మన కథల్లో తెలుగు ఆత్మముద్ర

1948లో పిలకా గణపతిశాస్త్రిగారు “ఈ రోజుల్లో అనేక వచనరచయితలు విదేశీయకథలు, నవలలు చదివి, ఆ దేశాల సాంఘిక సమస్యలు, సంఘటనలు మనదేశంలో ఉన్నాయని భ్రమించి, సరిగా విదేశీయరచనలకు మక్కికి మక్కీగా వ్రాస్తున్నారు. నవ్యతలో ఒకరకమైన దేశీయత  కూడా ఉంటుంది. ఇక్కడ “దేశీయత” దేశానికి సంబంధించడము అనే అర్థంలో వాడడం లేదు. ఆంగ్లరచన చదివినా, పరాసు రచన చదివినా, రష్యా రచన చదివినా మనకు ఆయా దేశాలముద్ర కనబడుతుంది. ఎంత ప్రాచీనరచన అయినా, ఎంత నవ్యరచన ఆయినా మనం ఆయాదేశాల “ఆత్మముద్ర” గుర్తించగలము. ఆలాగే తెలుగు దేశీయులరచన చదివితే ఆ ధేశీయుల సంస్కృతి, పరిసరాలు, ఆచారాలు మొదలైనవి ఆలోచనలో ప్రతిబింబించి, మన ప్రత్యేక దేశీయత సూక్ష్మంగానైనా కనిపించితీరుతుంది. మనం అనుకున్న నవ్యత ఈ విధమైన దేశీయత అంతరాంతరాల్లో ఉండాలి. ఉండాలి అని ఒక నియమం విధించడం లేదు. సజీవమైనరచనలో ఈ దేశీయత ఉండితీరుతుంది. ఈ “నవ్యత” ఉన్న రచనలో ఈ దేశీయతా ఉంటుంది, ఇంతకు పూర్వం వచ్చే దేశీయరచనలో లేని ఒక ప్రత్యేకత్వము, కొత్తదనము కూడా ఉంటాయి,” అని రాశారు.

ఒక తరం తరవాత, 1975 లో మధురాంతకం రాజారాంగారు, “కథకులు సూటిగా తన చుట్టూరా నెలకొన్న సమాజంనుంచి కథావస్తువును తీసుకున్నంతకాలం తెలుగుకథలోని తెలుగుదనానికి సేగి వాటిల్లదు. అందుకు భిన్నంగా ఇతివృత్తంకోసం ఇతర పుస్తకాలపైన, ఇతర భాషలసాహిత్యంపైన, సినిమాలపైన ఆధారపడినంతమేరకు తెలుగుతనం లుప్తం కాక తప్పదు. ఈ ప్రమాదం నేడు తెలుగుకథని ఎదుర్కొంటున్నమాట వాస్తవం. తెలుగునేలపైన ఎక్కడా కానరాని వాతావరణం, పునాదులు లేకుండా ఆకాశంనుండి ఊడిపడినట్టుండే పాత్రలు ఈనాటికథల్లో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు. జీవద్భాషతో సంబంధంలేని ఒక కృతక తెలుగుశైలి నేటికథల్లో కానవస్తుంది.” అంటారు తెలుగుకథలో తెలుగుదనం అన్నవ్యాసంలో (మధురాంతకం రాజారాంగారి కథాయాత్ర. పు.55). ఉదహరించడానికి నాదగ్గర పుస్తకాలు లేవు కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ, విశ్వనాథ సత్యనారాయణగారు మొదలైన సుప్రసిద్ధ రచయితలు కూడా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చేరు. ప్రస్తుతం మూడో తరం అనుకుంటే, నిజానికి నాలుగోతరం కూడా వచ్చేసింది, ఇప్పటికీ సుప్రసిద్ధరచయితలూ, తెలుగుని అభిమానించే పాఠకులూ తెలుగుకథలో లోపిస్తున్న తెలుగుదనంగురించి ఆరాటం వెలిబుచ్చుతూనే ఉన్నారు.

