తల్లివేరు

(మార్పు 52 తల్లివేరు)

 

తెలుగునాట తల్లివేరు, అమెరికాలో అంటుమొక్క. తల్లివేరుఛాయలు అంటు కట్టిన కొమ్మ అంతరాంతరాల అణిగిమణిగి ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు పైకి తేల్తాయి. ఏది తల్లివేరుఛాయ, యేది అంటుమొక్కకి కొత్తగా వచ్చిన మెరుగు అంటే విడదీసి చెప్పలేం.

చెప్పేను కదా సంస్కృతి కూడా బ్రహ్మపదార్థంలాగా అనిర్వచనీయం. ఏది కాదో చెప్పగలం కానీ ఏది అవునో చెప్పలేం.

నాకెందుకో అమెరికాలో ఉన్న ఆప్రికనులని చూస్తే, సన్నిహితులని చూసినట్టే ఉంటుంది. తెల్లవారితరవాత ఎవర్నిగురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు అంటే తడుముకోకుండా నల్లవారని చెప్పేస్తాను. వాళ్లకీ మనకీ కొంత సామ్యం ఉందనుకుంటాను. నిజానికి జ్యూస్ సంప్రదాయాలు మనసంప్రదాయాలకి దగ్గరగా ఉంటాయని విన్నాను. కానీ నాకు మాత్రం ఆఫ్రికనమెరికనులంటేనే ఎక్కువ ఇష్టం. నల్లవారిని గొలుసులు కట్టి ఈడ్చుకొచ్చేరు, మనవాళ్ళని స్వర్గసుఖాలు ఎర చూపి ఈడ్చుకొచ్చేరనిపిస్తుంది. ఈ రెండో పద్ధతిలో నాజూకుతనం ఉంది, నాగరీకం ఉంది. నీకిష్టమయితేనే రా, నీక్కావాలనుకుంటేనే రా అని నొక్కి చెప్పుతారు. అయినా రెండుతెగలూ చేస్తున్నది చాకిరీయే కదా అనుకుంటా. ఒకటి దైహికం, రెండోది బౌద్ధికం.

నాకీ ఆలోచన ఎందుకొచ్చిందో కూడా చెప్తాను. ఒకసారి టీవీలో ఒక విలేఖరి ఒక Human Resources మనిషి చేస్తున్న రిక్రూట్మెంటుగురించి అతనిప్రశ్న. జరిగిందేమిటంటే, ఆఫ్రికాలో డాక్టర్లు తక్కువా, డాక్టర్ల అవసరాలు ఎక్కువా కావడంతో, వారు నర్సులకి ఎక్కువ శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టేరు. ఆ సమయంలో మన హేచ్చారాసామి అక్కడికి వెళ్ళి ఆ నర్సులకి అమెరికాలో వారు పొందగల సౌఖ్యాలు వివరించి, వారిని ఇక్కడికి తరలించడం మొదలు పెట్టేడు. విలేఖరి ప్రశ్న, అది అన్యాయం కదా, వారిదేశపు అవసరాలకోసం వారిని అలా  ఎడ్వాన్సుడుగా తయారు చేసుకుంటున్నారు కదా. అని. దానికి హెచ్చారాసామి సమాధానం నాకు అది ఆలోచించడానికి తీరిక లేదు. నేను వారికిచ్చిన మాట ప్రకారం, వారికి ఎక్కువ డబ్బూ, తదితరవసతులు – వీటిలో తక్కువ చెయ్యడంలేదు కదా అని.

ఏ జాతివారు ఇక్కడికి వచ్చినా ఆలాటిఆశలతోనే కదా అనొచ్చు. నిజమే, ప్రతిదేశంనించీ అమెరికా రావడం ఆ ఆశలతోనే. కనీ, నాకు మాత్రం నల్లవారే దగ్గరవారిగా కనిపిస్తారు. దీనికి నేను ఋజువులూ, సాక్ష్యాలూ ఏమీ ఇవ్వలేను. నాకలా అనిపిస్తుందంతే.

ఇలా నాతో నేను మాటాడుకుంటుంటే, తలుపుమీద చిన్నగా తట్టిన చప్పుడయింది. అమెరికాలో అర్థంeతరంగా వచ్చేవారెవరా అనుకుంటూ లేచి తలుపు తీసేను.

లీల!

ఆఁ అంటూ నోరు తెరిచి, కౌగిలించుకున్నంత పని చేసి, “ఎప్పుడు రాక, వస్తానని చెప్పలేదే?,” అంటూ గబగబ ప్రశ్నలు గుప్పించేను, తలుపు బార్లా తీసి, పక్కకి తప్పుకుని, తను రావడానికి దారిస్తూ. ఆవెనకే అరవింద కూడా ఉంది.

“ఆహా, అరవింద, అబ్భ ఎన్నాళ్లయిందీ చూసి. అసలు నన్ను మర్చిపోయేవనుకున్నాను,” అన్నాను. నిజంగా వాళ్ళలా రావడం నాకు బాగుంది. ఆవిషయం మాటల్లో చెప్పలేదు కానీ ఆక్షణం

నామొహం చూసినవాళ్ళకెవరికైనా అర్థమయిపోతుంది. వాళ్ళిద్దరికీ అర్థమయింది!

