మిన్నూ మన్నూ ఏకం చేస్తూ గాలీ వానా

నిదానంగా, పెళ్లినడకలతో ఒకటీ, రెండూ, మూడూ చినుకులు మొదలయి, చూస్తూండగానే చింతగింజలంతయి, హోరున కుంభవృష్టి ఊపు అందుకుంది. వాన పెద్దదయేలోపున ఇల్లు చేరుకుందాం అని పరుగులాటి నడక అందుకుని, అది పనికిరాదని నిశ్చయించుకుని, బస్టాపువేపు మళ్ళేను తల దాచుకోడానికి.

అప్పటికే ఆ షల్టరు కిటకిటలాడుతోంది బస్సుకోసం వేచివున్నవారితో. అంటే బోల్డుమంది ఉన్నారని కాదు. ఐదారుగురు ఉన్నారు. ఆ గూడు వాళ్లతోనే నిండిపోయింది. గాలివాలుగా కొడుతున్న జల్లు చూసుకుని, రెండోవేపు షెల్టరుకి పక్కగా నక్కేను కొంతలో కొంతయినా రక్షణ అని. ఆ కంతలతో నిండిన చుట్టు పలకలకి లోపలివేపు నించున్నాయన రవంత జరిగి, “ఇటు రావచ్చు, ఫరవాలేదులే,” అన్నాడు సౌమ్యంగా. నేను చిరునవ్వుతో అతనిపక్కకి జరిగేను. తుప్పజుట్టుమీద మాసిన టోపీ, అంతకంటె ఎక్కువ మాసిన గళ్ళచొక్కా, భుజాన ఏరంగో తెలీని సంచీ, చేతిలో మరో చిన్నసంచీ – మధ్యాన్నంకూడు కాబోలు – గంట కూలీ కష్టజీవి అయి ఉండాలి వాలకం చూస్తే. ఇటుపక్కన ఓ ఆడమనిషి, యాభై పైనే ఉండొచ్చు, ప్లాస్టిక్ పాంచో కప్పుకుని నిరామయంగా నిలుచుంది. బస్సు రాకపోయినా నేనేం అనుకోను అన్నట్టుంది ఆవిడ వాలకం చూస్తే. వెనక ఇద్దరు సెల్లులు చెంపలకానించుకుని గడగడ చెప్పేస్తున్నారేదో ఎవరికో. చెప్పాల్సిందంతా ఇప్పుడే చెప్పకపోతే, మళ్ళీ అలాటి అవకాశం రాదనుకున్నారేమో. వాళ్లమొహాలు చూడ్డానికి నాకు మొహమాటంగా ఉంది. నేను వెనుదిరిగి వాళ్లవేపు చూస్తే, అదేదో సిగ్నలుగా వారూహించుకోవచ్చు.  వాళ్ళు నన్ను విసిగిస్తున్నారని నేననుకుంటున్నానని వాళ్ళనుకోవచ్చు. ఆతరవాత వాళ్లకి నేనూ, నాకు వాళ్లూ క్షమాపణలు చెప్పుకోలేక చావాలి. కానీ ఎంత వద్దనుకున్నా మాటలు మాత్రం వినిపించకమానవు కదా – “రేపు పెద్ద సేలు కదా, రారాదూ?” “నాకింకా జీతండబ్బులు చేత పడలేదు, ఎల్లుండిదాకా ఆగరాదూ? లేదంటే, నువ్వియ్యి, తరవాత …” “మా గ్రాంమా వస్తోంది … మహ చాదస్తం,” “అబ్భ, ఏం వాన, ఆపీసు మూసేస్తే బాగుండు,” “అడిగేను, వచ్చినవాళ్ళు వచ్చేరు కదా మూసేసి పొమ్మనడమేమిటి?” “నాకు అసలే కీళ్ళనొప్పులు, ఈ చలిలో వానలో నొప్పి రెట్టింపవుతోంది.” “అవునెళ్ళాలి డాక్టరుదగ్గరికి. టైమేదీ?” “నాకు కాన్సరొచ్చిందేమోనని అనుమానంగా ఉంది,” “నేను ప్రిగ్నెంటనుకుంటా.” “మా పిల్లాడు కారు తీసుకు ఎటో పోయేడు నిన్నట్నించి కనిపించడం లేదు.” “మన్లాటాళ్ళని ఎవరు పట్టించుకుంటారు?” … … ఏంటో, హోరుమని గాలీ, కుండల్తో కుమ్మరిస్తున్నట్టూ వర్షపాతం వీటిమధ్య ఈ కబుర్లేమిటో … అవి నాచెవిని పడడం నాకు మరింత ఇబ్బందిగా ఉంది. తొంగి చూసేను పోనీ అటుపక్కకి వెళ్దామా అని. అటువేపునించే జల్లు కొడుతోంది.

