ఆత్మ ముద్రలు నాదృష్టిలో

ముందు టపా, మన తెలుగు కథల్లో ఆత్మముద్రలు, లో ఈ ఆత్మముద్రని నిర్వచించడం సాధ్యం కాదని రాసేను. సరోజినీనాయుడుగారిగురించి లలిత ప్రస్తావించేక, నాకు మరి కొన్ని ఆలోచనలు వచ్చేయి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగువారిఅనుభవాలలో ఇవి ఎలా కనిపిస్తున్నాయి అని. అందరిమాటా నేను చెప్పలేను కానీ నావిషయంలో, నాకథల్లోనూ, నాజీవితంలోనూ అవి ఎలా ప్రతిఫలిస్తున్నాయి అన్నదృష్టితో కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. విదేశాల్లో ఉన్న తెలుగువారు చాలామందే ఇలాటి అనుభవాలు  చవి చూసే ఉంటారు. ఆరుగజాల చీరె కట్టుకుని పనులెలా చేస్తారు? అంత ఎండల్లో అంత కారాలు ఎలా తింటారు? ఇలా మనకి సర్వసాధారణమైనవి వాళ్ళకి వింతగా తోస్తాయి. కష్టాలు అందరికీ ఒక్కలాగే ఉండొచ్చు కానీ వాటిని ఎదుర్కొనే తీరులో, పరిష్కరించుకునే పద్ధతిలో తేడాలుంటాయి. కథల్లో అవి తెలుస్తాయి. అందుకే మరోదేశపు కథలు చదవడం. సరోజినీనాయుడుగారిరచలలోలాగే, రవీంద్రుడిరచనలలో కూడా భారతీయాత్మ కనిపిస్తుందని చాలామంది ఒప్పుకుంటారు కదా. ఆ నేపథ్యంలో, ఈనాడు విదేశాల్లో ఉన్న తెలుగువారు రాస్తున్న కథల్లో ఈ ఆత్మముద్ర ెలా ఆవిష్కృతమవుతోంది అని కూడా ఆలోచించాలి. ఏముందీ, ఎంతసేపూ, అమెరికా సంపదలూ, మనదేశంలో కృశించి నశించిపోతున్న ఆదరాబిమానాలూ, గతించిన దినాలకోసం తపన (నాస్టాల్జియా అన్న అర్థంలో) – ఇవే కదా అని తీసిపారేసేవారు కొందరైతే, ఇవే తెలుగుకథకి నమూనా అని మరికొందరి వాదన.

నేనిప్పుడు డయాస్ఫొరా సాహిత్యమంతా విమర్శించబోవడంలేదు కానీ, ప్రవాసాంధ్రుల అయోమయస్థితి, రెండు సంస్కృతులమధ్య సంఘర్షణ ఈ కథల్లో ప్రతిఫలిస్తోంది అని మాత్రం చెప్పగలను. మరో రెండు తరాలు పడుతుందేమో ఈ అయోమయ అవస్థనించి బయటపడి, నిర్దుష్టమైన ప్రవాసాంధ్ర జీవనసరళి అంటూ ఒకటి మనం సంతరించుకోడానికి. .

ప్రస్తుతానికి, తెలుగు ఆత్మముద్రలన్నవి ఎక్కడ కనిపిస్తున్నాయి అన్నదే నాసమస్య. ఒకతెలుగుమొహానికి మరో తెలుగుమొహం తారసపడినప్పుడు వెంటనే మనవాడిలా ఉన్నాడే అనిపిస్తుంది. నాకు నేనై అమెరికాలో తెలుగువారికోసం ఆరాటపడకపోయినా, ఏ దుకాణంలోనో తెలుగుమాట వినిపిస్తే గిరుక్కున వెనుదిరిగి చూస్తాను. అలాగే టీవీలో తెలుగుపేర్లే కానఖ్ఖర్లేదు భారతీయపేర్లలాటివి కనిపిస్తే ఎవరై ఉంటారా అని ఆలోచిస్తాను. దీన్ని అసంకల్పప్రతీకారచర్య అనొచ్చు!