“ఇంతకీ ఏమిటి ఇలా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారిద్దరూ? సమయానికింట్లో ఉన్నాను కనక సరిపోయింది. నేనేదో పనిమీద తిరగడానికి పోతే, ఏమయేది, హుమ్,” అన్నాను చిరుకోపం ప్రదర్శిస్తూ.

“వెనుదిరిగి వెళ్ళిపోయేవాళ్ళం, అంతేనా. ఇందులో ములిగిపోయిందేముంది?”

“ఈరోజుల్లో సకలం కరతలామలకమే కదా. సెల్లుంది కదా, పిలవొచ్చు కదా?” అన్నాను, ముందు తెలిస్తే కనీసం ఏ పకోడీలో చేసి ఉంచేదాన్ని కదా అనుకుంటూ.

“ఏమో, నాకిలా మామూలుగా ఏ హడావుడీ లేకుండా రావాలనిపించింది, వచ్చేను. మీకు బాగులేదంటే చెప్పండి, వెళ్ళిపోయి, ఫోన్ చేసి మళ్ళీ వస్తాం. బహుశా ఈ తతంగం అంతా జరగడానికి కనీసం ఓ అరగంట పట్టొచ్చు,” అంది లీల చిలిపిగా.

నేను నవ్వేసి, “అఖ్ఖర్లేదులే, కూర్చో. ఇంతకీ విశేషాలేమిటి?”

“పెద్ద విశేషాలేం లేవు. అరవింద గ్రాడ్యేట్ అయిపోతుంది, రమ్మంటే వచ్చేను.”

“అలాగే, శుభం. ఉద్యోగం కూడా సిద్ధంగా ఉందా?” అన్నాను అరవిందవేపు తిరిగి. విషిగురించి అడగనా వద్దా అని ఆలోచిస్తూ.

“ఒక ఏడాదిపాటు మనదేశంలో పని చేద్దాం అనుకుంటున్నాను. నాతో నా స్నేహితుడు కూడా వస్తున్నాడు. ఇద్దరం అక్కడ ఏడాదిపాటు ఉండి మన సంస్కృతిగురించి తెలుసుకుని వస్తాం,” అంది అరవింద.

“ఓ, విషి కూడా ఏడాదిపాటు ఉండడానికి ఇష్టపడ్డాడా?”

అరవింద ఒక క్షణం ఊరుకుని, “విషి కాదు. మరొకతను కిందటేడు ఇద్దరం కీన్యాలో ఒక సెమెస్టరు గడిపేం అక్కడిజీవనసరళి తెలుసుకోడానికి వెళ్ళి …” అని ఆపేసింది, ఏదో తటపటాయిస్తున్నట్టుంది.

నేను సంతోషంగా, “ఆహా, మంచి స్నేహితుడే దొరికేడన్నమాట,” అన్నాను.

లీలవేపు తిరిగి, “ఇంతకీ నువ్వెక్కడుంటున్నావిప్పుడు?”

“అక్కడే, కేమన్ టవున్, స్థిరోభవ, వరదో భవ అని అక్కడే ఉండిపోయేను.”

“బాగుందా అక్కడ?”

“నాకు నచ్చింది, చాలా హాయిగా ఉంది. చిన్న ఊరు. మనవేపు పల్లెవాతావరణం కూడా ఇక్కడ కనక ఏదో సంతృప్తి. దిక్కులు చూస్తూ రోడ్డుమీద నిలబడితే, తప్పిపోయేవా అడుగుతారు ఎవరో ఒకరు. కింద పడితే, చెయ్యందిస్తారు లేవడానికి. బజారులో ఏదైనా కొంటే, ఓ పైస తక్కువయితే, ఫరవాలేదులే, ఈపైసల్లోంచి తీసి జమ చేసుకుంటాను అంటారు ఆపక్కన ఉన్న ఓ చిన్నడొక్కులోంచి ఓ పైస తీసి. ఆడొక్కు అలాటి అవసరార్థమే.”

“బాగుంది. నీకు మనశ్శాంతి అన్నమాట.”

“ఆ, ఒకరకంగా శాంతే. అదే కారణంగా మరిన్ని ఆలోచనలు కూడాను. దాంతో మరింత అశాంతి.”

“హా.హా. బాగుంది. మనశ్శాంతికి తగిన వాతావరణం ఉంటే మరింత అశాంతి అంటావు.”

“మనం అనుకోడంలో ఉందిలెండి. నాకు ఈమధ్య ఆఫ్రికనమెరికనులగురించి ఆలోచనలు వస్తున్నాయి,” అంది అరవిందవేపు చూసి.

అరవింద చిన్నగా నవ్వి, “నాస్నేహితుడని చెప్పేను కదా. అతను ఆఫ్రికనమెరికను. ఆసంగతులు లీలక్కయ్యతో మాటాడుతున్నానులెండి. ఆవిడకది హాస్యంగా ఉంది,” అంది అరవింద కోపం నటిస్తూ.

