చేతనాకృతి

కథామాలతి 5 pdf అగత్యం లేనివారికోసం

రానున్న తుఫానుకోసం ఎదురు చూస్తూ కిటికీ చట్రంలోంచి మీదిమీదికి తోసుకొస్తున్న కారుమేఘాల్ని చూస్తున్నాను పరీక్షగా. ఎడతెగని ఆలోచనలు … సాహిత్యకారులు అన్నపదం ఇంతవరకూ విన్లేదు. స్వర్ణకారులు, కుంభకారులూ, చర్మకారులూలాటి పదాలు తెలుసు గానీ సాహిత్యకారులు ఆంధ్రభారతిలో కూడా లేదు. స్వర్ణకారులు, కుంభకారులూ బంగారమో, మన్నో – ఏదో ఒక స్థూలపదార్థం తీసుకుని ఒక వస్తువు తయారుచేస్తారు. చరిత్రకారులు అన్నది స్థూలజగత్తులో జరిగిన ఘట్టాలు తీసుకుని చరిత్ర రూపురేఖలు తీర్చి దిద్దుతారు అన్నఅర్థంలో కాబోలు. సాహిత్యకారులు ఏం చేస్తారు చెప్మా!  కవులనీ, కథకులనీ, “తయారు చేస్తార”నా, కుమ్మరి మట్టితో కుండలు చేసినట్టు? అంటే …

“ఏటలా సూత్తన్నవ్, దివాల్తీసినట్టు ముగెంవెట్టుక్కూసుని.”

ఉలిక్కిపడి అటు చూసేను. సంద్రాలు! “రా, సంద్రాలూ, చాల్రోజులయింది కనిపించి. ఏంచేస్తున్నావేమిటి, ఎక్కడా కనిపించడంలేదు. ఏమైపోయేవు?  …” గబగబ ఆబగా ఆత్రంగా ప్రశ్నలమీద ప్రశ్నలు కురిపించేను … “చెప్పు, చెప్పు. ఎందుక్కనిపించలేదిన్నాళ్లూ.”

“ఆగమ్మా, ఆగాగు. మా సెల్లెమ్మ బుడ్డోడికి అకస్మతుగా లగ్గెంవెట్టీసినారంటె దేసంవెల్లిన. ఇంతకీ ఏటైనాదేటి?”

“ఏం లేదు … వీళ్లందర్నీ చూస్తే నాకు మహ చిరాకేస్తోంది.”

“ఏటయిందో సెప్పకండ సిరాకంతె నానేటి సెప్పీది?”

“వీళ్ళంతా చదూకున్నాళ్ళూ, మూడో తొమ్మిదో యమ్మేలూ, యమ్మెస్సీలూ … చేసేసి, చైతన్యం, సాంస్కృతికం, అభ్యుదయం అంటూ కథలూ, కవిత్వాలూ, ఉపన్యాసాలూ ఊదరపెట్టేస్తున్నారు. మరి …”

“ఆగమ్మా తల్లీ. నానేటి నీనాగ యమ్మీలూ బియ్యేలూ, ఉలవలూ సదూకున్ననేటి, అనాగ చితనం, సంకారంవంటా ఓరెట్టీస్తే నాకేటి తెలస్ది. ఏటయిందో  నిదానంగ సెప్పు.”

“అది కాదు, సంద్రాలూ. ఈ కథలు రాసేవాళ్ళూ, వాళ్ళ కొమ్ము కాసేవాళ్ళూ నింగినీ నేలనీ నిలవకండ అదిరిపడుతున్నారు. నీకే గాదు నాకూ అయోమయంగానే ఉంది. మరి అభ్యుదయం అంటే ఎదటిమనిషిని గౌరవించడం కదా, అంటే వారిని నొప్పించకుండా మాటాడడం కాదూ? అదసలు కనీసధర్మం కదా.”

“అద్గదో మల్లి అదే రగడ. అసలేటయినాదో సెప్పవమ్మా అంతె ఏదో శాస్తాలు చదుతన్నవు.”

“… … ఏటీ కాలేదులే. నిన్న ఒకామె వచ్చేరు. చదువుకున్నారు, పండితురాలు. ఏదో కథలూ, కవిత్వాలూ రాసేరు, ఇంకా రాస్తున్నారు. మరి అలాటివారు కనిపిస్తే, వాళ్ళు చదివినవో రాసినవో మాటాడతారనుకుంటాం కద. మరేమో ఈ సాహిత్యమనుషులు తీరా ఎదురుపడి, నన్ను చూడగానే … మొదలెట్టేదేమిటో తెలుసా?”