రెండోది – మనకి కొత్తా, పాతా లేకుండా వావివరసలు కల్పించేసుకునే ఆనవాయితీ. ఏదేశంలో ఉన్నా, తెలుగుమొహం కనిపిస్తే, ఏదో ఆత్మీయతలాటికి తన్నుకొచ్చి, ఏదోరకం చుట్టరికం కలిపేస్తాం. నేను బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో నన్ను బామ్మగారూ అనడం నాకు బాగానే గుర్తుంది. ఇందులో మరో సూక్ష్మం కూడా గమనించేను. “బామ్మగారు” అని నన్ను సంబోధించింది అబ్బాయిలు. “నన్ను మీరు అని మన్నించకండి” అని అనడం అమ్మాయిలు మాత్రమే చేసేరు! ఈ రెండు పరిస్థితుల్లోనూ మనసంస్కృతికి సంబంధించిన ఒక ఆనవాయితీ కనిపిస్తుంది. అయితే, ఈ బామ్మగారు సంబోధన నారచనకి సంబంధించినదిగా కనిపించలేదు. ఇది నేను అమెరికా వచ్చేక, కలిగిన జ్ఞానమే అనుకుంటాను – ఏవిషయంలో గానీ ఏది కేంద్రబిందువు అన్నది పరిశీలించి చూసుకోవాలి అన్నది. నేను బ్లాగులో రాస్తున్నాను కనక ఆకోణానికే ఆ పరిచయాలు పరిమితం కావాలి అని నా అభిప్రాయం. ఇది నా ఆత్మ ముద్ర అనే అనుకోవాలి.

ఇంతకీ, ఈ వావివరసలమాట – పెద్దవారయితే అత్త, మామ, పిన్ని, బాబాయి, కొంచెం పెద్దవాళ్ళయితే, అక్క, అన్న – ఇలా ఏదో ఓ వరస కలుపుకుంటాం. ఇలా వరసలు పెట్టి పిలవడం అమెరికన్ కుటుంబాల్లో లేదు. ఎంత పెద్దవారయినా పేరు పెట్టే పిలుస్తారు. లేదా, సర్, మేడమ్ అంటారు. ఇప్పుడు ఈ సర్, మేడమ్ మనదేశంలో కూడా సామాన్యం అయిందనుకోండి. అధికం, అంకుల్, ఆంటీ కూడా సర్వసామాధారణమయిపోయింది. ఇదీ తెలుగుదనానికీ, అన్యజాతీయానికీ ఒక తేడా. మనదేశానికి వచ్చే అమెరికనులకి ఇలా అంకుల్, ఆంటీ అని ఎవరైనా పిలిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది.  అలాగే, మన బాషలో “మన” విశేషణం కూడాను. ఇది “మనిల్లేనా?” అని చుట్టపుచూపుగా వచ్చినావిడ అడిగితే, ఆస్తిలో పంపకాలు పెట్టమని అడుగుతోంది అని కాదు కదా. ఇంగ్లీషులో “our house” అని ఇంటి యజమానురాలు చెప్తే, అక్కడ our కి అర్థం మా అనే కానీ మన అని కాదు.

