దివంగతము

(మార్పు 54 దివంగతము)

వృద్ధిలోకి రావలసిన యువనటుడు, వృద్ధిలోకి వస్తున్ననటుడు, విజయవంతమైన సీరీస్‌లో స్థిరమైన పాత్ర పోషిస్తున్న నటుడు, సాటినటులచేత శభాషనిపించుకున్నవాడు, ఏ దురభ్యాసాలు లేనివాడు – చిన్న తుపాకితో ప్రాణం తీసుకున్నాడు.

పొద్దున్నే లేస్తూనే ఈవార్త చూసి అవాక్కయేను. అతను నటిస్తున్న షో నాకిష్టం. అతను పోషించే పాత్ర నాకు నచ్చింది. అలాటిపాత్రలు పోషించేవారు మంచివాళ్ళయిఉంటారని మనకి తేలిగ్గానే నమ్మకం కుదిరిపోతుంది కదా. ఇతనివిషయంలో కూడా అదే అనుకున్నాను. అదే నిజమని ఇప్పుడు తెలిసింది కూడాను.  రచయితలతోలాగే నటులతో కూడా ఇలా ఏదో అవినాభావసంబంధం ఏర్పడుతుంది. అంచేత అతను ఎందుకు తనని తానే చంపేసుకున్నాడన్న ఆరాటం ఎక్కువయిపోయింది నాకు. అసలు ఇలాటి వార్తలు ఈమధ్య కొంచెం ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అలా వింటూఉండడంతో అలవాటయిపోయి నాకు నిర్వేదం కూడా వచ్చేస్తోంది.  ఇప్పుడు మరణవార్తలు నన్నంతగా కదిలించడం లేదు. ఓ మహా రచయితో మహా రచయిత్రో పోయేరంటే, తెలుగు సాహిత్యానికి తీరని లోటు అంటూ బావురుమనాలనిపించడం లేదు. పోకేం చేస్తారనిపిస్తోంది. అయ్యోయ్యో .. ఛీ ఛీ, తప్పు, తప్పు అలా అనకూడదు. …మ్. మ్… కానీ బుద్ధి ఊరుకోదు కదా. నేను మాత్రం ఉండిపోతానేమిటి. పుట్టుటలాగే పోవుట కూడా జీవధర్మమే. నావంతు మాత్రం రాకుండా పోతుందేమిటి అనుకుంటాను నాకన్నాపెద్దవాళ్ళయితే. … నాకన్న చిన్నవాళ్లయితే, నేనేదో ఎవరికో ద్రోహం చేసినట్టుంటుంది. నేనుండగా వాళ్ళు పోవడమేమిటి? ఎక్కడో పొరపాటు జరిగిపోయింది …  నాతరంవాళ్ళు ఒకొకరే తరిస్తున్నారు. ఆవరసలో నేనూను. … నాకిదేమీ, ఈ ఆలోచనలేమీ వింత కాదు. చావుగురించిన ఆలోచనలు చిన్నప్పటినుంచీ నామనసులో మెదుల్తూనే ఉన్నాయి నిరంతరం. అనేకానేక ఇతర ఆలోచనల్లో ఇదొకటి. చాలామందికి చావంటే భయం. ఎప్పుడో ఒకప్పుడు వచ్చేదే కదా. ఇవాళ కాకపోతే రేపు … అందులో ఆశ్చర్యపడ్డానికేం ఉంది? ఆలోచించడానికేం ఉంది? మరి ఎందుకింత ఆలోచిస్తున్నాను. … మ్.

అతను, ఆ నటుడు తుపాకీతో ప్రాణాలు తీసుకున్నాడంటే… ఆత్మహత్యలో ఆధునీకరణ అన్నమాట. సాంకేతికంగా మనం సాధించిన అభివృద్ధి కూడా ఉపయోగపడుతోంది మరణాలకి! … మనిషి గుహల్లో తల దాచుకోడం మొలెట్టినదగ్గర్నుంచీ ప్రాణాలు నిలుపుకోడానికే కదా తాపత్రయపడుతున్నది. అప్పట్లో పులో ఎలుగుబంటో ఆరగించి, ఆజీవికి మంగళం పాడేసేది. ఇప్పుడు కార్లూ, రైళ్లూ, తుపాకులూ, కాకపోతే నానా రకాల మందులూ … రైళ్ళూ, నూతులూ ఉపయోగం తగ్గిపోతున్నట్టే ఉంది. … మనచట్టాలు మరీ విచిత్రం. ఆత్మహత్య నేరం అంటూ ఆ ప్రయత్నంలో ఉన్నవారిని పట్టుకుని జైల్లో పారేస్తారు. అదేదో కథలా అక్కడే నయం, వాళ్లు మనకి కాపలా కాస్తారు, కూడెడతారు అని ఆనందించాలి ….