ఈ పరభాషాసాహిత్యంమీద అదుపు లేకండా విస్తరిస్తున్న వ్యామోహం. ఈ వ్యామోహం అన్నపదం నేను ఆలోచించే వాడుతున్నాను. మరొకజాతి సంస్కృతి, భావజాలం అర్థం చేసుకోడానికీ, విశ్వమానవసౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ వారి పుస్తకాలు చదవడం మంచిదే. ఆరచనలద్వారా ప్రభావితులై, ఆ ప్రభావపుఛాయల్లో రచనలు సాగించడంలో ఒక ఎత్తు. మానవస్వభావం అలాటిది. మనం చూసినవీ, విన్నవీ, మరోరకంగా తెలుసుకున్నవీ – ఇవన్నీ మన మనసుమీదా, మేధమీదా తప్పనిసరిగా తమ ముధ్రలు వేస్తాయి. తెలిసో తెలీకో మనం వాటిని మనతలపుల్లో కలుపుకుంటాం. కానీ, పైన గణపతిశాస్త్రిగారు చెప్పినట్టు, ఆ భావాలలో ఏవి మన మనగడకీ, వాతావరణానికీ అనుకూలం, ఏవి మనబ్రతుకులకి అదనపువన్నె చేకూర్చగలవు, ఏవి మనకి నప్పవు అన్నది చూసుకోకుండా, అవే కథలూ, అవే భావాలూ తెలుగుపేర్లు పెట్టి రాసేస్తే తెలుగుదనం రాదు కదా.  పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది.

1928లోనే కొల్లూరు దర్మారాయకవి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చేరు కథాపరిణామము అన్న వ్యాసంలో. కన్యాశుల్కంలో “బుచ్చమ్మవంటి అమాయికవితంతువును గిరీశంవంటి fashionable upstart ఒకడు తనమాట నేర్పున … యామెతో ఉడాయించి, Social Reform ఆచరించెననుటలో గ్రామకవి బ్రహ్మవితంతూద్వాహమును నవ్వులాటలకు దింపెనే గానీ మరి యొండు గాదు,” అంటారు. అలాగే చలం బోధించిన సెక్స్ స్వేచ్ఛ కూడా మనసమాజంలో అసంగతమే అని, మానవుల కామవాంఛలని పశుప్రవృత్తితో పోల్చి, అది న్యాయమే అనడం కూడా న్యాయం కాదని వాదించేరు. చలంరచనలమాట ఎలా ఉన్నా ఈనాడు ఈ స్వేచ్ఛ అన్నపదం అర్థం లేకుండా పోయింది. ప్రతివారూ స్వేచ్చగురించీ, హక్కులగురించీ మాటాడినంతగా వ్యక్తిధర్మం, సాంఘికధర్మంగురించి మాటాడుతున్నారేమో కానీ వాస్తవంలో కనిపించడంలేదు, వినిపించడంలేదు. మనసంస్కృతికి ప్రాతిపదిక కుటుంబధర్మం, సామాజికధర్మం. పైన చెప్పినట్టు మనసంస్కృతి మన దేశపరిస్థితులబట్టి వచ్చింది, పాశ్చాత్యసంస్కృతివారి దేశపరిస్థితులబట్టి వచ్చింది. వారు కూడా ఇప్పుడిప్పుడే ఇలా కేవలం వ్యక్తిప్రాధాన్యతమీదే ఆధారపడితే కలిగే నష్టాలు గమనిస్తున్నారు. వ్యక్తిస్వేచ్ఛలో సమాజధర్మం కూడా భాగం, ముఖ్యమైన బాగం. అదే మనుషులకీ, పశువులకీ వ్యత్యాసం. నాయిష్టం అంటూ రోడ్డుకడ్డం పడి నడిస్తే కారుకింద పడడం ఖాయం. నిజానికి ఈనాడు చట్టంపేరుతో అమెరికాలో ఉన్నన్ని కట్టడులు మనదేశంలో లేవు. మనదేశంలో మతంపేరుతో ఉన్నని నియమనిష్ఠలు కూడా ఏమీ తక్కువ కాదు కదా.