పిల్లలనిగురించి మాటాడుతున్నప్పుడు వెనకటి తరాల్లో చవట, దేభ్యం, పిచ్చివెధవ లాటిపదాలు తేలిగ్గా వాడేసేవారు. అది తప్పుగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. దానికి కొంత కారణం పిల్లలని మెచ్చుకుంటే వారికి అహంకారం ప్రబలుతుందన్న భయం. అసలు మనసంస్కృతిలో ఎవరిని గానీ మొహంమీద మీరు చాలా అందంగా ఉన్నారు, మీతెలివితేటలు అద్బుతంలాటివి లేవు ఆకారణంగానే. అందుకు భిన్నంగా, అమెరికాలో గోరంతలు కొండంత చేస్తారు excellent, super, wonderful అంటూ. పిల్లలకి అది ఉత్సాహాన్నిచ్చి మరింత బాగా కృషి చేయడానికి దోహదం చేస్తుందని వీరి విశ్వాసం. ఇందులో ఏది మంచిపద్ధతి అని కాదు మనం చర్చించవలసింది. ఓపికుంటే ఈప్రవర్తనలకి వెనక గల కారణాలు వెతికిచూడాలి. లేదా, కనీసం, వాళ్ళలా చేస్తున్నారు కనక మనం కూడా అలాగే చెయ్యాలా? మన కుటుంబపరిస్థితులు, సామాజికపరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా? ఈ రెండూ కాక, మధ్యేమార్గం మరోటి, మనదైన మరో మార్గం సృష్టించుకోగలమా? ఇవీ మనం ఆలోచించుకోవలసినవిషయాలు.

ఈ రెండు ఆచారాలకీ వెనక ఉన్నది పిల్లలు వృద్ధిలోకి రావాలనే కోరికే. ఆ కోరిక ప్రకటించేతీరులో వ్యత్యాసాలున్నాయి అని తెలుస్తోంది కదా. ఇవి జాతిప్రత్యేకతలకోవలోకే వస్తాయి. మన పద్దతి వారికి వింతగా కనిపిస్తుంది, వారిపద్ధతి మనకి వింతగా కనిపిస్తుంది. కానీ ప్రతిజాతికీ ఎవరి పద్ధతులు వారికి వారి పరిసరాలూ, సంప్రదాయాలూ, పరిస్థితులూ – ఇలా అనేక కారణాలు ఆధారంగా ఏర్పడిఉంటాయి. ఇలాటివి అర్థం చేసుకోడానికి అన్నమాట కథల్లో వీటిని చిత్రించడం, విడమర్చి చెప్పడం జరుగుతుంది.

ఇప్పుడు మరోప్రశ్న కూడా అడగొచ్చు. మనసంప్రదాయాలు మనకి తెలీవా? మళ్లీ కథల్లో ఎందుకు చెప్పుకోడం? ఎందుకంటే, తెలీకపోవడం ఒక కారణం, తెలిసినా నిర్లక్ష్యం చెయ్యడం, చూసీచూడనట్టు ఊరుకోడం ఇతరకారణాలు. పాశ్చాత్య సంప్రదాయాల అయోమయంలో పడిపోయి, పొరుగింటి పుల్లకూర అయితేనే రుచి అని కొందరు అభిప్రాయపడడం – ఇలా ఎన్నైనా కారణాలు చెప్పుకోవచ్చు. సూక్ష్మంగా నామటుకు నాకు, మన ప్రాథమిక లేదా మౌలికవిలువలూ, సంప్రదాయాలూ మరోసారి కథల్లో చూసుకోవలసిన అవుసరం ఎక్కువగానే కనిపిస్తోంది ఈనాడు.