చావుకి సంబంధిచిన నిర్ణయాలు ఎవరికి వారు చేసుకోగలిగితే ఎంత బాగుండు. ఈలోకంలో నాపని అయిపోయింది – పుట్టినతరవాత చదువు, పెళ్ళి, పిల్లలు, వాళ్లని వృద్ధిలోకి తెచ్చి, వారికో మార్గం చూపడంతో నాపని అయిపోయింది. ఇంక నిష్క్రమిస్తాను అనుకుని, టికెట్ కొనుక్కోకుండా రైలెక్కి అనంతాల్లోకి పోగలగితే ఎంత బాగుండు!

పోడం నిజం. పుట్టుట గిట్టుటకొరకే అంటారు కానీ …కొరకే కాదు, గిట్టుట జరుగుతుందంతే.

వెనక ఇలాటి కబుర్లే ఓమాటు సంద్రాలుతో జరిగింది. తారకం కూడా ఉన్నాడు.

“ఈడ సెప్తరు గద పన్నులూ, సావులూ ఓరు తప్పించుకోనేరు,” అంది సంద్రాలు.

“ఆ మాట కూడా మారిపోతున్నట్టే ఉంది. పన్నులు కట్టనివారు చాలామందే కనిపిస్తున్నారు. చావుకి కూడా ఏవో కనిపెడుతున్నారు. గొట్టాలతో ప్రాణాలు పోస్తున్నారు కదా. ఆమధ్య ఓ డాక్టరు cheating death అని ఓ పుస్తకం రాయలేదూ. వేడి వేడి పకోడీల్లా అమ్ముడుపోయింది.”

“అదెన్నాల్లు గెన్క?”

“అవున్లే. ఏదో సమయంలో అది కూడా తొలగించాల్సిందే. చావు యెందుకు పెట్టేడు దేవుడు మనకి?” అన్నాను సంద్రాలేమైనా చెప్పగలదేమోనని.

“ఎందుకేటి. మొదలెట్టిన దేనికేన తుది ఉంటాది కదా.”

నేను మాటాడలేదు. ఎక్కడో ఏదో తకరారుంది. అదేమిటో తెలీడంలేదు.

“శీకిస్నపరమాత్ముడేటి సెప్పినాడు?”

“ఏంటి చెప్పేడేమిటి?”

“సంపేవోడూ, సచ్చీవోడూ అన్నీ నేనే. నివ్ సంపేదీ నేదు, ఆలు సచ్చీదీ నేదు. అంచేత మారాడకండ యుద్దం సేయి అన్నడు గద.”

“సంపీవోడూ సచ్చీవాడూ అన్నీ ఆయ్నే ఐతే, మరి ఆయనే యుద్ధం చేసేసి, చావడం, చంపడం పూర్తి చేసేయొచ్చు కదా. మళ్లీ మధ్యలో అర్జనుడెందుకూ?”

“ఎందుకంతె పుట్టినాడు గెన్క. పుట్టిన పెతివోడికీ ఓ దరమం ఉన్నాదని సెప్పేను గద,” అంది సంద్రాలు పాతకథలు మళ్లీ తవ్వడం ఎందుకు అన్నట్టు కనుబొమ్మలు ముడిచి.

“క్షత్రియుడయి పుట్టేడు కనక క్షాత్రధర్మం నెరవేర్చాలనేమో.”

“మరి క్షత్రియులు కానివారికేం పని లేదా?”

“ఎందుకు లేదూ? గృహస్థధర్మం. ఉపరి సన్యాసం.”

“ఆ తరవాత?”

“ఇందాకట్నుంచీ చెప్తున్నదేమిటి. ఆ తరవాత రంగంలోంచి అంతర్థానమయిపోడం.”

“ఇంత గొడవెందుకు. మొదట్లోనే మాయమయిపోతే పోతుంది కద.”