హోరుమంటూ గాలీ, జోరుగా వర్షం, … జనాలకి షెల్టరుగా చెలామణి అవుతున్న ఈ గూడు తాటాకులతడక్కంటే అర్థాన్నం. మరో విసురు గట్టిగా గాలి కొడితే గడ్డిపోచలా ఎగిరిపోతుంది, సందేహం లేదు. మూడువేపుల చుట్టుకుని ఉన్న స్టీలుకంతల్లోంచి తుప్పర్లు మీద పడి బట్టలు తడిసిపోతున్నాయి.

“షెల్టరుకి ఈ కంతలేమిటి?” అన్నాను నాపక్కనున్నాయనతో.

“గాలి కోసం అనుకుంటా. లేదా రూలేమో.ఠ

“అయ్యో, నాసంచీ … తడిసి ముద్దయిపోయింది, అందులో నాకాయితాలు …” “నా పేంటు చూడు, ఈ పక్కనంతా …” “ఉండుండు, వాళ్ళాఫీసుకి ఫోను చేసి అడుగుతాను … బస్సు ఆరునిముషాలు ఆలస్యంట…” “లేదు, లేదు, అదుగో వచ్సేస్తోంది,” “కాదు, కాదు, అది దక్షిణానికెళ్ళేబస్సు, ఉత్తరానికెళ్ళేది ఆలస్యం,” “అదేమిటి, ఉత్తరదిక్కున వాన లేదేమిటి?” “అదుగో … సమయానికే వచ్చేస్తోంది …”

ఒకదానివెంట ఒకటి, రెండూ వచ్చేసేయి. ఎవరిబస్సులో వారు సర్దుకున్నారు,

నేనూ, మరోమనిషీ మిగిలేం. “నాతో పని చేసేఆవిడ వస్తోంది నన్ను తీసుకెళ్లడానికి.”

తలూపేను అర్థమయినట్టు.

వానకథలు – వానా వానా చెల్లప్పా, వాకిలి తిరుగూ చెల్లప్పా, … వానల్లు కురవాలి, వరిచేలు పండాలి … వీధికాలువల్లో కాయితప్పడవలు, … అమ్మతో ఎల్లమ్మతోటదగ్గర చిన్మయ్ ఉపన్యాసానికి వెళ్ళడం – అప్పటికింకా ఆయనకింత పేరు లేదు – తిరిగొచ్చేటప్పుడు పెద్దపెట్టున వాన, తుప్పగా తడిసినపోయిన చీరెలబరువుతో కాళ్ళీడ్చుకుంటూ ఆస్పత్రి అప్పుమీద పడ్డ అగచాట్లు, … అస్పత్రి అప్పూ, కాలేజీ డౌనూ పాట్లు …విశాపట్నంవాసులకే ఎరిక .. “నిన్నెందుకు రమ్మనకుండా ఉండాలిసింది, రేప్పొద్దున జలుబు చేసి, జొరం వొచ్చేస్తుందేమోన”ని అమ్మ పడ్డ తపన, … ఆరోజూ, మర్నాడూ కూడా నాకేమీ రాలేదు కానీ … అప్పట్లో ఇలా నామంచిచెడ్డలు చూడ్డానికెవరోఒకరు ఉండడంతో నేనెప్పుడూ నాగురించి ఆలోచించనే లేదు. ఇప్పుడు ఇక్కడికొచ్చేక తెలిసింది నాకు నేనే దిక్కని.