“ఏటన్నరెటి?”

“ఒకటేమిటి, నానా చెత్తాను. చూడు వాళ్ళెట్టే కుక్కమార్కు రికార్డు …

—–

“ఒక్కరూ ఉన్నారా? అయ్యో పాపం. … అయ్యో రాతా, మీకెంత కష్టంవొచ్చీందీ. … అయితేనూ … ఆయనేమిటీ ఆయనే మిమ్మల్ని వొది…  పిల్లల్నొదిలేసేర్ట. నిజంగానే? “నేన్చెప్పేన్లెండి… మీరసలాటివారు కాదని నాకు తెలీదూ …లాయరుతో మాటాడరాదూ. మాచెల్లెల్నిలాగే చేస్తే, ముప్పతిప్పలూ పెట్టి మూడు చెరువుల్నీళ్ళు … అవున్లెండి. ఎవరెలా పోతే మనకేల? ఇంతకీ ఇప్పుడాయనెక్కడున్నారు? … అహ, ఇప్పుడావూళ్ళో లేరా? …మీకు తెలీదూ? నిజంగానే? పిల్లల్నడగరాదూ … … అసలింతకీ ఏంచేస్తున్నారూ అని … ఆమధ్య అక్కడికొచ్చేర్ట గదా.”

“ఆగమ్మా, ఆగాగు. తలా తోకా నేకండ ఏటా వొరస కుండపోతగ వొరసం గురిసిన్నాగ…”

“నేనంటున్నది కూడా అదే. అలా  భోగినీదండకం చదివినట్టు గుక్క తిప్పుకోకుండా … బుచ్చమ్మింట మకాంట, రాజుగారింట మేజువాణిట వీరసాహిత్యకారులతో దేశాటనంట. వందలాది భక్తసంఘాల్ట. కాశ్మీరు శాలువల్ట. పట్టు పీతాంబరాల్ట. అందలాలెక్కించేర్ట, అబిషేకాల్చేయించేర్ట, … అంతేలెండి. మనకెందుకు … వేలాదిపాఠకులు సుడిగాలి చుట్టుముట్టినట్టేన్ట . వందలాది విమర్శకులు శ్లాఘించేర్ట వేనవేల నోళ్ళ ఆదిశేషుడిలా …”

“ఏటో నీగోల నీది. పోన్నె. ఆ రచీతలపేల్లు ఏ బగమంతునిపేరో అవుతే అదీ పున్నెంవే గంద. యెనక ఇస్నువోరు సెప్పినట్టు కోపాన, తాపాన ఎనాగ తల్సుకున్న సాయిజ్జంవే.”

“అంతేగాదు. మాఊర్రండి. మీక్కూడా శాలువలు కప్పుతాం, ఫొటోలు తీయిస్తాం. పత్రికల్లో రాయిస్తాం అంటారు.”

“మరెల్లయితే.”

“వెళ్ళేను రెండుసార్లు. ఒక్కళ్ళకీ నేనేం రాసేనో తెలీదు. ఏంచేస్తున్నానో తెలీదు. తెలుసుకోవాలన్న తాపత్రయం కూడా లేదు. ఉన్న తాపత్రయం అల్లా ఒక్కటే … ఆయనేం చేస్తున్నారని.”

హీహీ అంది సంద్రాలు.

పళ్ళు కొరికేను నేను, “నీకు నవ్వులాటగానే ఉంటుంది.”

“అదిగాదమ్మా. ముగం ముడ్సుకోమాక. నివ్ మాతరం తక్కవతిన్నవేటి?”

నేను జవాబు చెప్పేలోపున తారకం వచ్చేడు.

అతనివెనకే వస్తున్న పెద్దమనిషిని చూసి, గబుక్కున లేచి, “రండి, రండి” అంటూ ఇద్దరినీ ఆహ్వానించేను.

“మానాన్నగారండి. అనంతంగారు. మిమ్మల్ని కలుస్తానంటే తీసుకొచ్చేను.”

“అనంతంగారా. పేరు పరిచయమే. మిమ్మల్నెప్పుడూ చూళ్ళేదు. అదేలెండి, ఇంతవరకూ.”