ఇంతకీ ఇలా ఏది తెలుగుకథ కాదో చెప్పుకుంటూ పోవడం తేలికే కానీ, ఏది ఎప్పుడు తెలుగుకథ అవుతుందో చెప్పడానికి కొలమానాలు చూపడం కష్టం అనుకుంటాను. ఏది తెలుగుకథ అవుతుంది? తెలుగుకథ రాయడం ఎలా అని ప్రశ్నించుకుంటే, పైన గణపతిశాస్త్రిగారు చెప్పిన ఆత్మ ముద్ర గురించి ప్రస్తావించాలి. అంటే ఈ ఆత్మముద్ర అంటే ఏమిటి? దాని రంగూ, రుచీ, వాసనా ఎలా ఉంటాయి? వాటిని కథల్లో ఆవిష్కరించడం ఎలా? ఎక్కడ ఎలా దర్శనమిస్తుంది? ఈ ఆత్మముద్రని ఎలా నిర్వచిస్తాం?

తినే తిండీ, కట్టే బట్టా, పలికే భాషా, అప్రతిహతంగా ఆనూచానంగా ఆచరిస్తున్నఆచారాలూ, తిరుగులేని విశ్వాసాలూ, ఇంటా బయటా ఒకరియందు ఒకరు ప్రకటించుకునే ఆదరాభిమానాలూ – వీటన్నిటి సముదాయం సంస్కృతి అంటాం కనక వీటన్నిటిలోనూ ఈ ఆత్మముద్ర ఉండే ఉండాలి కానీ ఏ ఒక్కటీ విడివిడిగా ఎత్తి చూపి, ఇదుగో ఇక్కడ ఆత్మముద్ర ఉంది అనడానికి లేదు. తెలుగు ఆత్మ అంటే కొరివికారం, గోంగూరపచ్చడీ, బంగనపల్లి మామిడిపళ్లూ, సింహాచలం సంపెంగలూ, గోదావరితరగలూ, పొందూరు పంచెలూ, గుంటూరు చేనేతచీరెలూ, జొన్నంబలీ, చాపకూడూ – ఇలా తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డలకి సుపరిచతమైనవి మాత్రమే కథల్లో పెట్టేస్తే తెలుగుకథ అయిపోతుందా?

అంతే కాదు. మనకథలు సమకాలీనసమాజాన్ని చిత్రించాలని కూడా అంటున్నాం. మరి సమకాలీనసమాజం అంటే ఇప్పుడు తెలుగునాట బస్తీల్లో పీచా, మెక్డొనాల్డ్, దుకాణాల్లో ప్లాస్టిక్ సంచులూ, ఈనాటి యువత తొడిగే జీన్స్, తినే ఫాస్ట్ ఫుడ్ – ఇవన్నీ కూడా ఈనాటి వాస్తవాలే. మరి వీటిగురించి రాస్తే, తెలుగు ఆత్మముద్ర కనిపిస్తుందా? కనిపించదా? ఈ బ్రహ్మపదార్థం ఉన్నట్టా, లేనట్టా?

రాజారాంగారు పైవ్యాసంలోనే తెలుగుదనం ఉట్టిపడే కథలకి ఉదాహరణగా ఇరవై కథలు ప్రస్తావించేరు. వాటన్నటిలోనూ సాముదాయికంగా కనిపించే గుణం పల్లెజీవితం. అంటే మరి మనతెలుగుదనం పల్లెల్లో మాత్రమే ఉందనుకోవాలా?

ఇక్కడ మరొకమాట కూడా ప్రస్తావించకతప్పదు. ఈ కథాయాత్ర పుస్తకానికి ముందుమాటలో రాజారాంగారు ఇంగ్లీషు పుస్తకాలు అట్టే చదవలేదనీ, అంచేత ఆయనరచనలమీద పాశ్చాత్యసాహిత్య ప్రభావం లేదనీ మధురాంతకం నరేంద్ర రాసేరు. రాజారాంగారి కథలు అచ్చతెలుగుదనం ఉట్టిపడే కథలని మనం అందరం ఒప్పేసుకోగలం. అందులో పేచీ లేదు. ఈ కథాయాత్ర కూడా తెలుగుకథ ప్రస్థానమే.

