కారణజన్ముడు

(మార్పు – 53)

ఓ చేత్తో సోడా, పుచ్చుకుని,  రెండోచేత్తో సెల్లు పుచ్చుకు స్నేహితురాలితో మాటాడుతూ నెమ్మదిగా నడుస్తున్నాడు ఓ అబ్బాయి. సమయం రాత్రి పదో, పదకొండో. తనవెనక ఎవరో వస్తున్నట్టనిపించింది. “నన్నెవరో తరుముకొస్తున్నట్టుంది,” అన్నాడు స్నేహితురాలితో.

“పారిపో.”

“లేదు, పరుగెట్టను. పరిగెడితే మరింత అనుమానాలొస్తాయి అన్నారు మానాన్న.”

“సరే. కానీ తొందరగా ఇల్లు చేరుకో.”

***

ఆ అబ్బాయిని గమనిస్తున్నతను పోలీసులకి ఫోను చేసేడు.

“హలో, 911. ఏమిటి ఎమర్జన్సీ?”

“ఎవరో అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు.”

“ఎక్కడ?”

“… మలుపులో.”

“అతన్ని వర్ణంచగలవా?”

“ఏమో చీకటి, నల్ల స్వెటరు వేసుకున్నాడు.”

“నల్లవాడా, తెల్లవాడా?”

“నల్లవాడిలాగే ఉన్నాడు. xxx … వీళ్ళు దొంగ వె…. xxxలు …”

“ఎటువైపు వెళ్తున్నాడు?”

“కనిపించడంలేదు ఎటెళ్ళేడో?”

“నువ్వు అతనివెంట వెళ్తున్నావా?”

“ఆఁ, ఇలాగే తప్పించుకుపోతారు వీళ్ళు xxx.”

“నువ్వలా వెంటపడ్డం మంచిది కాదు. నీకారులోనే ఉండు. పోలీసులు వస్తున్నారు.”

అతను కారు దిగి, ఆ అబ్బాయివెంట నడుస్తున్నాడు.

“ఇతను నావెంటే వస్తున్నాడు,” సెల్లులో స్నేహితురాలితో. హఠాత్తుగా వేరే మాటలు వినిపించసాగేయి.

లే …లే … నామీదనించి లే … అమ్మో .. బాబోయ్ … ఏయ్ .. ఊపిరాడ్డం లేదు. .. లే ..మ్  మ్.. లే.

పిస్తోలు పేలింది. ఢాం!

పోలీసులని పిలిచేడు.

చుట్టుపక్కల ఇళ్ళలోవాళ్ళు కిటికీలదగ్గరకొచ్చి చూసేరు.

— — —

పోలీసులు వచ్చేరు. “ఎవరు పోన్ చేసింది నువ్వేనా?”

అబ్బాయిని చూసేరు. అతనిప్రాణం పోయింది. ప్రాణం ఉన్నవాడు తనకథ చెప్పేడు. “వెనుదిరిగి కారుదగ్గరికి వెళ్ళిపోతుంటే, ఆ అబ్బాయి వచ్చి మీద పడ్డాడు. “ఇవాళ నువ్వు చస్తావు” అన్నాడు. ఈ చుట్టుపట్ల దొంగతనాలు ఎక్కువవుతున్నాయని, పహరా కాస్తూ చూసేను. అనుమానాస్పదంగా కనిపించేడు. పోలీసులని పిలిచి, అతన్ని అనుసరించేను. అతనే నామీదకి దూకి, నన్ను కిందపడేసి, నాతల సిమెంటుగచ్చుమీద బాదడం మొదలు పెట్టేడు. నేను నా పిస్తోలు తీయబోతుంటే, లాక్కోబోయేడు. నన్ను చంపేస్తాడన్నభయంతో కాల్చేసేను.”

“నీకేమైనా దెబ్బలు తగిలేయా? ఆస్పత్రికి వెళ్తావా?”

“లేదు. అఖ్ఖర్లేదు.”

“సరే పద. స్టేషనులో నీ వాఙ్మూలం ఇచ్చి పోదువుగాని.” (ఇక్కడ నాకు రావిశాస్త్రిగారి ముత్యాలమ్మ గుర్తుకొస్తోంది.).

ఏంబులెన్సువారు ఆ కుర్రాడి ప్రాణాలు పోయేయనీ, తాము చేయగలిగిందేమీ లేదని నిశ్చయించి, శవాన్ని బండిలో పడేసి తీసుకుపోయేరు.