అలాగే, పెద్దవాళ్లవిషయం. నేను నాకథ చేతనాకృతిలో ఇంటికి వచ్చిన అతిథి పొడిచి పొడిచి గృహస్థు స్వవిషయాలు అడగడంలో అనౌచిత్యం చిత్రించేను. అయితే అదే నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా కూడా తోచవచ్చు. వాస్తవజీవితంలో ఎవరు గానీ మరొకరి సొంతవిషయాలు మాటాడడం మంచిది కాదనే నా నమ్మకం. అంటే ఇది నేను అమెరికాలో ఉండడంవల్ల కొత్తగా సంతరించుకున్న గుణం అని అనుకోకండి. నాకు చిన్నప్పట్నుంచి కూడా నాసంగతులు గానీ, మరొకరిసంగతులు గానీ, పెద్దవయినా చిన్నవయినా మాటాడే అలవాటులేదు. అంటే అసలు మాటాడనని కాదు. ఏ ఇద్దరిమధ్య అయినా ఒక లక్ష్మణరేఖ ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు దాన్ని అదిగమించి మాటాడుతున్నాం, ఏవిషయాలు మాటాడితే ఎదటివారికి నొప్పి అన్నది ఆలోచించుకోవాలి ప్రతివారూ. నేను నావిషయాలు మాటాడతాను. కానీ ఎప్పుడు ఎవరితో అన్నది నానిర్ణయం. అంతేగానీ ఇంటికొచ్చినప్రతివారూ అలా మాటాడడం ఆనందదాయకం కాదనే అనుకుంటున్నాను. ఇవన్నీ నాపెంపకం, అంటే నేను పెంపబడినతీరులో ఉన్నాయి. అయితే అవతలివ్యక్తిని నేను అర్థం చేసుకోలేదా? చేసుకున్నాను. మనదేశంలో యిలా మాటాడడం సర్వసాధారణం. ఇవన్నీ మనసంస్కృతిలో భాగాలే. ఈ కారణాలన్నీ ఒకొకటి ఒకొక కథ కావచ్చు.

మనసంస్కృతిలో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు,– వీటిలో అనేక కోణాలు, వీటిగురించి అనేకానేక అభిప్రాయాలు – ఇవన్నీ నిశితంగా తరిచి చూసినప్పుడు ఈ పెళ్ళిళ్ళవిజయానికి గానీ విఫలమవడానికి గానీ కారణాలు చూపించగలిగినప్పుడు మంచి కథలవుతాయి.

“వారాలు చేసుకుని చదువుకోడం”లో క్రమశిక్షణ, నిష్ఠ, గురువు, గురుపత్ని, శిష్యులమధ్య ఆదరాభిమానాలూ – వీటిగురించి ఇదివరకు ప్రసావించేను.

అలాగే ఆతిథ్యం. ఇంటికి ఎవరైనా వస్తే, తినడానికి, తాగడానికి ఏదో ఇవ్వడం మర్యాద. కనీసం మంచినీళ్ళయినా ఇస్తాం. మజ్జిగ ఇస్తాం. ఆ వచ్చినవారు వద్దనడం కూడా ఆ మర్యాదలో భాగమే!  ఒక అమెరికన్ స్నేహితురాలు నన్ను అడిగింది అదేదో సినిమాలో ఇంటివారు అతిథులకి ఫలహారాలిస్తే, వారు ఎందుకు వద్దు అంటున్నారు? అని.

మనఇళ్ళలో అతిథులు వచ్చేరంటే, వాళ్ళకి ఏం కావాలో, కాలక్షేపానికీ, భోజనాలకీ ఏమిటి అమర్చాలో అంటూ ఆరాటపడిపోడంలేదు. ఇల్లు సినిమాసెట్టులా అలంగకరించాలన్న బాధ లేదు. “మనతో పాటే, మనం తిన్నదే తింటారు, రోజూ చేసేదే చేస్తాం,” అనిపించేలా, జరిగిపోతాయి ఆ రెండు రోజులూ కూడా. ఇది చాలామందికి అనుభవమే కావచ్చు. మనవాళ్ళు వచ్చివెళ్ళేరన్నతృప్తి ఉంటుంది.

జీవనప్రహసనం, (మధురాంతకం రాజారాం), రెండు బంట్లు పోయేయి (పూసపాటి కృష్ణంరాజు), కుటీరలక్ష్మి (కనుపర్తి వరలక్ష్మమ్మ) -, ఇలా ఎన్నో కథల్లో మన నిత్యజీవితాల్లోని సూక్ష్మవిషయాలు చిత్రించేయి. వీటిలో కొన్ని విషయాలు ఈతరం పాఠకులకి తెలీవంటే అతిశయోక్తి కాదు కదా.

