ఊసుపోక – సంకలించడం ఓ శ్రమ

(ఎన్నెమ్మకతలు 117)

తెలుగు సాహిత్యం మూడు పూవులు పన్నెండు కాయలుగా మహోత్సాహంతో, మహోద్వేగంతో వెల్లివిరిసిపోతోందనడానికి సాక్ష్యం ఈనాడు కోకొల్లలుగా వస్తున్న పుస్తకాలు. వాటిలో సంకలనాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రచయిత పుస్తకం వేసుకుంటే ఆ రచయితకి మాత్రమే ప్రతిష్ఠ. సంకనలం వేస్తే, ఆ సంకలనంలో ఎవరిపేర్లు ఉన్నాయో వారందరికీ ప్రతిష్ఠే కదా.

కొన్ని సంకలనాలు చూసికనప్పుడు సాహిత్యంలో ఏదో కృషి చేద్దాం అనుకుంటే, మరో పని తోచకపోతే ఓ సంకలనం వేసేద్దాం అని కొందరి అభిప్రాయమేమో అనిపిస్తోంది కొన్ని చూస్తే. ఈమధ్య వచ్చిన రెండు సంకలనాలు చూసినతరవాత, పుస్తకం.నెట్‌లో దీపతోరణం వందమంది రచయిత్రులకథానికలు సంకనలంమీద సారికగారి సమీక్ష చూసినతరవాత, నాకు ఈ టపా రాయాలనిపించింది.

సారికగారు తమ సమీక్షలో “లబ్ద ప్రతిష్టులైన సీనియర్ రచయిత్రులు తాము రాసిన వాటిల్లో మరి కొంత నాణ్యమైన కథల్ని పంపడంలో నిర్లక్ష్యం వహించారనిపించింది. నూరు కథల సంపుటి అనేది ఒక రికార్డు కాబట్టి దీనిలోని కథలు ఒకదానితో మరొకటి పోటీ పడే స్థాయిలో ఉంటే బావుండేది,” అని వ్యాఖ్యానించేరు. ఈవాక్యంలో రెండు అంశాలు ఉన్నాయి. నూరు కథలసంపుటి ఒక రికార్డు అన్నవిషయం ఒకటి, రెండోవిషయం – కథలు చెప్పుకోదగ్గస్థాయిలో ఉంటే బాగుండునన్నది. నేను ఈ రెండువిషయాల్లోనూ ఆమెతో ఏకీభవిస్తూ, నాకు తోచిన మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించడానికి ఈ టపా.

1. సంకలనానికి సంకల్పం చెప్పుకున్నాక, ఒక అంశం, ఎంచుకున్న లేక ఎంచుకోబోయే కథలకి, సూత్రప్రాయంగా తీసుకుంటాం. అంటే ఆ పుస్తకం మూసేవేళకి పాఠకుడికి ఆవిషయంమీద కనీసం లీలామాత్రంగానైనా ఒక సమగ్రకోణం ఏర్పడేలా చూస్తాం. ఆ అంశం చాలా చిన్నవిషయం కావచ్చు. చిన్నపిల్లల చదువులు, ఆడపిల్లలఉద్యోగాలు, రోజూకూలీలు, వికలాంగులు – ఇలా ఒక అంశంమీద అనేక కోణాలు ఆవిష్కరిస్తూ అనేకమంది రచయితలు రాసిన కథలు. లేదా, చరిత్ర ఆవిష్కరించదలుచుకుంటే, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 90వ దశకం, లేదా, ప్రాంతీయత వెల్లివిరసే కథలు – రాయలసీమకథలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉత్తరాంధ్ర, తెలంగాణా కథలు సంకలనాలుగా వేయొచ్చు. ఇలా ప్రాంతీయకథలు వేసినప్పుడు ఆ ప్రాంతంలోని సంస్కృతి, సంప్రదాయాలు వ్యక్తమవుతాయి అని వేరే చెప్పఖ్ఖర్లేదు కదా.

