తెలుపూ, నలుపూ, చామనచాయ కథలు

ఆఫ్రికన్ అమెరికన్ రచయితలకథలు చదివుతుంటే నాకు తోలు రంగు గురించిన ఆలోచనలు మరి కొన్ని కలిగేయి. అమెరికాలో నీగ్రో అన్న పదం నిగ్గర్ అయి, అదొక నిందార్థకం అయిపోయినతరవాత black అన్న పదం వాడుకలోకి వచ్చిందనుకుంటాను. ఆ తరవాత కలర్డ్ అని కూడా అంటున్నారు. నిజానికి ఏషియన్ అమెరికన్‌లాగే, ఆఫ్రికన్ అమెరికన్ అన్నదే నిర్దుష్టంగా వారెవరో తెలియజేసే శుభనామం. ఇంతకీ, అసలు విషయం తోలురంగు మనుషుల తత్త్వాలనీ, సంస్కృతినీ తెల్లము చేయగలదా? అమెరికా వచ్చేకే నాకు ఈ తేడాలు చూచాయగా తెలిసేయని ఇదివరకు చెప్పేను. 80వ దశకంలో కొందరు అమెరికన్ రచయిత్రుల నవలలు చదివేను కూడా. (మీరు నమ్మాలి మరి :p).

ఇప్పుడు మళ్లీ నాకు నీగ్రోరచయిత్రుల రచనలు చదవాలన్న కోరిక పుట్టింది ముఖ్యం ఇటీవల ట్రేవాన్ మార్టిన్ విషయంలో జరిగిన ఘోర అన్యాయం మూలంగానే. ప్రస్తుతానికి చిన్నకథలే ఎంచుకుంటున్నాను. ఈమధ్య చదివినకథల్లో రెండు కథలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

సుప్రసిద్ధ అమెరికన్ రచయిత్రి Dorothy Parker రాసిన Arrangement in Black and White అన్న కథలో, తోలు రంగుయొక్క లక్షణనిర్దేశకత ఎంత గహనమో, తెల్లవారి మనసు అట్టడుగు పొరల్లో ఎంత బలంగా నాటుకుని ఉందో మనకి తెలుస్తుంది. చాలా చిన్న కథే. అయినా ఎంతో సమర్థవంతంగా నిర్వహించారామె.

ఒక ప్రముఖ ఆప్రికన్ గాయకుడు వాల్టర్ ఒక పార్టీకి వస్తాడు. ఆయనసంగీతాన్ని విపరీతంగా అభిమానించే తెల్లరంగు స్త్రీ అతన్ని తనకి పరిచయం చెయ్యమని ఆయింటి యజమానురాలిని అడుగుతుంది. తనకి నలుపూ, తెలుపూ పట్టింపులు లేవని గట్టిగా పదే పదే నొక్కి వక్కాణిస్తూ ఉంటుంది కథ ఆద్యంతాలా. వాల్టర్ గానం అంటే తనకి ఎంత అభిమానం అంటే ఆ గాయకుడు ఆప్రికన్ కాకపోతే తనభర్త బర్టన్ ఈర్ష్య పడేవాడేనట. వాల్టర్తో ఎంతో చక్కగా మాటాడుతుంది. రానున్న కచేరీకి తప్పకుండా వస్తానని చెప్తుంది.

ఒక ప్రముఖ నటి కనిపిస్తుంది. “ఆవిడెవరు? ఎక్కడో చూసినట్టుందే” అనుకుంటుంటే, ఆమె ప్రముఖ నటి కాథరిన్ బర్క్ అనీ, తన స్నేహితురాలనీ చెప్తాడు. కథానాయకి ఆశ్చర్యపోతుంది. ఆవిడా? మరి తెరమీద “అలా” కనిపించదే! పార్టీ అయినతరవాత, ఆవిడ ఆ గృహస్తుతో అనే మాట – ఆ నటి అంత నల్లగా ఉంది. నేను నిగ్గర్ అనేసి ఉండేదాన్నే, ఆపుకున్నాను. అంత నల్లగా … బర్ట్‌కి చెప్పాలి తాను వాల్టర్‌తో మాటాడేనని, కరచాలనం కూడా చేసేనని. నాకు ఈ నలుపూ, తెలుపూ పట్టింపులు లేవు. కాథరిన్ ఈజ్ బ్లాక్ అని అనేసి ఉండేదాన్నే, ఆపుకున్నాను కానీ .. హు… ఇలా సాగుతుంది ఆమె స్వగతం, సంబాషణా కూడా.