ఇలా మనకే ప్రత్యేకమయిన అనేకవిషయాలున్నాయి కానీ అవన్నీ ఇక్కడ రాయడం సాధ్యం కాదు కానీ వర్థమాన రచయితలు ఇలాటి విషయాలమీద దృష్టి ఉంచి కథలు రాస్తే, మన ఆత్మముద్రలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయని నా నమ్మకం.

(జూన్ 29, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

11 thoughts on “ఆత్మ ముద్రలు నాదృష్టిలో”

 1. వసుధా రాణి, మన ఆలోచనలమీద పరిసరాల ప్రభావం ఉండే మాట నిజమే కానీ ఆ ప్రభావం ఎలాటి రూపుగా తేలుతుంది అన్నది కూడా ప్రధానమే కదా. ఒక మంచి ఉదాహరణ 50, 60 దశకాల్లో అమెరికా వచ్చిన తెలుగువారు అమెరికన్ పేర్లకి మార్చుకున్నారు భాస్కర్ అయితే బిల్, రామారావు అయితే రాన్ లాగ. ఇప్పుడు తెలుగువారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయికి వచ్చేక తెలుగు పేర్లు ఇంటిపేర్లతో సహా అలాగే ఉంచుకుంటున్నారు. తెలుగుఆత్మని ఎలా పోషించుకోవాలన్నది కూడా పరిస్థితులమీద ఆధారపడి ఉంటుంది కొెంతవరకూ.

  మెచ్చుకోండి

 2. అమెరికా ఐనా ఇండియా ఐనా మనిషి మనిషికి మధ్య తేడాలు చాల ఉంటాయి… మనం వర్తమానం లో ఉంటాం కనుక చుట్టూ ఉండే పరిస్థితులు కొంత మన ఆలోచనలు మన ప్రవర్తన మీద ప్రభావము చూపుతాయి. సుఖమయ జీవనం కోసం డబ్బే సర్వస్వ మై పోయిన కాలం ఇది కనుక ఎక్కడైనా దానివెనుకనే అందరి పరుగులు మనిషి ప్రయోజకత్వానికి కూడా అదే కొలమానం . ఆత్మ పై కేవలం $ముద్ర లేకుంటే ₹ ముద్ర అంతే

  మెచ్చుకోండి

 3. మాలతిగారు, మీ ఎత్తుగడ వ్యాసమూ, కింద చర్చా కూడా బాగున్నాయి. నేను ఇతమిత్ధం అంటూ ఏమీ చెప్పలేను. నా రచన శైలిని మెరుగు పరుచుకునే ప్రయత్నంలో ఉన్నాను. అంచేత ఈ ప్రశ్నలని నా కథలకీ పాత్రలకీ అన్వయించి చూసుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 4. కామేశ్వరరావుగారూ, మీరు చాలా ప్రశ్నలు వేశారు. అది మంచిదే. ఆ ప్రశ్నలన్నిటికీ నాక్కూడా సమాధానాలు తెలీవు. నిజానికి నిర్దుష్టమైన సమాధానాలు ఉన్నాయని కూడా అనుకోను. ఎంచేతంటే, మీరే అన్నట్టు ప్రతిరచయితా, ప్రతి కథా అలాగే రాస్తే, మళ్ళీ మరోరకమైన మూస కథలు వస్తాయి, నాస్టాల్జియా అయినా కాకపోయినా. కానీ ఇలాటి చర్చలవల్ల పాఠకులకీ, రచయితలకీ కూడా ఆ విషయాలు ఆలోచించే అవకాశం కలుగుతుందని నేను ఇక్కడ మొదలు పెట్టేను.లోతైన ఆలోచనా, సమగ్రమైన ఆవగాహనా కావాలని కనీసం తెలియజేస్తున్నాం కదా ఇక్కడ. అలాటి అవగాహన ఉన్నవారు అరుదని నేనూ ఒప్పుకుంటాను కానీ కనీసం అలా ఆలోచించే అవుసరం ఉందన్న స్పృహ కలగాలి కదా ముందు. నా ఈటపా ధ్యేయం అదే. వెనక పిలకా గణపతిశాస్త్రిగారు చెప్పేరు కనక, మళ్ళీ మరోసారి అదిక్కడ మళ్ళీ చెప్పేను. మీ అభిప్రాయాలు ఇక్కడ వెలిబుచ్చినందుకు సంతోషం.