— —

ఏ తప్పూ చేయని 17 ఏళ్ళ అబ్బాయి జీవితం అలా అర్థంతరంగా ముగిసిపోడం అన్యాయంగా అనిపించింది ప్రజలకి. అన్యాయం, అన్యాయం అని అరిచేరు. 44 రోజులతరవాత, కోర్టువారు కేసు నడపడానికి ఒప్పుకుని కార్యక్రమం మొదలు పెట్టేరు.

— —

మొత్తం కేసంతా ఇక్కడ రాయడం కష్టం కానీ, మొత్తమ్మీద పిస్తోలుమనిషిని నిర్దోషి అని నిర్ణయించి పంపేసేరు.

మళ్ళీ ప్రజల్లో ఆందోళన మొదలయింది శాంతియుతంగానే అయినా ఉధృతంగానే సాగిస్తున్నారు. నల్లవాళ్ళు మాత్రమే కాదు, తెల్లవాళ్ళూ, పచ్చవాళ్ళూ, చామనచాయవాళ్ళూ , చిన్నవాళ్లూ, పెద్దవాళ్లూ, ఆడవాళ్ళూ, మగవాళ్లూ – శతవిధాల తమ అసంతృప్తినీ, ఆరాటాన్నీ, ఆక్రోశాన్ని వెలిబుచ్చేరు.

ఇంకా వెలిబుచ్చుతూనే ఉన్నారు.

—–

జూరరు ఒకావిడ ఇంటర్వ్యూ ఇచ్చింది. “ఆ అబ్బాయిచావుకి కారణం ఆ అబ్బాయే. అందులో చాలా పెద్ద పాత్ర వహించింది అతనే,” అని నొక్కి వక్కాణించింది. “పిస్తోలుమనిషి వెంటబడి, తగువేసుకుంటే, ఆ అబ్బాయి ఎదురు తిరగడమేమిటి, వెనక్కి తగ్గి, ఇంటికెళ్ళిపోవాలి గానీ,” అంది.  ఇంకా చాలా మాటలు ఇలాటివే చెప్పింది కానీ అవన్నీ రాస్తే, మరింత నవ్వొస్తుంది, ప్రధానవిషయం పక్కదారి పడుతుందన్న భయంతో రాయడం మానుకుంటున్నాను. అన్నట్టు ఆ జూరరు  పుస్తకం రాయబోతోందిట. అది కూడా ఇలాగే నవ్విస్తుందనే అనుకుంటున్నాను. మిగతా జూరరులలో నలుగురు వెంటనే పై జూరరు అభిప్రాయాలు తమవి కావని ప్రకటించేరు. ఆరో జూరరు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది.

కానీ ..

ప్రజలు ఇంకా తమ ఆందోళన ప్రకటిస్తూనే ఉన్నారు. దేశనాయకుడు తన అబిప్రాయం వెలిబుచ్చేడు. సూక్ష్మంగా తన అనుభవాలు కూడా వివరించేడు. తన రూపురేఖలని బట్టి, తను కనిపించినప్పుడల్లా, పక్కకి తొలిగేవారూ, కారుతలుపుతాళాలు బిగించుకునేవారూ, పర్సులు మరింత గట్టిగా గుండెలకి అదుముకునేవాళ్ళూ … ఇవన్నీ తనకి అనుభవమే. తనే కాదు, దేశంలో మిగతా జనాభాలో చాలామందికి – తెల్లవాళ్ళు కానివాళ్లకి – ఇదంతా అనుభవమే అనడంలో సందేహం లేదన్నాడు. కారువాడిలాగే ఆ చిన్నవాడిచేతిలో పిస్తోలు ఉండి ఉంటే, ఆ అబ్బాయే కారువాడినే కాల్చి ఉంటే, కోర్టులో తీర్పు ఎలా ఉండేది? అని ప్రశ్నించేడు. ఇంతకీ ఆయన సలహా, ఈ ఒక్క కేసూ మాత్రమే దృష్టిలో పెట్టుకుని అల్లరి చెయ్యడం కాదు. ఎందుకిలా జరిగింది? చారిత్రక కారణాలు, సామాజిక కారణాలు ఇవన్నీ మరోసారి గుర్తు చేసుకుని, మళ్ళీ ఇలా జరగకుండా ఉండడానికి మనం చెయ్యగలిగింది ఏమిటి అని ఆలోచించాలి.

“ప్రతి ఒక్కరూ తమ ఆత్మల్లోకి తొంగి చూసుకుని తమలో అంతరాంతరాల ఓఅణిగి మణిగి ఉన్న వివక్షతని మరోసారి తడిమి చూసుకోవాలి” అని చెప్పేడాయన.