అయితే ఈపుస్తకం నాలుగోభాగంగురించి మాత్రం ఒకమాట చెప్పాలి. ఈభాగంలో “దారిదీపాలు” అన్న పేరుతో మణిపూసల్లాటి తెలుగుకథలు కొన్ని మచ్చుకి చేర్చేరు రచయిత. ఇక్కడ నాకు రవంత నిరాశ కలిగించినవిషయం వీటిలో మొదటికథ. ఇది రాసింది తెలుగువ్యక్తీ కాదు, తెలుగులో రాసిందీ కాదు. ఇందులో వాతావరణం కానీ పాత్రలు కానీ తెలుగు కాదు! నర్గీస్ దలాల్ పేరు గల పంజాబీ స్త్రీ ఇంగ్లీషులో రాసినకథకి తెలుగు అనువాదం. రాజారాంగారివంటి ప్రతిష్ఠాత్మకరచయితని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు కానీ, ఈ తెలుగుకథాచరిత్రలో ఈ అనువాదం అసంబద్ధమే అనుకుంటున్నాను.

రాజారాంగారే ఈ పుస్తకంలోనే చెప్పినట్టు, తెలుగుకథలో తెలుగువాతావరణం, జీవనవిధానం కనబడాలి. ఇతరదేశాల కథలు తీసుకుని, పేర్లు మార్చి రాసేస్తే, తెలుగుకథ అయిపోదు. జాతి చరిత్ర ఎలా ఏర్పడుతుంది అన్నది సూక్ష్మంగా చెప్పాలంటే, ప్రతిదేశానికీ, ప్రతిజాతికీ ఆయా దేశాలవాతావరణాన్నిబట్టి, పరిస్థితులనిబట్టి వారి సంస్కృతి, సంప్రదాయాలు ఏర్పడతాయి. మనకి స్థలం తక్కువా, జనం ఎక్కువా అవడంచేత మనుషులమధ్య సాన్నిహిత్యం తప్పనిసరిగా హెచ్చుతుంది. ఈనాటి సామ్యం తీసుకు చెప్పాలంటే, మీరు ఏ కేంపుకో, విహారయాత్రకో వెళ్ళినప్పుడు ఏర్పడే సాన్నిహిత్యంలాటిది అని చెప్పొచ్చు. అదే – ఈ పరిమిత జాగా – ఉమ్మడి కుటుంబాలు ఉప్పతిల్లడానికి కూడా కారణం. ఆదిమానవులతో మొదలయిన గణవిభజన కూడా ఈ ఉమ్మడికుటుంబాల్లో ఆత్మీయతలకి కారణం అయిఉండొచ్చు.

నూటఇరవైమంది ఓ పడవెక్కి, బ్రిటన్ నించి పారిపోయి, అమెరికాలో దిగగానే అలవికాని భూభాగం ఆక్రమించుకునే అవకాశం కలిగింది వారికి. మనుషులు తక్కువా, జాగా ఎక్కువా కావడంతో వారి సంస్కృతి కూడా తదనుగుణంగానే పరిణమించింది. ఎవరికి కావలిసినంత జాగా వారికి ఆక్రమించుకునే అవకాశం ఉండడంతో, అదే “నాగదీ, నీగదీ” సంస్కృతి రూపు దిద్దుకోడానికి మూలం అయివుండొచ్చు. (ఈ వాదానికి అనుకూలమైన రచనలు శోధించి చూస్తే దొరకవచ్చు అని ఒక అమెరికన్ స్నేహితురాలు నాకు చెప్పింది.)

బహుశా ఈవిషయంలో నేను చెప్పగలిగింది ఒక్కటే, నేను ఇదమిత్థంగా ఏమీ చెప్పలేను అని. ప్రతి తెలుగురచయితా తనకు తానై ఆలోచించుకోవలసిందే ఈ ఆత్మముద్ర ఎలా ఆవిష్కరించడం అన్నది.

