ఎదుగని బిడ్డ ఎదుగునా?

అక్కిరాజు ఉమాకాన్తము గారు వంద ఏళ్లక్రితం తెలుగుభాష దురవస్థని చక్కనికథలో చెక్కేరు. మళ్ళీ ఆకథని మనముందు పెట్టింది సౌమ్య (లింకు ఇక్కడ), అనేక ప్రశ్నలతో. బ్లాగుల్లోనూ, ఇతరత్రా తెలుగుభాషని పునరుద్ధరించి పరిపుష్ఠం చెయ్యడానికి ప్రయత్నాలు గొప్పగా కాకపోయినా కనీసం కనిపిస్తున్నాయి. ఆర్నెల్లకో పది నెల్లకో ఓమారు ఘనంగా సభలు పెట్టి మహోద్వేగంతో తెలుగుభాష ఉత్కృష్టతని మననం చేసుకుంటున్నారు మనవాళ్ళు. కనక, ఇది మరో సమిధ.

నాలుగువందలఏళ్ళ (ఆనాటికి) తనబిడ్డ రోగిష్ఠి అయిపోయిందని తెలుగుతల్లి వాపోయింది. భాషకి రోగం అంటే ఏమిటి, ఆరోగం కుదరడానికి మనం ఏం చెయ్యాలి, ఎప్పుడు, ఎలా భాష ఆరోగ్యంగా పరిపుష్ఠం కాగలదు అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను.

మొదట్లో అంటే ఉమాకాన్తముగారిలెఖ్ఖ ప్రకారం 5 వందలఏళ్లక్రితం మహరాజులూ, చక్రవర్తులూ తెలుగుభాషకి ఘనంగా గౌరవించి  సత్కారాలు జరిపేరు. తెలుగుకవులని ప్రోత్సహించి, కనకాభిషేకాలు చేసి, చీనిచీనాంబరాలతో సత్కరించి, తెలుగుభాషయందు తమకి గల ఆదరాభిమానాలని చాటుకున్నారు.

ఆ తరవాత మొగలాయి చక్రవర్తులు వచ్చేక, తెలుగుభాషకి తెగులు పట్టడం మొదలయిందని తెలుస్తోంది ఎదుగనిబిడ్డ కథవల్ల. అంటే భాష పరిపుష్టం కాకపోవడమే కాదు, దానికి చీడ పట్టడం కూడా మొదలయిందని. తెలుగు కవులకీ, కావ్యాలకీ ఆదరణ క్షీణించడం మొదలయింది. ముద్దుపళని రాసిన రాధికాసాంత్వనము కావ్యంమీద ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు సుమారుగా ఇదే అబిప్రాయాన్ని వెలిబుచ్చేరు. కవయిత్రి కవిత్వపటిమని మెచ్చుకుంటూనే, “నలుగురిలో చర్చించుటకు వీలు కానట్ట” రాసింది అని వ్యాఖ్యానించేరు లక్ష్మీకాన్తమ్మగారు. అందుకు కారణం కూడా ఆవిడే చెప్పేరు. ఆనాటి రాజకీయవాతావరణం కారణంగా, దేశంలో అరాచకం పెచ్చరిల్లి, కవిత్వం తుచ్ఛదశకి దిగజారిపోయిందని. ముద్దుపళని వాడిన భాష మంచి తెలుగే కానీ ఆవిడ స్పృశించిన అంశాలు శిష్టజనులతో చర్చించదగ్గవి కావని ఆమె అభిప్రాయం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భాష ఆరోగ్యకరంగా ఎదగడం అంటే ఏమిటి అని అర్థం చేసుకోడానికి.

వ్యాధి లక్షణాలు లేక శల్యపరీక్షః

బాషకి స్థానం నాలుక. ముఖే ముఖే సరస్వతీ. మన నోళ్ళలోనే వాగ్దేవి స్థానం, ప్రస్థానం కూడా. నాలుకమీదకి మాటలు మెదడులోంచి. ప్రతి ఒక్కరికీ, ఎవరి పదకోశం వారికే, వారిమెదడులో ఉంటుంది. అందులో కనీసం మూడు నాలుగు భాషల పదాలుంటాయి. “నాకు ఒక్క తెలుగు మాత్రమే వచ్చు” అనేవారిపదజాలంలో కూడా ఇంగ్లీషుతోపాటు,  సంస్కృతం, హిందీ, నాలుగో పదో తమిళ పదాలు, ఇంకా కన్నడ, ఉర్దూ .. ఇలా ఇతరభాషలమాటలు కలిసిపోయుంటాయి.

