాలం పని నేర్చుకున్నాడు. అదే అతనికి లాభం. కానీ తాను మోసపోయేనన్న జ్ఞానం అతన్ని మరింత కుంగదీసింది. అది కూడా సహజమే. ఎప్పుడైనా మనసుమీద నొప్పిముద్రలే మరింత గాఢంగా పడతాయి. మంచి ఉన్నా అంత మంచిగా అనిపించదు.

ముగింపు మరింత చక్కగా అమిరింది. ఏదో అవుతుందనే కానీ ఏమవుతుందో తెలీదు మనకి. హఠాత్తుగా పెద్ద వెలుగు అని చదివినప్పుడు కారు అనుకున్నాను. నా అంచనా తప్పు. అది రచయిత్రి చమత్కారం. తరవాత, అతనిలో కలిగిన సంచలనం, అతను ఒక నిర్ణయం తీసుకోడానికి దోహదం చేసిన సంఘటనా –  అదంతా ఇక్కడ రాయను కానీ రచయిత్రి గొప్పగా ఆవిష్కరించేరని మాత్రం చెప్పగలను. నాకలా అనిపించింది. నాకు ప్రత్యేకంగా అలా అనిపించడానికి కారణం నాక్కూడా ఈమధ్యనే అలాటి అనుభవం కలగడం కావచ్చు. బహుశా అదే కారణం కూడానేమో ఈ టపా రాయడానికి.

ఇప్పటికి చాలా టపాలే రాసేను మంచి కథ అంటే ఎలా ఉండాలో.  కానీ అవేవీ గుర్తు లేవు నాకు ఈ కథ చదువుతున్నంతసేపూ. నేననేది, ఒక సంఘటనో ఒక సన్నివేశమో మనకి అనుభవం అయినతరవాత, దానికి అనుబంధంగా కనిపించే కథ చదివినప్పుడు మన స్పందన మరింత బలంగా ఉంటుంది. ఏ ఆత్మీయురాలితోనో గుట్టుగా చెప్పుకుంటున్నట్టు సాంత్వన పొందుతాం. అదే ఎదుట నిలబడి మరోమనిషి, పోన్లెద్దూ, అదో పాఠం అనుకో, నొప్పి అదే పోతుందిలే అంటే చిరాకేస్తుంది.

ఇప్పుడు మీకర్థం అయిందనుకుంటాను ఎందుకు నాకు ఈకథ చదివేక, దాన్ని గురించి రాసేవరకూ తోచలేదో. మాలిక పత్రిక లో వ్యాఖ్యలని, ఈకథ చాలామందిని ఆకర్షించింది.

మంచి కథ అందించిన మధురవాణికి శుభాకాంక్షలు.

(మే 15, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “115 ఊసుపోక – నాకెందుకీ కథ నచ్చిందో …”

 1. CVR Mohan గారు :- “ఎదురుచూడని వెన్నుపోటు” కన్నా మొదట వ్రాసిన “అనుకోని వెన్నుపోటు” అన్నదే ఎక్కువ అర్ధవంతంగా ఉంటుందని నా అభిప్రాయం. వెన్నుపోటు కోసం ఎదురుచూడరు కదా.

  మెచ్చుకోండి

 2. @ మాలతి గారూ..
  This post is a pleasant surprise for me. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బ్లాగులన్నీ తరచూ చదివే వీలు కుదరడం లేదు గానీ నేను బ్లాగు రాయడం మొదలెట్టిన కొత్తల్లో బాగా చదివేదాన్ని. అప్పుడు మీ బ్లాగు పోస్టులు, కథలు, మీ నవల అన్నీ వదలకుండా చదివేదాన్ని. నాకు కథలు రాయాలన్న ఉత్సాహం కలిగించిన వారిలో మీరు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు నేను రాసిన కథని మీరు బాగుందని మెచ్చుకోవడం చాలా చాలా సంబరంగా ఉంది. Thank you so much.. You made my day! 🙂

  ఈ పోస్ట్ లింక్ షేర్ చేసిన సౌమ్యకి థాంక్స్.. 🙂

  మెచ్చుకోండి

 3. ‘అయినవారి అనుకోని వెన్నుపోటు,
  గుండెలను గుచ్చుతుంది’.
  ‘తప్పి పోయిన ప్రాణాంతక విపత్తు,
  జీవితం మీద తీపి పెంచుతుంది’.
  కథ , కథనం ఎంతో నచ్చాయి.
  ఈ కథ మీద నా పై వ్యాఖ్య కూడా
  నా స్వీయానుభవం నుంచే వచ్చింది

  మెచ్చుకోండి

 4. @ లలితా, అలాగే లింకివ్వండి. చాలాకాలం తరవాత మీఅభిప్రాయం చూడ్డం సంతోషం. నిజానికి నేను రాయలేదు కనకే మీరు కనిపించడంలేదని కూడా నాకు తెలుసనుకోండి. :))

  మెచ్చుకోండి

 5. తెలుగులో మంచి కథలంటే నాకు మీ కథలు, మీరు పరిచయం చేసిన కథలు గుర్తుకు వస్తుంటాయి. మీ అభినందనలు మధురవాణికీ, తెలుగు కథలకీ ఆశీర్వచనం అని నా అభిప్రాయం 🙂 మీ టపా చూసి ఆ కథ చదివాను. చాలా బావుంది. ఎందుకు బావుందో మీరు చెప్పేశారు 🙂 తెలుగు కథల గురించి ఫేస్ బుక్కులో చర్చిస్తుంటే ఈ మధ్యే నన్నూ చేర్చుకోమని విన్నపం పంపి చేరాను. మీరు కొన్ని కథలను, రచయితలనూ పరిచయం చేసి కథల మీద చర్చలని ఆహ్వనించారు ఒకప్పుడు. అది గుర్తు చేసుకున్నాను. అలాంటి చర్చల కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాలనుకున్నాను. ఇంకా ఎన్నో ఆలోచనలు అలాంటివి అలా సాగుతూనే ఉండగా మీ టపా చూశాను. కథని ఆస్వాదించడానికీ, మంచి కథకీ ఉదాహరణగా అక్కడ ఈ లంకె ఇద్దామనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s