ఊసుపోక – వొఠ్ఠి కబుర్లే!

(ఎన్నెమ్మకతలు 119)

ఇవాళ ఒఠ్ఠి ఊసుపోని కబుర్లే. అంటే ఒకదానికీ ఒకదానికీ సంబంధం ఉండదన్నమాట. నాకు తోచినవి తోచినట్టు తప్పొప్పులు చూసుకోకుండా, తలా తోకా లేకుండా రాసుకుంటూ పోడమే. అసలీమధ్య కొంతకాలంగా ఇలాగే ఉంటున్నాయి నాఆలోచనలు. ముసిల్దాన్నయిపోయేనన్న నమ్మకం దృఢపడిపోతోంది. ఒత్తులు సరిగ్గానే పెట్టేననుకుంటున్నాను. అంచేత కూడా నాకిలా వదరడానికధికారం ఉంది.

లైబ్రరీనించి తెచ్చిన రీటా రడ్నర్ పుస్తకం చదివేక నాకు భలే ఉత్సాహం వచ్చేసింది. ఆవిడ ఆలోచనలు అవి చెప్పిన తీరు నాకు చాలా చాలా బావుంది. ఉదాహరణకి నాలాగే (!) ఆవిడ కూడా కారు తోలడంగురించి రాసింది. నాలాగే(!)  ఆడవాళ్లు అందచందాలు తీరిచి దిద్దుకునేందుకు పడే తాపత్రయంగురించి రాసింది ఎంతో సీరియస్‌గా. భలే నవ్వొచ్చింది. వీటన్నిటితో పుస్తకం పూర్తయేక, చివర, ఒక బొమ్మ ఉంది ఆవిడదే. సోఫాలో తలకిందులుగా కూర్చుని, అంటే తలా కాళ్లూ స్థానాలు మార్పిడి చేసుకుని, గది కప్పువేపు తేరి చూస్తున్నదృశ్యం. ఆ బొమ్మ కింద మహావాక్యం – నేను సీలింగ్ కంప్యూటరు కొనిఉండకపోతే, ఈ పుస్తకం రాయడం ఇంత కష్టం కాకపోను అని. మామూలుగా పుస్తకం రాయడం కష్టం. కానీ దానికి కారణం నా కంప్యూటరు సీలింగ్ మీద ఉందనడం నాకు భలే నవ్వు తెప్పించింది.

నేనింకా విరగబడి నవ్వుతూనే ఉన్నాను కనక నాకు ఈ బొమ్మ మరింత నవ్వొచ్చేసింది. వెంటనే నాస్నేహితులందరికీ పంపేసేను కాపీ చేసి. ఇక్కడ పెట్టలేను ఎందుకంటే ఆ పుస్తకము సర్వస్వామ్యసంకలితము కనక. అవును, ఈదేశంలో ఇలాటి పట్టుదలలు కొంచెం ఎక్కువే. చీటికీ మాటికీ కోర్జులకీడవడం వీరికే తగును. అదే మనవాళ్ళయితే, ప్చ్ అని చప్పరించేసి ఊరుకుంటారు. ఇంతకీ నాస్నేహితులకి బొమ్మయితే పంపేను కానీ సంగతి సందర్భాలు చెప్పలేదు కనక ఆ బొమ్మ అసందర్భంగానూ, అర్థరహితంగానూ కనిపించింది. సందర్భం వివరించకపోతే ఇలాటి చిక్కులే వస్తాయని నాకిప్పుడు తెలిసింది. ఇదే రీటా రడ్నర్ అయితే సందర్బం మరో కథలో మరింత చక్కగా వివరించి ఉండేది అనిపించింది. నేను రీటాని కాను కానీ యథాశక్తి వివరించడానికి ప్రయత్నిస్తాను.

నన్ను ఆ బొమ్మ – రీటా సోఫాలో శీర్షాసనంతో – ఆకట్టుకోడానికి కారణం నేనే ఇంతకుముందొకసారి ఈ ఊసుపోక ధారలోనే పెట్టిన మరో బొమ్మ గుర్తు రావడం కావచ్చు. అలాగే కారు తోలడంగురించి ఆవిడరాసిన కతతో కూడా నా అనుభవాలు మననం చేసుకున్నాను అచేతనావస్థలో. అలాగే ఈనాటి సాంకేతికాబివృద్ధి, నేను నసాంకేతికాలులో రాసినట్టే ఉంది.  ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఇలా సుమారుగా మనఅనుభవాలూ, అభిప్రాయాలూ గొప్పవారి కబుర్లలో కనిపిస్తే మరింత అర్థవంతంగా ఉంటాయి. అవున్లే, నీకూ తెలుసాసంగతి. అయినా మరోమారు చెప్పకుండా ఉండలేను. హుమ్. అది నా వ్యసనం.