మన అంతరాంతరాల ఉన్న రాగద్వేషాలని “లేవు, లేవం”టూ, ఎదటివారిని నమ్మించడానికి పడే తాపత్రయం ఎంత హాస్యాస్పదమో చూస్తే, నవ్వొస్తుంది. ఇది ఒక తెల్లజాతి స్త్రీ మనస్తత్వచిత్రణలో ఒక కోణం.

డోరతీ పార్కర్ కథనవిధానానికి పెట్టింది పేరు. సోమర్సెట్ మామ్  “What gives her (Dorothy Parker) writing its peculiar tang is her gift for seeing something to laugh at in the bitterest tragedies of the human animal,” అని వ్యాఖ్యానిస్తాడు.

నీగ్రోజాతి సంస్కృతి నీగ్రోలలోనే ఎలా వ్యక్తమవుతుందో “Color Me Real” అన్న కథలో రచయిత్రి J. California Cooper అవిష్కరించేరు. ఈకథలో కథానాయకి తెల్లయజమానివల్ల ఆయింట్లో పనిచేసే నల్లస్త్రీకి పుట్టినఅమ్మాయి తెల్లని చర్మంతో. వయసు మళ్ళిన యజమాని తనతల్లిని పెట్టిన హింసలు చూసి, తనజీవితం తల్లిజీవితంకంటే మెరుగు పరుచుకునే ఉద్దేశంలోపట్నం వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. తెల్లరంగు చర్మంవల్ల తేలిగ్గానే నెగ్గుకొస్తుంది. చక్కగా చదువుకుంటుంది. ఒక తెల్లవాడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.

ఒకరోజు అతనితో మరొక నీగ్రో స్త్రీని పడగ్గదిలో చూసి, అతన్ని నిలదీస్తుంది. దానికి అతని సమాధానం “నల్లజాతి స్త్రీతో సంభోగం ఆనందం వేరు,” అని. “నీకు నల్లస్త్రీ కావాలా? సరే అయితే నేను నల్లజాతి స్త్రీనే” అని చెప్తుంది. అతను మండిపడతాడు తనని ఆమె మోసం చేసిందని. ఆమె మనసు విరిగి, అతన్ని వదిలేస్తుంది. కొంత కాలం అయేక, మరొక నీగ్రో అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. మరి సమస్య పరిష్కారం అయిందా? లేదు.

రెజీ ఆమె తెల్లరంగు చూసి చేసుకున్నాడు. అతని స్నేహితులందరూ తెల్లఅమ్మాయిలనే పెళ్ళాడేరు. ఆ తెల్ల ఇల్లాళ్ళందరూ నల్లజాతి స్త్రీలని హేళన చేస్తూ మాటాడతారు. ఎరా రెజీతో తగువేసుకుంటుంది. ఆమె దృష్టిలో నీగ్రో మగాడు నిజంగా విముక్తి పొందలేదు. తెల్లవారివిలువలే నెత్తినపెట్టుకునే బానిసత్వాన్నే వరించేరు. రెజీ మండిపడతాడు! ఎరా అతన్ని రెండోసారి విరిగిన మనసుతో  ఇంటికి వస్తుంది.

ఇంటిదగ్గర చిన్ననాటి స్నేహితుడు జార్జి కనిపిస్తాడు. ఆమెమీద ప్రేమతో అతను పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయేడు. ఆమె నిజమైనరంగు అర్థం చేసుకుని అభిమానించగలవాడు అతనొక్కడే. అతనితో స్థిరపడిపోతుంది ఆమె.

ఈ రెండు కథలూ చదివేక చర్మం రంగు కేవలం skin-deep అనుకోలేం. మనకి సాహిత్యంలో నల్లనివాడు, నీలమేఘశ్యాముడు అంటూ కీర్తిస్తాం. నిత్యజీవితంలోనూ, ఈనాటికథల్లోనూ ఈ నలుపు “చూపులకి” సంబంధించినదిగానే కనిపిస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లలవిషయంలో “ఈ నల్లపిల్లకి పెళ్ళెలా అవుతుందో” అన్న తల్లిబాధ చాలా కథల్లో చూసేం కదా. (రంగుతోలు కథ).

