ఊసుపోక – పాతకథలలో కొత్తరుచులు?

(ఎన్నెమ్మకతలు 116)

ఈమధ్య నాకు కొన్ని సందేహాలు మొదలయేయి. మొదటి సందేహం ఏ కథ ఎప్పుడు మంచికథ అవుతుంది. ఈరోజుల్లో కథలేవీ బాగుండడం లేదనుకుంటున్నవారికి పూర్వం ప్రచురించినకథలు నచ్చేయా? ఎందుకు నచ్చేయి? వాటిలో అందాలేమిటి? అలాగే సమీక్షల్లో, పరిశీలనాత్మకవ్యాసాల్లో వాళ్లు చెప్పేదానికీ ఇప్పుడు మనం అనుకుంటున్నదానికీ ఏమైనా తేడాలునాయా? అని.

ఇంతలో మన తవ్వకాలరాణి  మళ్ళీ కొన్ని పాతకాలపు కథలూ వ్యాసాలూ తవ్వి తీసి నాకంపింది. Thanks.  సరే,  విశ్వనాథ సత్యనారాయణగారి వేనరాజు చదవలేకపోయేను కనక పులులసత్యాగ్రహం మొదలు పెట్టలేదు. రెండు కథలు నల్లబిందె-దుక్క చెంబు (భోగరాజు నారాయణమూర్తిగారిరచన), మల్లుపంచె (వఝ్ఝ బాబూరావుగారిరచన) పాతభారతి పత్రికలలో ప్రచురించినవి. పేర్లబట్టే తెలుస్తుననాయి కదా మామూలుగా మననిత్యజీవితాల్లో, నట్టింట జరిగే భాగోతాలే అని. ఈపాత కథల్లో నాకు కొత్తదనం రచయితల పేర్లు. అప్పట్లో వారు ప్రసిద్ధులే అనుకుంటా. ఆరోజుల్లో కూడా బారతిలాటి పత్రికలలో కూడా ఇలాటికథలు వచ్చేవన్నమాట అనుకోడానికి బాగున్నాయి. మునిమాణిక్యం నరసింహారావుగారికథలు చాలామందికి పరిచయమే కనక ఇవి కూడా అలాగే ఉన్నాయనుకోండి.

1928లో అంతటి నరసింహంగారు, యం.ఏ.యల్.టి, రాసిన గద్య కథానకము అన్నవ్యాసంలో కథాలక్షణాలు వివరించడం జరిగింది. కథకీ నవలకీ గల తేడా, కథల్లో అంశానికి ప్రాధాన్యం చర్చించేరు. వ్యాసం నిడివి పది పేజీలుంది కనక చాలా విషయాలుంటాయనుకున్నాను కానీ ఆనాటి కథలు దాదాపు పదో పదిహేనో కథలు సూక్ష్మంగా చెప్పేరు కానీ పాత్రపోషణ, వాతావరణం, నేపథ్యం, ఎత్తుగడా, ముగింపువంటి కథానికాలక్షణాలేవీ విడివిడిగా చర్చించలేదు.

నాకు కొత్తగా తెలిసినవేమిటంటే, ఇంగ్లీషు పదాలకి ఆయన ఇచ్చిన తెలుగుపదాలు. ఉదా. anti-climax హీనక్రమము, background వెనుకభాగము. అట్టే లేవు కానీ ఆరోజుల్లోనే ఈ సమానార్థకాలు సృష్టించడం మొదలయినట్టుంది. లేదా, ఇంకా ముందే మొదలయిందేమో.