“ఇప్పుడు నేనేం అన్నానూ …” అంది లీల అమాయకంగా కళ్ళు చికిలించి.

“బాగానే ఉంది. నిజానికి అరవింద నాతో మాటాడకపోయినా, నేను కూడా వాళ్ళగురించే ఆలోచిస్తున్నాను ఈమధ్య. నిజానికి గత  గంటన్నరసేపట్నుంచీ అవే ఆలోచనలు.”

“ఇదుగో ఈ అరవింద చెప్పడంనించే లైబ్రరీనించి ఓ పుస్తకం తెచ్చేనీ మధ్య. కొందరు ప్రముఖ నలుపురచయితల ఇంటర్వ్యూలవి. ఒకొకరిది ఒకొక రకమైన అనుభవం. అందరిలో సర్వసాధారణంగా కనిపించిన అంశం తల్లిదండ్రులు చదువు లేనివారే, చదువువిలువ గుర్తించి పిల్లలని చదువుకోమని ప్రోత్సహించడం. Nathan McCall అని ఒకతను చిన్నతనంలో ఆకతాయిగా తిరిగి జైల్లో పడ్డతరవాత, పుస్తకాలమీద పడ్డాయిట కళ్ళు. ఎంతసేపు లెక్కపెడతాం ఆ గోడల్లో ఇటుకలు అన్నాడు. జైల్లో ఏకాంతం, aloneness మూలంగా తనకి జ్ఞానోదయం అయిందంటాడు. చాలామందికి జైలుజీవితం స్ఫూర్తిదాయకం అవుతుందంటాడు.”

“ప్రతివారూ ఏదో ఓసమయంలో తప్పక జైల్లో పడాలంటాడా అయితే?” అన్నాను నవ్వి.

“జైలనే అని కాదు కానీ చదువుకి, అంటే అర్థవంతమైన చదువుకి, ఏకాంతం చాలా అవుసరం అంటాడు. ఏకాకిగా బతకడం వేరు, ఏకాంతంలో జీవించడం వేరు. Loneliness is different from aloneness అని.”

“అవును, నేను కూడా అనుకుంటుంటాను ఈనాటి ఆధునికత మనకి ఆ ఏకాంతంవిలువ తెలియనివ్వడం లేదు. బాత్రూంలలో పత్రికలు చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఆ నాలుగు నిముషాలైనా “నాతో నేను” గడపడం అంత కష్టమా వీళ్లకి అని. నిశ్శబ్దం భరించలేరు. పొద్దస్తమానం టీవీనో రేడియోనో ఆన్ లోనే ఉంటుంది. లేదా చేతిలో హస్తభూషణం, సెల్ఫోను,  పత్రిక – ఏదో ఒకటి ఉండాలి.”

“అవునండి. నేనేం చెయ్యడంలేదు, ఇవాళ do nothing day అంటే చాలామందికి మహా ఆశ్చర్యమ్.”

“నిజానికి మనకి కూడా పూజగదులందుకే. ఎవరికి వారు కొంచెంసేపు ఈ నాతో నేను గడపడం అలవాటు చేసుకోవాలి. మళ్ళీ నాలుగో ఆశ్రమం వచ్చేసరికి అడవులకి పోవడం కూడా అందుకే.”

“అవునండీ. నేనూ అదే అంటాను. అది నాతో నేను మాటాడుకునేసమయం కావాలి నాకు. నన్నుగురించి నాకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు కదా. అంచేత నాకు నేనే ప్రాణస్నేహితురాలిని. అందుకే నాకు ఆయన చెప్పిన aloneness లో చాలా అర్థం కనిపించింది. చాలామందికి తమతో తాము కాలం గడపడానికి భయమేమో.”

“పిల్లలు ఆకతాయిపనులు చేస్తే, నీగదికి పో అంటూ వాళ్లగదికి తగిలేయడం కూడా అందుకేనండి. ఆలోచించుకోమని. కానీ, పిల్లలేమో దాన్ని శిక్షకింద తీసుకుంటారు,” అంది అరవింద.

నేను అవునన్నట్టు తలూపి, “ఇంతకీ ఆ పుస్తకం దేన్నిగురించి, అంటే మొత్తం సంకలనంలో ప్రధానంగా సందేశం ఏమిటి?” అన్నాను అరవిందవేపు తిరిగి.

“ఈ నలుపురచయితలు అందరూ తమ తల్లివేరు ప్రసక్తి చర్చించేరు. రెండోది తమ తల్లివేరే కాక ఇతరజాతుల కథలు కూడా చదవాలి అని గట్టిగా చెప్పడం నాకు చాలా నచ్చింది. అంచేతే నాకు వివిధజాతుల సంస్కృతులమీద ఆసక్తి వచ్చింది.”

లీలపెదవులమీద చిరుహాసం వెలిసింది. అరవింద ఆవిడవేపు చూసి, “కార్యా కూడా ఒక కారణమే అనుకోండి.”