ఈ ఇతరభాషలపదాలు తెలుగులో కలిసిపోడం (భాష పెరగడం) ఎలా జరిగిందంటే –

మొదట పండితులతో వచ్చిందనుకుంటా. దేవభాష సంస్కృతం – పేరులోనే ఉంది సంస్కరించబడినది. కవిత్వంలో సంస్కృతపదాలు వాడితే శృంగారం, తెలుగు వాడితే బూతు. రాజభాష ఇంగ్లీషు మాట వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. అది సార్వజనీనం, సార్వత్రికం, ప్రపంచీకరణలో ప్రధానాంగం.

ఇది ఎప్పుడు జరుగుతుందంటే –

సాధారణంగా ఇచ్చిపుచ్చుకోడాలు (పెళ్ళిళ్లు), వ్యాపారాలూ, ఉద్యోగాలమూలంగా జనులు దాటి పొరుగురాష్ట్రాలకి వెళ్ళడం, అంతకుముందే పాలనాయంత్రంగంకారణంగా ఎల్లలే మారిపోవడం జరిగినప్పుడు వారితాలూకు మాటలూ, అలవాట్లూ కూడా తెలుగువారి భాషాసంస్కృతులలో కలుస్తూ వచ్చేయి. అంటే, వీళ్ళు తెచ్చే సంస్కృతికి తగిన పదాలు తెలుగులో లేకపోతే, మనం అవే వాడతాం. ఇందుకు ఉదాహరణ అట్నుంచి ఇస్తాను. భారతీయభాషలపదాలు ఇంగ్లీషులో ప్రాచుర్యం పొందినవి – కర్మా, మంత్రా, దాల్, ఆమా (అమ్మ, Ama, Amah అని స్క్రాబుల్లో ఉన్నాయి), సాంబార్, ఇడ్లీ, చట్నీ. అలాగే తెలుగులోకి వచ్చిన ఉర్దూ పదాలు అంగీ, కైజారు, ఫిరంగులు … ఇవన్నీ మనకి తురకరాజులు పెట్టిన భిక్ష. ఇలా మనసంస్కృతిలో లేని వస్తువులూ, అలవాట్లూ మనవి చేసుకున్నప్పుడు తత్సంబంధిత పదజాలం కూడా తీసుకుంటాం. ఇలాటి భాష పెరుగుదల ఆరోగ్యమే అనుకుంటాను.

ఇంగ్లీషు ప్రస్తుతం చాలా ప్రాచుర్యంలో ఉంది. కారణం మొదట రాజభాష కావడం, తరవాత ఆ రాజులు పోతూ పోతూ, మీరు ఇంగ్లీషు నేర్చుకుని, మేం చెప్పిన పరిపాలనావిధానాలు ఒంట బట్టించుకుని, సరిగ్గా మాలాగే చేస్తే మీకు స్వాతంత్ర్యం ఇస్తాం అనడం. ఆవిధంగా భాషకీ, బతుకుతెరువుకీ, రాజకీయాలకీ ముడి పడి ఇంగ్లీషు వాడకం దేశంలో స్థిరపడిపోయింది. ఇంగ్లీషు రాజులు పోయినా ఇంగ్లీషు నిలిచిపోయింది.

ఆ తరవాత, అమెరికా సాంకేతికాభివృద్ధిమూలంగానూ, అవి తెచ్చే ఇహలోక సౌఖ్యాలమూలంగానూ మరింత ఎక్కువయిపోయింది. ఈవిషయంలో – ఇంగ్లీషుభాషని హక్కుభుక్తములు చేసుకోడంలో – దేశంలో ఇతరప్రాంతాలకంటే తెలుగువారిదే పైచెయ్యి అంటారు. అది అటుంచి, తెలుగుని అభిమానించే తెలుగువారు ఇంగ్లీషు ఎందుకు వాడుతున్నారు అంటే –

1. పైన చెప్పిన సాంకేతికాభివృద్ధి, సంస్కృతి కూడా విశ్వజనీనం కావడం.

2. ప్రచురించేవిధానంలో అవుసరం. పత్రికలు, బ్లాగులు తెలుగువిగా ప్రచారం పొందినా, వాటిలో ఇంగ్లీషూ, తెలుగూ రెండూ ఉన్నప్పుడు, తెలుగురానివారి దృష్టికి ఇంగ్లీషురచనలు తేవడంకోసం ఇంగ్లీషులోనే చెప్పవలసివస్తుంది (అంది సౌమ్య. నిజమే.).