రెండో విషయం కృష్ణవేణి అన్న కథలో కథాంశంగురించి ఆయన రాసిన కొన్ని విషయాలు కూడా నాకు ఆసక్తికరంగానే ఉన్నాయి. నిజానికి ఈకథవిషయంలోనే ఆయన లోపాలు ప్రస్తావించింది. “కథాంశము కల్పితమా, లేక ఆధునికజీవితమునుండి కొలదిమార్పులతో గ్రహించినదా అని సందేహము కలుగవచ్చు. ఇది ఒకలోపము” అంటారు నరసింహంగారు. ఇది లోపమని ఎందుకనుకున్నారో నాకర్థం కాలేదు. “కల్పన నైజ జీవితప్రతిబింబముగా నుండవలెను గానీ నైజజీవితకథనమే యగుచో వెగటు పుట్టించును. కళయొక్క ఆశయమే చెడిపోవును. ప్రకృతిననుసరించి నైజజీవితమును ప్రతిబింబింపజేయు కల్పన జీవితమందును, మనుజులభావములయందును గల మంచిచెడ్డలను గుర్తెరుంగ నూత యొసగుచు మనస్సుకు ఆనందము కలిగించును” అంటారు. ఈవాక్యాలు నాకు బాగా అర్థం కాలేదు కానీ, ఇది శిల్పానికి సంబంధించిన వ్యాఖ్య అనుకుంటాను.  ఈ తరవాతివాక్యం కూడా అదే చెప్తున్నట్టుంది. “చదువరికి ఉత్కంఠ కలుగజేసి యాతనిమనము బలవద్గ్రాహముగా పట్టియుంచును.” ఇది ఆనాటి వాడుకభాష అనుకోవాలి. కథాశిల్పంగురించిన ప్రస్తావన మరొకచోట కూడా ఉంది. పాశ్చాత్యులు కనిపెట్టిన Planchet పద్ధతిని కథకుడు ప్రవేశపెట్టినట్టుంది అన్నారు రచయిత. ఆపదానికి అర్థం A flat disk of metal ready for stamping as a coin; a coin blank అని జాలంలో వెతికి తెలుసుకున్నాను. కిందటివారం చర్చలోకి వచ్చిన కుక్క జాలి అన్నమాట నాకు గుర్తుకొచ్చింది. మనం ఒక విషయం తెలుసుకోడానికి చదువుతున్న వ్యాసాల్లో ఇలా అర్థాలు ప్రాచుర్యంలో లేని మాటలు వాడితే పాఠకులకి కష్టం అని నా అభిప్రాయం. ఇవి మనదృష్టిని మరోవేపు మళ్ళిస్తాయి. నాకు ఈ వ్యాసంలో రాలేదు కానీ కొన్ని కథల్లో చాలామాటలకి అర్థాలు వెతుక్కోవలసివచ్చింది. :))

ఈ కథలో నరసింహంగారు ఎత్తి చూపిన మరో విశేషం, కథ చివరలో “చదువరులు ఇందువలన నేర్చుకొనతగిన పది నీతుల పట్టిక చేర్చబడినది,” అని. దీన్ని కూడా నరసింహంగారు లోపము అనే “ ఇది కళకు పెద్దలోపము. ఈపట్టిక లేకున్న కథ బాగుండెడిది” అని రాసేరు. ఈ పద్ధతిని ఆయన కూడా ఆమోదించలేదు కనక మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కానీ ఒక కథారచయితకి అలా చెప్పాలని తోచడం, భారతి పత్రిక సంపాదకులు దాన్ని ప్రచురించడం మాత్రం విశేషంగానే భావిస్తున్నాను నేను. నిజానికి ఈనాటికీ ఈ చర్చ సాగుతూనే ఉంది. అంటే ముగింపులో రచయిత అలా జాబితా ఇవ్వకపోయినా, సందేశం స్పష్టం చేయాలా చేయకూడదా అన్నది చర్చనీయాంశంగా. 1928 ఆగస్టు బారతిలో ప్రచురించిన వ్యాసం ఇది.