పై రెండు కథలూ చదివేక, ఒకొక సంస్కృతిలో “రంగు”తాలూకు గుణనిర్దేశాలు మరింత ప్రస్ఫుటమయేయి. మరొకకోణం బావదాస్యం. మొదటికథలో వర్ణ (రంగు అన్న అర్థంలోనే) వివక్ష, రెండోకథలో నీగ్రోస్త్రీతో సంభోగానికి తెల్లవారూ, నల్లవారూ కూడా ఇచ్చ విశేషస్థానం ఈ రచయిత్రులు చిత్రించిన విదానం.

నేను సూక్ష్మంగా కథలు చెప్పేను కానీ నిజంగా ఈకథలు అర్థం చేసుకోవాలంటే, మూలకథలు ఇంగ్లీషులోనే చదవాలి. లైబ్రరీలో ఉంటాయి ఈ పుస్తకాలు చూడండి.

The Portable Dorothy Parker, A Piece of Mine by J. California Cooper. (includes the story, Color Me Real.)

ఇలాటి కథలు చదివినప్పుడే మనం ముందు చెప్పుకున్న ఒకొకజాతి ఆత్మముద్రలు కూడా మరింత ప్రస్ఫుటమవుతాయి  అనిపిస్తుంది.

(ఆగస్ట్ 4, 2013)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “తెలుపూ, నలుపూ, చామనచాయ కథలు”

 1. ఒక చదువరి, నేను నాలుగురోజలపాటు ఊళ్ళో లేను. అంచేత జవాబు ఆలస్యమయింది.
  మీరు శ్రమ తీసుకుని, చదివి, వివరంగా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు సమీక్ష అంటే సమ్మరీ కాదనే నా అభిప్రాయం కూడా. నేనింతకుముందు రాసిన వ్యాసాలు మీకు నచ్చేయి అంటున్నారు కనక అవి ఆ పద్దతిలోనే రాసేననే అనుకుంటున్నాను.
  నన్ను నేను సమర్థించుకోడానికి కాదు కానీ మరొక కోణం కూడా మనం ప్రస్తావించాలి అన్నఉద్దేశంతో ఈకింది రెండుమాటలు రాస్తున్నాను.
  సాధారణంగా కథకి ప్రధానంశం అటుండగా, ఒక కథలో కొన్ని కోణాలు మనం మరొకవిషయం ప్రస్తావించడానికి వాడుకుంటాం. నేను అమెరికన్ కథలు నేను ప్రస్తావిస్తున్న విషయానికి ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాను. అందుకు అనుగుణంగా కావలిసినవిషయాలు మాత్రమే ప్రస్తావించేను. అంతే గానీ ఆకథలకి నేను పరిచయాలు కానీ, కథలమీద సమీక్ష కానీ రాయలేదు. నావ్యాసానికి సంబంధించినంతవరకూ, చర్మపు నలుపురంగు కేవలం పైపై రంగే కాదు, దానికి అనేక అంతరార్థాలు, టీకలూ ఉన్నాయని నాకర్థమయింది అని చెప్పడం మాత్రమే.
  రెండోవిషయం, నేను సంక్షిప్తంగా కథ చెప్పడానికి కారణం – ఈ కథలు అంత తేలిగ్గా అందరికీ అందుబాటులో ఉండవని. నిజానికి ఒక స్నేహితురాలు దొరకలేదని రాసేరు కూడా నాకు. పైగా, ఇంగ్లీషులో చదవడం అందరికీ అలవాటు లేదా ఇష్టం లేకపోవచ్చు.
  మరొకసారి, మీ వ్యాఖ్యకి సంతోషం తెలుపుకుంటూ
  – మాలతి.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  మీ రచనలన్నా, మీ అభిప్రాయాలన్నా, మీరు చేసే పరిశీలనలన్నా నాకు చాలా గౌరవం. మీరు మామూలుగా మెచ్చుకునే సౌమ్య లాంటివారి రాతలకన్నా, నాకు మీ పరిశీలనలు చాలా అనుభవంతో, స్పష్టతతో చేసినట్లు అనిపిస్తుంది. మీ పోస్టుని పైపైన స్కాన్ మాత్రమే చేసి (మీరు సమ్మరీ రాసేరని తెలుసుకుని అది చదవకుండా, అంటే ఆంగ్ల లిపిలో అక్షరాలని చదివి మాత్రమే), మీరు చెప్పిన రెండు కథలూ తప్పక చదవాలని నిశ్చయించుకుని, లైబ్రరీలో J California Cooper కథల సంపుటి తెచ్చుకుని Color me real కథని ముందు చదివాను. ఈ కథని మీరు సూచించినందుకు ధన్యవాదాలు. ఆ తరవాత తిరిగి వచ్చి, ఆ కథ గురించి మీరు రాసిన పేరాగ్రాఫులు చదివాను, చెప్పద్దూ, నాకు చాలా నిరాశ కలిగింది, కొంచెం కోపంగూడా వచ్చింది (అందుకే 15+ నిముషాలు ఖర్చు పెట్టి ఇది రాయడం). మీరు కథ సమ్మరీ–చివరికి Era ఎంచేస్తుందో కూడా– రాసేసి కథకి ద్రోహం చేసారని అనిపించింది. (మీరు కొన్ని సన్నివేశాలని oversimplify చేసేరనీ, కొన్నిటిని కొద్దిగా misquote చేసేరని — మొదటి మొగుడు Era కి నచ్చజెప్పిన విషయం– అనిపించింది.) కథ/నవలని చదివించేలా చెయ్యాలంటే కథంతా చెప్పక్కరలేదు. మీ సమ్మరీ చదివి నేను కథని చదివితే నాకు ఆ కథవల్ల కలిగిన అనుభూతి ఖచ్చితంగా దూరం అయి ఉండేది. కథని “పరిచయం చెయ్యడం” అంటూ చాలా మంది బ్లాగర్లు కథని/నవలని/సినిమాని “సమ్మరైజు” చేసేసి(ఉత్తినే spoiler alert అని ఒక హెడ్డింగు పడేసి) రాయడం అనుభవం వాళ్ళు చేసే పనిలా అనిపిస్తుంది. మీలాంటి చెయ్యితిరిగిన, పబ్లిష్‌డ్ రచయితలు ఆ దారిలో ఎందుకు వెళ్ళడం? ఎంత సాధారణ కథ/నవలైనా మొదటి సారి ఏమీ తెలియకుండా చదివినప్పుడు కలిగే అనుభూతికి ఏదీ సాటి రాదు. మీరు కథ సమ్మరీ రాయడానికి నాలుగు పేరాలు ఖర్చుపెట్టి, కథ గురించి మీ ఆలోచనలు క్లుప్తంగా రెండు పేరాల్లో చెరొక మూడు వాక్యాలు రాసి వదిలిపెట్టారు. నాకు ఆ కథ గురించి మీ పరిశీలనలు, మీ ఆలోచనలు తెలుసుకోవాలని ఉంది. సాధారణ బ్లాగర్లు చాలామందికి లేని సొంత అభివ్యక్తీకరణ మీకుంది కదా,(నా పొగడ్తలు మీకు అక్కర్లేదనుకోండి..) దానికి మమ్మల్నెందుకు దూరం చేస్తారు? సమ్మరీ రాయడం కన్నా సొంత అభిప్రాయాలు రాయడానికి ఎక్కువ సమయం వెచ్చించాలని తెలుసు, మీరు వెచ్చించే సమయాన్ని నేను మీ బ్లాగుపై మీకున్న గౌరవానికీ, పాఠకులపై మీకున్న గౌరవానికీ కొలతగా భావిస్తాను. అదే మిమ్మల్ని సాధారణ బ్లాగర్లకన్నా ఎత్తుగా నిలుపుతోందని భావిస్తాను.