***

ముసిల్దాన్నయిపోయేననీ, నాకు మతిమరుపు ఎక్కువయిపోయిందనీ అనుకుంటున్నసమయంలో మా అమ్మాయి ఫోన్ చేసింది కిందటివారం. ఇక్కడ ఏదో దొరకలేదని చెప్తున్నా. “అవునమ్మా, మాడిసన్లో అలాటివి దొరకడం కష్టం” అంది. “నేను మాడిసన్లో లేను కదా,” అన్నాను, కొంచెం తికమకపడి, నాభుజాలమీద ఉన్న నాబుర్ర ఓమారు తడిమి చూసుకుని.  “అదే …” అంటూ మాట మార్చేసింది. అది కిందటివారం. మళ్ళీ నిన్న మాటాడుతూ, “కారుకి windshield wipers  కొత్తవి వేయించాలని చెప్పేను గుర్తుందా?” అనడిగింది. “నువ్వు కిందటినెల చెప్పినప్పుడే గబగబ షాపుకెళ్ళి కొత్తవి వేయించేసేను. ఆమాట నీకు చెప్పేను కూడా కదా,” అన్నాను. “ఓ  … అదే … ఇక్కడ వాన పడుతోంది. …”

దీంతో నాకు చాలా ఆనందం కలిగింది. మరిచిపోడానికి ముసిలితనమే కారణం కానఖ్ఖర్లేదు. ఒక్కపెట్టున ఊపిరాడనన్ని రాచకార్యాలు కలిసొచ్చినప్పుడు కూడా చాలా సంగతులు మరిచిపోవడం జరుగుతుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. నిజానికి ఈకాలపు యువతీయువకులకే ఈ మతిమరుపు ఎక్కువ, లేదా ఇది మతిమరుపు కాదు అని కూడా అనుకోవచ్చు :p. దాన్ని వాళ్లు తమ వ్యాపకాలన్నిటివల్లా కలిగిన ఏమరుపాటు అని గానీ స్ట్రెస్ అని గానీ అంటారు.

***

ఆమధ్య ఒక స్నేహితురాలు నాయందు అభిమానంతో నా మహావాక్యాలుగా ప్రకటించిన వాక్యాలు చూసి ఉలికిపడ్డాను, ఏమిటీ, నేనిలా అన్నానా, నేనే అన్నానా, నేను నేనేనా… ఇలా ఒక్కొక్క అక్షరంమీదా ఒత్తులు మార్చుకుంటూ చాలాసేపు చూసుకున్నాను. కొన్ని బాగున్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. కొన్ని ఫరవాలేదు, కొన్ని నాకు అర్థం కాలేదు. … అంటే ముసిలితనంచేతే … కాకపోవచ్చు. రచయితలందరికీ తెలిసిన మరో సత్యం ఉంది. మనం ఒక కథ రాస్తాం. అందులో పదిమందికి పది రకాల అర్థాలు స్ఫురిస్తాయి. అలా రకరకాల అర్థాలు స్పురించినప్పుడు ఆ అర్థాలకి జవాబుదారీ రచయితా, పాఠకుడా? హ్మ్. దీనికి సమాధానం అంత తేలిగ్గా దొరకదేమో. అంజనం వేసి చూసుకోవాలి కాబోలు. లేదా ఏ తెలుగు మహాసభలకో పంపాలి ఈవిషయంమీద ఓ పేనల్ పెట్టమని.

***

ఇప్పటికింతే. మళ్ళీ ఏమైనా జ్ఞాపకం వస్తే, రేపు రాస్తాను.

(జులై 30, 2013)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – వొఠ్ఠి కబుర్లే!”

 1. ” నిజానికి ఈకాలపు యువతీయువకులకే ఈ మతిమరుపు ఎక్కువ,”

  ఇది కరెక్ట్. ఇందుకు నేనే ఉదాహరణ (ఇప్పుడు యువకుడి లెక్కలోకి వస్తానో రానో కానీ ఇంకా చిన్నప్పుడు కూడా నాకు మరుపు ఎక్కువే) 🙂

  మరుపే తెలియని నా హృదయం అని పాడుకునే అవసరం లేకపోయింది 🙂

  మెచ్చుకోండి

 2. స్ఫురిత, హాహాహహా. ఒకరకంగా నువ్వు సున్నాగారికి కూడా జవాబు చెప్పేసేవు. మించిపోయింది లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది కనక, మళ్ళీ అనుకోడం మొదలుపెట్టొచ్చు.

  మెచ్చుకోండి

 3. సో అయితే మీ ఆనందానిక్కారణం మీ అమ్మాయి కూడా మర్చిపోతోందనా లేకపోతే, మీ మేధస్సు (వత్తు సరిగ్గా పెట్టేనా?) ముందు ఆవిడది ఎందుకూ పనికిరాకుండాపోయిందనా? 🙂 మనం ఒక్కళ్ళం గోదార్లో మునిగిపోతుంటే ఏడుపొస్తుందిట. అదే ఇంకోడు మనకూడా ఉంటే అంత ఏడుపురాదు కానీ కొంచెం సంతోషం కూడాను.

  >> అలా రకరకాల అర్థాలు స్పురించినప్పుడు ఆ అర్థాలకి జవాబుదారీ రచయితా, పాఠకుడా?

  ఎవడి ఏడుపువాడిదే కదండీ? మీరు మాడిసన్ నుంచి ఆస్టిన్ కి ఎందుకు మారారో చెప్పుకుంటే, నాకు అందులో నువ్వుకూడా న్యూ యార్కు నుంచి ఫ్లోరిడా పో అనే అర్ధం స్ఫురించి వెళ్ళాననుకోండి అక్కడొకాయన నన్ను తుపాకీతో కాల్చేస్తే మీరొస్తారా జ్యూరీ ద్యూటీకి? వస్తానన్నా ఎవడు పిల్చేది?

  మనసుకి ముసలితనం అంటుకోకుండా చూసుకోండి. శరీరం ముసిల్ది ఐపోవచ్చు, అవుతుంది కూడాను. మనసుకి అంటుకుంటే అది పనసకాయ జిగుర్లాగ మరి వదల్దు 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.