అనంతంగారు ప్రతినమస్కారం చేసేరు, “నేను కూడా మీపేరు విన్నానులెండి,”

“ఏం విన్నారని అడగడం నాకు క్షేమం కాదనుకుంటాను.”

అనంతంగారు చిన్నగా, అవునో కాదో తెలీనంత సన్నగా, తలూపేరు.

నేను ఇరుకున పడ్డాను తృటికాలం. తరవాత, “మీకథలు చదివి చాలాకాలమయింది. ఇప్పుడంతగా గుర్తు లేవు. ఈమధ్య కొత్తగా ఏమైనా రాసేరా?” అన్నాను.

“లేదమ్మా. నేను కూడా రాయడం చాలా తగ్గించేసేను.”

“కూడా అంటారేమిటి?”

“అంటే మీవి కూడా అట్టే కనిపించడంలేదని.”

“ఆహా. అయితే ఈనాటి సాహితీక్షేత్రం బాగానే గమనిస్తున్నారన్నమాట.”

అనంతంగారు మాటాడలేదు.

నేను ఆలోచించి, “మీ అభిప్రాయం చెప్పండి ఈనాడు ఉత్పత్తి అవుతున్న సాహిత్యం గురించి.”

“హా, ఉత్పత్తి అన్న ఒక్కపదంతోనే మీరు సమీకరించేసేరు మొత్తం సాహిత్యాన్ని.”

“క్షమించాలి. దేశ, కాల పరిస్థితులనిబట్టి భాష కూడా మారిపోతుంది కదా. ఇక్కడ వ్యాపారపరమైన నుడికారం ఎక్కువ. అలా వచ్చేసింది.”

“మీనోట ఎలా వచ్చినా, ఆ పదం మాత్రం సరిగ్గా సరిపోతుంది. స్వర్ణకారులూ, కుంభకారులూలాగే, ఈనాటి సాహిత్యకారులు కూడాను. “

నేను నవ్వేసి ఊరుకున్నాను.

“వెనకటి రోజుల్లో గోచరమయే ప్రతిభ, వ్యుత్పత్తి, స్ఫూర్తీ కూడా ఇప్పుడు అదృశ్యమయిపోయేయి. పది కథలు చదివి ఓ కథ రాయొచ్చన్న భావం మంచిదే కానీ అదే ధ్యేయం కాకూడదు. ఆబగా రోజుకో పుస్తకం చదివేసి, వారానికో పరిచయం రాసేయగలరు ఒకరకం సాహిత్యకారులు. రెండోరకం సాహిత్యకారులు – తమకులం అనో, ఊరనో, పేరనో, పలుకుబడనో – ఏదో వంక, ఏమాత్రమో కళ్ళముందుకొచ్చినవాళ్ళని అందలాలెక్కించి, హారతులు పట్టి, శాలువలు కప్పి, పురస్కారాలు ప్రసాదించి, మహారచయితలని చేసి, పదిమంది చేత అవుననిపించగలవారు. కింగ్‌మేకరులలాగే సాహిత్యశేఖర మేకరు”లు. ఇలాటివి తలపుకొస్తేనే నీరసం వచ్చేస్తుంది,” అంటూ అనంతంగారు ఆగిపోయేరు.

నాక్కూడా ఏం మాటాడడానికీ తోచలేదు.

“మనస్సాచ్చిగా కతలు సెప్కొనేవోరు కతలు సెప్పుకుంతబోతరు ఎవురిన్న యినకున్న, అదీ ఓ యసనంవె,” అంది సంద్రాలు.

“బాగా చెప్పేవమ్మా,” అన్నారు అనంతంగారు.

“ఇప్పుడు వస్తున్నది సమకాలీనసాహిత్యం కదా. సమాజం మారుతుంటే, సమకాలీనసమస్యలని ఆవిష్కరించే కథలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి కదా. మార్పు తప్పదు కదా. అందులో ఆశ్చర్యం ఏముంది? వెనకటిసాహిత్యంలా ఉంటేనే సాహిత్యం అనడం ఏం న్యాయం?” అన్నాడు తారకం.

“సమస్యలు మారతాయి. అంటే వస్తువులో అది కూడా పైపొరల్లో మాత్రమే మార్పు ఉంటుంది. మౌలికమైన ఆలోచనల్లో అభిప్రాయాల్లో వచ్చే మార్పులు తక్కువే. అవైనా మంచికా చెడుకా అని చూసుకోవాలి వాటికి అనుగుణంగా మనం మారిపోయేముందు.”