“అదిగాదు బాబూ. నోకంలో నున్న జీవులలో మడిసిజన్మ ఉత్తమం అన్నరెందుకు. సీఁవా దోఁవా నాగుండి, నిదానంమీన మడిసవౌతాడు. అపుడు సత్కరమలు సేసి, మంచోల్ల ఇల్లల్ల ఇంక ఇంక మంచి జలమలు ఎత్తతడు.”

“అలా పుట్టి చస్తూనే ఉంటారంటావు?” అన్నాడు తారకం, సంద్రాలుచేత మాటాడించడమే అతనికి సరదాగా ఉందో, నిజంగా ఆమె అభిప్రాయాలమీద కుతూహలంతోనో.

“అనాగ ఇంక ఇంక మంచి జలమలెత్తి, మంచి పనులు సేసినాక, పరమాతమలో కలిసిపోతడు.”

ఎంత అదృష్టవంతురాలో అనిపించింది నాకు. సంద్రాలు మనిషి స్వర్గానికెళ్తాడని దృఢంగా నమ్ముతోంది. అలాటి నమ్మకంమూలంగానే దిలాసాగా బతికేస్తోంది. తనబతుకుకి జవాబుదారీ మరొకడున్నాడన్న ధీమామూలంగా ఎంత హాయి!

“నిజంగా స్వర్గం ఉందని మీరు నమ్ముతారు,” అన్నాడు తారకం ఆమెవేపు చూస్తూ.

“నమ్మాల. నేదని నివ్ రుజూ సెయ్నేవు. అనుమానాల్త అతలాకుతలంవయితే ఏటి సుకం.”

హా. నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, మరో రెండు రకాలున్నాయి – వీళ్ళకి శాంతి లేదు. అదేమిటీ, ఇదేమిటీ, ఇదెందుకూ, అదెందుకూ అంటూ ప్రశ్నించుకుంటూ కూర్చునేవారికి శాంతి లేదు. సంద్రాలు అదృష్టవంతురాలు అనుకున్నాను మరోమారు.

000

అర్థశతాబ్దం అయింది నాకిలాటి ఆలోచనలు మొదలయి. చచ్చినతరవాత, స్వర్గానికెళ్తానా నరకానికెళ్తానా, నరకంలో వాళ్ళు పెట్టే బాధలు భరించగలనా, భరించలేక చచ్చిపోతానా… అని కాదు నా ఆలోచన. ఈ అవతారం చాలించినతరవాత, “నేను” అన్న ఈ పదార్థం ఏమవుతుందన్న బాధ లేదు. ఏమైపోతే ఏమిటి కనక? నాసందేహం అది కాదు. నా తలపులన్నీ “ఎలా పోతాను” అన్నప్రశ్న చుట్టూ పరిభ్రమిస్తోంది. చావూ బతుకూ కానీ మధ్యస్థపు బతుకు బతకాల్సివస్తుందేమో? అప్పుడేమిటి చేయడం? ఏ పనిమనిషినో పెట్టుకుని చేయించుకునే పరిస్థితి కాదు.  … అసలు ఎలా పోతానో … 60ల్లో అనుకుంటాను ఓ కథ చదివేను, కథ ఎవరు రాసేరో గుర్తు లేదు కానీ కథ పేరు మంగళం పాడేస్తా అని. అందులో కథానాయకుడు రకరకాల ఆత్మహత్యలగురించి ఆలోచించి, ఆఖరికి ఏదీ సుఖంగా లేదని ఆ ప్రయత్నం మానుకుంటాడు. భలే తమాషాగా ఉందే అనిపించింది అప్పట్లో. మళ్ళీ రెండు వారాలక్రితం Dorothy Parker కవిత ఒకటి చూసేను. అది కూడా ఈ ధోరణిలోనే ఉంది.

Razors pain you;
Rivers are damp;
Acids stain you;
And drugs cause cramp.
Guns aren’t lawful;
Nooses give;
Gas smells awful;
You might as well live.

“ఏమిటి ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు?” అంటూ లీల వచ్చింది. ఆ వెనకే అడుగులో అడుగేసుకుంటూ, అరవింద వచ్చింది.