3. ఆఫీసుల్లోంచీ, ఐఫోనుల్లోంచీ వార్తలు పంపినప్పుడు కూడా తెలుగులో రాయడానికి అవకాశం ఉండదు.

4. మనం చర్చించే విషయానికి తగిన వాతావరణం, భాష తెలుగులో లేకపోవచ్చు.

5. అలవాటయిపోయింది !! – ఇందులో నాకు కూడా పెద్ద పాలు ఉందని ఈవారం తెలుసుకున్నాను.

చాలాకాలంగా నేను తెలుగు పుస్తకాలు చదవలేకపోతున్నాననీ, దృష్టి కాయితమ్మీద నిలవడంలేదనీ చెప్తూ వస్తున్నాను. ఈమద్య ఆప్రోఅమెరికన్ రచయిత్రులపుస్తకాలు చదవడం మొదలుపెట్టేక, నాకు కొట్టొచ్చినట్టు అర్థమయినవిషయం – ఆ పుస్తకాలు ఆపకుండా చదివేస్తున్నాను. చక్కగా అర్థమయిపోతున్నాయి! తెలుగుతల్లి కథ మరోమారు గుర్తుకొచ్చింది. నేను 40 ఏళ్ళుగా అమెరికాలో ఉండడంచేత నాకిది comfortable అయిపోయింది! ఇంగ్లీషయినా చదవగలుగుతున్నందుకు ఆనందంగానూ, తెలుగు విదేశీభాష అయిపోయిందని బాధగానూ ఉంది.  అక్కిరాజు ఉమాకాన్తముగారు ఇప్పుడుంటే నన్నర్థం చేసుకుని, క్షమించగలరని ఆశిస్తున్నాను.

సరే, ఇవీ వ్యాధి లక్షణాలూ, విచికిత్సాను. ఇహ, చికిత్స సంగతి –

ఇప్పుడేం చేదాం? చికిత్స ఎలా చేదాం.

ఎదుగని బిడ్డ కథ ప్రతీత్మకం. నిజం చెప్పాలంటే నాకు కథంతా పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థం అయింది. ఈ భాషాదురాక్రమణలో మంచిని అలాగే ఉంచుకుని మిగతా బాగాలు ఉత్తరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలన్న  స్పృహ నాకే కాదు చాలామందికి ఉంది. అది బాగానే కనిపిస్తోంది.  మరింత తెలుగు మాటాడ్డానికీ, రాయడానికీ ప్రయత్నిస్తున్నారు. మిగతావారిని ప్రోత్సహిస్తున్నారు. నారాయణస్వామి బ్లాగులో తెలుగుపాఠాలూ (ఇది పునరుద్ధరించవలసిందిగా నారాయణస్వామిని కోరుతున్నాను), ఫేస్బుక్కులో తెలుగు నుడికారం ఇలాటి ప్రయత్నాలే అనుకుంటున్నాను. ఇంకా చాలామందే ఇలాటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు, నాకళ్ళ బడకపోవచ్చు. కానీ ప్రయత్నం ఉందని చెప్పడానికి ఇది చాలు కదా.

సభాలూ, సంఘాలూ, చట్టాలూ కంటే, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఒక మార్గమో పథకమో వేసుకుని మనం మర్చిపోతున్న తెలుగుమాటలని మళ్ళీ వాడుకలోకి తెస్తే, తెలుగుబిడ్డ ఆరోగ్యం కుదుటబడుతుందనుకుంటాను. ఎందుకంటే ముఖే ముఖే సరస్వతీ …

(జులై 26, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఎదుగని బిడ్డ ఎదుగునా?”

 1. ముద్దుపళని రచన ‘రాధికా సాంత్వనము’. రాధికాస్వాంతనము కాదు.

  సాంత్వనము అంటే ఊరట అనునయం, ఓదార్పు అనే అర్థాలున్నాయి. ఇక స్వాంతము అంటే మనసు.

  మెచ్చుకోండి

 2. ”రంగాజమ్మ రాసిన రాధికాస్వాంతనము”

  మాలతిగారు,
  రాధికాస్వాంతనం రాసింది రంగాజమ్మకాదు, ముద్దుపళని గమనించగలరు.

  మెచ్చుకోండి

 3. ఏ. సూర్యప్రకాశ్, … మ్. ఇలా మాటాడుతుంటే, ఒకరిద్దరు తెలుగుమీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని తెలిసింది. అంచేత, అందరం ఇలా మాటాడుతూందాం తెలుగులోనే… :p

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s