“కార్యా ఆప్రికన్ పేరు. వాళ్ళపేర్లు వర్ణనాత్మకం అంటారు. కార్యా అంటే ఏమిటో.”

“నెమ్మదిగా మాటాడే, తెలివైనవాడు అనిట.”

“ఆహా, బాగుంది. మనిషి కూడా అదే తత్వమా?”

“మీకు నవ్వొస్తోంది కానీ నిజంగా చాలా నెమ్మదయినమనిషీ, తెలివైనవాడూను.”

“అందుకేలెండి ఈపిల్లకి నచ్చేడు,” అంది లీల.

అరవింద మళ్ళీ అందుకుంది, “అవునండి. అతనికి కూడా స్వజాతిగురించి, ఇతరజాతులగురించీ అంతులేని కుతూహలం. అతనితో పరిచయం అయేకే, నాక్కూడా మనసంస్కృతిగురించి మరింత ఆసక్తి కలిగింది. చాలా అనువాదాలు కూడా చదివేను.”

“అతనిచేత కూడా చదివించేవా?”

“చదవమని ఇచ్చేను కానీ …” అని ఆగిపోయింది నేనేం అనుకుంటానో అని కాబోలు.

“ఫరవాలేదులే. నేనేం అనుకోను. చెప్పు. అతనేమన్నాడు, నువ్వేమనుకుంటున్నావు?”

“మనసంస్కృతి సంప్రదాయాలు, విశ్వాసాలగురించి మనకథల్లో ఉండాలి కదా.” అఁది లీల.

“తెలుగుకథల అనువాదాలు అర్థం చేసుకోడం కష్టంగానే ఉందండీ. అసలు ఉన్నవే తక్కువ. అవి కూడా తెలుగువాళ్ళకి మాత్రమే అర్థమవుతాయేమో.”

“కొన్ని చూస్తే, మనకంటూ ఏమీ ప్రత్యేకతలు లేవేమో అనిపించింది. అందుకే, ఇద్దరం వెళ్ళి అక్కడ పల్లెల్లో కొంతకాలం ఉండి చూద్దాం అనుకుంటున్నాం.”

“అన్నీ కాదులే. కొన్ని మంచికథలు వస్తున్నాయి. కాస్త వైవిధ్యం కనిపించింది. మొన్నీమధ్య ఒకరిద్దరు ముస్లిమ్ రచయితలు రాసినకథలు చూసేను. అవి చూసినప్పుడు నాకు అర్థమయింది తెలుగుముస్లిములగురించి నాకేమీ తెలీదని. అంటే ముస్లిములు రాసే కథలన్నీ ముస్లిమ్ కథలు అని కాదు కానీ కదాచితుగా వారి ఆచారాలు, వారు మాత్రమే ఉపయోగించే పదాలు ఉన్నవి కనిపిస్తున్నాయి.”

“మీరలా అంటుంటే నాకు మరో కథ గుర్తొస్తోంది మాన్యెం అని, జూపాక సుభద్రగారు రాసేరు. ఆ కథలో కూడా సంస్కృతి ఛాయలు, మనకి కనీసం నాకు తెలీనివి, కనిపించేయి. డక్కలోళ్ళకీ, మాదిగవాళ్ళకీ కంచంపొత్తే కానీ మంచంపొత్తు లేదు అంటారొక చోట. నాకు అది చాలా ఆసక్తిగా అనిపించింది. మామూలుగా మధ్యతరగతి జనాలు “కింది” తరగతి జనాలనందర్నీ చాపచుట్టగా ఓ కట్ట కట్టి మాటాడతారు. కానీ వీరిలోనూ ఎక్కువతక్కువలున్నాయి. డక్కలోళ్ళ రాజక్క మాదిగవారి చిన్నవాడిని ఇష్టపడి పెళ్ళి చేసుకోడానికి కొంత వ్యతిరేకతని ఎదుర్కోవలసివచ్చింది. మళ్ళీ “పంచాది” పెట్టేవేళకి, వారిలో వారికి సామరస్యం ఉంది. రాజక్క చెప్పిన తీర్పుకి డక్కలోళ్ళూ, మాదిగలూ కూడా కట్టుబడి ఉంటారు. ఇక్కడ నాకు మరో సందేహం వచ్చింది. వీరిలో, అంటే డక్కలోళ్ళు, మాదిగలు, స్త్రీలు పంచాది చెయ్యడం సర్వసాధారణమా, కేవలం ఈకథకోసం రాజక్కని సృష్టించడం జరిగిందా? అని.”

“మంచి ప్రశ్నే. మరి సమాధానం దొరికిందా?”