“ఇప్పుడు సాహిత్యంలో వచ్చినమార్పుకి కారణం ఏమిటంటారు, అందువల్ల నష్టమే కలిగిందనుకుంటున్నారా మీరు?” అన్నాను నేను.

“సమాజంలో మార్పులు వస్తాయి. అవి మంచికా చెడుకా అన్నది నిర్ణయించడం కష్టం. అలాగే సాహిత్యంలోనూను. వెనకటిరోజుల్లో సాహిత్యం ఒకరకంగా ఉండడానికి కారణం ప్రధానంగా ఆరోజుల్లో చదువుకున్నవారు తక్కువ. ఆ చదివినచదువు కూడా వారికి అంతకుపూర్వంనించీ సంక్రమించింది మాత్రమే. అంటే పరిమితమే కదా. తరవాత ఇంగ్లీషు చదువులు వచ్చేక, కొంతవరకూ ఇంగ్లీషుప్రభుత్వమే మనకి ఇంగ్లీషు మప్పింది. మనకి అన్ని భక్తులలాగే రాజభక్తి కూడా ఎక్కువే కనక అదేమని ప్రశ్నించకుండా, మహా ప్రసాదమని  నెత్తిన పెట్టుకున్నాం. ఇంగ్లీషువాళ్ళ భావాలు అంది పుచ్చుకుని, అవే తెలుగులోకి దించేయడం జరిగింది. మన మేధావులందరూ మిగతావారందరికీ అదే బోధించేరు.”

“మీరనేది విశ్వజనీనమయిన సాహిత్యాన్ని ఆహ్వానించడం తప్పంటారా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుండిపోతాం. అదేనా మీరు కోరేది,” అన్నాడు తారకం.

“లేదు. మార్పు కూడదని నేననడం లేదు. అనేక మతాలు రావడానికి అదే కదా మూలం. కాలానుగుణంగా మార్పులు చేర్చుకుంటూ, మతప్రవక్తలు కొత్త వ్యాఖ్యానాలు రాస్తూ, మతంలో చిన్న చిన్న మార్పులు చేస్తూ వస్తున్నారు. కానీ, మనం మరోసంస్కృతినించి భావాలూ, దృక్పథాలూ స్వీకరిస్తున్నపుడు, అవి మనసంస్కృతికి అనుకూలమవునా కాదా అని కూడా తరిచి చూసుకోవాలి.”

“అట్టా సూసుకోపోతే, నివ్విందలక సెప్పినట్టు గోల్మాలయిపోతాది. నీకు చదూకున్నోరిమాట గూడ బుద్దీనంగ కనిపిస్తది,” అంది సంద్రాలు.

నేను ఉలిక్కిపడ్డాను. “బుద్ధిహీనంగా అన్నానా నేను?” అన్నాను, అనంతంగారు ఏమనుకుంటారో అన్న పిరికితనం పొడుచుకురాగా.

“ఏమన్నారేమిటి?” అన్నాడు తారకం.

సూక్ష్మంగా చెప్పేను జరిగినసంగతి మళ్ళీ.