  మెచ్చుకోండి

 5. >>మాకు మా ఆత్మల్లేవు అని చెప్పుకోవడం ఫ్యాషన్ అనుకోవాలా అయితే? 🙂
  ఆత్మలన్నది భ్రమ, ఉన్నది ఒక్కటే ఆత్మ – అనడం ఫేషన్. 🙂

  మాలతిగారూ, మీరన్నది నేను కాదనను. అయితే న్యాయాన్యాయాలంత స్పష్టమైన తేడా కూడా ఇప్పటి పరిస్థితుల్లో మన/పర సంస్కృతిలో ఉందనుకోను. పైగా సాధారణంగా న్యాయాన్యాలు (కనీసం కథల్లో ఎక్కువగా కనిపించేవి) కాలాతీతం కూడాను! సంస్కృతి అలా కాదు కదా. అంచేత “మన” సంస్కృతి అంటే ఏమిటన్నది మొదటి చిక్కు ప్రశ్న.
  దానికేదో సమాధానం చెప్పుకొని, తీరి కూర్చొని అలాంటి సంస్కృతిని (లేదా మీరన్న “ఆత్మముద్ర”ని) ప్రతిఫలించే కథలు వ్రాసినా అవి కేవలం నాస్టాల్జియా కథలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది తప్పని నేను చెప్పడం లేదు. అయితే వాటివల్ల ఎంతవరకూ ప్రయోజనం ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది మన సంస్కృతి అని చెప్పుకోడానికి కథల్లో అలాంటిది మిగిలితే సరిపోతుందా? అలాంటి సంస్కృతి మనం ఎందుకు కోల్పోతున్నాం? ఎలా నిలబెట్టుకోగలం? అసలు నిలబెట్టుకోగలమా? ఎందుకు నిలబెట్టుకోవాలి? ఇలాంటి ప్రశ్నల గురించిన మథనం పాఠకుల్లో కలిగించే కథలు మరింత ప్రయోజనకరం కాదా? అలాంటి కథలు ఎలా వస్తాయి? దానికి కథల్లో ఆత్మముద్ర ఉంటే సరిపోదు. ఈ విషయాలపై లోతైన ఆలోచనా, కొంత సమగ్ర అవగాహనా ఉండాలి. దానికి తగ్గ ఇతివృత్తాలను ఎంచుకోవాలి. అలా కాకుండా ఎంచుకొనే ఏ ఇతివృత్తంలోనైనా మనదంటూ ఆత్మముద్ర ఉండాలీ, లేదా అలాంటి కథలే వ్రాయాలి అనుకోవడం సరికాదని నా అభిప్రాయం. కొన్నైనా అలాంటి కథలు వస్తే బాగుంటుందని నేనూ తప్పకుండా కోరుకుంటున్నాను. కానీ అలాంటి మంచి అవగాహన ఉండి దానిపై తపన ఉన్న రచయితలు అరుదుగానే కనిపిస్తారు.