“నీకోసం ఎవరైనా వస్తున్నారా?”

ఉలికిపడి, ఆవిడవేపు చూసేను, “హా?”

“నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారా?”

“లేదు. నేనిక్కడే…”

“ఎవరూ లేరూ? నా బస్ పాసిస్తాను. ఇంకో బస్సు వస్తుంది, అందులో వెళ్ళు.”

“అవుసరంలేదు. అదుగో ఆదే మా కాంప్లక్స్. అరమైలు కూడా లేదు. వాక్ …”

“ఎందుకైనా మంచిది. ఈ పాస్ ఉండనీ. బస్సులో అక్కడిదాకా వెళ్ళొచ్చు.”

“వద్దులే. అయినా నీకు మళ్ళీ అవుసరం అవుతుంది కదా.”

“లేదు. ఇది రెండు గంటలసేపే. అదుగో నాకారొస్తోంది. ఇంద.”

“వద్దమ్మా, నాకవసరం లేదు,” అంటూండగానే, ఆమె పరుగెత్తుకు వెళ్ళిపోయింది. రోజూ ఉద్యోగానికెళ్ళే మనిషి రెండుగంటల పాసు తీసుకోడమేమిటో…. మామూలుగా నెలపాసు తీసుకుంటే చవక కాదూ … ఏమో, కాదు కాబోలు.

రాను రాను వాన ఉధృతమవుతోందే కానీ తగ్గే జాడ లేదు. ఇదేదో ఆశ్చర్యంగానే ఉంది. నక్క పుట్టి మూడు వారాలు కాలేదన్నట్టు, నేనిక్కడికొచ్చి ఏణ్ణర్థం కాలేదు కానీ ఇంతవరకూ నేనెప్పుడూ చూళ్ళేదు ఇంత ధాటీగా ఆక్కుండా వాన పడ్డం.”

రోజూలాగే గంటలపంచాంగం చూసుకునే బయల్దేరేను సంచారానికి.

నాలాప్టాపు గంటగంటకీ ఇంకా కావలిస్తే పావుగంటకోమారు కూడా చెప్తుంది. రోజూలాగే ఇవాళ కూడా చూసుకునే బయల్దేరేను. నిజానికి టీవీలో కూడా చూస్తాను ఎందుకైనా మంచిదని. మనూళ్ళో ఆయవారబ్రాహ్మలు గుమ్మంలోకొచ్చి తిధివారనక్షత్రాలు మూణ్ణిముషాలు వల్లించి ఆపూట బత్తెం  పుచ్చుకు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఎండావానాపండితుడు పావుగంట చెప్తాడు సోది –  హై ప్రెషరూ, జెట్ స్ట్రీమూ …  ముఫ్పై శాతం, నలభై శాతం వాన పడుతుందనో పడదనో చెప్తే నాకేమిటి ఒరిగింది? పైగా ఈ ఊరొచ్చి ఏణ్ణర్థం అయింది, ఒక్కమారూ గట్టిగా గంటసేపు ఇలా జడివాన కురవలేదు. ప్రతిసారీ కొంపలంటుకుపోతున్నట్టో, యెవరో తరుముకొస్తున్నట్టో గబగబ నాలుగు చినుకులు తుప్పుతుప్పుమని పడ్డం, ఆగిపోడం. కాగా, దూరంగా ఏ పక్కఊళ్ళోనో కురిసిన కుంభవృష్టిమూలంగా మాయింటిపక్కగా పారుతున్ననదిలోకి దేశంలో ఉన్న చెత్తా చెదారం అంతా కొట్టుకురావడం. నాకళ్ళతోనే చూసేను ఫోంసోఫాలనించీ చిత్తుకాయితాలవరకూ ఆ కొట్టుకొచ్చే చెత్తలో చెప్పలేనంత వైవిధ్యం… ఎటొచ్చీ మనకి ఊరట కలిగించేదేమిటంటే, ఇది పారే నీరు కనక నాయింటివెనక నిలిచిపోదు. వచ్చినదారినే కాకపోయినా పోతున్నదారిలోనే కొట్టుకుపోతుంది తార్రోడ్డుమీద కొత్తకారులా (ఈ ఉపమ నాది కాదులే.). మళ్ళీ తెల్లారేసరికి, సుజనుడి వదనంలా స్వచ్చంగా, నిష్కల్మషంగా, కంటికింపుగా పారుతూ, మనసుని తెరిపిన పడేస్తుంది. ప్రాణం కుదుటపడుతుంది …