— —

అమెరికాలో 2012లో ఫిబ్రవరి 26వ తేదీ, ట్రేవాన్ మార్టిన్ అనే 17 ఏళ్ళ నల్ల అబ్బాయిని జార్జ్ జిమర్మన్ అనే 28 ఏళ్ళ తెల్లవాడు కాల్చి చంపేసేడు, ఆ అబ్బాయి అనుమానాస్పదంగా కనిపించేడన్న వాదనతో.

ఈ సంఘటన నన్ను చాలా కదిలించింది. కేసు కోర్టులో చాలావరకూ చూసేను. టీవీలో చర్చలు చాలామటుకు విన్నాను. రెండోవేపు వాదించేవారివి కొన్ని విన్నాను.  కొన్ని ప్రధానవిషయాలు మాత్రం ఇక్కడ రాసేను, పూర్తిగా రాస్తే పెద్ద పుస్తకం అవుతుంది. కావలసినవారు అంతర్జాలంలో చూడొచ్చు. wikipedia.org లో కూడా చాలా వివరంగా ఉంది.

నేను పై కథలో ఊర్లూ, పేర్లు ఇవ్వలేదు. అందుకు  కారణం, మీరు గుర్తించలేరని కాదు. నిజానికి మీకూ తెలిసే ఉంటుంది.

నేను పై కథలో ఊర్లూ, పేర్లు ఇవ్వలేదు. అందుకు  కారణం, మీరు గుర్తించలేరని కాదు. కానీ మనవి కానిపేర్లు కనిపించగానే, దూరం, మనకీ పెరవారికీ మధ్య ఎడం తలపుకొస్తుంది. అలా కాక మీ పరిసరాల్లో జరుగుతున్న ఇలాటి ఉదంతాలు మీమనసులోకి రావాలని నా కాంక్ష.

మనదేశంలో నలుపూ తెలుపూ కాకపోతే, మరో కారణంగా వివక్షతలు ఉన్నాయి. ఈ న్యాయాన్యాయాల విషయంలో, ఎదటిమనిషిని మనిషిగా గుర్తించే విషయంలో ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మల్లోకి చూసుకుని, తమని తాము ప్రశ్నించుకోవాలి అన్న ఒబామా మాటల్లో ఎంతైనా నిజం ఉందని అనుకుంటున్నాను.

మనదేశంలో పిస్తోలుతో కాకపోతే, కర్రలతో కొట్టి, కాళ్ళతో కుమ్మి చంపుతున్నారు. కిరసనాయిలు పోసి నిప్పంటించి చంపుతున్నారు. ఇంకా ఎలా వీలయితే అలా అనేకరకాల హింసించి చంపుతున్నారు. వీటిగురించి మనవాళ్ళు కూడా ఆలోచించాలి. వీటన్నిటికీ వెనక ఉన్న కారణం స్వార్థం, అహం. ఎదటిమనిషిని మనిషిగా గుర్తించే జ్ఞానం లోపించడం. ఒబామా చెప్పినట్టు మనవాళ్ళు కూడా ఆత్మశోధన చేసుకోవాలి, ప్రతివారూ ఆవేపు పయనించే ప్రయత్నం, చేయాలి, పిల్లలని అలా తీర్చి దిద్దాలి, personality development, how to be successful పాఠాలకంటే, ముందు పిల్లలకి నేర్పవలసినవి ఇవి అని నాకు చెప్పాలనిపించింది. అంతే.

ఇప్పుడు చెప్తాను అసలు నేపథ్యం.

ఫిబ్రవరి 17, 2012 రాత్రి, 17 ఏళ్ళ నల్లవారి పిల్లవాడు Trayvon Martin వీధిచివర షాపులో సోడా, స్కిటిల్స్ కొనుక్కుని, తిరిగి ఇంటికి వెళ్తుంటే, Neighborhood watch పేరున తిరుగుతున్న George Zimmerman అతన్ని అనుమానించి వెంబడించేడు. పోలీసులని పిలిచేడు. వాళ్లసలహా పాటించకుండా ఆ కుర్రాడివెంట వెళ్ళేడు. ఆతరవాత జరిగిన పోట్లాటకి ఆ అబ్బాయే కారణం అని Zimmerman వాదం. ఆ కుర్రాడు బతికి లేడు అతనివాదం చెప్పడానికి, చాలా పెద్ద కథే జరిగింది ఆ తరవాత. అదంతా రాయలేను. కానీ, కోర్టువారు, జూరరులు జిమర్మన్ కథ పూర్తిగా నమ్మి, అతన్ని నిర్దోషిగా నిర్ణయించేరు. కథ పూర్తిగా తెలియాలంటే, మీరు వీళ్ళపేర్లు కీవర్డ్ కొట్టి చూడొచ్చు. ఒక నిండు జీవితాన్ని అర్థంతరంగా అంతం కావడానికి జిమర్మన్ బాద్యత అస్సలు లేదంటే నాకు నమ్మకం కలగడం లేదు.