తెలుగు కథల్లో ఆత్మ ముద్ర నాదృష్టిలో కూడా చూడండి. ఇక్కడ

(జూన్ 26, 2013.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “మన కథల్లో తెలుగు ఆత్మముద్ర”

 1. @ నారాయణస్వామి, – అసలు ఆలోచన, ఆత్మ పరిశీలన, స్వస్వరూపజ్ఞానం వంటివి ఏవీ లేకపోవడం వల్లనని నా అనుమానం. – అది కూడా ఒక కారణమే కావచ్చునండీ. నేను కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. పోతే, individualism మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇది 18వ శతాబ్దంలోనే ప్రారంభమయిందని నేను చదివేను. నిజానికి ఈ వైయక్తికవిలువలో మంచీ, చెడూ కూడా ఉన్నాయి. ఇక్కడ సిద్ధాంతకర్తలు అందరూ చేసే తప్పే నేనూ చేసేను. అంటే ఏదైనా మనం ఒక్కవాక్యంలో చెప్పినప్పుడు ఏదో ఒక కోణం మాత్రమే చెప్తాం. ఈ విషయం కూడా ఇంకా రాస్తాననుకుంటా :))
  మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. తెలుగువారైన తలిదండ్రులకి తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు మాట్లాడే మనిషి తనని తాను తెలుగువాణ్ణి, తన సంస్కృతి తెలుగు సంస్కృతి అని చెప్పుకోవడంలో సంకుచితత్వం ఏవిటో నాకర్ధం కాలేదు. ఆంధ్రమహాభారతమూ భాగవతమూ కచ్చితంగా తెలుగువారి ఆత్మముద్రలతో నిండి ఉన్నాయి. ఈ విషయమ్మీద కవులూ విమర్శకులూ చాలా వ్యాఖ్యా వ్యాసాలూ, గ్రంధాలూ రాశారు. ఇదంతా కొత్త కాదు.

  ఇక మాలతిగారు ప్రతిపాదించిన గమనికలు, తీర్మానాల దగ్గరికి వస్తే – ప్రస్తుత తెలుగు రచనల్లో ఆత్మముద్ర లేకపోవడం ఇతర సాహిత్యాల ప్రభావం వల్ల కాదు, మన సాహిత్యాన్నే చదవని మన మహామహులు ఇతర భాషల సాహిత్యాని మధిస్తున్నారని నేననుకోను. అసలు ఆలోచన, ఆత్మ పరిశీలన, స్వస్వరూపజ్ఞానం వంటివి ఏవీ లేకపోవడం వల్లనని నా అనుమానం.

  “అదే “నాగదీ, నీగదీ” సంస్కృతి రూపు దిద్దుకోడానికి మూలం అయివుండొచ్చు.”
  నాకు తెలిసినంతలో ఈ అవగాహన సరికాదు. నేను చరిత్రని అధ్యయనం చెయ్యలేదుగానీ, కొలోనియల్ కాలపు జీవితపు ఉదాహరణలు .. అంతెందుకు, 19 వ శతాబ్ది జీవితపు ఉదాహరణల్లో కూడా ఈ నీగదీ, నాగదీ సంస్కృతి లేదు నాకు కనబడినంతలో. కొద్దిపాటి ధనవంతుల ఇండ్లలో కూడా గదులతో పాటు ఇంకా అనేక వనరుల్ని పంచుకునేవారు. విచ్చలవిడి ప్రబలిన కన్సూమరిజం రెండవ ప్రపంచ యుద్ధం తరవాతనే.

  మెచ్చుకోండి

 3. విరివిగా తెలుగు లో ప్రచారింప పడిన శరత్ సాహిత్యంలో,
  ఇతర భాషలనుంచితెలుగు లోకి అనువదింప పడ్డ కథలలో కూడా ,
  తెలుగుతనం తెలుగు ఆత్మ ఉందని అనుకుంటే ఏ సమస్యా లేదు.
  వేరే బాషల నుండి , తెలుగు లో తెలుగు ఆత్మ తో ఎన్నో సినిమాలు వస్తున్నాయి కదా!

  మెచ్చుకోండి

 4. @ సౌమ్య, @ ఆ తెలుగుతల్లి చూసుకుంటుంది ఇంక అవన్నీ!) – :)). మంచి సంగతులు చెప్పేవు. బోతవోలు రామబ్రహ్మంగారి వ్యాసం ఇప్పుడే చూసేను. నువ్వు వెంటనే ఎదుగని బిడ్డ గురించి టపా రాయకపోతే, మీయింటిముందు హఠం వేస్తాను అన్నం, నీళ్ళూ మానేసి.