హోరున గాలి, యాభైమైళ్ళవేగం ఉంటుంది, వర్షం కుండలతో కుమ్మరించినట్టు ఏకధారగా … అడ్డూ అదుపూ లేకుండా కురుస్తోంది. ఇంక ఆగితే, కనీసం తగ్గితే బాగుండుననిపిస్తోంది.

ఉరుములూ, మెరుపులూ, చెట్లు 30 డిగ్రీలకి వాలి అల్లల్లాడిపోతున్నాయి గాలిహోరుకి తట్టుకోలేక. వాన కొంచెం ఒఖ్ఖ అయిదు నిముషాలు ఆగితే బాగుణ్ణు, నాయింట్లో నేను పడతాను … నాయింటివెనక యేటిపాయ ఈసరికి పొంగి పొర్లుతూ ఉండాలి. ఇలా పెద్దవాన వచ్చినప్పుడు కుంకుడుగింజలంత నీటిబొట్లు ఏటిమీద పడి తుళ్లుతుంటే ఫొటో తియ్యాలని నాకు ఎంతో కోరిక. ఇంట్లో ఉంటే ఆ కోరిక తీరి ఉండును, కానీ ఇంట్లో లేను! బస్సుస్టాపులో, రెండు బస్సులు వచ్చి వెళ్ళిపోయేక, విసిరి కొడుతున్న ముసురులో తలా బట్టలూ ఓపక్క తడిసిపోతుంటే, ఈ విశాలవిశ్వంలో ఏకాకిగా నేనూ ….

మరో మెరుపు మెరిసింది కళ్ళెదుట చెయ్యి చాపితే అందుతుందేమో అన్నంత దగ్గరగా. ఫెళ్లున విరిగిన వేపకొమ్మలా మెరిసి, క్షణంసేపు ఆకాశంలో అట్టే ఆగి మాయమయిపోయింది. అలాటిమెరుపు ఫొటో తియ్యాలన్నది నా రెండోకోరిక. సమయానికి చేతిలో కెమేరా లేదు.

మరో కోరిక కాదు గానీ, సౌకర్యం అనొచ్చు, ఇంత ఉధృతంగా వాన పడుతున్నప్పుడు కారుని షికారుకి తీసుకెళ్తే, కారు కడగడం కూడా అయిపోతుంది కదా. కారు ఇంటిదగ్గరుంది. నేను బస్టాండులో ఉన్నాను. అర్థం లేని కోరిక!

ఏమిటో ఈ తీరనికోరికలు, కలసిరాని సౌకర్యాలూ, అక్కరకు రాని చుట్టాల్లా … నాబతుకంతా ఇలా అందీ అందని అవకాశాలతోనే తెల్లారిపోతోంది.