“లేదు. ఎవరైనా తెలిసినవారు చెప్తారేమోనని చూస్తున్నాను.”**

“మరో రచయిత్రి, Faith Adiele తండ్రి ఇగ్బో నైజీరియను, తల్లి నోర్దిక్ అమెరికను. ఆ అదేలె కూడా తండ్రి జాతిగురించి తెలుసుకోడానికి చాలా తాపత్రయపడిందిట. మామూలుగా ఉండే స్టీరియో టైప్ అభిప్రాయాలు – ఆఫ్రికనులు ఆటల్లోనూ, సంగీతంలోనూ మాత్రమే రాణించగలరు అన్న అపప్రథ పుస్తకాలు చదివినతరవాతే తొలిగిందిట. పుస్తకాలు చదవడం మొదలు పెట్టేక, ఆప్రికనులు కూడా డాక్టర్లు, నాయకులు, కావచ్చు అని ఆప్రికన్ పిల్లలు కలలు గనవచ్చు అంటుంది.”

“మంచి మాచ. నేను ఈమధ్య చదివిన మరోకథ గుర్తొస్తోంది నాకు. నువ్వు చెప్పిన అంశం కాదు కానీ, సంస్కృతి అంటే, మనం విదేశాల్లో ఉన్నప్పుడు ఆదేశాల్లో జరుగుతున్న సంఘటనలప్రభావం మన ఆలోచనలమీద ఎలా ఉంటుందో చెప్పడానికి ..  అది చదువుతున్నప్పుడు నాకొచ్చిన ఆలోచనలు చెప్తే, నువ్వు ఆశ్చర్యపోతావు.”

“ఏంటాకథ?”

నాన్నంటే అని ఆ కథపేరు. ఒక చిన్న పిల్లవాడు తండ్రికోసం పడే తపన. అసలు కథనవిదానంలోనే ప్రత్యేకత ఉంది. ఒకొక సన్నివేశం వర్ణించి, నాన్నంటే … అంటూ ముగించడంలో కథకి మంచి పట్టు వచ్చింది. ఎటొచ్చీ, నా ఆలోచనావిధానంమీద కమ్ముకున్నపొరలమూలంగా ఆకథ మరోవిధంగా ఊహించుకుంటూ పోయేను చివరివరకూ. నీకూ అనుభవమేనేమో కథ చదువుతున్నప్పుడు ఏమవుతుందో అనుకుంటూ చదవడం ఒకదారి, ఇలా జరుగుతుంది అని ఊహించుకుంటూ పోవడం మరోదారి. ఈ రెండోపద్ధతిలో తెలుస్తుంది నిజంగా మనభావజాలం మారిఉంటే, ఎంతగా మారిపోయిందో.”

“మీరిలా డొంకతిరుగుడుగా మాటాడితే నాకర్థం కాదు. అసలు కథ చెప్పండి. ఏమయిందేమిటి కథలో?”

“ నేను కథంతా చెప్తే ఆ అందం పోతుంది. నువ్వే చదువుకో కథాజగత్‌ లో. నేను చెప్తున్నదేమిటంటే, మనం పాఠకులం కథ చదువుతున్నప్పుడు మనకి కలిగే ఆలోచనలమీద పరిసరాల ప్రభావం, మనం మనది కాని సమాజంలో ఉన్నప్పుడు, అక్కడి వాతావరణంతాలూకు ప్రభావం ఎలా ఉంటుందో అన్నది నాకు ఈకథ చదువుతున్నప్పుడు కొట్టొచ్చినట్టు కనిపించింది. చెప్పేను కదా కథకుడు ఒకొక సన్నివేశమే వర్ణిస్తాడు. ప్రతిసన్నివేశంలో అర్థరాత్రివేళ నడివయస్కుడొకాయన వచ్చి  ముద్దు పెట్టుకోడం, ఒళ్ళంతా తడమడం చేసి పోతుంటాడు. ఇలాటివి చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది అమెరికాలో స్కూళ్ళలో కోచ్‌లూ, చర్చిలలో గురువులూ అబ్బాయిలమీద జరిపిన, జరుపుతున్న లైంగికహింస. ఈమధ్య ఇలాటి అంశాలమీద అంటే సెక్సుకి సంబంధించినఅంశాలతో తెలుగులో కూడా  కథలు వస్తున్నాయి కనక నేను ఇది కూడా అక్కడికే దారి తీస్తుందనుకున్నాను. తరవాత అలాటి ఆలోచన వచ్చినందుకు నామీద నాకే చిరాకేసింది కూడాను.”

“అంటే ఈసంస్కృతి, ఆసంస్కృతి అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందంటారా?”

“ఎవరి సంస్కృతి అని కాదు కానీ నాకు ఇలాటి ఆలోచన రావడానికి కారణం నేనున్న సమాజంలో ప్రతిరోజూ వింటున్న వార్తలే కదా. బహుశా వీటికి మీడియా ఇస్తున్న ప్రచారం కూడా కావచ్చు. కానీ ఇదే నేను ఇండియాలోనే ఉంటే ఇలాటి తలపు వచ్చేది కాదేమో.”