పిలకా గణపతిశాస్త్రిగారు తెలుగుస్వతంత్ర ఆగస్టు 1948 సంచికలో ఏది ఉత్తమరచన అన్న వ్యాసంలో సంపాదకులు ఏది మంచికథ అవునో కాదో ఎలా నిర్ణయించుకుంటారో, ఎలా నిర్ణయించుకోవాలో చెప్పేరు. చారిత్రకంగా సాహిత్యఉద్యమాలు లేదా కొత్తపోకడలు ఒకదానితరవాత ఒకటి రావడానికి ప్రాతిపదిక మేధ, బావము అని చెప్తూ, మేధ ప్రధానంగా కందుకూరి వీరేశలింగంగారికాలంలో మొదలయితే, గురజాడ అప్పారావుగారికాలం వచ్చేసరికి భావానికి పెద్దపీట వేయడం జరిగిందంటున్నారు. పాఠకులు ఆత్మాశ్రయకథలూ, కవితలూ అర్థం కాలేదంటే, రచయితలు మేం మీకోసం రాయడంలేదంటారుట. ఈరచయతకి ఆత్మాభివ్యక్తి, ఆత్మానందం ప్రథాన లక్ష్యాలయేయి అంటారు. కానీ సంపాదకులు ఉత్తమరచన సేకరించాలంటే ఒక్క భావమో ఒక్క మేధో మాత్రమే కాక రెంటినీ గమనించి, సమన్వయపరుచుకుని, కథ సజీవమైనదో కాదో నిర్ణయించుకోవాలిట. అంతే కాదు. కేవలం అక్కడే ఆగిపోతే, కొత్తఉద్యమాలు పుట్టే అవకాశం లేదు. నవ్యత కూడా అవసరమే సాహిత్యం అభివృద్ధి చెందడానికి. నవ్యత అంటే భావంలోను, భాషలోనూ, సరికొత్తగా ఉండడంమాత్రమే కాదు. “ఈరోజుల్లో అనేకులు విదేశీనవలలు, కథలు చదివి, ఆధేశాల సాంఘికసమస్యలు, సంఘటనలు మనదేశంలో ఉన్నాయని భ్రమించి సరిగా విదేశీయరచనలకు మక్కికి మక్కిగా రాస్తున్నారు. నవ్యతలో ఒకరకమైన దేశీయత కూడా ఉంటుంది. ఇక్కడ దేశీయత దేశానికి సంబంధించడము అనే అర్థంలో వాడడం లేదు. ఆంగ్లరచన చదివినా, పరాసు రచన చదివినా … మనకు ఆయా దేశాలముద్ర కనబడుతుంది. ఎంత ప్రాచీరచన అయినా, ఎంత నవ్యరచన అయినా మనం ఆయా దేశాల “ఆత్మముద్ర” గుర్తించగలము. అలాగే తెలుగు దేశీయులరచన చదివితే ఆ దేశీయుల సంస్కృతి, పరిసరాలు, ఆచారాలు, మొదలైనవి ఆలోచనలో ప్రతిబింబించి, మన ప్రత్యేకదేశీయత సూక్ష్మంగానైనా కనిపించి తీరుతుంది, మనం అనుకున్న ఈ దేశీయత మన అంతరాంతరాల్లో ఉండాలి. సజీవమైన రచనలో ఈ దేశీయత ఉండితీరుతుంది. ఇంతకు పూర్వం వచ్చే రచనలో లేని ఒక ప్రత్యేకత్వము, కొత్తదనము కూడా ఉంటాయి” అంటారు. ఈవాక్యాలు నాకు చాలా నచ్చేయి. 1948లో రాసిన ఈవాక్యాలు ఇప్పటికీ మనరచనలకి అన్వయించేలా ఉన్నాయంటే, గణపతిశాస్త్రిగారి రచన సర్వ కాలీనం అనుకోవాలా? అయ్యో, ఎవరూ ఆయనమాట లక్ష్యపెట్టలేదు అనుకుని విచారించాలా?

మనసాహిత్యం ఎంతటి పురోభివృద్ది సాదించింది అని తెలుసుకోడానికి ఇలాటి రచనలు చాలా సాయపడతాయి. ఎందుకంటే, ఇప్పుడు చాలామంది తెలుగు సాహిత్యం ఎంతో ముందుకు సాగిపోయిందని మురిసిపోతున్నారు. కానీ గణపతిశాస్త్రిగారు నిర్వచించిన “నవ్యత” మాత్రం అట్టే కనిపించడంలేదనే నాకనిపిస్తోంది.

అన్నట్టు కథలవిషయంలో ఎదుగని బిడ్డ కథ కూడా ఉంది. చదివేను కానీ దానిమీద సౌమ్యే రాస్తే బాగుంటుంది. ఆటపాకోసం ఎదురు చూస్తూ …

తా.క. సౌమ్య టపా రాయడం పూర్తయింది. లింకు ఇక్కడ

(జూన్ 12, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – పాతకథలలో కొత్తరుచులు?”