  మెచ్చుకోండి

 5. మీ వ్యాసం, వ్యాఖ్యలూ చూస్తున్నాను. ఒక్క ముక్క మాత్రం చెప్పాలనిపించింది .. ఇక్కడ ఆత్మముద్ర సంకుతితత్వం అన్న వ్యాఖ్య చూసి అవాక్కై.

  తొలి సాహిత్యంగా పేర్కొనబడుతున్న ఆంధ్రమహాభారతానికి ముందు కూడా తెలుగు సాహిత్యం ఉందని చెప్పి పరిశోధనకులు నిరూపించారన్నది ఒకటి – చర్చకి సంబంధం లేనిది.

  ఇక సంబంధం ఉన్నది – ఆంధ్రమహాభారతంలో తెలుగు ఆత్మముద్ర లేదంటే మాత్రం నేనొప్పుకోలేను. కనీసం కవిత్రయం ముక్కస్య ముక్క అనువాదం చేశారనుకున్నా అలా అనుకోవచ్చేమో కానీ … మళ్ళీ ఇక్కడ మూడు ముక్కలు:

  1. వాళ్ళు చేసినది స్వేచ్ఛానువాదం. తెలుగు వారికి అనుగుణంగా చేసిన అనువాదం అని వాళ్ళే రాసుకున్నారు. పతాక సన్నివేశాల్లోనూ (కథ), చక్కటి వర్ణనల్లోనూ (కథనం) జనం గుర్తుంచుకుని తరతరాలుగా చెప్పుకుంటున్న పద్యాలు, వర్ణనలు…సంస్కృత వర్ణనను అనుకోను. ఈ విషయమయ్యే “అనువాదాలు అరసున్నాలేనా?” అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాసం ఇక్కడ చూడండి.

  2. ఇకపోతే, భారతీయ vs తెలుగు: ఎందుకు సంకుతిత్వం కాదు, ఎందుకు అవసరం అన్నది తెలియాలంటే శ్రీపాద వారి ఆత్మకథ చదవండి (నాకు తెలిసినది సూచిస్తున్నాను)

  3. చివరి ముక్క: మొన్నామధ్య ఒక వ్యక్తి రాసిన ఆంగ్ల వ్యాసాన్ని బట్టి ఆ వ్యక్తి మాతృభాష ని ఆంచనా వేసే పరిశోధనల్లో పాలుపంచుకున్నాను. ఆ సమయంలో, ఆంగ్ల భాష యొక్క వివిధ దేశ-రూపాంతరాలను అభ్యసించే ఒక ప్రొఫెసర్ వచ్చారు. అక్కడ జరిగిన చర్చలో ఒక అంశం నన్ను ఆకట్టుకుంది..ఇక్కడ అందుకే ఈ వ్యాఖ్యలో చేరుస్తున్నది – “మన ఆంగ్లం మీద మన మాతృభాష ప్రభావం ఉంది అని మేము నిరూపిస్తూంటే మీరేమిటి indian english, nigerian english అంటూ దేశాల పేర్లతో మాట్లాడతారు? ఈ దేశాల్లోని వివిధ భాషలకి తమదైన ముద్ర ఉంది” అని ఒక విద్యార్థిని ప్రశ్న. దానికి ప్రొఫెసర్ సమాధానం: “మాతృభాష ప్రభావం లేదని కాదు. కానీ, వీళ్ళంతా ఒక ప్రాంతంలో నివసిస్తున్న మనుషులు. వీళ్ళ ప్రభుత్వాల linguistic policies ఒకలాగే ఉంఅవచ్చు దేశంలోపల. ఒక లాగే ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. ఒకలాగే మాట్లాడవచ్చును.” అని.
  (ఈ సంభాషణ నుండి – “మనకి తెలుగు ఆత్మముద్ర అక్కర్లేదు.” అన్న పాఠం నేర్చుకునే అవకాశం లేకపోలేదు. ఆ తెలుగుతల్లి చూసుకుంటుంది ఇంక అవన్నీ!)
  -మొత్తానికి నాకు అర్థమైనది ఏమిటి అంటే: తెలుగు ఆత్మముద్ర, భరతఖండపు ఆత్మముద్ర – రెండూ ఉంటాయి … తప్పనిసరిగా. ప్రయత్నం మీద వదిలించుకోవాలనుకుంటే అది ఎవరెవరి ఖర్మ గానీ, నా అభిప్రాయంలో వదిలించుకోవడమే సంకుతితత్వం అవుతుంది. స్వస్తి.