“నాక్కూడా ఇలాటివిషయాలలో కుతూహలం ఎక్కువే. నేను చదివినమరో కథ కాదు కానీ ఇంటర్వూ. Nathan McCall అన్న రచయిత స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ చెప్పే పాఠాలు నిస్సారం అంటాడు. I was fed a lot of Shakespeare in school, that while useful, primarily reinforced White supremacy and did not speak to my experiences as a Black young man (p. 116). తను చదువుకున్న పనికొచ్చే చదువంతా ఆయనతల్లిద్వారాను, స్వయంకృషితోనూ వచ్చిందే అంటాడు. అలాగే, మరొక రచయిత్రి తల్లిదండ్రులు వేరు వేరు జాతులకి చెందినవారుట. తండ్రి నైజీరియాలో ఇగ్బొ జాతి, తల్లి … ఈమెకి జ్ఞానం వచ్చేక. తండ్రిసంస్కృతిగురించి తెలుసుకోవాలని పుస్తకాలు చదవడం మొదలు పెట్టిందిట. ఇలా ప్రతి రచయిత, రచయిత్రి కూడా ఆపుస్తకంలో “చదవడం” ద్వారా తమ మనోభావాలు ఎంత విస్తృతమయేయో చెప్పేరు. అంటే పుస్తకం చదవడం అంటే అట్టనించి అట్టవరకూ చదివేయడం కాక, అందులో ఉన్నవిషయాలగురించి ఆలోచించడానికీ, అర్థం చేసుకోడానికీ, ఆకళించుకోడానికీ, వాటిని తమ సంస్కృతితో తూచి చూసుకోడానికీ కూడా కాలం వెచ్చించాలంటారు. నాకు నచ్చినవిషయం ఇది.

మొత్తంమీద వీరందరూ చెప్పేవిషయాలు నాకు నచ్చినవి – ఈనాటి ప్రపంచీకరణమూలంగా మనం ఇతరదేశస్థుల పుస్తకాలు చదవాలి. ఇక్కడన్నమాట నాకు వెనకటి రెండు టపాలూ తలుచుకోవలసిన అవుసరం ఏర్పడింది. మనం మనకి ఏది ప్రత్యేకమో, దేనిని మనం మనదానిగా చెప్పుకుంటామో అది మనకథల్లో కనిపిస్తేనే కదా వారికి తృప్తి. అలా కాక మేం హైదరాబాదులో ఉండి మెక్డోనాల్డ్ బర్గర్ (చికెన్ తోనేలెండి) తిని, కొకోకోలా తాగి, బారుకెళ్ళి  … ఇలా రాసినకథలో వాళ్ళకి మనగురించి తెలిసిందేమిటి? అలాగని, సూర్యోదయాత్పూర్వము స్నానమాచరించి, చద్దన్నము తిని, పలకా, బలపమూ పుచ్చుకుని … ఇలా రాస్తేనే మన సంప్రదాయాలు వారికి తెలుస్తాయనా? ఇది నిజంగా చిక్కు ప్రశ్నే.”

Edwidge Danticat – హేటీ నించి పన్నెండేళ్ళప్పుడు అమెరికా వచ్చేరుట. ఆమె హేటీలో చదువంతా ఫ్రెంచ్ సాహిత్యమయం అవడంచేత, తనచిన్నతనంలో మంచి సాహిత్యం అంటే మృతులయిన ఫ్రెంచి ర-చయితలే అనే అభిప్రాయం కలిగిందిట ఆమెకి. అమెరికా వచ్చేక, కొంతవరకూ ఇంటిమీద బెంగతోనూ, ఇంగ్లీషు బాగా రాకపోవడంచేతనూ, హేషన్ సాహిత్యం చదవడం మొదలు పెట్టేరుట. ఒక హేషన్ రచయిత తాను జపనీస్ రచయితని అన్నారని చెప్తూ, writers live in the land of their readers and so, at least in our imagination, we take on the identity of the reader అంటాడుట ఆయన. అంచేత, ఎవరిపాఠకులు ఏదేశంలో ఉంటే రచయిత ఆదేశం రచయిత అవుతాడు అని ఆయనవాదన.”

“దానికీ మనం మాటాడుకుంటున్న సంస్కృతికీ ఏమిటండీ సంబంధం?”

“సంబంధం ఉందని కాదు. ఇలాటి భావం ఉందనీ చెప్తున్నాను. అంటే ఇది ప్రపంచీకరణకి సంబంధించింది అనుకోవచ్చు. మనం మనప్రత్యేకతలగురించి రాసినప్పుడు కూడా మనం ఎవరికోసం రాస్తున్నాం అన్నది దృష్టిలో పెట్టుకుని రాస్తే, ఇలాటివిషయాలు కూడా కలుపుతాం అనుకుంటాను.”

“నాకు నిద్రొస్తోంది కానీ మరొక రచయిత్రి అన్నమరోమాట కూడా చెప్పేసి పవనమానసుతు బట్టు పాదారవిందములకు పాడేస్తాను.”

“హాహా, అది కూడా తెలుగుదనమే కాబోలు.”