 1. సౌమ్య, అంతే కదా .. శంఖంలో పోస్తేనే తీర్ధం .. 🙂

  మాలతిగారు – కృష్ణారావుగారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పలేదండి. మంచి రచనలు చేశారు అని నాలుగైదు సార్లు తల్చుకున్నారు.

  మెచ్చుకోండి

 2. సౌమ్యా, 🙂 🙂 :). ఆ తవ్వకాలరాణి నాకు పరీక్ష పెడతానని బెదిరిస్తోంది కూడా. మ్. అందుకన్నమాట ఈ పేపరు రాసేసి ఋణం తీర్చుకున్నా. :p

  మెచ్చుకోండి

 3. నారాయణస్వామి గారికి: ఎదుగని బిడ్డ కథ ఫేస్బుక్ కథ గుంపులో షేర్ చేశాను గత వారం అక్కడ చదవండి 🙂 నేను అంతగా చెబితే వినిపించుకోలేదు. మాలతి గారు చెప్పగానే కుతూహలం చూపుతున్నారు!!

  మెచ్చుకోండి

 4. నారాయణస్వామి, మీరు ఆత్మముద్రనిగురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది. పాశ్చాత్య ఈస్తటిక్ ముద్రలు పడతాయి తప్పకుండాను. ఆ స్పృహ ఉండడమే గొప్ప వషయం. నేను కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇష్టపడడం, ఇష్టమయినవిధంగా కథలు రాయడం మంచిదే. అయితే మనం రాసేకథల్లో మనదైన ముద్ర, తెలుగు సంస్కృతి, సంప్రదాయలముద్ర కూడా ఉండాలంటున్నారనుకుంటా. మీరు మార్చుకోడం కాదు కావలసింది, గణపతిశాస్త్రిగారు చెప్పినట్టు వాటిలో ఏ బావాలు, మాటతీరు మనసంప్రదాయానికి అనుగుణంగా ఉందో కూడా చూసుకోవాలి. నిజానికి ఒక తేడా చెప్పాలంటే నేను ఈమధ్యనే రాసిన చేతనాకృతిలో ప్రైవేసి అన్న భావం తీసుకోవచ్చు. నేను అలా రాయడానికి కారణం పాశ్చాత్యసంప్రదాయంముద్ర నామీద పడడమేనా అన్న అనుమానం నాకు ఓ పక్క కలుగుతోంది కూడా. ఈవిషయం ఇంకా చాలా చర్చించవచ్చులెండి.
  శ్రీరమణగారు జీ.వి. కృష్ణారావుగురించి ఏమైనా కొత్తసంగతులు చెప్పేరా, నాఅభిప్రాయాలు మీరు చదివేరు కదా అంచేత అడుగుతున్నాను. ఎదగనిబిడ్డగురించి లేదు ఇక్కడ చర్చ జరగలేదు. మళ్ళీ రాస్తాను.

  మెచ్చుకోండి

 5. తవ్వకాలరాణి .. కేక! 🙂

  ఆత్మ ముద్రని గురించి నేను కూడా ఇప్పుడే కొంచెం ఆలోచిస్తున్నాను. నేను ఎటువంటి కథని ఇష్టపడుతున్నాను, ఎలాంటి కథని రాయాలనుకుంటున్నాను అని బేరీజు వేసుకున్నప్పుడు .. నా మనసు మీద పాశ్చాత్య ఈస్థటిక్ ముద్ర ఎంత బలంగా పడిందో అర్ధమవుతున్నది. I don’t know if I need to change it or if I can change it now.
  “ఎదగని బిడ్డ” కమామిషు ఏవిటి? దీన్ని గురించి పూర్వరంగం ఏమన్నా ఉన్నదా చర్చలో?
  అన్నట్టు శ్రీరమణగారితో జరిగిన సంభాషణలో ఆయన జీవీ కృష్ణారావుగారిని చాలా తలుచుకున్నారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s