ఎక్కడో మళ్ళీ మహోద్వేగంతో గర్జించింది మేఘం. మళ్లీ ఉలిక్కి పడ్డాన్నేను. ఎక్కడ పడిందో. గాలి పదడుగులయినా లేని బడుగుమొక్కలని పట్టి ఊపేస్తోంది కంగాళీ అత్తలా. ఆమధ్య ఓక్లహోమాలో వచ్చిన సుడిగాలి … ఇంతకి పది రెట్లుంటుందని తెలుసు కానీ అలాగే ఇక్కడ కూడా రాదనేముంది? ప్రళయప్రభంజనం ఒకటొచ్చి, నన్నూ, ఈ స్టీలుగూటినీ ఎదుట ఉన్న కార్లనీ, మారీచుసుబాహుల్లా ఎత్తుకుపోయి ఏ పక్కఊళ్లోనో మరో అడవిలోనో విసిరిపారేస్తే … ఎప్పటికో ఎవరికళ్ళయినా బడినా, నేనెవరో ఎవరికీ తెలీదు. ఏం చేస్తారో … నాస్నేహితురాలు సలహా ఇచ్చింది  ఏ సెల్లో తాళాలగుత్తిలో పేరో ఆనవాలుగా పట్టుకెళ్ళు వాక్కెళ్ళినప్పుడు అని. పోనీ, నా ఫోన్నెంబరు పచ్చబొట్టు పొడిపించుకోనా అన్నాను. అదయినా మంచిదే అంది తను. మ్. అది మంచిదెలా అవుతుంది. పచ్చబొట్టంత శాశ్వతం కాదు కదా ఫోన్నెంబర్లు.

నన్నెవరైనా తలుచుకుంటారా? ఏమని తలుచుకుంటారు? నాపిచ్చి కానీ ఏముంది తలుచుకోడానికి? ఇంటికెళ్ళగానే ఓ టపా రాస్తేనో – నేనింక లేనని తెలిసేక, మీరేమనుకుంటారో ఇప్పుడే చెప్పండని ఆర్త క్వాల్డ్ (ఈఉచ్చారణ జాలంలో తెలిసింది) లాగ. హుమ్. ఆయనస్థానం ఏమిటి? నాస్థానం ఏమిటి? ఆయనకి చెల్లింది. నేనడిగితే అతిశయం అంటారు. వాళ్లని అడగడం ఎందుకూ, నేనే రాస్తే పోలే. ఇదీ హాస్యమే అనుకుని నవ్వుతారు, అదీ మంచిదే. నవ్వుతారా, నవ్వుకుంటారా, నవ్విపోతారా? అభ్బ, మనతెలుగులో ఎన్ని ఛాయలో, ఎంత సూక్ష్మమో ఈ తేడాలు, … మ్. ఇంకా ఏం అనుకోవచ్చు? కోపగించుకోవచ్చు, నేనలా రాయనని, విసుక్కోవచ్చు నామనసులో మాట ఈవిడకెలా తెలిసింది చెప్మా అని, :p :p. ఆవిడ అలా అన్నందుకైనా మనం మరోలా రాయాలనుకోవచ్చు. అసలు ఏమీ అనుకోకపోవచ్చు, అనకపోవచ్చు. శతకోటి చావుల్లో ఇదొకటి … ఈమధ్య చావులమాట ఎక్కువగానే వింటున్నాను. వయసు మీద పడ్డకొద్దీ ఇవే వార్తలవుతాయేమో … విన్నప్పుడల్లా, నావంతూ వస్తుంది అనిపిస్తుంది. పాపం, చెప్పినవాళ్ళు అలా అనుకుంటారని కాదు. నాకలా అనిపిస్తుందంతే. రామం పోయినదగ్గర్నుంచీ ఇవే ఆలోచనలు …