  మెచ్చుకోండి

 6. సి వి ఆర్. మోహన్, రామాయణం, భారతంవంటి కావ్యాలలో విస్తృతపరిధిలో భారతీయ ఆత్మముద్ర కనిపిస్తుందని చాలామందే ఒప్పుకుంటారు. వివిధభాషల్లో, వివిధప్రాంతాల్లో రచించిన ఈకావ్యాలలో ఆయా ప్రాంతాల సంప్రదాయాలూ, విశ్వాసాలే కాక అక్కడ దొరికే వస్తువులు కూడా పొందుపరిచిన దాఖలాలున్నాయి. ఆరుద్రగారి “రాముడికి సీత ఏమౌతుంది” అన్న పుస్తకం చూస్తే, వివిధ ప్రాంతాలలో, వివిధదేశాల్లో, వివిధభాషల్లో రచించిన ఈరామాయణాలలో ఎంత భిన్నత్వం, వైవిధ్యం ఉందో మీకు తెలుస్తుంది. పోతే, ఇక్కడ చర్చ చిన్నకథలగురించి కనక, చిన్నకథల్లో ఇలాటి తేడాలే అంటే భిన్నప్రాంతాల్లో పాటించే ఆచారాలూ, సంప్రదాయాలూ, జాతీయాలూ అవిష్కృతమవుతాయి, అలాగే మనతెలుగు కథల్లో కూడా కనిపించాలని గణపతిశాస్త్రిగారివంటి ప్రసిద్ధరచయితలంటున్నారు, నాకు కూడా అది సమంజసంగానే కనిపించింది. ఉదాహరణకి మీఇంట్లో పెళ్లిలో పాటించే ఆచారాలు కొన్ని మావేపు పెళ్ళిలో లేవు. ఈ తేడాలగురించిన వివరాలు తెలుసుకోడం సంకుచితత్వం, ప్రాంతీయ దురభిమానం అని నేను అనుకోను. మీరలా అనుకుంటే, అది మీయిష్టం.

  మెచ్చుకోండి

 7. దక్షిణాది భాషలన్నిటిలోనూ తొలి సాహిత్యం సంసృత పురాణ లనుండే అనువాదాలుగా వచ్చాయి
  వాటిలో తమిళ /కన్నడ /తెలుగు /మలయాళ ఆత్మల గురించి ,మూలల గురించి మనం ఎప్పుడూ , ఎవ్వరూ
  మాటలాడనంతగా అవి కలిసి పోయాయి , ఇప్పుడు ఈ సంకుచిత తత్వాలు ఎందుకు?
  పోను పో ను సీమ /కో స్తా /తెలంగాణ ఆత్మలు వెతుకు కోవాలా ?

  మెచ్చుకోండి

 8. సరోజిని నాయిడు గారి గురించి ఇక్కడ:
  http://www.poemhunter.com/sarojini-naidu/biography/
  ఆమె గురించి నేను ప్రస్తావించిన విషయం సూచనప్రాయంగా ఇది:
  (నాకు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఇంకొంచెం వివరంగా చెప్పినట్టు గుర్తు.)
  At the age of 16, she traveled to England to study first at King’s College London and later at Girton College, Cambridge. There she met famous laureates of her time such as Arthur Symons and Edmond Gosse. It was Gosse who convinced Sarojini to stick to Indian themes-India’s great mountains, rivers, temples, social milieu, to express her poetry. She depicted contemporary Indian life and events. Her collections “The golden threshold (1905)”, “The bird of time (1912)”, and “The broken wing (1912)” attracted huge Indian and English readership.