అలా కాక, నాయిష్ఠం అనుకుంటూ ఎంచిన కథలు, మాయింటికొచ్చినవాళ్ళకథలు, ఆదివారం సాయంత్రం ఛార్మినార్‌దగ్గర తారసపడ్డవాళ్ళకథలు – ఇలా కూడా సంకలించవచ్చు కానీ ఇవి ఆ సంకలనాల్లోని రచయితల మిత్రులపరిధిలో మాత్రమే ఉండిపోయే అవకాశం ఉంది.

దురదృష్టవశాత్తు, ఈ చివరిరకం సంకలనాలే ఎక్కువగానే వస్తున్నట్టు కనిపిస్తోంది నాకు. అచ్చంగా అలాగే కాకపోవచ్చు కానీ సుమారుగా అలాగే ఉంటున్నాయి. ఏదో పుస్తకం వేసేద్దాం అన్న ఉత్సాహమే, కాని ఆపైన కావలసిన శ్రమ పడడానికి సిద్ధంగా లేకపోతే, దరిమిలా బజారుకెక్కిన సంకలనాలు కూడా అస్తవ్యస్తంగానే తయారవుతాయి.

2. ఎంపిక అయినతరవాత, రచయితలనీ, రచయిత్రులనీ సంప్రదించడం. నేనయితే, ఆ సంకనలం కూర్చడంలో నా ఆశయం ఏమిటో వారికి వివరించి, తదనుగుణంగా ఉండే కథలు ఏమైనా వారివి ఉంటే రెండో మూడో పంపమంటాను. వాటిలో నా ఆశయానికి నప్పుతుందనుకున్నది ఎంచుకుని ఆవిషయం వారికి తెలియజేస్తాను. (ఇవన్నీ ఎవరికి తెలీవు అనకండి. నాప్రమేయం ఏమాత్రమూ లేకుండానే, నాకథలు కనీసం నాలుగు సంకలనాల్లో వచ్చేయి, పైన చెప్పిన దీపతోరణంతో సహా.)

3. “కథలు ప్రచురించిన పత్రికల పేర్లూ,తేదీలూ, రచయిత్రుల చిరునామాలూ కనీసం కాంటాక్ట్ ఫోన్ నంబర్లూ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పాలి,” అని సారికగారు సూచించేరు. కొన్ని సంకలనాల్లో ఈ సమాచారం ఇస్తున్నారు.

నేను కూడా కథ ప్రథమముద్రణకి సంబంధించిన వివరాలు ఇవ్వడం అవుసరం అనే అనుకుంటాను. కనీసం ఏ దశకంలో ప్రచురితమయిందో తెలిస్తే, కథకి మరింత పటుత్వం ఏర్పడుతుంది. ఇంకా, ఆ కథ నేపథ్యం, స్పూర్తి కలిగించిన సందర్భం కూడా రచయితని అడిగి తెలుసుకుని, ప్రచురిస్తే, మరింత బలం. పైగా ఇలాటి వివరాలు పాఠకులలో వ్యక్తిమీద కంటే వస్తువుమీద దృష్టి నిలపడానికి దోహదం చేస్తాయి.

చిరునామాలు, కాంటాక్ట్ నెంబర్లూ అవుసరమని నేననుకోను. నిజానికి అవి అచ్చులో కనిపించడం నాకిష్టం లేదు. ప్రైవేసి మాట అటుంచి, ఈ చిరునామాలూ, ఫోన్నెంబర్లూ అచ్చుపుస్తకం ఉన్నన్నాళ్ళూ ఉండవు కదా. మారిపోతుంటాయి.