  నా సమ్మరీ ఏంటంటే, శ్రమ తీసుకుని సమయం వెచ్చించే చేసే రచనలే నిలబడతాయి. ఉత్తినే సమ్మరీలు, “ఈ కథ చాలా బావుంది, చదవండి” , “అంతగా నచ్చేసింది నాకు ఆయన/ఆవిడ శైలి” అని రాసే మూస వాక్యాలు పుట్టలోని చెదల్లాంటివి. దయచేసి ఆర్టికిల్స్ రాయండి, బ్లాగు పోస్టులు కాదు. మీ బ్లాగు ఉద్దేశం డబ్బులు సంపాదించడం కాకపోయినా, ఈ వెబ్‌పేజీ తప్పక చూడండి. http://www.nngroup.com/articles/write-articles-not-blogs/
  సద్భావనలతో,
  — మీ బ్లాగు చదువరి.
  (ఈ అభిప్రాయం పబ్లిష్ చేయకపోయినా పరవాలేదు)

  మెచ్చుకోండి

 3. విన్నకోట నరసింహారావు, అవునండీ ఈ చర్మసౌందర్యంమీద నాకు ఇంకా చాలా ఆలోచనలు వస్తున్నాయి. నిన్ననే మరో పుస్తకం చదివేను The Autobiography of an ex-colored man అని. అది మరీ విచిత్రంగా ఉంది. వ్యాసం రాస్తున్నా.