అనంతంగారు సంద్రాలువేపు చూస్తూ, “చురుకైన బుర్ర. బాగానే అర్థం చేసుకున్నావు,” అన్నారు. తరవాత, నావేపూ, తారకంవేపూ చూస్తూ, “చూసేవా, ఆవిడకి తోచింది నీకు తోచలేదు. మనసమాజంలో జనాభా ఎక్కువ. ఉమ్మడికుటుంబాలు మన సంప్రదాయం. అసలు ఏ దేశంలో కానీ జనాభా, వాతావరణపరిస్థితులే ఆసమాజంలో సంస్కృతినీ, విలువల్నీ తీరిచి దిద్దుతాయి. మూడుతరాలజనం మూడుగదులఇంట్లో సర్దుకున్నప్పుడు, ఇంట్లో ఇంట్లోనే, ఆ నాలుగ్గోడలమధ్యే తగువులు పెట్టుకోడం, తీర్పులు చేసుకోడం కూడా జరిగిపోతుంది అట్టే ప్రయత్నం లేకుండానే. అత్తాకోడళ్ళూ, ఆలుమగలూ, తోటికోడళ్లూ, బావమరుదులూ, ఒకే చూరుకింద ఉంటారు కనక ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మాటలు అనేసుకుంటారు, దులుపేసుకుపోతారు. అదే మనకి థెరపీ. అలా ప్రతివారూ ఎదటివారిబతుకుల్లో భాగం అయిపోతారు. వారి కష్టసుఖాలు వీరివి, వీరి కష్టసుఖాలు వారివీ అయిపోతాయి. అవే ఆత్మీయతలూ, అభిమానాలూ. మనకిప్పుడు అది అనవసరపు కుతూహలంలా అనిపిస్తోంది ఈ పాశ్చాత్యనాగరికత అందించిన ప్రైవేసిమూలంగా. అప్పట్లో ఇందాక మీరన్నట్టు ఎవరేనా మాటాడితే తప్పు పట్టే రోజులు కావవి. ఇప్పుడు ఓ పక్క ప్రగతిపేరుతో, నాగరికతపేరుతో గుట్టూ, మట్టూ అలవాటు చేసుకున్నాం. మరోపక్క నరనరాలా జీర్ణించుకుపోయిన ఈ “అభిమానాలు” వదిలించుకోలేకపోతున్నాం. అసలు మనం ఇలా చేస్తున్నాం అన్న స్పృహ కూడా ఉండదు చాలామందికి. నేనిలా అడక్కూడదు కానీ అంటూ మొదలుపెట్టేసి, మరీ సాగిస్తారిది. ప్రైవేసి అనబడు విద్య యింకా అందరికీ పట్టుబడలేదు. బహుశా మరో మూడు తరాలు పడుతుందేమో సమాజంలో అందరికీ అది అలవాటు కావడానికి. ఈలోపున ఇలా కొందరు ఆహుతి కాకతప్పదు ఈ అస్తవ్యస్తనాగరికతకి.”

“అవుననుకోండి. మరి ఈ చదువుకున్నవారికి తెలియాలి కదా సంగతి.”

“నివ్వు మాటిమాటికి సదుకున్నోరు, సదూకున్నోరంటవేటి. ఆరికేటీ తెల్దని తెలస్తనే ఉంది గద,” అంది సంద్రాలు మొహం చికిలించి.

“ఈ చదువుకోడం కూడా చాలా మారిపోయింది. పూర్వం చదవడానికి అందుబాటులో ఉన్న సాహిత్యం కూడా పరిమితమే కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, సాంకేతికపరంగా పుస్తకాలు ఆకాశంలో నక్షత్రాలన్ని దొరుకుతున్నాయి చదవడానికి. అవన్నీ చదివేయాలన్న ఉబలాటం కూడా పైస్థాయిలోనే ఉంది. అంచేత అందిన ప్రతిపుస్తకం గబగబ చదివేసి, సుమారుగా అందులో ఏముందో తెలిసేసిందనుకుని, మరోపుస్తకానికి తరలిపోతున్నారే కానీ, చదవడం ముగిసినతరవాత దాన్నిగురించి ఆలోచించడం మాత్రం తక్కువే. అంతగా అయితే తమకి నచ్చిన అంశాలు ఓరెండు రాసి ఏ పత్రికలోనో ప్రచురించేస్తారు. ఒకానొకప్పుడు ఒక పుస్తకం చదివేనంటే ఆ పుస్తకం దాదాపు కంఠతా పట్టినంత శ్రద్ధగా చదివేవాళ్ళం. ఇప్పుడు అట్ట గుర్తుంటే గొప్ప! పోనీ, ఇది అతిశయోక్తే అనుకుందాం. కానీ ఎక్కువ పుస్తకాలు చదివితే ఎక్కువ తెలుస్తుందన్న ధోరణి మాత్రం మంచిది కాదు. కావలసింది ఆ పుస్తకంలోని భావాలు చక్కగా అవగాహన చేసుకోగలగడం, అవి మనకి ఎంతవరకూ ఆదరణీయం అన్నది సుదీర్ఘంగా ఆలోచించే వివేకం.”

“చూడండి, ఆంగ్లసాహిత్యంమూలంగా మనం తెలుసుకున్నది ఎంతో ఉందంటే మానాన్నగారు ఒప్పుకోరు,” అన్నాడు తారకం నావేపు తిరిగి.

“నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. తెలుసుకునేదీ, తెలుసుకోవలసిందీ వేరు. అందులో మనకి ఏది పనికొస్తుంది, ఏది కేవలం మరొకజాతి సంప్రదాయం అని గ్రహించి పక్కన పెట్టుకోడం వేరు. లేకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నచందం అవుతాయి మనబతుకులు. అవుతున్నాయి.”

“పోన్లెండి. మనం ఏం చెయ్యలేం వీళ్ళని. మరేదైనా చెప్పండి. ఈమధ్య మీరు చదివిన ఓ పుస్తకంగురించి.”

అనంతంగారు, “నేను ఈమధ్య ఏంచదవలేదు” అని, తను చదివినపుస్తకాలలో తనకి బాగా నచ్చిన ఒకపుస్తకంగురించి  చెప్పడం మొదలు పెట్టేరు. నేను కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాను. ఆ తరవాత మరో నాలుగు పుస్తకాలగురించి మాటాడేరు. వాటిలో ఒక్కటి కూడా నేను చదివింది లేదు. నాగస్వరం వింటున్న నాగుబాములా తలూపుతూ కూర్చున్నాను. ఆహా అనిపించిందాపూట. ఆయన చెప్పిందంతా నాకు అర్థం కాలేదు కనక ఇక్కడ రాయలేను. కానీ ఏదో వినదగినముక్కలు నాలుగు విన్న ఆనందం కలిగిందని మాత్రం చెప్పగలను. అవి దొరికితే నేను చదువుతాను. అప్పుడు బహుశా ఈయన చెప్పిన ఈసంగతుల్లో కొన్నైనా నాకు స్ఫురిస్తాయి. స్ఫురిస్తాయన్న నమ్మకం నాకుంది.

మొన్న వచ్చినావిడ మళ్ళీ పిలిస్తే ఏం మాటాడాలా అని ఆలోచిస్తున్నాను

– ఏముందిలెండి మాటాడ్డానికి. మీకెంతసేపూ అమ్మాయి పెళ్ళయిందా, నాన్నతో మాటాడుతుందా, ఆయనెక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఇవే కదా.

– అసలు ఒక మాటడుగుతాను చెప్పండి. మనం కలిసిన ప్రతిసారీ మీరు ఈమాటే తెస్తారు నేను ఆవగింజంతైనా  ఆసక్తి చూపకపోయినా. దానివల్ల మీరు పొందే ఆనందం ఏమిటి?

– నేను రాసినవేమీ చదివినట్టు లేదు. మీకు నచ్చలేదు కాబోలు. పోనీండి. నేను రచయితని కాననుకున్నప్పుడు నన్ను పిలవడం, కలవడం మాత్రం ఎందుకూ? జాలిచేతనా? తమాషా చూద్దాం అనా?

– నేనెలా ఉంటానో, ఏం మాటాడతానో అన్న కుతూహలమా?

– అయ్యో నాబతుకిలా అయిపోయింది అని నేనెడిస్తే చూడాలనా?

—–

ఫోను మోగింది. పోనుతీసి ఐడి చూసేను. ఆవిడే.

మరో రెండు రింగులు మోగి ఆగిపోయింది ఫోను. కిటికీవేపు చూసేను. చిన్న తుంపరలు మొదలయేయి.

“సిరాకు పోనాదా?”

మళ్లీ ఉలిక్కి పడ్డాను. “ఏంటి, వాళ్ళతోటే నువ్వూ వెళ్ళిపోయేవనుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్నావా?” అన్నాను నిరామయంగా.

“ఎల్నేదు. నివ్విప్పుడు ఏడస్త కూకుంటవేమొనని.”

“లేదులే. ఏడవడం లేదు. నేనలా ఏడవలేదనే ఆయమ్మ బాదేమో …”

“ఇందాకతల ఆబాబు సెప్పినారు గంద. ఈలలో సానామందికి ఏటి మాటాన్ను తెల్దు. అందుసేత అల మల్ల మల్ల అదే పెస్న అడగతరు. కొందురికి రాతలొస్తయి గానీ ఊసులాడ్డం తెల్దు. నివ్వంటె ఇట్టంగన్కనె వస్తరు, ఆయెన్క ఏం సెప్పాలో తెల్దు. నీకెందుకా గోల. ఆరినాగే నివ్వూ దులుపేసుకు పో, సరిపోతాది.”

“నీకేం, నువ్వలాగే చెప్తావు. నాకు మాత్రం విని, విని ప్రాణం కడగట్టిపోతోంది. “

“అయ్న నివ్ మాతరం తక్కవ తిన్నవేటి?”