ఇంత భయంకరంగా వర్షం పడుతుందని తెలిస్తే అసలు బయల్దేరకపోదును. టీవీలోనూ, లాప్టాపులోనూ చూసేక, మరోమారు కిటికీలోంచి చూసి బయల్దేరేను. తూర్పుదిక్కున అల్లంత దూరాన మేఘాలు నల్లగా కమ్ముకుని ఉన్నాయి కానీ గాలివానపండితుడు అప్పుడప్పుడు అన్నాడు కనక ఇప్పుడే కురవదులే అనుకుంటూ బయల్దేరేను. వాన పడదనే సూచనలే ఎక్కువున్నట్టు చెప్పేడు ఎండావానాపండితుడు. అయినా యాభై శాతం వాన పడే సూచనలున్నాయంటే, పడుతుందనా, పడదనా? నాక్కావలసిందల్లా వాన పడుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలియడం. వీధిలోకెళ్తే గొడుగు అవుసరం అవుతుందా అవదా అనే. సగం గొడుగు పట్టుకెళ్ళలేం కదా.

ఇంతకీ … వాన వెలవకముందే నాబతుకు ముగిసిపోతే, ఏమవుతుంది? నేను సృష్టించిన ఘనసాహిత్యమంతా ఏంకానూ? … హా. మళ్ళీ అదుగో అదే అతిశయం … మహా మహా రచయితలకే గతి లేదు. ఆయనెవరో చెప్పినట్టు చక్రవర్తి అశోకుడేడీ, జగద్గురు శంకరుండేడీ, మళ్లీ మాటాడితే ఈశతాబ్దంలోనే ఎందరో రచయితలు ఆనవాలు లేకుండా పోయేరు. … ఎవరూ మిగలరు పాఠాల్లోనూ పండితచర్చల్లోనూ తప్ప. అంతా క్షణికం. ఈ అనంతవిశ్వంలో నేనొక నలుసుని. … ఆమాటకొస్తే, తలిచేవాడూ, తలపించేవాడూ, తలపింపబడేవాడూ … ప్రతి జీవీ – అస్తిత్వం అంటే కాలపరిమితి కూడా ఉన్నట్టే … అస్తిత్వం, శాశ్వతం – బొమ్మా, బొరుసూ … కాదేమో … పరస్పర విరుద్ధంలా ఉంది. … మ్  … ఎందుకొచ్చిన గోల. హాయిగా రాసుకో. నీకు దినము గడవడానికి అదొక్కటే మార్గం కనక. ఆతరవాత ఏదో అవుతుందనీ ఆశించడం, ఏమీ కాదేమోనని బాధపడ్డం కూడా దండుగే. ఏమీ కాదు. అదుగో ఆ ఏటిలో చెత్తా చెదారంలాగే. నీరాతలు నీటిమీద రాతలు, అక్షరాలా…. జాలంలో రాస్తున్నావు కనక ఆ ఉపమానం చక్కగా అమిరిపోతుంది కూడాను.

నాకీ ధోరణి నచ్చలేదు. నారెండో నోరు మూసేసి, “విశాలదృక్పథం”లో ఆలోచించడం మొదలుపెట్టేను. నాకు ఏ ఆలోచనయినా నచ్చనప్పుడు ఇలా విశాలదృక్పథంతో ఆలోచిస్తానన్నమాట. అంటే, ఇవాళా రేపూ అనుకుంటే ఎంతో గొప్ప ప్రమాదంగా కనిపించేవి ఆ కాలమానం ఒక ఏటికో పదేళ్ళకో పెంచితే, ఆ ప్రమాదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఈ క్షణం ప్రాణాంతకమయింది ఈవారంలో ఈ నెలలో జరిగిన అనేకానేకసంగతులమధ్య పెట్టి చూస్తే, అంత ప్రాణాంతకంగా తోచదు. ఒస్, ఇంతేనా, పోనిద్దూ, లాటి మాటలొస్తాయి. …