చావుగురించి అనబోయి ఆగిపోయేను. “అయ్యొయ్యో అదేం ఆలోచనలండీ, మీకిప్పుడే ఆ ఆలోచనలేమిటి, దాట్లగుర్రంలా ఉన్నారు మట్టసంగా … “ అంటూ నన్ను ఆ ప్రయత్నం నించి (నేనింకా మొదలెట్టకముందే) మంచి ఆలోచనలవేపు మళ్లించడానికి కిందా మీదా పడిపోతే, నేనావిడని ఆపలేక, నానాతంటాలూ పడాల్సొస్తుంది. మ్, ఎందుకొచ్చిన సంత. నేనే గుప్‌చిప్‌గా ఊరుకుంటే క్షేమం.

“ఏం లేదు. రా, ఎప్పుడొచ్చేవు?” అన్నాను లేచి మరో కుర్చీ చూపుతూ. “బాగున్నావా?” అన్నాను అరవిందవేపు తిరిగి.

ఇద్దరూ తగుసమాధానాలు చెప్పి, నాఎదుటిసోఫాలో సర్దుకున్నారు.

లీల ఎందుకో దిగులు పడుతున్నట్టు కనిపించింది. గా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతున్నట్టుంది కానీ ఏమని ఎలా అడగడం? పక్కన అరవింద ఉంది. ఏం అడగొచ్చో, ఎలా అడిగితే బాగుంటుందో తోచలేదు.

ఇలాటప్పుడు మాటాడ్డానికి రెండే విషయాలు – ఎండా వానా, లేకపోతే రాజకీయాలు. … దేశ ఆర్థికపరిస్థితులగురించి కూడా మాటాడొచ్చు కానీ నాకు అట్టే సరదా లేదు ఆవిషయంలో.

“ఏమిటి చూస్తున్నారు?” అంది లీల టీవీవేపు పరీక్షగా చూస్తూ.

హమ్మయ్య, సందు దొరికింది. “ఏముంది, మామూలే, ఏరోజూ ఎవరో ఒకరు – తనని తనే చంపుకోడమో మరొకరిచేతుల్లో చావడమో తెలుసుకోకుండా పొద్దు వాలేట్టులేదు,” అన్నాను.

పొద్దున్నే విన్న నటుడి ఆత్మహత్యగురించి సూక్ష్మంగా చెప్పేను.

“మరి ఎందుకలా చేసేడు?”

“‌తెలీదు. ఇంకా వెతుకుతున్నారు.”

ఇదంతా చూస్తూంటే నాకు మొత్తం ప్రపంచంమీదే కోపం వస్తోంది. వ్యక్తివిజయాలు, వ్యక్తి స్వేచ్ఛ – ప్రతివారికీ ఇదే గోల. అందరూ హక్కులు హక్కులంటూ కొట్టుకోడమే కానీ బాధ్యతలమాట ఎత్తరు.  చట్టాలన్నీ చేస్తున్న సాయం మరింత అభద్రతా, గంద్రగోళం ‌మనబుర్రల్లో రేపడమే, మనకి తేలీకుండానే

“నేనీమద్య ఒక పుస్తకం తెచ్చేను లైబ్రరీనించి. Drinking with Dead Women Writers అని. ఇద్దరు అమ్మాయిలు గతించిన 16మంది రచయిత్రులతో ఇంటర్వూలు రాసేరు, ఊహాగానమేలెండి. తమాషాగా ఉంది,” అంది లీల

“అలా రాయగలగడం కష్టమే. ఆ రచయిత్రులరచనలూ, అభిప్రాయాలూ, అభిరుచులూ బాగా తెలియాలి కదా,” అన్నాను ఆలోచిస్తూ.

“నాక్కూడా అందుకే కుతూహలం కలిగింది. ఆ రచయిత్రులలో చాలామంది పేర్లయితే విన్నాను, కొందరి పుస్తకాలు చదివేను, కానీ ఈ ఇంటర్వ్యూలు చదువుతూంటే అంతా కొత్తగానే అనిపించింది.”

“ఎంచేత?”

000

(ఇంకా ఉంది)

గమనిక: దివికేగుట అన్న అంశంమీద నాకు తోచిన వివిధ అభిప్రాయాలు ఇవి. అంతే. ఇందులో వాక్యాలు తీసుకుని నా వ్యక్తిగతజీవితానికి ముడిపెడుతూ వ్యాఖ్యలు రాయకండి.

(ఆగస్ట్ 28, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.