“చెప్పనేల, నాకు అలాటివి సరదాగా ఉంటాయంతే. ఇంతకీ మరొక రచయిత్రి Faith Adiele స్టీరియోటైప్స్ గురించి ప్రస్తావించింది. నల్లవారు అన్నగానే వాళ్ళపిల్లలందరూ ఆటల్లోనో, సంగీతంలోనో రాణించడానికే కలలు కంటారన్న అపప్రథకి ప్రతిగా, పుస్తకాలు చదివేకే Books taught me that Blacks could be powerful princesses and abolitionists and civil leaders and scientists అన్నది స్పష్టమయింది అంటుంది.”

“మామూలుగా రచయితలందరు అలా ఏదో ఒకరకమయిన అభ్యుదయభావాలు కలిగే ఉంటారు కద.”

“అధికంగా, ఆమె తల్లిదండ్రులది దేశాంతరవివాహం. తల్లి నైజీరియాలో ఇగ్బో జాతికి చెందినవాడు, తల్లి నోర్డిక్ అమెరికనుట. ఆమె అమెరికాలోనే పెరిగింది కానీ, చిన్నతనంలోనే తండ్రికి చెందిన ఇగ్బో సంస్కృతిగురించి తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించిందిట.”

“అదే మరి. అంతో ఇంతో మేధ ఉన్నవారంతా ఈ సంస్కృతి అన్న పదార్థం ఉందన్నభావనతోనే రచనలు సాగిస్తున్నారు.”

“హుమ్. ఏమోలెండి. మరోపక్క, నక్క పుట్టి నాలుగాదివారాలు కాలేదన్నట్టు, ఏదో పది ఇంటర్వ్యూలు చదివి ఓ అభిప్రాయం ఏర్పర్చేసుకోడం కూడా తప్పే కదా అనిపిస్తోంది.”

“అలా కాదు. మనకి నచ్చిన ఒక అభిప్రాయానికి ఒక్కరి వత్తాసు వచ్చినా తృప్తిగానే ఉంటుంది కదా.”

“శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తెలుగుభాషగురించి ఎంత ఉప్పొంగిపోతూ చెప్తారో చూడండి. నాదగ్గర పుస్తకం లేదు కానీ వారి ఆత్మకథ చదివినవారికి గుర్తుండే ఉంటుంది. లేకపోతే, సౌమ్య తన పేస్బుక్కులో పెట్టిన నాలుగు మాటలేనా చూడండి. నాకంత భాషా లేదు, సామర్థ్యమూ లేదు. చాలామంది ఆనాటిరచయితలు ఇలా వాచ్యం చెయ్యకపోయినా, తెలుగుభాషమీద అభిమానమూ, గౌరవమూ ఉండబట్టే, అంత మంచి తెలుగు రాయగలిగేరు. దానికోసమే అని ప్రత్యక్షంగా ఒప్పుకోకపోయినా, ఆభాష మనకి సూటిగా తగలడంచేతే వారికథలు ఇప్పటికీ మంచికథలుగా చెలామణి అవుతున్నాయి.”

“ఈ సంస్కృతి, బాష, వ్యవహారాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలూ – వీటివెనక మరోటేదో శక్తి ఉందేమో.”

“ఉంది. అదే గణాలు ఏర్పడినప్పుడే ఏర్పడిందని నేననుకుంటాను. మనిషిలో రెండు పొరలు నేనన్న అహమిక ఒకటీ, నాకు సాటిమనిషి ఆసరా కావలన్నది మరొకటి. మొదటిదానిమూలంగా తనకో ప్రత్యేకత ఉంది, ఉండాలి, ఉందని అందరూ గుర్తించాలన్న తపన, రెండోదానిమూలంగా, కుటుంబం, సమాజం, వాళ్ళు బాగుంటేనే నేను బాగు, అంచేత వాళ్ళకోసం పాటు పడాలి అన్న స్పృహ కలుగుతుంది. ఈ రెంటిమీదే మొత్తం సంస్కృతి ఆధారపడి అభివృద్ధి చెందుతుంది.”

“ఇంక వెళ్దామా?” అంది లీల అరవిందవేపు చూస్తూ.

“ఉండండి. కాస్త టీ పెడతాను.”

“ఇప్పుడెందుకండీ శ్రమ.”

“టీకి శ్రమేముంది, వేణ్ణీళ్లే కద,” అన్నాను లేస్తూ.

అరవింద నావెంటే వచ్చింది, “నాకు కొంచెం భయంగా కూడా ఉందండి కార్యాని ఇండియా తీసుకెళ్ళడానికి.”

“ఎందుకు?”

“తీరా అక్కడికెళ్ళేక ఉత్సాహం అంతా నీరుగారిపోతుందేమోనని.”

“ఎందుకలా అనుకుంటావు?”

“అక్కడంతా ఇప్పుడు అమెరికన్ కల్చరే కదా. నేను నాలుగేళ్ళకిందట వెళ్ళినప్పుడే చూసేను. అందుకే ఈసారి పల్లెలకి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ అక్కడ కూడా ఈ కల్చరే పాకి ఉండొచ్చు కదా.”