  మెచ్చుకోండి

 9. @ ఏ. సూర్యప్రకాశ్, మీమాట బాగుందండీ. తెలుగుజీవితాన్ని అనుభవించడమే కాదు ఆ జీవితంమీద గౌరవం కూడా ఉన్నప్పుడే మంచి తెలుగుకథ సృజించగలరు.
  @ సివియర్ మోహన్, తెలుగు ఆత్మ ఎందుకుండాలి అనేవారికి వేరే చెప్పగలిగిందేమీ లేదు. వసుధైక కుటుంబం అన్నది సామరస్యం సాధించడానికే గానీ ఎవరి ప్రత్యేకతలు వారికుంటాయి. అవి తెలిసినప్పుడే ఆ సామరస్యం సాధ్యం కూడాను. ఎక్కడి వస్తువో అయితే అక్కడికథ అవుతుంది. ఉదాహరణకి తెలుగులో రష్యన్ కథలున్నాయి. అవి రష్యన్ జీవనవిధానాన్ని చిత్రిస్తాయి. పైరెండు వ్యాఖ్యలు కూడా చూడండి.
  @ లలితా, మీరు మంచి విషయం చెప్పేరు. సరోజినీనాయుడుగారిగురించి మీరు రాసింది నాకు తెలియదు. ఆవిడకథలు ఎక్కడయినా దొరికితాయేమో చూస్తాను.
  వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. ఇలా కథలు తరతరాలుగా వస్తున్నాయంటే ఇదే మన ఆత్మ అనుకోవాలేమో ఇక 😦 సరోజినీ నాయిడు ఆంగ్లంలో వ్రాస్తున్నప్పుడు మొదట్లో ఆమెకీ ఎవరో చెప్పారుట, ఆంగ్లంలో వ్రాస్తున్నాను కదా అని ఆంగ్లేయులు ఎన్నుకునే వస్తువులు ఎన్నుకుని వారిలాగే వ్రాయద్దు అని, ఉదాహాణకి Robin గురించి. ఇప్పుడు మనం ఆమెని గుర్తు చేసుకుంటే గుర్తుకు వచ్చేవి Bangle Sellers, Palanquin Bearers వంటివి కదా. అలా ఆమెకి చెప్పి ఉండకపోతే?
  “ఆత్మ” అంటే స్వంత, తనకి సంబంధించిన అని అనుకోవచ్చేమో కదా. అంటే తాను స్వయంగా అనుభూతి చెందిన, గమనించి ఒక భావన ఏర్పర్చుచుకున్న, అవగాహన కలిగిన వస్తువులు, భావాలు, వాటి వ్యక్తీకరణ కావాలి. effect కోసం వ్రాయడం ఎక్కువ ఉంటోంది అనిపిస్తోంది నాకు చాలా రచనలలో.
  తెలుగుతనం అంటే తెలుగువారు తమది అనుకునే ఆ తమదనం” ఏమిటి?

  మెచ్చుకోండి

 11. మానవానుభవాలన్నీ సీమాసమయసందర్భాలకతీతం!అయితే కథలో తెలుగుతనం లుప్తమయి సేగి వాటిల్లకూడదు!అత్మముద్రలేకుండా తెలుగు జీవితాన్ని అనుభవించకుండా మంచి తెలుగుకథ సృజించలేరు!

  మెచ్చుకోండి

 12. సచిత్ర వార పత్రికల లో కథలు తెలుగు వారికే సంబంధించి నవిగా ఉండాలని వ్రాసేవారు
  అది ఎందుకో నాకు అర్థం అయ్యేది కాదు.
  తొలి సాహిత్యమైన రామాయణ భారతాలలో తెలుగు తనం అక్కర లేనప్పుడు,
  వసుధేక కుటుంబ మైన ఈ రోజుల్లో తెలుగుతనం తెలుగు ఆత్మ ఎందుకు ఉండాలి ?
  వస్తువు ఎక్కడి దైనా తెలుగు లో వ్రాసి తె లుగు వారికి ఉపయోగ పడడం ముఖ్యం

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.