వాన తగ్గుముఖం పట్టింది. ఇంతవరకూ పడుతున్నంత ఉధృతంగా లేవు ఇప్పుడు ధారలు. ఇంతవరకూ చీకట్లు ముసిరినట్టున్న ఆకాశం నెమ్మదిగా తెరిపిచ్చి, తెల్లబడుతోంది. చినుకులు చిన్నవయేయి. ఇంకొంచెంసేపుంటే, పూర్తిగా ఆగిపోతుందా, మళ్లీ పుంజుకుని విజృంభిస్తుందా? అట్టే దూరంలేదు, ఎలాగా బట్టలు సగం సగం తడిసిపోయేయి, జోళ్లు పూర్తిగా తడిసి ముద్దయిపోయేయి. వెళ్ళిపోనా? వీధుల్లో వరద, బురద, గబగబ నడవడానికి లేదు. జారిపడితే మళ్ళీ మరో కష్టం… మరి ఎంతసేపు ఎదురు చూడ్డం, ఎప్పుడు ఆగుతుందో ఎలా చెప్పడం.

మళ్లీ కథలు – వర్షం. వానకి జడిసి, బస్సుకోసం దిగులుగా చూస్తూ టీకొట్టులో దిగులు పడిపోతూ కూచున్న బస్తీ యువకుడు, బస్సు రాదు, నువ్వెక్కడికీ ఎల్నేవు అంటూ  చులాగ్గా శల్యసారథ్యం నెరపుతున్నాడు తాత. “వొరసంవా? అదేటి సేస్తాది మనలని. సంపిడిసీనా?” అంటూ,  వర్షంలో హుషారుగా లోపలికి దూసుకొచ్చేడు పన్నెండేళ్ల పోతరాజు …

నేను కదిలేను మీద పడుతున్న చినుకులని అభిమన్యుడిలా తప్పుకోడానికి ప్రయత్నిస్తూ, జారి పడకుండా అడుగులో అడుగేసుకుంటూ.

(జూన్ 19, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “మిన్నూ మన్నూ ఏకం చేస్తూ గాలీ వానా”

 1. “ఇంత ఉధృతంగా వాన పడుతున్నప్పుడు కారుని షికారుకి తీసుకెళ్తే, కారు కడగడం కూడా అయిపోతుంది కదా.”
  నేనూ ఇలానే అనుకుంటూంటాను, టివీలో వెదరు చూసి వర్షంరాబోయేముందు కారుకి కొంచెం సబ్బుపట్టించి డ్రైవ్వేలో పెడదాం అని, ఇంతవరకూ కుదిరిచావలేదు!

  మెచ్చుకోండి

 2. నారాయణస్వామి, చాలా భావాలు – అంతేనండీ ఏ కథకైనా ధ్యేయం. ఈకథకి మంచి వ్యాఖ్యలు … :)). వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మీరా, హాహా, వైరాగ్యం కాదు, జ్ఞానోదయం అనుకో. నేనింకా ముప్ఫైయేళ్లక్రితం ఉన్నట్టే అనుకుంటున్నావేమో.. మాఅన్నయ్య నీకు గుర్తున్నాడనే నేను కూడా అనుకున్నాను.

  మెచ్చుకోండి

 4. నరసింహారావుగారూ, నేను సీరియస్ గా తీసుకోలేదు ఆ విషయాన్ని. మీరు కూడా తీసుకోవద్దు. అవునండీ, ఒకొకపరిస్థితుల్లో, అంటే వాతావరణం మాత్రమే కాక, మనజీవితాల్లో జరిగిన సంఘటనలమూలంగా రకరకాల ఆలోచనలు వస్తాయి. అందులో చావు కూడా ఒకటి. కానీ, దానివెనకే, దానికి అనుపానమేమో అనిపించేట్టు ప్రత్యామ్నయమైనవి కూడా కనిపిస్తాయి. ఈకథలో నేను ఏకాకిని అనుకోగానే పక్కనున్న మనిషి నా పాస్ తీసుకో అనడం దానికో ఉదాహరణ. అంతే నేను చెప్పదలుచుకున్నది. పైగా ఇది కథే కదా. సాయంసంధ్యలో మెలంఖలీ కూడా అలాగే. మంచి సామ్యం తెచ్చేరు.