4. అలాగే రచయితకి సంబంధించిన వివరాలు – పుట్టినతేదీలు, చదువులాటివి -కొంతవరకూ ఉపయోగపడొచ్చు సాహిత్యచరిత్ర దృష్ట్యా. కానీ ప్రతి రచయితపేరుకిందా ఒక మూస వాక్యం “అనేక పురస్కారాలు పొందేరు, అనేక పుస్తకాలు ప్రచురించేరు”వంటివి మాత్రం రచయితకి ఘనత తేవు. నాసంకలనం Telugu Penscape చివరలో ప్రచురణకర్తలు (నన్నడక్కుండా) నాపేరుకింద చిన్నతనంలో నేను రాయడం మొదలుపెట్టినరోజుల్లో రాసిన చిట్టి పొట్టి స్కెచ్చిలు, గల్పికలు ఉదహరించేరు నా రచనాపాటవానికి గుర్తుగా. అవసలు కథలే కావనీ, ఇలాటివి రచయితలకీ, సంకలనకర్తలకీ కూడా గౌరవప్రదం కాదనీ వారికి తెలీలేదు. రచయితలతో సంప్రదించకపోవడంవల్ల ఇలాటివి జరుగుతాయి.

5. కథాక్రమం –  ఇది కూడా అర్థవంతంగా ఉండాలి. రచయితల సాంఘికస్థాయినో, ప్రాముఖ్యాన్నోబట్టి కాక, ఒకకథలో సన్నివేశం తరవాత సన్నివేశం కూర్చినట్టే, సంకలనం కూడా ప్రధానాంశాన్ని ఆవిష్కరించే తీరులో ఒక అర్థవంతమైన క్రమంలో జరగాలి. అప్పుడు పాఠకుడు ఇక్కడో కథ, అక్కడో కథ అంటూ కప్పగంతులేసుకుంటూ పోకుండా పూర్తిగా పుస్తకం అంతా ఒక నవలలా చదివే అవకాశం ఉంటుంది.

6. ఇంక అచ్చుతప్పులమాట నేను చెప్పను. ఎందుకంటే నాపుస్తకంలో తప్పులగురించి మీరందరూ నాకు బాగానే పెట్టేరు కనక. కానీ, మీరు నాకంటె ప్రముఖులు కనక, మందీ మార్బలమూ ఉన్నవారు కనక, వీటివిషయంలో కూడా జాగ్రత్త వహించగలరు.

7. కాపీరైటు విషయం కూడా అనుమతి ఇచ్చినప్పుడే మాటాడుకోడం మంచిది. సాధారణంగా రచయితలు సరే వేసుకోండి అంటే, ఆ సంకలనంలో చేర్చుకోడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు లెఖ్ఖ. అలా కాక, మాకు మీకథ సర్వ హక్కుభుక్తములుగా ఇచ్చేయండి, మాతరవాత మీరు మరెక్కడా ఈకథ మార్చడానికి గానీ, మళ్ళీ ప్రచురించుకోడానికి గానీ మీకు హక్కు లేదనగలరు. ఇలాటివి ముందు మాటాడుకోవాలి. (అడక్కుండా వేసేసుకునేవాళ్ళని మనం ఏమి చెయ్యగలం అని నన్నడక్కండి 😛

ప్రధానంగా శ్రద్ధ, లక్ష్యశుద్ధి  కావాలి. సంకలనం వెయ్యాలనుకున్నాం, వేసేసేం అని కాక, శ్రద్ధతో, లక్ష్యశుద్ధితో చేసినప్పుడే సాహిత్యానికి నిజంగా సేవ చేసినవారవుతారు. మంచి సాహిత్యచరిత్ర ఏర్పడడానికి మార్గదర్శకులవుతారు.

(జులై 13, 2013.)

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఊసుపోక – సంకలించడం ఓ శ్రమ”

  1. మంచికథ ల సకలనం వేయాలంటే స్వంత డబ్బుండాలి అభిరుచి అధ్యయనం అవగాహన ఉండాలి!ఏది మంచికథ అనేది ఎంతమాత్రం తెలియనివారు వేసే సంకలనాలు బూడిదలో పోసిన ఖరీదయిన పన్నీరు!వృధా!మాలతి నిడదవోలు మంచి టపా లిఖించారు!

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.