  మెచ్చుకోండి

 6. @ కామేశ్వరరావుగారూ, బయట ప్రపంచంలో, జీవితంలో అలా జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, అది కథల్లో ప్రతిబింబిస్తే తప్పా ఒప్పా? అందులో ఆత్మముద్ర ఉన్నట్టా లేనట్టా? – నేననుకోడం కథకులు, దార్శనికులలాగే, ఒకడుగు ముందుండాలని. సాంఘికప్రయోజనం గల కథలు చేస్తున్నది అదే కదా. అన్యాయాలు జరుగుతున్నాయని వాటిని సమర్థించవు కదా మన కథలు. వాటిని ప్రతిఘటిస్తూ, ప్రతిఘటించమని పాఠకులని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అలాగే, తెలుగువారికి ప్రత్యేమైన, మనదైన అస్తిత్వం ఉందని నిరూపించుకోవాలంటే ఆ భావాలు కథల్లో ప్రతిఫలించాలి. లేకపోతే, మేం తెలుగువాళ్లం, మాకు ఓ సంస్కృతి ఉంది అని చెప్పుకోడానికి ఏమీ మిగలకుండా పోతుంది. మనకి అస్తిత్వం అంటూ అఖ్ఖర్లేదనుకుంటే మన పూర్వీకులు పోరాడి సంపాదించి మనకిచ్చిన స్వాతంత్ర్యానికి కూడా అర్థం లేకుండా పోతుంది. ఏమంటారు.

  @ సౌమ్య, నీమాటే నేను మరోరకంగా చెప్తాను. -సార్వజనీన అంశాలు ఆత్మలకీ, ప్రేతాత్మలకీ కూడా అతీతంగా కూడా ఉంటాయని – నిజమే. కానీ, భారతీయభాషలకి సంబంధించినంతవరకూ, మనకీ వారికీ ఉభయసామాన్యమైన భారతీయ ముధ్ర కూడా ఉంటుంది. అంచేత కూడా ఈకథలని మనం ఆదరిస్తాం. అంటే ఒకవేపు బెంగాలీసంస్కృతి అర్థం చేసుకోడానికీ, మరోవేపు మనం కూడా అలాగే చేస్తాం కదా అని ప్రతిస్పందించడానికీ కూడా ఉపయోగపడతాయి భారతీయభాషల్లో ఒకభాషనుంచి ఇంకొకబాషకి అనువాదాలు చేసినప్పుడు.

  @ మోహన్, మీకు సమాధానం పైసమాధానాల్లో ఉంది.

  మెచ్చుకోండి

 7. >>బయట ప్రపంచంలో, జీవితంలో అలా జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, అది కథల్లో ప్రతిబింబిస్తే తప్పా ఒప్పా? అందులో ఆత్మముద్ర ఉన్నట్టా లేనట్టా?
  -అవునండి, మీరన్నదీ నిజమే. బహుశా అదే సృష్టి ధర్మం కాబోలు : మాకు మా ఆత్మల్లేవు అని చెప్పుకోవడం ఫ్యాషన్ అనుకోవాలా అయితే? 🙂

  అన్నట్లు, అనువాదాలు ఏ భాషనైనా పరిపుష్టం చేస్తాయనీ, ఇతర సంస్కృతుల గురించి మనకి పరిచయం చేస్తాయనీ, అలాగే కొన్ని సార్వజనీన అంశాలు ఆత్మలకీ, ప్రేతాత్మలకీ కూడా అతీతంగా కూడా ఉంటాయని … కూడా నేను అనుకుంటూ ఉంటాను. అనువాదాలకి లభించే ఆదరణకి, తెలుగు ఆత్మ-పరమాత్మ-ప్రేతాత్మలకి మూడింటికీ ఎటువంటి సంబంధం లేదేమో అనిపిస్తుంది నాకు. గాడ్జిల్లా తెలుగు డబ్బింగ్ లో వేదపండితుడు ఉండాలంటే అది వేరే సంగతనుకొండి.

  మెచ్చుకోండి

 8. “మనది అనుకునేదాన్ని వదిలించేసుకున్నాక ఇంకో దాన్ని కావలించుకుని కథలు రాస్తే దానిలో ఏ ముద్రా లేకుండా పోతే… uniformity వచ్చేస్తుందన్న ఆరాటం అర్థం చేసుకోదగ్గదే కానీ, ఏం చేసుకునేందుకు ఈ uniformity?”