  మెచ్చుకోండి

 5. అయ్యో, నా ఉద్దేశ్యం “వెర్రిమొర్రి” ఆలోచనలు అని కాదండి. మీలాంటి పెద్దలు, విద్యాధికులు “వెర్రిమొర్రి” ఆలోచనలెందుకు చేస్తారు. అసలు నాకు తెలిసినంతవరకూ మోర్బిడ్ అంటే చావు లాంటి విషయాలమీద అనవసర కుతూహలం / ఆలోచనలు ఉండటం అనుకుంటాను. అయినా ఇంగ్లీష్ లో ఎం.ఏ చేసిన మీకు తెలియదనా నేను చెప్పటం. పరిసరాల మూలంగా, వాతావరణం మూలంగా – ముఖ్యంగా సాయం సంధ్య లో – ఒక్కోసారి melancholy గా అనిపిస్తుంది. ఈమధ్యే మీ అన్నయ్యగారు పోవటం కూడా మరొక కారణం అయ్యుంటుంది.

  మెచ్చుకోండి

 6. మాలతీ,
  వైరాగ్యం నుండి బయట పడలేదా ?రామం అన్నయ్య గురించి చదివి కాసేపు నేనూ బాధ పడ్డాను . నాకున్న ఒక్క తమ్ముడూ లేకుండా పోయాడు ఆరునెలల క్రితం . మన వుమ్మడి స్నేహితురాలు గోదావరి వెళ్ళిపోయింది . ఆమె గుర్తున్దనుకుంటా . నువ్వు అన్నట్టు ఈవయసులో ఇలాటి వార్తలే వింటున్నాం . మన్ను మిన్ను ,చేతనాకృతి చదివాను .లొపల బయట ఈగాలివానలు అందరికీ తప్పవేమో . అమెరికాకు వచ్చినప్పుడు మాత్రమే పలుకరిస్తానని కోపమేమో . ఈరాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా . Meera

  మెచ్చుకోండి

 7. @ విన్నకోట నరసింహారావు, ప్రకృతి భీభత్సంలో అలాటి తలపులు – అదేనండీ నేను ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. కుక్క దాలిగుంటలో పడుకున్నంతసేపే, హీహీ. మార్బిడ్ కి తెలుగు వెర్రి అని ఇప్పుడే ఆంధ్రబారతిలో చూసి తెలుసుకున్నాను. అంటే వెర్రిమొర్రి ఆలోచనలనుకోవాలి.
  @ లలితా, థాంక్స్. ఏదోలెండి, ఉన్నాను కనకే రాయడం… :p

  మెచ్చుకోండి

 8. మీరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. సంతోషం. జాగ్రత్తగా ఉండండి. ఇంత బాగా express చెయ్యగలగడాన్ని అభిందించకుండా ఉండలేకపోతున్నాను, మీ కష్టం, భయం అర్థం చేసుకుంటూనే.

  మెచ్చుకోండి

 9. బస్ షెల్టర్ చుట్టూ స్టీల్ కంతలున్నాయి. మా దేశంలో మా ఊళ్ళో అయితే బస్ షెల్టర్ల పైన కప్పు కూడా ఉండదు చాలా చోట్ల. ప్రకృతి బీభత్సంలో ఒక్కళ్ళూ నిలబడుంటే చివరి పేరాల్లో వచ్చినటువంటి morbid (తెలుగులో ఏమంటారో వెంటనే తట్టటంలేదు) ఆలోచనలు రావటం సహజమేలెండి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s