  మెచ్చుకోండి

 4. నల్లజాతి (ఆఫ్రికన్ అమెరికన్లు) వారికి తెల్ల తోలురంగు అంటే విముఖత ఉంటుందని అనుకునేవాడిని – తెల్ల జాతి వారి చేతుల్లో చాలా బాధలు పడ్డారు కాబట్టి. నా ఊహ నిజం కాకపోవచ్చని తెలుస్తోంది మీ టపా చదివితే. అలాగే తెల్ల తోలురంగు మీద మోజు భారత జాతికి కూడా తక్కువేమీ కాదు కదా. “వధువు కావలెను” ప్రకటనల్లో బాగా కనపడుతుందని అందరికీ తెలిసిందే. అదికాక ఈ తోలురంగు మీద కొంతకాలం క్రితం ఇండియాలో టీవీలో తరచుగా వచ్చిన ఫెయిర్నెస్ క్రీం వ్యాపార ప్రకటన ఒకటి గుర్తొస్తోంది. చామన ఛాయ కన్నా రెండు మూడు ఛాయలు తక్కువున్న అమ్మాయి ఫొటోని ఆమె మొహంమీదే చింపేసినట్లు చూపిస్తారు. తర్వాత ఆ అమ్మాయి ఈ కంపెని వారి ఉత్పాదనని వాడేసి తెల్లగా మెరిసి పోతున్నట్లూ, అది చూసి ఇంతకుముందు ఫొటో చింపేసిన మగవాడే ఆ అమ్మాయి కోసం తిరిగి వచ్చినట్లూ చూపిస్తారు. (నా అభిప్రాయంలో చాలా అవమానకరమైన ప్రకటన). తెల్ల రంగుతోలు “ప్రాధాన్యత” ఆత్మగౌరవం లాంటి వాటి గురించి బాధ పడకుండా అంగీకరించవచ్చని ఆ అమ్మాయి చెప్తున్నట్లే కదా (పైగా ఆ ప్రకటనలో మోడల్ గా చేసినది – చెయ్యవలసిన అవసరం లేని – అప్పటి ఒక ప్రముఖ సినీ హీరోయిన్). సమాజంలో ఉన్నదే చూపించారు అనుకుంటే, అది మన జాతి యొక్క ఆత్మముద్ర అనవచ్చేమో?

  మెచ్చుకోండి

 5. అదే, మీకు అటువంటి అభ్యంతరం ఉండవచ్చునేమోనని డిస్క్లోజర్ ప్రకటన అన్న మాట. Mosley’s works are not considered literary fiction. A book that made waves recently was The Help, by Kathryn Stockett, also made into a successful film. I did not read but it was well-acclaimed.

  మెచ్చుకోండి

 6. నారాయణస్వామి, అపరాధపరిశోధకనవలలప్రస్తావన ఎందుకు చేస్తున్నారండి, నాకు అర్థం కాలేదు. మ్. నాచిన్నప్పుడు చదివేను కానీ ఇప్పుడు చదివే సరదా లేదు.

  మెచ్చుకోండి

 7. నారాయణస్వామి, డోరతీ పార్కర్ కథలకంటే వ్యాసాలు మరింత స్ఫూర్తిదాయకం అని చదివేను కానీ నాకు కథలు చదవడమే ఎక్కువ ఇష్టంగా ఉంది ప్రస్తుతానికి. మీరు చెప్పినట్టు బయస్ ఎక్కువే. మీరు చెప్పిన పుస్తకం చూస్తాను మళ్ళీ లైబ్రరీకి వెళ్ళినప్పుడు.

  మెచ్చుకోండి

 8. Dorothy Parker is brilliant.
  ఇప్పుడు ప్రస్తుతసమాజంలో ఈ రంగులూ, తత్సంబంధ రాగాలూ బాగా సటిల్ అయ్యాయి అనుకుంటున్నాను, నిజజీవితంలోనూ, సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ.
  70లలో లాసేంజిలస్ లో రేషియల్ బయాసెస్ గురించి Walter Mosley చాలా బాగా రాశాడు.
  Irwing Wallace నవల The Man కొంత పడికట్టు చిత్రణే అయినా, ఆ రోజుల్లో రేషియల్ పాలిట్క్సుని గురించి కొంత సంచలనం రేపింది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.