ఈ సందర్భంలో, ఒక్క నల్లవాళ్లు మాత్రమే కాక, అన్ని రంగులవాళ్లూ ట్రేవాన్ మార్టిన్ పేరున నిరసన ప్రకటించడం చూస్తే, ప్రజలలో ఇంత సంచలనం కలిగించిన ఆ అబ్బాయి కారణజన్ముడనే అనిపిస్తోంది. ట్రేవాన్ మార్టిన్ మరణానికి కారకుడైన జిమర్మన్ కూడా కారణజన్ముడేనా? రావణుడు పుట్టకపోతే, రామావతారం అవుసరం లేదు. శకుని లేకపోతే, భారతయుద్ధం లేదు, కృష్టావతారం అవుసరం లేదు. అంచేత, మరి ఈ ఇద్దరూ కారణజన్ములేనా?

వీటన్నటికీ సమాధానాలు దొరక్కే ఈ ఆవేదనాశకలమ్! మన ఆలోచించే తీరులో, సాటిమనిషిని ఆదరించేవిధానంలో మార్పు రావాలి. మనం మారాలని గ్రహించడం తొలిమెట్టు. ఆ మెట్టుకోసం ఎదురు చూస్తూ …

(జులై 21, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “కారణజన్ముడు”

 1. ఒకరి ప్రాణాలను తీసే హక్కు ఇంకొకరికి లేదు .
  ఇక్కడ కూడా తగలబెట్టి చంపడం, దానిని సమర్దించడం,
  తరచుగా జరుగుతూనే ఉంటాయి
  చేసే వారు, చేయించే వారు దేశ ప్రధానులైనా కూడా
  ఆ శ్చర్య పడక్కర లేదు

  మెచ్చుకోండి

 2. విన్నకోట నరసింహారావు, అవునండీ మీరు చెప్పింది నిజమే. కానీ నాకిప్పుడనిపిస్తోంది సగం లోకం నిండినకప్పు. మనం చూడవలసింది నిండినసగమా, ఖాళీగా ఉన్న సగమా అని. కనీసం ఇది చదివిన ప్రతి ఒక్కరూ మరొకరితో ఇది చర్చిస్తే, ఏదో సాధించినట్ట్ తృప్తి పడతాను. 🙂

  మెచ్చుకోండి

 3. చాలా మంది మనసుల్లో ఉన్న ఆవేదన గురించి బాగా చెప్పారు. సమానత్వం పాటించే వ్యక్తులు కొద్ది శాతం లోకంలో ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు. అటువంటి వారి సంఖ్య పెరగాలని ఆశిద్దాము. కాని ఆమాత్రం మార్పు కూడా ఒక అమెరికా అధ్యక్షుడు చెప్పిన “peace in our lifetime” లాంటి ఎండమావే అనిపిస్తుంది (నిజంగా అదే జరిగితే యుటోపియానే గదా). ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తమైన వ్యాపార (విష) సంస్కృతి వల్ల విలువలు తగ్గిపోయాయి; టీవీ సినిమా మీడియాల్లో చిత్రీకరించే మితిమీరిన కక్షలు కార్పణ్యాల వల్లా, రాజకీయ నాయకులు అధికార దాహంతో రెచ్చగొట్టె పనుల వల్లా ప్రజల్లో అసహనం బాగా పెరిగిపోయింది. చరిత్రలో చేసిన తప్పులనుంచి నేర్చుకోవడం మానేసి సమాజం మనస్తత్వాల పరంగా కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్లిందని నాకు అనిపిస్తుంటుంది. కాని మీరు చెప్పినట్లు ప్రయత్నం తప్పకుండా కొనసాగుతూనే ఉండాలి. జనాల్ని అలోచింపజెయ్యటానికి రాయటం, చర్చలు చెయ్యటం విస్తృతంగా జరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా మీరు చక్కటి వ్యాసం వ్రాసారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.