“అదేమిటి అలా అంటావు, గంటన్నరసేపు నోరు మూసుక్కూచున్నాను హరికత వింటున్నట్టు.”

“మరి చిగురంటా యిని. చివర్నెటి సేసినవ్ టపాస్కాయ టప్మని పేల్సినట్టు అన్నవు గంద.”

“ఏంటి, నేనేం అన్నాను?”

“అదె సెప్పినవ్ గంద. నేనిందులకే సబలకెల్లనని. మరి ఆయమ్మ మొగం మాడిపోనేదా?”

అవును, సభలగురించి మాటాడుతుంటే, అన్నాను నేను సభలకిందుకే వెళ్ళనని. ఆవిడకూతురివేపు తిరిగి అన్నాను.

“హీహీ. అంతినయంగ సెప్పినవ్వేటి? ఏటి మాటాడవ్, ఎరికయినద నేనెటంటన్ననో.”

మ్ మ్. ఏమన్నానో జ్ఞాపకం రావడం లేదు.

“ఉప్పుడె గంద నాకు సెప్పినవు. ఆయమ్మ బాబుగోరికబురేదో సెప్తావుండేటేల నివ్వేమో తుపుక్కున ఇందికే నాను సబలకెల్లనంటివి. ఆడ ఇసమంటి మాటలిని తల బొప్పి కట్టేసినాదంటివి.”

అవును, నేను సభలకెందుకు వెళ్ళనన్నసంగతి అంతకుముందు మాటాడుకున్నాం కనక చెప్పేను.

“అంతెదనిక ఆగినవ? నేదు. ఆ పెద్దమ్మయెంక సెయ్యి సూపతా మరీ సెప్పినవ్. మల్ల నాను సబలకెల్లీది ఇసుమంటి ఊసులకా అంటివి. మరి ఆయమ్మకేటనిపిస్తదని నీకేటయిన తోసిందా?”

“హా!! తోసనేదు. నీకేల తోసిందట్ట.”

“ఏటి నన్నెకసక్కెలాడ్తన్నవు. ఉన్నమాట సెప్తే ఉలుకెక్కవంతరిందికే.”

“లేదు, లేదు, సంద్రాలూ, లేదు. నిన్ను వెక్కిరించడంలేదు. ఎందుకో అలా వచ్చేసింది. మరేదో గుర్తొచ్చింది. మరోలోకంలోకి వెళ్ళిపోయేను.”

“ఏటది? ఏటానోకం?”

“అదే, నాచిన్నతనంలో తొలిసారి నిన్ను చూసినప్పుడడిగేను, ఏ బళ్ళో చదివేవు, చెప్పు, నేనూ అక్కడే చదువుకుంటానని. మళ్ళీ ఇప్పుడు అలాగే అనిపిస్తోంది.”

“సూడు తల్లీ. అందురు మాటాడేతప్పుడూ ఎక్కవ తక్కవలొస్తయి. ఒకొప్పుడు తప్పూ, నొప్పీని, మరోతప్పుడు ఒప్పువుతాది. నామాటినుకో. నివ్వీల బుర్రవొంకరలు తీరసనేవు. తెల్సినాదా?”

తెలిసింది.

 

(మే 25, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “చేతనాకృతి”

 1. సివియర్ మోహన్, నాకథలో నేను చెప్పదలుచుకున్నది అలా మాటాడడం భావ్యం కాదని గ్రహించాలని. అలా మాటాడ్డం ఎంత హేయంగా ఉంటుందో చూపించడానికి ప్రయత్నించేను. కథానాయకి ఏం చెయ్యాలి అన్నది వేరే సంగతి

  మెచ్చుకోండి

 2. @ నారాయణస్వామి, :)). చూడండి మరి. విశ్వవిద్యాలయాలఆవరణలలో మాత్రం చూడకండి ఆవిడకోసం :p
  @ విన్నకోట నరసింహారావు, సంద్రాలు ఆస్థాన అన్నీనండి. ఆవిడస్థాయికి ఎదగాలి నేను కూడా.

  మెచ్చుకోండి

 3. చివరికి సంద్రాలు చేత అక్షింతలు తప్పలేదన్నమాట. ఫరవాలేదులెండి. సంద్రాలు మీ ఆస్ధాన విమర్శకురాలు కదా.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s