అ అమ్మాయి అనుమానం నాకు అర్థమయింది. నేను ఇక్కడ ఓ యూనివర్సిటీలో కొన్నాళ్లు తెలుగు పాఠాలు చెప్పేను. నాఉద్యోగం తెలుగుసంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోడానికి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళే అమెరికన్ విద్యార్థులకి తెలుగు నేర్పడం. ఇక్కడ వాళ్లు నానాతంటాలూ పడి పలకలేని పదాలన్నీ పట్టు బట్టి నేర్చుకుని, అక్కడికి వెళ్తే, అక్కడ ప్రతివారూ ఇంగ్లీషులోనే మాటాడ్డంతో తాము నేర్చుకున్న తెలుగు పనికిరాకుండా పోయిందని వాళ్ళు చెప్పేరు తిరిగొచ్చేక!

“లేదులే. ఎందుకలా అనుకుంటావు. మంచితెలుగు మాటాడేవారు, మనసంస్సృతంటే గౌరవం ఉన్నవాళ్ళూ  కూడా ఉంటారు,” అన్నాను.

నాలో అంతరాంతరాల కొనఊపిరితో కొట్టుకుంటున్న తల్లివేరు అలా అనిపించింది నాచేత.

———————————

గమనిక

**ఈ విషయం నాకు నిజంగా తెలుసుకోవాలనుంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

ఈవ్యాసంలో నేను ఉదహరించిన Black writers మాటలు ఈ కిందిపుస్తకంలోనుండి తీసుకున్నవి.

Golden, Marita, Ed. The Word: Black Writers Talk About the Transformative Power of Reading and Writing. New York: Broadway Paperbacks, 2011.

మాన్యెం కథ దీపతోరణం, వంద రచయిత్రులసంకలనంలో ఉంది.

నాన్నంటే కథ కథాజగత్ లో చూడగలరు.

(జులై 11, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “తల్లివేరు”

 1. లలితా, థాంక్స్. నేను కూడా వారు సూచించి పుస్తకాలు, వారు రాసిన పుస్తకాలు కూడా చదువుదాం అనే అనుకుంటున్నాను. కథల్లో సంస్కృతి పొందుపరచడం అన్నది అయాచితంగా జరుగుతుందేమో అనిపిస్తోంది నాకు. అంటే రచయితకి స్వతహాగా ఏ సంస్కృతిమీద గౌరవం ఉంటే, ఒకొకప్పుడు పుట్టుకతో వచ్చిన సంస్కృతి కాకపోయినా, ఆ సంస్కృతి తాలూకు ఛాయలు కనిపిస్తాయేమో అనిపిస్తోంది.
  నాన్నంటే కఛ – అవును పిల్లలకోణంలోంచి రాసిందే కదా. రచయిత ఆవిషయంలో కృతకృత్యుడయేడ
  నే చెప్పాలి. మీరు పిల్లలకోసం చేస్తున కృషి కూడా ఈ సంస్కృతివిషయంలో మెచ్చుకోదగ్గది. తప్పకుండా అలా కొనసాగించండి. శుభమస్తు.
  మాలతి

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ, రెండో సారి చదివాను. సంస్కృతి అంటే ఏమిటి, అది కథల్లో ఎలా ప్రతిబింబించాలి అన్న అన్వేషణని కొనసాగిస్తున్నారని అర్థమయ్యింది.
  ముందు కథాజగత్ లోని “నాన్నంటే” కథ చదివినప్పుడు నాకు అనిపించింది చెప్తాను. అదృష్టవశాత్తూ, మీకు ఏమి అనిపించింది అని ఇంతకు ముందు చదివినది మర్చిపోయాను నేను చదివేటప్పుడు. లేకపోతే నేను ఇంకోలా ఊహించేదాన్నేమో. నాకు బహుశా పిల్లల పుస్తకాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నందువల్లనేమో, ఇది ఆఫ్రికన్ స్టోరీ టెల్లింగ్ ని గుర్తుకు తెచ్చింది. పిల్లల కథలు చెప్పే విధానంలో నడిచింది కథ అని అనిపించింది. కథ అంతా ఆ అబ్బాయి కలలు నిజమా కాదా అన్న ఆలోచనల్తోనే చదివాను.
  మొత్తానికి మీరన్నట్టు పాఠకుడు చదివేది రచయిత చెప్పదల్చుకున్నదాంకంటే వేరు ఉండవచ్చు వేరువేరు ప్రభావాల వల్ల అన్నది ఒప్పుకోక తప్పని సత్యం.
  మీరు అన్వేషిస్తున్న ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఆ నల్లవారికి వారి సంస్కృతిని పరిచయం చేసిన పుస్తకాలని చదివితే కొంతవరకూ సమాధానం దొరకవచ్చు. అలా అంటుంటే నాకనిపిస్తోంది, జీవిత చరిత్రలు చెప్పకుండానే సంస్కృతి గురించి చెప్తాయేమో అని.
  కథలలో సంస్కృతిని పొందుపరచడం గురించిన ఆలోచన ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మీ ఆలోచనని దీపంలా ముందు పట్టుకుని నడక సాగిస్తున్నాను 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.