  మనది అనుకునేదాన్ని వదిలించుకొని ఇంకో దాన్ని కావలించుకోవడమూ, uniformity వచ్చేస్తుందన్న ఆరాటమూ, మౌలికంగా చూస్తే, కథల విషయంలోనా జీవితం విషయంలోనా అన్నది నా అనుమానం. బయట ప్రపంచంలో, జీవితంలో అలా జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు, అది కథల్లో ప్రతిబింబిస్తే తప్పా ఒప్పా? అందులో ఆత్మముద్ర ఉన్నట్టా లేనట్టా?

  మెచ్చుకోండి

 9. >>చుట్టపుచూపుగా వచ్చినావిడ అడిగితే, ఆస్తిలో పంపకాలు పెట్టమని అడుగుతోంది అని కాదు కదా
  – :))) Good one!!!

  పూర్తి విదేశీ సెటప్ లో కథలు రాస్తున్నప్పుడు కూడా తెలుగు ఆత్మ ముద్ర ఉండవచ్చు, కావాలనుకుంటే…అది ప్రత్యేకంగా చూపాలనుకుంటే. ఇటీవల ఒక నైజీరియన్ రచయిత చనిపోయినప్పుడు (Chinua Achebe) జనం అంతగా బాధపడ్డది – ఆయన అక్కడ కూర్చుని ఆంగ్లంలోనే అయినా ఆనరరీ అమెరికన్ లాగ కథలు రాసినందుక్కాదు కదా. అది దేశం, ఇది ఆంధ్ర రాష్ట్రం అనవచ్చును. పూర్వపు రోజుల్లో భారతదేశం లో పలు దేశాలు – తెలుగు దేశం, కన్నడ దేశం, వంగ దేశం, ఓఢ్ర దేశం వగైరా… నిశ్చయంగా ఆయా ప్రాంతాలకి వారి ముద్రలు ఇంకా ఉంటాయి (ఉండాలనుకుంటే. ఇంకా ఎక్కువ విషయం కావాలంటే, శ్రీపాద వారి ఆత్మకథ చదవమని మాత్రం చెప్పగలను ఎవరికైనా…నేను ఎక్కువ సాహిత్యం చదువుకోలేదు కనుక!). మనది అనుకునేదాన్ని వదిలించేసుకున్నాక ఇంకో దాన్ని కావలించుకుని కథలు రాస్తే దానిలో ఏ ముద్రా లేకుండా పోతే… uniformity వచ్చేస్తుందన్న ఆరాటం అర్థం చేసుకోదగ్గదే కానీ, ఏం చేసుకునేందుకు ఈ uniformity? అన్నదైతే నాకు అర్థం కాని విషయం. (Even machines will get bored eventually, to process the text which looks alike irrespective of who wrote it!)

  మెచ్చుకోండి

 10. చాలా బాగా చెప్పారు. ఎవరైనా ఇంటికి వస్తే మనకున్నంతలో వాళ్ళని చూసుకోవడం, ఎవరింటికైనా ముందుగా కబురు చేసిన తర్వాతే వాళ్ళ వీలుని బట్టి వెళ్ళాలి అన్న పట్టింపు ఆరోజుల్లో లేక పోవటం చాలా సహజం. ఇప్పుడంటే ఫోన్ లు గట్రా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ వీలుని తెలుసుకొని వెళ్తే ఇబ్బంది ఉండదు. అమ్మ,నాన్న, పిల్లలు (ఒక్కరు లేక ఇద్దరు} కుటుంబానికి పరిమతి అవుతున్న ఈ రోజుల్లూ మేనత్తలూ, బాబాయిలూ కూడా పరాయి వ్యక్తుల క్రిందే లెక్క.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s